నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-27

0
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]ఏ[/dropcap]దైనా ఒక నివేదిక అందగానే, నమ్మకస్తుడైన ఓ వ్యక్తిని ఆ విషయం గురించి వివరాలు తెలుసుకుని నాకు చెప్పమని కోరతాను. అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా, ది హిందూ పత్రికకి చెందిన వారయినా, స్థానికంగా పరిశోధించి, నిజానిజాలను నిర్ధారించగలుగుతారు. కొన్ని మార్లు ఆర్య సమాజ్‌కు – తిరుగులేని నాయకుడు నారాయణ రావు, అతని అనుచరులు, ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి, వ్యక్తిగత ప్రమాదాలను ఎదుర్కుని ఎవరూ అడుగుపెట్ట సాహసించని ప్రాంతాలకు వెళ్ళి బాధితుల నుంచి సమాచారాన్ని సేకరించేవారు. ఇలా వార్తను నిర్ధారించే తిరుగులేని సాక్ష్యాలు లభించిన తరువాత నాకు చెందిన ఒకరో, ఇద్దరో అధికారులు సంఘటన జరిగిన స్థలానికో, పరిసర ప్రాంతాలతో వెళ్లి పరిశోధన చేస్తారు. పలు సందర్భాలలో అర్ధరాత్రి పూట, తమ అనుభవాలను వినిపించేందుకు గ్రామ ప్రజలను నా దగ్గరకు తీసుకుని వచ్చేవారు.

రజాకార్ల అకృత్యాలకు నిరసనగా అనేక లాయర్లు కోర్టులను బహిష్కరించారు. 1948లో న్యాయవాదుల నిరసన కమిటీ ఏర్పాటయింది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏర్పడిండి ఈ కమిటీ. నా సలహాను అనుసరించి ఈ కమిటీకి చెందిన విజిలెన్స్ సబ్ కమిటీ, రజాకార్ల దురాగతాలకు సాక్ష్యాలను సంపాదించే కష్టతరమైన బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ న్యాయవాదులు అనేకులు నేరం జరిగిన స్థలానికి వెళ్ళేవారు. అనేక సందర్భాలలో వారి వెంట సాహసవంతులైన ‘ది హిందూ’ పత్రిక కరెస్పాండెంట్లు వెళ్ళేవారు. బాధితుల నుంచి జరిగినది తెలుసుకునేవారు, ఫోటోలు తీసుకుని, వారి నివేదికను నాకు అప్పగించేవారు.

బాధితుల వాంగ్మూలాలు, నివేదికలు చదవటం – ఘోరమైన శిక్షలా ఉండేది. అయితే, రజ్వీనే నన్ను ఆ శిక్ష నుంచి తప్పించేవాడు. ఏదో ఓ బహిరంగ సభలో ఫలానా గ్రామంలో రజాకార్లు ఫలానా రీతిలో ప్రవర్తించారని గొప్పగా ప్రకటించేవాడు. మరుసటి రోజు ఇత్తెహాద్ ఉర్దూ పత్రికలలో ఆ వార్త విపులంగా ప్రచురితమయ్యేది.

అయినా సరే, ఈ నివేదికలు, దమనకాండల వార్తలు నిరాధారాలని లాయక్ అలీ కొట్టివేస్తూనే ఉండేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, లాయక్ అలీ ఇలా ప్రవర్తించటం కాదు, ఢిల్లీలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు లాయక్ అలీని, అతని మాటలను నమ్మటం!

రామాచార్‍తో సహా, స్వామీ రామానంద తీర్థతో వేరుపడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాతో సంప్రదింపులు జరిపేవారు. రామాచార్ కాక నాతో సంప్రదింపులు జరిపే ప్రధాన వ్యక్తులలో, అతని నిజాయితీకి, దీక్షకు, సమతౌల్యతకు అందరూ గౌరవించే న్యాయవాది బి. రామకృష్ణారావు ఒకరు.

నన్ను ఆహ్వానిస్తూ, సికిందరాబాదులో జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించిన కొన్ని రోజులకు స్వామీ రామానంద తీర్థను అరెస్టు చేశారు. రామానంద తీర్థ అరెస్టయినా ఆయన ఆరంభించిన నిరసన ఉద్యమాన్ని, భారత సమాఖ్య సరిహద్దుల నుంచి బిందు, మెల్కొటే అనే ఇద్దరు నాయకులు కొనసాగించారు. వారు నిరంతరం నన్ను సంప్రదిస్తూండే వారు. నేను బొంబాయికి వెళ్ళినప్పుడు నన్ను కలిశారు.

నేను హైదరాబాదులో వ్యక్తిగత ప్రతిష్ఠ కల కొందరు హిందూ ముస్లింలను కలిశాను. వారు నన్ను రెసిడెంట్ గానే భావించారు. నాకు రెసిడెంట్‍కు ఉన్న అధికారాలు ఉన్నాయన్న భ్రమలోనే ఉన్నారు. నిజామ్ భయానక పాలనను అంతం చేసేందుకు ఏదో ఒకటి చేయమని వారంతా నన్ను అభ్యర్థించారు.

కమ్యూనిస్టులు:

ఆరంభంలో యునైటెడ్ ఫ్రంట్‌లో స్వామి జట్టుతో సంబంధం ఉన్న కొందరు కమ్యూనిస్టులతో సంబంధాలు నెరపాను. నల్గొండ, వరంగల్ వంటి ప్రాంతాల ప్రజలపై వారు అమితమైన ప్రభావం చూపిస్తుండడంతో, హైదరాబాదులో కమ్యూనిస్టుల ఉద్యమాన్ని లోతుగా అధ్యయనం చేశాను.

1937 నుంచి నేను బొంబాయి, బొంబాయి నగరానికి గృహశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచీ కమ్యూనిస్టుల కార్యకలాపాలను సన్నిహితంగా పరిశీలిసున్నాను. 1940లో, తమకు అలవాటయిన ఏదో కుట్ర చేస్తున్నట్లు రహస్యమైన రీతిలో కమ్యూనిస్టులు హైదరాబాదులో కామ్రేడ్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. వాళ్ళ లక్ష్యాలు ఎంత అస్పష్టంగా ఉన్నాయంటే, జాతీయవాదులు, అభ్యుదయవాదులు, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వైపు ఆకర్షితులయినట్టే, కమ్యూనిస్టుల వైపు ఆకర్షితులయ్యారు.

1938లో రాష్ట్ర కాంగ్రెస్ కార్తకర్తగా సత్యాగ్రహం చేసి స్వచ్ఛందంగా అరెస్టయిన నారాయణ రెడ్డి కూడా ఇలా కమ్యూనిస్టుల వైపు ఆకర్షితులయిన వారిలో అత్యంత ప్రాధాన్యం కలవాడు. మరో పేరుపొందిన కమ్యూనిస్టు మఖ్దూం మొయినుద్దీన్. వీరిద్దరూ, భారత కమ్యూనిస్టు పార్టీతో కలిశారు. వారు ఈ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక కమ్యూనిస్టు ప్రాంతంగా గెలిచే అవకాశంగా భావించి వీరిద్దరినీ వారు చేరదీశారు. కమ్యూనిస్టులు ఆంధ్ర ప్రాంతాన్ని ‘యెనాన్’గా భావించేవారు. ఆంధ్ర కేంద్రంగా మొత్తం భారతదేశాన్ని విముక్తం చేయవచ్చని కలలు గన్నారు [చైనాలో కమ్యూనిస్టులు ముందుగా యెనాన్ ప్రాంతంపై పట్టు సాధించారు. దాని ఆధారంగా మొత్తం చైనాపై అధికారం సాధించారు].

సి.పి.ఐ.లో ఒక భాగం అయిన తరువాత కమ్యూనిస్టుల సంస్థ, ప్రపంచానికి చిరపరిచితమైన ట్రోజెన్ పద్ధతిని అమలుపరిచే ప్రయత్నాలు ఆరంభించారు. హోమర్ వర్ణించిన ట్రోజెన్ యుద్ధంలో, ట్రాయ్ పై గెలుపొందేందుకు గ్రీకులు ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి, దానిలో రహస్యంగా సైనికులను ఉంచి, ట్రాయ్ నగర ద్వారాల దగ్గర ఉంచారు. ఆ చెక్క గుర్రాన్ని ఆట వస్తువుగా భావించి, ట్రోజన్లు ఆ గుర్రాన్ని దుర్బేధ్యమయిన కోటలోకి లాక్కువచ్చారు. నగరం లోపలికి రాగానే, గుర్రం లోంచి గ్రీకు యోధులు బయటకు వచ్చారు. అప్రమత్తంగా లేని ట్రోజన్లను ఊచకోత కోశారు. అలా 12 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా, గెలవలేని ట్రాయ్‍ను గెలుచుకున్నారు. ఈ పద్ధతిని కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా వందల మార్లు ప్రయోగించి చూశారు. రాజకీయ నాయకుల బలహీనతల వల్ల అధిక శాతం విజయాలు సాధించారు. ట్రోజన్ యుద్ధ పద్ధతిని అమలుపరిచే పథకంలో భాగంగా హైదరాబాదు కమ్యూనిస్టులు ముందుగా విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ సంస్థగా పనిచేస్తున్న ఆంధ్ర మహాసభకు చెందిన అభ్యుదయవాద నాయకులందరికీ సన్నిహితులయ్యారు. కొన్ని రోజుల్లోనే తెలివైన గొప్ప కాంగ్రెస్ నాయకుడిగా నారాయణ రెడ్డిని పొగడటం ఆరంభించారు. ఒకసారి నారాయణ రెడ్డి మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికవగానే, కమ్యూనిస్టులు మహాసభలో చాప కింద నీరులా ఆధిక్యం సంపాదించారు. కాంగ్రెస్ సంస్థతో అనుబంధం ఉన్న వారందరినీ శిక్షించి సంస్థ నుంచి తరిమివేశారు.

1945, 46, 47 సంవత్సరాలలో యు.ఎస్.ఎస్.ఆర్. (రష్యా) చెప్పుచేతల్లో ఉండే అంతర్జాతీయ సంస్థల ఆదేశాలను అనుసరించి కమ్యూనిస్టులు వెనుకడుగులు వేయాల్సి వచ్చింది. పలు సమయాల్లో రాజీ పడాల్సి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం వారికి అసహ్యకరమైన రాజరికపు సమర్థకుల యుద్ధం. కమ్యూనిస్టులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరుపుతూ – కాంగ్రెస్‍తో చేతులు కలుపుతారేమోనన్ని కమ్యూనిస్టులు నాయకులతో జరిపిన చర్చలు నాకు గుర్తున్నాయి.

ఎప్పుడయితే యు.ఎస్.ఎస్.ఆర్. మిత్రకూటమితో చేతులు కలిపి యుద్ధంలో పాల్గొందో, అప్పుడే భారత్ లోని కమ్యూనిస్ట్ పార్టీతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులందరికీ ఈ యుద్ధం, ప్రజా యుద్ధంగా మారిపోయింది. వాళ్ల పితృభూమి యుద్ధంలో ప్రవేశించటంతోటే, దేశ స్వాతంత్రం కోసం ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులను అణచివేస్తున్న బ్రిటీష్ ప్రభుత్వానికి హృదయపూర్వక మద్దతునిచ్చేందుకు కమ్యూనిస్టులకు ఓ కారణం లభించింది.

కాలక్రమేణా బ్రిటీష్ వారు నిజంగానే భారత్ వదిలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమయింది. అప్పుడు గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ సూచనలను అనుసరించి, భారత కమ్యూనిస్టులు నెహ్రూ ప్రభుత్వానికి మద్దతు నివ్వాలని నిశ్చయించారు. నెహ్రూ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం కన్నా అభ్యుదయవాది అని ప్రకటించి మరీ మద్దతునిచ్చారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ హైదరాబాద్‍లు రెండు కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులుగా కలిసి పని చేయటం ఆరంభించాయి. ఒక పద్ధతి ప్రకారం హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని తమ మద్దతుదార్లతో నింపేసింది. ఇదే రీతిన కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలపై కూడా కమ్యూనిస్టు పార్టీ పట్టు సాధించింది. అప్పటికే గ్రామాల్లో భూస్వాములు, దొరల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

కమ్యూనిస్టుల హృదయాలకు ఆనందం కలిగేన్ని సమస్యలు హైదరాబదులో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల తిండిధాన్యాలతో సహా పలు ఇతర అంశాలపై నియంత్రణలు, నిషేధాజ్ఞలు ఉన్నాయి. అవినీతిపరులైన అధికార్లు వాటిని అమలుపరిచే తీరు ప్రజలలో అసంతృప్తిని రగిలించింది. దీన్ని అవకాశంగా తీసుకుని మహాసభ గ్రామాలలో ‘సంఘాలు’ స్థాపించింది. గ్రామాల్లోని ప్రజలు, ఛోటా భూస్వాములు, వ్యాపారులతో సహా గుండాలు, అసంతృప్త వ్యక్తులను కూడా సంఘంలో చేర్చుకుంది. సంఘాలలో చేరటం ఇష్టం లేని గ్రామస్థులను వేధించి చేర్పించేవారు. అసంతృప్తి వ్యక్తం చేసిన వారిపై దాడులు చేసేవారు. లేక, వారి స్వంత భూముల్లోనే వారి పశువులను మేపకుండా శిక్షలు విధించేవారు.

సంఘాలు శక్తివంతమవగా, వారు తమని వ్యతిరేకించే వారిపై, తమ దారికి అడ్డు వచ్చే వారిపై హింసాత్మక దాడులు ఆరంభించారు. ముఖ్యంగా గ్రామ అధికారులపై అధికంగా దాడులు చేశారు. 1946 కల్లా కమ్యూనిస్టులు పలు గ్రామాలపై పట్టు ఎంతగా సాధించారంటే, రాష్ట్ర అధికారులు కూడా ఆ గ్రామాలలో అడుగుపెట్టగలిగేవారు కాదు.

ఆ కాలంలో సర్ మీర్జా ప్రధానిగా ఉండేవారు. అతని అధ్వర్యంలో నిజామ్ ప్రభుత్వం కమ్యూనిస్టుల చట్ట వ్యతిరేక చర్యలను అదుపులోకి తేవాలని ప్రయత్నించింది. కమ్యూనిస్టులు ఏ మేరకు ప్రజలలో చొచ్చుకుపోయారో పరిశోధించేందుకు ఒక కమీషన్‍ను కూడా నియమించారు. ఫలితంగా కొందరు నాయకులను శిక్షించారు. తీవ్రమైన చట్ట వ్యతిరేక చర్యలకు పరిహారంగా కొందరి భూములను ప్రభుత్వం జప్తు చేసుకుంది. అయితే, ప్రభుత్వం తమ పట్ల చర్య తీసుకుంటున్నదని తెలియగానే నాయకులు అజ్ఞాతవాసాల్లోకి వెళ్లిపోయేవారు. లేదా, సరిహద్దులు దాటి విజయవాడకు వెళ్లేవారు. అక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించేవారు.

హైదరాబాద్ లోని కమ్యూనిస్టు ఉద్యమం, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పెద్ద ఉద్యమంలో భాగం. ఈ ఉద్యమానికి ఆదేశాలు ఓ విదేశం నుండి అందుతాయి. అంటే పరాయి దేశం ఆదేశాలు పాటిస్తున్న ఉద్యమం అన్నమాట ఇది.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వతంత్రం కోసం సాగుతున్న జాతీయోద్యమాన్ని అణచివేయటంలో తమకు సహాయపడ్డందుకు బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనిస్టుల కార్యకలాపాలాను చట్టబద్ధం చేసింది. అలా ఓ నాలుగేళ్ళు సి.పి.ఐ. చట్టబద్ధమైన సంస్థగా పని చేసింది.

ఈ కాలంలో సి.పి.ఐ. దేశంలోని పలు సంస్థలలో తమ సభ్యులను ప్రవేశపెట్టింది. సానుభూతిపరులను పెంచుకుంది. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంది. ప్రచార వ్యవస్థను అత్యుత్తమ వ్యవస్థగా ఎదిగేట్టు చూసింది. కార్మికులు, విద్యార్థులలో తిరుగులేని మద్దతును సాధించింది. మధ్యతరగతి వారిలో కొన్ని వర్గాలపై శక్తివంతమైన పట్టు సాధించింది.

1944లో జైలు నుంది విడుదలయిన గాంధీజీ, ఈ నడుమ కాలంలో శక్తివంతమైన కమ్యూనిస్టుల వల్ల జాతీయోద్యమానికి కలిగే కీడును గ్రహించారు. తనకు అలవాటయిన రీతిలో ఆయన కాంగ్రెస్‌వాదుల వేషం వేసుకున్న కమ్యూనిస్టులను గుర్తించి, ఒంటరివారిని చేసి తరిమివేశారు.

1947 నడుమ భాగానికి కల్లా, కమ్యూనిస్టులు బహిరంగంగా దేశంలో పలు ప్రాంతాలలో హింసాత్మక ఉద్యమం ఆరంభించారు. అధికార బదిలీ వల్ల దేశంలో అరాచకం చెలరేగుతుందనీ, ఆ సమయంలో శాంతిభద్రతలను ఉల్లంఘించేందుకు విపులమైన పథకాన్ని వారు తయారు చేశారు. బ్రిటీష్ రాజకీయ నాయకులు, అధికారులు నమ్మినట్టు, కమ్యూనిస్టులు కూడా, దేశంలో నెలకొన్న అరాచకత్వాన్ని అధిగమించే శక్తి నెహ్రూకు లేదని, దేశం అల్లకల్లోలమవుతుందని, ఆ సమయంలో స్టాలిన్‍కు ప్రాకృతిక వారసులుగా భారత్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని ఆశించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here