తందనాలు-7

0
3

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

61
కాలమే నిర్ణయించు జరగబోవు పనులను
అలవోకగా సాగిపోవు కొన్ని
బలవంతంగా జరుగును మరి కొన్ని
ఇలలో జరుగును ఈ విధంగా

62
బిడ్డ రూపు, ఆరోగ్యం తల్లి తండ్రులవే
వడపోసి వెతికినా రూపు కానరాదు కొందరిలో
చెడు వ్యసనాలతో ఆరోగ్యం పోవు
కడకు మిగులు ప్రాణం

63
వరుడు శోభనం గదిలో ఎదురు చూపులు
చారడేసి కన్నులతో వధువు
మూరెడు మల్లెలతో చేరె
బారెడు ప్రొద్దెక్కినా లేవనివ్వదు ఆ మత్తు

64
కొంపలో కొన్ని వస్తువులు కావాలి
బంపర్ ఆఫరని వస్తువులు కొన్న భార్య
చెంప చెళ్లుమనిపించాడు భర్త
రంపపు కోతలాంటి బాధ భార్యకు

65
కారు చౌకగా వస్తువులు అమ్ముచున్నారు
బారులు తీరిన జనం
వేరుగా లైన్లు, స్త్రీలకు పురుషులకు
కోరుకున్నవి దొరకక కొందరు నిరాశ

66
కవులెందరో విచ్చేసిరి సభకు
చెవులకింపుగా పద్యాలు చదివిరి
లవ లేశమైనా కదలని ప్రేక్షకులు
చివరిగా పాటతో సభ ముగిసె

67
వింత వేషాలతో తిరుణాల
కాంతలూ వేసిరి వేషాలు
చెంతనున్న దుకాణాలలో తినుబండారాలు
ఎంతో చక్కగా నిర్మించిన ప్రభల ఊరేగింపు

68
కవిత్వంలో పటుత్వం వున్నప్పుడే రాణించేది
భవిష్యత్తులో నిలిచి ఉండేది
పేవలంగా ఉంటే పాఠకులిష్టపడరు
కేవలం అది పదాల కూర్పే

69
కారు మబ్బులు కమ్ముకున్నాయి
వరుణుడు తన ప్రతాపం చూపించాడు
దారులన్నీ నీటితో నిండిపోయె
కారులన్నిటినీ నీటి ప్రవాహం తీసుకు పోయే

70
కారు చీకట్లు కమ్ముకున్నాయి
బోరు బోరున విలపించిన పిల్లలు
అరుపులకు మేల్కొనిన తల్లి తండ్రులు
చిరు దివ్వెలు వెలిగించి ఓదార్చిరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here