జ్ఞాపకాల పందిరి-166

16
3

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

ఇంటింటి కథ..!!

[dropcap]స[/dropcap]మాజంలో సంసారంలో మునిగి తేలే ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. ఇది సహజం. ఎందుచేతనంటే అన్ని కుటుంబాలు ఒకేలా వుండవు. ఆనందమైనా, విషాదమైనా, సహజంగా ఎదురువచ్చేవి కొన్నైతే, కొనితెచ్చుకొనేవి, అంటే చేతులారా చేసుకొనేవి కొన్ని. అందరూ ఒకేలా వుండరు. అందరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు. మనిషిని బట్టి, మనిషి మనస్తత్వాన్ని బట్టి వారి జీవన శైలి ఆధారపడి ఉంటుంది. అలాగే భిన్న రుచులు ఉంటాయి. అలాంటపుడు అవగాహనా లోపం వల్ల అనేక సమస్యలు కూడా మనిషిని చుట్టుముడతాయి. అభిప్రాయ భేదాలు అల్లుకుంటాయి. అందుచేతనే ప్రతి ఇంటికీ ఒక కథ తప్పక ఉంటుంది. అలా తెలుసుకోగలిగితే కథలెన్నో బయటపడతాయి.

రచయిత, వారి శ్రీమతి, పిల్లలిద్దరూ

అయితే ఇప్పుడు వీటికి భిన్నమైన ఏకైక సమస్యతో, ప్రతి ఇంటా ఒకే కథ వినవలసి వస్తున్నది. అది కూడా పిల్లలతో ముడిపడి వున్న సమస్య.

పిల్లలు అనగానే, వాళ్ళ చదువులు, ఉద్యోగాల వేట, విదేశాల్లో ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోవటాలు, ఆ పిల్లల కోసం, ఆ పిల్లల రాక కోసం తల్లిదండ్రుల ఆరాటం. ఇవన్నీ ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఇంటా వినిపిస్తున్న కథలు. దీనికి అదనం పురుళ్ళు పోయడం కోసం (కూతురైనా, కోడలైనా) కనీసం ఆరు నెలలు వాళ్ళ దగ్గర గడపగలగడం. పిల్లలతో ఉన్నామన్న ఆనందం కొంచెం, గొడ్డు చాకిరీతో నడ్డి విరగడం మాత్రం ఖాయం (అందరి విషయంలో కాకపోవచ్చులెండి). చెప్పొచ్చేదేమిటంటే, చాలా కుటుంబాల పెద్దలు తమ వృద్దాప్యంలో ఇలాంటి సమస్యలకు కృంగిపోయి మానసిక వ్యథలకు గురి అవుతున్నారు.

హన్మకొండ లోని స్వగృహంలో రచయిత కుటుంబం

ఇలాంటి కుటుంబాలలో నేనూ ఒక సభ్యుడినేనని చెప్పాలి. పిల్లల నుండి నాకు ఎలాంటి సమస్యలూ లేవు గాని, పిల్లలు దూరంగా (నా కుమారుడు) వున్నారన్నదే భరించరాని వ్యథ. ఈ నేపథ్యంలో, నా కూతురు నాకు దగ్గరగా (హైదరాబాద్) ఉండడం నా అదృష్టమేనని చెప్పాలి. ఇద్దరూ దగ్గర వుండాలనుకోవడమూ తండ్రిగా నాది అత్యాశ కావచ్చును గాని, దురాశ కాదని నా నమ్మకం. మా అబ్బాయి అప్పుడప్పుడూ అమెరికా నుండి వస్తుంటాడు, కొద్దీ రోజులు మాత్రమే వుండి వెళ్లిపోతుంటాడు. మాకు కూడా అబ్బాయి వల్ల రెండుసార్లు అమెరికా దర్శించే ఆవకాశం కలిగింది.

హన్మకొండ నుండి సికిందరాబాద్ కు తిరుగు ప్రయాణం.

అవి రెండూ కూడా, ఒక నెల కార్యక్రమాలే. ఆరునెలల అవసరం ఇంకా రాలేదు లెండి. నా మనస్తత్వం, ఆలోచనా విధానం, ఇతరులకు భిన్నంగా ఉంటుంది. వినడానికి కూడా వింతగానే ఉంటుంది. విదేశాలనుంచి గానీ దూరప్రాంతాలనుంచి గానీ పిల్లలు వస్తున్నారంటే (నా విషయంలో మా అబ్బాయి) అందరూ సంతోషిస్తారు, కానీ నా మనసు బాధతో మూలగడం మొదలవుతుంది. అబ్బాయి రాకముందే వెళ్లిపోయే రోజుగురించి ఆలోచిస్తూ వేదనతో మనసు భారమై పోతుంది. తండ్రిగా నాకు ఇది ఒక వింత సమస్య. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తున్నది గాని, సంతృప్తికరమైనది మాత్రం కాదు. తిరిగి అమెరికా వెళ్లిన తర్వాత చాలా రోజుల వరకు ఈ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఈ ఆలోచనలతో నిద్రపట్టక తెల్లవారిపోతుంటుంది. ఏదో తెలియని బెంగ మనసును ఆవరిస్తుంది. తెలియని నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటాయి. ఈ సమస్య నాకేనా, ఇంకెవరికైనా ఉంటుందా? అనే ప్రశ్న కూడా అప్పుడప్పుడు పదేపదే నన్ను ముల్లులా గుచ్చుకుంటుంది. పరిస్థితులకు, మనకు మనం అలవాటుపడకపోవడం కూడా ఒక అనారోగ్య లక్షణమే అనిపిస్తుంది నాకు. అయితే నాతో కలసి జీవిస్తున్న ఇలాంటి సమస్య నా శత్రువుకు కూడా ఉండకూడదని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఈ సమస్య, నా శ్రీమతికి లేకపోవడం నా అదృష్టం గానే భావిస్తాను నేను. ఇది కేవలం నాలాంటి వాళ్ళకుండే బలహీనత తప్ప మరోటి కాదు.

పిన్ని పుట్టినరోజు వేడుకల్లో రచయిత అబ్బాయి.. రాహుల్, కోడలు.. దివ్య.

మా అదృష్టంకొద్దీ ఈ నెల రెండవ తేదీన మా అబ్బాయి, కోడలు అమెరికా నుండి వచ్చారు. మేము ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉండడం మూలాన అందరం ఒకే చోట (కోడలు ఇల్లు కూడా మేము నివాసం వుండే ఇంటికి చాలా దగ్గర) కలసి వుండే అవకాశం ఏర్పడింది. మా మనవడి (నా కూతురు కొడుకు) మొదటి పుట్టినరోజు కూడా ఈ నెలలోనే ఉండడం కూడా కలసి వచ్చింది. పెరిగి పెద్దవాళ్ళై, చదువులు పూర్తి చేసింది హన్మకొండ (వరంగల్) కనుక, స్వంత ఇంటికి అందరం వెళ్లి నాలుగు రోజులు గడిపాము. అలా ఇద్దరు పిల్లలతో, స్వంత ఇంట్లో గడపగలగడం నాకు ఆ నాలుగు రోజులూ పండగ రోజుల్లాగానే గడిచిపోయాయి. మళ్ళీ వాళ్ళు త్వరలోనే వెళ్ళిపోతారు. కొన్నాళ్లపాటు మళ్ళీ నా పరిస్థితి షరా మామూలే!

పిన్ని కుటుంబంతో (హైదరాబాద్) రాహుల్,దివ్య.

అయితే, అమెరికాలో ఉద్యోగం వేటలో పడి అక్కడికి వెళ్లేవారంతా అమెరికా మోజులోనే లేదా డాలర్ల మోజులోనే వెళుతున్నారా? అన్నది చాలామంది ప్రశ్న, అనుమానమూనూ. ఈ ప్రశ్న ఎక్కువగా ఉదయించేది, తమ పిల్లలను అమెరికా దేశానికి పంపించలేకపోయిన తల్లిదండ్రులలో. మోజుతో వెళ్లే కొద్ది శాతం మందిని ప్రక్కన పెడితే, మనదేశంలో ఉన్న విద్యావంతులకు సరిపడినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పాటు, ఇంకా అనేక సాంకేతిక కారణాల వల్ల, నిరుద్యోగులకు అమెరికాను ఆశ్రయించక తప్పడం లేదు. కొద్దికాలం పనిచేసి, కొంతడబ్బు సంపాదించుకుని తిరిగి మనదేశానికి వచ్చేయాలనే సదుద్దేశం తోనే అందరు అమెరికాలో ముందు కాలుమోపుతారు. కానీ తర్వాత అక్కడి పరిసరాలు, వాతావరణం, సదుపాయాలు రుచి మరిగిన తర్వాత, అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తారు. చిక్కు వచ్చేది, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేది ఇక్కడే! నేను ఇలాంటి ఒక సంఘటన గుర్తు చేసి వ్యాసం ముగిస్తాను.

పిన్ని- చిన్నాన్న లను సన్మానిస్తూ.. రాహుల్ దంపతులు
పిన్ని-చిన్నాన్న లతో రాహుల్ దంపతులు

నేను మహబూబాబాద్‌లో దంతవైద్యుడిగా పనిచేస్తున్న కాలంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దాయన ఉండేవారు. అయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా కూడా పనిచేశారు. ఆయన మహబూబాబాద్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో పెద్ద ఆధునిక వ్యవసాయ క్షేత్రం తయారు చేసుకున్నారు. రకరకాల పండ్ల చెట్లతో ఆ తోట ఎప్పుడూ కళకళ లాడుతుండేది అదొక పరిశోధక కేంద్రంగా ఉండేది. ఆయనకు ఒకే ఒక్క కుమారుడు, అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. వెళ్లినవాడు మళ్ళీ తిరిగి రాలేదు, తల్లి చనిపోయినా స్పందించలేదు. ఈ పరిస్థితిలో ఆ తండ్రి మానసిక వ్యధ ఎలాంటి వారికైనా అర్థమవుతుంది. ఆ బాధతో ఆయన కొన్నివందల ఆ వ్యవసాయ క్షేత్రాన్ని, ప్రభుత్వానికి (వ్యవసాయ విద్యాలయానికి) దానం చేసేసాడు. అది ఇప్పుడు గొప్ప వ్యవసాయక పరిశోధనా కేంద్రంగా విద్యార్థులకు ఉపయోగపడుతున్నది. దీనిని బట్టి ఆ తండ్రి కొడుకు విషయంలో ఎంతగా కృంగిపోయి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు! ఇలాంటి తల్లిదండ్రులు ఇంకెంతమందో.

రచయిత మనవడు నివిన్ (అమ్మాయి కొడుకు)తో కోడలు.. దివ్య కానేటి

అమెరికా వంటి విదేశాలకు వెళ్లి చదువుకోవడం, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించుకోవడం వంటి పనులకు నేను వ్యతిరేకిని కాదు. కానీ అవసరమైనంత కాలం వుండి, తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో కలిసి జీవించాలని చెప్పడమే, ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం.

ఇలా ఆలోచించడం వృథా ప్రయాస మాత్రమే అవుతుందేమో మరి, చెప్పలేము. కాలమే దీనికి జవాబు చెప్పగలుగుతుందేమో!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here