ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-39

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

వాయవ్యమాదాయ తతో వరాస్త్రం రామః ప్రచిక్షేప నిశాచరాయ।

సముద్గరం తేన జఘాన బాహుం స కృత్తబాహుస్తుములం ననాద॥

(యుద్ధ కాండ, 67. 144)

కుంభకర్ణుడు ఘోరమైన యుద్ధం చేశాడు.

రఘువీరుడు శ్రేష్ఠమైన వాయువ్యాస్తమును అభిమంత్రించి ఆ నిశాచరునిపై ప్రయోగించాడు. ఆ ప్రహారానికి గదను ధరించియున్న అతని చేయి తెగిపోయింది. వెంటనే అతను బాధతో గావు కేకలు పెట్టాడు.

శ్లో:

స తస్య బాహుం సహసాలవృక్షం సముద్యతం పన్నగభోగకల్పమ్।

ఐంద్రాస్త్ర యుక్తేన జఘాన రామో బాణేన జాంబూనద చిత్రితేన॥

(యుద్ధ కాండ, 67. 148)

సాలవృక్షముతో కూడియున్న కుంభకర్ణుని బాహువును శ్రీరాముడు బంగారముతో నిర్మితమై తళతళాడుతున్న ఐంద్రాస్త్రముతో ఖండించెను.

శ్లో:

తం ఛిన్నబాహుం సమవేక్ష్య రామః సమాపతంతం సహసా నదంతమ్।

ద్వావర్ధచంద్రౌ నిశితౌ ప్రగృహ్య చిచ్ఛేద పాదౌ యుధి రాక్షసస్య॥

(యుద్ధ కాండ, 67. 149)

వెంటనే వాడియైన రెండు అర్ధచంద్రాకార బాణములను ఒకేసారి సంధించి యుద్ధమున ఆ రాక్షసుని రెండు పాదములను ఛేదించెను.

శ్లో:

నికృత్తబాహుర్వినికృత్తపాదో విదార్య వక్త్రం బడవాముఖాభమ్।

దుద్రావ రామం సహసాభిగర్జన్ రాహుర్యథా చంద్రమివాంతరిక్షే॥

అపూరయత్ తస్య ముఖం శితాగ్రై రామః శరైర్హేమపినద్ధపుంఖైః।

స పూర్ణవక్త్రో న శశాక వక్తుం చుకూజ కృచ్ఛ్రేణ ముమోహ చాపి॥

(యుద్ధ కాండ, 67. 152, 153)

బాహువులు, పాదములు ఖండింపబడినప్పటికీ కుంభకర్ణుడు పైకెగిరి తొడల సహాయమున ముఖమును ముందుకు చాచి శ్రీరాముని మీదకు వేగంగా దాడికి వెళ్ళాడు. శ్రీరాముడు అతని ముఖములో బాణాలు నింపేశాడు. ఏమీ మాట్లాడలేక మూర్ఛితుడైనాడు.

శ్లో:

స తన్మహాపర్వతకూట సన్నిభం వివృత్తదంష్ట్రం చలచారుకుండలమ్।

చకర్త రక్షోధిపతేః శిరస్తథా యథైవ వృత్రస్య పురా పురందరః॥

(యుద్ధ కాండ, 67. 157)

శ్రీరాముడు ప్రయోగించిన ఐంద్రాస్త్రం కుంభకర్ణుని శిరస్సును ఖండించింది.

శ్లో:

న్యపతత్ కుంభకర్ణోథ స్వకాయేన నిపాతయన్।

ప్లవంగమానాం కోట్యశ్చ పరితః సంప్రధావతామ్॥

తచ్చాతికాయం హిమవత్ప్రకాశం రక్షస్తతస్తోయనిధౌ పపాత।

గ్రాహాన్ వరాన్ మీనవరాన్ భుజంగాన్ మమర్ద భూమిం చ తదా వివేశ॥

(యుద్ధ కాండ, 67. 160, 161)

కుంభకర్ణుడు తన కాయముచే అటూ ఇటూ పారిపోతున్న కోట్ల కొలది వానరులను నేలపాలు చేస్తూ పడిపోయాడు. ఆ కాయం సముద్రంలో పడిపోయింది. అందులోని మోసళ్ళు, చేపలు, సర్పములు నుగ్గు నుగ్గు ఐనాయి.

..కొందరు కుంభకర్ణుని లక్ష్మణుడు సంహరించాడు, శ్రీరాముడు కాదు అని చెబుతూ ఉంటారు. రావణకుంభకర్ణులు పూర్వం జయవిజయులు కాబట్టి శ్రీరాముని చేతిలోనే వారికి మరణం. ఇది వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది (శ్రీరాముడే వధించినట్లు).

శ్లో:

తదిదం మామ్ అనుప్రాప్తం విభీషణవచః శుభమ్।

యదజ్ఞానాన్మయా తస్య న గృహీతం మహాత్మనః॥

విభీషణవచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయోః।

వినాశోయం సముత్పన్నో మాం వ్రీడయతి దారుణః॥

తస్యాయం కర్మణః ప్రాప్తో విపాకో మమ శోకదః।

యన్మయా ధార్మికః శ్రీమాన్ స నిరస్తో విభీషణః॥

(యుద్ధ కాండ, 68. 21, 22, 23)

రావణుడు: ఇంతకుముందు ధీశాలియైన విభీషణుడు చెప్పిన మంచి మాటలు నా మూర్ఖత్వము చేత పెడచెవిని పెట్టాను. దాని ఫలితము ఇప్పుడు ప్రత్యక్షముగా కనబడుతోంది. కుంభకర్ణ ప్రహస్తులు దారుణంగా మరణించటంతో ఆ మాటలు విననందుకు నేడు పశ్చాత్తాపముతో సిగ్గు పడుతున్నాను.

ధార్మికుడైన విభీషణుని దూరం చేసుకున్నాను. ఆ పాప కర్మ ఫలితముగనే నాకు ఈ శోకము దాపురించినది.

శ్లో:

అహో ను బలవాన్ రామో మహదస్త్రబలం చ వై।

యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః॥

తం మన్యే రాఘవం వీరం నారాయణమనామ యమ్।

తద్భయాద్ధి పురీ లంకా పిహితద్వారతోరణా॥

(యుద్ధ కాండ, 72. 10, 11)

రావణుడు: భళీ! శ్రీరాముడు ఎంతటి మహా బలవంతుడు? అతని మహాస్త్ర ప్రభావములు అమోఘములు. అతని నిరుపమాన పరాక్రమము కారణంగా పెక్కుమంది రాక్షసులు మృత్యువు పాలైరి. ఆ రఘువీరుడు నిజముగా సనాతనుడైన ఆ శ్రీమన్నారాయణుడే అని తలంతును. ఆ మహాత్ముని భయం వలననే లంకా నగరము యొక్క అంతర్ద్వారములు, బహిర్ద్వారములు అన్నీ మూతబడినవి.

(ఇందులో గాయత్రి రామాయణం లోని శ్లోకం కూడా యున్నది)

శ్లో:

మన్యే స్వయంభూర్భగవానచింత్యో యస్యైతదస్త్రం ప్రభవశ్చ యోస్య।

బాణావపాతాంస్త్వమిహాద్య ధీమన్ మయా సహావ్యగ్రమనాః సహస్వ॥

ప్రచ్ఛాదయత్యేష హి రాక్షసేంద్రః సర్వా దిశః సాయకవృష్టిజాలైః।

ఏతచ్చ సర్వం పతితాగ్ర్యశూరం న భ్రాజతే వానరరాజసైన్యమ్॥

ఆవాం తు దృష్ట్వా పతితౌ విసంజ్ఞౌ నివృత్తయుద్ధౌ గతరోషహర్షౌ।

ధ్రువం ప్రవేక్ష్యత్యమరారివాసమ్ అసౌ సమాదాయ రణాగ్రలక్ష్మీమ్॥

(యుద్ధ కాండ, 73. 67, 68, 69)

ఇంద్రజిత్తు గొప్ప మాయా యుద్ధం చేసాడు. అదృశ్యంగా ఉంటూ బ్రహ్మాస్త్రం సంధించాడు.

శ్రీరాముడు లక్ష్మణునితో: (బ్రహ్మదేవుని ఆదరించుటకు, కనిపించని రాక్షసుడు యుద్ధభూమి నుంచి తప్పుకొని వానరులను రక్షించుటకు) ఈ అస్త్రము మనపై పడినను అందులకు ఏ మాత్రమూ కలత చెందక, దానిని తట్టుకొని నిలిచి యుండాలి. ఈ రాక్షస ప్రముఖుడు బాణములతో దిక్కులన్నీ కప్పేసాడు. అందుచేత వానర వీరులందరూ భూమిపై పడిపోయారు.

ఇప్పుడు మనం రోషహర్షములను మాని యుద్ధము నుండి నివృత్తులమై స్పృహను కోల్పోయినట్టు పడియుందాము.

అతను విజయలక్ష్మిని పొందినట్లు భావించి, రావణుని మందిరానికి చేరుకుంటాడు.

శ్లో:

మా భైష్ట నాస్త్యత్ర విషాదకాలో యదార్యపుత్రౌ హ్యవశౌ విషణ్ణౌ।

స్వయంభువో వాక్యమథోద్వహంతౌ యత్సాదితావింద్రజిదస్త్రజాలైః॥

తస్మై తు దత్తం పరమాస్త్రమేతత్ స్వయంభువా బ్రాహ్మమమోఘవేగమ్।

తం మానయంతౌ యుధి రాజపుత్రౌ నిపాతితౌ కోత్ర విషాదకాలః॥

(యుద్ధ కాండ, 74. 3, 4)

విభీషణుడు వానరులతో: శ్రీరామలక్ష్మణులు మూర్ఛిల్లినందుకు భయపడకండి. వారు బ్రహ్మదేవుని వచనములను గౌరవిస్తూ ఇంద్రజిత్తు యొక్క అస్త్రముల వలన బాధను అనుభవిస్తున్నారు. ఈ బ్రహ్మాస్త్రాన్ని విరించి స్వయంగా ఇంద్రజిత్తునకు ఇచ్చాడు. దానిని గౌరవింపదలచి శ్రీరామలక్ష్మణులు ఇలా పడియున్నారు.

శ్లో:

మృతసంజీవనీం చైవ విశల్య కరణీమపి।

సావర్ణ్య కరణీం చైవ సంధానకరణీం తథా॥

(యుద్ధ కాండ, 74. 33)

జాంబవంతుడు హనుమంతునితో: వృషభగిరికినీ, కైలాస శిఖరమునకు మధ్య సాటి లేని తేజస్సుతో వెలిగే ఒక పర్వతం ఉంటుంది. దాని మీద నాలుగు ఔషధులు కనిపిస్తాయి – మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్య కరణి.

శ్లో:

స తేన శైలేన భృశం రరాజ శైలోపమో గంధవహాత్మజస్తు।

సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివార్పితేన॥

(యుద్ధ కాండ, 74. 70)

హనుమంతుడు ఆ పర్వతమును పెకిలించి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు సూర్యతేజోమూర్తి అయిన ఆ మహాత్ముడు ప్రభాకరుని సమీపమున మరొక మార్తాండుని వలె తేజరిల్లాడు. దివ్యౌషధ గిరిని చేబూని యున్నవాడై వేయి అంచులు గలిగి అగ్నికాంతులు విరజిమ్ముచున్న చ్రకమును దాల్చిన మహావిష్ణువు వలె విరాజిల్లాడు.

శ్లో:

తావప్యుభౌ మానుషరాజపుత్రౌ తం గంధమాఘ్రాయ మహౌషధీనామ్।

బభూవతుస్తత్ర తదా విశల్యౌ అత్తస్థురన్యే చ హరిప్రవీరాః॥

సర్వే విశల్యా విరుజః క్షణేన హరిప్రవీరా నిహతాశ్చ యే స్యుః।

గంధేన తాసాం ప్రవరౌషధీనాం సుప్తా నిశాంతేష్వివ సంప్రబుద్ధాః॥

(యుద్ధ కాండ, 74. 73, 74)

శ్రీరామలక్ష్మణులు, వానరవీరులు స్వస్థత చెంది, ఆ ఔషధ ప్రభావమున లేచి కూర్చున్నారు.

శ్లో:

తతో హరిర్గంధవహాత్మజస్తు తమోషధీశైలముదగ్రవీర్యః।

నినాయ వేగాద్ధిమవంతమేవ పునశ్చ రామేణ సమాజగామ॥

(యుద్ధ కాండ, 74. 77)

ఆ ఔషధీ శైలమును వెంటనే హిమవత్పర్వతము మీదకి చేర్చి, మరుక్షణమే శ్రీరాముని వద్దకు చేరెను మారుతి.

శ్లో:

అశోభత తదా ద్రామో ధనుర్విష్ఫారయన్ మహత్।

భగవానివ సంక్రుద్ధో భవో వేదమయం ధనుః॥

(యుద్ధ కాండ, 75. 35)

శ్రీరాముడు తిరిగి ధనువును చేబూనినప్పుడు త్రిపురాసురునిపై కృద్ధుడై వేదమయమైన తన ధనుస్సును చేబూనిన శంకర భగవానుని వలె శోభిల్లెను!

శ్లో:

లక్ష్మణస్తు సుసంక్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్।

బ్రాహ్మమస్త్రం ప్రయోక్ష్యామి వధార్థం సర్వరక్షసామ్॥

తమువాచ తతో రామో లక్ష్మణం శుభలక్షణమ్।

నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హంతుమర్హసి॥

అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతమ్।

పలాయంతం ప్రమత్తం వా న త్వం హంతుమిహార్హసి॥

అస్యై వ తు వధే యత్నం కరిష్యావో మహాబల।

ఆదేక్ష్యావో మహావేగాన్ అస్త్రాన్ ఆశీవిషోపమాన్॥

(యుద్ధ కాండ, 80. 37, 38, 39, 40)

లక్ష్మణుడు: సమస్త రాక్షసులను సంహరించుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగిస్తాను.

శ్రీరాముడు: సోదరా! ఒక్కని కారణంగా ఈ భూతలమున రాక్షసులందరినీ చంపుట సరైన పని కాదు. యుద్ధము చేయకుండా ఉన్నవానిని, దాక్కున్న వానిని, పారిపోతున్న వానిని, స్పృహ లేని వానిని చంపకూడదు. ఈ ఇంద్రజిత్తును మాత్రమే వధించుట సరైన పని.

శ్లో:

తమేనం మాయినం క్షుద్రమంతర్హితరథం బలాత్।

రాక్షసం నిహనిష్యంతి దృష్ట్వా వానరయూథపాః॥

(యుద్ధ కాండ, 80. 41)

శ్రీరాముడు: విషసర్పముల వంటి ప్రాణాంతకాలైన అస్త్రాలను ప్రయోగిద్దాం! ఇంద్రజిత్తు ఎదురుగా నిలవలేక రథముతో కనబడకుండా సంచరిస్తున్నాడు. కనబడితే వానర యోధులే ఇతన్ని మట్టుపెట్టగలరు!

ఇంద్రజిత్తు ‘మాయాసీత’ను హతమార్చాడు.

శ్లో:

వానరాన్ మోహయిత్వా తు ప్రతియాతః స రాక్షసః।

చైత్యం నికుంభిళాం నామ యత్ర హోమం కరిష్యతి॥

(మాయామయీం మహాబాహో! తాం విద్ధి జనకాత్మజమ్)

(యుద్ధ కాండ, 84. 13)

ఇది ‘మాయ’ అని విభీషణుడు చెప్పాడు. ఆ విధంగా వానరులను భ్రమింపజేసి ఆ రాక్షసుడు (ఇంద్రజిత్తు) అభిచార హోమములను నిర్వహించేందుకు నికుంభిళ అనే చైత్యానికి వెళ్ళిపోతాడు.

నికుంభిళ అనే చోట అభిచార హోమము జరుగునప్పుడు ఎవరైతే నిరోధిస్తారో వారే ఇంద్రజిత్తు సంహారకులని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు ఇంద్రజిత్తుకు! శ్రీరాముని ఆదేశానుసారం లక్ష్మణుడు వానర వీరులతో కూడి అటు వెళ్ళాడు. విభీషణుడు తన సైన్యంతో అనుసరించాడు. అక్కడ పోరు గొప్పగా జరిగింది.

శ్లో:

హింసాపరస్వహరణే పరదారాభిమర్శనమ్।

త్యాజ్యమాహుర్దురాచారం వేశ్మ ప్రజ్వలితం యథా॥

పరస్వానాం చ హరణం పరదారాభిమర్శనమ్।

సుహృదామ్ అతిశంకా చ త్రయో దోషాః క్షయావహాః॥

(యుద్ధ కాండ, 87. 23, 24)

విభీషణుని ఇంద్రజిత్తు తూలనాడాడు.

విభీషణుడు: హింసకు పాల్పడుట, ఇతరుల సొత్తును అపహరించుట, పరస్త్రీల యెడ అక్రమముగా ప్రవర్తించుట మొదలగు దురాచారాలకు ఒడిగట్టినవానిని తగులబడుచున్న ఇంటిని వలె వెంటనే పరిత్యజించవలెనని పెద్దలు చెబుతారు. పరుల సొమ్మును దోచుకొనుట, పరస్త్రీలపై అత్యాచారానికి దిగుట, హితైషులైన సజ్జనులను శంకించుట – ఈ మూడును పరమ దోషములు. వీటికి పాల్పడిన వానిని అవి సర్వనాశనమొనర్చును.

శ్లో:

తతః క్రుద్ధో మహాతేజా ఇంద్రజిత్సమితింజయః।

ఆగ్నేయం సందధే దీప్తం స లోకం సంక్షిపన్నివ॥

సౌరేణాస్త్రేణ తద్వీరో లక్ష్మణః ప్రత్యవారయత్।

(యుద్ధ కాండ, 91. 57, 58)

ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రాన్ని లక్ష్మణుడు సౌరాస్త్రం (సూర్య) తో వమ్ము గావించాడు. అలాగే ఇంద్రజిత్తు అసురాస్త్రాన్ని మహేశ్వరాస్త్రంతో వమ్ము గావించాడు.

భయంకరమైన పోరు తరువాత –

శ్లో:

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది।

పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్॥

ఇత్యుక్త్వా బాణమాకర్ణం వికృష్య తమజిహ్మగమ్।

లక్ష్మణః సమరే వీరః ససర్జేంద్రజితం ప్రతి।

ఐంద్రాస్త్రేణ సమాయోజ్య లక్ష్మణః పరవీరహా॥

స శిరః సశిరస్త్రాణం శ్రీమజ్జ్వలితకుండలమ్।

ప్రమథ్యేంద్రజితః కాయాత్ పాతయామాస భూతలే॥

(యుద్ధ కాండ, 91. 72, 73, 74)

లక్ష్మణుడు: ఓ బాణమా! దశరథ మహారాజు కుమారుడు, ధర్మనిరతుడు, సత్యసంధుడు ఐన శ్రీరాముడు నిజముగ పరాక్రమమున సాటిలేని వాడే యైనచో ఈ ఇంద్రజిత్తును హతమార్చుము.

ఆ బాణమును ఆకర్ణాంతము లాగి ఐంద్రాస్త్రపూర్వకముగా ఇంద్రజిత్తును లక్ష్యం చేసి విడిచాడు.

ఇంద్రజిత్తు హతుడైనాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here