నువ్వూ అమ్మవే

1
3

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘నువ్వూ అమ్మవే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“మా[/dropcap] అత్తగారి మాటలు వినటానికి బాగా ఆత్మీయంగా వుంటాయి. ఆవిడ అందరితోనూ చాలా, ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఇంట్లో మాత్రం మా మామగారి మాటే చెల్లుబాటవుతుంది. మా ఆయనా, మా మరిదీ ఇద్దరూ కూడా తల్లిదండ్రుల మాటలకు బాగా విలువిస్తారు. మన ఇంట్లో పద్ధతులకూ, మా అత్తగారింట్లో పద్ధతులకూ కాస్త తేడా వున్నది. అమ్మా! నువ్వు మా సత్యనారాయణ స్వామి వ్రతాని కొచ్చినపుడు మా ఇల్లంతా పరీక్షగా చూశావా? మూడు బెడ్‌రూమ్‌లతో, పెద్ద హాలూ, వరండా, సిట్ అవుట్ బాగా పెద్దిల్లు, బాగుంది కదూ? ఇంటి చుట్టూ రకరకాల మొక్కలూ, చెట్లూ, ఇంట్లో బాగా చల్లగా ఉన్నది. వ్రతానికొచ్చిన మన చుట్టాలందరికీ కూడా మా అత్తారిల్లు బాగా నచ్చినట్లున్నది. నా దగ్గర తెగ మెచ్చుకున్నారు. మా ఇంట్లో ప్రతిపూటా భోజనానికి అందరం ఒకేసారి కూర్చోవాలి. అందరి భోజనాలయ్యే దాకా, ఎవరూ లేవకూడదు. అన్నాలు తిన్నాక ఎవరి ఎంగిలి పళ్లెం వాళ్లే తీసుకెళ్లి కుళాయి కింద పైపైన తొలిపి ఆ తర్వాతే కడగటానికి పనివాళ్లకివ్వాలి. మొదటిరోజు నాకు తెలియక, నా ప్లేట్ టేబుల్ మీదే వదిలేసి, ముందుగా లేవబోయాను. అత్తగారు అందరిదయ్యేదాకా కూర్చోమన్నారు. ప్లేట్ తియ్యమని రాజేష్ కళ్లతో సైగచేసి చూపించాడు. అమ్మా! మనింట్లోలాగా ప్రతి పనికీ వాళ్లు పనివాళ్ల మీద ఆధారపడరు. మనం చేసుకోదగిన పనుల్ని మనమే చేసుకోవాలంటారు. మా ఆయన కూడా పనిమనిషిని, పనిమనిషి అనరు. ‘అమ్మా నీ అసిస్టెంట్ ఈ పనిచేసి పెడ్తుందా’ అని మాత్రమే అడుగుతాడు, మొత్తానికి వాళ్లింట్లో సందడిగా బాగానే ఉన్నది” అని ఎంతో ఉత్సాహంగా రమ్య మాట్లాడింది.

“అబ్బో! అప్పుడే అక్క తన అత్తారింటిని తెగ మెచ్చేసుకుంటున్నది. చూడబోతే అక్కకు ఇక్కడి కన్నా, అక్కడే బాగున్నట్లున్నది” అన్నది రమ్య చెల్లెలు భవ్య.

“నిజం భవ్యా! వాళ్లందరూ చాలా మంచివాళ్లలాగానే వున్నారు. మా మరిది కూడా చాలా సరదాగా వుంటాడు. అన్నదమ్ములిద్దరూ బాగా చనువుగా, ప్రేమగా వుంటారు. అన్నదమ్ములేంటి? వాళ్ల నాన్నగారితో కూడా అలాగే చనువుగా ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్లీగా వుంటారు. ఒకరితో ఒకరు సరదాగా జోక్సు కూడా వేసుకుంటారు తెల్సా”.

“అబ్బ చాల్లే నీ పొగడ్తలు. కొత్తల్లో అంతా బాగానూ, అందరూ మంచివాళ్లలాగానే కనపడతారు. పోనుపోను గాని ఎవరి స్వభావమెలాంటిదో తెలియదు. ఎందుకైనా మంచిది. నువ్వు మరీ మెత్తనిదానిలాగా వుండకు, చెవులు పట్టి ఆడిద్దామనుకుంటారు. రాజేష్ నిద్ర లేచాడేమో చూడు. టిఫిన్ చేద్దురుగాని” అన్నది తల్లి జగదీశ్వరి.

“బావగారు తినే పలహారంలో కొంత ఉప్పుకశంగాను, మరికొంత కారంపుట్టగానూ, చేస్తే పోలా” అన్నది భవ్య.

“ఏం వద్దు. అలా ఏం చేయకు. తను మధ్యాహ్నం కూడా సరిగా భోజనం చేయలేదు” అంటూ చెల్లెల్ని వారించింది.

అప్పుడే అక్కడి కొచ్చిన రవీంద్రగారు కూతుళ్ల మాటలు విని నవ్వారు. “నీకే మాత్రం ఛాన్సివ్వదు భవ్యా. బావగారిని నువ్వేం అల్లరి పెడతావోనని అక్క వెయ్యి కళ్లతో కాపలా కాస్తుంది. పెళ్లయితే చాలు. ఆడపిల్లలు ఎంతగానో మారిపోతారు. రేపు నువ్వూ అంతే” అన్నారు.

రాజేష్ తమింటి అల్లుడయ్యాడు కాబట్టి తమింట్లో ఒక సభ్యుడు అయ్యాడు. ఇంకా చెప్పాలంటే అల్లుడు తమవాడుగానే వుండాలని జగదీశ్వరి, రవీంద్రల అభిప్రాయం.

“బావగారూ! అస్తమానం మీ ఆవిడ ఎదురుగా గదిలోనే ఏం కూర్చుంటారు? గది దాటి బయటకు రండి. మా ఊళ్లో చూడదగ్గవి చాలానే వున్నాయి. అక్కా మీరు, కలిసి వెళ్లండి. మీ మధ్యలో నేను కూడా వుంటానండోయ్. కాస్త నాలుగు చోట్లకూ తిరిగొద్దాం పదండి” అంటూ భవ్య అల్లరి చేసేది. రాజేష్ నవ్వుకుంటూ లేచొచ్చేవాడు. ఇక్కడో మూడు రోజులు గడిపి మరలా రాజేష్ వాళ్ల ఊరు వెళ్ళారు. తమింట్లోని ఎ.సి. కన్నా అత్తగారింట్లోని వాతావరణపు చల్లదనం, మనుషుల మృదు స్వభావం బాగా హాయిగా అనిపించాయి రమ్యకు.

ఇంకో రెండు రోజుల్లో రాజేష్ పెట్టుకున్న శెలవు అయిపోతుంది. పెళ్లి కుదరగానే రమ్య తను పనిచేసే కాలేజీలో రాజీనామా ఇచ్చేసింది. రాజేష్ త్రివేండ్రం వెళ్లిపోతాడంటే రమ్యకు చాలా బెంగగా అన్పిస్తుంది. ఆ మాటే భర్తతో అన్నది.

“నాకూ అలాగే వున్నది స్వీటీ. మన పెద్దవాళ్లను ఒప్పించి ఈ నెలలోనే మనం త్రివేండ్రంలో కాపురం పెట్టేద్దాం. నువ్వక్కడికి రావటానికి సిద్ధంగా వుండు. అమ్మా వాళ్లు మంచి రోజులు కావాలంటారు. అవెప్పుడో త్వరగా, చూడమంటాను. అందమైన భుజాలు నీవి. నాజూకైన చేతులు. ఆ చేతులకు ఈ రంగురంగుల గాజులు ఎంత బావున్నాయో” అంటూ రమ్య చేతి గాజుల్ని సుతారంగా సవరించసాగాడు. రాజేష్.

“కొసతేలిన ముక్కు, ఆ ముక్కుకటూ ఇటూ పెద్ద కళ్లూ, కళ్ల పైన వత్తైన కనుబొమ్మలు, నొక్కుల నొక్కుల చక్కని జుట్టు నీది రాజేష్” అంటూ అతని జుట్టులోకి వేళ్లుపోనించి ఆడుకోసాగింది రమ్య.

“స్వీటీ! భార్య సాహచర్యం ఇంత ఆనందాన్నిస్తుందని తెలియక ఇన్నాళ్లూ, పెళ్లిని వాయిదా వేశాను. నీ తర్వాత, తమ్ముడున్నాడు. వాడికీ ఉద్యోగం వచ్చింది. తనకీ పెళ్లి చేయాలని అమ్మా, నాన్నా, గట్టిగా చెప్తే సరేనని నిన్ను చూడటానికి వచ్చాను. వెంటనే మనిద్దరికీ పెళ్లి జరిగింది. ఇంకా ఆలస్యం చేస్తే నిన్ను దక్కించుకునేవాడిని కాదేమో” అన్నాడు రాజేష్ పరవశంగా భార్యను దగ్గరగా పొదువుకుంటూ. రమ్య కూడా గువ్వపిట్టలా భర్త కౌగిలిలో ఒదిగిపోయింది.

***

రాజేష్ త్రివేండ్రం బయలుదేరాడు. “రమ్యా! అమ్మావాళ్లకు నిన్నింకా కొద్ది రోజులు ఇక్కడే వుంచుకోవాలని వున్నది. వుండిపోవచ్చుగా?” అన్నాడు.

సరేనని అక్కడే వున్నది రమ్య. కాని తల్లిదండ్రులిద్దరూ వెంటనే ఫోన్ చేశారు.

“రాజేష్ వెళ్లిన తర్వాత నువ్వు ఒక్కదానివీ అక్కడుండి ఏం చేస్తావు? కారు పంపిస్తాం. వెంటనే వచ్చేసేయ్. మీ అత్తగారికి కూడా ఫోన్ చేస్తాం” అంటూ వెంటనే కారు పంపారు.

“నువ్విలా నట్టింట్లో తిరుగుతుంటే మా ఇంటి ఆడపిల్లే ఇంట్లో వున్నట్లుగా వున్నది. ఇంకో నాలుగురోజులు వుంటావు అనుకున్నాను” అన్నారు అత్తగారు కాస్త బాధగా. మామగారు సర్ది చెప్పారు. ఆయనకు, తమ్ముడి కొడుకు వరుసయ్యే అతనిని పిలిపించారు. రమ్యను జాగ్రత్తగా వాళ్ల ఊర్లో దింపి రమ్మని, చెప్పారు. తోటలో పండిన అరటిపండ్ల గెల, పచ్చివీ, ఎండువీ కొబ్బరిబొండాలు, కంద, పెండలం, పసుపు కొమ్ములు పెరట్లో కాసిన కూరగాయలు, నిమ్మకాయలు, సపోటాలు, ముఖ్యంగా కమ్మని వాసన వేస్తున్న కరివేపాకుతో సహా కోయించి కారులో పెట్టించారు. అత్తగారు బొట్టుపెట్టి కొత్త చీర ఇచ్చి కట్టుకోమన్నది. తల్లో మరువము, కనకాంబరాలూ కలిపి కట్టిన మాలను తురిమింది. మళ్లీ త్వరగా వస్తానని చెప్పి రమ్య బయలుదేరింది.

అత్తవారింటి దగ్గరనుంచి వచ్చిన రమ్యను చూసి తల్లి ముఖం చిట్లించింది. “ఏంటలా నాటు దొరసానిలా తయారయి వచ్చావు. ఆ చీరేంటీ? ఆ జడేంటి? ఆ పూలచెండేమిటి? కళ్లనిండా కాటుక పులువుకుని, కాసంత కుంకుమ కూడా మెత్తుకుంటే ఇంకా బాగుండే దానివి” అంటూ రుసరుసలాడింది.

“అమ్మ కరెక్ట్‌గా చెప్పిందక్కా ఆ గళ్లచీర, అందునా ధర్మవరం పట్టుది, కట్టుకుని మరీ వచ్చావు. ఆవిడిస్తే మాత్రం నీ సూట్‌కేస్ అడుగున వేసెయ్యకుండా భద్రంగా కట్టుకున్నావు. అందరూ డిజైనర్ శారీస్ వాడే ఈ కాలంలో ఇలాంటి వాళ్లు నీకెక్కడ దొరికారక్కా? వట్టి నాటు రకాల్లాగా వున్నారు” అన్నది భవ్య.

“వట్టి పల్లెటూరి రకాలు. పల్లెటూరి టేస్టులు. ఏదో రాజేష్ మంచి జాబ్ చేస్తున్నాడని ఈ సంబంధాని కొప్పుకున్నాం గాని లేకపోతే ఈ ఊరివంక, ఆ మనుషుల వంక కన్నెత్తి గూడా చూసే వాళ్లం గాదు” అన్నది జగదీశ్వరి చులకనగా.

తన అత్తగారి తరుపు వాళ్లను అలా తేలిగ్గా తీసెయ్యటం రమ్యకు కాస్త కష్టమనిపించింది.

***

త్రివేండ్రంలో రమ్యా వాళ్ళ కాపురం పెట్టుకున్నారు. అటు వైపు వాళ్లూ, ఇటువైపు వాళ్లు ఫోన్లు, చేస్తూనే వున్నారు. రమ్యకు రాజేష్ సాహచర్యంలో రోజులు వేగంగా గడిచిపోతున్నాయి.

“రమ్యా! నువ్వు బిటెక్ పూర్తి చేశావు, బొత్తిగా ఆ సంగతి మర్చిపోయావు. పక్కా ఇల్లాలిగా, మారిపోయావు, ఏదన్నా జాబ్‍లో చేరాలన్న ప్లాన్ చేస్తున్నారా లేదా! బొత్తిగా ఇల్లో నారాయణమ్మలాగా తయారవకు, సంపాదించిన డిగ్రీని ఉపయోగించుకో. దూరం పోవటం ఇష్టం లేకపోతే అక్కడే ఏదన్నా ఉద్యోగం చూసుకో.” అంటూ తరచుగా జగదీశ్వరి చెప్పేది.

ఆ రోజు కూడా ఫోన్ చేసి అదే ధోరణిలో మాట్లాడసాగింది. “అమ్మా! కాస్త నన్ను కూడా మాట్లాడనిస్తావా?” అన్నది రమ్య,

“ఏం మాట్లాడతావో మాట్లాడు. మీ నాన్నగారు ఇక్కడే వున్నారు.” అంటూ ఫోన్ భర్తకిచ్చింది.

“రమ్యా! బాగున్నావా? రాజేష్ నిన్ను మరీ బొమ్మలాగా చేసి ఆడిస్తున్నట్లుగా అన్పిస్తుంది. నీ భర్త ఏది చెప్తే నీకదే వేదవాక్యయింది. అతని ప్రతిమాటకూ వంత పాడటం రాదు. నీ వ్యక్తిత్వం నువ్వు కాపాడుకో, నిన్ను ఇంట్లోనే వుంచి చాకిరీ చేయించాలనుకుంటున్నాడనిపిస్తుంది. తనకు వేళకు అన్నీ అమర్చిపెట్టే భార్య రావాలంటే ఏ చదువు రాని మొద్దునో కట్టుకుంటే పోయేది” అన్నారు రవీంద్ర విసుగ్గా.

“రాజేష్ నన్నేం ఇంట్లో బంధించి వుంచాలనుకోవటం లేదు నాన్నా. కాకపోతే ఇక్కడిప్పుడు ముఖ్యంగా ‘ఇస్రో’ పరిధిలో నేను చేయదగ్గ ఉద్యోగం లేదని చెప్తున్నారు. నేను ఇప్పుడిప్పుడే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాను. కొద్ది రోజులు పోయిన తర్వాత మరేదైనా ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా చేస్తాను. వుంటాను నాన్నా” అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య.

అప్పుడప్పుడూ ఫోన్ చేసి జగదీశ్వరి తన ధోరణిలోనే చెప్తూ వుండేది. “ఫోన్ చేసినప్పుడు కూడా ప్రేమను కురిపిస్తూ మాట్లాడి వుంటావు. అందుకే మీ అత్తామామ నీ ఇంటి కొచ్చిపడ్డారు. వాళ్లతో వీలైనంత బెట్టుసరిగా వుండాలని ఎంత చెప్పినా నీకు తలకెక్కటం లేదేంటి రమ్యా? ‘ఎత్తు నేర్చిన బిడ్డ మొత్తుకున్నా చంక దిగదని’ సామెతుంది. నీ పని కూడా అలాగే తయారవుతుంది. నువ్విలా ఇంట్లో పడి వుండి వంటలక్కలా మారిపోతున్నావని మీ నాన్నగారు కూడా చాలా బాధపడుతున్నారు. ఎంత కష్టపడి పెంచాం. నువ్వు కోరిన చదువు చెప్పించాం. మా కూతురు ప్రయోజకురాలైతే చూసుకోవాలని మాకు మాత్రం వుండదా? పెళ్లిచూపులప్పుడే స్పష్టంగా చెప్పాం. మా అమ్మాయి ఉద్యోగం చెయ్యాలని, అప్పుడు సరేనన్నాడు రాజేష్, ఇప్పుడేమో తను పనిచేసే చోట నీకు పెద్దగా అవకాశాలు లేవని చెప్తున్నాడు. నువ్వది నమ్మావు. అవకాశమున్న చోట నిన్ను చేర్పించాలి. లేదా నిన్ను ‘ఏరోస్పేస్’ ఇంజనీరింగ్ మాస్టరు డిగ్రీ చేయించొచ్చుగా. అప్పుడు నువ్వు కూడా అతనితో పాటు ‘ఇస్రో’లోనే చేరొచ్చు” అన్నది అనర్గళంగా. ఈ డిగ్రీ సంగతి నాన్నగారు చెప్పి వుంటారు. దాన్ని అమ్మ నాకు చెప్తున్నది అనుకుంటూ రమ్య తన మాటలు మొదలు పెట్టింది.

“అమ్మా! నా కసలు ఈ ‘ఏరోస్పేస్’ రంగమంటేనే ఆసక్తిలేదు. అంటే ఆ డిగ్రీ తీసుకోవటం ఇష్టం లేదంటున్నాను. ఇక్కడ ఇస్రోలో జరిగే పనుల గురించీ, పరిశోధనల గురించీ రాజేష్ చెప్తుంటే వినడానికి, బాగానే వుంటుంది. కాని మళ్లీ నేను ఏ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సు’ లోనో కష్టపడి చేరి, ఆ తర్వాత ఇంకా కష్టపడి మాస్టర్స్ డిగ్రీ చెయ్యాలని మాత్రం అస్సలు అనుకోవటం లేదు. ఇంక ఆ సంగతి వదిలేయ్. భవ్య, నాన్నా, ఎలా వున్నారు? భవ్య ఫోన్ చేసి మాట్లాడుతున్నదా!”

“ఇద్దరూ బాగానే వున్నారు. భవ్య కూడా నేనన్నట్లే అంటున్నది. బావగారెలాగూ ఇస్రోలో సిస్టమ్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. అక్క కూడా, అక్కడే జాయినయితే బాగుంటుందని”.

“అమ్మా! నేనేం అడిగినా నువ్వు నా ఉద్యోగంతోనే ముడిబెట్టి మాట్లాడుతున్నావు. నన్ను కాస్త ఆలోచించుకోనీ, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటా” అంటూ ఫోన్ పెట్టేసింది.

***

“ఏంటి వాళ కాస్త డల్‌గా కనుపిస్తున్నావు స్వీటీ? మధ్యాహ్నం పడుకోకుండా ఏమైనా పనులు చేస్తూ కూర్చున్నావా?” అనడిగాడు రాజేష్ భార్య ముఖం వంక చూస్తూ.

“పెద్దగా పనులేమీ చెయ్యలేదు రాజేష్. కాస్త తలనొప్పిగా వున్నది. తగ్గుతుందిలే.”

“ఎక్కడ నొప్పిగా వున్నది? నుదుటి మీదా? తల పైభాగానా? లేకపోతే కణతల దగ్గరా? కొద్దిగా ఎక్సాఆయిల్ వ్రాస్తాను. ఏదీ ముఖం ఇటు తిప్పు” అన్నాడు రాజేష్,

“ఏం వద్దు. అదే తగ్గుతుందిలే”.

“కాదు స్వీటీ, నువ్విలా డల్‌గా వుంటే నేను భరించలేను. నా రమ్య ఎప్పుడూ చలాకీగా గంతులు వేస్తూ తిరగాలి” అంటూ రమ్య ముఖాన్ని ఎత్తి నుదుటి మీద చెయ్యి ఆనించి చూశాడు.

ఆ స్పర్శలో అతనికున్న ప్రేమంతా తెలిసిపోతుందనిపించింది రమ్యకు. ఆ చేతిని పట్టుకుని అలాగే తన పెదవుల కానించుకున్నది రమ్య.

భోజనాలు పూర్తి చేసి ఇద్దరూ టి.వి. ముందు కూర్చున్నారు. అప్పుడు కూడా రమ్య పరధ్యానంగానే వున్నది.

“స్వీటీ! ఏదో ఆలోచిస్తున్నావు. దాన్ని నాతో షేర్ చేసుకోవచ్చుగా?”

“ఏం లేదు రాజేష్! అమ్మావాళ్లు నన్ను మళ్లీ చదువుకోవటమో, ఉద్యోగం చెయ్యటమో, చెయ్యమని గట్టిగా చెప్తున్నారు.”

“చదువూ, ఆ తర్వాత పెళ్లి వరకూ మీ ఊరి కాలేజీలో సిస్టమ్ ఆపరేటర్ వర్క్ చేశావుగా. ఇప్పుడు కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నీ ఇష్టం వున్న పని చేస్తే బాగుంటుందేమో ఆలోచించు”

“కాని అమ్మావాళ్లు టైమ్ వేస్టు చేసుకుంటున్నానని బాధపడుతున్నారు. నేను మరలా చదువు మొదలు పెట్టి పి.జి. చెయ్యాలంటే చెన్నైకో, బెంగళూర్‌కో పోవాలి. నిన్నొదిలి వెళ్లాలని లేదు. మన ఈ క్వార్టర్స్ వదిలి ఎక్కడికీ పోవాలని లేదు. వర్క్ ఎట్ హోమ్ క్రింద మంచి ప్రాజెక్ట్ ఏమైనా లభ్యమైవుతుందేమో చూస్తాను. అలా అయితే ఇంట్లోనుంచే చేయగలిగిన వర్క్ చేస్తాను. కొన్ని కంపెనీలను కాంటాక్ట్ చేస్తాను”.

“నువ్వేం చేసినా నాకిష్టమే రమ్యా. నీకెందులో ఇంటరెస్టుంటే అదే చూసుకో.”

కొన్ని కంపెనీలను కాంటాక్ట్ చేసింది కాని వాళ్లిచ్చిన వర్క్ రమ్య కంత ఇష్టంగా లేక చెయ్యలేదు. మరేదైనా ప్రయత్నం చెయ్యాలనుకున్నది.

ఇంతలో సంక్రాంతి పండగ దగ్గర కొచ్చింది. పెళ్లి తరువాత వచ్చిన మొదటి సంక్రాంతి. తప్పకుండా ఇంటికి రమ్మని రమ్య వాళ్లకు అటు అత్తమామలు, ఇటు తల్లిదండ్రులూ, ఫోన్లు చేసి చెప్పారు.

“ఇంటికెళ్లి మన పేరెంట్స్‌ను  చూచివద్దాం స్వీటీ. నేను శెలవు పెడతాను. నీకు గూడా పుట్టింటి మీద బాగా బెంగగా వుండి వుంటుంది. మీ టౌనుల్లో కన్నా పండగలు మా పల్లెటూళ్లలోనే బాగా చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి లాంటివి. దాదాపు ప్రతివీధిలోనూ, కుదిరితే ప్రతి ఇంటిముందూ వెలిగే భోగిమంటలు, తోటల్లో వేసుకునే కోడిపందేలు, పావురాల పందేలు ఎప్పుడూ సరదాగా వుంటాయి. పచ్చని కళ్లాపి చల్లిన నేలమీద తెల్లని ముగ్గులు వీధినంతటిని ఏకం చేసేటట్లుగా వేస్తారు. ఆ ముగ్గుల్ని తొక్కకుండా, ముగ్గుల్లో ఉన్న గొబ్బెమ్మల్ని కాళ్లతో తన్నకుండా జాగ్రత్తగా నడిచే వాళ్లం. పండగ మూడు రోజులు మా అమ్మకు ఊపిరాడదు. బంతి పూలదండలూ, మామిడాకులూ వాకిళ్లకు కడుతూ, ముగ్గులు పెడుతూ, నువ్వులు వేసిన పిండితో నేతి అరిసెలు చేస్తూ, భోగిపళ్ల పేరంటాలకు వెడుతూ, దొడ్లో పశువుల్ని కూడా పండగ ముస్తాబు చేస్తూ వుండేది. పసుపు రాసిన పచ్చని అమ్మకాళ్ల వేళ్ల మెట్టెల్నీ, సన్నని కాలిపట్టీలను చూస్తూ అమ్మదగ్గర కూర్చుని వేళ్లతో వాటిని సవరిస్తూ వుండేవాడిని. నిద్రొస్తే ఒక్కోసారి అలాగే అమ్మ కాళ్ల దగ్గరే, అసలు కాళ్ల మీదే తల పెట్టుకుని నిద్రపోయేవాడిని. సంక్రాంతి పండగ నాకూ, తమ్ముడినీ ఎప్పుడూ మధుర స్మృతే. నిరుడే వెళ్లటానికి కుదరలేదు. ఈసారి తమ్ముడు కూడా వస్తానన్నాడు. మనమూ తప్పకుండా వెళ్దాం” అన్నాడు రాజేష్ సంతోషంగా.

“అమ్మావాళ్లు గట్టిగా రమ్మని చెప్పారు రాజేష్. పోనీ మీ తమ్ముణ్ణి కూడా మా ఇంటికి రమ్మని చెద్దామా?”.

“తమ్ముడూ, నేనూ, ఇద్దరం, ఇంట్లో లేకపోతే అమ్మానాన్నలకు పండగే వచ్చినట్లుండదు.”

ఊరన్నా, తల్లిదండ్రులన్నా రాజేష్‌కు తగని మమకారమని, అవకాశమున్నప్పుడల్లా అక్కడి కెళ్లాలని అతని మనసు బాగా కోరుకుంటుందని రమ్య కర్థమయింది. రాజేష్ వర్ణించిన పండగ వాతావరణమేమీ, తమింట్లో వుండదు. అసలే పండగైనా రొటీనే తమకు ఈ ముగ్గులూ, గొబ్బిళ్లూ ఇవన్నీ టి.వీ.లోనో, పేపర్లోనో చూడటం అంతే. అవన్నీ పల్లెటూరి వాళ్ల పద్ధతులు. ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఎవరు చేస్తారనే ఒక అభిప్రాయంతో వున్నారు తమ కుటుంబమంతా. నిజమైన పండగ వాతావరణం చూడాలంటే తమ అత్తగారింటికి వెళ్తే కనపడుతుంది. దొరికే సంతోషాన్ని ఎందుకు కాదనుకోవటం? అని ఆలోచించి “రాజేష్! అత్తయ్య వాళ్ల దగ్గరికే పండక్కి వెళ్ళదాం. తర్వాత మా ఇంటికి వెడదాం” అన్నది రమ్య.

రాజేష్ చాలా సంతోషించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతని తల్లిదండ్రులు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేం.

“మా కోడలు బంగారం. మావాణ్ణి తన పుట్టింటికి లాక్కుపోకుండా ఇద్దరూ ఇటే వచ్చారు. చిన్నోడు వస్తే పండగ సంబరం రెట్టింపువుతుంది.” అని అత్తగారు మురిపెంగా పొరుగింటి వాళ్లతో అంటున్నది.

“కొడుకుల్నీ, కోడల్నీ చూసుకోవటమే కాదు. ఈ ముసలి మొగుడు కూడా వున్నాడని కాస్త జ్ఞాపకం పెట్టుకో” అని హాస్యమాడారు మామగారు.

రాజేష్, అతని తమ్ముడూ తిరిగిన చాలా చోట్లకు రమ్య కూడా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేసింది. ఆ మర్నాడు రమ్య వాళ్లింటికి బయలు దేరారు. అత్తగారు పట్టుచీర కొనుక్కొమని డబ్బిచ్చింది.

రమ్య తమ ఇంట్లో అడుగు పెడుతూనే “అమ్మా!” అన్నది. ఆమె, ఆమె వెనుక తండ్రీ, ఆ వెనక చెల్లీ వచ్చారు. ఎవరి ముఖాలూ ప్రసన్నంగా లేవు.

“ఏం అక్కా! పెళ్లవగానే మమ్మల్ని మర్చిపోయి బావగారితోటి, వాళ్ల ఊరు వెళ్లిపోయావు. మేమెంత డిస్సపాయింట్ అయ్యామో తెలుసా?” అంది నిష్ఠూరంగా భవ్య,

“ఇవ్వాకొచ్చాంగా భవ్యా, ఇప్పుడు పండగను సెలబ్రేట్ చేసుకుందాంలే” అన్నాడు రాజేష్.

“ఏమిది సెలబ్రేట్ చేసుకునేది? నిన్న ఈ రోజవుతుందా? వాళ్ల ఇంటి ఆడపిల్లనయితే ఇలా కనుమ పూట పంపిస్తారా? అసలు పెద్దపండగ, మాకు తొలిపండగ మా ఇంటికి రానీయకుండా మీ వాళ్లు అక్కడకు పిలిపించుకోవటమేంటి? నోట్లో నాలుకలేని నా కూతుర్ని మీరంతా కలిసి ఆడుకుంటున్నారు” అంది ఆవేశంగా తల్లి.

“అవును బాబూ, మీకలా వెళ్లటం మీకు గొప్పే కావచ్చు. అల్లుడికి పండగ కానుక లివ్వకుండా తప్పించుకునేందుకే ఇలా పంపేశారని మీ ఊరి వాళ్లు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు”, అన్నారు రవీంద్ర. ఇలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందని అస్సలు ఊహించని రాజేష్ అవాక్కయ్యాడు. ఇంత తీవ్రంగా మాట్లాడతారని రమ్య ఊహించలేదు. వాకిట్లోనే నిలబెట్టి ఇన్ని మాటలన్నారని కోపంగా, రాజేష్ చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకెళ్లింది.

తన సిస్టమ్ ముందు కూర్చుని పరిశోధనా కేంద్రంలోని మొత్తం సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో, ఎక్కడ ఏ లోపముందో తను అంచనా వేయగలుగుతాడు కాని అత్తా, మామల మనస్సులో ఏముందో తనకు పసిగట్టడం రాదని అనుకున్నాడు. తన దృష్టిలో ఇది చాలా చిన్న విషయం. ‘ఏదో సరదాపడి రమ్య అక్కడికి వెళ్దామన్నది. అలాగే వెళ్లాము. ఆనందంగా గడిపాము. ఇప్పుడిక్కడకు వస్తే పండగ సరదా అంతా ఎగిరిపోయింది’ అనుకున్నాడు రాజేష్. ఆ మధ్యాహ్నమే భోజనం చేసి రాజేష్ తమ ఊరు వెళ్లిపోయాడు. తనంటే అంత ప్రేమగా వుండే రమ్య కూడా వాళ్ల అమ్మా నాన్న మాటల్ని ఏ మాత్రం ఖండించలేదు. ఇవ్వాళ వాళ్లు నోరు పారేసుకున్నారు. అది అలుసుగా తీసుకుని రమ్య కూడా అలాగే తయారవుతుందా? ‘రమ్య సంగతి ఏమో కాని, ఆమె తల్లిదండ్రులు మాత్రం కూతురు మౌనంగా వుండటం చూసి సందర్భం వచ్చినప్పుడల్లా రెచ్చిపోవటం ఖాయం’ అనుకున్నాడు రాజేష్.

శెలవు అయిపోగానే రాజేష్ త్రివేండ్రం వెళ్లిపోయాడు. అక్కడో నాలుగు రోజులూ, ఇక్కడో నాలుగు రోజులు వుండి రమ్య తరువాత త్రివేండ్రం వస్తానని ముందే చెప్పింది.

‘కనీసం రాజేష్ ఊరికి వెళ్లేటప్పుడు కాని, వెళ్లిన తర్వాత కాని ఒక్క ఫోన్ చేయలేదు. అసలు వాళ్ల ఊరు వెళ్లగానే అమ్మా నాన్నలతో, తమ్ముడితోనే లోకమైపోయింది. వెళితే వెళ్లనీ నాకేనా జరగంది’ అనుకుని రమ్య ఫోన్ చెయ్యలేదు. వారం గడిచింది.

“అమ్మా? ఒకసారి మా అత్తారింటికి వెళ్లివస్తాను.” అన్నది.

“రాజేష్ గాని, వాళ్ల అమ్మానాన్న గాని ఎవరూ ఒక్క ఫోనన్నా చేయలేదు. అక్కడకెళ్లి ఏం చేస్తావు? అత్తామామలకు పనిమనిషిలా సేవలు చేసి రావాలా? నువ్వెవర్నీ ఏం దేబిరించబల్లేదు. ఊరుకో” అన్నది అమ్మ జగదీశ్వరి.

“రమ్యా! సబ్జెక్టు మర్చిపోతావు. ఏదో ఒక పని చేస్తూ వుండాలి. ఇదుగో ఈమెయిల్ చూడు. ఈ కంపెనీ వాళ్లు నీ సబ్జెక్టు వాళ్లనే అప్లయ్ చేయమని మెయిల్ పెట్టారు. అప్లయ్ చేయ్.” అన్నారు నాన్న రవీంద్ర.

“అదెక్కడో హైదరాబాద్ కంపెనీ. ఇప్పుడొద్దులే. నేను త్రివేండ్రం వెళ్లాక ఏదో ఒక వర్క్ చూసుకుంటాను నాన్నా.”

“ఉద్యోగమంటూ వస్తే కొన్నాళ్లున్నాక ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు. ఐదు నెలల నుంచీ నువ్విలా ఖాళీగా వుంటే మాకేం నచ్చలేదు” అంటూ రవీంద్రగారు బలవంతపెట్టారు. సరేనన్నది రమ్య.

ఒకసారి కోడల్ని చూసొద్దాం. వీలైతే తమ వెంట తీసుకొద్దామని రాజేష్ అమ్మా నాన్నలు రమ్య దగ్గర కొచ్చారు. మాములు మర్యాదలై పొయ్యాక “రమ్యను తీసుకెళ్లి నాలుగు రోజులుంచుకుంటామండీ. పంపించండి” అన్నారు.

“ఒక్కతీ అక్కడుండి ఏం చేస్తుందండీ? వాళ్ల నాన్నగారు ఏదో జాబ్‌కు అప్లై చేయిస్తున్నారండీ.”

“రమ్యకు ఇప్పుడు ఇక్కడుండి జాబ్ చేసుకోవాల్సిన అవసరమేముందండీ?”.

“మీ అబ్బాయి చదువుకుని ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడా ఏంటి? మా అమ్మాయీ ఏదో ఒకటి చేస్తుంది” అన్నారు రవీంద్ర.

“పెళ్ళై కాపురం చేసుకునే పిల్లను ఇక్కడుంచి జాబ్ చేసుకోమని చెప్పటమేంటండీ! అక్కడి కెళ్లిన తర్వాత వాళ్లిద్దరూ ఆలోచించుకుని వాళ్లకు వీలైనది చేస్తారులే బావగారూ!”.

“వాళ్లింత వరకూ ఏ ఒక్క ప్రయత్నయూ చెయ్యలేదు. తొలి పండక్కి కూడా మా ఇంటికి రానీయకుండా మీరే మీ ఇంటికి పిలిపించుకుంటిరి. అంతా మీ ఇష్టంలాగా కనపడుతుంది” అన్నారు నిష్ఠూరంగా ఇద్దరూ.

“మీరు చాలా ఎక్కువగా ఊహించుకుని మాట్లాడుతున్నారు వదిన గారూ! రమ్యను మేం మా కూతురే అనుకుంటున్నాం. మీరు రాజేష్‌ను అలా కొడుగ్గా అనుకుంటున్నారో లేదో తెలియదు. రమ్య బంగారం లాంటి పిల్ల. ఎంతో సంతోషంగా పండక్కి వచ్చింది. ఆ పిల్లకు లేనిపోనివి చెప్పి కాపురం చెడగొట్టకండి” అన్నది నెమ్మదిగా రమ్య అత్తగారు.

ఆ మాటలకు జగదీశ్వరికి ఎక్కడలేని రోషం పొడుచుకొని వచ్చింది. “మేం కూతురి కాపురం చెడగొట్టే వాళ్లలాగా కనపడుతున్నామా? అలా చెడగొట్టేవాళ్లమయితే అస్సలు పెళ్లెందుకు చేస్తాం? వాళ్లిద్దరూ చిలకా గోరింకలల్లే కాపురం చేసుకుంటుంటే వాళ్ల మధ్య మనమెందుకని ఈ ఐదు నెల్లనుంచీ మేమటు వైపుకు కూడా వెళ్లలేదు, మీరే మొగుడూ, పెళ్లాలూ వెళ్లారు. అనంతపద్మనాభస్వామినీ, కేరళనూ చుట్టొచ్చారు. పోనీ వెళ్లిన వాళ్లు ఏ హాటల్లోనైనా దిగారా? ఇంట్లోనే దిగి నా కూతురి చేత నానా చాకిరీ చేయించుకొచ్చారు. అంతకు ముందంతా మీరక్కడికి వెళ్లలేదు. నా కూతురు వెళ్ళీ వెళ్లగానే చాకిరీ చేసే మనిషి దొరికిందని వెళ్లి తిష్టవేశారు” అన్నది ఆవేశంగా జగదీశ్వరి.

తను ఇబ్బంది పడ్డానని రమ్య ఏమైనా తల్లిదండ్రులకు చెప్పిందా? అలాంటి పిల్లలాగే లేదు. అత్తయ్యా మీకది కావాలా? మామయ్యా! మీకిది చేసిపెట్టినా అంటూ ఎంతో ప్రేమగా చూసి పంపింది. వీళ్లే తప్పుగా అర్ధం చేసుకునే మనుషుల్లా వున్నారు. అందుకే ఆ రోజు రాజేష్ వెంటనే తిరిగొచ్చాడనుకున్నారు. ఇంక వీళ్లతో ఏం మాట్లాడీ ప్రయోజనం లేదని అనిపించింది. వెళ్లొస్తామని రమ్యకు చెప్పిలేచారు.

రమ్యకు మనసు మనసులో లేదు. తన జోక్యమేం లేకుండా వాళ్లలో వాళ్లే మాట్లాడేసుకున్నారు. తను కలగజేసుకుంటే ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఇద్దరికీ, కోపాలు వస్తాయేమోనని అనుకున్నది. ఎవరి తరుపున మాట్లాడితే వాళ్లు అవతలి వాళ్ల దగ్గర తమను తేలిక చేసిందని భావించటమే జరుగుతుందని, మెదలకుండా ఊరుకున్నది. ఇంత జరిగాక రాజేష్‍కు ఏ ముఖం పెట్టుకుని ఫోన్ చేయాలి అని ఇంకా భయపడింది. అసలు రాజేష్‌కు కూడా బాగా కోపం వచ్చి వుంటుంది. అమ్మా వాళ్లన్న మాటలన్నీ తనకి, వాళ్లమ్మా నాన్నా చెప్పే వుంటారు. అసలు అమ్మా వాళ్ల ఉద్దేశమేంటో తనకు పూర్తిగా అర్థం కావటం లేదు.

రాజేష్‌కు ఒక్కడితోనే నీకు సంబంధం; మిగతా వారితో ఏ అనుబంధమూ పెట్టుకోవద్దు. వాళ్లందరినీ బాగా దూరం పెట్టు. నువ్వు నీ ఉద్యోగమేదో చేసుకో. ఎవరినీ ఇంటికి చేరనివ్వకు. అలా చేస్తే నీకు వ్యక్తిత్వముంటుంది.

నాకు మీరెంతో రాజేషూ వాళ్ల అమ్మానాన్న అంతే కదమ్మా? తనకి అత్తా మామలంటే బాగా ప్రేముండాలి. మరి నాకు? నా అత్తామామలంటే ప్రేముండగూడదా? అని ప్రశ్నిస్తే – ‘ఇన్నాళ్లూ కనిపెంచినందుకు మేం నీకు పరాయి వాళ్లమై పోయాం. విషమైపోయాం. మా మాటలు నీకు ఇనుప గుగ్గిళ్లలాగా జీర్ణం కావటం లేద’ని తల్లి గగ్గోలు పెట్టటం ఖాయం – అని ఆలోచించి రమ్య మౌనంగా వుంటూ కాలం గడపసాగింది. నిజంగా రాజేష్ బాగా హర్టయి వుంటాడు. అందుకే ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు అని బాధపడసాగింది రమ్య.

‘రమ్య తల్లిదండ్రులేమిటి? మరీ అలా మాట్లాడుతున్నారు? చిన్న చిన్న విషయాలనే అంత పెద్దదిగా చేసి కంపనం పుట్టిస్తున్నారు. పెళ్ళై ఐదు నెలలన్నా కాలేదు. ముందు ముందు వీళ్లతో చాలా కష్టమే. కట్నకానుకలేమీ భారీగా ఆశించకుండా అమ్మాయిని, చదువును చూసి ఒప్పుకున్నాం. మంచి ఫ్యామిలీ అని బంధువులు చెప్తే నమ్మేశాం. రమ్య వాళ్ల అమ్మా నాన్నల మాటలకు కొంచెం కూడా ఎదురు చెప్పలేదు. కాపురం వద్దు. ఏ మొద్దు అంటే ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో వుండిపోతుందేమో? సరే వుంచుకోనీ. ఎన్నాళ్లుంచుకుంటారో? తప్పంతా తన తల్లిదండ్రులదేనని రమ్యకు తెలుసు. ఒక్క ఫోన్ చేసి మావాళ్లు తొందర పడ్డారు. ఏమనుకోకు అని ఒక్క మాట చెప్పినా తనకింత బాధ కలగకపోను. పెళ్లైన కొత్తలోనే వీళ్లంతా ఇలా బిహేవ్ చేస్తుంటే ముందు ముందు వీళ్లని భరించగలనా, అన్న అనుమానం వస్తుంది’ అనుకున్నాడు రాజేష్,

ఆన్‌లైన్‌లోనే ఇంటర్వూ అన్నారు. అడిగిన వాటికి రమ్య బాగానే ఆన్సర్ చేసింది. కొద్దిరోజులు

తర్వాత రిజల్ట్ చెప్తామన్నారు. “ఇంకా ఏమైనా వేకెన్సీలు వుంటాయి. సిస్టమ్‌లో చూస్తూ వుండు రమ్యా” కూతురితో అన్నారు రవీంద్ర.

“నీకు తెలియదు రమ్యా! నువ్వు చిన్న పిల్లవు. అత్తింటి వాళ్లు అన్నిట్లోనూ డామినేట్ చెయ్యాలని చూస్తారు. పిల్లవాడి తరుపు వాళ్లమన్న అహంకారముంటుంది. మనం దాన్ని సాగనివ్వకూడదు. నువ్వూ నీ తరుపున మేమూ కాస్త కరుగ్గానే వుండాలి. అప్పుడు కాని దారిలోకి రారు. మనం మెత్తటి వాళ్లమనే కదూ? ఇప్పటి వరకూ నీ ఉద్యోగం సంగతే ఎత్తటం లేదు. ఇక్కడకు కాకుండా పండక్కి నిన్ను వెంటేసుకుని తన ఊరు తీసుకెళ్లాడు”.

“నేను వస్తానంటేనే అక్కడికి వెళ్లామమ్మా. అత్తయ్యా వాళ్లను కూడా త్రివేండ్రం నేనే పిలిచాను.”

“ఆ అమాయకత్వమే వద్దని చెప్పేది. అలా వుంటే మన నెత్తినెక్కి స్వారీ చెయ్యాలని చూస్తారు. మనమే వాళ్లను మన దారిలోకి తెచ్చుకోవాలి. వచ్చారా దారిలో కొస్తారు. రాకపోతే వదిలించుకుంటాం. ఈ రోజుల్లో ఆడపిల్లలకు బోలెడు డిమాండ్ వున్నది. నాకసలు నిన్ను అమెరికాలో వుండే అతని కిచ్చిచేద్దామని ఎప్పటినుండో కోరిక, రాజేష్ ‘ఇస్రో’లో సిస్టమ్ ఇంజనీర్ మంచి పోస్టులో వున్నాడని మీ నాన్నగారు తెగ మురిసిపోయారు. నన్నూ, నినూ, ఒప్పించారు. మన భవ్యనైనా అమెరికా పంపాలి. అక్కడ పనిచేసే కుర్రాణ్ణి వెతుకుదాం.” అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది.

అమ్మో! అమ్మ ఇలా కూడా ఆలోచిస్తుందా? రాజేష్ తనకన్ని విధాలా నచ్చే తను పెళ్లి చేసుకున్నది. అమెరికా వెళ్లాలని తన కస్సలు లేదు. చెల్లి కూడా అమ్మ చెప్పిన సంబంధం చేసుకోదు. ఎందుకంటే అది ఇప్పటికే ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతున్నది. ఆ సంగతి తెలియక అమ్మ ఏవో కలలు కంటున్నది.

‘అమ్మా నాన్నా, ఇద్దరూ రాజేష్‌కు నువ్వేం ఫోన్ చేయకు. పెళ్లాం కావాలనుకుంటే అతనే చేస్తాడు. వెంటనే నన్ను ఉద్యోగంలో చేరిస్తే కాపురానికి వస్తానని నువ్వు గట్టిగా చెప్పు అని ఆంక్షలు పెడుతున్నారు. రాజేష్‌కు కొంచెం కోపం తగ్గాక నెమ్మదిగా నేను మాట్లాడతాను’ అనుకున్నది రమ్య,

ఈ మధ్య ఎవరు కలిసినా “ఏం రమ్యా! ఇంకా త్రివేండ్రం వెళ్లలేదా! ఎప్పుడెళ్తావు?” అడుగుతున్నారు.

“జాబ్ ట్రయిల్స్‌లో వున్నది” అని అమ్మ చెప్తుంటే వాళ్లు అనుమానంగా చూస్తున్నారు.

“అమ్మా! మనం తొందరపడుతున్నామేమో? ముందు నన్ను త్రివేండ్రం పంపించండి. అక్కడుండే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను, మనం ఆలోచించినట్లే ఆలోచించి అత్తయ్యా వాళ్లు కూడా మొండిపట్టు పడితే, తెగేదాకా తాడును లాక్కున్నట్లు అవుతుంది. నాన్నా, నువ్వూ, మరోసారి ఆలోచించండి” అంది నెమ్మదిగా.

“నీ మొహమేం కాదూ? కావాలంటే నీకు నమ్మకం కలగాలంటే ఏ లాయర్ చేతనైనా, లేదా కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ల చేతనైనా చెప్పిస్తాను. వాళ్లు కూడా నా మాట కరక్టే అంటారు” ధీమాగా అన్నది.

“అలాంటి వాళ్లందరి దాకా మనింటి విషయం ఎందుకులే అమ్మా? మనమే ఏదో ఒకటి నిర్ణయించుకుందాం.” అంది రమ్య.

ఒక్కసారి రాజేష్ మాట్లాడితే బాగుండునని అన్పిస్తున్నా రమ్యకు ఏదో బెరుగ్గా వున్నది.

“అమ్మా! ఫోన్ రీఛార్జింగ్ చేయించుకొస్తా. ప్రొద్దున నాన్నగారికి చెప్పటం మర్చిపోయాను. అవసరంగా కొన్ని ఫోన్లు చేసుకోవాలి” అంటూ తల్లి సమాధానాని కెదురు చూడకుండా బయటకి నడిచింది రమ్య.

మెడికల్ షాపు కెళ్లి తనకు కావలసినది కొనుక్కుని ఇంటికి తిరిగి వచ్చింది. బాత్రూమ్ వెళ్లి ‘ప్రెగ్నెన్సీ కిట్’ ద్వారా యూరిన్‌ను టెస్టు చేసుకుని చూచుకున్నది. కిట్ మీద రెండు ఎఱ్ఱని గీతలు కనపడ్డాయి. తన అనుమానం కరక్టే, తను ఇక్కడికొచ్చి ఇరవై రోజులయింది. ఈ నెల తనకు పీరియడ్స్ రాలేదు. తనిప్పుడు కన్సీవ్ అయింది. సంతోషమేసింది. ఈ విషయం అమ్మకు చెప్తే సంతోషిస్తుందో? లేక ఇప్పట్నుంచే పిల్లా, పీచూ ఎందుకు అంటుందో తెలియదు. కూతురు తల్లి అవుతున్నదంటే సంతోషించని తల్లులుంటారా? ఏమో? అన్న ఆలోచనలో వుండగానే కాలింగ్ బెల్ మోగింది. రమ్య వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా రాజేష్ మేనమామా, ఆయన భార్యా నిలబడి వున్నారు. వాళ్లు కూడా తన అత్తగారి ఊర్లోనే వుంటారు.

“పనిమీద ఈ ఊరొచ్చాం. నువ్విక్కడే వున్నావని తెలిసి చూడ్డాలని వచ్చాం” అన్నారు.

అత్తవారి తరుపున ఏదో రాయబారానికే వచ్చారని రమ్యకు అర్ధమయింది. వీళ్ళేమైనా అడిగితే ఎలా నోరు మూయించాలా, అని జగదీశ్వరి ఆలోచనలో వడింది.

“ఏమ్మా, రమ్యా! ఎలా వున్నావు? మనూరు కూడా వచ్చి నాల్గు రోజులుండక పోయావా?” అన్నారు.

“ఒక్కసారిగా అమ్మా వాళ్లను వదిలేసి త్రివేండ్రంలో ఐదునెలలు వుండే సరికి బాగా బెంగగా అనిపించి ఇక్కడే వుండిపోయాను. ఈ రోజే అత్తయ్యా వాళ్ల దగ్గరకు బయలు దేరదామనుకుంటున్నాను. ఇంతలోనే మీరొచ్చాడు. ఇప్పుడు మీతో పాటు నేనూ వస్తాను. లోపలికెళ్లి బట్టలు తెచ్చుకుంటాను” అంటూ గభాల్న లోపలికెళ్లి బట్టలు సద్దుకోసాగింది.

అది చూసిన జగదీశ్వరి నోరు తెరుచుకుని ఆశ్చర్యంతో “రమ్యా?” అన్నది.

“అక్కడికి వెళ్లగానే ఫోన్ చేస్తానమ్మా. పదండి బాబాయ్. పదండి పిన్నీ” అంటూ వాళ్లతో పాటు బయలుదేరింది.

‘నా బిడ్డకు తండ్రి ప్రేమను ఇప్పటినుండే అందించాలి. తండ్రి మనసుపడే అపురూపమైన ఆనందాన్ని రాజేష్‌కూ దక్కనివ్వాలి. మా అత్తామామలతో కలిసి వెంటనే త్రివేండ్రంకు వెళ్తాను. అమ్మా, మనుమడినో, మనుమరాలనో చూస్తే ముందు నేనే పెంచాలని మళ్లీ నువ్వే పంతం పడతావు. ఎంతైనా నువ్వూ అమ్మవే. ఆ తర్వాత అమ్మమ్మవు కదా’ అనుకుంటూ రమ్య ముందుకు నడిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here