సామెత కథల ఆమెత-28

0
3

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

పానకంలో పుడక

[dropcap]భ[/dropcap]గవంతుడి పూజకి పెట్టే ప్రసాదాల్లో తప్పని సరిగా సమర్పించే ద్రవపదార్ధం ‘పానకం’. నీటిలో బెల్లం, మిరియాల పొడి, యాలకు పొడి వేసి పానకం తయారు చేస్తారు.

అలా తయారు చేసే పానకాన్ని భక్తులు పవిత్ర తీర్థం లాగా భక్తితో పుచ్చుకుంటారు. అలాంటి పవిత్రంగా పుచ్చుకునే తీర్థం మధ్యలో పుడక వస్తే కొంత అసౌకర్యం కలుగుతుంది.

మన తెలుగు సాహిత్యంలో ‘అవధానం’ చాలా ముఖ్యమైన ప్రక్రియ. అందులో ఇతర పృచ్ఛకులతో పాటు అప్రస్తుత ప్రసంగం చేసే వారు కూడా తప్పని సరిగా ఉంటారు. అవధానం నిర్వహించేవారు పృచ్చకులు అడిగిన నిబంధనల పరిమితులతో పద్య పాదం గురించి ఏకాగ్రతతో ఆలోచిస్తున్న సమయంలో అవధాని గారి ఏకాగ్రత భంగం చేస్తూ ఈ అప్రస్తుత ప్రసంగీకులు అసందర్భమైన ప్రశ్నలు వేస్తూ వారిని దారి మళ్ళిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అవధాని గారు ఏ మాత్రం తొట్రుపడకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు.

అలాంటి పానకంలో పుడక లాంటి సామెత మీద ఒక కథ చెప్పుకుందాం.

***

అరుణ, స్వర్ణ, మాధవి చిన్ననాటి స్నేహితులు.

ఇప్పుడు మాధవి.. వాళ్ళ ఆయన ఉద్యోగ రీత్యా అస్సాంలో ఉంటున్నది. తరచు రావటానికి కుదరదు.

చిన్నప్పుడు.. రాత్రి పడుకునే సమయం తప్ప ఎప్పుడూ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో కాలక్షేపం చేసేవారు. పెళ్ళిళ్ళయ్యాక కూడా మూడు.. నాలుగు నెలలకి ఒకసారి ఎవరో ఒకరి ఇంట్లో కలిసి తమ బాల్య స్మృతులని కలబోసుకుంటూ ఉండేవారు.

అలాంటిది మాధవి కారణంగా నాలుగేళ్ళ నించి కలవటం కుదరక గిలగిల్లాడుతున్నారు. ఆ స్నేహితులకి ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది.

మాధవి మరిది కూతురు పెళ్ళికి హైదరాబాద్ వస్తున్నదని తెలిసి మిత్రులంతా తమ కలయిక గురించి కలలు కనేస్తూ రోజొక యుగంలా గడుపుతున్నారు.

***

ఎక్కడ కలవాలో కాసేపు తర్జన భర్జనలయ్యాక.. అందరు అరుణ ఇంట్లో భేటీ అవ్వాలని నిర్ణయమయింది.

అరుణ అత్తగారు వృద్ధాప్యం వల్ల మంచానికి పరిమితమవటం వల్ల, సహాయకురాలు ఉన్నప్పటికీ.. అరుణ ఆమెని వదిలి ఎక్కువ సేపు బయటికి వెళ్ళదు.

వచ్చిన మిత్రుల కోసం మసాలా వడ, మైసూరు పాక్ రెడీ చేసింది అరుణ.

కాఫీ టిఫిన్లయ్యాక కబుర్లల్లో పడ్డారు.

“ఆఁ ఇప్పుడు చెప్పు.. మీ మరిది కాబోయే అల్లుడు ఏం చేస్తున్నాడు. పెళ్ళి కూతురు ఉద్యోగం చేస్తున్నదా” అని స్వర్ణ, అరుణ ఒకే సారి అడిగారు.

“అతనికి రెస్టారెంట్ ఉన్నది” అన్నది.

“అదేంటి.. మీ మరిది కూతురు చదువులో బాగా మెరిటోరియస్ అన్నావ్.. ఇలా హోటల్ నడుపుకునే వాడికిచ్చి చేస్తున్నారా” అన్నారు ముక్త కంఠంతో!

“అతను కూడా గోల్డ్ మెడలిస్టే. కానీ ఎందుకో తనకి బిజినెస్ ఇంటరెస్ట్ అని ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్ ప్రారంభించాడు. అతని కుటుంబ నేపథ్యం మంచిది, బాగా చదువుకున్నాడు.. అమ్మాయి కూడా ఓకే చెప్పింది. ఈ కాలపు పిల్లల లాగా కూతురు అల్లుడు విదేశాలు పారిపోకుండా ఇక్కడే ఉంటారు అని మా మరిది వాళ్ళు ముందుకెళుతున్నారు” అంది మాధవి.

“అరుణా.. మొన్న కాకరకాయ కూర ఎలా చేశావ్” అంటూ కరుణాకర్ వాళ్ళ సంభాషణ మధ్యలో హఠాత్తుగా దూరాడు.

“మొన్నటి కూర సంగతి అడగటానికి మీకు ఇప్పుడే టైం దొరికిందా” అని చిరాకు పడింది భర్త మీద అరుణ.

మిత్రులు ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయి అరుణ వంక..ఆమె భర్త వంక వింతగా చూశారు.

“సరే ఇంతకీ ఎలా చేశావో చెప్పు.. మా గీత అడుగుతోంది” అన్నాడు పట్టు వదలని విక్రమార్కుడి లాగా!

“పానకంలో పుడక లాగా.. ఈయన ఇంతే! సమయం సందర్భం చూసుకోకుండా ఇలాగే తల దూర్చి అక్కరలేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు” అన్నది మిత్రులతో అరుణ సంజాయిషీగా.. భర్త ధోరణికి చిన్నబుచ్చుకుంటూ!

“మాధవీ.. మీకు అక్కడ తెలుగు సినిమాలు తెప్పిస్తారా? మొహం వాచి ఉంటావ్.. రాత్రికి సినిమాకి వెళదామా” అన్నది స్వర్ణ ఉత్సాహంగా.

“పెళ్ళి ఇంట్లో నాతో ఏమయినా పని ఉందేమో ఒక్కసారి మా ఆయనకి ఫోన్ చేసి అడిగి.. ఫరవాలేదంటే వెళదాం” అన్నది మాధవి.

సినిమా ప్రోగ్రాం తేల్చుకున్నాక.. రాత్రికి వంట చేసే హడావుడిలో పడింది అరుణ. కూరలు తరిగిచ్చే పనితో కబుర్లల్లో పడ్డారు ఇతర మిత్రులు.

“అరుణా.. మధ్యాహ్నం మా ఆఫీసులో ఏమయిందో తెలుసా.. ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించలేదు. దానికోసం అందరం కంగారుగా వెతుకుతుంటే టేబుల్ మీద ఉన్న ఫోన్ కింద పడిపోయింది. అది పక్కనున్న చెత్త బుట్టలో పడింది. ఇంతలో హెడ్డాఫీసు నించి ఫోన్ వచ్చింది. రింగ్ వినిపిస్తోంది కానీ ఎక్కడో తెలుసుకోవటానికి టైం పట్టింది” అన్నాడు కరుణాకర్ మళ్ళీ మిత్రుల మాటల మధ్యలో అసందర్భంగా తల దూర్చి. అది చాలా ముఖ్యమైన విషయమన్నట్టుగా.. భార్యకి అప్పుడే చెప్పెయ్యాలన్నట్టుగా ఉన్న అతని ముఖంలో సీరియస్‌నెస్ చూసి.. మిత్రులు ఒకరి ముఖాలు ఒకరు వింతగా చూసుకున్నారు.

“మీరు అలా బజార్ దాకా వెళ్ళి ఒక డజను యాపిల్స్ తెండి. సినిమాకి వెళ్ళే ముందు అందరం తలా ఒక ముక్క తిని వెళతాం” అని భర్త తమని డిస్టర్బ్ చెయ్యకుండా ఉండటానికి బయటికి పంపించే ఉపాయం ఆలోచించింది.

“అలాగే ఇప్పుడే వెళతాను. అన్నట్టు నీకు చెప్పటం మర్చిపోయాను.. మొన్న మా కిట్టు గాడు.. నీకు తెలుసు కదా కృష్ణ.. వస్తుంటే రోడ్డు మీద ఎవరో అతను నడుస్తూ కాలు మెలిక తిరిగి కింద పడ్డాడుట. అతన్ని వీడే లేపి పక్కనున్న హాస్పిటల్లో దింపి వచ్చాడుట” అన్నాడు.

“బాబోయ్ ఏమిటే మీ ఆయన ధోరణి వింతగా ఉంది. ఎప్పుడూ ఇంతేనా? అసలు ఆయన ఆరోగ్యం బాగానే ఉందా? ఎప్పుడూ ఇలా అన్నిట్లో తలదూరుస్తుంటారా? లేక మనమేం మాట్లాడుకుంటున్నామో అని నిఘానా? ఎలా భరిస్తున్నావ్” అని అందరూ ఒకేసారి అడిగేసరికి అరుణకి తలకొట్టేసినట్టయింది.

“ఏం చెప్పమంటారే! మనమేం మాట్లాడుకుంటున్నాం అని అనుమానం కాదు. తనకి ఎప్పుడూ అటెన్షన్ కావాలి. నేను ఖాళీగా ఉంటే ఒక్క మాట మాట్లాడరు. కనీసం అన్నం కూడా కలిసి తినం. ఎక్కడో కూర్చుని సెల్ ఫోన్లోనో, ఐ పాడ్ లోనో తల దూర్చి ఏవో ఒకటి చూస్తూ ఉంటారు.”

“ఇంటికెవరయినా వచ్చి వాళ్ళతో నేను సరదాగా మాట్లాడుతుంటే.. ఎక్కడ తనని పట్టించుకోనో అని ఇలా మాటల మధ్యలో తలదూర్చి అక్కరలేని విషయాలు.. అసందర్భంగా చెబుతూ ఉంటారు. ‘పానకంలో పుడకయితే’ తీసి పక్కన పడేసి తాగేస్తాం. ఇది మనుషులతో వ్యవహారం.. అందులోను ముఖ్యమైన వాళ్ళు. పుడకలాగా తీసి పడెయ్యలేం కదా!”

“మనిషి మంచి వాళ్ళే. కొంచెం అటెన్షన్ సీకింగ్! విసుక్కుంటే రెచ్చి పోతారు. చిన్న పిల్లల లాగా.. తెలివిగా డైవర్ట్ చేసి పని ఒప్పచెప్పి బయటికి పంపించాలి అంతే” అన్నది అరుణ నిట్టూరుస్తూ!

మనుషుల్లో ఉండే రక రకాల వ్యక్తిత్వ సమస్యల్లో ఇది ఒక రకం అనుకోవటం తప్ప చేసేది ఏముంది? ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here