హాస్యం, భావుకత్వంతో కట్టిపడేసే ‘పాచువుం అద్భుత విళక్కుం’

2
4

[‘పాచువుం అద్భుత విళక్కుం’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]

[dropcap]అ[/dropcap]ఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పాచువుం అద్భుత విళక్కుం’ (పాచు మరియు అద్భుత దీపం)- పాచు అనేది హీరో ప్రశాంత్ ముద్దు పేరు.

~

ఇది అమెజాన్ ప్రైంలో తెలుగులో అందుబాటులో ఉంది. దాదాపు రెండు గంటలా యాభై నిమిషాల నిడివి గల చలన చిత్రం ఇది. అయినా చివరికొచ్చేసరికి ‘అరె! అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు ఉంటే బాగుణ్ణు’ అని మనకి అనిపిస్తుంది.

ఇది నిజంగా ఒక ఫీల్ గుడ్ చిత్రం. చాలా రోజుల తర్వాత ఒక మంచి చిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది.

~

ఇంతకూ కథేంటి?

చాలా చిన్న పాయింట్. ‘చదువుకోవడం అనే హక్కుకి ఆడపిల్లని దూరం చేయరాదు’. ఈ పాయింట్ చుట్టూతా అందమైన కథనం. ఎక్కడా బోర్ కొట్టదు.

కోటక్కల్ ఆయుర్వేద వైద్యశాల వారి ఫ్రాంచైసీ యూనిట్‌ని ముంబాయిలో నడుపుతుంటాదు హీరో ప్రశాంత్ (ఫహాద్ ఫాజిల్). ‘మల్లీశ్వరి’లో వెంకటేష్‌లా ఇతనికి పెళ్ళి సంబధాలు వచ్చినట్టే వచ్చి తప్పిపోతు ఉంటాయి. పెళ్ళి కాని ప్రసాద్ లాగా అతను అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. అతను ఒకసారి కేరళలో ఉన్న స్వగ్రామం వెళ్ళి తిరిగి ముంబయికి బయలుదేరుతాడు. అక్కడ అనుకోని పెళ్ళి చూపులు, అక్కడ చేపముల్లు ఇరుక్కుని హాస్పిటల్ పాలవ్వడం వల్ల విమానం మిస్ అయి రైల్లో బయలుదేరాల్సి వస్తుంది. ముంబయిలో ఇతని బిల్డింగ్ యజమాని రియాజ్ (ఒక నాటి హీరో వినీత్) ఒక కోటీశ్వరుడు, రాజకీయంగా కూడా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. అతను చాలా చెడ్డవాడేమో అనే తరహాలో అతని కారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రశాంత్‌ని ఇతను ఒక రికెస్ట్ చేశాడు. రైల్లో వచ్చేటప్పుడు కేరళ నుంచి వస్తున్న తన తల్లికి తోడుగా రమ్మంటాడు. దానికి ప్రతిగా అతనికి ఐ ఫోన్‌ని బహుమతిగా పంపిస్తాడు.

ఇక్కడి దాకా ఎన్నో హాస్య సంఘటనలు. ఎంతో ఉల్లాసంగా సాగిపోతుంది కథ. విమాన ప్రయాణాన్ని కూడా తృణీకరించి ఆవిడ రైల్లో ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. ఇంతలో రైలు ప్రయాణం మధ్యలో అందరి కళ్ళు కప్పి ఆ పెద్దావిడ మార్గ మధ్యంలో రాత్రి పూట గోవాలో దిగిపోతుంది. ఆపబోయిన ప్రశాంత్ కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి వేగంగా చీకట్లో కలిసిపోతుంది.

ఇక ఇక్కడ నుంచి కథ మొత్తం గోవాలో నడుస్తుంది.

ఇక్కడ నుంచి కథ మొత్తం మిస్టరీ, చేజింగ్, ఫైట్స్ అన్న విధంగా సాహసోపేతంగా సాగిపోతుంది. ఎవ్వరూ ఊహింఛని మలుపులు తిరుగుతుంది కథ. అక్కడే హంసద్వని (అంజనా ప్రశాంత్) పరిచయం అవుతుంది ప్రశాంత్‌కి. మొదట గిల్లికజ్జాలతో మొదలైన వారి పరిచయం ఎలా హృద్యంగా సాగుతుందో తెరపై చూడాల్సిందే.

~

బసు చటర్జీ (ఛోటీ సీ బాత్, చిత్‌చొర్, ఖట్టా మీటా), హృశీకేష్ ముఖర్జీ (గోల్ మాల్), జంధ్యాల తీసిన అనేక హాస్య ప్రేమ కథలలాగా, గుల్జార్ (అంగూర్) చిత్రాల లాగా చక్కటి ఆరోగ్యమైన హాస్యం మనల్ని ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ఉత్తిగా హాస్యం మీద మాత్రమే ఏకాగ్రత పెట్టకుండా గుల్జార్, ప్రియదర్శన్, కుందన్ షా, వంశీ, బాపు, తరహా భావుకత్వం మనల్ని కట్టిపడేస్తుంది. ఇదే ఈ చిత్రనికి బలం. ఈ రోజుల్లో కూడా హీరో హీరోయిన్లు ఒకే కప్పు కింద ఒక రాత్రి ఉండాల్సి వచ్చినా, ప్రేక్షకుడికి ఎక్కడా అసభ్యమైన ఆలోచనలు రాకుండా చక్కగా వంశీ తరహలో, గుల్జార్ గారి తరహాలో చక్కటి సున్నితమైన భావనలే మనలో కలిగేలా చూపడంలో దర్శకుడి సంస్కారం బయటపడుతుంది.

కథ పక్కాగా జంధ్యాల సినిమాలకి సరిపోయే కథ. ట్రీట్మెంట్ విషయానికి వస్తే గుల్జార్, వంశీ, కుందన్ షా, తరహా ట్రీట్మెంట్.

మణిరత్నం తీసిన ఒకప్పటి చక్కటి భావుకత్వంతో కూడిన చిత్రాలు కూడా గుర్తుకువస్తాయి ఫోటోగ్రఫీ, సంగీతం పరంగా ఒక్కో దగ్గర.

ఇంతకంటే ఇంకేమి కావాలి ప్రేక్షకులకి.

చక్కగా పిల్లా పాపలతో హాయిగా చూసేయవచ్చు ఈ ఆదివారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here