పాలమూరు వలసల జిల్లా కాదు కవుల జిల్లా – మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
[dropcap]పా[/dropcap]లమూరు వలసల జిల్లా కాదు కవుల జిల్లా అని, ఇక్కడ వెలిసిన కవులు, రచయితలు ఎక్కడా లేరని రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు, యువజన సర్వీసులు, క్రీడా, సాంస్కృతిక శాఖామంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 4 జూన్ 2023న మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రముఖ కవి కె. లక్ష్మణ్ గౌడ్ రచించిన ‘వేగుచుక్క’ కవితాసంపుటి ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా అని పేరుండేదని, ఇప్పుడు ఆ వలసలన్ని మాయమైపోయి వలసల జిల్లాకే వలసలు మొదలయ్యాయన్నారు. ఆనాడే సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోల్కొండ సంచికను తీసుకొచ్చాడన్నారు. తొలి రామాయణం ఇక్కడే పుట్టిందన్నారు. సాహిత్యానికి నిలయం పాలమూరు జిల్లా అని, జిల్లా చరిత్రను తెలిపేలా కవిత్వం రాయాలని కవులను కోరారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ కవిత్వంలో విభిన్న వస్తువులు కన్పిస్తాయన్నారు. తనదైన శైలిలో కవిత్వం రాయడం లక్ష్మణ్ గౌడ్ ప్రత్యేకతన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహిత్యవేత్త, దూరదర్శన్ మాజీ సంచాలకులు డాక్టర్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ సమాజంలో మార్పును తీసుకురావడంలో కవిత్వం దోహదం చేస్తుందన్నారు. మంచి సమాజ నిర్మాణమే కవి లక్ష్యమన్నారు. ఆ దిశలో లక్ష్మణ్ గౌడ్ కవిత్వం నిలుస్తుందన్నారు.
ప్రముఖ న్యాయవాది వి. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ ఒక పక్క పాఠశాలను నడుపుతూనే మరో పక్క కవిత్వం రాయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కాళోజి అవార్డు గ్రహీత కోట్ల వేంకటేశ్వర రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. పుస్తకాన్ని ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ సమీక్ష చేసారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ సంయోజకులు, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, జగపతిరావు, డాక్టర్ ఎస్.విజయకుమార్, బాదేపల్లి వెంకటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కవులు, రచయితలు హాజరయ్యారు.