మళ్ళీ గెలిచిన తాబేలు

4
3

[బాలబాలికల కోసం ‘మళ్ళీ గెలిచిన తాబేలు’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

[dropcap]అ[/dropcap]డవిలో ఆ రోజు చాలా సందడిగా వుంది. వుండదా మరి!? ఈ మధ్య తాబేలు కనబడ్డ వాళ్ళందరితో చెప్తోందిట. నేను చాలా వేగంగా పరిగెత్తటం అభ్యాసం చేస్తున్నాను. నేనిప్పుడు కుందేలుకన్నా వేగంగా పరిగెత్తగలను. మళ్ళీ ఒకసారి మా మధ్య పోటీ పెడితే ఈ మారు ఉపాయాలతో కాదు (ఇంతకు ముందు తాబేలు ఉపాయాలతో గెలిచిన కథలు కూడా వున్నాయి) పరుగుతోన నేను కుందేలుని గెలుస్తాను అని. మళ్ళీ ఒకసారి పరుగు పందెం పెట్టమని పెద్దలని అడిగిందట కూడా. అందుకే ఆ రోజు అడవిలో ఆ హడావిడి. మళ్ళీ తాబేలు, కుందేలు మధ్య పరుగు పందెం.

పోటీ జరిగే స్ధలంలో అన్ని జంతువులూ చేరాయి. కొన్ని కుందేలు వైపు మాట్లాడుతున్నాయి. ఎంతయినా కుందేలుకి పరుగు జన్మతః వచ్చింది. అభ్యాసం లేనంత మాత్రాన అడుగున పడిపోదు. తాబేలు కొన్ని రోజులు అభ్యాసం చేసినంత మాత్రాన కుందేలులాగా పరిగెత్తలేదు అని.

కొన్ని జంతువులు తాబేలు వైపు మాట్లాడుతున్నాయి. మా తాబేలేమన్నా తక్కువ తిందా!! కుందేలును గెలవాలని రోజూ ఎన్నెన్ని గంటలు అభ్యాసం చేస్తోందో తెలుసా!? అది వూరికే పోతుందా! తప్పకుండ మా తాబేలే గెలుస్తుంది.

పోటీ మొదలయింది. పోటీదార్లు తయారుగా నుంచున్నారు. కుందేలు, తాబేలుతో నాకు పోటీ ఏమిటి అని చాలా నిర్లక్ష్యంగా వుంది. తాబేలు మాత్రం పోటీ మొదలయ్యే క్షణం కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. గెలుస్తానో, లేదోననే భయం కూడా కొంచెం వుంది. కానీ అన్ని రోజులనుంచీ అభ్యాసం చేస్తున్నాను కదా అనే ధైర్యం కూడా వుంది. సరే పోటీ మొదలయింది. తాబేలు వెంటనే శక్తి కొద్దీ పరిగెత్తటం మొదలు పెట్టింది. కానీ కుందేలు వున్న చోటనుంచీ కదలలేదు.

తాబేలు నాతో ఎన్నిసార్లు పోటీ పడలేదు. అన్ని సార్లూ నేనే గెలిచాను కదా. పైగా తాబేలు తాను గెలవటానికి అనేక ఉపాయాలు కూడా చేసింది. అయినా కూడా లాభం లేకపోయింది. తాబేలు ఉపాయాలతో అలా అన్యాయంగా గెలిచిన ప్రతిసారీ, న్యాయ నిర్ణేతలు నిజం తెలుసుకుని, తననే విజేతగా ప్రకటించారు. ఈ మారు ఏమి ఉపాయం చేస్తోందో! అయినా న్యాయ నిర్ణేతలు సరైనవారు కనుక వాటిని అంగీకరించరు. వారికి ఎవరు వేగంగా పరిగెత్తగలరో తెలుసు. ఇక్కడివారందరికీ కూడా తెలుసు. వాళ్ళంతా చెప్పరా తనే వేగంగా పరిగెత్తగలదని. మళ్ళీ పోటీ ఎందుకు అని పరిగెత్తకుండా దర్జాగా వున్న చోటనే కూర్చుండి పోయింది.

అప్పుడేమవుతుంది?? సహజంగా పోటీలో పరిగెత్తి గమ్యస్ధానం చేరిన తాబేలునే విజేతగా ప్రకటించారు. కుందేలు, దాని తోటి వారంతా పెద్ద ఎత్తున గోల చెయ్యటం ప్రారంభించారు అది అన్యాయమని. పాపం కుందేలు, దాని మద్దతుదారులతో సమానంగా గోల చెయ్యలేని తాబేలు, దాని తోటి వాళ్ళంతా దిగాలు పడ్డారు.. వీళ్ళ గోలకి దడిసి న్యాయ నిర్ణేతలు విజేతల ప్రకటనని ఎక్కడ మారుస్తారోనని.

కానీ వాళ్ళు న్యాయ నిర్ణేతలు కదా సరైన న్యాయం చెప్పారు. అందుకే తమ నిర్ణయాన్ని మళ్ళీ స్పష్టంగా ప్రకటించారు. మేము ఈ పోటీకి న్యాయ నిర్ణేతలం. కనుక న్యాయమే చెప్పాలి. పోటీలో పాల్గొనటానికి వచ్చాక, పోటీ ప్రారంభం అయ్యేలోపలే తనకేమైనా అభ్యంతరాలుంటే చెప్పాలి. ఏ అభ్యంతరాలు చెప్పకుండా, పోటీకొచ్చి కూడా పరిగెత్తకుండా నుంచుంటే, ఇది వరకు ఫలితాలను బట్టిగానీ, వారి సహజ శక్తులను బట్టిగానీ న్యాయ నిర్ణయం జరగటానికి వీల్లేదు. పందెంలో పాల్గొన్నప్పుడు అవతలివారు తమకన్నా తక్కువ అని పోటీ పడకుండా ఆగిపోకూడదు. కుందేలు సహజంగా వేగంగా పరిగెత్తేదయినా, పోటీలో పాల్గొనికూడా పరిగెత్తకుండా ఒకే చోట కూర్చున్నందువల్ల, పోటీలో పరిగెత్తి గమ్యస్ధానం చేరిన తాబేలే విజేత అని మళ్ళీ వివరంగా చెప్పారు.

పాపం! గోల చేసిన కుందేలు, మద్దతుదారులు ఏమీ అనలేక ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయారు. మిగతావారంతా న్యాయ నిర్ణేతల సరైన తీర్పుకు సంతోషించారు.

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here