అన్నమయ్య పద శృంగారం-7

0
13

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

మాళవి

పిలువక వచ్చితిమి పేరటాండ్లము
సొలసి సొలసి మీ పైన సోబాన బాడేము ॥పల్లవి॥
చుక్కబొట్టు పెట్టుకొని సూసరము గట్టుకొని
నిక్కినిక్కిచూచీ నాపై నీదిక్కు
పిక్కటిల్ల నీకు నాపై పెండ్లికూతురాయనో
చొక్కముగ జెప్పవయ్య సోదాన బాడేము ॥పిలు॥
ముప్పిరినవ్వులతోడ ము(ముఁ) జేతికంకణముతో
చిప్పిల నీయెదుటను సిగ్గువడీని
దెప్పరమై తాను గొత్తదేవులు నీకాయనో
చొప్పులె త్తి చెప్పవయ్య సోబాన బాడేము ॥పిలు॥
తాళి మెడగట్టుకొని దైవారా బసపు పూసి
ఆలాయనో తాను అప్పుడే నీకు
యేలితివి వేంకటేశ నన్ను నింతలోనే
సోలి నింకా జెప్పవయ్య సోబాన బాడేము ॥పిలు॥ (53)

భావము: చెలులు నాయకునితో శోభనాలు పాడుతామంటున్నారు. శోభనములు, ధవళములు యక్షగాన సంప్రదాయములోనివి.

ఓ వెంకటేశా! మీ పెండ్లికి పిలువని పేరంటంగా ముత్తైదువలము వచ్చాము. అలసి సొలసిన మేము మీ యిద్దరిపైనా శోభనాలు పాడుతాము. నీ సఖి పెండ్లికి సిద్ధమై చుక్క బొట్టుపెట్టుకొని, తలపై ధరించే తిరుగుడు బిళ్ల (సూసకము) ధరించి నీవైపు నిక్కినిక్కి చూస్తోంది. నీకామె ప్రియమైన పెళ్లికూతురై వచ్చిందేమో నిజం చెప్పవయ్యా! మేము శోభనాలు పాడుతాము. అందమైన నవ్వు మొగంతో, ముంజేతికి కంకణంతో నీయెదుట సిగ్గుల మొగ్గ అవుతోంది. చూడగా ఆమె నీకు కొత్త భార్య అయినదేమో ఆలోచించి చెప్పవయ్యా! మేము శోభనాలు పాడుతాము. తాళి మెడలో కట్టుకొని, అందంగా పసుపు పూసుకొని ఆమె అప్పుడే నీకు భార్య అయినదా! స్వామీ! నన్ను ఇంతలోనే ఏలావు. అసలు విషయం చెప్పవయ్యా! మేము శోభనాలు పాడుతాము. భార్యాభర్తలైనట్లు తిరిగే వారిద్దరినీ చెలులు ఎకసెక్కము లాడుతున్నారు.

వరాళి

ఏమని చెప్పేమయ్యా యివిగో మాభాగ్యాలు
నీమన్ననలే మాకు నిండునిధానాలు ॥ పల్లవి॥
పలుకుబంతముతోను పతిచిత్తము వచ్చితే
వలపు కామధేనువు వనితలకు
పిలిచి మాటాడినప్రియము తంగేటి జున్ను
సెలవులనవ్వులు చేనిపంటలు ॥ ఏమ॥
దయతో ధనమగడు తనవద్దనుండితేను
వయసు కల్పవృక్షము వనితలకు
నయమున జూచేచూపు నమ్మినటువంటి సొమ్ము
రయమున జెనకులే రత్నాభిషేకములు ॥ ఏమ॥
చనవిచ్చి శ్రీవేంకటేశ నీవు గూడితేను
మనసే పరుసవేది మగువలకు
ననుపు నటించి నేడు నన్ను నిట్టె యేలితివి
నినుపులరతులివి నిచ్ఛకల్యాణములు ॥ ఏమ॥ (54)

భావము: పతి తన సతులపై ప్రేమను చూపితే అదే పదివేల వరాలని పలుపలు విధాలుగా నొక్కి చెబుతున్నారు సతులు. శ్రీవేంకటేశ! మేము నీతో ఏమని చెప్పగలమయ్యా! మాభాగ్యాలివే! నీవు ఆదరంగా మమ్మల్ని చూడటమే పెన్నిధి. పతి మనసుపడితే పలుకు పంతమై, ప్రేమ స్త్రీలకు కామధేనువు అవుతుంది. పిలిచి పలకరిస్తే ఆదే తంగేటి జున్ను. పెదవులపై చిరునవ్వులు చేలో బాగా పండిన పంటలు. తన మగడు దయతో తన వద్దనే ఉండిపోతే వనితల వయస్సు కల్పవృక్షం వంటిది. ఆదరంగా చూచిన చూపు నమ్మకమైన ధనము. వేగంగా దరిచేరి తాకడమే రత్నాలతో అభిషేకం చేయించడం. స్వామీ! చనవుగా మాట్లాడి నీవు క్రీడిస్తే నీ భామలకు పరుసవేది. ప్రేమను నటించి నేడు నన్ను ఏలుకున్నావు. సమృద్ధిగానున్న రతులు నిత్యకల్యాణాలు – అని సతులు స్వామికి విన్నవిస్తున్నారు.

దేశాక్షి

ఎట్టుసేసినా జేయు మెన్న నెఱజాణవు నీ-
చుట్టరికమే గురి సుదతిచేతలకు ॥ పల్లవి॥
జలజాక్షిచూపులకు చక్కనినీమేను గురి
పిలిచేవారికిని నీ పేరే గురి
తలపోతలకు నీతగినగుణాలే గురి
చెలులము నేమింత చెప్ప నేమున్నది ॥ ఎట్టు॥
కాంతచన్నులకు నీకందువకాగిలి గురి
బంతి నా పెచేతికి నీపాదాలే గురి
చెంత శిరసుపైకి నీసేసపా లెప్పుడు గురి
వింతలుగా నీకు విన్నవించ నేమిటికి ॥ ఎట్టు॥
అతివరతులకు నీయధరామృతము గురి
మతిలోనియాసలకు మన్ననే గురి
ఇతవై శ్రీ వేంకటేశ యీపె నిట్టె యేలితివి
మితిలేని మహిమ మెచ్చగ మావసమా ॥ ఎట్టు॥ (55)

భావము: తమ సఖికి శ్రీ వేంకటేశ్వరుడే గురి – సమస్త కార్యాలలోను ఆమెకు తానే లక్ష్యమని వివరణాత్మకంగా చెబుతున్నారు. శ్రీ వేంకటేశ నీవు ఎలా వ్యవహరించినా సరే! నీవు నెరజాణవు (నేర్పరివి). మా సఖి చేష్టలకు నీ తోడి చుట్టరికమే గురి. ఆమె చూపులకు అందమైన నీ శరీరమే గురి. ఆమె నోటికి నీ పేరు గురి. ఆమె ఆలోచనలకు నీ సద్గుణాలే గురి. ఆమె చెలులమైన మేము ఇంతగా నీకు చెప్పడానికి ఏమున్నది. కాంత చనుదోయికి ఏకాంతంలో నీ కౌగిలియే లక్ష్యం. ఆమె చేతిలోని చెండుకు నీ పాదాలే గురి. ఆమె శిరస్సు మీదికి నీవు చల్లే సేసలే గురి. ఈ విషయాలన్నీ నీకు వింతలుగా విన్నవించడమెందుకు? ఆమె రతులకు నీ పెదవి అమృతమే గురి. ఆమె మనసులోని పలు విధాలైన ఆశలకు నీ ఆదరమే గురి. ప్రియంగా నీవు ఈ విధంగా ఆమెను ఏలుకొన్నావు. లెక్కలేని నీ మహిమలను పొగడడం మా వశమా? అని చెలులు విన్నవిస్తున్నారు. శ్రీ వేంకటేశుడే ఆమె సర్వస్వం. మనసా వాచకర్మణా త్రికరణ శుద్ధిగా ఆమెకు స్వామియే గురి.

గౌళ

నా మొగము చూచి యేమి నవ్వేవే ఇందుకుగాను
నీ మగనియెదుటను నిలుచుండగదవే ॥ పల్లవి॥
కన్నులు గొప్పలైతే చక్కదనాలకు మేలు
చన్నులు బలిసితేను జవ్వనమునకు మేలు
నిన్ను నీవే యెంచుకొని నీవే సిగ్గుపడితే
కన్నెరో నీపతి వచ్చె గక్కన రావే ॥ నా మొ॥
ముక్కు గొప్పదైతేను మోమునకు సింగారము
నిక్కినకొప్పయితేను నిలువునకు సింగారము
చెక్కు చేతబెట్టుకొని శిరసేల వంచేవే
మక్కువ నీవిభునితో మాటలాడగదవే ॥ నా మొ॥
నిండుబిరుదైతేను నెన్నడిమి కాదరువు
దండియైన మీగాళ్లు తనువు కాదరువు
అండనే శ్రీ వేంకటేశుడంతలోనే నిన్నుగూడె
పండె నీతపము లింక బాదాలకు మొక్కవే ॥ నా మొ॥ (56)

భావము: ముగ్ధయైన తమ సఖి అంగాంగ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆమెతో ఎకసెక్కములాడుతోంది ఓ సఖి.

ఓ సఖీ! ఇందుకుగా నీ మొహం చూచి అలా ఎందుకు నవ్వుతావే! నీ పతి ఎదుట నిలుచోవే. కనులు విశాలమైతే సౌందర్యానికి మేలు. బలిసిన చనుదోయి యవ్వనానికి మేలు. నిన్ను నీవే గొప్పగా భావించి సిగ్గుపడితే ఎలా? ఇదిగో! నీ పతి వచ్చాడు. వేగంగా రా! ముక్కు పొడవైతే ముఖానికే అందం. పెద్దదైన కొప్పు నిండైన శృంగారం. బుగ్గ మీద చేయి పెట్టుకొని తలవంచుకుంటావేమే! ప్రియంగా నీ ప్రియునితో మాట్లాడవే. బలిసిన పిరుదులు అందమైన నడుముకు ఆధారము. బలిష్టమైన మీగాళ్లు శరీరానికి ఆధారము. నీ దగ్గరలోనే వున్న శ్రీ వేంకటేశుడు ఇంతలోనే నిన్ను కలిశాడు. నీ తపస్సు పండింది. ఆయన పాదాలకు మొక్కవే! అని చెలి సరసోక్తులాడుతోంది. పొడవైన కనులు, బలిసిన చన్నులు, నిటారైన ముక్కు, పెద్ద కొప్పు, బలమైన పిరుదులు, దండిమైన మీగాళ్లు శృంగారవతికి అలంకారాలు. అవి అన్నీ ఆ సఖికి అందంగా అమరాయి.

సామంతం

ఎడయ నీచుట్టరిక మెప్పుడు మాకు గలదు.
తడవితే నానందము దైవారునే ॥ పల్లవి॥
ననిచినచోటను నాటుకొను నేస్తము
తనిసినచోట నుండు తాలిములు
కనుగొనేచోట నిండు కడలేనియాసలు
పెనగబోతే వలపు పిప్పిగట్టునే ॥ ఎడ॥
తగులుగలుగుచోట తమకము లుప్పతిల్లు
సొగసినవావులైతే సొంపురేగును
మొగమోటగలచోట నగవులు తానే వచ్చు
యెగసక్కెమైతే మన సెరపులానే ॥ ఎడ॥
చెలగి కూడేటిచోట సిగ్గులు తానే విడు
వలెనని కాచితేనే వాడికలను
యెలమి శ్రీ వేంకటేశు డింతలోనె నన్ను గూడె
బలిమి సేసితే రతి పచ్చి దేరునే ॥ ఎడ॥ (57)

భావము: సఖి వలపు తలపులను చెలి వివరిస్తోంది.

ఓ సఖీ! నీతోడి చుట్టరికము మాకు ఎల్లవేళలా వుంటుంది. అవి నెమరువేసుకొంటే ఆనందం కలుగుతుంది. అనురాగం వున్న చోట స్నేహం నాటుకొంటుంది. తృప్తి చెందిన చోటనే క్షమించడం జరుగుతుంది. చూచే చోటనే అంతులేని నిండు ఆశలు ఉంటాయి. పెనగులాడితే ప్రేమ పిప్పిగడుతుంది. స్నేహం వున్నచోట మోహం పుడుతుంది. అందంగా వావి వరుసలు కలిస్తే శృంగారం ముదురుతుంది. మొహమాటం వున్న చోట తమంత తామే నవ్వులు పుడతాయి. ఎకసెక్కంగా మాట్లాడితే మనసు విరిగిపోతుంది. కలిసి క్రీడిస్తే సిగ్గులు వాటంతట అవే వీడిపోతాయి. కావాలని ఎదురుచూస్తేనే అలవాటవుతుంది. శ్రీ వేంకటేశుడు ఇంతలోనే నన్ను కూడాడు. బలవంతపెడితే రతి ముదరదు – అని చెలి తన సఖిన్ని రతికి ఉన్ముఖం చేస్తోంది.

కా(కాం)బోది

ఏమిదపము సేసెనో యీతడు నీకుగా దొల్లి
ప్రేమతోడ నురమున బెట్టుకున్నా డిపుడు ॥ పల్లవి॥
పండువెన్నెలబయలు పడతి నీ నవ్వు మోము
కొండలవేటపొలము గొప్పచన్నులు
పండెడిపూబొదవిల్లు బాహులతలకాగిలి
అండ నీపతిభాగ్య మేమని చెప్పేమే ॥ ఏమి॥
పొత్తులభోజనసాల పొలతి నీవదనము.
హత్తిన కొలువుకూటాలాయ దొడలు
గుత్తపు సాముకంబము కోమలమైనగళము
ఇత్తల నీరమణుడు ఇన్నిటాను ఘనుడే ॥ ఏమి॥
వాటపుబెండ్లిచవికె వనిత నీపిరుదు
మేటి రాజ్యపదవి నీమేనల్లాను
యీటున శ్రీ వేంకటేశు డింతలోనె నిన్నుగూడె
బోటి నీవిభు గీతని బొగడగ వసమా ॥ ఏమి॥ (58)

భావము: ఓ భామా! నీ విభుడు పూర్వజన్మలో నీ కోసం ఎంతటి తపస్సు చేశాడో గదా! ప్రేమతో నిన్ను గుండెపై ఈ జన్మలో పెట్టుకొన్నాడు. ఆ వనిత అంగాంగ వర్ణనను కవి సమయాలతో పోలుస్తోంది. ఓ పడతీ! నీ నవ్వుల మొహము పండువెన్నెల నాటి బయలుగా వుంది. నీ బలిష్ఠమైన చన్నులు కొండలలో వేటాడే విశాలమైన పొలము. నీ బాహువులనే లతల కౌగిలి పూచిన పూపొదరిల్లు. అట్టి నిన్ను పొందిన నీ భర్త అదృష్టమేమని చెప్పగలము? నీ ముఖము స్నేహంగా చేసుకొనే భోజనశాల. నీ తొడలు దగ్గరగా వున్న కొలువుకూటాలు. సున్నితమైన నీ కంఠము అందమొలికే శంఖము. నీ ప్రియుడు అన్ని విధాలుగాను గొప్పవాడు. బలిష్ఠమైన నీ పిరుదు తీర్చిదిద్దిన పెండ్లి పీట. నీ శరీరమంతా గొప్పదైన రాజ్యపదవితో సమానము. ఇంతలోనే శ్రీ వేంకటేశుడు నీతో క్రీడించాడు. ఓ వనితా! నీ విభుడైన ఇతనిని పొగడడం మా చేతనవుతుందా? అని చెలులు తమ సఖి అద్భుత శరీరంగాలను ఉపమిస్తున్నారు.

కురంజి

వాకిలి గాచుకొనివుండే వనితలము నేమెల్లా
చేకొని వేళయైతే జెప్పేము గాని ॥పల్లవి॥
మేడలో దేవులుదాము మెరసి మాటలాడేరు
వేడుకతో సవతులు వినబోకురే
కూడిమాడి నవ్వుకుంటా గూచున్నాడు నాయకుడు
చూడకురే యీదిక్కు సుదతులాల ॥ వాకి॥
పానుపుపై నుండి వారే బాగాలు వేసుకునేరు
కానుక లిచ్చేమంటా దగ్గరబోకురే
ఆనుక పూవులవేట్లాడేరు కొప్పులు జార
పానిపట్టి రొదసేసి పరాకు సేయకురే ॥ వాకి॥
లలి శ్రీ వేంకటేశు డలమేల్మంగా గూడున్నారు
బలిమితో లోనికి గొబ్బన బోకురే
పిలిచే రదివో మిమ్ము బ్రియములతో దామే
సలిగెగలవారలు సందడించకురే ॥ వాకి॥ (59)

భావము: వేంకటేశ్వరుడు అలిమేలుమంగ ఏకాంతంలో కూడి వున్నపుడు బయట వున్న చెలులు వారి సఖ్యాన్ని చెడగొట్టకూడదని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. వారంతా ద్వారపాలకులవలె వాకిటి ముందు కాచుకొని వుండే వనితలు. మేమంతా వాకిటి కావలివారము, ఏకాంతానికి వేళ అయితే చెప్పగలవారము. ఏమమ్మా! చెలులారా! పైన మేడమీద దేవేరి, తాను కలిసి ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఓ సవతులారా! మీరు వారి రహస్య సంభాషణలు వినగూడదు సుమా! మా నాయకుడు ఆమెతో సరససల్లాపలాడున్నాడు. ఓయమ్మా! మీరు ఆ దిక్కువైపు చూడకండి.

శయనగృహంలో పడక పైనున్న వారిద్దరూ తాంబూలాలు యిచ్చి పుచ్చుకుంటున్నారు. మీరు కానుకలిస్తామంటూ వారి దగ్గరకు వెళ్లకండి. వారిద్దరూ సన్నిహితంగా చేరి కొప్పులు జారుతుండగా పూలబంతులు విసురుకుంటున్నారు. మీరు పనిగట్టుకొనివెళ్లి రచ్చచేసి వారికి పరాకు తెప్పించకండి. శ్రీవేంకటేశ్వరుడు, అలమేలుమంగ కలిసి మెలిసి వున్నారు. మీరు బలవంతంగా తొందరపడి లోపలి కెళ్లకండి. వారిద్దరే మిమ్ములను ప్రియంగా పిలుస్తున్నారు. ఆశ్రయించిన మీరు సందడి చేయవద్దు.

సతీపతుల ఏకాంతాన్ని భంగం చేయవద్దని హెచ్చరికలు చేస్తున్నారు.

దేసాళం

నేనేమి యెఱుగుదు నీసేవ సేసేదాన
మోనముతోనే పొగడి మొక్కేమయ్యా ॥ పల్లవి॥
చెప్పరానిమాటలు చెవులొగ్గి వినరాదు
విప్పరానిముడియలు విడువరాదు
చొప్పులెత్తరానిసుద్దులు నీకే తెలుసు
అప్పటి నాతో నేమి ఆనతిచ్చేవయ్యా ॥ నేనే॥
చూపరానిసొమ్ముల మించుకన్నుల జూడరాదు
ఆపరానిగుణముల నణచరాదు
నీపొందులవేడుకలు నెమ్మది నీకే తెలుసు
యీపొద్దు నాకానతిచ్చే విది యేమయ్యా ॥ నేనే॥
పట్టరాని నీచిత్తము పై కొని చెయిచాచరాదు
ముట్టరాని నీనవ్వు ముడువరాదు
యిట్టె శ్రీ వేంకటేశ యేలితివి నం(న)న్ను నేడు
గుట్టెల్లా నానతిచ్చేవు కొంక కిదేమయ్యా ॥ నేనే ॥ (60)

భావము: ముగ్ధ అయిన కాంత స్వామికి తన బాధ విన్నవించుకొంటోంది. ఓ వేంకటేశ! నీ సేవ నిత్యం చేసే దానిని. నాకేమీ తెలియదు. మౌనంగా నిన్ను పొగడి నీకు మొక్కుతున్నాను. బహిరంగంగా చెప్పరాని మాటలు ఆసక్తితో వినరాదు. విప్పరానటువంటి ముడులు విడిచిపెట్టగూడదు. జాడ తెలియని సుద్దులు నీకే తెలుసు. అప్పట్లో నాతో నీవు ఏమి చెప్పావు స్వామీ! చూపలేని సొమ్ములను ఆసక్తితో చూడరాదు. ఆపలేని లోలోపలి గుణాలను అదిమి పెట్టరాదు. నీతోడి రతి వేడుకల సౌఖ్యము నీకే తెలుసు. ఈ వేళ నాకు ఇలా చెబుతున్నావేమయ్యా! అదుపులో లేని నీమనసుతో చేయి చాచకూడదు. ముట్టుకోలేని నీ నవ్వులు ముగించకూడదు. ఓ స్వామీ! నన్ను ఈనాడు ఏలుకున్నావు. ఏ మాత్రము భయపడకుండా నీ రహస్యాలన్నీ చెప్పావు. ఇదేమి చందమయ్యా. తనపట్ల ప్రేమాభిమానాలు చూసే పతి సౌభాగ్యాన్ని కాంత విన్నవిస్తోంది.

దేసాళం

అప్పుడుగాని నీయాసోదము దీరదు
ముప్పిరి నీవు కొంగులు ముళ్లు వేసుకోవయ్యా ॥ పల్లవి॥
వినేవు విన్నపములు వేడుకతో మఱవక
వనితమాటలు నీవు వా(వ్రా?) సుకోవయ్యా
యెనలేక చూచేవు యేపొద్దు నాపెమోము
గొనకొని లక్కబడెచ్చున వేసుకోవయ్యా ॥ అప్పు॥
వొప్పుగ నాపెచన్నులు వూరక పట్టిచూచేవు
గొప్పలెంతలేశో కొల్చుకోవయ్యా
యెప్పుడు నాపెగుణాలే యెంచేవు సారెసారె
తప్పక నీమనసులో దాచుకోవయ్యా ॥ అప్పు॥
చేరి నీపాదా లాపెచేత గుద్దించుకొనేవు
కోరి యట్టె కాగిలించుకొనవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేడు
సారపునామోవితేనె చవిచూడవయ్యా ॥ అప్పు॥ (61)

భావము: శ్రీ వేంకటేశునితో సఖి తన నాయిక పట్ల విభుని ఆసక్తిని వివరిస్తూ ఆమెను వివాహం చేసుకోరాదా? అని హెచ్చరిస్తోంది.

ఓ స్వామీ! ప్రేమతో నీవు ఆమె మెడలో మూడుముళ్లు వేస్తే తప్ప, నీ ఆశ తీరదు. నేను చేసే విన్నపాలు సరదాగా మరిచిపోక విని, మా సఖి చెప్పే మాటలు గుర్తుగా వ్రాసుకోవయ్యా! అన్ని వేళలా ఆమె ముఖసౌందర్యాన్ని తృప్తిలేక చూస్తున్నావు. ఆ ముఖాన్ని లక్క అచ్చు ముద్ర తీసుకోవయ్యా! ఆమె చన్నులు మాటిమాటికీ పట్టి చూస్తున్నావు. ఎంత బలిష్ఠమైనవో కొలతలు వేసుకోవయ్యా! పలుమార్లు ఆమె గుణగణాలే లెక్కిస్తున్నావు. వాటిని తప్పకుండా నీ మనసులోనే దాచుకోవయ్యా! ఆమెకు దగ్గరగా చేరి ఆమెచేత పాదాల పట్టించుకొంటున్నావు. కోర్కెతో కౌగిలించుకోవయ్యా! ఈ విధముగా నన్ను ఈనాడు ఏలుకున్నావు. మధురమైన పెదవి తేనె రుచి చూడవయ్యా (నా పెదవి అనగా నాయిక పెదవి).

హిందోళం

ఎటువంటి జాణతన మిది మేలయ్యా
మట(టు?)మాయచేతలనే మచ్చిక చూపేవు ॥ పల్లవి॥
తేరకొన జూచితేనే దిష్టిదాకెనంటాను
కోరి కొంగువట్టేవు కొమ్మను నీవు
మేరతో నవ్వుకొంటేను మీదజల్లె వలపంటా
గోరనంటి చెక్కు నొక్కి గురుతు సేసేవు ॥ ఎటు॥
సంగడికి నచ్చితేనే చన్నులు దాకించెనంటా
యెంగిలి సేసేవు మోవి ఇంతలో నీవు
చెంగట మాటాడితేనే చిత్తము గరచెనంటా
కెంగేల సంగములు గిలిగించేవు ॥ ఎటు॥
ఆకుమడిచిచ్చి తేనే ఆసలు రేచెనంటా
కైకొని నీపచ్చడము గప్పేవు నీవు
యీకడ శ్రీ వేంకటేశ యింతి నిట్టె యేలితివి
దీకొని మొక్కితే నీకు దేవులంటా మెచ్చేవు ॥ ఎటు॥ (62)

భావము: శ్రీ వేంకటేశుని జాణతనాన్ని సఖి వివరంగా వెల్లడిస్తోంది. ఓ వెంకటేశ! నీవు చూపే జాణతనం ఎటువంటిది? ఇది నీకు మేలా? నీ మోసకారి చేష్టలతో ప్రియురాండ్రను మచ్చిక చేసుకొంటావు. నీవైపు తేరిపార జూచితే చాలు దిష్టి తగులుతుందట. ఏరికోరి మా సఖి కొంగు పట్టుకొంటావు. తన హద్దులో తాను నిలిచి నవ్వుకొంటే చాలు- నీ ప్రేమను వొలకబోస్తావు. నీ కొనగోటితో బుగ్గలపై నొక్కి గుర్తు పెడుతున్నావు. నీ దగ్గరకు వస్తేనే చాలు చనుదోయి పట్టుకొంటావు. ఇంతలోనే నీవు పెదాలు ఎంగిలి చేసేశావు. దగ్గరగా వచ్చి మాట్లాడితేనే చేతిలో శరీరావయాలను గిలిగింతలు పెడతావు. తాంబూలం మడిచి ఇస్తే ఆశలు రేపుతావు. పరుపు మీదపరిచే దుప్పటి కప్పుతావు. ఇక్కడ ఓ స్వామీ! నీవు మా భామను ఏలుకున్నావు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here