ఋతువులు

0
4

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘ఋతువులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కౌ[/dropcap]సల్యకి అమ్మని చూస్తే బాధగా వుంది. నాన్న మరణం అమ్మని చాలా కుంగదీసింది. 30 సంవత్సరాల వాళ్ళ అన్యోన్య దాంపత్యం అందరికీ తెలుసు. నాన్న ఎడబాటు అమ్మకి యెంత లోటో కౌసల్యకి అర్థం అవుతోంది. తల్లిని తనతో తీసుకెళ్లడానికి నిశ్చయించుకుంది. తల్లి సీతమ్మ, ముందు ససేమిరా అంది. భర్త రాఘవరావు జ్ఞాపకాలతో ఆ ఇంట్లోనే ఉంటానని అంది.

కానీ కౌసల్యకి ఆమెని అలా వంటరిగా వదలి వెళ్లడం ఇష్టం లేదు. కౌసల్యకి అమ్మ అంటే చాలా ఇష్టం. తానుండేది హైదరాబాద్‌లో. తరచూ వచ్చి తల్లిని చూసుకోలేదు. భర్తతో కలిసి తల్లిని పదే పదే బతిమాలింది. అల్లుడు, కూతురు అంతగా చెపుతూంటే కాదని అనలేక పోయింది సీతమ్మ. రాఘవరావు, సీత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేసారు. పెద్దమ్మాయి అపర్ణ బొంబాయిలో ఉంటుంది. చిన్న అమ్మాయి కౌసల్య.

ఆ రోజు ప్రయాణం. అన్ని సామాన్లు సర్దేసుకున్నారు. నాన్న ఫొటోస్, నాన్నకు సంబంధించిన వస్తువులు ప్రత్యేకంగా ఒక పెట్టిలో పెడుతోంది కౌసల్య. అప్పుడు నాన్న డైరీ ఒకటి చూసింది. నాన్న జ్ఞాపకాలతో కళ్ళు వర్షించాయి. ఆ డైరీని అభిమానంగా నిమిరింది. యథాలాపంగా తిరగేసింది. ఒక పేజీలో నాన్న రాసిన పేరా కింద అమ్మ రాసిన వాక్యాలు కనపడ్డాయి. ‘నాన్న డైరీలో అమ్మ చేతి రాత ఎందుకు వుంది’ అనిపించింది. ఆసక్తిగా చదివింది.

రాఘవరావు ఇలా రాసేడు:

“సీతకి నేను అన్యాయం చేసెను. పెళ్లి అయ్యి, మెట్టినింట అడుగు పెట్టిన అమాయకురాలిని 6 నెలల పాటు మనిషిగా చూడలేదు. దూరం పెట్టి, చాలా వేదన కలిగించాను. ఎన్నో ఆశలతో, గుండె నిబ్బరంగా నా జీవితంలో అడుగు పెట్టిన ఆమెను నేను అలా బాధించకుండా ఉండాల్సింది. అప్పటి నా మానసిక స్థితికి, ఎప్పుడూ కోలుకోలేను అనిపించింది. అయినా, నన్ను క్షమించి నన్ను, సంసారాన్ని చక్కదిద్దుకున్న సీతకు నేను ఎప్పటికీ రుణపడి వుంటాను.”

భర్త ఆవేదన చల్లార్చడానికి అక్కడే ముగింపు వాక్యాలు రాయాలి అనుకుందేమో.., సీతమ్మ అక్కడే ఇలా రాసింది:

“నిరాశలో కూరుకు పోయినప్పుడు జీవితం మీద, మనుషుల మీద ఇష్టం ఉండదు. అది మీ తప్పు కాదు. మిమ్మల్ని కాపాడుకోవడానికే నాన్నని ఎదిరించి మీ దగ్గరికి పంపించింది అమ్మమ్మ. నూరేళ్ళ జీవితంలో 6 నెలలు ఒక లెక్క కాదు. ఎప్పుడు జీవితంలో ఆ ఆలోచన రానీయకండి. మీరు నాకు దేముడితో సమానం”

కౌసల్యకి ఏం అర్థం కాలేదు. చిన్నప్పటి నుండి అమ్మ, నాన్న ఒకే మాట మీద ఉండడం చూసింది. అమ్మంటే నాన్నకి చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. అమ్మతో సంప్రతించకుండా ఏ పనీ చేసేవారు కాదు. అమ్మమ్మ, తాతయ్య కూడా మొగుడిని కొంగుకి కట్టేసుకున్నావ్ అని సరదాగా అంటూ ఉండడం.. తానూ వింది.

అలాంటిది నాన్న ఇలా రాసేరేమిటి, అమ్మ అలా ముగింపు వాక్యాలు రాసిందేమిటి, తర్వాత ఏమైంది.. తెలుసుకోవాలని అనిపించింది ఆమెకి. ఆ డైరీ తీసి దాచింది.

అయితే అమ్మని ఈ సమయంలో అడిగి మళ్ళీ బాధ పెట్టదలుచుకోలేదు.

***

హైదరాబాద్ చేరి 4 నెలలు అయింది. మనసులో వేదన మరిపించేది కాలం ఒక్కటే. మనవలతో కాలక్షేపం చేస్తూ నెమ్మదిగా సీతమ్మ కాస్త తేరుకుంది.

ఆ రోజు కౌసల్య భర్త, పిల్లల్ని ఎగ్జిబిషన్‌కి తీసుకుని వెళ్ళేడు. ఇంట్లో తానూ, తల్లి మాత్రమే వున్నారు. అదే సరి అయిన సమయం అనిపించింది కౌసల్యకి. వచ్చి తల్లి దగ్గర కూర్చుంది. డైరీలో విషయం ప్రస్తావించింది. సీతమ్మ ముఖం గంభీరంగా మారిపోయింది.

సీతమ్మ చాలా గుట్టు మనిషి. పిల్లలతో అనవసర ప్రసంగాలు ఎప్పుడూ చేసేది కాదు. వాళ్ళ అవసరాలు తీర్చడం వరకే వాళ్లతో మాట్లాడేది. కుటుంబ విషయాలు తనూ, రాఘవరావు మాట్లాడుకునేవారు. ఇన్నాళ్లూ పిల్లలకి తెలియక్కర్లేదు అన్న విషయం ఇప్పుడు చెప్పక తప్పలేదు.

సీతమ్మ ఇలా చెప్పింది:

రాఘవరావు తన కాలేజీ రోజుల్లో తన క్లాసుమేట్ లీలని లవ్ చేసేడు. కానీ లీల వాళ్ళ ఇంట్లో వీళ్ళ లవ్‌ని ఒప్పుకోలేదు. పెద్దల్ని ఎదిరించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. లీల వాళ్ళ నాన్న చాలా అడ్డంకులు సృష్టించాడు. లీలని దూరంగా తీసుకు వెళ్లి పోయి పెళ్లి చేసేసేరు. విషయం తెల్సి రాఘవరావు చాలా కుంగిపోయాడు. బతుకు మీద ఆశ వదిలేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసేడు. సముద్రంలో దూకేసేడు. అదృష్టవశాత్తూ జాలర్లు అతన్ని రక్షించారు. ఆ సంఘటన రాఘవరావు కుటుంబాన్ని కుదిపేసింది. బతికినా, రాఘవరావు, మనుషుల్లోకి రాలేక పోయేడు, దిగులుగా తనలో తను మాట్లాడుకుంటూ వుండేవాడు..

రాఘవరావు అక్క, బావ విజయవాడలో వుంటారు. రాఘవరావు తల్లి సుగుణ, కొడుకు పరిస్థితికి తల్లడిల్లిపోయింది. కూతురు సత్యవతిని, మనవరాలు సీతని రాఘవరావుకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగింది. తమ్ముడి కోసం సత్యవతి వొప్పుకున్నా అల్లుడు రామం వప్పుకోలేదు. తన కూతురికి ఇంకా మంచి సంబంధం చేసుకుంటాను అంటాడు. పైగా ఎవర్నో ఇష్టపడి, దేవదాసులాగా మారిన బావమరిదికి ఇచ్చి తన కూతురి జీవితం అన్యాయం చేయలేను అన్నాడు. సుగుణ యెంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. సత్యవతి ఎటూ చెప్పలేక నలిగిపోయింది.

అప్పుడు సుగుణ మనవరాలు సీతకు నచ్చ చెప్పింది. అమ్మమ్మ అంటే వల్లమాలిన అభిమానం సీతకి. అమ్మమ్మ మంటల్లో దూకమన్నా దూకే రకం సీత.

అప్పటికే degree పూర్తయిన సీతకి అన్ని విషయాలు అర్థం అవుతున్నాయి. జీవితం పట్ల స్థిరమయిన దృక్పథం వుంది. నాన్న తన కోసం, తన భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగ పడుతున్నాడు అని అర్థం అయ్యింది. కానీ మామయ్యని చూస్తే జాలి వేసింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, ఏదో కోల్పోయినట్లు గదిలోంచి బయటికి వచ్చేవాడు కాదు.

కొడుకు ఏమయి పోతాడో అని అమ్మమ్మ బెంగ పడుతోందని సీత అర్థం చేసుకుంది. మామయ్యని ఎలాగయినా మార్చుకోగలనని, తనపై తనకు విశ్వాసం వుంది ఆమెకి.

సంవత్సరంలో ఋతువులన్నీ ఒకలా వుండవు. అలాగే జీవితంలో పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. శిశిరంలో ఆకు రాల్చిన చెట్లు వసంతంలో చిగురించడం చూస్తూనే ఉంటాం. ఇలా అనుకున్న సీత.. అమ్మమ్మ మాటకు ఓటు వేసింది. నాన్నని కాదని రాఘవరావుని పెళ్లి చేసుకుంది.

ఆరు నెలల కాలం లోనే ఎంతో ఓపికగా పరిస్థితులు చక్కదిద్దింది. రాఘవరావుని మార్చుకుంది. అమ్మమ్మ, అమ్మల ఆనందానికి అవధులు లేవు. నెమ్మదిగా రామం కూడా సర్దుకు పోయేడు.

ఆలా తన సంసారాన్ని తానే సర్దుకుంది సీత. రాఘవరావు సీత అభిమానానికి లొంగిపోయేడు. ఆమె అంటే అతనికి ఎంతో గౌరవం. తనని మామూలు మనిషిని చేసిన సీతకి ఏ కష్టం రానిచ్చేవాడు కాదు.

~

“అది తల్లీ.. మీ నాన్న గతం. మగవాళ్ళు ఒత్తిడిలో వున్నప్పుడు తాము ఓడిపోయినట్లు, పరిస్థితులు బావున్నప్పుడు తామే గెలిచినట్లు అనుకుంటూ వుంటారు. ఓపికగా నిలబెట్టుకునే ఆడది వాళ్ళ జీవితం లోకి వచ్చేకే వాళ్ళ జీవితం బావుంటుంది” అంది సీతమ్మ కౌసల్యతో.

అమ్మా నాన్నల ఫ్లాష్‌బ్యాక్ తెలిసేక, కౌసల్యకి ఆమ్మ అంటే మరింత గౌరవ భావం పెరిగి పోయింది. అమ్మని గట్టిగా వాటేసుకుని “నువ్వొక పెద్ద సైకియాట్రిస్ట్ అవ్వాలిసింది” అంది.

చిరునవ్వు నవ్వింది సీతమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here