సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-10

0
4

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సెలవులు అయిపోయాకా కాలేజీకి వస్తుంది బిందు. శకుంతల రాకపోయేసరికి, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శకుంతల తల్లిదండ్రులు బిందుని ఆహ్వానిస్తారు. బిందూ, శకుంతల కబుర్లలో పడతారు. తమ కజిన్ సుందరి తమ ఇంట్లో ఉండి చదువుకోడానికి వస్తోందని శకుంతల మాటల్లో చెప్తుంది. సుందరి గురించి, వాళ్ళ నాన్న గురించి, అన్న గురించి బిందుకి వివరంగా చెప్తుంది. సుందరిని ఇక్కడ చదివించడంలోని రహస్యాన్ని బిందుకి చెబుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న శాల్తీ ఎవరా అని బిందు ఆశ్చర్యపోతుంది. ఇంతలో శంకరం, కాత్యాయని, సుందరి అక్కడికి వస్తారు. పలకరింపులు అవుతాయి. తన కోరికని అంగీకరించినందుకు సూర్యానికి థన్యవాదాలు చెప్తాడు శంకరం. మర్నాడు సుందరిని ట్యూషను సెంటర్లో జాయిను చేసి ఫీజు కట్టి పుస్తకాలు కొంటాడు శంకరం. ఎంత కష్టమైనా భరించి, చదివి బావని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది సుందరి. బావని చూసి వస్తానంటూ శంకరం బయల్దేరుతుంటే, బావని ఒకసారి తీసుకురమ్మని తండ్రిని గోముగా అడుగుతుంది సుందరి. అక్కడే ఉన్న బిందూని శ్రీదేవిలా ఉందని అంటూ తనని పరిచయం చేసుకుంటుంది సుందరి. సిద్ధార్థని తీసుకుని వస్తాడు శంకరం. సుందరి సంతోషం పట్టలేకపోతుంది. సుందరితో తన పెళ్ళిని ఊహించుకోలేకపోతాడు సిద్ధార్థ. ఇంతలో సుందరి శకుంతలని, బిందూని పిలుస్తుంది. అక్కడ సిద్ధార్థని చూసి వాళ్ళిద్దరూ, వాళ్ళని చూసి సిద్ధార్థ ఆశ్చర్యపోతారు. అది తమ ఇల్లే అని, సుందరి చెల్లెలని చెబుతుంది శకుంతల. అయితే మనకి బంధుత్వం కలిసిందన్న మాట అంటాడు సిద్ధార్థ. మీకు ముందే పరిచయం ఉందా అని శంకరం వాళ్ళని అడిగితే, సిద్ధార్థ మాకు సీనియర్ అని చెప్తుంది శకుంతల. ఇంతలో అక్కడికి పద్మ, సూర్యం రాగా, – నా మేనల్లుడు, అంతే కాదు కాబోయే అల్లుడు అని సిద్ధార్థని వాళ్ళకి పరిచయం చేస్తాడు శంకరం. కాబోయే అల్లుడు అన్నందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తాడు సిద్ధార్థ. ‘ఇవాళ కాకపోయినా రేపయినా ఈ సుందూ నీ పెళ్ళామేనురా’ అని అంటాడు. బిందు మనసు అస్తవ్యస్తమవుతుంది. ఊరికి బయల్దేరుతూ సుందరి ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని కాత్యాయని పద్మతో అంటుంది. ఎటువంటి భయాలు, ఆందోళనలు మనస్సులో పెట్టుకోకుండా నిశ్చింతగా వెళ్ళిరమ్మని పద్మ అంటుంది. అవే మాటలు సూర్యం శంకరంతో కూడా అంటాడు. శంకరం, కాత్యాయని తమ ఊరికి బయల్దేరుతారు. ఇక చదవండి.]

అధ్యాయం-19

సుందరి తను చెప్పిన సూత్రాలు పాటిస్తోంది అని అనుకుంది శకుంతల. సిద్ధార్థను భర్తగా పొందడానికి ఎంత కష్టపడ్తోంది అని అనుకుంది.

“సుందూ నీవు కొద్దిగా లావు తగ్గినట్లున్నావే!” అంది శకుంతల.

“నిజమా?”

శకుంతల మాటలు విన్న సుందరి కళ్ళల్లో ఆశ్చర్యంతో బాటూ కుతూహలం అగుపించిది.

“నిజం.”

“నీవు చెప్పిన సూత్రాలు పాటిస్తున్నాను. చిరుతిళ్ళు మానేసేను. నూనె, నెయ్యిల వాడకం తగ్గించేసేను. ట్యూషను సెంటరికి నడిచి వెళ్తున్నాను. ఇంకా ఒళ్ళు తగ్గాలి. ఆ శ్రీదేవిలా అదే ఆ బిందులా సన్నజాజి తీగలా సన్నగా స్మార్టుగా తయారయితే కాని బావ నన్ను లైక్ చేయడు.”

సుందరి ఈ మధ్యనే తన మాటల్లో ఇంగ్లీషు శబ్దాలు దొర్లించడం నేర్చుకుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించారు.

“చదువులో కూడా ఇంప్రూవ్‌మెంటు ఉండాలే సుందూ! నీవు ఇక్కడికి వచ్చింది చదువుకి కాదు అని నాకనిపిస్తోంది. నీ చదువు పెళ్ళి చదువులా ఉంది.”

“శకూ నీవన్నది సెంట్ పెర్సంట్ కరక్ట్. ఇంజనీరుకి భార్యనవడానికి కనీస చదువు ఉండాలి అని పెద్దలు ఆంక్ష పెడ్తే, నాన్న తాపత్రయం ఎందుకు కాదనాలి అని నేను ఈ చదువుకి ఒప్పుకున్నాను.”

చదువును అంత తేలికగా సుందరి తీసివేయడం శకుంతలకి నచ్చలేదు.

“సుందూ! చదువుని అంత తేలిక చేసి మాట్లాడకు. చదువు విజ్ఞానాన్ని పెంచుతుంది. చదువు తరగని సంపద కూడా. దానం చేస్తున్నా తరగని సంపద ఈ చదువు. ప్రతీ ఒక్కరూ తప్పని సరిగ చదువు నేర్చుకోవాలి,” శకుంతల అంది

“నీ ఉద్దేశం నేను చదువుని చులకన చేస్తున్నాను అనేకదా! కాని నా ఉద్దేశం అది కాదు శకూ! నా ఉద్దేశంలో ముఖ్యంగా ఆడదానికి చదువు అంత ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే నేటి విద్యా వ్యవస్థను చూస్తున్నావు కదా! చదువుకున్న వాళ్ళందరూ బాగుపడ్తున్నారా? అన్నిటిలోనూ అవినీతే. ఇది చివరకు విద్యా వ్యవస్థను కూడా విడిచిపెట్టలేదు. చదవకుండానే, పరీక్షలు వ్రాయకుండానే డబ్బులు పడిస్తే మన చేతికి పరీక్షలో ఉత్తీర్ణత చెందినట్టు పత్రం వచ్చి చేతిలో వ్రాలుతుంది. ఆ దొంగ పత్రాల్తో ఉద్యోగాల్లో చేరుతున్న పలుకుబడి, పరపతి ఉన్న పెద్ద మనుష్యులు.

నిజాయితీగా కష్టపడి చదివిన వాడికి ఉద్యోగం లేదు. నిరాశగా నిశ్పృహగా ఎదురుచూసి, చూసి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేటి విద్యా వ్యవస్థ కుళ్ళిపోయింది. పరీక్షా విధానం భ్రష్టు పట్టిపోయింది” ఉపన్యాస ధోరణిలో అంది సుందరి.

సుందరి మాటలు శకుంతలకి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ‘సుందరి పైకి ఇలా ఏం తెలియనట్టు అల్లరి చిల్లరగా ఉంటుంది కాని ఎన్ని విషయాలు తెలుసు? ఎంత పరిశీలనాత్మక దృష్టి ఉంది?’ అనుకుంది.

“శకూ! పాత సినిమా ‘ఈ చదువులు మాకొద్దు’ చూశావా? ఆ సినిమా నేడు కూడా నేటి సమాజానికి దగ్గరగా ఉంది. రోజులు మారుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి కాని, వ్యవస్థలో మాత్రం మార్పులేదు. నేటి విద్యా వ్యవస్థ మీద చదువుకున్న నిరుద్యోగ నవ యువకుల తిరుగుబాటు, ఆ సినిమాలో నిరుద్యోగ సమస్యల్ని బాగా చిత్రీకరించారు. హీరో యాక్షన్ వండ్రఫుల్. చదివి ఎవరు బాగుపడ్డారు కనుక?” సుందరి చెప్పుకుపోతోంది.

సమాజంలో ఉన్న అందరూ సుందరి లాగే ఆలోచిస్తే మానవ మనుగడే ఉండదు అని అనుకున్న శకుంతల సుందరితో “నీ ఆలోచన్లు కేవలం సినిమా చూసి ఆస్వాదించే వరకే, చదువు కేవలం ఉద్యోగ సంపాదనకే పరిమితం కాదు. విజ్ఞాన సంపాదనకి కూడా ఈ చదువు ఆయుధం. మానవుడు వైజ్ఞానిక క్షేత్రంలో క్రొత్త క్రొత్త పరిశోధలను చేసి ముందుకు సాగుతున్నాడు,” అంది.

సుందరి వాతావరణాన్ని గంభీర స్థాయి నుండి తేలిక పరచడానికి మాట మార్చింది. “ఎవరి ఆలోచన్లు వాళ్ళకుంటాయి చదువు గురించి. ఆ ప్రస్తావన వదలిపెట్టు. ఇంకో మాటలు మాట్లాకుందాం” అంది.

“దేని గురించి?” శకుంతల అంది.

“అదే కాలేజీలో నీకూ, ఆ శ్రీదేవికి నిక్ నేమ్స్ లేవా?”

“ఉన్నాయి.”

“ఏంటి?”

“నాకయితే మేనకా పుత్రీ, కణ్వ మహర్షి పెంపుడు కూతురని, బిందుకి మంచు బిందు అని” శకుంతల అంది.

“మా ట్యూషన్ సెంటర్లో నా నిక్ నేమ్ ఏంటో తెలుసా?”

“నీవు ట్యూషను సెంటర్లో చేరి ఎన్ని రోజులో అవలేదు. అప్పుడే నీకు నిక్ నేమా?” ఆశ్చర్యంగా అడిగింది శకుంతల.

“నా నిక్ నేమ్ గజం.”

“అదేంటి ఆ నిక్ నేమ్?”

“మన జాతీయ భాషలో గజ్ అంటే ఏనుగు కదా! అందుకే నాకా పేరు పెట్టారు. నేను ఏనుగులా భారీకాయంతో ఉంటాను కదా!” సుందరి.

కొంతమంది స్వభావం ఇంతే. బాధపడరు. ఎదుటి వాళ్ళ హేళనను కూడా తేలికగా తీసుకుంటారు. ఆ కోవకు చెందింది సుందరి.

“నీకు బాధ అనిపించలేదా?” శకుంతల అంది.

“ప్చ్.. బాధెందుకు? బాధపడే స్వభావం నాది కాదు. నా స్వభావమే వేరు. క్షణికమైన ఈ జీవితంలో నవ్వుతూ సంతోషంగా ఉంటూ జీవితం గడపకుండా ఈసురోమని ఏడుపు మొగం పెట్టుకుని కూర్చోడం నాకు నచ్చదు. హాస్యభరితమైన ఎట్మాస్పియర్ లేకపోతే లైఫ్ వేష్టు శకూ! ఎదుటి వాళ్ళు అలా అన్నారని బాధపడ్డం ఎందుకు? కొద్ది రోజుల్లోనే మాటల్లో ఇంగ్లీషు పదాలు దొర్లించడం ఎలా నేర్చుకున్నానో, అలాగే శ్రీదేవిలా సన్నజాజి తీగలా తయారవుతాను. అప్పుడు నీవే ఆశ్చర్యపోతావు. ఐ లైక్ స్టూడెంట్ లైఫ్.

ప్రస్తుతం నేను పట్నం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఎన్ని ఆకర్షణలు? కో-ఎడ్యుకేషనులో అమ్మాయిలకి బోయ్ ఫ్రెండ్సు – అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్సు. ఎన్నెన్నో వింతలూ – విడ్డురాలూ? ఆ పల్లెటూరులో ఏముంది కనుక? పేడ కుప్పలు, గడ్డిమోపులు. ఛీ.. ఛీ..! అదీ ఓ జీవితమేనా?” సుందరి మాట్లాడుతూ పోతోంది.

“ఏఁవర్రా పిల్లలూ! కాలేజీకి వెళ్ళరా ఏంటి? మాట్లాడుతూ కూర్చున్నారు” పద్మ వంటింటి నుండి కేకేసింది.

“ఆఁ.. వస్తున్నాం,” అంటూ లేచారు శకుంతల, సుందరి. భోజనానికి డైనింగు హాలు వేపు వెళ్ళబోయి ఆగారు.

“ఆ సుందరికి చదువు మీద శ్రద్ధ లేదండి,” అంది పద్మ.

“నీకు ఇప్పుడా తెలిసింది. ఆ అమ్మాయిని చూసీ చూడగానే నేను పసిగట్టాను.”

“సుందరికి చదువు మీద శ్రద్ధ లేకపోతే లేకపోయింది మన శకూని కూడా చదవనీయకుండా చేస్తుందని నా భయం.”

“సుందూతో మాటలు తగ్గించమని శకూతో చెప్పు. ఎందుకంటే మంచైనా, చెడేనా సాంగత్యం వల్లనే మన మీద ప్రభావం పడుతుంది. వ్యర్ధ ప్రసంగాలు మానివేయమని చెప్పు.”

“అలాగే.”

సుందరి, సూర్యం పద్మలు మాటలు వింది. ఆమె ముఖం పాలిపోయింది. తను ఇక్కడ వచ్చి చదవడం వీళ్ళకి ఇష్టం లేదన్నమాట. తన తండ్రి దగ్గర మొహమాటానికి అంగీకరించారు కాని, ఈ మధ్య శకూ కూడా మునపటిలా తనతో మాట్లాటం లేదు. మాటలు తగ్గించింది. ఇలా ఆలోచిస్తోంది సుందరి.

అధ్యాయం-20

కూతురి చదువు వ్యవహారం ఎలా ఉందో అని చూడ్డానికి వచ్చారు శంకరం, కాత్యాయిని.

“ఎలా ఉంది సుందూ నీ చదువు ఇక్కడ,” అడిగాడు శంకరం కూతుర్ని.

“నేను అనుకున్నంతగా ఊహించినంతగా గొప్పగా లేదు డాడీ! చాలా బోర్‌గా ఉంది. సినిమాలు లేవు. ఏ వినోదం లేదు. టి.వి. ప్రోగ్రాములు చూడ్డానికి ఫ్రీడమ్ లేదు. ఒక విధంగా బానిస బ్రతుకే”.

కూతురి మాటలు కాత్యాయినికి నచ్చలేదు. మొదట్నించి స్వేచ్ఛకి అలవాటు పడిపోయింది. అందుకే బానిస బ్రతుకు అంటోంది ఇక్కడ. సుందూ ఇక్కడ ఉంటేనే బాగుపడుతుంది అని అనుకుంటున్న కాత్యాయిని భర్తతో “అది అలాగే అంటుంది. చదువుకో అని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ కూడా దీనికి స్వేచ్ఛ కావాలిట. మన ఊర్లో ఇల్లిల్లు తిరిగి సినిమాలు టి.వి.లో చూస్తూ గడిపేస్తోందని ఇక్కడికి పంపిస్తే దీని బుద్ధి మారలేదు. అది చదవక, శకూని కూడా చదవకుండా పాడు చేస్తోందేమో అని నా అనుమానం” అంది.

“మమ్మీ! నీవు అలా మాట్లాడ్డం నేను లైక్ చేయను,” అంది సుందరి.

“నీలో వచ్చిన మార్పు అదేనే. నాన్నా, అమ్మా అని మాతృభాషలో తియ్యగా పిలిచేదానివి ఇప్పుడు మమ్మీ, డాడీ అని పిలుస్తున్నావు. వచ్చీరాని, ఇంగ్లీషులో రెండు ముక్కలు మాట్లాడుతున్నావు. మీ నాన్నయితే మురిసిపోతే మురిసిపోవచ్చు కాని నాకు మాత్రం కంపరంగా ఉంది. మధు చూస్తే అలా తయారయ్యాడు. నిన్ను చూస్తే నీవు ఇలా తయారయ్యావు. చదివింది చాలు కాని, పద ఇంటికి, చదువుకి పెద్దే ఉన్న మతి పోయిందిట నీ వాలకం” అంది కాత్యాయిని గట్టిగా.

భార్య మాటలు శంకరానికి నచ్చలేదు. సుందరి చిన్న బుచ్చుకోవడం ఆ తండ్రికి బాధనిపించింది. అందుకే “సుందూకి చదువు రాకపోతే ఏం? ఇంజనీరుకి కాబోయే భార్య అది,” మురిసిపోతూ అన్నాడు శంకరం.

“మీరు అలా వెనకేసుకుని రాకండి. ఇలాంటి దాన్ని ఆ అబ్బాయి ఏ మాత్రం ఇష్టపడడు పెళ్ళి చేసుకోడానికి. దీనికేం చదువా? సంస్కారమా? అందమా?” అంది కాత్యాయిని.

ఆత్మాభిమానానికి ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడే దెబ్బ తగిలింది. సుందరికి తల్లి మాటల్తో రోషాగ్నితో సుందరి మనస్సు దహించుకుపోతోంది. పూర్వంలా తండ్రి తల్లి మీద విరుచుకు పడటం లేదు. తల్లిని ప్రతీ విషయంలో సమర్థిస్తున్నాడు. అదే సుందరి ఆవేదనను, ఉక్రోషాన్ని మరింత పెంచుతోంది. ఆ ఉక్రోషంలో అనకూడని మాటలు కూడా ఆమె నోట వెంబడి వెలువడ్తున్నాయి.

“మన డబ్బుతో చదువు సాగిస్తున్న వాడు నన్ను ఎందుకు పెళ్ళి చేసుకోడు? చేసుకుని తీరుతాడు.” మొండిగా అంది సుందరి. ఆమె మాటల్లో డబ్బుతో సాధించలేనిది – అసాధ్యమైనది ఏదీ లేదన్న భావం స్పురించింది.

“సుందూ..!” గట్టిగా అరిచింది కాత్యాయిని. కూతురు చెంప చెళ్ళుమనిపించింది. “మరో పర్యాయం అలాంటి మాటలు మాట్లాడితే కూతురని చూడకుండా చంపేస్తాను” అని ఆడ బెబ్బులిలా గాండ్రించింది. తల్లిలో మరో రూపాన్ని చూస్తోంది సుందరి.

“లాభం లేదు. చదివిందేదో చాలు. మనింటికి పద. బట్టలు సర్దుకో,” కాత్యాయిని కూతురికి ఆజ్ఞాపించింది.

సమస్యలు పుడ్తూనే ఉంటాయి. అయితే ఆ సమస్యకి పరిష్కారం ఆవేశకావేశాలయితే ఆ సమస్య మరింత జటిలమవుతుంది. ఇప్పుడు జరిగిందీ అదే. సుందరి తన మాటల్తో తల్లిని రెచ్చగొట్టింది. కొడుకు లాగే కూతురు కూడా తయారవుతుందేంటా అని అనుకుంది కాత్యాయిని.

సుందరి కూడా ఆలోచిస్తోంది. తల్లి చెప్పినట్టు తను తన ఊరికి వెళ్ళిపోవడమే మంచిది. ఈ మధ్య పిన్నీ బాబాయ్ మాటలు తను వింది. తన వలన శకూ పాడవుతుందని వాళ్ళ ఉద్దేశం. అంతేకాదు శకూ కూడా తనతో మాట్లాడ్డం తగ్గించేసి ముక్తసరిగా మాట్లాడుతోంది. ‘టి.వి. చూడ్డానికి వీల్లేదు. సినిమా చూడ్డానికి వీల్లేదు. అన్ని విషయాల్లోనీ ఆంక్షలే. ఈ బానిస బ్రతుకు తను బ్రతకలేదు. ఇక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది,’ ఇది సుందరి నిర్ణయం.

తల్లి కొట్టిన చెంప దెబ్బకి సుందరి కళ్ళు పచ్చబడ్డాయి. ఒక వంక రోషం – మరో వంక అవమానం దుఃఖంతో సుందరి మనస్సు కుతకుతలాడిపోతుంది.

ఇంత జరుగుతున్న తండ్రి ఏం మాట్లాడకుండా నిలబడి అలా చూస్తూ ఉండటం సుందరికి మరింత బాధ కలిగించింది. తన మీద ఈగయిన వ్రాలనీయని తండ్రి ఎప్పుడూ తననే వెనకేసు కొచ్చి తల్లిని తిట్టే తండ్రి ఈ రోజు ఇంత తతంగం జరుగుతున్నా మౌనం వహించడం చూసి ఆమె మనస్సు మరింత అవమాన భారంతో కృంగదీస్తోంది.

ఎన్నడూ తన ఎదుట కూతుర్ని పల్లెత్తు మాట అయినా అనడానికి సాహసించని కాత్యాయిని ఈ రోజు కూతురి మీద ఆడ బెబ్బులిలా విరుచుకుపడి చేయి చేసుకుంటే శంకరానికి నోటి వెంబడి మాట రాలేదు. ఆలోచన్లలో పడ్డాడు.

‘కూతురిలో ఇలాంటి ఆలోచన్లు ఆరోగ్యప్రదం కాదు. రేపొద్దున్న పెళ్ళి అయిన తరువాత కూడా నా తండ్రి ఇచ్చిన డబ్బుతో చదువుకున్నావు. ఒక విధంగా నేను నిన్ను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని మొగుడ్ని కూతురు ఎదిరిస్తే భర్త అన్నవాడు సహించగలడా? ఆత్మాభిమానం గల ఏ మగవాడూ సహించలేదు. సిద్ధార్థ అసలే ఆత్మాభిమానం మెండుగా కలవాడు. అలాంటి వాడు ఇలాంటి మాటలు అసలే సహించలేదు’ ఇలా సాగిపోతున్నాయి శంకరం ఆలోచన్లు. కన్నీటితో నిండిన కూతురు కళ్ళవంక చూడకుండా బరువుగా అడుగులేస్తూ అచటి నుండి కదిలిపోయాడు.

అవమాన భారం, తట్టుకోలేక రోషాన్ని ఆపుకోలేక చున్నీతో కన్నీళ్ళు తుడుచుకుంటూ, చెంప తడుముకుంటూ చేతిలో పుస్తకం గిరాటు వేసి కోపంతో సుందరి కూడా అచటి నుండి కదలిపోయింది.

‘దీని కెంత పొగరు? తండ్రి వల్లే కూతురు ఇలా తయారయింది. దీనికి కొమ్ములొచ్చాయి. ఈ మిడిసిపాటు తనం మంచిదికాదు,’ అనుకుంటోంది కాత్యాయిని. అయితే ఆమెకి ఒక్క విషయం విస్మయం, ఆనందం కలిగించాయి. భర్త కూతుర్ని ఈ విషయంలో సమర్థించక పోవడం, మౌనం వహించడం. అంతకు మునుపు కూడా ఇలాగే తన భర్త ఉండి వుంటే కూతురికి ఇంత పొగరు ఉండేది కాదు. ఇలా అనుకుంటూ ముందుకు నడిచింది కాత్యాయిని.

“అక్కా! సుందూ మీద అలా చేయి చేసుకుని తప్పు చేశావేమో” పద్మ అంది.

“పద్మా! నేను తప్పు చేయలేదు. తప్పు జరగక ముందే మేల్కున్నానని పిస్తోంది. ఆ హిమబిందుని, శకుని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో, సుందూని చూస్తుంటే అంత బాధ కలుగుతోంది. మా పెంపకంలో లోపం వల్లనే అది అలా తయారయింది. అందుకే చదివింది చాలు. చదువు మాన్పించి తీసుకు వెళ్లామనుకుంటున్నాను. సుందూ ఇక్కడ ఉంటే శకూ చదువు కూడా పాడవుతుంది.”

“మరో పర్యాయం బాగా ఆలోచించు అక్కా! మధ్యలోనే చదువు మాన్పించేయడం ఎందుకు?”

“మరి నా మనస్సు మార్చడానికి ప్రయత్నం చేయకు పద్మా! మీ బావగారు కూడా ఈ విషయంలో నా మాట వినే స్థితిలో ఉన్నారు. సుందూ ఇక్కడే వుంటే ఎన్ని తిక్క తిక్క పనులు చేస్తుందో?” అంది కాత్యాయిని.

స్థిరమైన నిర్ణయం మనల్ని వెనక్కి అడుగు వేయనీయదు. తమ నిర్ణయంలో మంచి ఉంది. మేలు జరుగుతుంది అన్న భావన వచ్చిన నాడు స్థిర నిర్ణయం తీసుకున్న వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకోలేరు. కాత్యాయిని నిర్ణయం అటువంటిదే.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here