[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.
ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.
101. యమ ధర్మం
కొండయ్య: నన్ను నరకానికి అన్యాయంగా తీసుకొచ్చారు, నేను చాలా పుణ్యాలు చేశాను? పైగా నేను చచ్చిపోయిన తరువాత కొండయ్య స్వర్గస్థుడయ్యెను అని టివిలో చెప్పారు. పత్రికల్లో కూడా రాశారు.
యమధర్మరాజు: అదే మీ భూలోకానికీ మా యమలోకానికి తేడా! అబద్ధాలను కూడా అతిశయోక్తులతో నిజమని నమ్మిస్తారు. కానీ మా నరకం అలా కాదు. యమ ధర్మం, యమకింకరులారా! ఈ డింభకుణ్ణి నూనెలో వేయించండి.
102. కొత్త డిజైన్లు
వెంకయ్య: అరే! మీ అపార్ట్‌మెంట్‌కి వెరైటీ డిజైన్ వేయించారే! ఇంతకీ ఎంత ఖర్చయ్యిది?
రోశయ్య: ఖర్చా! పాడా! మా అపార్టమెంట్‌లో పాన్లు, కిళ్ళీలు, జర్దాలు తినేవాళ్ళు చాలామంది ఉన్నారులే.
103. కొత్త ఉద్యోగం
పోగ్రామర్: సార్! నాకు ఒక కత్తెర, ఒక గమ్ బాటిల్ ఇవ్వండి!
మేనేజర్: నువు కంప్యూటర్ మీద పని చేస్తున్నావుగా వాటితో నీకేం పని?
ప్రోగ్రామర్: పైల్స్ అన్నీ వెంటనే కట్ పేస్ట్ చేయమన్నారుగా! అందుకని.
104. మిరియాల ఫ్రై
కాల్ సెంటర్: (ఫోనుచేసి) హలో! నమస్కారమండీ!
బామ్మ: నమస్కారం బాబు. ఎవరు మాట్లాడుతున్నారు మీరు?
కాల్ సెంటర్: మేము పిప్పర్ ఫ్రై నుండీ మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారా?
బామ్మ: నేను ఇంట్లోనే ఉంటాను కానీ మా ఇంట్లో మిరియాలు చాలానే స్టాక్ ఉన్నాయి. అయినా మా మిరియాలను మేం వేయించుకోలం నాయనా! (అని ఫోను కట్ చేసింది బామ్మగారు).
105. మేకప్
యాంకర్: ఎనభై సంవత్సరాల వయస్సు వచ్చినా ఇంకా మీరు ఆరోగ్యంగానూ, యవ్వనంగానూ ఉండటానికి గల రహస్యమేమిటి సార్?
యువరాజ్: చాలా సింపల్ ప్రశ్న! మా ఆవిడ ఎప్పుడూ మేకప్ చేసుకుంటూనే ఉంటుంది. అందుకే నాకు మనశ్శాంతి లభిస్తోంది.
106. సినిమా
గురువు: శిష్యా! ఏదైనా ఒక చమత్కారమును చెప్పుము?
శిష్యుడు: సినిమాలో డ్రామా ఉండును. కానీ, డ్రామాలో మాత్రం సినిమా ఉండదు గురువుగారు!
107. సెల్ఫీ
రామోజి: మొత్తానికి సూపర్ హీరోతో సెల్ఫీ తీసుకున్నావే నువ్వు. నేను కూడా ప్రోగ్రాంలోనే ఉన్నాను, మరి నువ్వెలా సెల్ఫీ తీసుకున్నావ్ రా?
జోగిరాజు: అసలు నేను ప్రోగ్రామ్ చూడలేదు రా.
రామోజి: మరి సెల్ఫీ ఎలా తీసుకున్నావ్?
జోగిరాజు: అదే రా! నా టాలెంటంటే!
రామోజి: నస ఆపి, అసలు విషయం చెప్పరా!
జోగిరాజు: సూపర్ హీరోగారు, వాష్ రూమ్ కొచ్చాడు, అక్కడే మా సెల్ఫీ తీసుకున్నానోచ్.
108. కంకణం
నాయకుడు: ఇదేమిటయ్యా చేతికి కంకణం కట్టుకొచ్చావ్?
కంకణ రాజా: మన ఎగస్పార్టీని ఓడించటానికి మనం కూడా కంకణం కట్టుకోవాలని నిన్న మీటింగులో మీరే చెప్పారు కదా సార్!
(సమాప్తం)