[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]మా[/dropcap] ఎదురింటికి ఫంక్షన్‌కి వెళ్ళి వస్తూండగా తట్టింది.. ఈ టాపిక్.
ఏంటంటే.. వాళ్ళ పిల్లాడు పుట్టినరోజు.. ఓకే.. బావుంది.
చిరంజీవికి అక్షింతలు, ఆశీస్సులు.
కేక్ కటింగులూ, బెలూన్లూ, హేపీ బర్త్ డే టూ యూ.. పాటలూ కేకలూ.. ఓకే.. పిల్లలకి ఎంజాయ్‌మెంట్ బాగానే ఉంది.
తర్వాత భోజనాలు..
ఫ్రైడ్ రైసూ, గోబీ మంచూరియా, నూడిల్స్, సమోసాలూ, బేబీ కార్న్‌తో ఏదో మసాలా కూరా.. సరే.. ఇష్టమయిన వారందరూ బానే పట్టించారు.. సరే, ఇదీ ఓకే కాదనను.. నా లాంటి వృద్ధ బాపతులు.. ప్రసాదంలాగా నోట్లో వేసుకుని ‘మమ’ అనిపించాము.. మన ఇంటికెళ్ళి ఏదో పండో, ఫలమో ఆరగించి గ్లాసుడు మజ్జిగ తాగే ఆప్షన్ ఉంటుంది కదా! కాబట్టి ఇది కూడా బాగానే ఉంది.
ఆ తర్వాతే.. వెళ్ళొస్తాం అని లేవగానే, ఆ ఇంటావిడ.. “బోలెడు ఆర్డరిచ్చి తెప్పించాం.. బోలెడు మంది వస్తామని చెప్పి రాలేదు. బోలెడు మిగిలిపోయాయి. వేస్ట్ అయిపోతాయి” అని చెపుతూ.. ఆ మిగిలిన పదార్ధాలు డబ్బాకి సర్ది ఇస్తూ.. పదే పదే..
“మిగిలిపోయాయి పట్టుకెళ్ళండి, మిగిలిపోయాయి పట్టుకెళ్ళండి” అంటూంటే ఓకేనా?
మామూలుగా ఇప్పుడు అమెరికాలయినా, ఇండియాలో అయినా పార్టీలు, ఫంక్షన్‌ల సమయంలో మిగిలిపోయిన పదార్థాలు వచ్చిన ఫ్రెండ్స్ ఎవరికి కావలిసినవి పట్టుకెళ్ళడం రివాజే. అందులో తప్పేం లేదు. పదార్థాలు వృథా అవకుండా ఉంటాయి. ఆ టేబుల్ మీద పక్కగా జిప్ లాగ్ కవర్లూ, డిస్పోజబుల్ డబ్బాలూ పెట్టేసి ఉంచుతారు. ఎటువంటి మొహమాటాలూ లేకుండా పట్టుకెడతారు.
ఇది ఓకేనే..
కానీ.. కొందరు అనే మాటలు ఎలా ఉంటాయంటే.. “అబ్బే! ఈ మిగిలినవి మేమిక తినం.. మిగిలినవన్నీ మీరు పట్టుకుపోండి” అనో,
లేదా.. “ఇవి కేవలం ఈ ఫంక్షన్ కోసం తెప్పించాం. మామూలుగా అయితే మేం నోట కూడా పెట్టం. మా ఇంట్లో ఎవరూ తినరు. మిగిలినవి మేమేం చేసుకుంటాం.. మీరు పట్టుకుపోండి” అంటూంటారు.
అంటే వాళ్ళకి అక్కర్లేనివీ, ఇష్టం లేనివీ.. మాత్రం అందరికి చెప్పి మరీ అంటకడతారన్నమాట.
ఓసారి ఒకరు ఇలాగే, “ఛీఛీ.. ఇవి మేం తినమండీ! మీకు డబ్బాలో పెట్టిచ్చేస్తాను” అనగానే.. “ఇక్కడ తప్పదని అలా కొంచెం నోట పెట్టాను కానీ, మా ఇంటిల్లిపాదికి ఇవి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు మీరిచ్చినా డస్ట్‌బిన్‌లో పారేసేదే.. అదేదో మీరే పారేసుకోండి” అని చెప్పాను.
సగటు మనిషి మనస్తత్వం అలాగే ఉంటుంది కాబోలు..
మనకి ఎక్కువయినది తోటివారికివ్వడం కాదనము..
కానీ మనకి ఇష్టం లేనిది, మనకి నచ్చనిది.. ఇవ్వడం ఎలా ఉంటుంది? పైగా.. అదీ ఆ మాట అంటూ ఇవ్వడం.. అదే, ఇది నాకు ఇష్టం లేదు అంటూ ఇవ్వడం.. ఎలా ఉంటుందీ? ఒకవేళ తీసుకునేవారికి ఆ వస్తువు, వంటకమో ఇష్టమే అయినప్పటికీ, .ఎదుటివారు తమ అయిష్టత తెలియచేస్తూ మరీ ఇవ్వడం అనేది సబబు కాదని నా అభిప్రాయం.
మా నాన్నగారు ఎప్పుడూ అనేవారు.. ‘ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకున్నపుడు మనకి ఇష్టమయినదే ముందు వారికి ఇవ్వాలి’ అని.
“ఇది నీకు ఇష్టం కదా! మరి కొంచెం తీసుకువెళ్ళు” అనో.. లేదా.. “ఈ వంటకం తెప్పించినపుడు/చేసినప్పుడు నువ్వే గుర్తు వచ్చావు. ఇదంటే నీకు చాలా ఇష్టం కదూ.. నీకోసం ప్రత్యేకంగా పేక్ చేసాను. తీసుకో” అని ఇవ్వడం ఎంత బావుంటుంది.
అదండీ సంగతి. కాబట్టి ఇచ్చేదేదో ఇష్టంగా ఇద్దాము. ప్రేమగా ఇద్దాము. ఆప్యాయంగా ఇద్దాము.