విదేశీ కోడలు

0
9

[dropcap]రై[/dropcap]తు కుటుంబం నుంచి వచ్చిన విజయమ్మ ఆలోచనలు సాగుతున్నాయి.

సూర్యోదయం మొదలు రైతు పడే కష్టం ఎవరికి కావాలి? ఎంత కష్టపడితే మనకు కంచంలోకి అన్నం వస్తుంది? ధాన్యం దమ్ము చేసి కళ్లాలలో నుంచి బస్తాలకెత్తుకుని మిల్లుకో ఇంటిలో తెచ్చుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలి. అయితే ఎన్ని రకాల ఏర్పాట్లు ఉన్నా పంట వచ్చే నాటికి ప్రకృతి విజృంభించి భీభత్సం చేస్తోంది. ఎంతో మంచి పంట కూడా చేతికి రావడం సమస్యగా ఉన్నది.  ఎవరో ప్రముఖులు నాయకులు వచ్చి ఓదార్చి వెడతారు. ఆ తరువాత ఎవరూ కనిపించే విధానం లేదు. ఓదార్పు మాత్రమే కాదుగా, మనిషికి కావాల్సింది. సంయమనం పాటించాలి, దాని కోసం మాట్లాడాల్సిన అవసరంలో శాంతి సహనం ఉండాలి. డబ్బు లేనిదే ఏమి లేదు.

అందరూ అందుకే పొలాలు రైతులకి కౌలికి ఇచ్చి పిల్లల వెంట పట్నం వెళ్లి జీవిస్తున్నారు. కష్టం సుఖం ఎలా ఉన్నా పిల్లల దగ్గర ఉన్న సంతృప్తి కోసం ఉన్నారు. పల్లెలో పెద్ద పెద్ద మేడలు, మండువా ఇల్లు అన్ని వదిలేసి ఉంటున్నారు. విశాల తత్వం నుంచి అపార్ట్మెంట్ కల్చర్‍కి అలవాటు పడుతున్నారు.

చాలా కష్టం కూడా ఇది. మడి ఆచారం సాగటం లేదు. అన్ని ఏక పాకం అవుతున్నాయి. సిటీ జీవితంలో ఆ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు వెళ్లి అడ్జస్ట్ అవడం కష్టమే కానీ తప్పడం లేదు. వృద్ధాప్యంలో ఒంటరిగా వద్దు అంటూ పిల్లలు తీసుకెళ్ళి పోతున్నారు.

కోడలు బ్యాగ్ వేసుకుని ఒక ప్రక్కకి, కొడుకు మరో ప్రక్కకి వెడితే ఇంటికి కాపలాగా ఈ వృద్దులు ఉండాల్సి వస్తోంది. పిల్లలు ఉంటే వాళ్ళకి ఆయాగా కూడా. కొందరు పిల్లల్ని చూడటానికి తీసుకు వెడుతున్న విషయం కొందరు అన్నారు.

కానీ ఆడపిల్లల తల్లి తండ్రులు ఆ మార్గం లేకుండా ఉన్నారు. పిల్లలకి అన్ని ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు. కానీ వృద్ధాప్యం వీరికి చాలా సమస్య గానే ఉన్నది.

పెళ్ళిలో ఒక్క పిల్ల  మేమే చూస్తాము అంటారు, ఇద్దరు పిల్లలు అయితే ఆరు నెలలు ఒకరు ఇంకో అరు నెలలు ఇంకొకరు అన్నట్లు పంచుకుంటున్నారు. ఒక కూతురు వేరే దేశంలో.. ఉంటే కొంత డబ్బు పంపిస్తున్న వైనం కూడా ఉన్నది.  అయితే కొందరు అబ్బాయిలు తమ తల్లి తండ్రి బాధ్యతలు తీసుకుని  ఎంతో ప్రేమగా చూసేవారు ఉన్నారు. కొందరు అల్లుళ్లు కూడా కొడుకుల మాదిరే అత్తమామలను చూస్తున్నారు.

ఒక ఇంజీనీర్ అల్లుడు అత్తమామలను తల్లి తండ్రి మాదిరిగా చూస్తున్నాడు. అతనికి అన్నదమ్ములు అక్కలు ఉన్నారు. వాళ్ళ గురించి అసలు పట్టించుకోడు. అత్త కూచిగా మారిపోయాడు. మరదలిని, బావమరుదులను ఇద్దరినీ ప్రేమగా చూస్తూ బట్టలు కొంటూ పార్టీలు చేస్తూ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఘనంగా చేసేవాడు. అలాంటి అల్లుడు ఎక్కడ దొరకడు, చాలా అదృష్టం అనుకున్నారు అందరూ.

కొందరు ఈ మధ్య కొత్త పద్ధతిలో అనూహ్య మార్పులు చేర్పులు చేస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. అత్తగారు ఒక్కర్తే ఉంటే తెచ్చి ఇంట్లో పెట్టుకుని తల్లి మాదిరిగా చూస్తున్నారు. మరి కొందరు మామగారు ఉంటే కనుక చక్కగా వేరే ఇల్లు దగ్గరలో చూసి వాళ్ళను తెచ్చి పెట్టుకుని చూస్తున్నారు. మనిషికి మనిషికి కావలసినది కేవలం మాట సహయమే అని చెప్పాలి. కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు అయితే పల్లెలో ఉండి పొలాలు చూసుకుంటూ స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నారు.

మనిషి బాల్యం, యౌవనం, ఉద్యోగ దశలు బాగానే గడుస్తాయి. కానీ వృద్ధాప్యంలో అన్ని అప్పటి సంగతులు తలుచుకుంటూ ఆలోచిస్తూ ఆనందంగా  గడిపేస్తారు. అంతే కానీ వృద్ధాప్యాన్ని అదే పనిగా తలుచుకుంటు బాధపడరు. అది బ్రతుక నేర్చిన తెలివి.

రైతు జీవితంలో భూమాత పంటనిస్తుంది. విత్తు నాటగానే  వచ్చే చినుకు తొలకరి జల్లు. రైతన్న మదిలో మెదిలే అమృతవర్షిణి. మొక్క ప్రతి అంగుళం పెరుగుదల ఒక అనందం. ప్రకృతి నుంచి వచ్చే సందేశాలు ఎన్నో మేఘ సందేశాలు. మానవాళికి మంచి ఆహారం సమకూర్చి ఆనందం పంచుకోవాలి. పెరిగిన మొక్కలు కంకులు వేసి బంగారు వన్నెలో మెరిసిపోతూ అన్నపూర్ణ దేవికి స్వాగతం పలుకుతాయి. విన్నూత్న విచిత్ర చిత్ర రీతిలో భూమాతతో వరుణుడు చెలిమి చేస్తాడు. వారి ఆనంద స్నేహం వల్ల అద్భుత అభిమానం భూమాతపై చూపడంతో భూమాత పంటలు తడిసి ముద్దగా చిరు మొలకలు వచ్చేశాయి.

రైతన్న కళ్ళలో ఆనందం మాయం చేస్తూ ధాన్యం, ఇతర పంటలు మళ్ళీ భూమాతను చేరి ప్రకృతి ఒడిలో లాలించి పాలించాయి.

మానవాళికి మంచి ఆహారం కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం రైతన్న పడే శ్రమ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి ఎరుక? మానవులు ప్రకృతి ఆధార జీవులు. ప్రకృతిని ప్రేమించాలి, రక్షించాలి. ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా అవి అశాశ్వతమని, ప్రకృతి మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి.

ఆర్గానిక్ ఆహారం కోసం తపన పడుతూ, మంచి ఆరోగ్యం పొందాలంటే రైతన్న పంటలు సమృద్ధిగా పండటం మానవాళికి అవసరం. ఈ రకంగా ఇంత కష్టం రైతు పడుతూ మనకు మంచి ఆహార ధాన్యం అందిస్తాడు.

కానీ మనం షాపింగ్ మాల్స్‌లో కెళ్ళి నాణ్యత ప్రకారం కిలో అరవై డెబ్బై వంద నూట పది చేసి కొంటాము. పిల్లలకి అది తెలియదు. ప్యాకెట్లలో, అందమైన గాజు బీరువాలో పెట్టటం మాత్రమే తెలుసు. అందుకే అన్నం అంటే కుక్కర్‌లో వండే తెల్లని పదార్థమని ఇప్పటి కాన్వెంట్ పిల్లలు చెప్పే విషయం. “మమ్మీ ఏవో తెల్లని గింజలు కుక్కర్‍లో వేసి నీళ్ళు పోస్తూ ఉంటుంది. అది కాస్త అన్నంగా ఉడికాక విజిల్ వస్తుంది. ఎలక్ట్రికల్ అయితే లైట్ పైకి వెడుతుంది. అప్పుడు నన్ను స్విచ్ అపి ఉంచటుంది. కాసేపు అయ్యాక నాకు కలిపి పెడుతుంది.  ఎంతో తొందరగా  అయిపోతుంది” అందొక పాప.

రైతు ప్రాణ శక్తి అందించే దేముడు. అమృత మథనం ద్వార ఆహార సృష్టికి భగవంతుడు. అమృత ఆహారం అందించి జీవకోటిని రక్షించే దివ్య స్వరూపుడు. ఆహారమే ప్రాణ శక్తికి మూలము. అది దేవత స్వరూపం. జీవితమంతా మంచి ఆరోగ్యానికి, మంచి ఆహార పదార్థాలు అందించే దయామయుడు రైతు. తాను కష్టపడి మనకి ఆహారం ఇస్తున్నాడు.

డబ్బుంటే రూపాయలు తినగలరా? ఆహారం కావాలి. వరి, జొన్న, గోధుమ, రాగి, సజ్జ ఏ ప్రాంతానికి ఆ ధాన్య ఆహారము అవసరము. దాని ఉత్పత్తి – మిషన్ ద్వారా కాదు భూమాత నుంచి పండించాలి. అదే శ్రమైక సౌందర్యము. చమట నుంచి పుట్టే అద్భుతాలు. రక్తాన్ని స్వేదంగా మార్చి సౌధాలు నిర్మించే ఘనులు రైతులు.

‘రైతే రాజు’ – ఇది ఎంతో కాలంగా చేస్తున్న నినాదం. ఆహారం లేనిదే జీవితం లేదు. అందుకే రైతు కష్టం ఎంత ఉందో తెలుసుకోవాలి. అప్పుడే అమృత ఆహారము అద్భుత జీవితము.

మానవ ప్రతిభ,  ఉన్నతి, ఉత్తమ జీవిత సారథి వారధి కూడా రైతే. అందుకే ప్రతి వ్యక్తి విద్యతో పాటు రైతు జీవన విధానం తెలిసి గౌరవించి ఆదరించాలి.

అప్పుడే దేశ ప్రగతి పథంలో పయనించి జాతి కోసం ఎన్నో రకాల స్ఫూర్తి కీర్తి. రైతుకి విలువ ఇస్తే కానీ ఆహారం రాదు. అతను సంపాదించే ఆస్తి పరిశుభ్రమైన పంట మాత్రమే. ఆరోగ్యవంతమైన పంట దిగుబడి ఇచ్చే వంగడాలు ఎరువులు వాడి పురుగుల మందులు ఇతర రసాయనాలు వాడి పంటను రక్షించి మేలు రకం ధాన్యం అందిస్తాడు. అందుకే వాళ్ళ పిల్లలను ఈ వృత్తిలోకి దింపక వేరే ఉద్యోగాల్లో పెడుతున్నారు.

సంపాదన లేనిదే జీవితం గడవదు. ప్రతి క్షణం ఏదో ఒక మార్పు విభిన్న రూపాల వస్తూనే ఉంటుంది. అలాంటి వాటిని ఎదుర్కోవాలి.

ఆలోచనల్లోంచి బయటపడింది విజయమ్మ.

***

విజయమ్మ గారి భర్త  శ్రీనివాస రావు గారు ఇంటి దగ్గర వడ్డీ వ్యాపారం చేస్తారు.  ఇద్దరు కూతుళ్లు. సృజన స్ఫూర్తి, సుప్రజ కీర్తి. కొడుకులు అవినాష్, వెంకట  సతీష్.

ఏదో పది ఎకరాల పొలం ఉన్నది. మరో పది ఎకరాలు కౌలుకు పుచ్చుకొని పాలేళ్లను పెట్టి సాగు చేయిస్తాడు. డబ్బు బాగానే వస్తుంది. అయితే కౌలుకు వచ్చే సమయానికి ఒకసారి పంట బాగా పండవచ్చు, ఎండవచ్చు అందుకని ఎలా వచ్చిన సరే ఎకరాకు పన్నెండు బస్తాల ధర ఇస్తాను అని చెప్పాడు. ఒక్కో సారి ఇరవై పండవచ్చు, పండక పోవచ్చు. లేకపోతే బస్తాల లెక్కన అప్ప చెపుతాడు. ఇలా జీవితం అటు పోటు లేకుండా బ్రతుకు సాగిస్తున్నారు, నచ్చినట్లు బ్రతుకుతున్నారు.

ఉళ్ళోనే విజయమ్మ అన్నగారు, తమ్ముడు ఉన్నారు. వాళ్ళకి మగ పిల్లలు ముగ్గురు. ఆడపిల్ల ఒకతె. అందరూ బాగానే చదువుకున్నారు. ఒక కొడుకు విమానాలలో జాబ్. రెండవ వాడు బ్యాంక్ ఆఫీసర్‍గా సెలెక్ట్ అయ్యాడు.

పిల్ల డిగ్రీ చదివి చక్కగా ఇంటి పనులు వంట వార్పు నేర్చుకున్నది. ఇంట్లోనే కంప్యూటర్ క్లాస్‌లు కూడా నేర్చుకుంటుంది. చివరన కొడుకు. వాడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

శ్రీనివాస రావు గారి రెండవ బావమరిదికి  ఇద్దరు కొడుకులు. ఇద్దరు కూతుళ్లు. పెద్ద పిల్ల పెళ్లి చేశారు. కొడుకులు ఇద్దరు ఇంజినీర్స్. దూరంగా వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.

విజయమ్మ ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు మేనళ్ళుళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యాలని తెగ ఆశ పడింది. కూతుళ్ళు ఇద్దరు ఇంజినీరింగ్ చదివారు. చదువుకి, పెళ్లికి సంబంధం లేదు. సంపాదన ముఖ్యము. విజయమ్మకు అన్నగారు నాలుగు ఎకరాలు  కట్నం  ఇచ్చి పెళ్లి చేసారు. ఇప్పుడు అదే పద్ధతికి కూతుళ్ళకు ఇమ్మన్నారు. శ్రీనివాస రావు గారు “రెండు ఎకరాలు ఇస్తాను” అంటే “వీలు లేదు, అది మా చెల్లెలికి ఇచ్చినదే, నువ్వు రెండు చొప్పున ఇస్తే విజయమ్మ ఆస్తి పిల్లలకి ఎలాగ వస్తుంది?” అంటూ ఘరానా లెక్కలు చెప్పారు. మొత్తానికి పెళ్ళిళ్ళు జరుగనివ్వలేదు. బయటి సంబంధాలు పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా చూసుకుని చేశారు.

పెద్ద పిల్ల కెనడాలో ఉంటుంది. దానికి ఇద్దరి పిల్లలు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. రెండవది బెంగుళూర్‍లో ఉంటుంది. దానికి ఒక మగ, ఒక ఆడ పుట్టారు.

విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.

విజయమ్మ అన్నగారు పెళ్ళిళ్ళ రాజకీయాలు బాగానే జరిపారు వచ్చిన సంబంధాలకు. “మా పిల్లలకి చేద్దామని అనుకున్నాము కానీ మా బావ గట్టి మనిషి. అందుకు తగిన పెట్టుపోతలు ఉండవని మా ఆడాళ్ళు ఒప్పుకో లేదు” అన్నారు. అలాగే అంటూ ఎలా చెడగొట్టలా అని అనుకున్నారు కానీ దేముడు వాళ్ళను బాగా చూసాడు.

ఆడపిల్లలు ఇద్దరు యూ ట్యూబ్ ద్వారా చక్కగా శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు ఎక్కువ నేర్చుకుని పాడేవారు. అప్పట్లో ఆడపిల్లలకి సంగీతం నేర్పించేవారు. ఇప్పుడు యూట్యూబ్ పెద్ద మాస్టారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు బాగా నేర్పుకుంటున్న విషయం అందరికి నచ్చింది. ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలకి ఇల్లు తరువాతే ఉద్యోగం అనే వాళ్ళు వచ్చారు.

ఇంకా పెద్ద కొడుకు అవినాష్ పెళ్లి విషయంలో అన్నగారి కూతుర్ని చెయ్యమని అడిగింది విజయమ్మ. కానీ వదిన గారు ఒప్పుకోలేదు. సిటీలో పేరున్న డాక్టర్ కొడుకు – బిజినెస్ చేసుకునే కుర్రాడికి చేసింది.

ఇంకా రెండో కొడుకు వెంకట సతీష్ ఉన్నాడు. వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. “సెలవలకి వేసవిలో వస్తాను, అక్కలు పిల్లలు అందరూ వస్తారు” అని అన్నాడు. సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ రాలేదు. వేసవి కాలం కూడా బాగుంది కానీ విదేశాల వారికి వేడి ఉన్నా ఇంట్లో పూల మొక్కలు దొడ్లో అరటి మొక్కల తోట మామిడి పనస సపోటా జామ చెట్లు చల్లగా ఉంటాయి.

ఒక ఉయ్యాల కట్టించి నాలుగు చెక్క సోఫాలు వేస్తారు వచ్చిన వాళ్ళు అక్కడే ఆనందంగా ఉంది అంటారు. ఉయ్యాల దగ్గరలో జాజి పందిరి, మరువం, దవనం, మల్లెపూలు చెట్టు  ఉన్నాయి. బాగా సువాసనలు వస్తాయి.

దొడ్లో పళ్ళ మొక్కలు పుల మొక్కలు విరివిగా పూసి కాసి  ఉన్నాయి. ఊళ్ళో పంచి పెడతారు. కావాల్సిన వాళ్ళకి పంపుతారు. “ఈ జన్మలో పెట్టి పుట్టాము, వచ్చి జన్మకి పుణ్యం చేసుకోవాలి” అంటారు.

ఎవరు వచ్చినా ఎక్కవ భాగం దొడ్లోనే కూర్చుంటారు. పిల్లలు ఆడుకుంటారు. ఇంక కరెంట్‌తో సంబంధం లేదు. వంటలు దొడ్లో రేకు షేడ్‌లో చేస్తారు, అందుకని ఇంటికి ఏ మాత్రం ఘాటు రాదు.

పెద్ద కొడుకు పెళ్ళి డిగ్రీ చదివిన పిల్లలతో చేశారు విజయమ్మా, శ్రీనివాసరావు. కోడలూ అత్తగారు కలుపుగోలుగా ఉంటారు. ఆమెకి ఒక కూతురు.

ఇంక చిన్న పిల్లాడు వెంకట సతీష్ పెళ్లి చెయ్యాలి. అన్నగారు తమ్ముడు దగ్గర ఈడైన పిల్లలు ఉన్నారు, కానీ ఇష్టం లేదు. అందది దగ్గర మేము మేనల్లుడికి చేస్తాము, అందుకే బయటి సంబంధాలు చూడటం లేదు అన్నారు

కానీ విజయమ్మకు భర్తకి చెప్పలేదు.

ఈ ఏడాది పిల్లాడి పెళ్లి చెయ్యాలి. వాడిని అడగాలి. ఐదు సంబంధాలు బయటవి చూసి రెడీగా పెట్టారు. వేసవిలో తమ్ముడు వచ్చే లోగా అక్కలు పుట్టింటికి వచ్చేశారు. అమ్మకి, వదినకు ఊరగాయలలో సహాయం చేశారు. ఎక్కడికి అక్కడ పని వాళ్ళు ఉన్నా సరే వీళ్ళు కలుగ చేసుకుని పనులు చేస్తారు.

పిల్లలకి పెద్దలకి ఇష్టం బెల్లం ఆవకాయ, పెసర ఆవకాయ,  నువ్వుల ఆవకాయ, ఉల్లి ఆవకాయ, మునగ ఆవకాయ, మెంతికాయ్ బెల్లం, మెంతికాయ పెడతారు. అందరూ నాలుగు కిలోల ఐదు కిలోల డబ్బాలో పెట్టుకుని వెడతారు. మామిడి పళ్ళు, సపోటా బట్టలు కట్టి పట్టుకెళ్ళడం అలవాటుగా ఉన్నది. అక్కడ చిన్న సీసాల్లో పెట్టి తెలిసిన వారికి పంపుతారు. జంతికలు, కారప్పుస, చెక్క వడలు, ఆకు పకోడిలు, మిఠాయి, అరిసెలు చేయించి డబ్బాలు నింపి పెడుతుంది విజయమ్మ. మనవలు వచ్చేటప్పటికి అన్ని రెడీగా ఉంచుతుంది.

ఆహారం తరువాతే మరి ఏదైనా. రుచిగా శుచిగా వండాలి. అనందంగా ఆరోగ్యంగా ఉండాలి. కొన్నవి అసలు ఇష్ట పడదు. వీలున్నంత వరకు వంట వాళ్ళని రప్పించి చేయిస్తుంది. “అత్తింటి పనులు చేసుకుని ఉంటారు ఇప్పుడు ఇక్కడ పనులు ఎందుకు?” అని విశ్రాంతిగా ఉండమంటుంది కూతుళ్ళని. పిల్లలు పెద్దలు నచ్చిన సినిమాలు టివిలో సీడీలు పెట్టుకుని చూస్తారు. హాయిగా నిద్ర పోతారు. పిల్లలకీ, పెద్దలకీ వేసవి వేడి ఏమి తెలియదు. అలా ఉంటుంది ఇల్లు. సాయంత్రం నాలుగు గంటలకు పని మనిషి వచ్చి పువ్వులు కోసి ఇస్తుంది. చక్కగా మాలలు కట్టి పెట్టుకోండి అంటుంది. మనుమరాళ్ళకి పువ్వుల జడ వేస్తుంది

“అమ్మా మాకు ఏ లోటు లేని సంబంధాలు చేశారు. మాకు అన్ని దొరుకుతాయి. అయితే అక్కడ ధరలు ఎక్కువ. అందుకని కుదిరినప్పుడు, అవి వచ్చినప్పుడు కొంటాము” అన్నారు కూతుళ్ళు.

“అవును నాకు తెలిసిన విషయమే. నేను వచ్చి మీ ఊళ్ళో ఉన్నాను, చూసాను కదా. తల్లి ప్రాణం కదా పిల్లల కోసం ఎప్పుడు ఆరాటపడుతు ఉంటుంది. అంతే తల్లీ” అంటూ ఉంటుంది విజయమ్మ.

ఉదయం పాలేరు వెంకన్న వచ్చి  పనస తొనలు, అనాస ముక్కలు, కొబ్బరి బొండాలు, సపోటా పళ్ళు అన్ని కూడా తెచ్చి ఇస్తాడు. అన్ని కూడా రసాలు చేసి ఫ్రిజ్‍లో పెట్టి మనుమలకి మధ్యాహ్నం ఇస్తుంది. పిల్లలు వచ్చేలోగా కారాలు, వడియాలు, ఊరగాయలు, మిరపకాయ ఊరగాయలు అన్ని చేసి రెడీగా ఉంచింది విజయమ్మ. “ఈ పిల్లలకి పిడకకి అరిసెకి తేడా తెలియదు” అని అన్నీ చూపిస్తు నేర్పుతూ ఉంటుంది.

మరి వచ్చే విదేశీ కోడలు ఎలా ఉంటుందో? అయినా విజయమ్మకు సహనం, శాంతం ఎక్కువ. భాష రాని కోడల్ని కూడా చక్కగా చూసుకోగలదు. ఆ తెలివి ఉన్నది.

***

సూర్యోదయంలో ఎన్నో అందాలు. మరెన్నో మార్పులు చేర్పులు. జీవితంలో అవన్నీ కూడా అనుభవించాలి తప్పదు.

రైతులు ఉండి పొలం ఉండి భూమాత సేవ చేసే రైతులుగా జీవించడం ఒక అదృష్టం. ఆర్థిక, సామాజిక, మానసిక, శారీరక ప్రకృతి మార్పులు అన్ని భరిస్తూ  ఓర్పు నేర్పుతో ఇంటికి ఆహార గింజలు వచ్చేలా చూస్తారు రైతులు. కానీ ప్రకృతీ మాత్రం వినదు. దానికి ఎంతో ఓర్పు కావాలి. అయితే ఉత్తమ స్థితి కొందరికే లభిస్తోంది.

కొందరు పిల్లల్ని ఇందుకే వేరే వృత్తిలో పెడుతున్నారు. పంట సంపాదన అంతగా లేవు. ఆ ఉద్యోగాలు కూడా ఎండమవుల్లా ఉన్నాయి. ఖర్చు పెట్టిన డబ్బు లెక్క వస్తుంది కానీ పంట దిగుబడి తక్కువ ఉంటోంది. అప్పులు మిగులు రాబడి లేదు అని తెలుస్తోంది. రైతు భరోసా కేంద్రాలు ఉన్న రైతుకి అందేది అంతంత మాత్రమే. పంట నష్టం బ్యాంక్‌లో వస్తుంది అని చకోర పక్షిలా చూడటమే. ఇచ్చే సమయానికి వేలిముద్ర సరిగా పడలేదు అంటూ ఏవో వంకలు వాగులు పొంగుతాయి.

ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లలే అంతంత మాత్రంగా అత్త ఇంట ఉంటున్నారు. అలాంటిది వేరే దేశంలో పెరిగి చదివిన విదేశీ పిల్ల ఇక్కడ పద్దతిలో ఇమడటమెంత కష్టమో ఆలోచించాలి. ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది. మట్టి ముద్దలా మలచుకోవాలని ప్రతి భర్త, ప్రతి అత్తింటివారు అంటారు. అలా వింటూ ఉన్న పిల్ల కావాలి. పెళ్లి కి ముందు అన్ని ఎస్, ఆల్రైట్ అనేసి, పెళ్లి తరువాత నో అంటారు. ఇది చాలా కుటుంబాల్లో జరుగుతున్న విషయమే. ఆడపిల్లని అన్నదమ్ములు తండ్రి అల్లారు ముద్దుగా పెంచి సమాజం నుంచి రక్షింప డానికి ఒక ఉత్తమ భావాలు  గల వ్యక్తితో పెళ్లి చేసి అత్తింటికి పంపుతారు. పెళ్లికి ముందు చెప్పిన ఉత్తమ మాటలు పెళ్లి అయిన  తరువాత వ్యతిరేక ధోరణిలోకి మారుతాయి. ఇంకా ఆడపిల్ల జీవితం లో సుఖం ఎక్కడిది? ఎలా బ్రతకాలి? స్థిరం కానీ పుట్టిల్లు, అస్థిరత్వంలో ఉన్న అత్తిల్లు – రెండు ఆమెకు సమస్య పూరణలే.

ఉరంతట ఉపన్యాసాలు, భార్య విషయంలో అసమానత్వం చూపుతారు. దీనికి అత్తింటివారు ఆనందాలు వెళ్లగక్కారు.

విజయమ్మ కోడలు విషయం లో చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ దేశం పిల్ల కాదు ఉన్న నెల అయినా మంచి అత్తగారు అనిపించుకోవాలి. ఇది భ్రమ కదా!

“మా పిల్లలు బుద్ధిమంతులు. ఇల్లు ఆఫీస్ తప్ప ఏమీ తెలియదు” అంటూ చెపుతారు. వాళ్ళకి కనీసం కట్టుకున్న భార్య దగ్గర కూడా డిసిప్లిన్ ఉంటే ఎలా గొప్ప కబుర్లు కాకరకాయలు చెపుతారు? వాటి వల్ల వల్ల జీవితం సజావుగా కాదు. అతి పద్ధతిగా పెంచడం వల్ల సమస్యలు వస్తాయి. భార్య దగ్గర చనువు ఉండాలి. స్కూల్ పిల్లల మాదిరి అత్త భర్త వేధిస్తే ఎలా? అది వాళ్ళకి గొప్ప విషయము.  అదో గొప్ప విశేషము కూడా.

***

సమస్యలతో అట్టుడుకుతున్న రైతుల కోసం ఎన్నో రంగుల జండాలు నాయకులు భరోసా ఇచ్చారు. కానీ బ్యాంకులో మాత్రం ఖాతాలు నిండలేదు. మాటలు బురిడీ కబుర్లుగా మిగిలాయి. పిల్లలని చదువులో పెట్టీ నాలుగు రకాల సంపాదన అవసరమే అనుకుని వేరే వృత్తికి వెడుతున్నారు అని అంటున్నారు. అందరూ ఆ వృత్తి వదిలేస్తే ఎలా, మనకి ఆహారం అవసరం కదా అందుకే కొందరు ఆధునిక యంత్రాల ద్వారా పంటలు పండించడానికి ముందుకు వస్తున్నారు.

ఎన్నో ఉపయోగాలు, యంత్రాలు వచ్చినా ఆహారం విషయంలో రైతుల అవసరం ఎంతో ఉన్నది. అందుకే రైతే రాజు అంటారు. ఎందుకంటే మంచి పంటలు విదేశీ ఎగుమతులకు కూడా అవసరమే.

ఆదే నేపథ్యంలో  హిమబిందు ఆహార డాక్టర్ కోర్సు చదివింది. అయినా సరే వంటలు, పంటలు ఇవన్నీ కూడా బాగా రీసెర్చ్ వర్క్ చేసి మనిషిపై ఆహార ప్రభావం వల్లే ఆరోగ్యం, మానసిక స్థితి ఉంటుంది అని బాగా ఎన్నో విషయాలు తెలుసుకుని వ్యాసాలుగా కథలుగా రాసింది.

ఆమెకు ఇండియా వచ్చి మంచి పొలాలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కోరిక.  కారణం చిన్నప్పుడు తాతగారి ఇంటికి వెళ్ళడం, అక్కడ మామయ్యలు ఎంతో గొప్పగా ఉండటం చూసింది. మేనమామ కొడుక్కి చేద్దామని అడిగితే అత్త మీ అమ్మాయి విదేశాల్లో పుట్టి పెరిగింది, గ్రీన్ కార్డ్ హోల్డర్‌గా పెరిగింది. ఒక్క పదిరోజులు ఇక్కడ ఉండటానికి బాధ పడింది. జీవిత కాలం మాతో ఉండటం కష్టం కదా? రావాలని ఉండాలని ఉంటే ఎప్పుడైనా రావచ్చు, ఉండవచ్చు” అని సంబంధం కలుపుకోలేదు. ఆ అబ్బాయికి ఇంకో పది ఎకరాలు ఉన్న, ఒక్కతే కూతురున్న సంబంధం చేశారు.

ఒక విధంగా అది నిజమే అనుకున్నారు హిమబిందు తల్లిదండ్రులు. అప్పటినుంచి పొలాలు ఉన్న సంబంధం చెయ్యాలి హిమ తల్లి పట్టుపట్టింది. కెనడాలో ఉండి విదేశీ సంబంధాలు చూస్తూ మన వెంకట సతీష్‌ని ఎంపిక చేశారు. హిమ వాళ్ళ పిన తండ్రి రమణ రావు గారు కూడా సతీష్ కంపెనీలో చేస్తున్నారు. వివరాలు తెలుసుకొని స్నేహం పెంచుకుని పిల్లను ఇవ్వడానికి ఏడాది పాటు గ్రౌండ్ వర్క్ చేశారు. మొత్తానికి అందరూ ఇష్టపడ్డారు. విదేశీ కోడలు మాకు వద్దు అనలేదు విజయమ్మ. సంతోషించింది.

ఏ దేశమైనా ముక్కు ముఖం తెలిసిన పిల్ల కావాలి, ఇదే వారి ఉద్దేశం. కారణం తన ఆడపడుచు కూతురు పెళ్లి విషయంలో సమస్యలు వచ్చాయి. ఒక్కతే ఆడబడుచు పూర్ణ.  విజయమ్మ పెద్ద కొడుకు కన్నా రెండేళ్లు పెద్దది. పెళ్లి తరువాత వదినా అంటూ బాగా అలవాటు. అన్న వదిన అమ్మ నాన్న కంటే ఎక్కువ చూసేవారు. వేలు విడిచిన మేనమామ  సంబంధం మంచిదని పెళ్లి విషయంలో సరే అన్నారు. ఇంట్లో ఆఖరు కుర్రాడు, మంచి తెలివైన వాడు,  ఇక్కడే ఉండి బావగారితో వ్యవసాయం చూసేవాడు. చదువు తక్కువే అయిన చెల్లెలు కళ్ళ ముందు ఉంటుదని చెప్పి చేశారు.

ఒక పిల్లని కన్నకా  అన్నదమ్ములు “అక్కడ ఉండి వ్యవసాయంలో వారికి సహాయం చెయ్యడం కాదు. మనకు పొలం ఉన్నది, మా దగ్గర ఉండి చెయ్యి” అని అతన్ని ఎగేసి అల్లరి చేసి తీసుకు వెళ్ళారు.

పూర్ణ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. ఉమ్మడి కుటుంబంలో వంట వార్పు చెయ్యలేక జబ్బు పడింది. అక్కడ నీళ్ళు కూడా ఒక ఫర్లాంగు వెడితే కానీ నుయ్యి లేదు. పాలేరు చేత నీళ్ళు కొన్ని మాత్రం తెప్పించే వారు. మడి నీళ్ళు కోడలు తేవాలి. పురిటికి వచ్చి పిల్లను కన్నాక ఆరోగ్యం సాగక సహకరించక చెల్లెల్ని ఇక్కడే ఉంచేసారు. అక్కడి వైద్యం లేదు, చూస్తూ చెల్లెల్ని పంపడానికి ఇష్టత చూపలేదు.

విజయమ్మ మేనకోడలు  సుధీరని కూడా కూతురు మాదిరి పెంచి డిగ్రీ చదివించి పెళ్లి చేసేసారు. ఏదో కంపెనీలో పని. తల్లి తండ్రి చెల్లెలు ఉంటారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. పెళ్లి కాని చెల్లెలు వదిన గారిపై చాడీలు చెప్పింది దానితో గొడవ వచ్చింది. అసలు పెళ్లికి ముందు పూర్ణను చూసే బాధ్యత అల్లుడికి ఉన్నది అని చెప్పారు. ఒప్పుకుని పెళ్లి అయ్యాక పక్కింటి ఎదురింటి కిందింటే వేరే బంధువులు వల్ల వియ్యపరాలు  ఉంటే కూతుర్ని పని చెయ్యనివ్వదు అంటూ రూల్స్ చెప్పి పంపేశారు.

విజయమ్మ ఆడపడుచుని కూడా కూతురు మాదిరి ఆదరించింది. అది ఆమె మంచితనం.  ఇంట్లో ఆడది కలిసి వస్తే కానీ మగాడు ఏమి చెయ్యలేడు అంటారు. కానీ ఇద్దరు కలిసి ఆలోచించుకుని చెయ్యాలి. అప్పుడే బాగుంటుంది. అంతా మంచి మనసు. మరి విదేశీ కోడల్ని ఎందుకు బాగా చూడదు?!

***

వెంకట సతీష్ విదేశాల నుంచి కూడా ఎనిమిది పెద్ద సూట్కేస్‌లు ఒక అందమైన కుర్రాడితో ఇంటికి చేరాడు. ఊరంతా కొత్త విషయంగా చెప్పుకున్నారు.

పెళ్లి చూపులు, మాటలు అన్ని కూడా వీడియో కాల్స్‌లో జరిగాయి. ఇప్పుడు బావమరిది అనిరుధ్‌ను తీసుకుని వచ్చి ఒక నెల ఉండి పెళ్లి పనులు చూసుకోవడానికి వచ్చాడు.

కానీ మేనమామలకి ఈ విషయం తెలియదు. ఇద్దరి కూతుళ్ళ కోసం వచ్చి మేనల్లుడిని ఘనంగా పలుకరించారు. వాళ్ళకి వాచీలు తెచ్చాడు. సంబరపడ్డారు.

“బావగారు పడుకున్నరా” అంటూ శ్రీనివాసరావు గారి కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు అర్జునుడు దుర్యోధనుడు మాదిరి కూర్చున్నారు.

“ఏమిటి?”

“లేవండి, మా అన్నయ్యకు పరీక్షా? లేవండి” అంటూ విజయమ్మ భర్తను నిద్ర లేపి కూర్చోబెట్టింది.

“ఏమిటి ఇంత ఎండలో వచ్చారు?” అంటూ లేచాడు.

“పిల్లలు గల వాళ్ళం, ఆడపిల్లని చెప్పాలి అని వచ్చాము” అన్నారు.

“అబ్బే నాదేమి లేదు. అంతా వాడిదే ఇష్టం” అన్నాడు శ్రీనివాసరావు.

ఇంకా వాళ్ళు మేనల్లుడికి రక రకాల బిస్కట్లు వేశారు, వాడు పడలేదు.

“అన్ని ఎప్పుడో ఫిక్స్ అయ్యాయి. మీ స్థాయి ఎక్కువ. అందుకని నేను అక్కడే అన్ని రెడీ చేసుకుని వచ్చాను. పెళ్లి ముహూర్తం పెట్టాక, ఒడుగుకి కెనడా నుంచి అంతా వస్తారు. ఓ పాతిక మంది బంధువులు ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. మీరు వచ్చి దీవించండి” అన్నాడు.

కొంచం బాధతో అనందం నటించారు. విధి రాత ప్రకారం అన్ని జరిగిపోయాయి

***

విజయమ్మ కోడలికి పట్టు చీరను లంగా ఓణి మాదిరి కుట్టించింది. కొడుకు బావమరిదికి పట్టు పంచెలు కుట్టించింది. చాలా అందంగా కొత్తగా ఉన్నాయి. ఆ ఇంట్లో పదిహేను ఏళ్ల తరువాత పెళ్లి. ఇప్పుడు మార్పులు ప్రకారం ఈవెంట్ వారు వచ్చి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆడ పెళ్లివారు, మగ పెళ్లివారు మాదిరి వచ్చి పెళ్లి చేశారు. రంగ రంగ వైభవంగా పెళ్లి జరిగింది. నలభయి రకాల వంటకాలు. అప్పడాల పిండి ఊరు మిరపతో సహా ఉలవ చారు జున్ను కూడా వడ్డించారు.

రెండువేల మంది వచ్చారు. అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. కౌలు రైతులు ఇరవై మందికి పట్టు పంచెలు ఫాన్సీ చీర ఇచ్చారు. మిగిలిన పాలెళ్లకి ప్యాంట్ షర్ట్ ఇచ్చారు రెడీమేడ్‌వి. ఇవ్వాళ కుట్టుకూలి వెయ్యి పైగా ఉన్నది కదా.

ఇంకా కూలిలకి అన్నం క్యారేజీలు బహుమతి ఇచ్చారు. అందులో అరిసె, మైసూర్ పాక్, మిఠాయి, జంతికలు. కాజ పెట్టారు. ఇంక మామిడి పళ్ళ సంగతి సరే సరి. అంతా ఆనంద పడ్డారు. మేనమామలు కొంచెం అసూయ పడ్డారు.

హిమబిందు తెలుగు బాగానే మాట్లాడుతోంది. మేనమామ పెళ్లికి మేనకోడళ్ళు డాన్స్ చేశారు. వాళ్ళకి బెంగుళూర్‌లో పెద్ద టీచర్ దగ్గర నేర్పిస్తున్నారు. ఆమెను కూడా పిలిచారు. అవిడ కొన్ని ఐటమ్స్ గ్రూప్‌లో పాల్గొన్నది ‘ముద్దు గారే యశోద’ వంటి శ్రీ అన్నమయ్య వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడారు, నృత్యం చేశారు. తెలిసున్న పాటలు కనుక అందరు ఆనంద పడ్డారు.

కళ ఎప్పుడు శాశ్వతం. అది కొందరికే వస్తుంది. కళలు పొలాలు ఉండాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలి.

ఏ దేశం అయినా మంచి ఆహారమే ఆరోగ్యం. ఆనందమూ,  ఆహ్లాదం, అద్భుత అపూర్వ అందము కూడా.

సర్వేజనా సుఖినభవంతు. శాంతి శుభము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here