శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం

0
3

[dropcap]అ[/dropcap]మెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటోలో షెల్డన్ హైస్కూల్ థియేటర్లో జూన్ 17, 2023న ప్రవాసాంధ్ర చిన్నారి చిరంజీవి. శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం వైభవంగా జరిగింది. బాల్యం నుంచే నాట్యంపై ఆసక్తి కలిగిన చిరంజీవి. శివాని కి 7వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. గురువు శ్రీమతి. అనుష్య రాజేంద్ర శిక్షణలో తన 15వ ఏట చిరంజీవి. శివాని భరతనాట్య అరంగేట్రం కార్యక్రమానికి ఉపక్రమించింది.

ఈ సందర్భంగా వేదికపై ముఖ్య అతిథి, శ్రీ విశ్వంభరానందగిరి స్వామి అనుగ్రహభాషణ చేస్తూ విశ్వమే హిందువు, హిందువే విశ్వం అనేది వేదకాలం నుంచి ఉన్నదని, హిందువు అంటే పాపములు, చెడు, విషయవాంఛలు వదిలి సర్వమానవ శ్రేయస్సు కోసం కృషి చేసేవారని అన్నారు. హిందూ సాంప్రదాయంలో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని ఆయన చెప్పారు. నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని, భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయము చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చునని ఆయన తెలిపారు. ఈ తరం యువతకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలనన్నారు. అది వారి వ్యక్తిత్వంలో నిర్ణయాత్మకమైన మంచి మార్పులకు కారణమవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భరతనాట్యం అరంగేట్రం గావించిన చిరంజీవి. శివాని పేరిశెట్లను అభినందిస్తూ శ్రీ విశ్వంభరానందగిరి స్వామి ఆమెకు ‘భరతనాట్య విద్యాధరి’ బిరుదు ప్రదానం చేశారు. మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించ మునుపు ఈయన ‘ఒలుకుల శివశంకరరావు – ధారణావధాని’గా సుపరిచితులు.

ఈయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాల ప్రధానాచార్యుడుగా పనిచేశారు. ఈయన 1997లో తెలుగు విశ్వవిద్యాలయంలో 1125 శ్లోకాలను 10 గంటలలో నిర్విరామంగా ధారణచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. మేన్ ఆఫ్ రికార్డుకు ఎంపికైనారు. ప్రపంచవ్యాప్తంగా 300 ధారణావధాన కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు 2013 తానా సభలలో కనకాభిషేకం, రత్నహారాభిషేకం, ఇంకా అనేక సంస్థల నుండి పలు సత్కారాలు లభించాయి.

అంతకు మునుపు స్థానిక షెల్డన్ హైస్కూల్ థియేటర్లో వైవిద్యభరితమైన భరత నాట్యాంశాలను జనరంజకంగా ప్రదర్శించి చిరంజీవి. శివాని ప్రేక్షకులకు కనువిందు చేసింది. స్థానిక నృట్ట డాన్స్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రముఖ గురువు శ్రీమతి. అనుష్య రాజేంద్ర శిష్యురాలైన చిరంజీవి. శివాని భరతనాట్యంలో అరంగేట్ర ప్రదర్శన చేసింది. పుష్పాంజలి, అలరిప్పు, జతిస్వరం, వర్ణం, శివస్తుతి, తిల్లానా అంశాల్లో నర్తించి ఆమె భళా అనిపించింది. ఈ కార్యక్రమంకు పెద్ద సంఖ్యలో స్థానిక శాక్రమెంటో ప్రవాసాంధ్రులు హాజరై చిరంజీవి. శివాని ని అభినందించారు. శివాని తల్లిదండ్రులు పేరిశెట్ల లలితబాబు, డా. మాధవి ఆధ్యర్యంలో శ్రీ విశ్వంభరానందగిరి స్వామి వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం గురు శ్రీమతి. అనుష్య రాజేంద్ర కు సత్కారం చేశారు.

 

ఈ భరతనాట్యం అరంగేట్ర ప్రదర్శనకు శ్రీమతి నీల రామానుజ గాత్రం, ఏ.పి కృష్ణ ప్రసాద్ వేణువు, ఎస్ .జి ప్రమత్ కిరణ్ మృదంగం వాద్య సహకారం అందించారు. చిరంజీవి. శివాని పేరిశెట్ల మాట్లాడుతూ తనకు ప్రేమతో భరతనాట్యం విద్యను నేర్పించిన గురు శ్రీమతి. అనుష్య రాజేంద్ర కు ధన్యవాదాలు తెలియజేసింది. ముఖ్య అతిధి శ్రీ విశ్వంభరానందగిరి స్వామి వారికి, తన తల్లిదండ్రులకు, సోదరునికి, భరతనాట్యం అరంగేట్ర ప్రదర్శన ఆసాంతం తిలకించిన వీక్షకులకు, సహకారం అందించిన వాద్య బృందానికి వినమ్ర పూర్వకమైన కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి. శివాని పేరిశెట్ల చెప్పింది. ఈ సందర్భంగా థియేటర్ లాబీలో ప్రదర్శనకు ఉంచిన భరతనాట్య ఔన్నత్యాన్ని తెలిపే పలు కళాఖండాలు, చిత్రాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here