[box type=’note’ fontsize=’16’] “పల్లెటూరి సొబగు-సొగసుల నూతన జగత్తును తెరిచిపెడతాయి ఈ కథలు. ప్రతి కథకూ ఒక స్వరూపముంది. ఒకే దిక్కులో, వేగంగా సాగుతాయి” అంటున్నారు ‘మూగడి బాధ‘ పుస్తకంలోని కథల గురించి శంకర మోకాశి పుణేకర. [/box]
[dropcap]సి[/dropcap]రసంగి లింగరాజ్ సాహిత్య పురస్కారం పొందిన కథల సంపుటి ఇది. ప్రముఖ కన్నడ రచయిత డా.మూడ్నాకూడు చిన్నస్వామి గారు కన్నడంలో రాసిన కథలను రంగనాథ రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. ఇందులో పది కథలు ఉన్నాయి.
“డా.మూడ్నాకూడు చిన్నస్వామి కథల్లో ఎక్కువగా గ్రామీణ దళిత జీవితంలోని చీకట్లు, బాధలు, గొడవలు, సంఘర్షణలే సాక్షాత్కరిస్తాయి. విద్యావంతులైన దళిత యువకుల్లోని చైతన్యం చుట్టూవున్న తన సమాజాన్ని, సంపూర్ణ ప్రగతిపథం వైపు నడిపించాలని ప్రయత్నిస్తుంది. కానీ గ్రామాల్లో గూడుకట్టుకొన్న ప్రబల వర్గాల జాత్యహంకారం, ఆర్తిక స్తోమత, అధికారబలంవల్ల దళితయువకుల ఉన్నత ఆశయాలకు గొడ్డలిపెట్టు తగిలి సమాజం యధాస్థితిలోనే ఉండిపోతుండటాన్ని డా. మూడ్నాకూడు చిన్నస్వామిగారు వివేచనా శక్తితో సంయమంగా చిత్రించారు. రచయితకు దళిత జీవితపు ఆటుపోట్ల సరైన అవగాహన ఉన్నందువల్ల కథలకు స్వాభావికతతోపాటు సత్తువ కూడా చేకూరింది. రచయిత స్వానుభవానికి హేతుబద్ధమైన చింతన తోడ్పడటంతో పాఠకులపై గాఢప్రభావం ప్రసరించడమే కాదు, వాళ్ళను ఆలోచింపజేస్తుంది కూడా. డా. మూడ్నాకూడు చిన్నస్వామిగారి ‘మూగడి బాధ’ కథా సంపుటి తెలుగు దళిత కథకులకు కొన్ని కోణాల్ని స్పురింపజేసే అవకాశం కల్పిస్తుంది” అని ‘అదో లోకం! అథో లోకం!!’ అనే ముందుమాటలో వ్రాశారు ఘట్టమరాజు.
“పల్లెటూరి సొబగు-సొగసుల నూతన జగత్తును తెరిచిపెడతాయి ఈ కథలు. ప్రతి కథకూ ఒక స్వరూపముంది. ఒకే దిక్కులో, వేగంగా సాగుతాయి. ఇలాంటి సంపుటికి ముందుమాట రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు శంకర మోకాశి పుణేకర తన ముందుమాట ‘చిన్నస్వామిగారి కథాలోకం!’లో.
ఈ పుస్తకానికి వ్రాసిన ‘చివరి మాట’లో – “కన్నడ కావ్యలోకానికి కొత్త చింతనలతో కూడిన, గొప్పవైన మూడు కృతులను ఇచ్చిన చిన్నస్వామిగారు ఇప్పుడు కథాలోకాన్ని ప్రవేశించి కొత్త దిగంతాలను తెరుస్తూ సాగటం వారి సృజనశీల ప్రతిభకు తార్కాణం. కథ రాయటం కష్టం. కథకుడు సంయమనంతో నిర్లిప్తంగా కథ చెప్పటం సులభసాధ్యం కాదు. దీన్ని చిన్నస్వామిగారు సాధించారు. కల్పన కన్నా సహజ అర్హత, సహజత్వాన్ని రసాత్మకం చేసేటటువంటి, కళాత్మకం చేసేటటువంటి గొప్పదనం చిన్నస్వామిగారి కలానికి ఉంది. అలాగే వారి కథలు చైతన్యంతో కళకళలాడుతాయి. కఠోర వాస్తవాలను విప్పి చెప్తాయి. మన మనస్సును రెచ్చగొట్టకుండా సత్యాన్ని దర్శింపజేస్తాయి. కథకు తగినట్టు భాషను నవనవీనంగా ఉపయోగించుకోవడం ఆయన కౌశల్యం మెచ్చుకునేటటువంటిది. ‘మూగడిబాధ’ కథాసంకలనం ఇప్పటిదాకా వచ్చిన కథాసంకలనాల కన్నా భిన్నంగా నిలబడుతుంది. కన్నడ కథ ఇంకా నిర్మించుకోవలసిన మార్గపు కాంతులను సూక్ష్మంగా ఇస్తుంది” అని వ్రాశారు శాంతరస.
మూగడి బాధ
(కన్నడ అనువాద కథా సంపుటి)
లక్ష్మీ ప్రచురణలు
పేజీలు: 96
వెల: రూ.80/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, ప్రచురణకర్త.
ప్రచురణ:
Lakshmi Kumari
1-11-163/1
4th Floor, Flat No 402,
Stephen’s Cottage,
Shyamal Building,
Begumpet,
Hyderabad – 500016