‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -10

0
4

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

రాజీనామా

[dropcap]శ్రీ [/dropcap]కె.శ్రీనివాసన్ గారు నా సహోద్యోగి. రసాయనశాస్త్రపు అధ్యాపకులు. ప్రగతిశీల చింతనాపరులు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో నా సహపాఠి. ఇద్దరూ ఒకే సెక్షన్‌లో చదివాము. అయినా అప్పుడు మా ఇద్దరికీ పరిచయం లేదు. మేమిద్దరమూ ఒకేసారి నేషనల్ కాలేజీలో అధ్యాపకులుగా చేరాము. ఆ ఒక్క సంవత్సరంలో మా ఇద్దరి మధ్యా మంచి స్నేహం పెరిగింది. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉద్యమంలో పాల్గొనాలన్న నా నిశ్చయాన్ని వారికి తెలిపాను. దీన్ని కూలంకషంగా చర్చించడానికి మేము ఆగష్టు నెల చివరి వారంలో ఒకరోజు సాయంత్రం లాల్‌బాగ్ వెళ్ళాము. సాధకబాధకాలన్నీ చర్చించుకున్న తరువాత నా నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా వారూ రాజీనామా చేయడానికి నిశ్చయించుకున్నారు. శ్రీ కె.శ్రీనివాసన్ గారికి కొంతకాలం క్రితమే వివాహం అయ్యింది. నాకంటే వారికి ఎక్కువ భాధ్యతలున్నాయి. ఈ నేపథ్యంలో వారిది సాహసోపేతమైన నిర్ణయం.

మరుసటి రోజు ఇద్దరమూ మా రాజీనామా పత్రాలను వ్రాసుకుని ప్రిన్సిపాల్ గారైన శ్రీ కె.సంపద్‌గిరిరావుగారికి ఇచ్చాము. వారు చాలా కోపగించుకున్నారు. తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడే అంటే కేవలం రెండేళ్ళ క్రితమే కొత్తగా ప్రారంభమైన నేషనల్ కాలేజీ ఇద్దరు అధ్యాపకులను పోగొట్టుకోవలసి వస్తుందని వారికి విచారం. మేమిద్దరమూ మంచి అధ్యాపకులమనే అభిప్రాయం వారికి, విద్యార్థులకూ ఉన్నట్లు కనిపిస్తుంది. పైగా కొత్త కాలేజీని పెంపొందించే శక్తి సామర్థ్యాలు మాకున్నాయని వారి భావన. అందుకే వారికి కోపం కలిగింది. అయితే మేము మా నిర్ణయాన్ని మార్చుకోలేదు.

అప్పుడు నేను అదే ఆవరణలో ఉన్న నా విద్యార్థి దశలో నాకు ఆశ్రయాన్నిచ్చిన విద్యార్థి నిలయంలోనే ఉన్నాను. నిలయపాలకుడి (Warden)గా కూడా ఉన్నాను. భోజనానికీ, వసతికీ విద్యార్థుల మాదిరిగానే నేను డబ్బులు చెల్లించేవాడిని అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. రాజీనామా చేసిన తరువాత విద్యార్థి నిలయంలో భోజనం చేయడాన్ని నిలిపివేశాను. అయితే వసతి మాత్రం అక్కడే. కాలేజీకి అతి సమీపంలో గోవిందప్ప రోడ్డులో ఉన్న ఒక ఇంటిలో నా కొందరు మిత్రులు భోజనానికి, వసతికీ ఒక మెస్ ఏర్పాటు చేసుకున్నారు. వారిలో శ్రీ ఎ.ఆర్.వాసుదేవమూర్తి, శ్రీ జి.వి.సుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ జి.వి.అనంత అయ్యర్, శ్రీ కె.ఆర్.నాగరాజన్ ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. ఇప్పుడు వారంతా మంచి మంచి హోదాలలో ఉంటూ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు అయ్యి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. వారు నాకు ఆ ‘మెస్‌‘లో భోజన సౌకర్యం కల్పించారు.

ఉద్యమంలో ప్రవేశించడం అయ్యింది. మేము రాజీనామా చేసిన విషయం విద్యార్థులకు తెలిసిపోయింది. అప్పటి నుండి మా కాలేజీ విద్యార్థుల సంపూర్ణ సమ్మె మొదలయ్యింది.

మైసూరు రాజ్యమంతా పాఠశాలలు, కాలేజీలలో సమ్మె ప్రారంభమయ్యింది. అయితే అన్నిచోట్లా ప్రభావవంతంగా సమ్మె జరిగిందని చెప్పడానికి కుదరదు. దీనితోపాటు కార్మికుల సమ్మె. సభలు, ఊరేగింపులు, నిషేధాజ్ఞల ఉల్లంఘన, అరెస్టులు, లాఠీచార్జీలు వీటితో పాటు అక్కడక్కడా విధ్వంస సంఘటనలు, హింసాత్మక కృత్యాలు, టెలిఫోన్ వైర్లను తెంచి వేయడం, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం, రైలురోకో వంటివి నిత్యకృత్యాలయ్యాయి. ఇవన్నీ క్విట్ ఇండియా ఉద్యమంలో వాడిన అస్త్రాలే.

ఇన్‌క్విలాబ్ పత్రిక

మేమిద్దరమూ చురుకుగా ఏమి చేయాలని ఆలోచించాము. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఊరికే జైలులో కూర్చోవడం మాకు ఇష్టం లేదు. నాకైతే దాని అనుభవం చాలినంత ఉంది. చివరకు ఒక అండర్‌గ్రౌండ్ దినపత్రికను ప్రకటించడం మంచిదని నిర్ణయించాము. దానికి ‘ఇన్‌క్విలాబ్’ అని పేరుపెట్టాము. ఇన్‌క్విలాబ్ అంటే విప్లవం అని అర్థం. ఆ పత్రికను ముద్రించడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. దానితో సైక్లోస్టయిలు చేయ నిశ్చయించాము. మా ఆవరణలోనే ఉన్న ‘శ్రీ రంగనాథ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్’ సంస్థ యజమాని, మా పాఠశాల సీనియర్ విద్యార్థి అయిన శ్రీ టి.ఆర్.శ్యామణ్ణ గారిని ఈ పనికోసం ఒక సైక్లోస్టయిల్ యంత్రాన్ని ఇవ్వవలసిందిగా కోరాం. వారు అంగీకరించారు. కాగితం, ఇంకూ మొదలైన వాటికి కావలసిన పైకాన్ని స్నేహితులనుండి, శ్రేయోభిలాషుల నుండి సంగ్రహించేవాళ్ళం.

సెప్టెంబర్ 4వ తేదీ నాయకులను అరెస్టు చేశారు. మరుసటిరోజు అంటే సెప్టెంబర్ 5వ తేదీ మొదటి సంచిక ఇంగ్లీషులో వెలువడింది. సుమారు వెయ్యి ప్రతుల ఉచిత పంపిణీ. పత్రికను పంచడానికి మా కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు, వివిధ కాలనీలకు చెందిన ఔత్సాహిక యువకులు నన్ను ప్రతిరోజు సాయంత్రం కాలేజీ ఆవరణలో కలిసేవారు. వారికి కావలసినన్ని ప్రతులను ఇచ్చేవాణ్ణి. ఈ పత్రికను ప్రకటించడం, పంచడం అంతా అతి రహస్యంగా జరిగేది. ఇప్పుడు ప్రముఖ గాంధేయవాదిగా పేరుగడించిన డా.హెచ్.శ్రీనివాసయ్యగారు మల్లేశ్వరం ప్రాంతంలో పత్రికను పంపిణీ చేసేవారు. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి ప్రతులను తీసుకుని వెళ్ళేవారు. మొదటి రెండు సంచికలు ఇంగ్లీషులో ప్రకటించాము. తరువాత కన్నడలోనికి బదలాయించాము. ఆయా రోజు ప్రకటించవలసిన విషయాలను నేను, శ్రీనివాసన్ ముందుగానే చర్చించుకునేవాళ్ళం. మామూలు దినపత్రికలలో ఉద్యమానికి సంబంధించిన అన్ని వార్తలనూ ప్రకటించేవారు కాదు. బెంగళూరులో ఒక రహస్య రేడియోను ఉద్యమకారులు స్థాపించారు. దాని నుండి వచ్చిన వార్తలు, మా చుట్టుపక్కల, బెంగళూరులోని అన్ని ప్రాంతాలలో జరుగుతున్న వివిధ రాజకీయ కార్యక్రమాలు, విద్యార్థులు, యువకులు మున్ముందు చేయాల్సిన పనుల మార్గదర్శనం, వారి ఉత్సాహం చల్లారకుండా మంటను రాజేయడం మొదలైన విషయాలు మా పత్రిక ముడిసరుకులు. అప్పుడప్పుడూ విషయానికి అనుగుణంగా వ్యంగ్య చిత్రం కూడా ఉండేది. దీనిలో పరిణతి చెందిన స్నేహితుడొకరు మా సలహా ప్రకారం చిత్రించి ఇచ్చేవారు. పత్రికలోని విషయాన్ని వ్రాసేది నేనే, వాటి కాపీలను తీయడమూ నేనే చేసేవాణ్ణి. ప్రకటన, పంపిణీ అంతా మా కాలేజీ ఆవరణలోనే.

ఉద్యమ కాలంలో బసవనగుడి ప్రాంతంలో ముఖ్యంగా నేషనల్ హైస్కూలు, కాలేజీ మైదానంలో ఎక్కువ రాజకీయ కార్యకలాపాలు సాగేవి. వీటిపై నిఘా పెట్టే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మా కాలేజీ ముందు భాగంలో కాంపౌండుకు సుమారు 20 గజాల దూరంలో రెండు గుడారాలను వేసి ఒక తాత్కాలిక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మా కళ్ళముందరే పోలీస్ స్టేషన్. దాని పక్కనే పోలీసుల కళ్ళు కప్పి చేస్తున్న చట్టవ్యతిరేకపు పనులు! ఆ పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడూ ఉరుకులూ పరుగులూ. వాహనాల ఆగమన నిర్గమనాలు. పోలీసు అధికారుల రాకపోకలు. ఆ చుట్టుపక్కల ఎప్పుడూ గట్టి కాపలా. మేము చేస్తున్న పని పోలీసుల కంట పడితే మమ్మల్ని అరెస్టు చేస్తారు, యంత్రమూ పోతుంది అని ఆలోచించాము. అరెస్టుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. అయితే యంత్రం పోతే పత్రిక ప్రచురణ పనులు ఆగిపోతుందనే ఆందోళన. అందువల్ల మా ప్రకటనను ఒకే ప్రదేశంలో చేయకూడదని నిశ్చయించుకున్నాము.

రెండు మూడు రోజుల తరువాత బసవనగుడి రోడ్డులోవున్న, మా సంస్థలకు ఎక్కువ దూరంలో లేని మా స్నేహితులైన శ్రీ ఎల్.టి.అశ్వత్థనారాయణ గౌడ్ గారి ఇంటికి వారి అనుమతి మేరకు యంత్రాన్ని చేర్చడానికి నిశ్చయించాము. ఒకరోజు చీకటిరాత్రిలో నేను పల్లెటూరివానిలాగా చెడ్డీ వేసుకుని నెత్తిపై ఒక గోనెసంచీ వేసుకుని దానిపై మూసివున్న యంత్రాన్ని పెట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్ళాను. తోడుగా శ్రీనివాసన్ పక్కలోనే వస్తున్నారు. అక్కడక్కడా వస్తూ పోతున్న జనాలకు అనుమానం ఏమీ రాలేదు. చాలా మంది మా వైపు చూడను కూడా చూడలేదు. అంతో ఇంతో గమనించినవారు నా జతలో వస్తున్న ‘యజమాని’ తన ‘కూలీ’తో తలమీద ఏదో ఒక బరువైన వస్తువును తీసుకు వెళుతున్నాడని అనుకుని ఉండవచ్చు.

క్షేమంగా గౌడుగారి ఇంటికి చేరుకున్నాము. పత్రిక సామాగ్రిని తీసుకుని పోయి, అక్కడే వ్రాసి, ప్రతులను తీసి యథాప్రకారం వాటిని మా కాలేజీ ఆవరణలోనే వితరణ చేసేవాడిని. రెండు మూడు రోజుల తరువాత వారి ఇంటి ముందు ఎవరో ఒకరిద్దరు అపరిచితులు సంచరించడం గౌడు గారు గమనించారు.

అలా తిరుగుతున్నవారు ప్రభుత్వపు సి.ఐ.డిలు కావచ్చని గౌడుగారి అనుమానం. వారు మాకు ఆ విషయాన్ని చెప్పారు. ఇంక ఆ యంత్రాన్ని అక్కడ ఉంచడం క్షేమం కాదని భావించాము. ఎక్కడ పెట్టాలని ఆలోచించాము. ఆ యంత్రాన్ని మా కాలేజీ గణితశాస్త్ర అధ్యాపకులైన శ్రీ ఎం.ఎస్.సూర్యనారాయణశాస్త్రి గారి ఇంటిలో వారి అనుమతితో పెట్టాము. వారి ఇల్లు చామరాజపేటలో ఉంది. యంత్రాన్ని మోసుకుని పోవడానికి వెనుకటి ‘కూలీ’నే ఉపయోగించాము. ఆ కూలీ వెనుక కాపలాగా అదే యజమాని. రెండు మూడు సంచికలు అక్కడ ప్రచురించాము. అయితే కొన్ని ఆటంకాలేర్పడ్డాయి. అవి మావైపు నుండి కాదు.

పోలీసువారికి అనుమానం వచ్చింది. సెప్టెంబర్ 13 రాత్రి ఒంటిగంటకు శాస్త్రిగారి ఇంటిని పోలీసులు వెదికారు. యంత్రం దొరికింది. ఇన్‌క్విలాబ్ కొన్ని ప్రతులూ దొరికాయి. శాస్త్రిగారిని అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్ళారు. యంత్రాన్ని పోలీసులు వశపరచుకున్నారు. ‘కోతి పెరుగును మెక్కి మేక మూతికి రాసినట్టు’ అయింది.

14వ తేదీ తెల్లవారుజాము సుమారు 4 గంటలకు శాస్త్రిగారి కుమారుడు నేను పడుకున్న శ్రీ టి.ఎస్.రాఘవన్ గారింటికి వచ్చి సమాచారం చెప్పాడు. నేను కొన్ని రోజులు హాస్టల్‌లో, కొన్ని రోజులు రాఘవన్ గారి ఇంటిలో పడుకునేవాడిని. ఈ విషయం కొంత మంది స్నేహితులకు తెలుసు. శాస్త్రిగారి అరెస్టు, యంత్రమూ పోయింది. 14వ తేదీ సాయంత్రం మా పత్రిక ప్రకటించక పోతే శాస్త్రిగారి ఇంటిలోనే ఇది ప్రచురిస్తున్నామని అనడానికి ఇంకా ఎక్కువ రుజువు దొరికి నట్టవుతుందని భావించి ఏమైనా చేసి ఆ రోజు సాయంత్రం ఇన్‌క్విలాబ్‌ను ప్రకటించి తీరాలని అనుకున్నాను. ఖర్మకొద్దీ ఆ రోజు బెంగళూరులో కర్ఫ్యూ. జాగ్రత్తగా పడుతూ లేస్తూ ఉదయం ఐదు గంటలకు స్కూలుకు చేరాను. కొత్త యంత్రాన్ని ఎక్కడనుండి సంపాదించాలి అని ఆలోచించాను. మా స్కూలులో ఒక పాత సైక్లోస్టైలు యంత్రమున్నట్టు నాకు జ్ఞాపకం. అదే ఆవరణలో శ్రీ వెంకటయ్య వాచ్‌మాన్‌గా పని చేస్తూ నివసిస్తున్నారు. అతను నేను హైస్కూలులో విద్యార్థిగా ఉన్నప్పటి నుండీ బాగా పరిచయం. నా మీద అతనికి చాలా నమ్మకం. ఆ నమ్మకాన్ని దురుపయోగం చేస్తూ పాఠశాల యంత్రాన్ని ఇవ్వమని అడిగాను. అతడు సంతోషంతో ఇచ్చాడు.

మా కాలేజీ కాంపౌండుకు ఆనుకుని దక్షిణం వైపు చివర ఒక ఇరుకైన చీకటి సందు ఉంది. దానిని ఆనుకునే మా పాఠశాల మూత్రాలయం. ఆ సందు మా పత్రిక ప్రచురించడానికి ప్రశస్తమైన స్థలమని భావించి ఆ రోజు ఆ సాయంత్రం ఇన్‌క్విలాబ్‌ పత్రికను ప్రకటించ గలిగాము. మాకంతా సంతోషమయ్యింది. శాస్త్రిగారిపై అనుమానం తక్కువ కావడానికి చేసిన ప్రయత్నంలో సఫలమై ఉండవచ్చన్న తృప్తి. కర్ఫ్యూ ఉన్నా మా ప్రాంతపు కొంతమంది శ్రమపడి వచ్చి ప్రతులను తీసుకెళ్ళారు. ఇక మీదట యంత్రాన్ని ఇంకొకరి ఇంటిలో పెట్టి ‘కనిపించిన వాడిని బావిలో తోసి లోతు తెలుసుకోవడం వద్దు’ అని ఆలోచించి ఏమైనా కానీ పత్రికాప్రకటనను మా ఆవరణలోనే చేయాలని నిర్ధారించాము.

కానకానహళ్ళికి

ఇన్‌క్విలాబ్‌కు ఎక్కువమంది పాఠకులను వెదికే ప్రయత్నంలో భాగంగా కానకానపల్లెకు వెళ్ళాలని నేను, శ్రీనివాసన్ నిర్ణయించుకున్నాము. కానకానహళ్ళి బెంగళూరుకు దక్షిణంవైపు ఉందని తెలుసు. ఎంత దూరం ఉంటుందని ఖచ్చితంగా తెలియదు. బసవనగుడి నుండి దక్షిణాభిముఖంగా కానకానహళ్ళికి వెళ్ళే దారి ఉండేది. ఇప్పుడూ ఉంది. సుమారు 15 -20 మైళ్ళ దూరం ఉండవచ్చని తెలుసుకుని మేమిద్దరం ఒకరోజు మధ్యాహ్నం సైకిల్‌పై బయలుదేరాము. 15 మైళ్ళు దాటాము. కానకానహళ్ళి దొరకనే లేదు. తరువాత దొరికింది. బెంగళూరు నుండి 35-36 మైళ్ళ దూరమని తెలిసింది. మేమేమీ అలసిపోలేదు.

అక్కడి యువ నాయకులైన శ్రీ కె.జి.శ్రీనివాసమూర్తి ద్వారా కొందరు ఉత్సాహవంతులైన యువకులతో ఒక చిన్న సమావేశాన్ని వారి ఇంటిలోనే ఏర్పాటు చేసి మా పత్రికకు సహాయం అందించాలని కోరాము. మద్దతుతో కూడిన హామీ వారి నుండి లభించింది. అక్కడి నాయకులు, ఆ సమయంలో జైలులో ఉన్న శ్రీ వెంకటాచలపతి శెట్టి గారింటిలో చిత్రాన్నం# (పులిహోర) తిని ఉదయం బెంగళూరుకు సైకిల్‌పై వెనుదిరిగాము. మరుసటి రోజు నుండే కానకానహళ్ళికి పోస్ట్ ద్వారా పత్రికలను గుర్తుపట్టకుండా ప్యాక్ చేసి పంపించేవాళ్ళము.

మొదటిసారి ఆ ప్రతులు చేరినప్పుడు నా పేరుతో ఆ ‘మెస్’ అడ్రసుకు శ్రీ కె.జి.శ్రీనివాసమూర్తి గారు ఒక కార్డు వ్రాశారు. దానిలో ఒక వాక్యం ఇలా ఉంది. ‘మీరు పంపిన బులెటిన్‌లు చేరాయి’. దాన్ని చదివిన వెంటనే నా గుండె ఆగిపోయింది. అలా ఏ ఉత్తరంలోనూ వ్రాయకండి. కార్డులో అసలు వ్రాయకండి అని వారికి తెలిపాను.

1992వ సంవత్సరం ఆగష్ట్ 9వ తేదీ క్విట్ ఇండియా ఉద్యమం స్వర్ణోత్సవం. ఆ రోజు ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గాంధీ స్మారక నిధి (కర్ణాటక) అధ్యక్షులైన డా.హెచ్.శ్రీనివాసయ్య గారు, నేనూ పాల్గొన్నాము. ఇద్దరూ కూర్చొని యాధృచ్చికంగా వెనుకటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాము. ఆ మాటలలో ‘మైసూరు చలో’ విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వారు మేము ప్రచురిస్తున్న ఇన్‌క్విలాబ్ పత్రికలను మా కాలేజీకి వచ్చి తీసుకుని పోయి మల్లేశ్వరంలో పంచేవారనీ, వారి దగ్గర ఆ పత్రిక సంచికలన్నీ ఉన్నాయిని తెలుసుకుని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంతోషం కూడా వేసింది. నావద్దనే ఆ ప్రతులు లేవు. ఆ ప్రతులను చూడాలని సహజమైన కుతూహలం కలిగింది. రెండు రోజుల తరువాత ఒక సెట్ జిరాక్స్ ప్రతులను పంపించారు.

మళ్ళీ ఆమూలాగ్రంగా చదివాను. 46 సంవత్సరాల క్రితం నా చేతివ్ర్రాత, రచనలు చూసి, చదివి సంతోషమయ్యింది. ఈ సంచికలన్నీ ఇక్కడ చేర్చాలనే ఆలోచన ఉండేది. అయితే దాని నుండి ఎక్కువ ఉపయోగం లేదని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

ఇలా ‘మైసూరు చలో’ ఉద్యమం చాలా ఉధృతంగా సాగింది. ఈ ఉద్యమంలో అత్యంత జనప్రియమైన ప్రాసబద్ధమైన నినాదాలు – ‘ఆర్కాట్ బాయ్‌కాట్’, ‘తంబుచెట్టి చట్ట కట్టి (తంబుచెట్టి పాడె కట్టండి)’. ‘మైసూరు చలో’ ఉద్యమాన్ని ‘ఆర్కాట్ బాయ్‌కాట్’ ఉద్యమమనీ పిలిచేవారు.

ప్రతిరోజూ సత్యాగ్రహుల గుంపులు మైసూరును ముట్టడించాయి. వందలాది మందిని అరెస్టు చేశారు. మైసూరు రాజ్యమంతటా సభలు, ఊరేగింపులు, అక్కడక్కడా విధ్వంసాలు. ప్రభుత్వానికి ఈ ఉద్యమాన్ని అణచడం కష్టమయ్యింది. అప్పుడు బెంగళూరు, ఇంకా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పబ్లిక్ మీటింగులను, ఊరేగింపులను నిషేధించారు. దానితో కాంగ్రెస్ కార్యకర్తలు పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోని హిందూపురం సమీపంలోని సేవామందిరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను, శ్రీనివాసన్ ఆ రాత్రి జరిగిన సభకు హాజరయ్యాము. ఉద్యమంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పట్ల విపులమైన చర్చ నడించింది. చాలా సార్లు చర్చ కార్యరూపంలోనికి తీసుకురాలేక, కేవలం సూత్రప్రాయమైన విషయాల పట్ల దారితప్పి నడిచింది. ఉదాహరణకు ఒక విషయం గురించి చర్చ ఇలా సాగింది:-

పల్లెలలో స్థానిక అధికారులైన కరణాల దస్తావేజులను నాశనం చేయడం మంచిదా, కాదా, హింసా, అహింసా ఈ విషయంపై పుంఖానుపుంఖాలుగా చర్చ సాగింది. చాలు ఈ ఉపయోగం లేని చర్చ అని అనుకుని నిద్రకు చోటు వెదుకుకుంటూ వెళ్ళిపోయాము. ప్రొద్దునే లేచి హిందూపురానికి ఒక హోటల్‌లో తిండి తినడానికి వెళ్ళాము. అప్పుడు హిందూపురంలో కలరా. ఐనా ఒక మంచి హోటల్‌కు వెళ్ళాము. ఆ హోటలు బిక్కుబిక్కుమంటూ ఉంది. ఒక్క పురుగూ లేదు. మాకు అక్కడ ఉండటానికి మనసొప్పలేదు. అక్కడి నుండి నేరుగా బెంగళూరుకు వెనుదిరిగాము. మా పత్రిక ప్రకటన ఆటంకం లేకుండా ముందుకు సాగింది.

రాజీనామా పత్రాలు

పాఠశాల ఆవరణలో రాతి బెంచీమీద సాయంత్రం పూట మేమిద్దరం కూర్చుని మాట్లాడుకోవడం సర్వసాధారణం. అలాగే ఒక రోజు మాట్లాడుతున్నప్పుడు మా స్కూలు గుమాస్తా అయిన శ్రీ బి.నరసింహమూర్తి గారు మమ్మల్ని చూస్తూ నవ్వుకుంటూ మూత్రాలయం వైపుకు వెళ్ళారు. ఆరోజు మా సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ (పాలక సభ్యుల) సభ. మా రాజీనామా పత్రాలపై చర్చించారా అని వారిని అడిగాము. మీ రాజీనామా పత్రాలు పోగొట్టుకుని పోయాయి. ఎంత వెదికినా దొరకలేదు అన్నారు. మేము ఇంకోసారి వ్రాసి ఇస్తాము అన్నాము. అవి అవసరమైనప్పుడు సంస్థ మీ నుండి తీసుకుంటుంది అంటూ నవ్వుతూనే వెళ్ళిపోయారు. ఇంతకూ ఆ రోజు మా రాజీనామా పత్రాల విషయం చర్చకు రాలేదు.

ఉద్యమం ఉధృతిని, దెబ్బనూ తట్టుకోవడానికి ప్రభుత్వానికి కాలేదు. రాజ్యం లోపల పెరిగిన సత్యాగ్రహం. రాజ్యం వెలుపల కూడా ప్రభుత్వానికి ప్రతికూల వాతావరణం ఉంది. ప్రభుత్వాన్ని కాపాడటానికి వారి దొరలైన ఇంగ్లీషువారి అధికారం ఆగష్టు 15తో ముగిసింది. మైసూరు సర్కారు అనాథ అయ్యింది. జవాబ్దారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొదలైన ‘మైసూరు చలో’ ఉద్యమానికి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ ఆశీర్వాదమే కాదు, పరోక్ష ప్రోత్సాహమూ ఉంది. ఇక తన ప్రభుత్వం నిలువజాలదని తెలిసి తెలివిగల దివాన్ ఆర్కాట్ రామస్వామి మొదలియార్ సంపూర్ణంగా శరణాగతితో మైసూరు కాంగ్రెస్‌తో ఒప్పందమే మంచిది అని నిర్ణయించుకున్నారు. అక్టోబరు 6వ తారీఖున కాంగ్రెస్సుకు చెందిన కార్యవర్గ సభ్యులందరినీ విడుదల చేశారు. చర్చలు మొదలయ్యాయి. అయినా జైలు నుండి బయటకు వచ్చిన నాయకులంతా కార్యవర్గ సమితి చెప్పే వరకూ పోరాటాన్ని కొనసాగించాలని ఆదేశం ఇచ్చారు. 9వ తేదీ సాయంత్రం కె.సి.రెడ్డి గారితో దివాన్ ఆర్కాట్ రామస్వామి మొదలియార్ చర్చలు మొదలు పెట్టారు. ఆర్కాట్ వారే స్వయంగా పోర్టికో వరకూ వచ్చి కె.సి.రెడ్డిగారిని స్వాగతించారట. అలాగే వీడ్కోలు పలికారట! ఒక నెల రోజులుగా సత్యాగ్రహులపై అమానవీయ దమనకాండను చేసిన ఆర్కాట్ గారిలో ఎంత హృదయ పరివర్తన!

సెప్టెంబర్ 12వ తేదీన ఉద్యమం ముగిసింది. ఆ రోజే మా ఇన్‌క్విలాబ్ చివరి సంచిక. మా సైక్లోస్టయిల్ యంత్రానికి అజ్ఞాతవాసం ముగిసింది. మా ఆవరణలోనే ఒక బల్లపై యంత్రాన్ని పెట్టి బహిరంగంగా సంచిక యొక్క సుమారు 2000 ప్రతులను తీసి అక్కడికి వచ్చిన వారందరికీ పంచాము. పోలీసులకూ పంచాము. పోలీసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొందరికి ఆశ్చర్యం వేసింది. కొందరు నవ్వుకుంటూ వెళ్ళారు. పోలీసువారు మేము ప్రకటించే స్థలం సమీపంలోనే ప్రతిరోజూ తిరుగుతూ ఉన్నా వారికి దీనిని కనిపెట్టలేక పోయారు!

జవాబుదారీ ప్రభుత్వం

‘మైసూరు చలో’ ఉద్యమం విజయవంతంగా జవాబ్దారీ ప్రభుత్వాన్ని రాజ్యానికి తెచ్చియిచ్చింది. మొదటి మంత్రి మండలిలో తొమ్మిది మంది శాసకులు మంత్రులయ్యారు. వారిలో ఆరుగురు కాంగ్రెస్ మంత్రులు, ముగ్గురు కాంగ్రెసేతరులు.

కాంగ్రెస్ మంత్రులు

  1. కె.చెంగలరాయ రెడ్డి (ముఖ్యమంత్రి)
  2. హెచ్.సి.దాసప్ప
  3. కె.టి.భాష్యం
  4. హెచ్. సిద్ధయ్య
  5. టి.మరియప్ప
  6. ఆర్.చెన్నిగరామయ్య

కాంగ్రెసేతర మంత్రులు

  1. పామిడి సుబ్బరామ శెట్టి
  2. మహమ్మద్ షరీఫ్
  3. డి.హెచ్.చంద్రశేఖరయ్య

1947 అక్టోబర్ 29న శ్రీ కె.చెంగల్రాయ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసింది.

ఒప్పందం ప్రకారం చతురుడు ఆర్కాట్ రామస్వామి మొదలియార్ పేరుకు మాత్రం దివాన్‌గా 1949 మే నెల వరకు కొనసాగారు. మహారాజు గారు రాజ ప్రముఖులయ్యారు.

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం, రాజ్యానికి జవాబుదారీ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టిన ‘మైసూరు చలో’ ఉద్యమం – ఈ రెండు ఉద్యమాలలోను ఎలాంటి కష్టనష్టాలను లెక్కచేయకుండా నేను చురుకుగా పాల్గొనడం నాకు గొప్ప సంతృప్తిని కలిగించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here