దేశ విభజన విషవృక్షం-43

0
4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రతదేశంలో ఇస్లాం ఎదిగిన తీరును ప్రాథమికంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చని మన చరిత్రకారులు చెప్తుంటారు. ఈ నాలుగు సిద్ధాంతాల ద్వారా ఈ దేశంలో ఇస్లామీకరణ బలవంతంగా జరుగలేదని, ఆయా పరిస్థితులను బట్టి, వారి వారి అవసరాలను బట్టి మాత్రమే జరిగిందని పలు విధాలైన అభిప్రాయాలను ఉదాహరణలుగా చూపిస్తూనే.. తాము విశ్లేషిస్తుంటారు. భారత్ లోనికి ఇస్లాం చొరబడిందనే వాదనను తక్కువ చేసి.. ప్రపంచంలోనే అత్యంత శాంతియుత ధర్మంలోకి ప్రజల మార్పు సహజ న్యాయ పరిణామంగానే జరిగిందని సైద్ధాంతిక ప్రాతిపదికలను చూపిస్తారు.

వీటిలో మొదటిది ఇమ్మిగ్రేషన్ థియరీ.. ‘ఈ సిద్ధాంతం మన దేశంలో ఇస్లామీకరణను విశ్వాసం ప్రాతిపదికన కాకుండా ప్రజల వలసలను బట్టి జరిగింది. ముఖ్యంగా ఇరాన్ పీఠభూమి నుంచి వలస వచ్చిన వారు.. లేదా.. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి వ్యాపారం పేరుతో ఇక్కడ స్థిరపడిన వారు.. అరేబియా సముద్రంతో భౌగోళికంగా ఆనుకొని ఉన్న దక్షిణాసియా ప్రాంతాల్లో ఇస్లామీకరణకు ఈ వలసలు ఎక్కువగా కారణమయ్యాయి. బెంగాల్లో కూడా.. ముఖ్యంగా తూర్పు బెంగాల్‌లో ఈ రకమైన వలసలు ఎక్కువగా జరిగాయి. అయితే ఈ ఒక్క కారణాన్ని బెంగాల్‌లో సామూహిక ఇస్లామీకరణ జరిగిందనడానికి ఆధారంగా చూపించలేము. కాకపోతే ఈ వలస వచ్చిన వారు భారతదేశంలో స్థానికులను సామూహికంగా ఇస్లామీకరించడంలో దోహద పడ్డారనడంలో సందేహం లేదు.’ ఈ దేశానికి వలస వచ్చిన అరబ్బులు, పర్షియన్లు, మంగోలులు, పోర్చుగీసులు, బ్రిటిషర్లు ఊరికే వచ్చారా? ఖాళీగా వ్యాపారం చేసి పోదామని వచ్చారా? ఇది విచిత్రమైన వాదన కాకపోతే మరలేమిటి? అరేబియా కానీ, ఇరాన్ కానీ, మరే ప్రాంతం నుంచి కానీ దేశంలోకి చొచ్చుకొచ్చిన వారంతా ఆక్రమణదారులే. వారిని వలస వచ్చినవారు అనడం ఎంతమాత్రం సమంజసం కాదు. వారి లక్ష్యాలు మొదట్నుంచీ స్పష్టమే. వారి చర్యలన్నీ మొదట్నుంచీ ఒకే విధంగా సాగినవే.. భారతదేశ ప్రవేశద్వారం వద్ద రాజా దాహిర్ సేన్‌ను హతమార్చిన నాటి నుంచి.. ఔరంగజేబ్ శంభాజీ మహరాజ్‌ను క్రూర హింసలు పెట్టి చంపడం దాకా వారు అనుసరించిన విధానమూ ఒక్కటే. తూర్పు బెంగాల్‌లో వీరు అనబడే వలసలు వ్యాపార రూపంలో సాగాయి. అరేబియా సముద్రం మీదుగా చుట్టూ తిరిగి.. మలేసియా మీదుగా చిట్టగాంగ్‌కు అరబ్బు వ్యాపారులు వచ్చి స్థిరపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన సూఫీ సంతులకు ఈ వ్యాపారులు పూర్తి అండగా నిలిచారు. పైగా బెంగాల్ రాజు ఇస్లాం స్వీకరించిన హిందువు కాబట్టి వారి పని మరింత సులువు అయింది. పంజాబ్ మాదిరిగానో, రాజస్థాన్ మాదిరిగానో, మరాఠాల మాదిరిగానో విరుచుకు పడితే ఇవాళ బంగ్లాదేశ్ అనేది పుట్టేది కాదు.

రెండవ సిద్ధాంతం అందరికీ తెలిసిందే. ఇస్లామీకరణకు ప్రధాన భూమికగా నిలిచిన సిద్ధాంతం ఇదే. దీన్ని ‘రిలీజియన్ ఆఫ్ స్వార్డ్ థీసిస్’ అని ప్రసిద్ధంగా పిలుస్తారు. మెడమీద కత్తిపెట్టి మతం స్వీకరించేలా చేయడం. ఒక్క భారతదేశంలోనే కాదు.. అరేబియా సముద్ర తీరం వెంబడి ప్రారంభమై.. హిమాలయ సానువులదాకా ఇస్లాం విస్తరించిన తీరులో ఈ సిద్ధాంతమే ముఖ్య పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. ఇస్లాం వ్యాప్తిలో సైనిక శక్తి పాత్ర.. వారికి మతోన్మాదులైన ఉలేమాలు, సూఫీల మంత్రాలు కీలక భూమిక వహించాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. 18, 19 శతాబ్దుల్లో యురోపియన్ సామ్రాజ్య ఆధిపత్యానికి ఇస్లాం వ్యాప్తి చెందిన తీరు అతి గొప్ప ప్రేరణను అందించింది. ఏడవ శతాబ్ది చివరి నుంచి 19వ శతాబ్ది చివరి వరకు ఇస్లాం ఆవిర్భావం.. ఎదుగుదల తీరుపై ఓరియంటలిస్టులు వివరించారు. 1898లో సర్ విలియమ్ ముయిర్ మాటలు ఒక్కసారి చదువండి..

It was the scent of war that now turned the sullen temper of the Arab tribes into eager loyalty.. Warrior after warrior, column after column, whole tribes in endless succession with their women and children, issued forth to fight. And ever, at the marvelous tale of cities conquered; of rapine rich beyond compute; of maidens parted on the very field of battle “to every man a damsel or two”…fresh tribes arose and went. Onward and still onward, like swarms from the hive, or flights of locusts darkening the land, tribe after tribe issued forth and hastening northward, spread in great masses to the East and to the West.

ఇస్లాం ఎదుగుదల ఒక మిలిటెంట్ ఉద్యమ రీతిలో సాగిందని ముయిర్ కూడా బలంగా అభిప్రాయపడ్డాడు. కానీ దాన్ని పూర్తి వివరంగా చెప్పలేకపోయాడని మన చరిత్రకారులు అంటారు. ఈ విలియమ్ ముయిర్.. బ్రిటిష్ ఇండియాలో ఒక అధికారి. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీల ఉద్యమకారుడు. మతం గురించి, మత మార్పిళ్ల అవసరం గురించి బాగా తెలిసినవాడు. మతం ఆధిపత్యం ద్వారా ప్రజలను బానిసలుగా ఎలా చేసుకోవచ్చో బాగా అవగాహన ఉన్నవాడు. అందుకే.. భారత దేశంలో క్రైస్తవ మత వ్యాప్తి కోసం మాత్రమే నియోగించబడిన వ్యక్తి విలియమ్ ముయిర్. అలాంటి వాడు ఈ దేశంలో ఇస్లాం ఎదుగుదల ఎలా జరిగిందో తన బాస్ లకు ఇచ్చిన నివేదికను తరువాతి తన పుస్తకంలో పేర్కొన్నాడు. క్రైస్తవ మత వ్యాప్తికీ అదే విధంగా చేయాలన్నది అతని అభిప్రాయం కావచ్చు. కానీ బ్రిటిషర్లు మతవ్యాప్తితోపాటు సంపద దోపిడీకే అధిక ప్రాధాన్యమిచ్చారు. అందువల్లనే మిషనరీలు తమ పని తాము చేసుకుంటూ పోయాయి. అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోయారు. తరువాత మరో అధికారి పీటర్ హార్డీ కూడా భారతీయులను మెడమీద కత్తి పెట్టి మరీ ఇస్లాంలోకి మార్చారని భావించాడు. భారతదేశంలో ఇస్లామిక్ ఆక్రమణలు, మత మార్పిడులు.. ఇస్లాం వ్యాప్తికి సంబంధించి ప్రధానంగా అరబిక్, పర్షియన్ గ్రంథాలు ఎక్కువగా ఆధారాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన చరిత్రకారులు ఈ రెండింటిలోని వాస్తవాలను ‘తమదైన’ భావజాల పద్ధతుల్లో విశ్లేషించడం వల్ల భారతదేశంపై ఇస్లామీయుల ఆక్రమణలను తక్కువ చేసి చూపించడం జరిగింది. బ్రిటిషర్లు భారతదేశంలో ముస్లిం చొరబాట్లు, దోపిడీ, ఇస్లామీకరణ అంశాలపై లోతైన అధ్యయనమే చేశారు.. అది వారి కార్యాచరణకు, వ్యూహరచనలకు, ప్రణాళికల రూపకల్పనలకు దోహదకారిగా నిలిచింది. దాన్ని అంతవరకే వాడుకున్నారు తప్ప.. ప్రచారానికి, రచనలకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు.  యోహనాన్ ఫ్రైడ్ మన్ మాత్రం అరేబియా గ్రంథాలలో “iṭā’at-i Islām numūdand” వారు ఇస్లాంకు లొంగిపోయారు.. లేదా “dar iṭā’at” అంటూ ఇస్లాంకు లొంగిపోయారు.. అన్న పదాలను, పదబంధాలను గమనించాడు. ఇది ఇస్లాం మతానికి లేదా ఇస్లాం సైన్యానికి లొంగిపోయినట్టు భావించవచ్చని అతను పేర్కొన్నాడు. అంతే కాదు.. 1200 నుంచి 1760 మధ్యన ఇండో టర్కిష్ సైన్యాలను తరచుగా లష్కర్ ఏ ఇస్లాం, ఆర్మీ ఆఫ్ ఇస్లాం అనే పిలిచారు. ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం గమనిస్తే.. ఇస్లామిక్ సైనికులకు భారతీయులు లొంగిపోయారు అన్న మాటల వెనుక అర్థం సులభంగానే అర్థమవుతుంది. సైనిక బలం చేతనే దేశంలో ఇస్లామీకరణ జరిగిందే తప్ప ఇస్లామిక్ విశ్వాసంపై మాత్రం కానే కాదు. ఇస్లాం శాంతియుత మతమని.. అందువల్లే పెద్ద ఎత్తున ప్రజలు ఆ మతాన్ని స్వీకరించారని పేర్కొనడం లాజిక్‌కు అందని విషయం. ఈ విషయాన్ని యోహనాన్ ఫ్రైడ్ మన్ కానీ, బ్రిటిష్ అధికారులు కానీ స్పష్టంగా చెప్పకుండా గోడమీది పిల్లి వాటంలా స్పందించారు. ఎందుకంటే.. ముస్లిం సంతుష్టీకరణ బ్రిటిషర్ల కాలం నుంచే మొదలైంది కాబట్టి. ఈ సిద్ధాంతంపై ఇస్లామిక్ చరిత్రకారులు కానీ, బ్రిటిష్, మార్క్సిస్టు చరిత్రకారులు కానీ పదే పదే వాదించేదేమిటంటే.. సైనిక చర్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముస్లిం జనాభా కంటే కూడా.. సైనిక చర్య లేని తూర్పు బెంగాల్ ప్రాంతంలో అత్యధికంగా ముస్లిం జనాభా పెరిగిందని. జనాభా గణాంకాలు కూడా చూపిస్తారు.  దీనికి కారణం ప్రజలు స్వచ్ఛందంగా ఇస్లాంలోకి మారారు కాబట్టేనని వారు ఘంటాపథంగా చెప్తారు. లెక్కలు కరెక్టే.. తప్పేం లేదు. మనమూ అంగీకరించాల్సిందే. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది.. ఏమిటంటే.. గంగా, యమున, సరస్వతీ నదుల పరీవాహక ప్రాంతాల్లో ముస్లింల దాడులు అత్యధికంగా జరిగాయన్నది వాస్తవం. ఇక్కడ పెద్ద ఎత్తున ఇస్లాం సైన్యం విరుచుకుపడిన మాటా వాస్తవం. ఇస్లామిక్ రాజులు ఇక్కడ అనేక రాజులను ఓడించి ఢిల్లీ కేంద్రంగా రాజ్యాన్ని పరిపాలించిన మాటా వాస్తవం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో.. ఎంత తీవ్రంగా ముస్లిం రాజుల సైన్యాలు విరుచుకుపడ్డాయో.. అంతే తీవ్రంగా ప్రతిఘటనలూ ఎదురయ్యాయి. సిక్కులు, రాజ్‌పుత్‌లు, మరాఠాలు, తమను తాము చంపుకోవడానికి సిద్ధపడ్డారే తప్ప మతం మారడానికి ఇష్టపడలేదు. అందుకే ఈ ప్రాంతాల్లో కోట్ల సంఖ్యలో హిందువుల ఊచకోతలు జరిగాయి.. వేల సంఖ్యలో వారి సొంత, ఆధ్యాత్మిక ఆస్తులు ధ్వంసం అయ్యాయి. కానీ సంపూర్ణ ఇస్లామీకరణ సాధ్యపడనే లేదు. తూర్పు బెంగాల్ పరిస్థితి అలా కాదు. ఇక్కడ ప్రఖ్యాత ముస్లిం రాజులెవరూ పరిపాలించకపోవచ్చు. కానీ.. తూర్పు బెంగాల్ ప్రాంతం పూర్తిగా మారుమూల ప్రాంతం. దాదాపు బంగాళాఖాతంలోకి వెళ్లిపోయిన ప్రాంతం. ముందుగానే చెప్పినట్టు అక్కడికి ముస్లిం దేశాలు కూడా దగ్గరగా లేవు. కానీ.. అక్కడ సూఫీలు ఉన్నారు. ఉలేమాలు ఉన్నారు. అరేబియన్ వ్యాపారులు ఉన్నారు. వారికి బెంగాల్ రాజు జలాలుద్దీన్ మహమ్మద్ అండదండలు పుష్కలంగా లభించాయి. ఇక్కడ మెడమీద కత్తి పెట్టాల్సిన పని పెద్దగా లేకుండానే ఇస్లామీకరణ జరిగిపోయింది. ప్రతిఘటన పెద్దగా ఎదురుకాకపోవడానికి కారణం ఆ ప్రాంతం పర్టిక్యులర్‌గా ఒక బలమైన భారతీయ రాజు పరిపాలనలో లేకపోవడమే. బెంగాల్‌ను ఏలిన హిందూ రాజు కొడుకు జలాలుద్దీన్ కావడం ఇక్కడ ఇస్లామీకరణ పూర్తిగా కావడానికి దోహదపడింది. మన చరిత్రకారులు చెప్పినట్టు జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకొని చరిత్ర రాస్తే.. ఆ చరిత్రను విశ్లేషిస్తే.. ఇంతే సంగతులు. తూర్పు బెంగాల్ మాదిరిగా ప్రతిఘటన లేకుండా పోతే.. ఇవాళ భారతదేశం అంటూ ఉండేదా? ప్రపంచంలోనే అతి పెద్ద ఇస్లాం దేశం పుట్టేది కాదా.. తాము దాడులు చేశామని.. లక్షల మంది ఫకీర్లను చంపామని.. వారే రాసుకొన్నారు.. ప్రతిఘటనలు ఎదురైన చోట వారిని చంపామని కూడా పేర్కొన్నదీ వారే.. ఇంత యుద్ధం జరిగింది కాబట్టే.. త్రివేణీ పరీవాహక ప్రాంతం ఇవాళ అభారతీయం కాకుండా మిగిలింది. తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్‌గా మారిపోయింది.

భారతదేశంలో ఇస్లామీకరణ జరగటంలో మత పోషకత్వం కూడా ప్రధాన భూమిక నిర్వహించిందని మూడో వాదనను వినిపిస్తారు. ఇది సత్యదూరం కాదు. కాశ్మీర్‌లో ఈ తరహా మార్పులు చూశాం. రాజపోషణ కోసం.. తన ఆస్తిపాస్తులను కాపాడుకోవడం కోసం, జిజియా లాంటి ఇస్లామేతర పన్నుల నుంచి ఉపశమనం పొందడం కోసం.. ఇస్లాంలోకి మారిన వారు కొందరున్న మాట వాస్తవమే. అది ఇప్పటికీ ఈ తరహా తీరు కొనసాగుతూనే ఉంటుంది. రాజ ప్రాపకం.. అధికార ప్రాపకం కోసం వ్యక్తులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడమే ఇది కూడా.. అధికారంలో కొనసాగాలంటే.. కొన్ని అవసరమవుతాయి. ఇవాళ్టి మన భారతదేశ రాజకీయాల్లో ప్రధానంగా సాగుతున్న ముస్లిం సంతుష్టీకరణ (మైనార్టీ సంతుష్టీకరణ ఎంత మాత్రం కాదు.. ఎందుకంటే.. మిగతా మతాలను గురించి ఈ దేశ రాజకీయ వ్యవస్థ పెద్దగా పట్టించుకోదు.) కూడా ఈ కోవకు చెందిందే. రాచరిక వ్యవస్థలోనైనా.. రాజకీయ వ్యవస్థలోనైనా ఈ రకమైన ట్రెండ్ కామనే. కానీ విచిత్రమేమిటంటే.. కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే వాళ్లు ముస్లిం మతాన్ని స్వీకరించారే తప్ప వారిపై ఎలాంటి ఒత్తిడులు లేవని చెప్పడానికే ఈ సిద్ధాంతం పుట్టుకొచ్చింది. కానీ.. ఇదే రాజదర్బారులలో మతం మారకుండా ఉన్నవారూ ఉన్నారు కదా.. కోవర్టులుగా పనిచేసిన వారూ ఉన్నారు కదా. మరి వారి మాటలేమిటి? ఇలాంటి సైద్ధాంతిక చర్చలు ఇతరత్రా జరిగిన క్రూరమైన చరిత్రను కప్పి పుచ్చలేవు. ఈ చరిత్రకారులదే మరో ఉవాచ. ‘ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా 19వ శతాబ్దంలో చెప్పిన జనాభా లెక్కల ప్రకారం ఎగువ భారతదేశంలో అంటే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గంగా మైదానంలో అనేక భూస్వామ్య కుటుంబాలు ఆదాయపు పన్ను చెల్లించకుండా.. జైలు శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం తమను తాము ముస్లిం కుటుంబాలుగా ప్రకటించుకున్నాయి. గంగా మైదానంలోని కాయస్థులు, ఖత్రీలు, మహారాష్ట్రలోని పరాస్నీలు, సింధ్‌లోని అమీల్స్ అందరూ ఇస్లామిక్ సంస్కృతిని పెంపొందించుకున్నారు. పరిపాలనా వ్యవస్థల్లో గుమస్తాలుగా చేరారు. పాలకుల, ప్రభుత్వాల అవసరాలు తీర్చారు. వారు తమ సమాజానికి, కుటుంబాలకు శాశ్వతంగా దూరమై.. పూర్తిగా తమను తాము ఇస్లామీకరించుకొన్నారు.’ ఇది వింటుంటే.. సర్దార్ పాపారాయుడు అన్న 1980ల నాటి సినిమాలో ఒక బ్రిటిష్ అధికారి డైలాగ్ గుర్తుకు వస్తుంది. ‘మా వంటవాడు భారతీయుడు.. మా పని వాడు భారతీయుడు, మా తోటమాలి భారతీయుడు, మా చెప్పులు తుడిచేవాడు భారతీయుడు’ అన్నది ఆ డైలాగ్. తైమూర్ నుంచి ఔరంగజేబ్ దాకా తమ పరిపాలనలు ఎలా సాగాయో వారికి వారే రాసుకొన్నారు. తమ దగ్గర పనిచేసేవాడు.. తమ మతం పట్ల విశ్వాసం చూపకపోతే.. విధేయతగా ఉండడనేది వారి గట్టి నమ్మకం. మతం మారకపోతే.. మారణ హోమమే. ఈ పరిస్థితుల్లోనే ఈ పరిణామాలన్నీ సంభవించాయన్నది కఠోర వాస్తవం. బతికుంటే బలుసాకు అయినా తినవచ్చు అన్న సామెత ఈ పరిస్థితుల్లోనే వచ్చింది. కానీ.. దీన్ని శాంతియుత మతాంతరీకరణ అనో.. తమ అవసరాలకు మాత్రమే ఇస్లాంను స్వీకరించారనో ముద్ర వేసేశారు.

ఇక నాలుగో సిద్ధాంతం ఏమిటంటే సామాజిక అభివృద్ధి. ఈ రకమైన సిద్ధాంతం ఎల్లప్పుడూ.. పాశ్చాత్య శిక్షణ పౌందిన లౌకిక సామాజిక రాజకీయ శాస్త్రవేత్తలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారి సైద్ధాంతిక చర్చలే ఈ విధంగా ఉంటాయి. భారతదేశంలో జరిగే వాదనలన్నీ కూడా ఈ కోవలోనే కొనసాగుతుంటాయి. రాజుగారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి.. ఆకర్షితులై.. ప్రేమతో.. ఇస్లాం మతాన్ని స్వీకరించారని చెప్తుంటారు. ఇదంతా మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా.. అవును.. పార్టీ ఫిరాయించిన ప్రతి నాయకుడూ ఇవాళ మాట్లాడే మాటే ఇది. ఈ దేశాన్ని ఖిల్జీ పాలించినప్పుడు జరిగిన మత మార్పిడులపై బిన్ బట్టూటా అనే అతను ఒక నివేదిక తయారుచేశాడు. దీని ప్రకారం ఖిల్జీ సుల్తానుల పరిపాలనకు ఉబ్బి తబ్బిబ్బయిపోయి అనేక మంది తమ మతాన్ని మార్చుకున్నారని.. తమంతట తామే మతం మార్చుకున్నామని ఖిల్జీకి తెలియజేశారని పేర్కొన్నాడు. వారి వారి స్థాయిలను బట్టి ఖిల్జీ సుల్తాను వారిని గౌరవ వస్త్రాలను, విలువైన కానుకలను బహుమతులుగా ఇచ్చి సత్కరించారని కూడా పేర్కొన్నాడు. మన వాళ్లు కూడా ఇలాంటి వాదనలనే తెరముందు పెట్టి వాదిస్తుంటారు. ఎలాంటి ప్రయోజనం లేకుండా పార్టీ మారానంటే ఈ దేశంలోనే ఎవరైనా నమ్ముతారా? అలాంటిదే ఇది కూడా.

ఇట్లాంటి సిద్ధాంతాలతో భారతదేశంలో మతమార్పిడులకు ముఖ్యమైన హేతువులను తక్కువ చేసి చూపించడానికి ఇవాళ్టికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here