మనసును దోచే పాట ‘యా ఆలీ.. రహం ఆలీ’

3
4

[గాంగ్‌స్టర్ సినిమాలో తనకు బాగా నచ్చిన ‘యా ఆలీ.. రహం ఆలీ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]

“బినా తేరే ఎక్ పల్ హో
నా బిన్ తేరే కభీ కల్ హో”

***

ఒక పాట గూర్చి నేను విశ్లేషణ వ్రాయటం ఇదే ప్రథమం.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతుంది ఈ పాట చిత్రీకరణ.

ఈ పాట ప్రారంభ దృశ్యంలో మెట్రో రైల్లో వెళుతున్న ఇమ్రాన్ హష్మీ, కార్లో వెళుతున్న షైనీ అహుజా ఒకరికి ఒకరు తెలియకుండానే ఎదురు ఎదురుగా వెళ్ళి పోతారు.

ఇది ఒక సింబాలిక్ దృశ్యం .

నమ్మకస్తులైన ఇద్దరు ముగ్గురు అనుచరులతో షైనీ అహూజా దొంగ పాస్‌పోర్ట్, వీసా సృష్టించుకుని ఒక మసీదు ఆవరణలోకి వస్తాడు.

అక్కడ పాప్ బాణిలో భక్తులు ఖవ్వాలీ పాడుకుంటూ తన్మయంగా ఉంటారు. అదే ఆవరణలో బిర్యానీ వండుతుంటారు ఇంకొందరు భక్తులు.

***

నేను ‘గాంగ్‍స్టర్’ సినిమా గూర్చి రివ్యూ వ్రాయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. అది మాములు సినిమానా ఇలా కూర్చుని అలా వ్రాయటానికి. ఓపికగా మళ్ళీ ఒకసారి, ఆపై మళ్ళీ ఇంకోసారి, ఆ పై మళ్ళీ మళ్ళీ చూసి వ్రాయాలి. ఇది జోక్ కాదు. ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు హృదయం భారంగా మారిపోతుంది. మోసాన్ని మోసంతోనే జయించాలన్నమాట వినటానికి బాగా ఉంటుంది కానీ  ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి – ఒక స్త్రీ యొక్క మనోభావాలతో ఆడుకోవటం ఎంత వరకు భావ్యం అనే ప్రశ్న తలెత్తుతుంది. కర్మ అనేది ఎంతటివారినైనా వదలదు. అతను చేసిన పనికి అతను ఎంత ఘోరంగా ప్రతిఫలం పొందాడు అనేది మనకి ఎలాగు తెలుస్తుంది సినిమాలో.

సరే ఈ చర్చ ఉపచర్చలు ఆ సినిమా గూర్చి రివ్యూ వ్రాసేటప్పుడు వివరంగా వ్రాస్తాను. ఇప్పుడు ఈ వ్యాసం ఆ సినిమాలోని ఒక పాట గూర్చి మాత్రమే.

ఏమిటి ఆ పాట అంటే ‘యా ఆలీ.. రహం ఆలీ’ అనే పాట.

అదేంటి ఆ పాటలో ఏమిటి అంత ప్రత్యేకత అంటారా, అదిగో అక్కడికే వస్తున్నాను.

మొదట పాట నేపథ్యం చెబుతాను.

నేర ప్రపంచం లోకి ప్రవేశించి, అదే జీవనాధారంగా చేసుకున్న తర్వాత ఇక వెనక్కు వచ్చే అవకాశం ఉండదు. బయటకి రావాలంటే ఒకటే మార్గం చచ్చిపోవటం. ఇలాంటి నేర సామ్రాజ్యంలో ప్రవేశించి చోటామోటా లీడర్‌గా ఎదిగి ఇంకా పైపైకి ఎదగాల్సిన తరుణంలో ఒక యువకుడు (షైనీ అహూజా) కంగనా రనౌత్‌తో ప్రేమలో పడతాడు.

ఆమె అతన్ని మారమని ప్రోద్బలం చేస్తుంది. గౌరవప్రదంగా జీవించమని అతన్ని కోరుకుంటుంది. అతను బాస్ గుల్షన్ గ్రోవర్ వద్దకి వెళ్ళి చెబుతాడు తన నిర్ణయాన్ని.

చెప్పాను కదా నేరప్రపంచం లోకి వెళ్ళిన వాళ్ళకి బయటకి రావటానికి ఉన్న ఒకే ఒక మార్గం మృత్యువు అని.

గుల్షన్ గ్రోవర్ అతనికి నచ్చజెబుతాడు నిర్ణయాన్ని మార్చుకొమ్మని. ఇతను వినడు.

వీళ్ళ చర్చ అంతా దక్షిణ కొరియ రాజధాని సియోల్‌లో ఒక మసీదు ప్రాంగణంలో జరుగుతుంది. ఆ సమయంలో మసీదులో కొదరు యువకులు పాప్ గీతం బాణిలో ఖవ్వాలి పాడుతుంటారు. ఆ ఖవ్వాలీ అర్థం షైనీ అహుజా మానసిక స్థితికి కూడా సరిగ్గా సరిపోతుంది.

గుల్షన్ గ్రోవర్ ఇతని వీసా, పాస్‌పోర్ట్ తీసి పొయ్యి దగ్గర మంటలోకి వేస్తాడు. అదృష్టవశాత్తు అది కాలిపోదు. పక్కన పడుతుంది.

గుల్షన్ గ్రోవర్ అనుచరులు నిరాయుధుడిగా వచ్చిన షైని అహుజని కుక్కని కొట్టినట్టు కొడతారు. మంచి వైపు వెళ్ళే ప్రయత్నం విఫలమయిన అతను ఇంచుమించు చావుకి దగ్గర అవుతాడు ఆ పోరాటంలో. అప్పుడు షైనీ అహుజాకి ఎవరో రహస్యంగా తుపాకిని అందజేస్తారు. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా అప్పుడు మృత్యువు అంచులలో ఉన్న అతను లేచి విలన్లందర్నీ షూట్ చేసేస్తాడు. ఈ పోరాటంలో షైనీ అహుజా ఆ విలన్లందర్ని హతమారుస్తాడు. గుల్షన్ గ్రోవర్‌ని కూడా గాయపరుస్తాడు. ఆ తరువాత అక్కడ పడి ఉన్న పాస్‌పోర్ట్ తీసుకుని పారిపోతాడు.

ఈ పోరాటం జరిగినంత సేపు నేపథ్యంలో ఈ పాట వస్తూ ఉంటుంది

ఇదిగో అదే ఈ పాట.

***

యా ఆలీ రెహం ఆలీ
యా ఆలీ యార్ పే కుర్బాన్ హై సభీ
యా ఆలి మదద్ ఆలీ
యా ఆలి యె మేరి జాన్ హై జిందగీ
ఇష్క్ పే హా, మిటా దూ లుటా దూ మై అపనీ ఖుదీ
యార్ పే హా, లుటా దూ మిటా దూ మైన్ అపనీ హస్తీ
యా ఆలీ రెహం ఆలీ
యా ఆలీ యార్ పే కుర్బాన్ హై సభీ
యా ఆలి మదద్ ఆలీ
యా ఆలి యె మేరి జాన్ హై జిందగీ
ముఝే కుచ్ పల్ దే కుర్బత్ కే
ఫకీర్ హూ మే తేరి చాహత్ మే
రహే బేచైన్ దిల్ కబ్ తక్
మిలే కుచ్ పల్ తో తాహత్ కే
చాహత్ పే, ఇష్క్ పే హా, మిటా ఊ లుటా దూ మై అపనీ ఖుదీ
యార్ పే హా, లుటా దూ మిటా దూ మైన్ అపనీ హస్తీ
యా ఆలీ రెహం ఆలీ
యా ఆలీ యార్ పే కుర్బాన్ హై సభీ
యా ఆలి మదద్ ఆలీ
యా ఆలి యె మేరి జాన్ హై జిందగీ
బినా తేరే ఎక్ పల్ హో
నా బిన్ తేరే కభీ కల్ హో
యే దిల్ బన్ జాయె పత్తర్ కా
న ఇస్ మే కోఇ హల్ చల్ హో
సనం పే హా, ఇష్క్ పే హా, మిటా ఊ లుటా దూ మై అపనీ ఖుదీ
కసం సే హా, లుటా దూ మిటా దూ మైన్ అపనీ హస్తీ
యా ఆలీ రెహం ఆలీ
యా ఆలీ యార్ పే కుర్బాన్ హై సభీ
యా ఆలి మదద్ ఆలీ
యా ఆలి యె మేరి జాన్ హై జిందగీ

***

తెలుగులో దగ్గర దగ్గరగా ఇలా చెప్పుకోవచ్చు ఈ పాటకి అర్థం.

~

ఓ దేవా నాపై దయ చూపు
ప్రేమకై నా సర్వస్వాన్ని బలి ఇచ్చుకుంటాను
ఓ దేవా నాకు సాయపడు
ఓ దేవా నా ప్రేమే నా జీవితం
ప్రేమ కోసం నా అహాన్ని, బలి ఇచ్చుకుంటాను
నా అస్తిత్వాన్ని బలి ఇచ్చుకుంటాను
కొన్ని క్షణాల సామీప్యాన్ని నాకు ప్రసాదించు
నేను ప్రేమకై జోలె పట్టిన ఒక ఫకీర్ని
ఇంకెంత కాలం ఈ గుండె ఈ వివశత్వాన్ని తట్టుకుంటుంది?
నాకు కొన్ని క్షణాల సాంత్వనని ప్రసాదించు
ఒక్క క్షణం కూడా ఎడబాటుని తట్టుకోలేను
నాకు రేపన్నది లేదు
(ఎడబాటు కారణంగా) నా గుండె శిలా సదృశ్యం అవుతుందేమో
హృదయ స్పందనలు సైతం ఆగిపోతాయేమో

***

ఈ పాట ఇంతగా ఎందుకు మనసులు దోస్తుంది అంటే, సినిమా చూస్తే అర్థం అవుతుంది.

ఈ పాటని అరబిక్ యువరాజు యొక్క మ్యూజిక్ బాండ్ రూపకల్పన చేసిన ‘యా ఆలి’ అనే పాటకి నకలు అని ఒక కోర్టు కేసు కూడా నడిచింది. అది వేరే సంగతి.

ఈ అసలు పాట ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ముస్లిం జానపద పాట నుంచి ప్రేరణ పొంది సౌది యువరాజు తన బాండ్‌తో పాడించాడట.

సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ పాటకి ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది.

మహేష్ భట్ కాంప్ నుంచి వచ్చిన ఈ సినిమా పాటతో ఇండియాలో పాప్ తరహా గీతాలకి నాంది పలికినట్టయింది. అంటే మనకి పాప్ తరహా గీతాలు లేవని కాదు. ఉత్సాహంగా ఉల్లాసంగా పాడే పాటలకి పాప్ తరహా బాణీలు మనకి కొత్త కాదు.

కానీ లోతైన భావాల్ని పలికిస్తూ గుండెల్ని పిండేసే పాటల్ని పాప్ గీతాల ధోరణిలో పాడటం మనకి అలవాటు లేని విషయం.

ఇంగ్లీష్ పాప్ గీతాలు అంతే. ఎంతో వేదనతో నిండి ఉంటాయి, మృత్యువుని, విరహాన్ని, వేదనని రంగరించి పాడే పాటలు కూడా గెంతులు వేస్తూ, జుత్తు విరబోసుకుని, చినిగి పోయిన పాంట్లు వేసుకుని, తలకి బాండ్ కట్టుకుని, చొక్కాలు విప్పేసి, మైకు పగిలిపోయేలా అరుస్తూ పాడతారు.

ధరిత్రి వేదన గూర్చి, పర్యావరణాన్ని గూర్చి, అణ్వాయుధాల వ్యాప్తి గూర్చి, ప్రేమ గూర్చి, విరహం గూర్చి, అమ్మ ప్రేమ గూర్చి, దైవం గూర్చి, ఆధ్యాత్మికత గూర్చి ఇలా ఏ అంశం ఎత్తుకున్నా వాళ్ళ బాణీలు ఇలాగే ఫాస్ట్ బీట్‌తో ఉంటాయి. ఇది వారి ధోరణి.

మనకి అలా కాదు. ప్రతి భావానికి ఒక నిర్దిష్ట రాగం ఉంది. లాలిత్యంతో కూడిన సంగీతం ఉంది. సరే ఇది ఒక సంధి యుగం. పెద్ద పెద్ద వాయిద్యాల హోరుతో సాగుతు ఉంటాయి ఆ పాటలు.

మనకి అది అలవాటు లేని అవపోసన.

శంకరాభరణం శంకర శాస్త్రి గారు చెప్పారు కద ‘ఆకలి వేసిన బిడ్డ అమ్మా అని ఒక లాగా అరుస్తుంది.. ప్రతి భావానికి ఒక నిర్దిష్టమైన రాగం ఉంటుందీ’ అని.

కానీ ఇలా లోతైన సున్నితమైన భావాలని కూడా పాశ్చాత్య ధోరణిలో పాప్ గీతాల లాగే తరహా పాటలకి ఈ పాట నాంది పలికింది హిందీ రంగంలో. ఆ తరువాత ఇదే ధోరణిలో ఆషికి 2 లో భట్ కాంప్ వారు పాటల బాణీలు రూపొందించారు.

మన తెలుగులో కూడా ఇటీవల ఇదే ధోరణి నడుస్తోంది. నాకు తెలిసినంత వరకు తెలుగులో ఈ ధోరణిలో వచ్చిన మొదటి పాట ‘మనం’ సినిమాలో ‘ఓ కనులని తాకే వెన్నెల’ పాట. ఈ పాట నిండా విషాదమే. కానీ పాప్ ధోరణిలో బాణీ.

ఆ మసీదు ఆవరణలో పని చేసుకుంటున్న వారు కానీ, పెద్ద పాత్రలో బిర్యాని వండుతున్న వారు కానీ, పాప్ గీతాల ధోరణిలో ఖవ్వాలీ పాడుకుంతున్న భక్త బృందం కానీ ఏ మాత్రం కంగారుపడరు ఇంత మారణహోమం జరుగుతున్నా కూడా. ఇదంతా చాలా మామూలు అన్నట్టుగా నింపాదిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతుంటారు.

అది విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here