[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
పంచమాశ్వాసము – నాలుగవ భాగము
ఉ.॥
యా చిరు ప్రాయమం దుననె యాతని తల్లి ప్రసంగమంతటిన్
యా చిరు బాలకుండు మది యౌదల దాల్చగ నిశ్చయంబునన్
లేచి ప్రతిజ్ఞ జేతుమది లెక్కకు మిక్కిలి విద్యలన్నిటిన్
కాచిటు బోసెదన్ కలిమి గానక బోయిన చింత నొందనే. (421)
చం.॥
జననిరొ నీదు పల్కులను జక్కగ వీనుల వింటినమ్మ; యీ
జననము నీదు భిక్ష గద జాగును లేక పరీక్ష లందునన్
ఘనముగ గెల్చి మించెదను ఖ్యాతిని వ్యాపిని జేతునీ ధరన్
వినయము పెంపెలర్ప మరి విన్గదె మాతరొ నాదు పల్కులున్. (422)
సీ॥
ఈరోజు నీ పల్కు ఇటు నేను దాల్చెద
నన్ను నమ్ముము నీవు నయము గాను
ఘనమైన విద్యలన్ గరపి ముందుకు బోదు
నన్ను నమ్ముము నీవు నయము గాను
నా తండ్రి యాశయాల్ నన్నియు న్నెరవేర్తు
నన్ను నమ్ముము నీవు నయము గాను
నా జాతి వేదన న్యాయంబు చేకూర్తు
నన్ను నమ్ముము నీవు నయము గాను
తే.గీ.॥
వినుము ఓ తల్లి నా మాట వీనులలర
సూర్యచంద్రుల చుక్కల సూటి యాన
మాట ఇచ్చెద తల్లిరొ మహిని మిగుల
చదివి సాగెద యధికార సంబంరమున. (423)
తే.గీ.॥
యనుచు పల్కిన తనయుని యాన వినియు
పరవశించెను యా తల్లి పారవశ్య
మంది తనుదాను మరిచియు మానినపుడు
తగిన తనయుని కంటిని తప్పకుండ. (424)
తే.గీ.॥
వీని సంకల్ప బలమందు వీసమైన
సంశయంబును గానను సాక్షులైన
సూర్యచంద్రుల చుక్కల సూటి యాన
తనకు సంతోశ సంబరం తగిన విధము. (425)
తే.గీ.॥
నీవు చదువుచు సాగుము నిట్టి వేళ
నేను బంపెద రొఖ్ఖము నిజము వినుము
కాయకష్టము చేసెద కన్న తండ్రి
కోర్కె నిలబెట్టు కొమరుడ కొల్ల గాను. (426)
తే.గీ.॥
నేను బాధల కోర్చుచు నిన్ను మిగుల
మిన్నగా నిల్పెద వినుమిక మిగుల కోర్కె
నేను గైకొందు తనయుడ నేటి నుండి
చదివి నిలువు సమాజపు చట్రమందు. (427)
సోమరాజు సముద్రము వైపు చూచుట
తే.గీ.॥
అంత నొకనాటి వరువాత నాకసమున
మబ్బులేమియు లేనట్టి మాసమందు
నరిగి సాగర దరికి తా నాటలాడు
మిషను ఏగెను బాలుండు మీనవరుడు. (428)
కం.॥
అప్పుడె సూర్యుడు పుడమిని
గొప్పగ కనుదెరిచె కడలి గోపురమందున్
యిప్పుర మందలి బాలుడు
నప్పుడె చెలియలి జగాన నడుగును బెట్టెన్. (429)
సీ॥
కడలంచు లందున కట్టపై నిలుచుండి
నీటి వైపును జూసె నిలచి తాను
అరుణ కిరణ రేఖ మావళి యప్పుడే
సాగ నారంభించె సాగరమున
యా కాంతి పుంజాల యశమును గాంచగా
వాడి మనసు నందు వైనమయ్యె
కారుచీకటి మ్రగ్గు వీరు నా సోదరుల్
బైటికిన్ తేగ నే బాగ చదువ
తే.గీ.॥
వలెను యనుకొంచు వెనుకకు వచ్చెనపుడు
జదువు సంధ్యల యందున జక్కగాను
యాట పాటల యందున మేటిగాను
వరల సాగెను బాలుండు సరస గతిని. (430)
తే.గీ.॥
చిమ్మ చీకటిలోనను చింత లేక
నరిగి వారలు వలలను నాణ్యముగను
వదలు చుండిరి యప్పుడు అదను జూసి
చేపలను బట్టగా వారు జేరిరంత. (431)
తే.గీ.॥
నిలచె కలందు వారలు నీసు గబ్బు
నీళ్ల యందున బెదరక నిట్టి సమయ
మందు చల్లని నీళ్ళను లెక్క నింక
చేయకను వారు నావేళ చేప బట్టె. (432)
సీ॥
యా విధంబుగ కొన్ని వత్సరంబులు సాగె
బాలరాజు కొమరు బాగు బెరిగె
సోమరాజు కిపుడు సొగసు జూడదరమె
బహుగ బెరిగెనంత బాగుగాను
తోటివారల తొటి తొలగు వైరము లందు
సరి లేరు చదువున సాటి తనకు
ఏది మానిన గాని ఏగు బడి కతండు
అలవాటు మానడే అచ్చరొంద
తే.గీ.॥
ఇటుల యా బాలకుండును పటుతరంబు
బెరిగి పెద్దగ మారెను పెంపు మీర
విద్య లందున మేటయ్యె వేడ్క తోడ
తల్లి గోర్కెను నిలబెట్టు తనయు డయ్యె. (433)
వచనం॥
యాయరుణోదయ వేళ కడలి తరంగ ప్రతిఫలన ఘటన యా బాలుని మస్తిష్కంబును ప్రోది చేసి కర్తవ్యోన్ముఖునిం జేసే! నాడు బోధి వృక్ష అధో పరివేష్టిత బోధ నొందిన గౌతమ బుద్ధునోలె యా చిరు మనస్సుకు కర్తవ్య బోధ కలిగె! కుటిల కుతంత్రంబు నెరుగని నిష్కపట జాలరి వర్గంబు నీయజ్ఞాన పంకిలంబు నుండి వెలుగు రేఖల వేపు నడిపించవలెనను బలీయ సంకల్పంబు గలిగె! (434)
తే.గీ.॥
ఇంటి యందున తల్లియు వీధులందు
పెద్ద బడుల యందు గురువు పేర్మి బుద్ధి
గరపు చుండెను బాలుండు గట్టిగాను
చదువ దొడగెను బుడుగుండు జక్కగాను. (435)
తే.గీ.॥
కాన నేనిక వెంటనే కఠినమైన
దీక్ష బూనుచు జదివెద దెసలుదోచ
మంచి మార్కుల తోడను మహిని మించి
గొప్ప యధికారిగా వత్తు గొలువ గాను. (436)
చం.॥
చదివెను గాదె బాలకుడు చక్కగ శాస్త్రము వంటబట్టగన్
బడవెను జ్ఞానమున్ బడసి పోటీ పరీక్షల గెల్చి మించి; నా
విధముగ చేపలన్ బడయు వీధుల నాడిన బాలకుండు; యి
వ్విధముగ నయ్యె నంచు ధర వింతగ దోచదె నెంతవారికిన్. (437)
ఉ.॥
సాగర దీరమున్ గలసి సాగుచు చేపల వృత్తియు సల్పు; యా
తీగల మాదిరే తరుణ తేజములన్నియు కాంతి బాసి; యీ
సాగర చెంతనే నివురు సైతము గ్రమ్మిన నిప్పు వోలె; ఏ
ఆగమ చేయకన్ వరలె నంతము చేయగ వారి వేదనల్. (438)
ఉ.॥
ఈ కుల మందునన్ జనన మీ జగమందున గల్గినాడ; నే
నా కుల బంధుగుల్ కఠిన నైష్ఠిక కర్మల నాచరించగన్
యీ కుల మందునన్ చదువు లేశము శాతము నైన గానమే
ఏ కుల మంచు లోకులెవరి విధమున్ నను గేలి సేయరే. (439)
వచనం॥
యిటుల సంకల్ప బలంబు నొందిన బాలకుండు సోమరాజు ఎంతటి కఠినతర సమస్యల నైననూ ఛేదించి యన్ని పరీక్షల యందునూ మేటి స్థానంబున నిల్చి సేపలోని బిడ్డడు సేప మాదిరేనని సమస్త జనంబులు బొగడగా కేంద్ర పబ్లిక్ సర్వీస్ అయినటు వంటి భారత పాలన సేవా పరీక్షను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుండయ్యె. బిదప జిల్లాకు సర్వాధికారి యగు కలెక్టరై కొన్ని వత్సరంబులు నితర జిల్లాలలో పని చేసి తదనంతరంబు సొంత జిల్లా కేతెంచిన బిదప.. (440)
ఆశ్వాసాంత గద్యము:
ఇతి శ్రీ మద్వల్లంద్ర రాజవంశ రాకా సుధాకర విరాజిత కీర్తి కాంతాసముపార్జితులౌ, పట్టపు మత్స్యకార్వర్గ, ఆవలాన్వయ సంభూతులౌ, శ్రీ సీతలాంబా ఉపాసిత శ్రీ మస్తానయ్య కుమార రత్నంబగు, సహజ కవీంద్రులై వెలయు, శ్రీ వెంకట రమణ కవీంద్రుని విరచితంబగు కుసుమ వేదనా కావ్యము పంచమాశ్వాసము సర్వమూ సమాప్తము.
(సశేషం)