(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[కుసుమని హాస్పటల్లో చేర్చారని మహీకి వాళ్లమ్మ చెబుతుంది. అమ్మమ్మ వాళ్ళింటికి ఫోన్ చేసి పరిస్థితి కనుక్కుంటుంది మహీ. తన పరిస్థితి బాలేదనీ, ఒక్కసారి వచ్చి కలవమని అమ్మమ్మ అంటుంది. సరేనని బయల్దేరి వెళుతుంది మహీ. ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడాకా, హాస్పటల్‍కి వెళ్ళి కుసుమని చూసి వస్తానని అంటుంది మహీ. శ్రీధర్ అనే కొత్త డాక్టర్ వచ్చారనీ, ఆరు దాటాక విజిటర్స్ రాకూడదని రూల్ పెట్టారని తాతయ్య చెప్తారు. మర్నాడు కుసుమని కలుస్తుంది. తన బాధనంతా మహీతో చెప్పుకుంటుంది కుసుమ. కుసుమ బామ్మ మాత్రం కుసుమదే తప్పంతా అని అంటుంది. మహీ ఆమె మీద అరుస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి అలా అరవద్దనీ, ఒక అరగంట తర్వాత తన రూమ్‍కి వచ్చి మాట్లాడమని అంటారు. కుసుమ పరిస్థితి నిజంగానే బాగోలేదని, కొన్నాళ్ళ పాటు భర్తకి దూరంగా ఉండడం మంచిదని మహీతో చెప్తారు డాక్టర్ శ్రీధర్. తానేం చేయగలను, అమ్మమ్మ తాతయ్యలతో మాట్లాడి చెప్తాను అంటుంది. అమ్మమ్మ తాతయ్యలతో కుసుమ గురించి మాట్లాడుతుంది. అమ్మమ్మ భరోసా ఇస్తుంది. అమ్మమ్మ చేసిన వంటలని పట్టుకెళ్ళి డాక్టర్ గారికి భోజనం పెట్టి, కుసుమకి తినిపిస్తుంది. కుసుమ అన్నం తిని నిద్రపోతుంది. చాలా రోజుల తర్వాత రుచికరమైన భోజనం తిన్నానని శ్రీధర్ అంటారు. మహీ సంతోషిస్తుంది. – ఇక చదవండి.]
[dropcap]ఒ[/dropcap]క్క రోజు కోసం వెళ్ళినదాన్ని వారం పాటు మా కర్రావూరి వులవపాడులోనే వుండాల్సొచ్చింది. కారణం కుసుమ ఉండమని నన్ను బ్రతిమాలడమే కాదు, డాక్టరూ అదే మాట చెప్పడం.
“ఏ జబ్బూ కేవలం మందుల వల్ల తగ్గదు మహితా, ఆ పిల్ల ఇక్కడికొచ్చినప్పుడు అసలు బతుకుతుందని అనుకోలేదు. నువ్వొచ్చాకా ఆ పిల్లలో అనూహ్యమైన మార్పు వచ్చింది. చిత్రంగా ఆహారం కూడా తీసుకోవడం వల్ల ‘రెక్విప్’ అవుతోంది. కొన్నాళ్ళ పాటు నువ్వు ఆమెతో వుంటే అతి త్వరలోనే డిశ్చార్జ్ అవుతుంది” అని నాతో చెప్పారు శ్రీధర్ గారు.. కుసుమ బామ్మ ఎదటే!
ఆ మాటకి ఆ ముసలావిడ కూడా నా చేతులు పట్టుకు ఏడ్చింది. వారం తర్వాత కుసుమ డిశ్చార్జ్ అయింది.
చిన్న చిన్న సంభాషణలూ, వాదాలు పరువుప్రతిష్ఠలకి సంబంధించిన మూర్ఖపు మాటలూ పక్కన పెడితే, కుసుమ బామ్మా, తల్లిదండ్రులూ కుసుమని ఓ ఏడాది పాటు మా వూళ్ళోనే, వాళ్ళింట్లోనే వుంచుకోవడానికి (?) ఒప్పుకున్నారు. కుసుమ భర్త పెద్ద గొడవ లేవదియ్యబోతే, “నీకెన్ని జబ్బులున్నాయో, ఎలా అంటుకున్నాయో అన్నీ మాకు తెలుసు. పోలీసు రిపోర్టిస్తే కటకటాల వెనక్కు పోతావు. మర్యాదగా ఆ పిల్లని యీ వూళ్ళోనే వుంచి, పుచ్చిపోయిన నీ శరీరాన్ని బాగు చేసుకో. నువ్వు ఏ జబ్బూ లేకుండా నూటికి నూరుపాళ్ళూ ఆరోగ్యంగా వున్నావని డాక్టరు సర్టిఫికెట్టు ఇచ్చిన తరువాతే మా కుసుమని నీతో పంపేది” అని మా తాతయ్య వీర లెవెల్లో అతన్నీ, అతని తల్లిదండ్రుల్నీ బెదిరించాడు. ఏమైతేనేం మరుసటి ఆదివారం నాడు మళ్ళీ మా వూరెళ్ళాను, కుసుమకి ధైర్యం చెప్పి. ఈ వారం రోజులూ కుసుమతో పాటు డాక్టరు గారిక్కూడా భోజనాలు, వూరగాయలూ, స్పెషల్సూ తీసికెళ్ళటంతో ఆయన కూడా ఫుల్ హేపీ.
***
“యూ హావ్ డన్ ఏ గుడ్ జాబ్” మా నాన్న కుసుమ విషయం అంతా విన్నాక నా భుజం తట్టి అన్నాడు.
“ఇంకో రిక్వెస్టుంది నాన్నా” కొంచెం గారంగానే అన్నాను.
కుసుమ విషయం నాన్నతో చెప్పడానికి అసలు కారణం వేరు. కుసుమ బామ్మ కన్నీళ్లు పెట్టుకుని నా చేతులు పట్టుకోవడం తాత్కాలిక ఆవేశంతో. కానీ, ఆవిడ అలానే అంత మంచిగాను వుంటుందని నాకేమీ నమ్మకం లేదు. డిశ్చార్జ్ అయినప్పటి నించీ ఆ ముసలావిడ మళ్ళీ మొండిగా ‘యథా ప్రకార సిద్ధిరస్తు’గా మారిపోయింది. కుసుమని ఆ వూరి లోనే వుంచడం అంటే దాన్ని మళ్ళీ పరువూ ప్రతిష్ఠల మోటబావిలోకి నెట్టడమే అని నాకూ మా తాతయ్యకీ ఆనాడే అర్థమయింది.
“ఏమిటీ?” చిన్నగా నవ్వి అన్నాడు మా నాన్న. నేను కొద్దిగా గారాలు పోతే, ఏదో ఒకటి లాగటానికేనని ఆయనకీ తెలుసు.
“కుసుమని యీ వూరు తీసుకొస్తే గానీ అది పూర్తిగా కోలుకోదు. మీరే అంటారుగా.. పనీపాటా లేని మెదళ్ళు పిశాచాల నిలయాలనీ. అది మళ్ళీ ఆలోచనల వూబిలో పడితే బయటకి లాగడం చాలా కష్టం. మొగుడన్నా, అత్తారిల్లన్నా, వాళ్ళ బామ్మన్నా అది హడలిపోతోంది. దాని బాగు చెయ్యాలంటే, ఏదో ఒక వ్యాపకం కల్పించాలి. ప్రయివేటుగా దాని చదువు కంటిన్యూ చేయిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది.” ఆశగా ఆయన మొహం వంక చూసి అన్నాను. ఆయన నా వంక ఓ క్షణం చూసి, తల తిప్పుకుని, ఓ రెండు నిముషాల తరువాత “సాయంత్రం మీ అమ్మతో కూడా డిస్కస్ చేద్దాం. నువ్వు అనుకున్నంత తేలికైన విషయం కాదిది. చాలా చిక్కుముళ్ళు వున్నాయి. ఆ పిల్లకి పెళ్ళయింది గనక, కుసుమ గురించి కుసుమ తల్లిదండ్రులు మాత్రమే నిర్ణయం తీసుకోవడం కుదరకపోవచ్చు. ఆ పిల్ల అత్తవారికి తెలపకుండా, తెలియకుండా, మనం ఏమీ చెయ్యలేం” అన్నారు. నిజమేగా మరి. అప్పటిదాకా, ఆ విషయం నా బుర్ర లోకి రానందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.
“నేను దానికి మాట ఇచ్చాను నాన్నా” తల వొంచుకుని అన్నాను.
“చూద్దాం..” మా నాన్న లేచాడు. ఎందుకో ఆయన కంఫర్టబుల్‍గా లేరని అనిపించింది.
***
“నీకసలు బుద్ధి అనేది వుందా? ఒక పెళ్ళయిన పిల్లని, అందునా తల్లీదండ్రీ, అత్తామామా, భర్తా అందరూ వున్న పిల్లని మనింటికి పంపుతారని నువ్వెలా అనుకున్నావూ? అది అసలు నిన్నెలా అడగ్గలిగిందీ? మాటిచ్చావా? ఎవర్నడిగి ఇచ్చావే? సొంత పిల్లల సేఫ్టీ గురించే బుర్రలు పగలగొట్టుకుంటుంటే, పరాయి యింటి పిల్లని ఎన్ని కళ్ళతో కాపలా కాయాలో నీకు తెలుసా? పోనీ తీసుకొచ్చినా, ఎంత కాలమని ఇంట్లో అట్టేపెట్టుకుంటాం? పోనీ చదువులో పెట్టినా సరిగ్గా వుంటుందన్న నమ్మకం ఏమిటీ? అసలే భర్త అన్నా, అత్తమామలన్నా ఇష్టం లేని ఆడదాయే. రేపు ఎవడితోనే వుడాయిస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరిదవుతుందే? పేద్ద పోటుగత్తెలాగా పోయావు. సేవ చెయ్యి, కాదన్నామా? ధన సహాయం చెయ్యి, వద్దంటామా? అంతేగానీ, యీ ఇంటికి తెచ్చి పెట్టుకోవడాలూ, చదివించడాలూ ఏమిటే? మతేమన్నా పోయిందా?” ఇంతెత్తున లేచింది మా అమ్మ.
నేను ఆవిడ్నే చూస్తున్నా. మామూలుగా ఎంతో శాంతంగా, కూల్‍గా వుండే మా అమ్మలో కూడా ఇంత వైవిధ్యం వుందా అన్నదే నా ఆశ్చర్యం.
“అది కాదమ్మా.. అది ఆ వూళ్ళోనే వుంటే దాని ఆరోగ్యం మళ్ళీ మొదటికొస్తుంది..” గొంతు పెకల్చుకుని అన్నాను.
“ఓహో.. వాళ్ళ అమ్మానాన్న కంటే నీకే అక్కర ఎక్కువా? తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నువ్వు చూస్తావన్నమాట. మరి నీ చదువుని ఏ గంగలో కలుపుతావూ?” కోపంగా అన్నది అమ్మ.
ఈ అమ్మ నాకు తెలిసిన అమ్మ కాదనిపించింది. ఆ సమయంలో ఏం చెప్పినా వినిపించుకోదని అర్థమయింది. మా నాన్న వంక చూశాను. ఆయన ఎవరి వంకా చూడకుండా గోడ మీద వున్న రాధాకృష్ణుల పటం వంక చూస్తున్నారు. మా అన్నయ్య మా అమ్మ వంకా నా వంకా మార్చి మార్చి చూస్తున్నాడు. తమ్ముడు, చెల్లి ఇంట్లో లేరు.
***
“నువ్వు ఆలోచించిన విధానం పెర్‍ఫెక్ట్. అందులో ఏ సందేహమూ లేదు మహీ. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. ఆశయాలు వేరు.. ఆచరణలు వేరు. ఆ రెండూ ఏనాడూ కలవ్వు. ఒక స్నేహితురాలిగా, ఆమె బాధని తగ్గించాలనే సదుద్దేశంతో నువ్వు మాట ఇచ్చావు. కానీ సంఘపరంగా చూస్తే అదంత తేలిక కాదు. నీ మాటకి విలువిచ్చి మీ అమ్మానాన్నాగారు కుసుమని ఇక్కడికి తీసుకొచ్చినా, అది అక్కడితో ఆగదు. నానా కొట్లాటలూ చికాకులూ మీ వాళ్ళు ఎదుర్కోవాల్సి వుంటుంది. అంత తలనొప్పి వారికి అవసరమా? కేవలం ఆలోచన లేకుండా స్నేహావేశంలో నువ్విచ్చిన మాటని నిలబెట్టడానికి మీ వాళ్ళందరూ నానా మాటలూ పడాలా?” సూటిగా నా వంకే చూస్తూ అన్నారు వరలక్ష్మి గారు. తలొంచుకున్నా.
ఇందాకటి దాకా, అంటే గత వారం నించీ ఇప్పటి దాకా నాకు మా అమ్మ మీద కోపంగానే వుంది. నేను ఎంత వాదించినా, ఎంత బ్రతిమాలినా మా అమ్మ సీరియస్‍గానే వుంది కానీ, పొరపాటునైనా ఒక మెట్టు దిగలే. అందుకే విషయాన్నంతా వరలక్ష్మి మేడమ్‍కి వివరించా.. ఆవిడ స్టాఫ్ రూమ్‍లో ఒంటరిగా వుండడం చూసి.
ఆవిడ వివరించి చెబుతుంటే కొంచెం కొంచెం నాకు అర్థమవుతోంది.
“నేను అనాలోచితమైన పనే చేసి వుండొచ్చు మేడమ్.. కానీ కళ్ళ ఎదటే నాలాంటి ఆడపిల్ల జీవితం అలా అవుతుంటే ఎలా చూస్తూ వుండగలనూ!” నేనూ సూటిగానే అడిగాను.
“చూస్తూ ఉండకూడనేది స్నేహధర్మం. కానీ లోకధర్మం గురించి కూడా ఆలోచించాలిగా! ఒక పని చేద్దాం. మరో వారం పాటు సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించి, ఏమి చెయ్యగలమో నిర్ణయిద్దాం. ఏదో ఓ బాట దొరక్కపోదు” అనునయంగా అన్నారు మేడమ్. నేను తల వూపి నా క్లాస్ లోకి వచ్చేశాను.
“వాళ్ళ జనరేషన్ వేరూ.. మన జనరేషన్ వేరు. మోస్ట్ ఒబీడియంట్ టైపు వాళ్ళు ఉరకలెత్తే ఉడుకు రక్తాన్ని ఎలా అర్థం చేసుకోగలరూ?” అన్నాడు హగ్గీ (హరగోపాల్).
మేడమ్‍తో మాట్లాడిన రెండో రోజున కుసుమ సమస్యని ఫ్రెండ్స్ ముందర పెట్టాను. అదీ కుసుమ పేరు చెప్పకుండా, ఓ ఫ్రెండ్ అని ‘చర్చా కార్యక్రమం’లో యీ సమస్యని వుంచాను. నా తల్లిదండ్రుల పేరు ఎత్తకుండా, ఆ అమ్మాయి ఫ్రెండ్ తల్లిదండ్రులని చెప్పాను. మేడమ్ పేరు ఎత్తకుండా ఆ పిల్లకి వరసయ్యే చుట్టం ఇలా అన్నదని చెప్పాను.. చాలా కన్విన్సింగ్‍గా.
“నో.. అది సరైన ఆలోచన కాదు. సమస్య చాలా సున్నితమైనది. ఉరకలేసే రక్తాలా పడుకున్న ప్రాణాలా అని కాదు ఆలోచించవలసింది. ఇది ఆ పిల్ల జీవిత సమస్య. ఒక్కనాటితోనో, ఓ రెండేళ్ళతోనో తీరేది కాదు. చూడాల్సింది కూడా తాత్కాలిక పరిష్కారం కాదు.. శాశ్వత పరిష్కారం” హగ్గీని సూటిగా చూస్తూ అన్నాడు తిమ్మూ.
ఆ మాటలు నాకు నచ్చడమే కాదు, అతని ధోరణి మీద గౌరవాన్ని పెంచాయి.
“ఆలస్యం అయితే అమృతమైనా విషమౌతుంది. ఇక్కడ తీరిగ్గా మనం ఆలోచిస్తు కూర్చుంటే ఆ పిల్ల ఆత్మహత్మ చేసుకోవచ్చు” కంగారు ధ్వనించే స్వరంతో అన్నది అనంతలక్ష్మి.
“ఆత్మహత్యలకు ప్రయత్నించేవాళ్లు ఆపినా ఆగరు. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకునే వాళ్ళన్నా, చేసుకుంటామని బెదిరించేవాళ్ళన్నా నాకు అసహ్యం. ఆత్మహత్య పేరు చెప్పి ఎదటివాళ్ళని బ్లాక్‍మెయిల్ చెయ్యడం, ఇరకాటంలో పెట్టడం పరమ శాడిస్టులు చేసే పని. అటువంటి వాళ్ళని ఎవడూ ఏమీ చెయ్యలేడు” దూరం నించీ వస్తున్న స్కూటర్‍ని చూస్తూ అన్నాడు తిమ్మూ.
నేను షాకయ్యాను. నేను వూళ్ళో లేని సమయం చూసి అల తిమ్మూకి తన ప్రేమ గురించి చెప్పి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందా? అల వంక చూశా. మొహం మాడ్చుకుని కూచుంది. ఓహో కుసుమ రామాయణంలో ఇదో పిడకల వేటలా అనిపించింది. గంటన్నర పాటు ‘చర్చ’ జరిగినా సమస్య మాత్రం ఓ కొలిక్కి రాలేదు. రెండు రోజుల తరువాత అందరం ఇదే సమస్య గురించి ఆలోచించి మళ్ళీ చర్చకి కూర్చుందామని నిర్ణయానికి వచ్చాం. డిస్పర్స్ అయ్యాకా, అలని అడిగాను, “తిమ్మూతో మాట్లాడావా?” అని.
“ఊహూ..” సన్నగా అన్నది గానీ, ఏదో దాస్తోంది అనిపించింది. దాచేవాళ్ళని ‘ఏమి దాస్తున్నావూ’ అని అడిగి ఏమి వుపయోగం? మౌనంగా మా ఇంటి దారి పట్టాను.
“ఆ అమ్మాయి ‘తలాక్’ తీసుకోవడం మంచిది. వ్యసనాలు అంత తేలిగ్గా వదలవు. ఆమె భర్త అంత తేలిగ్గా మారతాడని నేను అనుకోను. మరోసారి కాపరానికి వెళ్ళిందంటే కాపాడటం ఎవరి తరమూ కాదు” నాతో బాటే మా వీధి మలుపులో కొచ్చిన రహీమా అన్నది.
ఆ ఆలోచన నాకూ నచ్చింది. డైవోర్స్ తీసుకుంటే కనీసం కుసుమ హెల్త్ కన్నా గ్యారంటీ వుంటుందిగా!
***
కుటుంబం కూడా శరీరం లాంటిదే. శరీరంలో ఏ పార్టుకి దెబ్బ తగిలినా మొత్తం శరీరం బాధపడ్డట్టుగానే, కుటుంబంలో ఏ ఒక్కరి మనఃస్థితి సరిగ్గా లేకపోయినా, ఆ ఎఫెక్టు మొత్తం కుటుంబం మీద పడుతుంది.
కుసుమ విషయంలో నేను పట్టుపట్టడం, మా అమ్మ నన్ను అరిభీకరంగా వారించడం, మా నాన్న ఎటూ చెప్పలేక ఇబ్బంది పడడం – మొత్తం యీ వ్యవహారం మా ఇంట్లో ఓ మౌనాన్ని ప్రవేశపెట్టింది. నేను పుట్టాక ఇటువంటి వాతావరణం ఏనాడూ మా యింట్లో నేను చూడలేదు. దీనికి కారణం ఎవరూ? ‘నేనే’ అన్నది స్పష్టంగా నాకు తెలుసు. బహుశా కుసుమకి పెళ్ళి కాకపోతే? అసలీ గొడవే ఉత్పన్నమయ్యేది కాదుగా!
ప్రశ్నలూ నావే.. జవాబులూ నావే. నిద్ర పట్టలేదు.
“మహీ..” పిలిచింది మా అమ్మ నా మంచం పక్కకి వచ్చి. కళ్ళు తెరిచాను.
“నీకు నిద్ర పట్టడం లేదని నాకు తెలుసు. నువ్వెందుకు ఆలోచిస్తున్నావో కూడా తెలుసు. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యకుండా నేను అడ్డుపడ్డాననుకుంటున్నావు. అసలు నాకు ‘స్నేహం’ గురించే తెలీదని నువ్వు అనుకోవచ్చు. ఎటూ చెప్పలేక మీ నాన్న మౌనం లోకి జారుకుంటున్నారు. మొన్న మొన్నటి దాకా కాసిని కబుర్లతో బోలెడు నవ్వులతో సాగిన కుటుంబం ఇవ్వాళ ఓ అర్థం పర్థం లేని గాంభీర్యంతో స్తంభించిపోయింది. సరే! ఇప్పుడు ఏం కావాలి?” మంచం అంచున కూర్చుంటూ అడిగింది మా అమ్మ.
బెడ్ ల్యాంప్ వెలుతురులో కూడా నీరసించిన ఆమె మొహం నాకు స్పష్టంగా కనిపించింది. షాక్ తిన్నాను. గత రెండు వరాలుగా మా అమ్మ మొహాన్ని సరిగ్గా గమనించలేదు. ముద్దబంతి పువ్వులా వుండే ఆవిడ మొహం ఎండిపోయిన చేమంతిలా తయారైంది. కళ్ళు కూడా లోతుకుపోయాయి. నాకెందుకో చాలా గిల్టీగా అనిపించింది. కానీ ఏం చెప్పనూ?
“సమాధానం నీ దగ్గరా వుంటుందని నేను అనుకోను. సరే, నీకు కావల్సిన విధంగా కుసుమని మనింటికే తీసుకొద్దాం. తీసుకురావాలంటే కుసుమ తల్లీ తండీ మాత్రమే కాదు, అత్తామామా మొగుడూ ముగ్గురూ ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకుంటారూ? సరే, ఒప్పుకున్నారనే అనుకుందాం. పిలిచి చదివిద్దాం. ఆ తరువాత? చదువుతుందా? ఉద్యోగం చేస్తుందా? విడాకులిచ్చి వేరేవాడ్ని పెళ్ళి చేసుకుంటుందా?” సూటిగా నా మొహం వంకే చూస్తూ అడిగింది మా అమ్మ.
నా మౌనం తన ప్రశ్నలకి సమాధానం కాదని నాకు తెలుసు. కానీ నా దగ్గర జవాబు లేదు.
“చూడు మహీ, ‘అమ్మ ఎంతో గొప్పదీ, విశాల హృదయం కలదీ అనుకున్నాను గానీ, ఒక వ్యక్తి కష్టం చెప్పినా అర్థం చేసుకోలేని బండరాయి’ అని నువ్వు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే, ఏ తల్లికైనా మొదట తన పిల్లలే ముఖ్యం. లోకంలో ఎవరయినా వాళ్ళ తరువాతే. కుసుమ విషయంలో నాకేం ప్రాబ్లం అని నువ్వు అడగొచ్చు. ఇప్పటికీ వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మలూ, నాయనమ్మలూ నీ గురించి చాలా ‘చెడు’గానే చెప్పు వుంటారని నేను వూహించగలను. నిన్న మొన్నటి దాకా మౌనంగా పడి ఉన్న కుసుమ, ఇవ్వాళ్ళ ‘నేను ఛస్తే కాపరానికి వెళ్ళను’ అని మొండికేసే ధైర్యం ఎవరిచ్చారు? నువ్వే అంటారు వాళ్ళు. రెండోది ఏమంటే, ఇది డబ్బు సమస్య కాదు. కుసుమది ‘మనసు’ సమస్య. మొదట్నించీ దానికీ పెళ్ళి ఇష్టం లేదు. సరే, అది పాపం మనసు నోరు మూసుకుంటే, ఆరోగ్య సమస్య దాని నెత్తి నెక్కి కూర్చుంది. కుసుమ తల్లిదండృలది గౌరవ సమస్య. పెళ్ళి చేసి పంపిన కూతురు కాపరం చెడగొట్టుకుని పుట్టింటికి చేరితే ఎలా తలెత్తుకు తిరగగలమూ అనేది ఆ గౌరవ సమస్య. కుసుమ మొగుడిదీ, అత్తమామలది పరువు ప్రతిష్ఠల సమస్య. పరువు ప్రతిష్ఠలనే పదాలు వినడానికి బాగానే వుంటాయి. కానీ, వాటిని పట్టుకుని పాకులాడే వాళ్ళకి మాత్రం అవి పదాలు కాదు.. మారణాయుధాలు.
ఈ పరువు ప్రతిష్ఠల కోసమే లోకంలో ఆత్మహత్యలూ, హత్యలూ జరిగేది. ప్రస్తుతానికి వాళ్ళు వూరుకున్నా రోజులు గడుస్తున్న కొద్దీ పగ పెంచుకుంటారు. ఆ పగ వాళ్ళ చేత ఏమైనా చేయిస్తుంది. సమస్యని అంత వరకూ తీసికెళ్ళడం ఏ మాత్రం తెలివైన పని కాదు. మధ్యవర్తుల ద్వారా సామరస్యంగా పరిశీలించాలి. ఆ దృష్టితోనే పరిష్కారం వెదకాలి. మీదంతా ఉడుకు రక్తం. నువ్వూ మీ ఫ్రెండ్సూ చేసే, చేస్తున్న చర్చల గురించి నాకు తెలుసు. వాటి పర్యవసానమూ తెలుసు. ఆ సమస్య గురించి నువ్వే కాదు, నేనూ, మీ నాన్నా కూడా ఆలోచిస్తూనే వున్నాం. లే..! మనుషుల మధ్య మౌనం పెరగకూడదు. మౌనం పెరిగిన కొద్దీ బంధాలు దూరమవుతాయి. మేము నీ మంచి కోరే వాళ్ళమే గానీ శత్రువులం కాము. ఎమోషనల్‍గా కాదు ఆలోచించాల్సింది.. ప్రాక్టికల్‍గా..” వొంగి నా తల నిమిరి వెళ్ళిపోయింది.
తను ఇంత పెద్ద స్పీచ్ ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు, వినలేదు. న్యాయంగా చెబితే, అమ్మ చెప్పిన ప్రతి మాటా కరక్టే. చాలా రోజుల తరువాత నిశ్చింతగా నిద్రపోయా.
(ఇంకా ఉంది)