[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
ప్రకరణం 2 కాకతీయుల కాలంనాటి స్త్రీలు – ఒక పరిగణన – మూడవ భాగం:
శాసనాలలో ప్రసక్తమైన స్త్రీలు
ఆ కాలంలో దానం చేసి శాసనం వేయించిన స్త్రీలు:
A. కులస్త్రీలు:
1. ముప్పమాంబిక (క్రీ.శ. 1104):
[dropcap]న[/dropcap]తవాడి దుగ్గభూపతి భార్య. ఈమె ముప్పేశ్వరునికి ఆలయం కట్టించి గుండెనిబండలోని నెరుపుంగుంట దానమిచ్చి వేయించిన నిడిగొండ శాసనంలో ఈమెను సతి, గుణవతి, సీత, అరుంధతి, పార్వతి శచీదేవుల కంటె గుణాధిక్యం కలదని, అందంలో రతి, రంభ, ఊర్వశి, తిలోత్తమలను మించినదని, చతురోక్తులలో వాణిని, సౌభాగ్యంలో కేతబరాణిని మించినదని ప్రస్తుతించారు.
2. మైలమదేవి (క్రీ.శ. 1121):
కోడూరు పురవరేశ్వరుడు, సూర్యవంశోద్భవుడు, కాశ్యపగోత్రుడు కరికాలాన్వయుడు అయిన మండలేశ్వర ఎఱువ తొండయరాజుల మహాదేవి ఈ మైలమ. భీమేశ్వరునికి చైత్రబహుళ అమావాస్యనాడు అఖండవర్తి దీపాన్ని సమర్పించింది.
3. లావణ్యవతి (క్రీ.శ. 1128):
శ్రీ మదనన్తవర్మ చోడగంగదేవుని మహాదేవి.
4. రాజలదేవి:
మహారాజు గంగాన్వయుడు అయిన శ్రీ మదనన్తవర్మ దేవుని మహాదేవి ఈ రాజలదేవి.
5. పద్మలదేవి:
ఈమె కూడా అనంతవర్మ చోడగంగదేవుని దేవి.
6. జెయంగొండ చోడియంగారు (క్రీ.శ. 1128):
అనంతవర్మ చోడ గంగదేవుని పట్టమహిషి, కళింగ మహాదేవి.
పైన చెప్పిన స్త్రీలేకాక శ్రియాదేవి, లీలావతీదేవి, కల్యాణదేవి, దెన్నవ మహాదేవి అనేవారు కూడా కళింగ దేశాధిపతి శ్రీ మదనన్తవర్మ చోడగంగదేవుని భార్యలే.
11. లక్ష్మీదేవి:
అనంతవర్మ చోడగంగదేవుని దేవి లీలావతీదేవికి తల్లి. వీరందరూ శక సంవత్సరం 1050, సింహమాసం వ్యతీపాత నిమిత్తం శ్రీ భీమేశ్వరునికి అఖండవర్తి దీపానికై దానంచేసి శాసనాలు వేయించారు.
12. గడియమదేవి (క్రీ.శ. 1129):
ఈమె బుద్ధమండలికుని భార్య. ఈమె కుమారుడు మన్మమండడు. మేడనికి మేడమాంబకు జన్మించి, గుణ గౌరవ సంపదలలో గాంధారిని, సీతని, శచిని మించినదని మన్నన పొందింది. ఈమెను కలుహారగళి (కల్హారగన్ధి) అంభోరుహనేత్రి, అన్వయ విభూషణి అని శాసనంలో ప్రస్తుతించారు. ఈ బుద్ధమాండలికుడు కొండ పడుమటి బుద్ధరాజని మరొక శాసనం వల్ల తెలుస్తున్నది. ఈమె నాదిండ్ల మహాదేవునికి అఖండ దీపదానం చేసింది.
13. కొమ్మిదేవి (క్రీ.శ. 1132):
రాజాధిరాజ పల్లవకుల తిలకుడు, భారద్వాజ గోత్రుడు, కాడ్వెట్టి వంశోద్భవులైన మహామండలేశ్వర భీరగొట్టమున బయ్యరాజు మహాదేవి అయిన కొమ్మిదేవి శక సం. 1054, ఉత్తరాయణ సంక్రాంతి నాడు దాక్షారామ భీమేశ్వరునికి అఖండవర్తి దీపాన్ని సమర్పించింది.
14. కొమ్మమ మహాదేవులు:
మహామండలేశ్వర బీరగొట్టమున బయ్యరాజుకు ద్వితీయ లక్ష్మీసమానురాలైన ఈ కొమ్మమ దాక్షారామ భీమేశ్వరునికి కనకవలయం 108 గద్యాణల బంగారం సమర్పించింది.
15. మేడాసాని (క్రీ.శ. 1132):
ఈమె కొలని ఒక్కెత్తు గండయ రాజేంద్రచోడ రాజుకు చెల్లెలు. శక సం. 1054 ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం తన తండ్రి తమతినాయకునికి తల్లి ప్రోలాసానికి ధర్మార్ధం భీమేశ్వరునికి అఖండ దీపదానం చేసింది.
16. గంగాదేవి (క్రీ.శ. 1135):
కోన మల్లరాజు భార్య గంగాదేవి. ఈమె కొడుకు లోకరాజు. శక సంవత్సరం 1057, ఉత్తరాయణ సంక్రాంతినాడు భీమేశ్వరునికి అఖండ దీపాన్ని అర్పించి, కఱిపొలంలో ఒక ఖండుక భూమిని దానం చేసింది.
17. రాజాదేవి (క్రీ.శ. 1135):
కోన ముమ్మడిరాజు మహాదేవి అయిన ఈ రాజాదేవి రాజవంశం స్త్రీలలో అగ్రగణ్యురాలని కీర్తించబడింది. చాళుక్యాన్వయ రాయభూపాలునికి కుమార్తె, హైహయ వంశానికి చెందిన ముమ్మడిరాజుకు భార్య, శక సం. 1057, ఉత్తరాయణ సంక్రాంతినాడు భీమేశ్వరునికి అఖండదీపదానం కాక యిలుపట్టు భూమి, పంటభూమి 1 ఖండుక సమర్పించింది.
18. గుండమాంబికా మహాదేవి (క్రీ.శ. 1132):
వేంగీ విషయ షోడశ సహస్రావనీ వల్లభ, ఒక్కెత్తుగండ బిరుదులున్న రాజుకు తల్లి. ఈమె శక సం. 1054, ఉత్తరాయణ సంక్రాంతి తనకు ధర్మార్థం రెండు అఖండ దీపాలు శ్రీకాకొలని శ్రీవల్లభునికి సమర్పించింది.
19. ముప్పమ ( ముప్పమంగారు) (క్రీ.శ. 1140):
మహామండలిక కోనకండ్రవాడి సబ్బయకు తల్లి ముప్పమ. తనకు ధర్మార్థం బెజవాడ మల్లీశ్వర మహాదేవునికి అఖండ దీపానికై 10 మాడలు స్థానపతుల అధీనంలో సమర్పించింది.
20. లావణ్యవతి (కాలం తెలియదు):
గంగాన్వయుడు కళింగాధీశుడు అయిన చోడ గంగదేవర మహాదేవి ఈమె. మాఘపున్నమి, బృహస్పతివారం భీమేశ్వరునికి అఖండ దీపదానం చేసింది.
21. అయమాంబిక (ఐతమ) (క్రీ.శ. 1143):
ఈవని కండ్రవాడిలోని కుఱుంగంటికి వెలనాటిలోని డావులూరికి రెడ్డి అయిన అయ్తమ నాయకుని కులాంగన అయిన ఐతమ విష్ణువు సంక్రాంతినాడు డావులూరి గోకేశ్వర దేవరకు అఖండవర్తి దీపానికి 55 గొఱ్ఱెలనిచ్చింది.
22. కుందాంబిక (క్రీ.శ. 1150):
కొండపడుమటి మన్మమండనికి భార్య. కొండుపడుమతి డెబ్భై మూడు గ్రామాలకు అధిపతి అయిన మల్లని కొండపడమటి బుద్ధరాజుకు తల్లి. ఈమె ఉత్తరాయణ సంక్రాంతి నాడు నాదెండ్ల మూలస్థాన దేవరకు అఖండవర్తి దీపానికై గొఱ్ఱెలను దానం చేసింది.
23. కంటమ (క్రీ.శ. 1153):
బెజవాడనేలే నయనిధి బొద్దన నారాయణుని ధనాధ్యక్షుని అత్త కంటమ. నిజకుల కమలినీ కలహంస గుణగుణాలంకృత అని ప్రశంసింపబడినది. ఈమె శక సం. 1075, మల్లేశ్వరునికి అఖండదీపానికై 55 ఇనప ఎడ్లను సమర్పించింది.
24. చోడమహాదేవి (క్రీ.శ. 1155):
గంగాన్వయుడైన చోడగంగ దేవుని భార్య అయిన చోడమహాదేవి శక సం. 1077 విషువు సంక్రాంతి నాడు భీమేశ్వర దేవర కిలరం (పశువులమంద) కొఱకు, అఖండ దీపానికై పది కులోత్తుంగ మాడలు సమర్పించింది.
25. గుండమాంబికా మహాదేవి (క్రీ.శ. 1132):
వేంగీ విషయాధిపతి తల్లి గుండమాంబిక. ఈమె పుత్రుని పేరు శాసనంలో శిధిలమైంది. కానీ అతనికున్న బిరుదులలో వేంగీ విషయ షోడశ సహస్రావనీ వభ్ల్ల, ఆహవరక్కస, విక్రమ కర్కశ, కామినీ జన కుసుమ బాణ పెక్కండ్ర నొక్కెత్తుగండ, ఇత్యాది బిరుదులు ముఖ్యమైనవి.
ఈ గుండమాంబికా మహాదేవి తనకు ధర్మార్థం శక సం. 1054, ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం అఖండదీపాలు రెండింటిని శ్రీకాకొలని శ్రీవల్లభునికి సమర్పించింది.
26. పల్లవ మహాదేవి (క్రీ.శ. 1153):
శ్రీ మదనన్తవర్మ మహారాజులైన చోడగంగదేవర తమ్ముడు ఉలగుయ్యవంద పెర్మాడి దేవి ఈ పల్లవ మహాదేవి. శక సం. 1075న వీరిద్దరు దంపతులు దాక్షారామ భీమేశ్వర మహాదేవునికి పూజలకు, చందన కర్పూరాలకు నివేద్యానికి ఆచంద్రార్కం నడపటానికి గంగకొండ చోడవైరాగి ఆండరి చేత పంపించిన నూటిరవై మాడలతో కొనిపించిన ఆండమూరి రట్టడికంతో అష్టభోగ సల్పి సంపదలతో గ్రామాన్ని అర్పించారు.
27. మేడాంబిక (క్రీ.శ. 1160):
ధాన్యపురాధినాధుడు, ఖ్యాతిగాంచినవాడు అమరేశ్వర పాదభక్తుడు అయిన భీమరాజు పుత్రిక మేడాంబిక అనంతయ మండలేశుని పత్ని, పతివ్రత, శక సం. 1082, వైశాఖమాస శుక్ల ఏకాదశినాడు భక్తిముక్తులకై అఖండదీపాన్ని సమర్పించింది.
28. చెంగామాసకమ్మ యైన పరాకమ్మ (క్రీ.శ. 1157):
ఆణ్డపురి ద్రోణభట్ల భార్య. ఈమె శక. సం. 1079 విషు సంక్రాంతి నాడు భీమేశ్వరునికి అఖండదీపాన్ని అర్పించింది.
29. పండాంబిక/పండమదేవి (క్రీ.శ. 1163):
వెలనాటి కులోత్తుంగ చోడగొంక రాజుల కొడుకు మహామండలేశ్వర రాజేంద్ర చోడరాజుల అర్ధాంగలక్ష్మీ పండమదేవి కోనకండ్రాడి పశుపతిరాజుకు పోతమాంబకు జన్మించింది. ఈమె శక సం. 1085 దక్షిణాయన సంక్రాంతినాడు భీమేశ్వరునికి అఖండదీపం సమర్పించింది.
30. ఎఱకమ ( క్రీ.శ. 1163):
ఎడఱువ లోని చిత్తలూరు ప్రోలెభట్ట ఉపాధ్యాయుల భార్య ఎఱకమ శక సం. 1085, మిధున సంక్రాంతి నిమిత్తం భీమేశ్వర దేవరకు అఖండవర్తి దీపాన్ని సమర్పించింది.
31. బొప్పమ/బొప్పాదేవులు (క్రీ.శ. 1163):
మాధవవర్మవంశంలోని ప్రోలుని పుత్రుడు ఱేపల్యదుగ్గరాజు అగ్రమహిషి అయిన బొప్పమ అర్థిజనులకు కల్పవృక్షం వంటిదనీ, ధైర్య, ఔదార్య, చాతుర్యాలు కలిగినదని శాసనంలో ప్రశంసించబడింది. దేవి బొప్పమ పూర్వకార్థి జనతాకల్ప వ్రతానీ స్వయం ధెర్యౌచార్య, సువీర్య కార్యవిలసత్ చాతుర్య ధుర్యశ్రియః – శక సం. 1085, విషుసంక్రాంతి నాడు భీమేశ్వరునికి అఖండవర్తి దీపాన్ని సమర్పించింది. ఈ ఱేపల్య దుగ్గరాజు కాకతి ప్రోలుని కొడుకులలో ఒకరని, ఇతనే కాజీపేట దర్గాశాసనంలో పేర్కొనబడిన దుర్గరాజు అని చరిత్రకారులు అభిప్రాయపడినారు. కానీ కాజీపేట దర్గాశాసనంలోని దుర్గరాజు రెండవ బేతరాజు పెద్దకొడుకు, బొప్పాదేవి భర్త అయిన దుర్గరాజు కాకతిప్రోలునికి కొడుకు. బొప్పాదేవి కాకతి రాణులలో ఒకరు అని చెప్పవచ్చు.
32. పండమాంబ (క్రీ.శ. 1163):
వెలనాటి గొంక నరేంద్రుని భార్య (అస్యశ్రీ గొంకరాజస్య రామారత్నం యశస్వినీ) అగణ్య పుణ్యవతి, యశస్విని అని పొగడబడింది. ఈమె దాక్షారామ భీమేశ్వరునికి అఖండవర్తి దీపాన్ని సమర్పించింది.
33. పోతమదేవి/వోతమదేవి:
కండ్రవాడి భీమరాజు కూతురు, మహామండలేశ్వర తాచూఱ దారపరాజుల భార్య అయిన పోతమదేవి భీమేశ్వరునికి అఖండదీపానికై 50 ఇనుపఎడ్లను సమర్పించింది.
34. దన్నమదేవులు (క్రీ.శ. 1168):
కాకతి రుద్రదేవ మహారాజు భార్య. రాజరాజ సంవత్సరం 23 కుంభమాసంలో భీమేశ్వర దేవరకు అఖండవర్తి దీపాన్ని సమర్పించింది.
35. సూరమదేవి ( క్రీ.శ. 1169):
దన్నవాడ కోటివింజమ పోతరాజు కొడుకు చోడయరాజుల మహాదేవి సూరమహాదేవి. శక సం. 1091, మాఘశుద్ధ పౌర్ణమావస్య – మంగళవారం సూరమహాదేవి తనకు ధర్మార్థం దాక్షారామ భీమేశ్వరునికి అఖండదీప దానం చేసింది. ఈమె భర్త చోడరాజుకు ఉన్న బిరుదులలో పరచక్ర భైరవ, చాళుక్య రాజ్య సముద్ధర, కాకతి ప్రోల నిర్దహన అన్నవి పేర్కొనదగినవి.
36. గోకాంబిక (క్రీ.శ. 1170):
పడాలుచోడునికి కట్టాంబకు జన్మించిన పడవాలు గొంకని భార్య ఈ గోకాంబిక. ఈమె తండ్రి ముచ్చన నాయకుడు. తల్లి పండితులచేత నుతింపబడే సూరమాంబ (సూరివినుతా భువి సూరమాంబా) పడవాలు గొంక, గోకాంబిక మ్రోంపఱ్తి చోడేశ్వర దేవరకు రెండు అఖండదీపాలు సమర్పించి, ఆలయంలో దేవరను త్రిసంధ్యల కొలిచే సానులకు, పూజారులకు భూములను వృత్తిగా ఇచ్చారు.
37. గుండాంబిక ( క్రీ.శ. 1171):
మహామండలేశ్వర బుద్ధరాజుల అగ్రమహిషి అయిన గుండాంబిక సౌభాగ్య భాగ్యాన్విత, కాంతలకు తలమానికము, గుణఖని, సత్కావ్య చింతామణి అని శాసనంలో ప్రశంసించబడింది. ఈమె శక సం. 1065 నాటి నాదిండ్ల శాసనంలో కొండపడమటి బుద్ధరాజుల కులసతిగా పేర్కొనబడింది. కొండ పడమటి బుద్ధరాజు కులసతి అయిన గుండమదేవులు వేయించిన క్రీ.శ. 1143 నాటి శాసనంలో నాదిండ్ల దక్షిణాన తాను కట్టించిన గుండసముద్రాన్ని నాదిండ్ల మూలస్థాన మహాదేవునికి నైవేద్యానికై ఆచంద్రార్కం ఇచ్చింది. శక సం. 1093 న నాదిండ్ల మూలస్థాన మహాదేవునికి అఖండదీపం సమర్పించింది.
38. వింజాంబిక ( క్రీ.శ. 1175):
భీమరాజ ప్రియ, పోతభూపని తల్లి అయిన వింజాంబిక దాక్షారామ భీమేశ్వరునికి అఖండదీపాన్ని సమర్పించింది.
39. గూరమదేవి ( క్రీ.శ. 1186):
పోతక్షీతీశునికి వింజాంబకు పుత్రిక మండలేశ్వరుడు మండయరాజుల దేవి అయిన గూరమదేవి శక సం. 1108, మార్గశిర శుద్ధత్రయోదశి ధనుస్సంక్రాంతినాడు అఖండదీపం అర్పించింది.
40. గుండమ (కాలం తెలియదు):
కులోత్తుంగ చోడగొంకరాజుల ప్రధాని వాసన పెగ్గడ కూతురు, సంధానము శ్రీధర పెగ్గడ భార్య అయిన గుండమ దాక్షారామ భీమేశ్వరునికి అఖండదీపం సమర్పించింది. అందుకై మేకతిప్ప పడుమటి పొలంలో 5 ఖండుకలు సమర్పించింది.
41. ప్రోలమ (కాలం తెలియదు):
పరనృప జీవాపహరణ, యమదండమనే బిరుదులు గల ప్రిత్విన బోయిని భార్య. ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం అఖండదీపానికై 55 గొఱ్ఱెలను దానంచేసింది.
42. గౌరమాంబ/గౌరసాని (క్రీ.శ. 1197):
పెనుంగోటి చెంద్రిరెడ్డి కోడలు, కామనరెడ్డి భార్య అయిన గౌరాసాని శక సంవత్సరం 1119 శ్రాహి సంక్రాంతినాడు తన భర్త కామనరెడ్డికి ధర్మార్ధం శ్రీ భీమేశ్వర దేవరకు అఖండదీపానికై 50 ఇనుపయెడ్లను సమర్పించింది.
43. మైలాంబ (క్రీ.శ. 1213):
పానుగల్లు నేలిన భీమ, ఉదయాదిత్యుల తల్లి. ఈమె మూడవ కొడుకు గోకర్ణుడు. ఈమె తన కుమారుడు భీముని పుణ్యంకోసం 108 మంది బ్రాహ్మణులకు చోడ భీమనారాయణ పురమనే అగ్రహారాన్ని దానమిచ్చింది.
44. ముత్తనమ్మ:
హసనపురపు మానవభట్ల పెండ్లాము, వెల్లమూరి దేవన అప్పన తల్లి ముత్తనమ్మ తనకు ధర్మార్థం భీమేశ్వరునికై అరదీపాన్ని సమర్పించింది.
45. ప్రోలాసాని (క్రీ.శ. 1246):
పెంజలి గొంకన బోయుని కూతురు, గద్యసూరపనాయుని భార్య అయిన ప్రోలాసాని శక సం. 1168 మకర సంక్రాంతి నాడు తన భర్త సూరపనాయుని పేరుమీద అఖండ దీపాన్ని సమర్పించింది. (తండ్రి గొంకన బోయుడు, పెనిమిటి సూరపనాయుడు అన్నది గమనించదగ్గ విషయం)
46. జాయసాని (క్రీ.శ. 1249):
చతుర్థ కులానికి చెందిన (పద్మాసనస్య చరణోద్భవ వంశజాతః) ఎంజలి చోడెబోయుని కొడుకు చోడెబోయుని భార్య జాయసాని. వెలనాటి గొంక రాజేంద్రచోడుని వద్ద సర్వాధికారి పదవిలో ఉన్న ఎంజలి చోడెబోయుని కోడలు జాయసాని తన భర్తకు ధర్మార్థం ఉత్తరాయణ సంక్రాంతినాడు త్రిపురాంతకేశ్వరునికి అఖండదీపాన్ని సమర్పించింది.
47. లకుమాబాయి (క్రీ.శ. 1250):
శ్రీపతి నాయకుని కొడుకు జనమి నాయకుడనేవాడికి భార్య లకుమాబాయి. శ్రీపతి నాయకుని కొడుకు పురుఖదేవరాయ సహస్రమల్ల ధాటిధడ్కు అతడు దానమిచ్చి వేయించిన శాసనంలో ఈ జనమి నాయకుని ప్రసక్తి కూడా ఉన్నది. శక సం. 1172, కార్తీక పర్వసందర్భంగా పైన చెప్పిన శ్రీపతి నాయకుని కొడుకు జనమినాయకుడు, లకుమాబాయి అఖండవర్తి దీపానికై పది గోవుల చొప్పున దానమిచ్చారు.
48. ప్రోలమదేవి ( క్రీ.శ. 1251):
భారద్వాజ ఋషిగోత్రుడైన నాగమహీపాలుడు, అతని తమ్ముడు నారాయణ. వీరిద్దరి తల్లి ప్రోలమదేవి శక సం. 1173, నక్ర సంక్రాంతికాలంలో బ్రహ్మేశ్వరుని దీపార్థం కొడుకు నారాయణుడు దానమివ్వగా, తల్లి ప్రోలమదేవి కొంత భూమిని దేవుని నైవేద్యం కోసం సమర్పించింది (దేవాయస్మై సార్థమర్తుక సంజ్ఞికా ముయ్యడ్డ).
49. చండుబాయి ( క్రీ.శ. 1251):
కాయస్థసేనాని గంగయసాహిణి భార్య చండుబాయి. గంగయ సాహిణి మంత్రి నామదేవ పండితులు దుర్గి పట్టణంలో వంకేశ్వర దేవరను ప్రతిష్ఠించగా గంగయసాహిణి దేవబ్రాహ్మణులకు భూములను దానం చేసిన సందర్భంలో చండుబాయి కూడా మహదేవి చల్లి (ఈనాటి మాచెర్ల) లో పెద్దచెఱువు వెనక తాడ్లపల్లి తెరువులో వెలిదొఱ్త లోను భూములను, దేవర అంగరంగ భోగనైవేద్యాలకై ఇచ్చింది.
50. పద్మావతి (క్రీ.శ. 1231):
హైహయరాజ వంశజుడైన వల్లభరాజు మనుమడు సత్యరాజు. అతని కొడుకు అయిన భీమరాజు భార్య పద్మావతి. ఈమె శక సం. 1153లో దాక్షారామ భీమేశ్వరునికి హవిబలి అర్చనలకు ఖుండెనపల్లి గ్రామాన్ని అర్పించింది.
51. శ్రీ గోమతీదేవి (క్రీ.శ. 1205):
విష్ణువర్ధన మహారాజులైన విజయాదిత్య దేవచక్రవర్తికి అక్క. తైలపదేవుని కుమారుడు విజయాదిత్యుడు. గోమతీదేవి శక సం. 1127లో భీమేశ్వరునికి అఖండదీపం సమర్పించింది.
52. మారమాంబ (క్రీ.శ. 1256):
చతుర్థ వంశంలో జన్మించిన అన్నిరెడ్డి కుమార్తె. రాజేంద్ర వెన్నమల్ల క్షితిపతి భార్య. శక సం. 1178లో భీమేశ్వరునికి అఖండదీపాన్ని సమర్పించింది.
53. గజపతి వీరభానుని పట్టమహిషి (క్రీ.శ. 1274):
సౌభాగ్యవతి అని ప్రశంసింపబడిన ఈమె భీమేశ్వరుని నిత్యనైవేద్య భోగార్థం తొండివిషయంలో భూమిని దానం చేసింది. భీమనాధ పురానికి తూర్పుదిక్కున ఉన్న తోంపు మధ్యనున్న చోడమండపాన్ని భీమనాధునికి అర్పించింది.
54. జక్కమాంబ (క్రీ.శ. 1249):
ఏకాంబ్ర దేవునికి మావిండాంబకి పుత్రుడైన ఎఱగమంత్రికి భార్య అయిన జక్కమాంబను సతి, రూపయౌవన సంపన్నురాలని శాసనంలో వర్ణించబడింది. ఆమె భర్త కులోత్తుంగ రాజేంద్రచోడ పృథివీశ్వర దేవ మహారాజుల భృత్యుడని శాసనాన్ని బట్టి చెప్పవచ్చు. ..గ్గ రాజేంద్ర చోడ ప్రిథివీశ్వర దేవ మహారాజుల (భృత్యు) అని ఉన్నది. ఈమె శక సం. 1171లో భీమేశ్వరునికి అఖండదీపాన్ని సమర్పించింది.
55. గంగామహాదేవి (క్రీ.శ. 1383):
గాంగవంశీయుడైన వీరనరసింహదేవుని భార్య అయిన గంగామహాదేవి సంతానం కోరి పూజలు చేసింది. (‘పూజాం పుత్రార్థం క్రతుర్కామా ప్రకటిత మకరోదుత్తమైర్వస్తుజాలైళ’) శ్రీకాకొలని వల్లభునికి బంగారము, సన్నం పూసపేరు, ఘంటలు, పిన్నలి, బత్తులు, పద్మతడుకులు ముత్యాల తిరుణాము పసిడికాయలతో వింజామరలు, పహిణికామ ఆలవటం, పూంతక లెంతలు, వెండిదివ్యకోలలు, వెండినిడ్డెజప్పడి, పట్లు, పచ్చపట్లు, చంద్వాలు, పట్టుగొడుగులు, మణియార వెల్లలు, వెన్నెచీరలు బృందావన పట్లు మొదలైనవానిని సమర్పించింది. ఈ వస్తువులను చదివించినవారు కాళిదాస సేనాపతి గోపాళజియ్య గోవిందసేనాపతి అనేవాడు.
56. పోచలదేవమ్మ:
కోట మన్మగణపద్దేవరాజుల ధర్మపత్ని పోచలదేవమ్మ. తనకు ధర్మార్థం శ్రీకాకొలని శ్రీవల్లభునికి అఖండదీపానికై 25 గోవులను సమర్పించింది.
(సశేషం)