మార్పు

4
3

[శ్రీపార్థి గారు రాసిన ‘మార్పు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఊ[/dropcap]రంతా హాహాకారాలు మిన్నంటుతున్నాయి. ఎవరి పెదాలపై నవ్వు లేదు. దానిక్కారణం రాత్రి జరిగిన సంఘటన. పెళ్లి బృందంతో వస్తున్న ట్రాక్టరు రోడ్డు సరిగా లేక చీకట్లో గోయ్యిలోకి జారి బోల్తాపడింది.

దాంతో అందులో వున్నవారంతా తీవ్రంగా గాయపడ్డారు. అందులో రాములు భార్య, బిడ్డ, తల్లి కూడా ఉన్నారు. ఈ సంఘటనతో ఊరిలో మళ్లీ రోడ్డు కోసం చర్చ మొదలయింది. ఆ చర్చంతా మరోసారి ఊరి సర్పంచి మీదకు మళ్లింది.

***

“యేంది, యేమో పతాగూడ లేకుంట ఊరోళ్లంత కట్టగట్టుకొని గీ పట్నందాక ఒచ్చిండ్రు” అన్నాడు నరసింహం తాతల నాడు చేయించిన సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుంటూ.

“గదే పటేల్ సాబ్, జరిగిన ప్రమాదం విషయం మీకు తెలిసే వుంటది. మన ఊరు రోడ్డు గురించి అడుగుదామని వచ్చినం, మీరే గదా ఊరికి సర్పంచు, పెద్ద దిక్కు, మీరేమో మనూరికే రాకపోవడ్తిరి” అన్నాడు ఊర్లో అందరికి తలలో నాలుకలా మెదిలే పెద్దమనిషి పురుషోత్తం రాని నవ్వును బలవంతంగా ప్రదర్శిస్తూ, అరచేతులు రుద్దుకుంటూ.

“మొన్ననే గద మస్తు పైసలు ఖర్చువెట్టి మట్టి పోయించి రోడ్డంత సాఫు జేయించిన, మళ్లేంది?” అన్నాడు నరసింహం కోపాన్ని ప్రదర్శిస్తూ తెల్లని పంచని నల్లని కాళ్లు కనిపంచకుండా కప్పుతూ.

“అయ్యా! మొన్న ఆటో ట్రాలీలో సామాను యేసుకొని వస్తావుంటే రోడ్డు బాగలేక, ఆయింత ఆ ట్రాలీ బొల్తాపడి దుకాణం కోసం తెచ్చిన సామాను, నూనే అంతా నేలపాలైంది. మంచి డాంబరు రోడ్డు వేయించుదురు మీకు ఫుణ్యం వుంటుంది” అన్నాడు ఊరు షావుకారి కుర్చీలోంచి అమాంతం లేచి చేతులు జోడించి వంగి వంగి దండాలు పెడుతూ.

“గదే పటేలా, మీరు మట్టి పోయించుతాండ్రు, ఆనలు (వానలు) గట్టిగ వడ్డవోలే ఆ మట్టంత కొట్కపోయి, పెద్ద పెద్ద గొయ్యిలు వడ్తానాయి. మీరేమో ఊరి మొకానే అత్తలేరాయే. ఊర్లకి అచ్చే రోడ్డు మంచిగ లేక షానా తిప్పలు అయితాంది. యేట్లనన్నా గా డాంబరు రోడ్డు యేయించుండ్రి పటేలా” అన్నాడు రాములు చేతులు కట్టుకొని నేల చూపులు చూస్తూ కుడికాలి బొటన వేలుతో నేలపై అటూ ఇటూ రాస్తూ.

“అవురా రాములు, నువ్వు నా మనిషివి. నువ్వు గూడ అట్లనే మాట్లాడతవేంద్రా, డాంబరు రోడ్డంటే షిన్న కతనారా, షానా పైసలు గావాలే, పర్మిషన్లు దేవాలే యేన్ని కతలుంటయిరా” అన్నాడు నరసింహం కాలు మీద కాలు వేసుకొని వెనక్కి వాలుతూ.

“పోయిన సర్పంచి ఎలక్షన్ల వాగ్దానం జేస్తిరి గద పటేలా ఊరికి డాంబరు రోడ్డు ఏపిస్తనని, గందుకనే ఓట్లేసి గెలిపిస్తిమి, గా మాటనే నిలబెట్టుకోండ్రి. ఇంకో సంమత్సరం అయితే మల్ల సర్పంచి ఎన్నికలు అత్తనే వున్నయి, గా డాంబరు రోడ్డు యేపిస్తే మల్ల మీకే ఒట్లు యేత్తం అంటాండ్రు ఈల్లంతా, చెప్పుండ్రి పటేలుకు, మాట్లాడరు” అన్నాడు రాములు తనతో వచ్చిన వాళ్లందరి వైపు చూస్తూ..

అందరి వైపు ఒకసారి చూసాడు నరసింహం, వెంటనే రాములు వైపు చూస్తూ

“లండికే! ఏందిరా నువ్వు మాట్లాడేది, అందరిని ఎగేత్తానావురా, పుణ్యానికేసిండ్రారా నాకు ఓట్లు, కక్కెదాక తాగిండ్రు, కడుపు బగిలేదాక తిన్నరు. మల్ల పైసలు దొబ్బిండ్రు, ఒక్కొక్క ఇంటికి ఎంత పంచిండ్ర పైసలు, నువ్వే తిస్కపోయి ఇత్తివిగాదురా అందరికి, ఎలక్షన్లని నువ్వెంత దిన్నవురా నా దగ్గర, ఎన్ని పైసలిచ్చిండ్ర నీకు, పైసలిత్తెనే ఓట్లేత్తమంటిరి గదరా, మళ్లేమో ఇప్పడచ్చి నీతులు మాట్లాడతానవు” అని కోపంతో ఊగిపోతూ కుర్చీలోంచి విసురుగా లేచాడు.

“యేదో వయిసు పోరడు మాట జారిండు. మీరు అయన్ని మనుసుల పెట్టుకోకుండ్రి పటేల్ సాబ్” అన్నాడు పురుషోత్తం.

యేం మాట్లాడితే యేం పికులాటో అని అందరు నోరు మూసుకొని లేచి నిలుచున్నారు

“గవర్నమెంటు దగ్గర ఇప్పడు పైసలు లేవు, రోడ్డు అచ్చినాడే అత్తది, దాని గురించి మీరు పరేషాను గాకుండ్రి. ఆ సంగతి నేను జూస్త. నేను ఊరికచ్చె పనున్నది అక్కడ మాట్లాడుకుందాం” అంటూ సావధానంగా చెప్పి చేతిలో వున్న కండువా భూజాన వేసుకొని లోపలికెళ్లాడు నరసింహం.

అందరూ ఉసూరుమంటూ బయటికొచ్చారు.

***

దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు, పదిహేను వందల జనాభా, సుమారు వెయ్యి ఓట్లు కలిగిన గ్రామ పంచాయతి ఆ ఊరు. మండలానికి దూరంగా, పట్నానికి యేరిపారేసినట్టు అభివృద్ధికి ఆమడదూరంలో వున్న గ్రామం అది. తరాలుగా డాంబరు రోడ్డు కోసం కలలు కంటున్నారు ఆ గ్రామస్తులు. ఎన్నికలొచ్చినప్పుడే ఆ ఊరికి పండగ. యే ఎన్నికలొచ్చినా తాగినంత మందు, తిన్నంత తిండి, జేబునిండా పైసలు దొరుకుతాయి ఓటర్లకు. అప్పుడు ఊరంతా అలికిడే. పేరు పేరునా ఓట్ల పేరుతో మనుష్యుల్ని కొడనడమే అక్కడ ఎన్నికలు జరపడమంటే.

ఊరిలో సర్పంచి ఎన్నికలంటే నరసింహానికి, లక్ష్మింపతితోనే పోటి. ఇద్దరికి పాలి పగ వుండనే వుంది. ఎవరు గెలిస్తే వారిదే ఊర్లో పెత్తనం. కాని ఎప్పుడూ నరసింహానిదే పైచెయ్యి. అందుకు కారణం ఆయనకున్న ధనబలంతో ఓట్ల కొనుగోలుకు పెట్టే ఖర్చే కారణం. ఎన్నికలప్పుడు ఒకోసారి ఊరు రెండుగా చీలినా నరసింహంకున్న ధనబలం కండబలంతో చివరి నిమిషంలో ఓట్లుకొని గెలుపు సాధిస్తున్నాడు.

***

“నమస్తే సారు”

“యేమ్ రాములు కనపడతనే లేవు, స్కూలు వైపు అస్తనే లేవు” అన్నాడు స్కూలు టీచరు రామారావు చేతిలో వున్న పుస్తకాలను టేబులుపైన పెట్టి కుర్చీ వెనక్కి జరిపి కూర్చుంటూ.

“యేడ సారు, మా అమ్మ ట్రాక్టర్ల నుంచి పడ్డకాడికెళ్లి బాగ పరేషాన్లున్నం, యేడి కచ్చుడయితలేదు, దవఖానకే బాగా ఖర్చయితాంది” అన్నాడు రాములు వెనకున్న స్టూలును తనవైపు జరుపుకొని దాని మీద కూర్చుంటూ.

“రోడ్డు గురించి సర్పంచు సాబు దగ్గరికి పోయిండ్రట గద, యేమయింది.”

“యేమయితది సారు, యేప్పటి ముచ్చటనే జేప్పిండు, కొత్తముచ్చటేందంటే ఓట్లేసుటానికి పైసలు దీస్కున్నరు గదా, మళ్ల రోడ్డు యేట్ల అడుగుతరు” అంటడు

“అది నిజమే గద రాములు, పైసలిత్తేనే మీరు ఓట్లేత్తమంటిరి, ఓట్లకు ఆయన మీకు పైసలిచ్చే, ఇగ ఆయనను మీరు ఊరి పనుల గురించి రోడ్డు గురించి యేట్లడుగుతరు చెప్పు?”

“అదేంది సారు, మీరు గూడ అట్లనే మాట్లాడుతరు. దానికి దీనికి లెక్కెంది?”

“ఉన్నది, దానికి దీనికి లెక్క శానా వున్నది. ఆయనేమన్న ఇంట్లకెళ్లిత్తడ పైసలు, గిండ్ల సంపాయించినయే ఓట్లేసుటానికి మీకిత్తడు, మళ్ల సర్పంచయితడు. మళ్ల ఇండ్లనే సంపాయించుతడు”

“అయితే, ఓట్లకు పైసటు దీస్కునుడు తప్పంటరా”

“తప్పే మరి, కాదా.. అందుకని ఒక్కపైస తీస్కొకుంట అందరు ఆయనకు ఓట్లేయిండ్రి, గెలిచినంక అందరు పోయి సర్పంచు ఇంటి ముందట కూసోండ్రి రోడ్డు గావల్నని. గప్పుడు మీకు ఆయనను అడిగే హక్కు వుంటది.”

“గట్ల యేవరేత్తరు సారు, ఓట్లప్పుడు అందరూ పైసలకే ఎగవడ్తరు. మన మాటింటారు”

“గట్లకాకపోతే మీ ఊరికి రోడ్డె రాదు పో.. ఇంకో విషయం ఏందంటే.. రోడ్డు కచ్చిన పైసలు ఆయనే దిన్నడని నాకు తెలిసింది.”

***

“అవురా.. రాములు మల్ల సర్పంచు ఎలక్షన్లు అత్తానయ్ గదా, ఊర్లకు నరసింహం పటేలు దిగిండట గద” అన్నాడు కాంతయ్య, చలికి ఇంటి ముందు నీరెండకు కూచుని కాలు మీద వున్న కురుపును పుల్లతో పొడుస్తూ తన ముందునుంచి పోతున్న రాములుతో.

“యెప్పుడచ్చిండట తాత?” అన్నాడు రాములు పోయేవాడు ఆగి కాంతయ్య పక్కన వున్నరాయి మీద కూచుంటూ.

“రాత్రే దిగిండట గాదురా, ఇగ నీకు పిలుపత్తది పో, అగో మాటల్లనే అత్తాండు రాజిగాడు” అన్నాడు కాంతయ్య.

“రాములన్న.. పటేలు నిన్ను తోల్కరమ్మన్నడు” అన్నాడు నరసింహం దగ్గర పనిచేసే రాజయ్య.

“కూలి పనికి పోతానా రాజన్న, మాపటీలి అచ్చి కలుత్తాని జెప్పు” అన్నాడు రాములు.

“మర్షిపోకు, అచ్చి కల్వనటగలువు” అంటూ రాజయ్య పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్లిపోయాడు.

“అవునే తాత నువ్వుగూడ రాజకీయంల దిరిగినవు గద, ఇప్పటిలెక్క మీ కాలంలా ఓట్లకు పైసలు దీస్కునేదా?” అన్నాడు రాములు తెలుసుకుందామనే కుతూహలంతో.

“అప్పటి కాలమా రా ఇది, అప్పుడు యేట్లుండేది, ఓట్లంటే సాలు ఉరుక్కుంట బోయి యేసేది. ఇప్పుడు పైసలిత్తేనే ఓట్లేత్తమంటాండ్రు, ఓటును నమ్ముకోవాల్రా – అమ్ముకుంటార్రా?”

***

గ్రామంలో సర్పంచు ఎన్నికల హడావిడి మొదలయింది. ఈసారి కూడా నరసింహం, లక్షింపతి పోటీ పడుతున్నారు. ఊరి మీద పట్టు నిలుపుకోవాలంటే తను గెలవడం నరసింహానికి తప్పనిసరయింది. పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. తన వర్గంలోని యే ఒక్క ఓటును వదులుకోవడానికి సిద్ధంగా లేడు నరసింహం.

ముసలి ముతకా తప్ప ఊరంతా రెండుగా చీలిపోయింది. నరసింహం మామిడి తోటలో కొందరు, లక్షింపతి చేను దగ్గర కొందరు జమయ్యారు. డప్పుల వాయిద్యాలు, విందులు వినోదాలతో రెండు వైపులా సందడి వాతావరణం నెలకొంది. రోజు తాగినంత మందు, తిన్నంత తిండి జేబునిండా పైసలు. ఎవ్వరి ఇంట్లో పొయ్యి కూడా వెలగడం లేదు.

ఊరి అవసరాలను, ముఖ్యంగా డాంబరు రోడ్డు గురించి అంతా మరిచిపోయారు. ఒకవేళ గుర్తున్నా అడిగే సాహసం యేవరికి లేదు. ఒకవేళ యేవరైనా అడిగినా ఇప్పుడు ఇచ్చేది వాగ్దానమే తప్ప రోడ్డు వస్తుందన్న గ్యారెంటీ లేదు.

నరసింహం ఊర్లోకి వచ్చిన దగ్గర నుంచి రమ్మని యేన్ని సార్లు మనిషిని పంపినా రాములు వెళ్లలేదు. ఇవన్ని చూస్తున్నా యేమి పట్టనట్టు ఇంట్లోనే ఉంటున్నాడు రాములు.

ఓటర్లందరిని పేరు పేరునా లెక్కెసుకుంటున్నాడు నరసింహం. ఒక్క ఓటు గెలుపును నిర్ణయిస్తుంది. అది నరసింహనికి బాగా తెలుసు.

రేపు ఎన్నికలనగా ముందురోజు సాయంత్రం చీకటి పడ్డాక ఇంటికి వచ్చి రాములును బలవంతంగా తీసుకెళ్లి నరసింహం ముందు నిలబెట్టారు ఆయన మనుషులు.

“యేమ్ రా రాములు యేన్నిసార్లు మనిషిని పంపినా రాకనేపోతివి?” అన్నాడు నరసింహం

“ఇంట్ల మా అమ్మకు పానం మంచిగుంటలేదు. గా పరేషాన్ల వున్న పటేలా, గందుకే అచ్చుడయితలేదు” అన్నాడు రాములు ముక్తసరిగా

“పరేషాన్ల వుంటే నాకు జెప్పవురా, ఇగో పైసలు, అరేయ్, ఆ మందు బాటిలు ఇయ్యుండ్రి వానికి” అన్నాడు నరసింహం డబ్బులను బలవంతంగా రాములు చేతిలో పెడుతూ.

“అద్దు పటేలా, పైసలు అద్దూ” అంటూ రాములు తిరిగి ఇవ్వబోయాడు.

“ఉంచుకోరా, ఇంకా గావల్నంటే అడుగు, కాని ఓట్లన్ని మనకే పడేటట్టు జూడాలే, నువ్వే దగ్గరుండి చూసుకోవాలే” అన్నాడు నరసింహం రాములు భుజం మీద చెయ్యి వేసి.

“సరే పటేలా పొద్దుగాలస్త” అనుకుంటూ ఇంటి దారి పట్టాడు రాములు.

ఇల్లు చేరాడన్న మాటేగాని పైసలు, మందు తీసుకున్న ఆనందం రాములులో లేదు. రోడ్డు గురించి అడిగినపుడు నరసింహం చేసిన అవమానం పదే పదే గుర్తుకు రాసాగింది. రోడ్డు మంచిగ లేక ఊరి వాళ్లందరూ ఎంత బాధ పడుతున్నారో కళ్ల ముందు కనిపించసాగింది. ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతామని టీచరు రామారావు చెప్పిన మాటలు చెవిలను మెలిపెడుతున్నాయి. ఓటును నమ్ముకోవాలి గాని అమ్ముకుంటార్రా అని కాంతయ్య చెప్పిన మాట గుండెకు తగులుతోంది. ఈ ఆలోచనలతో రాత్రంతా రాములుకు కలత నిద్రే అయింది.

***

ఓటేయడానికి ఉదయమంతా బయటికి రాని రాములు ఓటేసే టైం అయిపోతుందనగా మందు బాటిలు పైసలు పట్టుకొని నరసింహం ముందు నిలబడ్డాడు

“యేమ్ రా రాములు, పోద్దుగాలనుంచి యేడబోయినవు, ఓటు యేసుటానికి గూడ రాలే?” అన్నాడు నరసింహం

“పటేలా! ఇగో నువ్విచ్చిన పైసలు మందు బాటిలు, నువ్వె దీస్కో నాకద్దు. ఓటు మాత్రం నీకే యేస్త, పైసలు తీసుకోకుంట యేస్త కాని గెలిచినంక మాత్రం ఉరికి రోడ్డు యేపియాలే, అన్ని సౌలతులు జేయాలే” అని నరసింహం జవాబు కొరకు చూడకుండా చరా చరా నడుచుకుంటూ ఓటింగు బూతు వైపు వెళ్లాడు రాములు. నరసింహం చుట్టూ వున్న పైసలు తీసుకొని ఓట్లేసిన వాళ్లంతా రాములు చేసిన పనికి ఆశ్చర్యపోయారు. ఈ ముచ్చట నిమిషాల్లో ఊరంతా పాకింది.

***

ఎన్నికల ఫలితాలలో గ్రామ సర్పంచుగా నరసింహం ఒక్క ఓటుతో విజయం సాధించారు అని మైకులో మారుమోగింది. నరసింహం గెలుపుతో ఆయన మనుషులు డప్పు సప్పుళ్లు పూల దండలు బుక్కా గులాలతో ఊరు ఊరంతా హంగామా చేశారు.

తెల్లవారి ఉదయమే నరసింహం ఇంటి ముందు నిలబడ్డాడు రాములు, ఊరి రోడ్డు గురించి అడగడానికి. రాములు వెనుక కాంతయ్య, ఆ వెనుక టీచరు రామారావు ఉన్నాడు. ఈ ముగ్గురి వెనక ఊరి వారంతా ఒక్కొక్కరే చేరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here