దేశ విభజన విషవృక్షం-45

0
4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]ముం[/dropcap]దు దుండగులు.. దోపిడీదారులు.. ఆ తరువాత రాజులు.. ఆ తరువాత సూఫీలు.. ఆ తరువాత స్కాలర్లు.. వీరికి అండగా మార్క్సిస్టులు.. కమ్యూనిస్టులు.. ఇలా ఒకరి తరువాత ఒకరుగా ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి బలంగా పూనుకున్నారు. ఇందులో భాగంగానే మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు. అదే తరువాతి కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. స్వాతంత్ర్యానికి పూర్వరంగంలో పాకిస్తాన్ ఏర్పాటు వ్యూహ ప్రతివ్యూహాలకు కేంద్ర స్థానంగా మారింది. 1886లో ఇదే సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్‌ను స్థాపించాడు. ఆ తరువాత ముస్లిం ఉన్నత వర్గాన్ని రాజకీయంగా ప్రేరేపితం చేసి ముస్లింలు ఒక ప్రత్యేక జాతిగా (మత వర్గంగా కాదు) గుర్తింపు తేవటమే కాకుండా.. ప్రత్యేక దేశమనే భావనకు ఈ కాన్ఫరెన్స్ ఆజ్యం పోసింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే.. 1857 తొలి స్వాతంత్ర్య సంగ్రామం సందర్భంలోనే బ్రిటీషర్లకు ముస్లింలు బాగా బాగా దగ్గరయ్యారు. చాలా చోట్ల వారికి మద్దతుగా నిలిచారు. వీరందరిలోనూ సర్ బిరుదును పొందిన సయ్యద్ అహ్మద్ ఖాన్.. ముస్లిం ఎజెండాను విజయవంతంగా అమలుచేశాడు. 1857లో బ్రిటిషర్లకు వెన్నంటి నిలిచిన సయ్యద్‌కు బ్రిటీషర్లు పూర్తి అండగా నిలిచారు. కావాల్సినన్ని నిధులు సమకూర్చారు. ఉర్దూను ప్రమోట్ చేశారు. ముస్లిం మత కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. 1857.. 1859..1863..1975..1886 ఇవన్నీ కూడా వరుసగా ప్రత్యేక ముస్లిం అనుకూల ఉద్యమ నిర్మాణానికి బీజం వేశాయి. వీటన్నింటిలోనూ సదరు సయ్యద్ అహ్మద్ ఖానే కీలక పాత్ర పోషించాడు. వీళ్లు చేసిన పని.. మొదట ముస్లింలలో ముఖ్యంగా ముస్లిం ఉన్నత వర్గాలను రాజకీయంగా ప్రేరేపించడం.. ఇందుకోసం ఇస్లామిక్ సంప్రదాయ విద్యతోపాటు.. ఆంగ్ల విద్యాభ్యాసాన్ని కూడా చేసేలా చేయడం ద్వారా ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేశారు. విచిత్రమేమిటంటే.. ముస్లింలలో ఉన్నత వర్గాలను మాత్రమే తమ లక్ష్య సాధనకోసం ఎంచుకున్నారు. వీరిలో అత్యధికులను రాజకీయాల్లోకి తీసుకొని రావడమే ప్రధాన ఉద్దేశం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సదస్సుల్లో.. ఆ పార్టీ నాయకత్వాన్ని, సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శించడం ద్వారా వారిని ఒక విధంగా ఆత్మన్యూనతలోకి నెట్టేసే ప్రయత్నం జరిగింది. భారత దేశం రెండు విభిన్న జాతులు కలిగి ఉన్నదని.. ఈ రెండు జాతుల మధ్య సామరస్యం పొసగదని.. కాంగ్రెస్ సదస్సుల్లో అదే పనిగా విమర్శించడం మొదలైంది. ఈ విమర్శలు చేసిన వారిలో ఎక్కువ మంది అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి వచ్చినవారే కావడం విశేషం. 1886లో ఏర్పాటైన మహమ్మడన్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఆ తరువాత చాలాకాలానికి ఈ కాన్ఫరెన్సే అఖిలభారత ముస్లిం లీగ్‌గా పరివర్తనం చెందింది. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. అలీగఢ్ ఉద్యమానికి నిధులు సమకూర్చడం.. తద్వారా తాము అనుకున్న ఉన్నత వర్గ ముస్లింలలో రాజకీయ స్పృహ కల్పించి.. ద్విజాతి సిద్ధాంతం వైపు నడిపించడం. ఈ ద్విజాతి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీని పూర్తి అయోమయంలోకి నెట్టేసిందనే చెప్పాలి. ముస్లిం ప్రముఖులను పార్టీ సమావేశాలకు ఆహ్వానించడం.. ఆ తరువాత వారి డిమాండ్లకు అనుకూలమైన తీర్మానాలను ఆమోదించడం.. అనుకూలమైన కార్యాచరణ ప్రకటించడం ప్రారంభమైంది. ముస్లిం సంతుష్టీకరణ 1910 క్రమంగా ఊపందుకొన్నది. మహాత్మాగాంధీ, నెహ్రూ నాయకత్వంలోకి కాంగ్రెస్ వెళ్లిపోయిన తరువాత ఈ సంతుష్టీకరణ పరాకాష్టకు చేరుకొన్నది. భారతదేశం ఒక జాతి అవునా కాదా అన్న చర్చను కాంగ్రెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా లేవదీశారు. ఆంగ్లో ఇండియన్ నాయకులు ఈ దేశం రెండు జాతులది అని చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వాళ్లు ప్రధానంగా దృష్టి సారించింది హిందూ, ముస్లింలే తప్ప మిగతా మతాలను గురించి ఎన్నడూ పట్టించుకోలేదు.. చర్చించలేదు. జనాభాలో హిందువుల తరువాత అధికంగా ఉన్న ముస్లింల సంతుష్టీకరణ మూల హేతువుగా ఈ దేశంలో ద్విజాతి సిద్ధాంతాన్ని అదే పనిగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. చివరకు జాతీయ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈ సిద్ధాంతాన్ని కొండొకచో అంగీకరించారు. కానీ.. నాటి హిందువులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. జాతీయత, జాతీయ వాదం అనేవి ప్రజల జీవన సంస్కృతులు, నాగరికతలకు సంబంధించినవే తప్ప మతానికి సంబంధం లేనిదని వారు గట్టిగా ప్రతిఘటించారు. జాతీయత అనేది ఆయా దేశాల ప్రజల ప్రత్యేక గుణాలుగా ప్రపంచం భావించినట్టే.. భారతదేశ హిందువులు కూడా భావించారు. స్వాతంత్య్రోద్యమం, స్వపరిపాలన వాంఛ కూడా బలపడటానికి కారణం ఈ జాతీయతేనన్నది మరచిపోవద్దు. ‘భారతదేశానికి జాతీయత లేదని వాదించడం అంటే.. సమావేశమవుతున్న ప్రజలు దుస్తులు లేకుండా నగ్నంగా ఉన్నారని మాట్లాడటమే’ అని హెచ్.జీ.వేల్స్ వ్యాఖ్యానించడం గమనార్హం. అలీగఢ్ ఉద్యమం ద్వారా ప్రారంభమైన ఈ రగడ భారత దేశమంతటా చర్చనీయాంశమైంది. సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రభావితులైన మేధావుల రాజకీయ వ్యూహం సూపర్ సక్సెస్ అయింది. భారతదేశం ఒకే జాతి అని చెప్పడానికి, అందరినీ ఒప్పించడానికి హిందువులు, స్వపరిపాలన కోసం ఉద్యమిస్తున్న వారంతా ఒక పోరాటమే చేయాల్సి వచ్చింది. 19 వ శతాబ్దం చివరి సంవత్సరాలన్నీ కూడా ఈ కోవలోనే సాగాయి. అప్పటికి మహాత్మాగాంధీ ప్రవేశం భారతదేశంలోకి జరుగలేదు. దాదాపు పాతికేండ్ల పాటు ఈ చర్చ కొనసాగిందనే చెప్పాలి. ముస్లిం మేధావులంతా ఏక స్వరంతో తమది అంతా ఒక జాతి అని తమకు ప్రత్యేక హక్కులు, సదుపాయాలు కావాలని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా నాడు కావాల్సింది అదే. మరో పక్క ఆంగ్లో ఇండియన్ రాజకీయ వాదులంతా ఈ వ్యవహారానికి దూరంగా తటస్థంగా ఉండిపోయారు. ముస్లిం మేధావులు మాత్రం తమ అజెండాను చాలా దూరదృష్టితో అమలు చేస్తూ పోయారు.

భారతదేశంలో జాతీయత అన్న చర్చపై నాటి భారత దేశంలో హిందువుల అభిప్రాయం ఎలా ఉన్నదో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏమన్నారో ఒక్కసారి చదవండి.. ‘హిందువుల, ముస్లింముల మధ్య ఎలాంటి జాతి భేదాలు లేవన్నది వారి మొట్ట మొదటి వాదన. పంజాబ్ ముస్లింలు, పంజాబీ హిందువులు, బెంగాలీ ముస్లింలు, బెంగాలీ హిందువులు, బీహారీ ముస్లింలు, బీహారీ హిందువులు, యూపీ ముస్లింలు, యూపీ హిందువులు, మద్రాసు ముస్లింలు, మద్రాసు హిందువులు.. అందరూ ఒకే జాతికి చెందిన వారు. మద్రాసు ముస్లిం, మద్రాసు బ్రాహ్మణుడి మధ్యన.. మద్రాసు, పంజాబీ బ్రాహ్మణుల మధ్య కంటే ఎక్కువగా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. హిందువులకు, ముస్లింలకు మధ్య భాష పరమైన సమైక్యత పూర్తిగా ఉన్నది.. పట్టణాల్లో ఉండే ముస్లింలు మాత్రమే ఉర్దూను, హిందువులు ఆ రాష్ట్ర భాషను ఉపయోగిస్తున్నారు. పట్టణాలకు వెలుపల హిందువులు, ముస్లింల మధ్య భాషాపరమైన సమైక్యతగా భారతదేశంలో కలిసి మెలిసి జీవిస్తున్నారనేది మూడో అంశం.. జాతి సమైక్యత పరంగానే కాక, రెండు రకాల సాంస్కృతిక జీవనానికి సంబంధించి కూడా సామాన్యుల మీద కూడా విశ్వాసం ఉంచటం జరిగింది. చాలా మంది ముస్లింల సామాజిక జీవనంలో అనేకానేక హిందూ సంప్రదాయాలు పెనవేసుకుపోయాయి. పంజాబ్‌లో గల అవన్‌లో అందరూ ముస్లిములే. కానీ వారు తమ పేర్లలోనూ, వంశావళిలోనూ బ్రాహ్మణీయ రీతి సంప్రదాయాలను కొనసాగించటమన్నది ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ముస్లిములలో చాలామందికి హిందువుల ఇంటి పేర్లు ఉన్నాయి. చౌదరి అనే ఇంటిపేరు హిందువులకు చెందింది. ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో చాలామంది ముసల్మానులకు చౌదరి ఇంటి పేరు ఉన్నది. పెళ్లి తంతులో కొన్ని ముస్లిం వర్గాలు కేవలం పేరుకే ముస్లిం మతస్థులు. వారు వివాహ మహోత్సవాలలో హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. మొదట హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకొని.. తరువాత ముస్లిం ఖాజీని పిలిచి ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకుంటున్నారు. కొన్ని ముస్లిం వర్గాలు వివాహం, వారసత్వం, పోషకత్వ బాధ్యతల విషయాలలో హిందూ న్యాయ సూత్రాలను అనుసరిస్తున్నాయి.. హిందూ యోగులు ముస్లింలను శిష్యులుగా చేసుకున్నారు. ముస్లిం పీరులు హిందువులను శిష్యులుగా చేర్చుకున్నారు.. ఇవన్నీ యథార్థమనటంలో ఎలాంటి సందేహాలకు తావు లేదు. ముస్లింలు అనేకులు హిందువుల జాతికి చెందిన వారే అనటంలో కూడా ఏ విధమైన సందేహాలు లేవు.” (అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, 8 వ సంపుటం, స్వస్థానం కోరుతున్న జాతి.. పే. 17, 18, 19)

డాక్టర్ అంబేద్కర్ రచనలోని ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. మనకు అనేక అంశాలు గోచరిస్తాయి. ముస్లిం మత మార్పిడులు పూర్తిగా ఇష్టంగా జరిగినట్టు లేదని స్పష్టమవుతున్నది.. ఉత్తర భారతదేశంలోని అన్ని మార్పిడులు కూడా హిందువులలో జరిగినవే కానీ.. అనేకానేక కుటుంబాల్లో సంపూర్ణ మత మార్పిడి జరుగలేదు. అంటే ఈ దేశంలో జరిగింది బలవంతపు మత మార్పిడులేనని తేలిపోయింది. ఒకటి రెండు తరాలు పైకి ముస్లింలుగా వ్యవహరించినప్పటికీ.. అంతర్గతంగా తమ ధర్మాన్ని, సంప్రదాయ ఆచారాలను విడిచిపెట్టలేదని స్పష్టంగానే అర్థమవుతున్నది. భయంతోనో.. ఆందోళనతోనో.. సరైన ప్రబోధకులు లేకపోవడం వల్లనో.. తరువాతి తరాల వారు పేరుకు ముస్లింలుగా ఉన్నప్పటికీ.. తమ ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలను, సామాజిక జన జీవనాన్ని పూర్తిగా విడిచి పెట్టలేక పోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని ముస్లింలకు ఇస్లామిక్ భాష కూడా వంటబట్టలేదు. ఈ మాటలు ఎవరో చెప్పినవి కాదు. సాక్షాత్తూ డాక్టర్ అంబేద్కర్.. ఆనాటి భారతదేశంలోని సామాజిక జీవనాన్ని ఆమూలాగ్రం పరిశీలించి పేర్కొన్న మాటలివి. సామాన్య ప్రజల కుటుంబాల్లో ఆనాటికి ఇంకా మూలాలు అంతరించిపోలేదు. మొదటి నుంచి మతమార్పిళ్లకు పాల్పడిన అన్ని సందర్భాల్లోనూ.. మతం మారని వారితో ఎలాంటి సంబంధాలు కొనసాగకుండా.. వారి సంస్కృతి, సంప్రదాయాలతో సంబంధం కొనసాగించకుండా, వారిని పూర్తి శత్రువులుగా మాత్రమే చూడాలన్న ఇస్లామీకరణ ప్రధాన సూత్రం అరేబియాలో, పర్షియాలో ఇతర ప్రాంతాల్లో సక్సెస్ అయినట్టుగా భారతదేశంలో కాలేదని అంబేద్కర్ వ్యాఖ్యలు చెప్పకనే చెప్తున్నాయి. బ్రిటీష్ వాళ్లు వెళ్లి పోయేనాటికి కూడా ఈ రకమైన జనజీవనం ఈ దేశంలో కనిపించింది. అందువల్లనే దారుల్ ఇస్లాంగా భారతదేశాన్ని మార్చాలన్న ముస్లిం చొరబాటుదారులు, సూఫీలు, ఉలేమాల వంటి సమస్తమైన శక్తుల వల్ల సాధ్యం కాలేదు. అందువల్లనే.. ఈ దేశాన్ని కనీసం ముక్కలైనా చేయాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఇందుకు సయ్యద్ అహ్మద్ ఖాన్ మూలపురుషుడయ్యాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రధానంగా సాగించిన బ్రిటీష్ పాలకులకు సయ్యద్ అహ్మద్ ఖాన్ అండగా దొరికాడు. ఈయన ప్రారంభించిన అలీగఢ్ ఉద్యమం దేశాన్ని ముక్కలు చేసేదాకా కొనసాగింది. ఆ తరువాత కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉత్పత్తులు కాంగ్రెస్ పార్టీ సదస్సులకు హాజరై పార్టీ విధానాలను విమర్శించడం.. ముస్లిం ప్రత్యేక అస్తిత్వ డిమాండ్లు చేయడం మొదలైంది. ఇదే సమయంలో 1905లో దేశంలో తొలి విభజన జరిగింది (దీని గురించి తరువాతి వ్యాసంలో చర్చించుకొందాం.). అది బెంగాల్ విభజన. తూర్పు బెంగాల్‌ను విడగొడుతూ బ్రిటీష్ రాజ్యం నిర్ణయం తీసుకోవడం బ్రిటీష్ రాజ్యంపైనే కాదు.. రెండు మతాల మధ్యన తీవ్రమైన ఆఘాతాన్ని సృష్టించింది. ఆ తరువాత ముస్లిం మేధావులు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో అంటకాగటం కంటే కూడా.. ముస్లింలకు ప్రత్యేకంగా రాజకీయ పార్టీ కావాలన్న డిమాండ్ పెరిగిపోయింది. 1886లో ఏర్పడిన సయ్యద్ అహ్మద్ ఖాన్ స్ధాపించిన మహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ లోనే రాజకీయ పార్టీ ఆవిర్భావం గురించిన చర్చ మొదలైంది. మొదట్లో ఈ సంస్థలో రాజకీయ చర్చలు ఉండవని విధి నిషేధాలు పొందుపరుచుకొన్నప్పటికీ.. క్రమంగా దాని ఉద్దేశం మారింది. 1906 సెప్టెంబర్‌లో లక్నోలో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి ముస్లిం ప్రతినిధులు హాజరై ముస్లింల కోసమే ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడంపై పరిశీలించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ 27 నుంచి 30 వరకు ఢాకాలో ప్రత్యేక సదస్సు జరిగింది. నవాబ్ వకార్ ఉల్ ముల్క్ కంబోహ్, నవాబ్ ముహ్సిన్ ఉల్ ముల్క్ఖ్ నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముస్లింను ప్రత్యేక జాతిగా గుర్తించాలని తీర్మానం జరిగింది. సమావేశం బ్యానర్ లోనే ముస్లింల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్తూ నినాదం రాశారు. ఈ సదస్సులోనే పార్టీ ఏర్పాటు ఖరారైంది. ఢాకా నవాబు సలీముల్లా ఖాన్ పార్టీ లక్ష్యాలను రూపొందించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాడు. అప్పుడు పార్టీకి ఆలిండియా ముస్లిం కాన్ఫెడరసీ అని పేరు పెట్టారు. నవాబు ప్రతిపాదనలను హకీమ్ అజ్మల్ ఖాన్, మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ (ఖిలాఫత్ ఉద్యమకారుడు), జాఫర్ అలీఖాన్, లక్నో న్యాయవాది సయ్యద్ నబీవుల్లా, మరో న్యాయవాది సయ్యద్ జహూర్ అహ్మద్ తదితరులు పార్టీ ఏర్పాటు ప్రతిపాదనలను అంగీకరించారు. దీంతో పార్టీ ఏర్పాటు సంపూర్ణమైంది. ఇదే తదనంతర కాలంలో అఖిలభారత ముస్లిం లీగ్‌గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి ముస్లిం లీగ్ ప్రత్యేక దేశ అజెండా అమలు కావడం మొదలైంది.

వచ్చేవారం బెంగాల్ విభజన.. వందేమాతరం ఉద్యమం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here