[కృత్రిమ మేధ గురించి, చాట్ జిపిటి గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి.]
[dropcap]2[/dropcap]014 నాటికే ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కృత్రిమ మేధతో లెక్కలేనన్ని ప్రయోజనాలతో పాటుగా అజాగ్రత్తగా ఉంటే మానవజాతినే తుడిచిపెట్టేయగల ప్రమాదమూ ఉందన్న అభిప్రాయానికి వచ్చారు.
‘ఫ్యూచర్ ఆఫ్ లైఫ్’ ఇన్‌స్టిట్యూట్ మానవాళి ఎదుర్కుంటున్న ముప్పుకు సంబంధించిన అంశాలను పరిమితం చేయగల లేదా ఉపశమింప చేయగల దిశగా కృషి చేస్తోంది.
2014లో ‘కృత్రిమ మేధ – భవిష్యత్తు’కు సంబంధించిన అంశాలకు సంబంధించి సలహాలను అందించే శాస్త్రజ్ఞుల బృందం ‘ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ ఎ.ఐ.’ బోర్డు రూములో కూర్చుని ఉంది. వారిలో స్టీఫెన్ హాకింగ్, ఎలాన్ మస్క్ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. ఆ సదస్సులో స్టీఫెన్ హాకింగ్ తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ సదస్సులో ఒక లేఖను వెలువరించారు. చాలామంది నిపుణులు ఆయన ఆందోళన, అభిప్రాయలతో ఏకీభవించారు.
2015లో ‘ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ ఎ.ఐ.’ మొదటి కాన్ఫరెన్స్ ప్యూర్టోరికోలో జరిగింది. ఆ సదస్సులో హాకింగ్, మస్క్, ఇంకా చాలామంది ప్రముఖులు స్టీఫెన్ హాకింగ్ ప్రస్తావించిన అంశాలతో కూడిన లేఖను ఆ సంస్థ నుండి బహిరంగంగా వెలువరించారు.
ఎలాన్ మస్క్, గూగుల్ రీసెర్చ్ డైరక్టర్ పీటర్ నార్వింగ్ వంటి ప్రముఖులతో బాటుగా కృత్రిమ మేధ నిపుణులు, రోబోల తయారీదారులు, సామాజిక శాస్త్రవేత్తలు, కేంబ్రిడ్జ్, హార్వార్డ్, ఆక్స్‌ఫర్డ్, ఎమ్.ఐ.టి., స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలకు చెందిన అకడమీషియన్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన 150 మంది ప్రముఖుల సంతకాలతో ఆ బహిరంగ లేఖ వెలువరించబడింది.
లేఖ సారాంశం:
ప్రయోజనకరమైన, పటిష్టమైన కృత్రిమ మేధకు సంబంధించిన ఆవిష్కారాల దిశగా జరుగుతున్న కృషిలో ‘పరిశోధనా ప్రాధాన్యతలు’ అన్న శీర్షికతో వెలువడిన ఆ లేఖ 4 పేజీల నిడివితో ఉంది. 4 పేజీల ఆ లేఖతో పాటుగా మార్గదర్శకాలతో కూడిన 12 పేజీల ముసాయిదా కూడా జతపరచబడింది.
కంప్యూటర్ సైన్సెస్‍కు సంబంధించిన వివిధ శాఖలు – సెక్యూరిటీ, విశ్లేషణ, పరిశీలన, సవాళ్ళు వంటి అంశాలన్నీ పరిగణలోనికి తీసుకోబడ్డాయి. ఏదైనా కృత్రిమ మేధ వ్యవస్థ రూపొందించగలిగినప్పుడు దానికి సంబంధించి పునః పరిశీలన, నాణ్యత, భద్రతకు సంబంధించిన అంశాలు, చివరగా నియంత్రణ వ్యవస్థ అన్నీ సజావుగా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ తరువాతనే వ్యవస్థ వినియోగంలోనికి రావాలి.
మన కృత్రిమ మేధో వ్యవస్థలు మనకు కావలసినట్లుగా పని చేయాలి. భవిష్యత్తులో ‘సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు’ రూపొందినట్లయితే మనం మన ఎ.ఐ. వ్యవస్థలపై పట్టును కోల్పోగల ప్రమాదం ఉంది. శక్తివంతమైన సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మనిషిని నిర్దేశాలకు అనుగుణంగా పనిచేయవు. ఆ వ్యవస్థలు అద్భుతమైనవే అయినప్పటికీ తమ అపారమైన శక్తి సామర్థ్యాలు, ఏ నియంత్రణా లేని స్వయంచాలితశక్తి కారణంగా మానవాళికి ముప్పు కాగల ప్రమాదం ఉంది. అత్యంత సునిశితమైన కృత్రిమ మేధ మేధోవిస్ఫోటనాలకు దారి తీయకుండా జాగ్రత్త వహించడానికి ప్రస్తుతం ఉన్న ఎ.ఐ. అభివృద్ధి, వినియోగం విధానాలు సరిపోవు.
కృత్రిమ మేధకు సంబంధించిన పరిశోధన ప్రయోగశాలలన్నీ క్రొత్త వ్యవస్థల రూపకల్పన, ఆవిష్కరణల దిశగా దూసుకుపోతున్నాయి. ఈ పరుగు పందెంలో – సాంకేతికతల నుండి సంబంధించగల విపరిణామాలకు సంబంధించిన రక్షణ ప్రాధాన్యతలను ఏమారుస్తున్నాయి.
“కృత్రిమ మేధ దుర్వినియోగం కాగల అవకాశాలను కాదనలేం. అదే జరిగితే దైనందిన జీవితాలు ప్రమాదభరితం కాగలవు. అది వాస్తవం.” అని మానవాళి మనుగడకు ముప్పు తేగల అంశాలకు సంబంధించి విస్తృత అధ్యాయనాలను చేపట్టిన ‘కేంబ్రిడ్డ్’ యూనివర్శిటీకి చెందిన డా. సేన్ అభిప్రాయపడ్డారు.
మనం వ్యతిరేకించవలసింది చక్కని మేధో వ్యవస్థలని కాదని, ప్రమాదకరమైన కృత్రిమ మేధను మాత్రమేనని ‘యూనివర్శిటీ ఆఫ్ సౌత్ వేల్స్’కు చెందిన ప్రొఫెసర్ టోబీ వాల్ష్ అంటున్నారు.
కృత్రిమ మేధ వ్యతిరేక ఫలాలను నిరోధిస్తూ, సానుకూల ప్రయోజనాలను స్వాగతించాలన్నది ‘ఇన్‍ఫర్మేషన్ సొసైటీ – జర్మనీ’కి చెందిన హేన్స్ స్క్వాడరర్ అభిప్రాయం.
‘ఓపెన్ ఎఐ’, ఛాట్ జిపిటి లలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు చాలానే ఉన్నాయి. ఆ సంస్థకు చెందిన నిపుణుడు ఎరిక్ హార్విజ్ “కృత్రిమ మేధ పరిశోధనలను నిలిపివేయడం గురించి కాకుండా ఆ దిశగా పెట్టుబడులను పెంచి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసుకుని తదనుగుణంగా దిశా నిర్దేశం, క్రమబద్ధీకరణ వంటి చర్యలతో సాంకేతికతను ముందుకు తీసుకువెళ్లాలి. సాంకేతికతలకు సంబంధించిన ప్రయోగాల నిలుపుదల తాత్కాలికంగా నైనా సరే, సబబైనది కాదు” అని నిష్కర్షగా ప్రకటించారు.
కృత్రిమ మేధ ఆల్గారిథమ్స్ 30-50 సంవత్సరాలలో తమను సృష్టించినవాళ్ళను మించిపోతాయన్న అంచనా ఉండేదని, కానీ ప్రస్తుత వాతావరణం చూస్తుంటే 5-20 సంవత్సరాల కంటే పట్టదనిపిస్తోందని ప్రముఖ ఎ.ఐ. శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ ఆందోళన వెలిబుచ్చారు. ‘PALM’ అన్నింటి కంటే పెద్ద ప్రోగ్రామ్. అంత సంక్లిష్టమైనదీ మానవ మస్తిష్కం ముందు తీసికట్టే. అటువంటిది తాను, తన సహ శాస్త్రజ్ఞులు ఊహించిన దానికంటే వేగంగా ఎ.ఐ. దూసుకుపోతోందనీ దానిని మనిషి అదుపులో పెట్టగల స్థాయికి మాత్రమే పరిమితం చేయడం తక్షణావసరం అనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఛాట్ జిపిటి లో వినియోగించబడిన సాంకేతిక నమూనా PALM వంటిదే.
మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన జాఫ్రీ హింటన్ కంప్యూటర్ సైన్స్ లోనూ నిపుణుడు. గూగుల్‍తో ఆయనకు సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉంది. న్యూరల్ నెట్‍వర్క్ మీద విస్తృతంగా పరిశోధనలు చేసిన హింటన్ కంప్యూటర్స్‌కు నేర్చుకునే సామర్థ్యాన్ని చేకూర్చగల ఆల్గారిథమ్స్‌ను రూపొందించి, అభివృద్ధి చేశారు. కృత్రిమ నాడీ అనుసంధానాలు, అభ్యసన నైపుణ్యాలు వంటి మేధో వ్యవస్థల రూపకల్పన దిశగా ఆయన చేసిన పరిశోధనలు, కృషి కృత్రిమ మేధ రంగంలో వివిధ వ్యవస్థల రూపకల్పనకు, ఆవిష్కారాలకు విశేషంగా దోహదం చేశాయి. కంప్యూటర్ సైన్సెస్‍కు సంబంధించిన అత్యుత్తమ అవార్డు – నోబుల్ ప్రైజ్‍గా గౌరవించబడే ‘టర్నింగ్ అవార్డు’ ఆయనను 2018లో వరించింది. ఎ.ఐ.కి సంబంధించి తన ఆందోళనను నిష్కర్షగా వెల్లడించడం గురించి ఆయన గూగుల్‍కు రాజీనామా చేయడాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.
జాఫ్రీ హింటన్ రిజైన్ చేసిన సందర్భంగా ఆ కంపెనీకి చెందిన ఛీప్ సైంటిస్ట్ జెఫ్ డీన్ – హింటన్ దశాబ్దాల కృషి ఎ.ఐ.కి దారులు తెరిచిందనీ, ఆయన సేవలు వెలకట్టలేనివనీ ప్రస్తావిస్తూ కృత్రిమ మేధకు సంబంధించి – వినియోగం, ఆవిష్కారాలు వంటి అన్ని అంశాలలోనూ తాము బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంబిస్తామని భరోసా ఇచ్చారు.
ఛాట్ జిపిటి ని విడుదల చేసిన ‘ఓపెన్ ఎ.ఐ.’ స్టార్టప్ ఇటీవల GPT-4 పేరిట మరొక ఛాట్ బాట్‍ను మార్కెట్‍లోకి విడుదల చేసింది. అది జిపిటి కంటే మరిన్ని రెట్లు శక్తిమంతమైనది, ఆధునికమైనది. ఎన్నో రెట్లు సమర్థవంతంగా పని చేస్తోంది.
ఇదిలా ఉండగానే టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు సహపరిశోధకులు మెదడు పనితీరును విశ్లేషించగల కృత్రిమ పరిజ్ఞానాన్ని సృష్టించారు. మెదడులో ఏ పరికరాలనూ అమర్చకుండానే వెలుపలి నుండి M.R.I. స్కానింగ్ ద్వారా ఈ విశ్లేషణను వారు సాధించగలిగారు. ‘సెమాంటిక్ డీకోడర్’ మనిషి ఆలోచనలను, స్పందనలను సుమారు 80% ఖచ్చితత్వంతో అనువదించగలిగింది.
U.K.కి చెందిన ‘ఇంజనీర్డ్ ఆర్ట్స్’ మెస్మర్ టెక్నాలజీతో రూపొందించిన ‘అమెకా’ (Ameca) హార్డ్‌వేర్ మరొక చక్కని సాంకేతికత. ఇది క్లౌడ్ కనెక్టెడ్ టెక్నాలజీ.
ముమ్మూర్తులా మనిషి వలె అన్ని కండరాలను కదల్చగల ఈ హ్యుమనాయిడ్ రోబో భవిష్యత్తు తరాల అవసరాలకు దీటుగా నిలబడగల హ్యూమనాయిడ్ రోబోల తయారీకి చక్కని వేదిక కాగల టెక్నాలజీతో రూపొందించబడింది.
వివిధ దేశాలు – సన్నద్ధత దిశగా:
యూరోపియన్ యూనియన్‍లో ఇప్పటికే పలు డిజిటల్ చట్టాలున్నాయి. మరొక ప్రత్యేక చట్టాన్ని తీసికొని రావటానికై కసరత్తు జరుగుతోంది. కృత్రిమ మేధ నేపథ్యంలో చట్టం రూపకల్పన జరుగనున్నది.
అమెరికాలోనూ భద్రత, గోప్యత, సమాన హక్కులకు రక్షణ కల్పిస్తూ వాటికి భంగం కలగనీయని రీతిలో ‘ఎఐ బిల్ల్ ఆఫ్ రైట్స్’ వచ్చింది.
చైనాలో కృత్రిమ మేధకు సంబంధించిన సాంకేతికత, ఆవిష్కరణలకు సంబంధించిన మార్గదర్శకాలు, నియంత్రణా ఉన్నాయి. చైనా కంపెనీలు చాలా కాలం నుండి ఎ.ఐ. ఉద్యోగులను వాడుతున్నాయి. జిపిటి ఛాట్ బాట్‍ల కంటే చాలా ముందునుండి ఛాట్ బాట్స్ మనుషులతో మాట్లాడుతున్నాయి.
2017లోనే సింగపూర్, ఫిన్లాండ్, చైనా, ఎమిరేట్స్ వంటివి తమ విధానాలను రూపొందించుకున్నాయి. దాదాపు అన్ని దేశాలూ ఎ.ఐ. రంగంలో పరిశోధనలు, వినియోగం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నాయి. భారతదేశం విషయానికి వస్తే, ఎ.ఐ.లో పరిశోధనలను ముమ్మురం చేయడానికి రెండంచెల సమగ్ర ప్రణాళిక రచించబడింది. కృత్రిమ మేధను వినియోగిస్తునే గోప్యత, భద్రత, నీతి నియమాలకు లోబడి ఈ వినియోగం కొనసాగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎ.ఐ. రంగంలో 22,000 మంది మాత్రమే డాక్టరేట్స్ ఉండగా, సింహభాగం అమెరికా లోనే ఉంటున్నారు. ఆ కారణంగా స్వయం సమృద్ధి దిశగాను వివిధ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. తమ యూనివర్శిటీలలో ఎ.ఐ. మాస్టర్స్, పి.హెచ్.డి. డిగ్రీలనూ ప్రవేశపెడుతున్నాయి.
కృత్రిమ మేధ కారణంగా మానవాళి మనుగడ ప్రమాదంలో పడకుండా కాపాడగల, హాని చేయకుండా – ప్రపంచం మనుగడకు సంబంధించిన రీతులను అర్థం చేసుకొని కాపాడగల మరొక క్రొత్త కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థను రూపొందించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. దాని పేరు ‘ట్రూత్ జిపిట్’గా ఆయన ప్రకటించారు. ఈ ‘x’ కృత్రిమ మేధకు సంబంధించిన సరికొత్త కంపెనీని టెక్సాస్ లోని నెవడాలో ఏర్పాటు చేస్తున్నారు.
U.S. జాతీయ పరిశోధనా సంస్థ 140 మిలియన్ డాలర్ల కృత్రిమ మేధకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‍మెంట్‌పై ఖర్చు పెట్టనుంది. వ్యవసాయం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన రంగాలలో కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించిన పరిశోధనకు ఈ నిధిని వెచ్చిస్తారు.
Image Courtesy: Internet