కల్పిత బేతాళ కథ-20 గురువు గారి దూరదృష్టి

1
3

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా బయలు దేరాడు.

విక్రమార్కుని భుజాన ఉన్న బేతాళుడు “మహీపాలా, నీ పట్టుదల చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. నీ గురించి ఇంద్రుని నగరంలోని ‘శితాత శిఖరం’-విధ్యాధరుల రాజ్యంలోని ‘మహానీల శిఖరం’-కిన్నెరుల నగరం లోని ‘వేణుమానవ శిఖరం’-గరుడ పక్షుల నివాసమైన ‘కరంజ శిఖరం’- ‘వసువులు నివసించే’ వసుధారా శిఖరం’- ‘సప్తరుషుల నివాస మైన’ రత్నథాతు శిఖరం’- బ్రహ్మ లోకం లోని ‘సుమేర, హేమశృంగ శిఖరం’-రుద్రుల నివాసమైన ‘గజశైలశిఖరం’- ఆదిత్యులు, అశ్వని దేవతల నగరం లోని ‘సుమేఘ శిఖరం’ – గంధర్వుల నగరంలోని ‘హేమకక్ష’- యక్షుల నగరం లోని ‘శతశృంగ’-నాగలోకం లోని ‘తామ్రభ శిఖరం’ వంటి మహాన్నత శిఖర నివాసులైన ప్రజలందరూ నీ గుణ గణాలను, కీర్తి ప్రతిష్ఠల గురించి చెప్పుకోవడం నాకు తెలుసు. సర్వగుణ సంపన్నుడవు అయిన నీవే నాకు ఉన్న సందేహాన్ని తీర్చాలి. మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా కథా రూపంలో తెలియజేస్తాను.. విను” అంటూ చెప్పసాగాడు.

***

అమరావతి నగర పొలిమేరలలో సదానందుడు రాజు గారి సహాయంతో ఆశ్రమం నడుపుతున్నాడు.

ఆ ఆశ్రమంలో ఎందరో వేద విద్యతో పాటు, పలురకాల విద్యలు నేర్చుకుంటున్నారు.

ఒకరోజు రాజభటుడు సదానందుని దర్శించి “గురుదేవా, రాజు గారి ఇంట పూజా కార్యక్రమం ఉంది, దాన్ని నిర్వహించడానికి ఒకరిని పంపమన్నారు, ఇది రాజు గారి ఆజ్ఞ” అన్నాడు రాజభటుడు.

వేద విద్య పూర్తి చేసిన ముగ్గురు పండితులను చేరపిలిచి “నాయనలారా రాజు గారి ఇంట పూజా కార్యక్రమం ఉందట. ఒకరిని పంపమన్నారు, మీరు ముగ్గురూ వెళ్లి రండి” అన్నాడు సదానందుడు.

“గురుదేవా రాజుగారు ఒక్కరినే తీసుకు రమ్మన్నారు” అన్నాడు రాజభటుడు.

“భయపడక ఈ ముగ్గురుని నీ వెంట తీసుకు వెళ్లు” అన్నాడు సదానందుడు.

రాజభటుని వెంట ముగ్గురు పండితులు బయలు దేరారు.

కొంతదూరం ప్రయాణంచేసాక ఒక వర్తకుడు వారికి ఎదురై “అయ్యా, మా ఇంట పూజా కార్యక్రమం ఉంది, మీలో ఒకరు ఆ కార్యక్రమం నిర్వహిస్తే కోరినంత ధనం ఇస్తాను” అన్నాడు.

మూడవ పండితుడు ఆ వర్తకుని వెంట వెళ్లిపోయాడు.

రాజభటుడు ఇద్దరు పండితులతో నడవసాగాడు.

అలా కొంతదూరం ప్రయాణం చేసిన తరువాత ఒక వ్యక్తి వీరికి ఎదురువచ్చి “అయ్యా మా ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి. నిర్వహించిన వారికి కోరినంత ధనం ఇస్తాను. మీ ఇరువురిలో ఎవరైనా ఒకరు రాగలరా?” అన్నాడు.

రాజభటుని వెంట ఉన్న పండితులలో ఒకరు ఆ వ్యక్తితో వెళ్లిపోయాడు.

మిగిలిన ఒక పండితునితో బయలుదేరిన రాజభటుడు రాజధాని చేరాడు.

***

కథ చెప్పడం పూర్తి చేసిన బేతాళుడు “విక్రమార్క మహీపాలా, సదానందుడు ముగ్గురు పండిత శిష్యులను రాచకార్యానికి పంపినా చివరకు ఒక్కడే వెళ్ళి రాచకార్యం పూర్తి చేసాడు. మరి సదానందుడు ముగ్గురు శిష్యులను పంపడంలో ఆంతర్యం ఏమిటి? జవాబు తెలిసి చెప్పక పోయావో మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా ఎన్ని విద్యలు నేర్చినా ధనం సంపాదించడమే ధ్యేయంగా మనిషి జీవిస్తాడు. ముందు వెళ్ళిన ఇద్దరు పండితులు దైవకార్యాన్ని తిరస్కరించలేక వారితో వెళ్ళి అక్కడ సంపాదించిన ధనం ఆశ్రమ నిర్వాహణకు వినియోగించాలని ఆలోచనతో వెళ్ళారు. మొదట వెళ్ళిన మూడవ పండితుడు తాను లేకున్న, మిగిలిన ఇద్దరూ రాచకార్యం నిర్వహించగలరని నమ్మకంతో వెళ్ళాడు. అదే నమ్మకంతో రెండో పండితుడు కూడా వెళ్ళాడు. చివరిగా మిగిలిన మూడవ పండితుడు రాజు గారి శుభకార్యం నెరవేర్చాడు. ముందు జాగ్రత్తతోనే సదానందుడు ముగ్గురు పండితులను భటుని వెంట పంపించాడు” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here