ఆడవాళ్ళ ఉద్యోగాలు

23
3

[శ్రీ ఎం. వి. సత్యప్రసాద్ రచించిన ‘ఆడవాళ్ళ ఉద్యోగాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సీ[/dropcap]త ఆఫీస్ ముగించుకుని త్వరగా ఇంటికి వచ్చింది. రాము కోసం ఎదురుచూస్తోంది. రోజూ 7 గంటల కల్లా ఇంటికివచ్చేవాడు, ఈ రోజు ఇంకా రాలేదు. సీత, స్టేట్ గవర్నమెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. రాము ఇండియన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లి అయి రెండు సంవత్సరాలు అయ్యింది. అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నారు. ఇద్దరూ ఆఫీసర్స్ గానే ఉద్యోగాలు మొదలుపెట్టారు. సీతకి ఆఫీస్‌లో బాధ్యతలు ఎక్కువ. అయినా ఉదయం టైంకి వెళ్లి సాయంత్రం కూడా టైంకే లేచి వచ్చేస్తుంది. పనిలో కూడా అంతే పద్ధతిగా ఉంటుంది. సీతకి క్రమశిక్షణగా ఉండటం చాలా ఇష్టం. ఇతరులు కూడా క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటుంది. కానీ అదే తనకు, చాలా చోట్ల కష్టాలను తెచ్చి పెడుతోంది. అయినా సీత తన పద్ధతి మార్చుకోదు.

సీత ఎదురుచూపులకు తగినట్లు, రాము ఆలస్యం గానే వచ్చాడు. రాగానే సోఫాలో చతికిలబడ్డ రాముకు కాఫీ అందించింది సీత నవ్వుతూ. రాము కాఫీ తాగడం పూర్తిఅయ్యాక, తనకు ప్రమోషన్ వచ్చిన లెటర్ ఉన్న కవర్‌ను అందించింది.

‘ఏమిటబ్బా’ అనుకుంటూ, కవర్ లోని పేపర్ బయటకు తీసాడు రాము. లెటర్ చదివాక, సంతోషంతో ఎగిరి గంతేసి, ఒక్కసారి సీతని రెండు చేతుల మీద ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. కళ్ళు తిరుగుతాయని చాలా కంగారు పడ్డది సీత.

“ఎప్పుడు జాయిన్ అవాలి”, అడిగాడు రాము.

“పదిహేను రోజులు లోగా” అన్నది సీత.

“మరేంటి దిగులుగా ఉన్నావు”, అన్నాడు రాము.

“ఆ లెటర్ సరిగా చదివారా”, అడిగింది సీత.

“ఏముంది అంతగా”, అన్నాడు రాము.

“జాయిన్ కావలసింది విశాఖపట్నంలో, మనం ఉండే నెల్లూరు నుంచి విశాఖపట్నం ఎంత దూరం ఉంది, మీరు ఒక్కరే ఇక్కడ భోజనానికి ఎంత అవస్థ పడాలి” అన్నది సీత.

“ఓహ్, అదా! నేను కూడా వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటాలే”, అన్నాడు రాము.

“ఏమో బాబు, ఏం ట్రాన్స్‌ఫర్ పెట్టుకోడమో ఏమిటో, మిమ్మల్ని వదిలి నాకు వెళ్ళబుద్ధి కాదు”, అన్నది సీత.

“అలా కాదులే, వైజాగ్‌లో లేడీస్ హాస్టల్స్ ఉంటాయి. ఒక మూడు నెలలు నువ్వు అక్కడ కాలక్షేపం చెయ్యగలిగితే నేను ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటాను”, అన్నాడు రాము.

***

ఒక వారం రోజులు సెలవు పెట్టి, సీతని వైజాగ్ తీసుకెళ్లి, లేడీస్ హాస్టల్‍లో జాయిన్ చేయించాడు, రాము. హాస్టల్‍లో జాయిన్ అయిందే కానీ, ఇలా హాస్టల్‌లో ఉండి చదువుకోడం గాని, ఉద్యోగం చెయ్యడం గాని, సీతకి అలవాటు లేదు. అంతా కొత్తగా ఉంది. చాలా మంది ఆడవాళ్లు తన లాగానే ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ.

ఆఫీస్‌కి వెడితే పరవాలేదు, వైజాగ్ ఆఫీస్‌లో ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నారు.

రాము కూడా, నాలుగు అయిదు రోజులు, వైజాగ్ లోనే, ఒక జెంట్స్ హాస్టల్‌లో తాను సర్దుకుని, రోజు సీత వాళ్ళ హాస్టల్‌కి వెళ్లి, తనని పిలుచుకుని ఆఫీస్ దగ్గర దింపి వచ్చేవాడు. మళ్ళా సాయంత్రం వెళ్లి, హాస్టల్‌లో దింపేవాడు. వారం రోజులూ అయిపోయాక, రాము నెల్లూరు వచ్చేసాడు.

ఇల్లు చేరగానే, ఇల్లంతా బోసిగా అనిపించింది రాముకి. ఇంట్లో ప్రతి వస్తువు సీత జ్ఞాపకాలే. సీతని వదిలి ఉండాలంటే, ఎంత బాధో, రాముకి ఇప్పుడు అర్థమవుతోంది. కానీ తప్పదు, అనుకుంటూ, వెంటనే ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ పోసిషన్ ఏంటో కనుక్కోవాలి, అనుకున్నాడు

***

సీత నెమ్మదిగా, విశాఖపట్నం వాతావరణానికి అలవాటు పడుతోంది. ఆఫీస్‌లో కూడా మంచి తెలివిగలవాడు, మంచివాడు, తన కింద పని చెయ్యడానికి ఒక ఆఫీసర్ ఉన్నాడు. అతని పేరు రవి. పని గబా గబా చేస్తాడు, సౌమ్యుడు. సీతకి, ఒక రకంగా రక్షణ కవచంలా, ఉంటాడని చెప్పొచ్చు. తనకు ఆఫీస్‌లో లేట్ అయితే, తాను వెళ్లే దాకా రవి వెళ్లకుండా ఆఫీస్ లోనే ఉంటాడు..

సీత పని చేసే ఆఫీస్‍లో మేనేజర్, పేరు రమణ. మనిషి కొంచం ‘అదో టైపు’గా అనిపిస్తాడు. చిన్న చితక పనులకు కూడా, తన కేబిన్ లోకి రమ్మని, అసలు, అయిదు నిముషాలలో అయిపోయే పనిని, ఒక గంట సేపు సాగతీస్తున్నాడు. ఏంటో ఆనందం అనుకుంటుంది సీత. అప్పటికీ అక్కడినుంచి త్వరగా పని ముగించుకుని, వదిలించుకుని వస్తుంది.

‘కూచున్నప్పటి నుంచి అతను నా మొహం వైపే చూస్తూ ఉంటే, చాలా చిరాకుగా ఉంటుంది బాస్ కేబిన్ లోకి వెళ్లాలంటే’, అనుకుంటుంది సీత. అయినంత వరకు రవిని పంపిస్తుంది. కొన్నిసార్లు తనే వెళ్లక తప్పదు.

ఇలా ఆరు నెలలు గడిచాయి. రాము వైజాగ్ వచ్చినపుడు, జెంట్స్ హాస్టల్‌లో ఉండటం కొంచం కష్టంగా అనిపించి, ఇల్లు అద్దెకు తీసుకున్నారు సీత వాళ్ళు. రాముకి ఇంకా ట్రాన్స్‌ఫర్ అవలేదు. సీత ఆఫీసులో, సీతతో, మేనేజర్ రమణ ప్రవర్తన అలానే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే, ఇంకా పెరిగిందని చెప్పాలి. ఆయనకు ఎదురుగా కూచుని మాటాడుతుంటే, వచ్చి పక్కన నుంచుని మాటాడమంటాడు. తన టేబుల్ దగ్గరకు ఆయన వచ్చినపుడు, తానే పక్కకు వచ్చి నుంచుని మీదకు వంగి, కంప్యూటర్‌లో ఏదో చూస్తున్నట్టు మాటాడుతాడు. ఈ వేషాలన్నీ ఎదుటి వాళ్లకు తెలీవు అనుకుంటారెమో, అనుకుంది సీత చిరాకుగా. కానీ రోజు రోజుకీ అద్వాన్నంగా తయారవుతున్న మేనేజర్ ప్రవర్తన, సీతని చాలా ఇబ్బంది పెడుతోంది.

రవి, తను వెళ్లే వరకు ఇంటికి వెళ్లకుండా, తనకు తోడు ఉంటున్నాడని, బయట, ఏదో ఆఫీసులో పని ఉన్నట్లు, సాయంత్రం నాలుగు గంటలప్పుడు మేనేజర్, రవిని, బయటకు పంపుతాడు. ఎట్టి పరిస్థితిలో, అయిదు లోపు తిరిగి రావటానికి వీలు లేనంత దూరం పంపిస్తాడు. ఇదంతా కావాలని చేస్తున్నాడని సీతకి అర్థం అవుతోంది. మధ్య మధ్యలో ఒకసారి, “మీ వారి ట్రాన్స్ఫర్ ఎందాకా వచ్చింది?” అని అడిగి, వివరాలు తీసుకుంటాడు. ‘ఏం మనుషులో ఏమో’ అనుకుంది సీత.

ఒకరోజు, “విజయవాడ ఆఫీసులో మీటింగ్ ఉంది, మీరు కూడా రండి”, అని సీతని రమ్మన్నాడు. ఆయన కార్ లోనే, ఆయన డ్రైవ్ చేస్తుండగా, ఆయన పక్కన సీత కూచుని వెళ్ళాలి.

“ఉదయం ఏడు గంటలకు బయలుదేరాలి” అని చెప్పాడు రమణ సీతతో.

“ఓకే” అన్నది సీత.

“నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని పిక్ అప్ చేసుకుంటాను” అన్నాడు రమణ.

“నేనే ఆఫీస్ దగ్గరకు వస్తాను” అన్నది సీత..

కారులో వెళ్తుండగా కూడా, ఏదో జోక్ వేసి నవ్వుతున్నట్లు, సీత భుజం మీద తట్టినట్లు చెయ్యి వెయ్యడం, “డోర్ సరిగా పడలేదు” అని సీత మీదకు వంగి ఆయన చేత్తో డోర్ వెయ్యడం,్ లాంటి పిచ్చి పనులు చేయడం మొదలుపెట్టాడు. సీత ఎంతో చిరాకుగా మొహం పెట్టడం గమనించాడు. అయినా, ‘సిగ్గు లేని బతుకు’, అనుకుంది సీత మనసులో, పైకి అంటే ఏడ్చి చస్తాడేమో అనుకుని.

“ఏంటి మేడం, మూడ్ బాగా లేదా”, అన్నాడు సీతతో రమణ.

“లేదు సర్, నాకు కార్ పడదు, కడుపులో తిప్పుతున్నట్లు ఉంది, వాంతి అవుతుందేమో అన్నట్లు ఉంది” అన్నది సీత చిరాకుగా అతని వైపు చూస్తూ.

రమణకు, తను ఏ ఉద్దేశంతో చెప్పిందో అర్థం అయ్యింది. కానీ ఏమీ జరగనట్టు, “ఓకే మేడం కాసేపు కళ్ళు మూసుకుని కూచోండి, ఎక్కడైనా మెడికల్ షాప్ ఉంటే, ఏదయినా టాబ్లెట్ తీసుకుందాం” అన్నాడు రమణ.

హమ్మయ్య అనుకుని, “నేను వెనక సీట్‌లో కొంచం రిలాక్స్‌డ్‌గా కూచుంటాను” అని అడిగింది, సీత.

“ఓకే, కూచోండి” అని కార్ ఆపాడు రమణ. ప్రాణం లేచి వచ్చినంత పని అయ్యింది సీతకి.

సీత కార్ దిగి, వెనక సీట్‌లో కూచుంది. కానీ నిద్రపోలేదు. ‘వీడిని నమ్మకూడదు’, అనుకుంటూ జాగ్రత్తగా, మెలకువ గానే ఉండి, కళ్ళు మూసుకుని ఉంది. రాముకి ఫోన్ చేసి, విజయవాడలో మీటింగ్ కోసం తాను మేనేజర్ గారితో కలిసి వచ్చినట్లు చెప్పి, రాముని విజయవాడకి రమ్మని చెప్పింది. వీళ్ళు విజయవాడ చేరిన ఒక గంటకి, రాము విజయవాడ చేరాడు. ‘హమ్మయ్య ప్రస్తుతానికి గండం గడిచింది’ అనుకుని, తిరిగి వైజాగ్ చేరే వరకు రాముని ఉండమని చెప్పింది. అలాగే రాము, సీత తోనే, సీత వైజాగ్ రిటర్న్ అయ్యేవరకు ఉన్నాడు.

కానీ సీత ఆలోచనలో పడింది. ఇలా ఎన్నాళ్ళు? ఈ మేనేజర్, ఇలా, కాపు కాచి, ‘ఏదో ఒక రకంగా దగ్గరవ్వాలి’ అని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి సారి ఏదో ఒక పని ఉందని చెప్పి తప్పించుకోవడం కష్టంగానే ఉంది, అదీ కాక, ‘ఈ మేనేజర్ ఎటువంటి దురాగతాలు పన్నుతున్నాడో తెలుసుకోవడం, మళ్ళా, దాని నుంచి తప్పించుకోవడం, ఇవన్నీ చాలా కష్టంగా ఉంది’, అనుకుంటూ ఆలోచనలో పడింది.

మేనేజర్ రమణకి, ఒక లేడీ అసిస్టెంట్, ఇదే ఆఫీసులో పని చేస్తోంది. ఆమె పేరు సూర్యముఖి. కాకపోతే, అందరూ ‘సూరమ్మ’, అని పిలుస్తారు. ఎక్కడన్నా ‘చంద్రముఖి’ అని పేరు పెడతారు, ఈమెకేంటో ‘సూర్యముఖి’ అని పెట్టారు, అయినా ‘ఏ పేరు ఉంటే నాకేంటి’ అనుకుంది సీత.

ఈ సూరమ్మ, ఆ మేనేజర్ రమణకి, చాలా చేదోడు వాదోడుగా ఉంటుంది. చెప్పిన పనులన్నీ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ‘చెంచా’ అని చెప్పొచ్చు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెబుతూ ఉంటుంది. ఒక రోజు రమణ గారి దగ్గర నుండి ఒక వార్త మోసుకొచ్చింది. రమణ గారు, సీతని ఇష్టపడుతున్నారని.

ఆ మాట సూరమ్మ చెప్పగానే, సీత సూరమ్మ మీద మండిపడింది. ఇలా మండి పడ్డట్టు చెప్పమని కూడా చెప్పమంది. ఇంకేముంది, ఈ సూరమ్మ నాలుగు మాటలు కలిపి, రమణ గారికి చెప్పింది. కానీ సీత ఏ మాత్రం, తొణుకు బెణుకు లేకుండా ఉంది. ప్రతి రోజు ఎలా ఉంటుందో, అలాగే ఉంది.

కొన్నిరోజులయ్యాక, ఒక రోజు, సీతని, రమణ కేబిన్ లోకి పిలిచాడు. అనుమానిస్తూనే వెళ్ళింది సీత. ఏం చేస్తాడో అని చాలా జాగ్రత్త గానే ఉంటోంది. “రెండు రోజుల తర్వాత, సెంట్రల్ ఆఫీస్ నుండి ఇన్‌స్పెక్షన్‌కి వస్తున్నారు. అన్ని ఫైల్స్ రెడీ చేసి పెట్టండి, పెండింగ్ వర్క్ ఉంటే, అంతా క్లియర్ చెయ్యండి” అని చెప్పిపంపించేశాడు.

ఆ రోజు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. సీత టైం చూసింది. 6.30 అయ్యింది. మేనేజర్, సీత చేస్తున్న పనిని, చాలా లోతుగా అడిగి తెలుసుకుంటున్నాడు. ఇన్‌స్పెక్షన్ కారణం చూపించి, రోజు రాత్రి ఏడు గంటల దాకా, పని చెయ్యాలని ఆపుతున్నారు. సీతకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్రతి రోజు ఒక గండం లాగానే నడుస్తోంది.

మరుసటి రోజు, కొన్ని ఫైల్స్ తీసుకుని ఎక్కడికో తనతో రమ్మని మేనేజర్ రమణ, తన కారులో సీతను తీసుకెళ్లాడు. “ఎక్కడికి” అని సీత అడిగితే, “ఇన్‌స్పెక్షన్ చేసే ఆఫీసర్స్ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు, వాళ్ళు ఫైల్స్ అక్కడ చెక్ చేస్తారు”, అని చెప్పి, ఆఫీసు గెస్ట్ హౌస్‌కి, పిలుచుకు వెళ్ళాడు. రవిని తోడు తీసుకుని వెల్దామంటే, రవిని బయటకు పంపాడు. సీతకు, అతని ఆలోచన అర్థం అయ్యింది. కానీ రాముకు ఫోన్ చేసినా, రాలేడు. చాల దూరంగా ఉన్నాడు.

గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాక, వాష్ రూమ్‌కి వెళ్లాలని చెప్పి, సీత వాష్ రూమ్ లోకి వెళ్లి, రవికి ఫోన్ చేసి మాటాడింది. సీత గెస్ట్ హౌస్‍ని గమనిస్తోంది. అక్కడ ఏ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్స్ కనబడలేదు. తానూ, మేనేజర్ రమణ తప్ప, ఇంకెవరు ఉన్నట్టు అనిపించలేదు. సీత, సోఫాలో కూచుంది. రమణ కూడా, సీతకి ఎదురుగా ఉన్న సోఫాలో కూచున్నాడు.

“ఇన్‌స్పెక్షన్ చేసే ఆఫీసర్స్ ఎక్కడ?” అడిగింది సీత, రమణని.

దానికి సమాధానం చెప్పకుండా, “సీతా ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాల ఇష్టం..” అన్నాడు రమణ. తనని ఏకవచనంలో సంబోధించడం గమనించింది సీత.

“నేను పెళ్లి అయిన దాన్ని, మీరు నన్ను లవ్ చెయ్యడం ఏంటి..” అడిగింది సీత.

“నీకు పెళ్లి అయినా, మీ వారికి దూరంగానే ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం” అన్నాడు రమణ.

“మీరు అలా మాటాడకూడదు, నేను అలాటి దాన్ని కాదు” అని సర్ది చెప్పబోయింది సీత.

సీతకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రమణకి నచ్చ చెప్పడానికి, ట్రై చేసింది. రమణ వినిపించుకునే స్థితిలో లేడు. కామంతో కళ్ళు మూసుకుపోయాయి. కాకపోతే, సోఫా లోనే కూచుని మాట్లాడుతున్నాడు. ఎక్కడ మీద పడతాడో అని సీతకు భయంగా ఉంది. ‘ఇక్కడ నుండి ఎలా బయట పడాలిరా భగవంతుడా’ అని అని ఆలోచిస్తోంది. పైకి మాటాడుతోంది కానీ భయంగానే ఉంది తనకి.

ఈ మాటలు ఇలా జరుగుతూ ఉండగానే, రమణకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మాయి 5th క్లాస్ చదువుతున్న పాప, ఇంకా స్కూల్ నుండి రాలేదని.

‘హమ్మయ్య. నేను రవికి ఫోన్ చేసి చెప్పిన పని, రవి పూర్తి చేసినట్లున్నాడు’, అనుకుంది సీత రమణ మాట్లాడుతున్న ఫోన్ మాటలు విని.

ఫోన్ చేసింది రమణ భార్యనే. వేరే ఎవరో అయితే, రమణ నమ్మేవాడు కాదు. స్కూల్ నాలుగు గంటలకే వదిలేస్తారు. టైం ఆరు అవుతోంది. “స్కూల్ కి ఫోన్ చేస్తే, ‘పిల్లలందరూ వెళ్లిపోయారు, స్కూల్‌లో ఎవరూ లేరు’ అని గేట్ సెక్యూరిటీ చెప్పాడు” అన్నది రమణ భార్య. ఆమె పడ్డ కంగారు, ఆమె గొంతులో రమణకు క్లియర్‌గా వినబడింది. రమణ కంగారుగా, వచ్చిన పని ఆపేసి, సీతను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ సీత మధ్యలోనే దిగిపోయింది. రమణ కార్‌లో బయలుదేరాడని, సీత, రవికి ఫోన్ చేసి చెప్పింది.

కాకపొతే, రమణ కూతురుని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు, రవి చెప్పాడని, రవి స్నేహితుడు ఒక అతను, పాపను తీసుకెళ్లి, పాపకు ఐస్ క్రీంలు కొని ఇచ్చి, హ్యాపీగా చూసుకున్నాడు. వెంటనే రవి, రమణ కూతురుని రమణ ఇంటి దగ్గర దింపే ఏర్పాటు చేసాడు. ‘ఈసారి కూడా గండం గడిచింది’ అని, సీత ఊపిరి పీల్చుకుంది.

మరుసటి రోజు ఆఫీస్‌కి వెడితే, ఏమీ కానట్టు, తాను ఏమి ఎరగనట్టు ప్రవర్తిస్తున్నాడు రమణ. సాయంత్రం అయ్యాక, సీతను, కేబిన్ లోకి రమ్మని పిలిచాడు. అప్పటికి దాదాపు అందరూ వెళ్లిపోయారు. రవి మటుకు తన టేబుల్ దగ్గర ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. రవి ఆఫీస్ లోనే ఉన్నాడు కాబట్టి, సీత, కాస్త ధైర్యం తెచ్చుకుని రమణ కేబిన్ లోకి వెళ్ళింది. రమణ మళ్ళీ మామూలే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ మొదలు పెట్టాడు.

సీత వినిపించుకోకుండా అక్కడినుండి లేచింది.

“సీత ఆగు” అన్నాడు రమణ.

“స్టాప్ ఇట్. నీ ఇష్టం వచ్చినట్లు మాటాడకు” అన్నది సీత, కొద్దిగా హెచ్చు స్థాయి స్వరంతో ఏకవచనంలో.

అయినా, తనని కాదు అన్నట్టు, “నువ్వు నాకు కావాలి సీతా”, అన్నాడు రమణ.

“రమణ గారు, హద్దుమీరి ప్రవర్తించకండి”, అన్నది సీత కోపంగా ఉన్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ.

గట్టిగా మాటాడుతోంది కానీ, లోపల భయంగానే ఉంది సీతకు. రోజు రోజుకు, రమణ ప్రవర్తనలో మార్పు బాగా కనబడుతోంది. మీద పెడతాడేమో అన్న భయంగా కూడా ఉంది. తనని, ఏదయినా కేసులో ఇరికించి, లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని, రవి ద్వారా తెలిసింది. రవి చెప్పే న్యూస్ కరెక్ట్ గానే ఉంటుంది. కానీ రమణ కొంచం డేంజర్ మనిషే. ఎలా బయట పడాలో సీతకు అర్థం కావడం లేదు.

***

రెండు రోజులు సెలవు పెట్టి సీత దగ్గరకు వచ్చాడు రాము. జరిగిన విషయం అంతా జరిగింది జరిగినట్లు తన భర్త రాముకి చెప్పింది సీత.

“ఏదో ఒకటి ఆలోచిద్దాం” అన్నాడు రాము.

“తొందరగా ఆలోచించండి, నాకు ఆఫీసు కి వెళ్లాలంటే భయంగా ఉంది” అన్నది సీత.

“ఓకే నేను ఆలోచించి ఏదో ఒకటి చేస్తాగా” అన్నాడు రాము.

“మీరు ఏం చేసినా, చెయ్యబోయే మీ ప్లాన్ ఏంటి అన్నది నాకు చెప్పి చెయ్యండి” అన్నది సీత రాము తో.

“మా ఫ్రెండ్ ఒకడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‍స్పెక్టర్‍గా ఉన్నాడు, అతన్ని కాంటాక్ట్ చేసి చూద్దాం”, అంటూ ఫోన్ తీసుకుని, అతని నెంబర్ కోసం వెదకసాగాడు రాము.

“కానీ పోలీసులతో ఎందుకండీ వ్యవహారం?” అంది సీత.

“నువ్వు అదేం భయపడవద్దు, మనకు ఇబ్బంది లేకుండా, మీ మేనేజర్‌కి బుద్ధి చెప్పడానికి వీలవుతుందా, అని అడుగుదాం. లేదూ, మీ మేనేజర్‌ని ట్రాన్స్‌ఫర్ చేయించడానికి ఏమైనా ప్రయత్నం చెయ్యొచ్చా, ఆలోచిద్దాం, ముందు మా ఫ్రెండ్‌తో మాట్లాడుదాం” అన్నాడు రాము.

వెంటనే తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, మరుసటి రోజే ఇంటికి రమ్మని, అర్జెంటుగా మాట్లాడాలని పిలిచాడు రాము. రాము స్నేహితుడి పేరు విష్ణు. చిన్నతనం నుంచి ఇద్దరూ ఒకే క్లాస్‍లో చదివారు.

మరుసటి రోజు, విష్ణు రాము ఇంటికి వచ్చాడు. “రా విష్ణు” ఇంటిలోపలికి విష్ణుని పిలిచాడు రాము.

“బాగుంది ఇల్లు” అంటూ సోఫాలో కూచున్నాడు విష్ణు.

“మేము ఈమధ్యనే ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. అప్పటివరకు సీత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‍లో ఉండేది” అన్నాడు రాము.

ఈలోగా హాల్ లోకి వచ్చిన సీతను పరిచయం చేసాడు రాము. “నమస్కారమండి” అంది సీత.

“నమస్తే” అన్నాడు విష్ణు.

“ఏంటి సంగతులు” అన్నాడు విష్ణు, రాముతో, సీత పట్టుకొచ్చిన కాఫీ అందుకుంటూ.

సీత వాళ్ళ ఆఫీసులో, మేనేజర్ రమణ, సీతతో ప్రవర్తించిన విషయం అంతా, వివరంగా చెప్పాడు రాము.

“ఓకే, మా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ద్వారా బుద్ధి చెప్పొచ్చు, కానీ, మీ మేనేజర్, ఏదో ఒక రికమండేషన్‌తో బయటపడతాడేమో. అతను బయటపడకుండా ఉండేటట్లు ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చేద్దాం, ఇంతకీ మీ బాస్ రమణకి కాస్త లంచాలు తీసుకునే అలవాటు ఉందా..” అడిగాడు విష్ణు సీతని.

“ఆ, తనకి అలవాటే, కానీ చాలా జాగ్రత్తపరుడు. ఈ విషయంలో ఎంతో జాగ్రత్త గానే ఉంటాడు” అంది సీత.

“అలాగేనండి, మీ బాస్‍ని ఎలా బుట్టలో పడెయ్యాలో మనం ఆలోచిద్దాం, నా బ్యాచ్‌మేట్, ఒకతను ‘ACB’ అంటే ‘యాంటీ కరప్షన్ బ్యూరో’లో పని చేస్తున్నాడు. వాళ్ళు చేసే పని ఇదే, లంచాలను తీసుకునే వాళ్ళను పట్టుకుంటారు. అతని ద్వారా ప్లాన్ చేద్దాం” అన్నాడు విష్ణు.

“మీరు ఆలోచించి ఏదో, త్వరగా చెప్పండి” అన్నది సీత అభ్యర్ధిస్తున్న ధోరణిలో.

“తప్పకుండా, ఇవ్వాళే మాట్లాడుతాను” అన్నాడు విష్ణు.

విష్ణు, ఏసీబీలో పని చేసే తన ఫ్రెండ్ విజయ్‌ని కలిసి ఈ విషయం అంతా చెప్పాడు. విజయ చెప్పిన విధంగా చెయ్యమని విష్ణు, సీతకి చెప్పాడు. సీత, విజయ్ గారి ప్లాన్ ప్రకారం చెయ్యడానికి నిశ్చయించకుంది.

***

ఒకరోజు, ప్రసాద్ అనే ఒకతను, ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి, సీత వాళ్ళ ఆఫీస్‌కి అర్జీ పెట్టుకున్నాడు. ఈ పని మీద ప్రసాద్, అనుమతి కావాలని సీత దగ్గరకు వచ్చాడు. వచ్చినవాడు, ఎవ్వరికీ, లంచం ఇవ్వడానికి అంతగా సుముఖంగా లేడు. సీత, అతన్ని, ‘లంచం ఇస్తే గానీ పని కాదు’ అని ఒప్పించి మేనేజర్ గారి దగ్గరకు పంపించాలని, ప్రయత్నించింది. కానీ ప్రసాద్ లంచం ఇవ్వడానికి సుముఖంగా లేక పోయేసరికి “ఒక పని చెయ్యండి, మీరే మేనేజర్ గారితో మాటాడుకోండి, కావాలంటే రవి గారు మాట సాయం చేస్తారు” అని ప్రసాద్‍తో అంది.

ప్రసాద్, మేనేజర్‌తో మాట్లాడాక, ‘డబ్బులు ఇవ్వకుండా ఈయన దగ్గర పని జరిగేటట్టు లేదు’, అని అర్థమయింది. నిరాశగా తీరుగుముఖం పట్టిన ప్రసాద్‌ను, రవి ఆఫీస్ బయట కలిసి, మేనేజర్ గారికి డబ్బులు ఇవ్వకుండా పని ఏసిబి అధికారుల ద్వారా ఎలా అవుతుందో చెప్పాడు. సీత చెప్పిన ప్లాన్ ప్రకారమే, ప్రసాద్‌ను ఏసిబి అధికారుల దగ్గరకు పంపించాడు.

ప్రసాద్, ఏసిబి అధికారులను కలిసి, మేనేజర్ గారు, ‘లంచం ఇవ్వకపోతే పని కాదు’ అన్నట్లుగా వ్యవహరించిన సంగతి వివరించాడు. ఏసీబీ అధికారులు చెప్పినట్లు గానే చేసి, మేనేజర్ రమణ లంచం తీసుకుంటూ ఉండగా, రమణని, ఏసీబీ వాళ్లకు పట్టించాడు ప్రసాద్. తర్వాత రమణని ఉద్యోగంలో నుంచి తొలగించడం జరిగింది.

సీత తన ప్రమేయం లేకపోయినా, తన స్నేహితుల ద్వారా, మేనేజర్ రమణ పెట్టే కష్టాల నుండి బయట పడినందుకు, వెయ్యి దేవుళ్ళకు దండాలు పెట్టి, ఊపిరి పీల్చుకుంది. వెనక నుంచి కథ నడిపించిన విష్ణు గారికి, విజయ్ గారికి, రవికి, మనఃపూర్వక కృతజ్ఞతలు చెప్పి, ‘ఆడవాళ్లు ఉద్యోగం చెయ్యాలంటే ఎంత కష్టంరా భగవంతుడా’ అనుకుంటూ తన పనిలో మునిగి పోయింది.

కాలం కలిసొచ్చింది అన్నట్టు, రాముకి కూడా వెంటనే వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. సీత, రాముల ఆనందానికి అవధులు లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here