[dropcap]ఉ[/dropcap]పనిషత్ అంటే ఉప+నిషత్ గురువుకు సమీపముగా నుండి విచారించుట – అని అర్థము. ఉపనిషత్ విచారణ క్రమంలో ముఖ్యమైన అంశం గురువుగారు చెప్పినదానిని చెప్పినట్లుగా స్వంత బుద్ధి, తర్కం ఉపయోగించకుండా ఆచరించటం. అన్ని రకాలుగా శరణాగతులైనటువంటి శిష్యులకు మాత్రమే ఉపనిషత్ విచారణ సాధ్యం అని ఉపనిషత్తులలో స్పష్టంగా చెప్పబడింది. అటువంటి ఉపనిషత్తులలో అతి ముఖ్యమైనది, అతి నిగూఢమైనది, ఉపనిషత్తులలో అగ్రతాంబూలం అందుకున్నది కఠోపనిషత్తు.
మృత్యుదేవత అయినటువంటి యమునకు, ఆశ్రయించినటువంటి నచికేతునకు మధ్య జరిగినటువంటి సంవాద రూపమే ఈ కఠోపనిషత్తు. నచికేతుడు యమధర్మరాజు తనకు ఇస్తానన్న మూడు వరములలో, మూడవ వరముగా మానవుడు మరణించిన తర్వాత అతడు ఇంకొక రూపంలో వుంటాడని కొందరు, ఉండడని కొందరు చెబుతున్నారు. ఈ అంశంలో నిజమేమిటో, అందులో వున్న తత్వం ఏమిటో చెప్పవలసిందని కోరాడు.
దీనికి సమాధానముగా అనేక ఉపమానములతో ఈ ఉపనిషత్‌ను యముడు నచికేతునకు వివరించి చెప్పాడు. అయితే యమధర్మరాజు నచికేతుడు అడిగిన వెంటనే ఆత్మతత్వమును బోధించకుండా అతనిని అనేక ధన కనక వస్తు వాహనాదులను ఇస్తానని అనేక ప్రలోభములకు గురిచేసి, వాటన్నిటికీ నచికేతుడు లొంగక ధృఢ నిశ్చయంతో వున్నాడని ధృవపరచుకున్నాక అతని అర్హతను గుర్తించి అప్పుడే ఆత్మను గురించి బోధించాడు. ఈ ఉదంతం ద్వారా వైరాగ్యము, వివేకం, పవిత్రమైన నడవడిక మొదలగు అర్హతులున్నవారే బ్రహ్మజ్ఞానమునకు అర్హులని యమ ధర్మరాజు పరోక్షంగా ప్రబోధించాడు.
కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ శాఖలో ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. ఆత్మజ్ఞానం గురించి అనేక నిగూఢమైన రహస్యాలు వున్నందున ఈ ఉపనిషత్‌ను స్వయంగా చదివి అర్థం చేసుకోవడం అతి కష్టమని కాబట్టి ఒక పండితుడు లేక సద్గురువు ముఖతః మాత్రమే ఈ ఉపనిషత్‌ను నేర్చుకోవాలని ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం.
ఈ ఉపనిషత్తులో ఒక ముఖ్యమైన నీతి: దానమిచ్చే సమయములో మన వద్దనున్న వానిలో మంచివి, గ్రహీతకు ఉపకరించేవి మాత్రమే ఇవ్వాలి. ఇదే ఉత్తమ దానము యొక్క లక్షణము. పితృవాక్యపాలనము తనయుల ప్రథమ కర్తవ్యము. అంతేకాక తండ్రి అడుగకుండానే తండ్రికి హితవు చేయాలని తపించేవాడు ఉత్తమ పుత్రుడు అంటూ ఉత్తమ పుత్రుని లక్షణాలను ఈ ఉపనిషత్తు తెలియజేసింది.
Image courtesy: Internet