మోడస్ ఆపరాండి

    0
    8

    [box type=’note’ fontsize=’16’] తెలివిగా నేరాలు చేస్తున్న ఓ పెద్దమనిషిని అంతే తెలివిగా పట్టుకున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ గురించి “మోడస్ ఆపరాండి” కథలో చెబుతున్నారు ఆనందరావ్ పట్నాయక్. [/box]

    [dropcap]ఉ[/dropcap]దయం తొమ్మిది కావస్తుంది. పోలీసుస్టేషను ముందు మోటారుసైకిలు ఆగింది. ఇనస్పెక్టరు జేమ్సబాండ్ బండి దిగి వచ్చాడు. నిజానికి అతనికి మరో పేరేదో ఉంది. కాని నేర పరిశోధనలో మంచి దిట్టని, ఎటువంటి క్లిష్టమైన కేసులని ఇట్టే అవలీలగా ఛేదించే నేర్పు ఉందని డిపార్టుమెంటులో మంచి పేరుంది. కుర్చీలో కూచొని ఫైల్సు తిరగేస్తున్నాడతను. ఆ రోజు కోర్టుకి ఫార్వర్డు చెయ్యాల్సిన నేరస్తుల జాబితా పరిశీలించాడు. అందులో ఒక పేరు చూసి ఉలిక్కిపడ్డాడు. సౌజన్యమూర్తి. పొరబాటు పడలేదు. లాకప్పులో ఉన్న మూర్తిని హాజరుపర్చారు. తెల్లని చొక్కా, తెల్లని పైజామా, నుదుట ఎర్రని బొట్టు. మూర్తీభవించిన కరుణదేవతలా ఉన్నాడతను.

    ఇనస్పెక్టరుని చూడగానే “సాయిరాం సారూ…” అన్నాడు మూర్తి.

    “కూచోండి…” అనగానే కుర్చీలో బైఠాయించాడతగాడు.

    “ఏమయింది చెప్పండి మూర్తిగారూ…” సౌమ్యంగా అడిగాడు.

    “చెప్పడానికి ఏముంది సారూ… నిన్న ఆ హత్య నేనే చేసాను”.

    “ఎందుకు… కారణం… హతుడికి మీకు ఉన్న సంబంధం ఏమిటి…” తన ధోరణిలో ఆరా తీస్తున్నాడు ఇనస్పెక్టరు.

    “బాబా ఆదేశం ఇచ్చారు… అ పాపిని పంపించమన్నారు. చంపాను…” మాట తడబడడం లేదు మూర్తికి.

    స్టేషను బయట కారాగింది. సాయికుమార్ వచ్చాడు. ఇనస్పెక్టరుకి నమస్కారం చేసి

    “ఏమిటి నాన్నా ఇది… రోజు రోజుకి నీ మతి మండిపోతుంది. ఇనస్పెక్టరు మనవాడు కాబట్టి సరిపోయింది… కేసు లేకుండా…”

    ముందర కాళ్లకి బంధం వేసాడు ఆ వ్యాపారవేత్త. అతనికి ఒక బంగారుషాపు, రెండు మిల్లులు, మూడు హోటల్సు ఉన్నాయి. ప్రతీనెల స్టేషనుకి ముడుపులు చెల్లిస్తాడతను, అదీ పెద్ద మొత్తంలో.

    తండ్రికి వయసు పెరగడంతో పిచ్చి ముదిరిందని వాపోయాడు సాయికుమార్. కరుణ, జాలి అన్న పదాలు పోలీసు డిక్షనరీలో లేవు, ఉండవు కూడా. అయినా జేమ్సుబాండు అందుకు భిన్నం. కొడుకుతో వెళిపోతున్న మూర్తిని చూసాడు. అతని చొక్కాకు ఒక స్లీవ్ లేదు. టయిం అవ్వడంతో ఆరోజు కోర్టులో హాజరుపరిచేందుకు ముద్దాయిలను బయటకు తీసుకువచ్చారు. వాళ్లలో ఒకడి ఫేంటు పైకి మడిచి ఉంది. తెల్లటి బ్యాండేజీ కట్టినట్లుంది. రాత్రిపూట అనుమానం మీద ఒక నేరస్తుడిని తీసుకొచ్చి పోలీసులు ధర్డు డిగ్రీ ప్రయోగించారు. రక్తాలు వచ్చినట్లు కొట్టారు, లాకప్పులో మూసారు. వాడికి శుశ్రూషలు చేసి కాలికి కట్టుకట్టాడు మూర్తి. దానికోసం తన ఫర్టు స్లీవ్ చింపాడు. సెంట్రీ చెప్పిన విషయం విని మూర్తి మానవతా హృదయానికి మనస్సులోనే జోహార్లు అర్పించాడు.

    ముందురోజు రాత్రి రిటయిర్డు డి.ఎస్పీ హత్యకు గురయ్యాడు. పై ఊరి నుండి వచ్చి సాయికుమార్ హోటలులో రూం తీసుకొని పడుకున్నవాడిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపారు. డబ్బు, బంగారం ఏవీ పోలేదు. తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. అనుమానించదగ్గ వ్యక్తులెవరూ  దొరక్క ఇనస్పెక్టరు ఇరకాటంలో పడ్డాడు.

    ***

    అమావాస్య రాత్రి. భోరున వర్షం కురుస్తోంది. ఎవరో తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచాడు సెంట్రీ. గొడుగు ముడిచి… “సాయిరాం…” అన్నాడు మూర్తి. ఆవులింత ఆపుకొని ఏమిటీ అన్నట్లు చూసాడు. మరు నిముషం సెల్లులో ఉన్నాడు మూర్తి. మర్నాడు ఉదయం ఇనస్పెక్టరు వచ్చీరాగానే హంతకుడు వచ్చి సరండరయిన విషయం చెప్పాడా కొత్త సెంట్రీ. ఆ ముందు రోజు రాత్రి రిటైయర్డు జడ్జీ హత్య జరిగింది. ఇనస్పెక్టరు లాఠీ తీసుకొని సెల్లు దగ్గరకు వచ్చాడు. రెండు మర్డర్సు ఈ ముద్దాయి మీద రుద్దేసి కేసు క్లోజ్ చేసే పధకం రచించాడు. నోరు తెరుకుపోయింది ఇనస్పెక్టరుకి. ముగ్గురు ముద్దాయిలతో ఉన్నాడు మూర్తి. కాని అతని ఆశ్యర్యానికి కారణం మూర్తి అండరువేరు, బనియన్‌తో ఉండడం. సెంట్రీ మీద విరుచుకుపడ్డాడు జేమ్సుబాండు.

    “అతనిదేమీ తప్పు లేదు సాయిరాం…” అన్నాడు మూర్తి…

    “మరి లోదుస్తులతో ఈ అవస్ధ ఏమిటీ…”

    “వర్షానికి వెంటిలేటరు గుండా నీటితుంపరులు పడి గదంతా తడిసింది. నా బట్టలతో తోటి సాయిరాంలని తుడిచి పడుకోబెట్టాను…” తాపీగా సమాధానమిచ్చాడు మూర్తి. వేపకాయంత వెర్రి కాస్త వెలక్కాయంతయిందనుకున్నాడు.

    “ముందు ఈ పిచ్చోడిని తీసుకొని పోకపోతే నిన్ను మర్డరు చేయాల్సి ఉంటుంద”ని సెంట్రీ మీద కసురుకున్నాడా ఖాకీ.

    ఈ సారి జరిగింది రిటయిర్డు జడ్జీ హత్య. అతగాడు ఒకప్పుడు ఆ టౌనులోనే పనిచేసాడు. అంతకన్నా క్లూలు ఏవీ లభించడం లేదు. హతుడ్ని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపారు. అదీ సాయికుమార్ హోటల్లోనే. అంతవరకూ ఎవరినీ అరెస్టు చేయనందుకు పై అధికారులు హెచ్చరించడంతో జేమ్సుబాండ్ తల పట్టుకు కూచున్నాడు.

    ***

    “బిక్షపతి లక్షాధికారి, కాని నిస్సంతు. దంపతులిద్దరూ ఎన్నో మొక్కులు మొక్కారు. మొత్తం మీద లేటుగా నైనా పుట్టిన పండుగాడిని అల్లారుముద్దుగా పెంచడంతో అల్లరి, ఆగడాలు ఎక్కువయ్యాయి. పెళ్లీడు రాగానే పెళ్లి చేసారు పేరెంట్సు. రికామీగా తిరుగుతున్న పండుగాడిని తమ బస్సుని అజమాయిషీ చెయ్యమన్నాడు తండ్రి. అప్పటికే ఒక బిడ్డకి తండ్రయపోయాడు పండు. పట్టపగలే కులుకుతున్న కొడుకుని పట్టుకొని కోడలి ముందే బూతులు తిట్టాడు బిక్షపతి. అవమానభారంతో బారుకెళ్లి బాగా తాగి బస్సుని చెక్ చెయ్యడానికి వెళ్లాడు. డ్రైవరు తెలిసే బండి ఆపలేదు. సిన్మాల్లో చూపినట్లు ఛేజ్ చేసి బస్సులో జొరబడ్డాడు పండు. కండక్టరు టికెట్ సొమ్ము స్వాహా చేసేసాడు. బస్సాపనందుకు డ్రయివరుని తిట్టాడు. మాటమాట పెరిగింది. తాగి ఉన్నాడు, తండ్రి చేసిన పరాభవం. పైగా డ్రయివరు ఎదురుతిరగడంతో పండుకి పట్టరాని కోపం వచ్చింది. టూలుబాక్సులోని ఇనపరాడ్‌తో ఒక్క దెబ్బ వేయడంతో డ్రయివరు చచ్చి ఊరుకొన్నాడు. ఉరిశిక్ష ఖాయం అనడంతో బిక్షపతి లక్షలు లంచంగా ఇచ్చాడు. పోలీసు ఇనస్పెక్టరు, మేజస్ట్రేటు, కండక్టరు డబ్బు మింగి మోసం చేసారు. పండుగాడికి శిక్ష పడింది. ఒక్కగానొక్క పిల్లాడు జైలు పాలవడం, సొసయిటీలో పరపతి పోవడంతో బిక్షపతి గుండాగి చచ్చాడు. నెల తేడాలో భర్తను వెతుకుతూ వెళ్లిపోయింది భార్య. జైలునుండి విడుదలయి వచ్చిన పండు తని మోసం చేసిన వాళ్లని చంపేస్తానని కత్తి తీసాడు. ముందు తనని, కొడుకుని చంపి వెళ్లమంది పండు భార్య. వాళ్ల మొహాలు చూసి చల్లబడ్డాడు. అటువంటి పాడుపనులు చేయనని మాట ఇచ్చాడు పండు. ఆస్తంతా అమ్మేసి టౌనుకి వచ్చేసారు”

    చెప్పడం ఆపి కానిస్టేబులు వైపు చూసాడు జేమ్సుబాండ్. కోక్ అందించాడు వాడు. అది ప్రెస్ కాన్ఫరెన్సు. జంట మర్డర్‌లతో అట్టుడికి పోయింది జిల్లా జిల్లా. పెద్ద సంఖ్యలో ప్రెసువాళ్లు, పబ్లిక్‌తో హాలు కిటకిట లాడుతోంది. ముందు వరుసలో కూచున్న లేడీ రిపోర్టరు విప్పారిన కళ్లతో చూస్తుంది. ఆ కళ్లలో మెచ్చుకోలు కన్పడడంతో ఇనస్పెక్టరు రెచ్చిపోయాడు. ఇనుమడించిన ఉత్సాహంతో కథనం కొనసాగించాడు.

    “పట్టణం వచ్చిన పండు పైసలు పాతి పసిడి పండించాడు. కొద్ది రోజులల్లో కోటీశ్వర్ల జాబితాలో చేరాడు. కొడుక్కి పెళ్లి చేసి, వ్యాపారాలు అప్పజెప్పి విశ్రాంత జీవనం గడపసాగాడు. కాని ప్రశాంతంగా ఉండలేకపోయాడు. గతం అతని బుర్రని దొలిచేయడం మొదలబెట్టింది. తన తలిదండ్రుల చావుకి, తనను కటకటాలపాలు చేసిన కారకుల మీద పగ తీర్చుకోవాలనుకొన్నాడు. భార్య పోవడంతో ఒట్టు తీసి గట్టున పెట్టాడు పండుబాబు”.

    ఒక్కసారి నిశ్సబ్దం అలముకొంది. జేబురుమాలు తీసి మొహం తడుచుకున్నాడు బాండ్. పోలీసులు, విలేఖర్లు రెప్పవెయ్యడంలేదు. క్లైమాక్సు కోసం ఉగ్గబెట్టుకు కూచున్నారు.

    “మా పోలీసు పరిభాషలో చెప్పాలంటే ‘మోడస్ ఆపరాండి’ అన్న పదం ఉంది నేరస్తుల నేరప్రవృత్తి గురించి. ఒకే హంతకుడు రెండోసారి నేరం చేసినప్పుడు అదే పద్ధతి అనుసరిస్తాడు. హతుల చరిత్ర సమగ్రంగా శోధించాను. పండుబాబు హిట్ లిస్టులో కండక్టరొక్కడే మిగిలిపోయాడు. అప్పటినుండి నా బతుకు బస్టాండయిపోయింది”.

    హాలు నవ్వులతో నిండిపోయింది. టీ, టిఫిన్లు వచ్చాయి. అందరూ ఆబగా వాటి మీద పడ్డారు. లేడీ రిపోర్టరు మాత్రం ఒక బిస్కట్ అతి సుతారంగా కొరికి టీ తాగింది. ఈవిడగారు ఆ రంగంలో ఎక్కువ రోజులు మనలేదనకొని ఒక కంట ఆమెను గమనిస్తూ చెప్పడం ఆరంభించాడు.

    “గతంలో హతులకు వచ్చినట్లే కండక్టరుకి ఫోనుకాలు వచ్చింది. తమ సంఘం అతగాడిని గజమాలవేసి, గండపెండేరం తొడిగి కనకాభిషేకం చెయ్యదలుకొన్నదని దాని సారాంశం. సన్మానానికి తన అర్హత ఆలోచించలేదతను. సరేననడంతో ఫలానా హోటలులో, ఫలానా ఏ.సి.రూం బుక్కయిందని చెప్పడంతో మరో ఆలోచన లేకుండా వచ్చేసాడు కండక్టరు మహాశయుడు. తస్కారం సారీ సత్కారం అంటే ఆపరేషను టేబులు మీదున్నరోగి కూడా లేచొస్తాడు దండ వేస్తామంటే”.

    మళ్లా నవ్వులు పువ్వులయి రాలాయి.

    “నేను, నా బలగం బాత్రూంలో, మంచాల కింద దాక్కున్నాం. రాత్రవడం, పండుబాబు కీ తీసి వచ్చాడు. అది వాళ్ల హోటలే. దిండుతో చంపబోతున్న హంతకుడిని రెడ్ హేండెడ్‌గా పట్టుకొన్నాం. ముసుగులో మీ ముందున్నాడు. హంతకుడు ఎవరయి ఉంటారో ఊహించిన వాళ్లకు సన్మానం ఉంటుంది”.

    లేడీరిపోర్టరు ముసిముసి నవ్వులు క్రీగంట గమనించాడు ఇనస్పెక్టరు. ప్రేక్షకులు ఉద్వేగంతో ఊగిపోయారు తప్ప ఎవ్వరూ చెప్పలేకపోయారు. సస్పెన్సుకి తెర దించుతూ ముద్దాయి ముసుగు తొలగించాడతను. అతను…

    అతను… సౌజన్యమూర్తి  ఉరఫ్ పండుబాబు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here