మహతి-3

0
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[తమ కాలేజీలో స్వేచ్ఛ ఎక్కువని చెప్తుంది మహతి. అలా అని లెక్చరర్లు విద్యార్థులని పట్టించుకోరని కాదని చెప్తూ, చదువుకన్నా జీవితంలో ఇంకా ముఖ్యమైనవి ఎన్నో ఉంటాయని చెప్పిన లెక్చరర్ శ్రీమన్నారయణ గారిని గుర్తు చేస్తుంది. రహీమా సహాయంలో హిందీ పాటల అర్థాలు తెలుకుని, టీవీలో మ్యూజిక్ ఛానెల్స్ చూస్తూ, హిందీ పాటలను ఎక్స్‌ప్రెషన్‍తో పాడడం నేర్చుకుంటుంది మహతి. అప్పుడప్పుడూ తమ కాలేజీ పక్కనుంచి పారే బందరు కాలువ వంతెన వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదించేది. ఒకరోజు అక్కడ కూర్చుని ఉండగా హరగోపాల్ వచ్చి పలకరిస్తాడు. ఆమె సిగ్గుపడకుండా మాట్లాడుతుంది. మహతి బాగా పాడుతుందని తెలిసిందంటాడు. తను పాడితే వినాలని ఉందంటాడు. సమయం రావాలని అంటుంది. మాట్లాడినందుకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. మర్నాడు వందన మహతి గురించి, హరగోపాల్ గురించి మహతితో వెటకారంగా మాట్లాడుతుంది. లవ్‍లో పడ్డారా అని అడుగుతుంది. గట్టిగా కౌంటర్ ఇస్తుంది మహతి. మర్నాడు కాలేజీ గోడలపై మహతి, హరగోపాల్ పేర్లు రాసుంటాయి. మహతి ఫ్రెండ్స్ అందరూ బాధపడి ఆ రాతల్ని చెరిపేస్తారు. హరగోపాల్ వచ్చి క్షమించమని అడుగుతాడు. ఇదొక పిరికిపంద పని అని అందరూ వినేలా చెప్పి, అతన్ని బాధపడద్దంటుంది మహతి. కాలేజీ ప్రిన్సిపాల్ గారి పుట్టినరోజు వస్తే అప్పటికప్పుడు అనుకుని కేక్, స్వీట్స్ తెప్పించి క్లాసు రూమ్‍లో ఆయనతో కేక్ కోయిస్తారు మహతి, ఆమె క్లాస్‍మేట్స్. ప్రిన్సిపాల్ గారిని ఉద్దేశించి చక్కని పాట పాడతాడు హరగోపాల్. పాట బాగా పాడావని అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తుంది మహతి. అది చూసిన వందన, హడావిడి అంతా సద్దుమణిగాకా, పాణిగ్రహణం అయినట్టేనా అని మహతిని అడుతుంది. మళ్ళీ మరోసారి గట్టిగా సమాధానం చెబుతుంది మహతి. అందంగా తయారై వచ్చే క్లాస్‌మేట్ అఖిలకి – ఆమె శరీరం నుంచి వచ్చే దుర్వాసన గురించి ఏకాంతంలో చెప్తుంది మహతి. ఆమె నిజం గ్రహించకపోగా, మహతిని తిట్టి వెళ్ళిపోతుంది. ఒకరోజున అనంతలక్ష్మి ఏడుస్తూ మహతి దగ్గరకొచ్చి తనకెవరో ప్రేమలేఖ రాసారని చెప్పి, దాన్ని చూపిస్తుంది. దాన్ని చదివిన మహతి ‘ఇది రాసింది వెధవ వుత్తి నోటి దురద గాడు, భయపడద్దు’ అంటూ ధైర్యం చెప్పి, క్లాసు రూమ్‍లో లెక్చరర్ ముందు అనంతలక్ష్మి పేరు చెప్పకుండా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రేమలేఖ రాసాడనీ, అతను ఎవరో తాను సులువుగా పట్టించగలలనీ, కానీ ఇదే పెళ్ళాడేవయసు కాదని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఒక రోజున ఇంగ్లీషు క్లాసులో సార్ – ఆ రోజు పాఠాలు వద్దని, సరదాగా గడుపుదామని అనడంతో కొందరు జోక్స్ చెప్తారు. హరగోపాల్ పాడుతాడు. అతని పాటయ్యాకా, మహతి పాడుతుంది. ఆ పాట నచ్చిన అందరూ మరికొన్ని పాటలు పాడించుకుంటారు. మొదటి సంవత్సరం సందడిగా ముగిసి, రెండో సంవత్సరం మొదలవుతుంది. మిత్రులంతా సన్నిహితులవుతారు. పెద్ద పేర్లని తీసేసి, షార్ట్ నేమ్స్‌తో పిలుచుకోవడం మొదలుపెడతారు. భవిష్యత్తు లక్ష్యాలు ఏర్పడుతుంటాయి. అందరిలోకి తిరుమలరావు (తిమ్మూ) ప్రత్యేకంగా నిలుస్తుంటాడు. – ఇక చదవండి.]

[dropcap]హా[/dropcap]ఫ్ యియర్లీ ఎగ్జామ్స్ తరువాత ‘క్లాస్’ పిక్నిక్ జరిగింది. ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాస్ పిల్లలతోనే పిక్నిక్‍కి పోవడమన్న మాట. మేమందరం వూరు బయట వున్న మామిడి తోటని సెలెక్టు చేశాం. కారణం అక్కడ ఓ పెద్ద బావీ, మోటర్, ఓ ఫామ్ హౌస్ లాంటి హంగులు వుండటమే. అంతేకాక కొబ్బరిచెట్లూ సపోటా చెట్లూ కూడా వున్నై.

వంటలు కూడా అక్కడే ప్రిపేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందరూ రాలేకపోయినా అయిదుగురు లెక్చరర్స్ మాత్రం ‘ఖచ్చితంగా వస్తా’మని మాటిచ్చారు. వారిలో ఒకరు వరలక్ష్మి గారు. చాలా సాఫ్ట్ పెర్సన్. ఎప్పుడూ కూల్‍గా, హుందాగా వుంటారు. కానీ ఏదో ‘వెలితి’ వుందని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది ఆవిడ్ని చూస్తే. నాకు చాలా ఇష్టం ఆవిడ అంటే.

వరదాచార్యులు గారు మరో లెక్చరర్. ఆయన మా తెలుగు లెక్చరర్. మాంఛి ఒడ్డూ పొడుగూ. అందర్నీ ‘ఒరేయ్’ అనే పిలుస్తారు. ఆడపిల్లల్ని మాత్రం ‘అమ్మాయ్’ అంటారు. జోవియల్ మనిషి.

సత్యమూర్తిగారు మేథ్స్‌కి వస్తారు. ఆయన ప్లానింగ్ అద్భుతం. అగ్గిపెట్టె దగ్గర్నించీ అన్నీ లిస్టుగా రాస్తారు. ఏ పని తరవాత ఏమి చెయ్యాలో వివరంగా ప్రతి అకేషన్‍కీ ఓ నోట్‍బుక్కులో రాసి సిద్ధం చేస్తారు.

‘షామియానా’ల వాళ్ళ దగ్గర్నించి వంట సామాన్లు ఎట్సెట్రా అన్నీ ఉదయం ఆరు గంటల కల్లా తెచ్చి తోటలో పెట్టించాడు జగపతి. ఆ తోట వాళ్ళదే. ఆరున్నరకి గాడిపొయ్యి వెలిగించారు వరదాచార్యులు గారు. “ఒరేయ్, ఉప్మా చేద్దాం. దానిలో నంజుకోవడానికి ఉల్లిపాయ టమోటా చెట్నీ చేద్దాం” అని ఉప్మా ఎలా ఎన్ని రకాలుగా తయారు చెయ్యచ్చో వివరంగా చెబుతూ ప్రాక్టికల్‍గా చేసి చూపించారు.

టమోటా పప్పు, మాంఛి ఇంగువ పోపు వేసిన గోంగూర పచ్చడి, బంగాళదుంప కూర, కొబ్బరి+వంకాయ పెరుగు పచ్చడి, బెండకాయ కూర, పెద్ద పెద్ద మంచి గుమ్మడికాయ ముక్కలూ, సొర, దోస ముక్కలూ వేసి బ్రహ్మాండమైన సువాసనలు వెదజల్లుతున్న దప్పళం, అరటికాయ బజ్జీలు, ఆవడలు, వైష్ణవులు స్పెషల్‍గా చేసే పులిహోర, సేమియా పాయసం (జీడిపప్పులూ, కిస్‍మిస్ పండ్లూ దిట్టంగా వేసిన), ఆ పైన గడ్డ పెరుగు. ఇదీ మెనూ.

వరదాచార్యులు గారూ, వరలక్ష్మి గారు, రవీంద్రనాథ్ గారూ వంటల అజమాయిషీ చేస్తూ చేయిస్తూ వుంటే నేను, అల, ఉష, మాన్య వారికి కూరలకు తరగడంలోనూ, మిగతా పనుల్లోనూ సహాయం చేశాం.

రహీమా, భారతీ పక్క తోటలో ఉన్న బాదం ఆకుల్ని గంపనిండా కోసుకొచ్చి టిఫిన్‍లకీ, భోజనాలకీ చక్కగా సరిపోయేట్టు ‘విస్తళ్ళు’ కుట్టారు. విస్తళ్ళ ఐడియా రహీమాదే. ‘పర్యావరణం’ పాడు చెయ్యకూడదని తీసుకున్న నిర్ణయం అది. అలాగే గ్లాసులు కూడా (స్టీలువి) రెంట్‍కి తెచ్చి వాడాము గానీ, ‘యూజ్ అండ్ త్రో’ వి వాడలేదు.

మొదట్లో గమనించలేదు గానీ, తరవాత, చాలా సేపటి తరవాత గమనించాను. వందన అసలు టిఫిన్‍కే రాలేదు. దూరంగా ఓ చెట్టుని ఆనుకుని కూర్చుంది. మిగతా వాళ్ళందరూ టిఫిన్లు తినేశారు. చెప్పొద్దూ – ఆ రోజు ఉప్మా రుచే వేరుగా అనిపించింది. ఎప్పుడూ ‘పంచుకుని’ తినేదే ప్రసాదం అవుతుందనిపించేది. నేనూ, వరదాచార్యులు గారూ, అల ఇంకా టిఫిన్ చెయ్యలా. వరలక్ష్మి గారికి సుగర్ వుండడంతో స్టూడెంట్స్‌తో పాటు తినేశారు. నేను వందనని పిలవడానికి చెట్టు దగ్గరకు వెళ్ళాను. “వందనా.. టిఫిన్‍కి రాలేదేం?” అడుగుతుండగా, వందన ముఖం వెనక్కి తిప్పి నా వంక చూసింది. కళ్ళ నిండా నీళ్ళు. నాకు చాలా బాధ కలిగింది. సామాన్యంగా ఆ అమ్మాయితో ఎవరూ మాట్లాడరు. పిక్నిక్‍కి వచ్చినా ఎవరూ మాట్లాడకపోయేసరికి బాధతో ఒంటరిగా కూర్చుని వుంటుంది అనిపించింది.

“సారీ వందనా.! నీతో మాట్లాడలేకపోయాను.!” అంటూ ఆమె భుజాల మీద చేతులు వేశాను. సిన్సియర్‍గానే బాధ పడ్డా కూడా.

“మహీ.. నేనంటే మీ అందరికీ అసహ్యం కదూ..!” వెక్కుతూ అంది.

“లేదు.. నువ్వు పుల్ల విరిచినట్టు మాట్లాడతావని కొంచెం భయంతో పక్కకి తొలగుతాం.. అంతే..!” అనునయంగా అన్నాను.

తనేమీ మాట్లాడకుండా ఏడుస్తూనే వుంది. ఏడవనిచ్చాను కాసేపు. ఏడవడం కూడా భగవంతుడు మనిషి కిచ్చిన వరమే. గుండెలో గూడు కట్టుకున్న బాధ ఏడిస్తేనే కరుగుతుంది. ఆ కన్నీళ్ళే లేకపోతే గుండెలో బాధ కొండలా పెరిగి మనిషిని నిలువునా చంపెయ్యదూ!

కొంత ఉధృతి తగ్గాకా అన్నాను, “పద.. నేనూ టిఫిన్ చెయ్యలా.. అక్కడ అల, మాన్య, రహీమా కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు” అన్నాను.

మెల్లగా కన్నీళ్ళు పైటకి తుడుచుకుని నా వెంట వచ్చింది. అల ఏదో అడగబోతుండగా వద్దని సైగ చేశాను. అది సైలెంటైంది.

టిఫిన్ కోసం కుట్టిన బుల్లి విస్తళ్ళు భలే వున్నాయి. వేడి వేడి ఉప్మా బాదం ఆకుల్లో వడ్దించుకుని చెట్నీతో తింటూటే అద్భుతంగా వుంది. జీడిపప్పులే కాదు, వరదాచార్యులు గారు కిస్‍మిస్ కూడా ఉప్మాలో వేశారు. అవి నిండుగా ఉబ్బి భలే టేస్ట్‌ని ఇచ్చాయి.

ఇటు ఆటలూ పాటలూ, కబుర్లతో సరదాగా గడిచిపోతుంటే, అటు వంటల కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంటే, వందన మాత్రం మౌనంగా కూర్చుని వుంది. ఎందుకో తెలీదు గనీ నాకు చాలా జాలిగా అనిపించింది. ఎప్పుడూ ఏదో మాట విసిరి ఇతర్లని బాధ పెట్టే వందనని ‘ఇలా’ చూడటం బాధ కలిగించింది.

“వందనా.. కొంచెం హెల్ప్ చేస్తావా?” కావాలనే దప్పళానికి ముక్కలు తరుగుతూ పిలిచా. వచ్చింది. పెద్దగా పనేం లేదు. ఆ విషయం తనూ గ్రహించింది. బహుశా వరలక్ష్మి గారు కూడా వందనని గమనించి వుండాలి.

“వందనా.. నీకు వంట వచ్చా?” అని నవ్వుతూ అడిగారు.

“వచ్చండీ.. మీరేమీ అనుకోకపోతే తోటకి వేసిన కంచెకి నేతిబీర తీగ పాకిందండీ.. నేతిబీరకాయలు చాలా వున్నాయండి.. వాటిని కోసుకొచ్చి పచ్చడి చెయ్యనాండీ?” చాలా నెమ్మదిగా అన్నది.

వందన ఇంత నెమ్మదిగా ఇంత వినయంగా మాట్లాడం ఇదే మొదటిసారి. “వై నాట్! నేతి బీరకాయ పచ్చడి అంటే నిజంగా ఓ వైభోగమే.!” ఆనందంగా అన్నారు వరదాచార్యులు గారు. భగవంతుడు ఒక్కొక్కరికీ ఒక్కో టాలెంట్ ఇస్తాడనుకుంటాను. బోలెడు నేతిబీరకాయలు కోసుకొచ్చి దినుసులన్నీ తనే వేయించి తనే నూరి బ్రహ్మాండంగా పచ్చడి చేసింది వందన.

ఒంటి గంటన్నరకి అందరూ విస్తళ్ళ ముందు కూర్చునుండగా అన్ని కూరలూ పప్పూ, పచ్చళ్ళూ వడ్డిస్తూ, నేతిబీరకాయ పచ్చడిని మాత్రం ‘ఇది వందనా స్పెషల్ పచ్చడి’ అని అందరికీ చెబుతూ నేనూ, మాన్య వడ్డించాం. ఆ మాట విన్నప్పుడు వందన కళ్ళల్లో తళుక్కుమన్న వెలుగునీ ఆనందాన్నీ దాదాపు అందరూ గమనించారు.

నిజంగా చెబితే వంటలన్నీ అద్భుతంగా కుదిరాయి. నేతిబీరకాయ పచ్చడిని అందరూ ఎంత లైక్ చేశారంటే పూర్తిగా గిన్నె తుడిచెయ్యాల్సి వచ్చింది. చిట్టచివర భోజనానికి కూర్చున్నది నేనూ, వరదాచార్యులు గారూ, రహీమా, వందన. మాకు కొద్దిగా పులిహోర, కాస్త పప్పూ, రెండు బజ్జీలూ తప్ప ఏమీ మిగలలేదు.

‘ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు’ ఆ విషయం గుర్తు కొచ్చినా నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే వరదాచార్యులు గారు తయారించిన ఆ కొబ్బరి వంకాయ పెరుగు పచ్చడి ‘రంగు’ యీనాటి వరకూ నేనెక్కడూ చూడలేదు. దాన్ని ఆ రోజు ‘రుచి’ చూడలేకపోవడం జీవితంలో ఏనాడూ, పూడ్చలేని లోటే.

ఆ మాటే వరదాచార్యులు గారితో అంటే “అమ్మాయ్.. మనం చేసిన వంట మనకి మిగలకుండా అందరూ తినేస్తే అంతకి మించిన ‘ఎవార్డు’ లోకంలో మరొకటి వుండదు. ఆ తృప్తితో కడుపు నిండిపోతుంది కాదూ.!” అని నవ్వారు.

ఎంత గ్రేటు.. వందన చేసిన నేతిబీర పచ్చడి దానికీ మిగల్లేదు. మేం నలుగురం కూడా రుచి చూడడానికి మిగల్లేదు.

సరే.. అదలా వుంచితే ‘వందన’ మొహంలో ఆనాడు ఆనందం నృత్యం చేసింది. అందరూ తాను చేసిన పచ్చడి రుచిని పొగిడి అభినందించినవాళ్ళే.

పిక్నిక్ అయిపోయాకా, గిన్నెలన్నీ తోమేసి స్థలాన్ని చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేశాక, ఎవరింటికి వారు పోయే ముందు వందన నన్ను కావలించుకుని, “థాంక్స్ మహీ.. యీ రోజును బతికున్ననాళ్ళూ మరువలేను.” అన్నది. వందన గొంతులో ‘తడి’.

నాకు అప్పుడు అనిపించింది.. ‘మనిషి’ని అర్థం చేసుకోవాలంటే అంత తేలిక కాదని. ప్రతి మనిషి ‘లోపలా’ మరో మనిషి ఉంటాడు. ఆ లోపలున్న మనిషే అసలు సిసలు మనిషి. బయటకి కనిపించేవాడు కాదు.

బైటకి కనిపించే మనిషి మొహానికి ఎన్నో ముసుగు లుంటాయి. లోపకి మనిషికి ఏ ముసుగూ వుండదు గాక వుండదు.

మనలోనూ మరో వందన వున్నది. బైటకి నిన్నటి వరకూ కనిపించిన వందన పెడసరంది. ఇతర్లను ఏదో ఓ మాట అనో, పుకారు పుట్టించో వాళ్ళని బాధపెట్టి ఆనందించే శాడిస్టు. నిన్న చూసిన వందన వేరు. ఎందుకో ఆమెని ఇంకా లోతుగా తెలుసుకోవాలనిపించింది. ఎవరి గురించి ఎవరు పూర్తిగా చెప్పగలరూ?

“తిమ్మూ మంచి ఆర్గనైజర్ మహీ.. ‘షో’ చెయ్యకుండా సైలెంట్‍గా వర్క్ చేసే టైపు” మెచ్చుకోలుగా అన్నది అనంతలక్ష్మి.

“ఏమి ఆర్గనైజ్ చేశాడూ?” అడిగా. “పిక్నిక్‍కి కావల్సినవన్నీ జగపతి అరేంజ్ చేశాడని అనుకున్నాం గానీ, వెనక వుండి సమయానికి అన్నీ అమరేటట్లు చేసింది తిమ్మూనే.!” బ్రైట్‍గా మెరుస్తున్న కళ్ళతో అన్నది అల.

“అనంతా, ఓ మాట నిజం చెప్పవే.. అతనంటే నీకు ఇష్టమా?” సూటిగా అడిగాను. “నిజం చెబితే ఇష్టమే. ఎందుకో ఎప్పుడూ అతన్ని చూడాలని వుంటుంది. అతను మాట్లాడుతుంటే వినాలని వుంటుంది!” కళ్ళు దించుకుని కొంచెం సిగ్గుపడుతూ అన్నది.

బాగా రిజర్వ్‌డ్‍గా వుండే ‘అల’ యీ మాత్రం బైటపడటానికి కారణం యీ రెండేళ్ళుగా మా మధ్య వున్న స్నేహమే. నేను అల భుజం మీద తట్టాను. అంతే. చెప్పటానికి ఏముందీ.

యవ్వన ప్రారంభంలో వెచ్చని వూహలు వుంటాయి. అఖిల కాస్త మెత్తబడింది. ఓ రోజున గుసగుసగా చెప్పింది, “నువ్వు చెప్పినట్లుగానే చంకల్లో కాస్త యుడికొలోన్ రాసి నైసిల్ పౌడర్ లైట్‍గా వేస్తున్నాను మహీ! అలాగే వెల్లుల్లి వాడకం తగ్గించేశా.. లవంగం వేసుకుంటున్నా.. నాలోని పెద్ద డిఫెక్టులని స్మూత్‍గా చెప్పినందుకు థాంక్స్!” అని.

రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. ఏదో కావాలనే వూహలు ఎన్నో వున్నాయి గానీ, మనసులో ఖచ్చితంగా ‘ఇదే కావాలి’ అనే స్పష్టత మాత్రం మాలో చాలామందికి లేదనే చెప్పాలి. ‘తిమ్మూ’కి మాత్రం వుంది. చాలా కవితలూ, పాటలూ రాస్తున్నడని హగ్గీ చెప్పాడు. అంతేగాదు, పత్రికలకి మా వూళ్ళో జరిగే విశేషాల్ని కూడా ‘న్యూస్’ అయిటమ్స్‍గా పంపుతున్నాడట. తిరుమలరావు పేరుతో గాక ‘టెమూజిన్’ అనే కలం పేరుతో.

ఆ పేరు వినగానే ‘చంఘిజ్ ఖాన్’ నవల గుర్తొచ్చింది. ‘సూటూ బోడ్కా బట్ టెంగ్రూ టెమూజిన్ ఖాఖాన్’ అనేది చంఘిజ్ ఖాన్ అసలు పేరు. అనేది చంఘిజ్ ఖాన్ అనేది బిరుదు. ఒమర్ షెరీఫ్ యాక్ట్ చేసిన సినిమా కూడా చూశాను. అంటే, మా నాన్నగారు తీసికెళ్ళారు. సినిమా గురించీ నవలల గురించీ మా నాన్న చక్కగా వివరించడమే కాక ఊళ్ళో మంచి సినిమాలు వస్తే, దగ్గరుండి మరీ తీసికెళ్ళేవారు. సినిమా చూసిన మరుసటి రోజున దాన్ని గురించి చక్కగా చర్చించేవారు కూడా.

***

“ఈ సంవత్సరం ఫూర్తయ్యాకా మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు, ఎవరు ఎంచుకున్న కాలేజీకీ వాళ్ళు పోతారు. స్కూలుకీ, కాలేజీకి మధ్య వారధి లాంటిదీ ఇంటర్. దీన్ని చక్కగా ఉపయోగిస్తే లైఫ్ చాలా సజావుగా సాగుతుంది. ప్రతిరోజూ కాలేజ్ అయ్యాకా ఓ గంట సేపైనా దేన్నో ఓ సబ్జెక్టుని ఎంచుకుని డిస్కస్ చెయ్యండి. లేదా మీ టాలెంట్స్‌కి పదునుపెట్టుకోండి” అని ఓ చిన్నపాటి లెక్చరిచ్చారు శ్రీమన్నారాయణ గారు. ఆ సలహా మాకెంతో నచ్చింది. ప్రతి రోజూ కాకపోయినా వారానికి రెండు సార్లు మా కాలేజ్ ప్లే గ్రౌండ్‍లో ఉన్న బూరుగు చెట్టు క్రింద ఇంట్రెస్ట్ వున్న వారందరం సమావేశం కావాలని నిర్ణయించుకున్నాం. ప్రతి బుధవారం, శనివారం అన్న తిమ్మూ ప్రపోజల్‍ని అందరం అంగీకరించాం.

వందన మెల్లగా మాతో కలిసే ప్రయత్నం చేస్తోంది. పుల్ల విరుపు మాటలు చాలా తగ్గాయి కానీ, ఒక్కోసారి సడెన్‍గా రెచ్చిపోయి ఎదుటివాళ్ళని భీకరంగా హర్ట్ చేసేది. ఆ దెబ్బతో మళ్ళో జనాలు ఆమెను దూరం పెట్టేవాళ్ళు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని నేనెన్నిసార్లు ప్రయత్నించినా తను పొరబాటున కూడా ‘గుట్టు’ విప్పేది కాదు.

అఖిల మాత్రం చాలా మారింది.

“నేను ఇక చదవలేనే మహీ” బేలగా నాతో అన్నది అల.. ఓ రోజున.

“ఏమయిందీ?” అడిగాను. “ప్రతి క్షణం నా మనసులో తిమ్మూనే ఉంటున్నాడే. చదువు మీద అస్సలు ధ్యాస మళ్ళటంలా.. ఎప్పుడు అతని గురించిన వూహలే. అతను లేకుండా నేను బ్రతకలేనే!” కళ్ళ ల్లోంచి బొటబొటా నీళ్ళు కారుస్తూ అన్నది అల.

నాకు పిచ్చి కోపమూ, జాలీ కూడా ఒకేసారి పుట్టుకొచ్చాయి.

“అసలు మీ ఇద్దరికీ మధ్య మాటలే తక్కువ గదే. అయినా, చదువుకునే వయసులో యీ పిచ్చేంటే? పోనీ, చదువు మానేస్తే, తిమ్మూ నీ వాడవుతాడా? అతనికి తన జీవితం మీద స్పష్టమైన అవగాహన వుంది. అతని ఆశలూ, అతని ఆశయాలూ అతనికున్నాయి. నువ్వెళ్ళి ‘ఐ లవ్యూ తిమ్మీ, నువ్వు లెకుండా నేను బ్రతకలేను’ అంటావనుకో. ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడనుకుంటున్నావా? పోనీ ఒప్పుకున్నా ఇద్దరి చదువులూ పూర్తి కాలేదుగా, ఏం చేస్తారూ? పోనీ మీ వాళ్ళు మీకిప్పుడు అర్జెంటుగా పెళ్ళి చేస్తారనుకుంటున్నావా?” కోపంగానే అన్నాను.

“ఛస్తే చెయ్యరు. తిమ్మూ కులం వేరు. మా వాళ్ళు కులం అంటే ప్రాణం పెడతారు. నా పెళ్ళి ఛస్తే వేరే కులం వాళ్ళతో చెయ్యరు” కిందకి చూస్తూ అన్నది అనంతలక్ష్మి.

“మరి తెలిసి కూడా యీ పిచ్చేమిటీ?” చికాగ్గా అన్నాను.

“నువ్వేమన్నా అనుకో.. తిమ్మూని నేను క్షణమైనా మరువలేనే” గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అల. నేను అవాక్కై అక్కడే నిలబడ్డాను. ఇన్నాళ్ళ పరిచయంలో నేను చూసిందాన్ని బట్టి అల సౌమ్యురాలే గాదు.. పట్టుపడితే మహా మొండిది. దీని పిచ్చి ఎలాగూ వదిలించడం?

రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. మా అమ్మ దగ్గర నాకు చనువు ఎక్కువే. అనంతలక్ష్మి విషయం అమ్మకి చెప్పి సలహా తీసుకుందామనుకున్నాను గాని మళ్ళీ ఆగిపోయాను. ఒక్కసారి మా వాళ్ళ సంగతి ఆలోచిస్తే వాళ్ళు తీసుకునే, తీసుకుంటున్న జాగ్రత్తలు గుర్తొచ్చాయి. ఆ జాగ్రత్తలన్నీ నాకు చెప్పేవే. ఎంత విజ్ఞులైనా, ఎంత చదువుకున్నవారైనా, ఏమీ చదువుకోకపోయినా తల్లిదండ్రులు పిల్లల విషయంలో ‘అతి’ జాగ్రత్తలు తీసుకోవడం నాకు తెలుసు. సమస్య నా స్నేహితురాలిదని చెప్పినా, ఆ సమస్య నాదేననీ, కేవలం స్నేహితురాలి పేరు మీద సలహా అడిగాననీ కూడా మా అమ్మ అనుకునే ఛాన్సు 90% ఉంది. ఆ జనరేషన్ ఆలోచనలు అలాగే వుంటాయి. ఇతర్ల పిల్లల విషయంలో చాలా విశాల దృక్పథంతో వుండేవారు కూడా, కన్న బిడ్డల విషయంలో వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. రాత్రి గడుస్తూనే వుంది గానీ నిద్ర రాలేదు. ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్రపట్టింది.

***

“అనంతలక్ష్మీ, నువ్వు ప్రేమించడం తప్పని నేననను. కానీ ఎలా బతుకుతారు? కనీసం డిగ్రీ అయ్యేవరకైనా ఆగలేవా? కనీసం అతనైనా పూర్తి చెయ్యాలిగా?” అసహనంగా అన్నాను.

“ప్రేమంటే ఏమిటో ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది” గంభీరంగా అన్నది అల.

చాచి దవడ పగలగొడదామనిపించింది. గంటన్నర నించీ డిస్కషను. బోలెడు సినిమా ప్రేమల్ని కూడా ఉదహరించింది. అతను ఒప్పుకోకపోతే ఆత్మహత్యే శరణ్యంట.

నాకొచ్చిన కోపానికి అంతు లేదు. మొదట్లో ఎంతో మంచిగా, సెన్సిబుల్‍గా వుండే యీ పిల్ల అసలెందుకింత మూర్ఖంగా తయారైంది? ఇందుకేనా లవ్ యీజ్ బ్లైండ్, లవ్వీజ్ మేడ్ అనేదీ? చాలా ప్రయత్నంతో గానీ కోపాన్ని అణచుకోలేకపోయాను.

“మనిషిని ఇంత మూర్ఖంగా తయారు చేసే ప్రేమ నాకెప్పుడూ వద్దు. ప్రేమంటే పిచ్చి వూహలూ, పిచ్చి కలలూ కాదు. మనిషిని హత్యకో, ఆత్మహత్యకో ప్రేరేపించేది ప్రేమ ఎలా అవుతుందీ? అలా, నిజంగా చెబుతున్నా, ఇంకా నీ పిచ్చి ముదరక ముందే కళ్ళు తెరుచుకో. ఒకవేళ నిజంగా అత్మహత్య చేసుకోవాలనుకుంటే నీ ఖర్మ. లోకం ఎవరి కోసం ఆగదు” సీరియస్‍గా అని క్లాస్ రూమ్‍ లోకి నడిచాను. నాకు తెలుసు నా హెచ్చరికలూ, నా కోపాలూ యీ సమస్యకి పరిష్కారం కావని. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలీ?

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here