కాజాల్లాంటి బాజాలు-5: పెళ్ళికొడుకు కాశీ వెళ్ళిపోయేడు

    2
    3

    [box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

    [dropcap]మా[/dropcap] చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు “వాడిదంతా ప్రత్యక్ష్యపురాణం…” అనేవారు. అంటే ఏమిటని అడిగితే పురాణం చెపుతున్నప్పుడు కథలా చెపుతారు కదా… అలా కాకుండా ఆ సన్నివేశాన్ని చేసి చూపించడంట. అంటే అని ఇంకా అర్థం కాక అడిగిన మా పిల్లకాయలకి, కాస్త పెద్దవాడినంటూ మామీద అధికారం చెలాయించే మా బాబయ్య చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ అలా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది.

    అదేంటంటే.. “ఇదిగో పిల్లలూ, మీకు అర్ధమయేలా చెప్పాలంటే… చూడండి… ఇప్పుడు నేను రామాయణం పురాణకథ చెపుతున్నాననుకో… సీతమ్మని వెదకడానికి లంకకి వెళ్ళిన ఆంజనేయుల్ని రాక్షసులు పట్టుకుని, తోక చుట్టూ గుడ్డలు చుట్టేసి, నూనె పోసి ఆ తోకకి నిప్పంటించేస్తారు కదా… అదెలాగో చూపించడమన్నమాట…” అంటూ, అక్కడే దండెం మీద ఆరేసిన పంచెలూ, తువ్వాళ్ళూ తీసేసుకుని, ఒకదాని మీదొకటి వెనకాల తోకలాగ వేళ్ళాడదీసుకుని, దాని మీద పక్కనే లాంతర్లో వున్న కిరసనాయిలు వంపేసుకుని, గూట్లో అగ్గిపెట్టి అందుకుని వెలిగించుకోబోతుంటే, హఠాత్తుగా అక్కడికి వచ్చిన తాతయ్య హడిలిపోయి, అందరి వీపులూ విమానం మోత మోగించి, మా బాబయ్యని సామాన్లకొట్లో పడేసిన దృశ్యం అలా సినిమారీలులా కళ్ళముందు కొచ్చేస్తుంది.

    ఇప్పుడీ ప్రత్యక్షపురాణం గొడవెందుకంటారా… చెపుతాగా…

    మొన్నీమధ్య మా చుట్టాలింట్లో పెళ్ళికెళ్ళేను. ఈ రోజుల్లో అన్నీ హంగులూ, ఆర్భాటాలే కదా… అసలు శాస్త్రం తెల్సింది తక్కువా హడావిడి ఎక్కువానూ. అసలు వాళ్ళకన్న వాళ్ళ ఫ్రెండ్స్ హడావిడీ, ఎంజాయ్‍మెంటూ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పటి పెళ్ళిళ్ళలో. పాపం, పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ ఎంచక్కా సిగ్గుసిగ్గుగా ఒకరి నొకరు చూసుకుంటూ, ముద్దుముద్దుగా, మురిపాలుపోతూ తలంబ్రాలు పోసుకుంటుంటే, “నువ్వు పొయ్యంటే, నువ్వు పొయ్యని” చుట్టూ చేరిన ఇద్దరి ఫ్రెండ్సూ వాళ్ళని ఊదరగొట్టేసి, ఒకరి మీద ఒకరు పంతాలకి పోయినట్టే చేసేసి, ఆఖరికి ఒకరి మీద ఒకరు పళ్ళాలు విసురుకునేలా చేసేస్తున్నారు.

    ఇవాళ నేను వెళ్ళిన పెళ్ళిలో కూడా అలాంటి విషయమే ఒకటి జరిగింది. వేదిక మీద స్నాతకం జరుగుతోంది. హాల్లో కూర్చున్న పెళ్ళికొడుకూ, పెళ్ళికూతుళ్ళ ఫ్రెండ్స్ సరదాగా మా అమ్మాయి గొప్పంటే, మా అబ్బాయి గొప్పనటం మొదలుపెట్టేరు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ పెళ్ళికూతురిని ఏడిపించడానికి ఏదైనా చేస్తే, పెళ్ళికూతురి ఫ్రెండ్స్ పెళ్ళికొడుకుని వెక్కిరించడానికి దానికి మించింది చేసేస్తున్నారు. కాసేపు రెండు గ్రూపులూ పాటలు పాడుకున్నారు. తర్వాత ఒకరి మీద ఇంకొకరు పాడుకున్నారు. ఆమీద పోటాపోటీగా చెణుకులు విసురుకున్నారు. ఆపైన వీళ్లని వాళ్ళు వాళ్ళని వీళ్ళూ వెక్కిరించుకున్నారు, వేళాకోళాలు చేసుకున్నారు. నాలాంటి ప్రేక్షకులం ఆ వేడుకని చూసి భలే ఎంజాయ్ చేసేం.

    ఇంతలో స్నాతకం చివరిఘట్టం కాశీయాత్ర వచ్చింది. సరే, పెళ్ళికొడుకు ఒకచేత్తో గొడుగు పట్టుకుని, జారిపోతున్న పంచెని మరోచేత్తో సర్దుకుంటూ, ఊడిపోతున్న పాంకోళ్ళని బొటకనవేలు, మిగిలినవేళ్ళ మధ్య బిగించి పట్టుకుని, పడిపోకుండా నడవడానికి పాపం నానాతంటాలూ పడుతూ, స్టేజి నుంచి ఎంట్రెన్స్ వైపు నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. అతని వెనకాల బావమరిదికిచ్చే కట్నం పళ్ళెంలో పట్టుకుని నడుస్తోంది అతని అక్కగారు. ఆ వెనకాల అతని తల్లి, అత్త, పిన్ని, బంధుగణం అంతా ఊరేగింపుగా బయల్దేరేరు.

    ఆడపెళ్ళివారు కూడా ఓ గుంపుగా పోగయి వాళ్ళ వెనకాల చేరేరు. ఇంక అటూ ఇటూ ఫ్రెండ్స్ విజృంభించేసేరు. “కాశీప్రయాణం కట్టాడుకదా! ఎంతవరకూ వెడతాడో చూద్దాం వెళ్ళనీండి…” అంటూ పెళ్ళికూతురి ఫ్రెండ్స్ బావమరిదిని తీరుబడిగా అప్పుడు టిఫిన్ తిని రమ్మని పంపించేరు. వీళ్ళ హడావిడి చూసిన ఆ బామ్మరిది మరింత తాపీగా టిఫిన్ తినడం మొదలుపెట్టేడు.

    పెళ్ళికొడుకు ఫంక్షన్ హాల్ ఎంట్రెన్స్ దాకా వచ్చేడు, అందరూ అక్కడే బావమరిదికోసం కాసేపు చూసేరు. ఎక్కడా కనపడలేదు. పెళ్ళికొడుకు తల్లి కాస్త నుదురు చిట్లించి ఆడపెళ్ళివారివైపు చూడగానే అందులో ఒకరు బామ్మరిదిని పిలవడానికి లోపల గదుల్లోకి పరిగెత్తేరు. పెళ్ళికూతురి ఫ్రెండ్స్ ఓ పక్క నిలబడి వినోదం చూస్తున్నారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్‌కి వీళ్ళు ఆటాడుకుంటున్నారని అర్ధమైపోయినట్టుంది, ముందు ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటున్నారు.

    బామ్మరిదిని పిలవడానికి వెళ్ళినావిడ తీరుబడిగా టిఫిన్ తింటున్న అతన్ని చూసి, “ఒరే, అక్కడ కాశీయాత్ర అవుతుంటే ఇక్కడ తింటూ కూర్చున్నావేంటిరా.. వెళ్ళి మీ బావని ఆపి, మీ అక్కని పెళ్ళి చేసుకుందుకు రమ్మని చెప్పాలి. తొందరగా రా..” అంది.

    ఆవిడ మాటకి ఎదురు చెప్పలేనట్టు ఆ కుర్రాడు గబగబా నోట్లో టిఫిన్ కుక్కేసుకుని, “ఇదిగో పిన్నీ, చేతులు కడుక్కుని వచ్చేస్తున్నా…” అని బయల్దేరుతుంటే అతని పక్కనున్న పెళ్ళికూతురి ఫ్రెండ్స్ అతన్ని ఏమార్చి లోపలి గదుల్లోకి తీసుకెళ్ళిపోయేరు.

    ఇక్కడ పెళ్ళికొడుకు బామ్మరిదికోసం వెనక్కి వెనక్కి చూస్తూ, ఫంక్షన్ హాల్ దాటి, ముందు లాన్ దాటి దాదాపు గేట్ దాకా వచ్చేసేడు. అయినా కూడా ఎక్కడా బామ్మరిది జాడ లేదు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్‌కి ఇది చాలా అవమానంగా అనిపించింది. తమమీద పెళ్ళికూతురి ఫ్రెండ్స్ గెలిచేస్తారేమో అనుకుంటూ అందరూ కలిసి ఎలాగైనా పెళ్ళికొడుకుని గెలిపించాలని బ్రహ్మాండమైన ఉపాయం పన్నేరు.

    పాపం, బామ్మరిది ఇంకా రాడేంటంటూ వెనక్కి వెనక్కి చూస్తూ, అడుగులో అడుగేస్తున్న పెళ్ళికొడుకు గేటుదగ్గర ఆగిపోయేడు. అంతే, పక్కనించి మోటార్ సైకిలొకటి బుల్లెట్ లాగా దూసుకొచ్చింది. పెళ్ళికొడుకు వెనకాల వున్న అతని ఫ్రెండొకడు అమాంతం పెళ్ళికొడుకుని తోసేసినట్టు చేసి ఆ బుల్లెట్ మీదకి ఎక్కించేసాడు. ఇంకా పాపం పెళ్ళికొడుకు ఏమయిందో అర్థం చేసుకునే లోపలే ఆ మోటార్ సైకిల్‌ని మహా స్పీడుగా రోడ్డెక్కించేసేడు దాన్ని తెచ్చినతను. చేతిలో ఉన్న గొడుగు గాల్లో కొదిలేసి, రెండు చేతులతో ముందున్న వాడి నడుం గట్టిగా పట్టేసుకున్నాడు పెళ్ళికొడుకు. అంతే, క్షణాల్లో ఆ మోటార్ సైకిల్ అక్కణ్ణించి అదృశ్యమైపోయింది.

    షాక్ నుంచి కోలుకున్న అక్కడవాళ్లు “పెళ్ళికొడుకేడీ… పెళ్ళికొడుకేడీ… ఎక్కడి కెళ్ళిపోయేడూ…” అని గాభరాగా అనుకుంటుంటే, పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ విలాసంగా నవ్వుతూ, “పెళ్ళికొడుకు కాశీ వెళ్ళిపోయేడు. పెళ్ళి కావాలంటే బామ్మర్దిని కాశీ వెళ్ళి తీసుకురమ్మనండి.” అంటూ ఒకటే నవ్వులు. వట్టి నవ్వడమే కాకుండా పెళ్ళికూతురి ఫ్రెండ్స్‌ని చూసి విజయం సాధించేమన్నట్టు సైగలు. విషయం తెలుసుకున్న పెళ్ళికూతురి మేనమావ రంగంలోకి దిగేడు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ దగ్గర చేరి, నెమ్మదిగా మాటలు కలిపి, పెళ్ళికొడుకుని ఎక్కడికి తీసికెళ్ళేరో ఆరా తీస్తున్నాడు.

    ఇదంతా చూస్తున్న చుట్టపక్కాలందరం “ఓహో, కాశీయాత్రని వీళ్ళు ప్రత్యక్ష్యపురాణంగా చూపిస్తున్నారన్నమాట” అనుకుంటూ, ఈ కాశీయాత్ర  ఇప్పుడప్పుడే పూర్తయేలా లేదనుకుంటూ అన్నపూర్ణాదేవి ప్రసాదం తినడానికి డైనింగ్‍హాల్ చేరేం…

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here