[బలరాజ్ సహ్ని నటనా వైదుష్యాన్ని విశ్లేషిస్తూ పి. జ్యోతి గారు అందిస్తున్న వ్యాస పరంపరలో భాగంగా ‘ఘర్ సంసార్’ చిత్రం విశ్లేషణ.]
[dropcap]బ[/dropcap]ల్‍రాజ్ సహ్నిలో ఓ మేధావి దాగి ఉన్నాడు. అయన ఆలోచనలు దేశ ఉన్నతి, దేశ ఆత్మగౌరవ పోరాటం దిశగా సాగుతుండేవి. భారతదేశం తన సంస్కృతిని, తన వారసత్వాన్ని పాశ్చాత్య అనుకరణతో పోగొట్టుకోకూడదనే తపన ఆయనలో ఎంతో ఉండేది. బల్‍రాజ్ సినిమాలలో నటిస్తున్న సమయంలో ప్రతి రంగం విదేశీ అనుకరణను ఆమోదిస్తుంటే, అదే ఉన్నతి అని భావిస్తుంటే ఆయన మాత్రం మన దేశ సాధారణ ప్రజానిక ఆత్మ తన పనిలో కనిపించాలని తపించేవారు. వారి ఈ తపన ఆయన జే.యెన్.యూ విద్యార్థులకు ఇచ్చిన ఉపన్యాసంలో స్పష్టంగా అర్థం అవుతుంది.
“నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, మా ఉపాధ్యాయులు అందరు కూడా, లలిత కళలు తెల్లవారి ప్రత్యేక హక్కు అని మమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నించేవారు. గొప్ప సినిమాలు, గొప్ప నాటకం, గొప్ప నటన, గొప్ప పెయింటింగ్ మొదలైనవి యూరప్, అమెరికాలలో మాత్రమే సాధ్యమయ్యాయి అని చెప్పేవారు. భారతీయ ప్రజలు, వారి భాష, సంస్కృతి నిజమైన కళాత్మక వ్యక్తీకరణకు వెనుకబడి ఉన్నారు అన్న అభిప్రాయాన్ని బాహాటంగానే ప్రకటించేవారు. మేము దీన్నీ ఖండించే ప్రయత్నం చేసినా లోలోపల, మేము ఈ తీర్పును అంగీకరించేవాళ్ళం.
సాహిత్య ప్రపంచంపై, నాకు గణనీయమైన ఆసక్తి ఉంది. కాని అక్కడా నేను అదే పద్ధతిని చూసాను. మన నవలా రచయితలు, కథా రచయితలు, కవులు ఐరోపాలోని ఫ్యాషన్ ప్రవాహాల బాటలో నడుస్తున్నారు. యూరప్, సోవియట్ యూనియన్ మినహా, భారతీయ రచనల గురించి ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఉదాహరణకు, పంజాబ్‌లోని నా స్వంత ప్రావిన్స్‌లో ప్రస్తుతం ఉన్న సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా యువ కవులలో నిరసన అలలు ఉన్నాయి. వారి కవిత్వం, ప్రజలు ప్రస్తుత వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, దానిని విచ్ఛిన్నం చేయాలని, అవినీతి, అన్యాయం మరియు దోపిడీ లేని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలని ఉద్బోధిస్తుంది. ఎవరూ ఆ స్ఫూర్తిని హృదయపూర్వకంగా ఆమోదించలేరు, ఏ ప్రశ్నలు లేకుందా, ప్రస్తుత సామాజిక క్రమాన్ని మార్చడం అవసరం.
ఈ కవిత్వం యొక్క కంటెంట్ చాలా ప్రశంసనీయం, కానీ రూపం దేశీయం కాదు. ఇది పశ్చిమం నుండి తీసుకోబడింది. పశ్చిమం కవిత్వంలో మీటర్, రైమ్‌లను విస్మరించింది, కాబట్టి మన పంజాబీ కవి కూడా దానిని విస్మరిస్తున్నాడు. అతను తప్పనిసరిగా అల్ట్రా-రాడికల్ చిత్రాలను కూడా ఉపయోగిస్తున్నాడు. ఫలితం ఏమిటంటే, ధ్వని మరియు కోపం కాగితంపై మాత్రమే మిగిలిపోయింది. సాహిత్య సర్కిల్‌లలో పరస్పరం ఒకరినొకరు మెచ్చుకోవడానికి మాత్రమే ఈ కవిత్వం పరిమితం అవుతుంది. విప్లవోద్యమానికి ఊతమిచ్చే ప్రజలు, కార్మికులు, కర్షకులు ఇలాంటి కవిత్వానికి తలవంచలేరు. ఇది వారిని కలవరపెడుతుంది. ఇతర భారతీయ భాషలు కూడా ‘న్యూ వేవ్’ కవిత్వంలో ఉన్నాయని నేను చెబితే మీరు ఒప్పుకుంటారనుకుంటా.
పెయింటింగ్ గురించి నాకు ఏమీ తెలియదు. అందులో మంచి చెడులు నేను అంచనా వేయలేను. కానీ ఈ రంగంలో కూడా మన పెయింటర్లు విదేశాల్లోని ప్రస్తుత ఫ్యాషన్‌లకు అనుగుణంగా ఉన్నట్లు నేను గమనించాను. ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది.
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని మన స్వాతంత్ర్య ఉద్యమం ఎల్లప్పుడూ ఆస్తి కలిగిన వర్గాలు – పెట్టుబడిదారులు, భూస్వాములచే ఆధిపత్యం చెలాయించబడిందని అంగీకరించారు. కాబట్టి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ వర్గాలే అధికార పగ్గాలు చేపట్టడం కనిపిస్తుంది. గత ఇరవై ఐదేళ్లలో ధనవంతులు ‘ధనవంతులు’గా ఎదుగుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారన్నది నేడు అందరికీ తెలిసిందే. పండిట్ నెహ్రూ ఈ పరిస్థితిని మార్చాలని కోరుకున్నారు, కానీ ఆయన ఏమీ చేయలేకపోయారు. నేను దానికి అతనిని నిందించను, ఎందుకంటే అతను తన ప్రయత్నాలకు చాలా తీవ్రమైన అసమానతలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ రోజు మన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశాన్ని సోషలిజం వైపు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆమె ఎంతవరకు విజయం సాధిస్తుందో నేను చెప్పలేను. రాజకీయం నా విషయం కాదు. కాని ప్రస్తుత ప్రయోజనాల కోసం, నేటి భారతదేశంలో, ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఆస్తిపాస్తులే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని మీరు నాతో ఏకీభవిస్తారనుకుంటాను. బ్రిటీష్ వారు మన దేశంపై తమ సామ్రాజ్య పట్టును పటిష్టం చేసుకోవడం కోసం ఆంగ్ల భాషను ఉపయోగించారని మీరు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు, భారతదేశంలోని ప్రస్తుత పాలకులు వారి వారసులుగా తమ స్వంత ఆధిపత్యాన్ని బలపరచుకోవడానికి ఏ భాషను ఎంచుకుంటారనుకుంటారు? రాష్ట్రభాష హిందీ నా? కాదు. వారి కోరికలు కూడా ఇంగ్లీషు ద్వారా మాత్రమే తీరతాయని నాకు అర్థం అవుతుంది. దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం వారికి ఉన్నందున, వారు రాష్ట్రభాష హిందీ గురించి చాలా సందడి చేసి ప్రజల మనస్సు మళ్లిస్తారు కాని ఇంగ్లీషు భాషకే ప్రాధాన్యత ఇస్తారు. వారికి దాని వల్ల లాభం ఉంటుంది కాబట్టి.
లాభాల దృక్కోణంలో, పారిశ్రామికీకరణ మరియు సాంకేతిక విప్లవం వేగవంతమైన ఈ కాలంలో పెట్టుబడిదారీ వర్గానికి ఆంగ్లాన్ని నిలుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో సామాజిక ప్రయోజనాలు వారికి ఎక్కువ. ఆ దృక్కోణంలో, ఆంగ్లం మన పాలక వర్గాలకు దేవుడు పంపిన బహుమతి. ఎందుకు? మన దేశంలోని లక్షలాది మంది శ్రమించే వారికి ఆంగ్ల భాష అందుబాటులో ఉండదు అనే సాధారణ కారణంతో. పురాతన కాలంలో, సంస్కృతం మరియు పర్షియన్ శ్రామికులకు అందుబాటులో ఉండేవి కావు. అందుకే ఆనాటి పాలకులు వాటికి రాష్ట్ర భాషా హోదా కల్పించారు. సంస్కృతం మరియు పర్షియన్ భాషల ద్వారా, ప్రజానీకం అజ్ఞానులుగా, హీనంగా, అనాగరికంగా తమను రాజ్యపాలనకు అనర్హులుగా భావించుకున్నారు. సంస్కృతం, పర్షియన్ వారి మనస్సులను బానిసలుగా మార్చుకోవడానికి సహాయపడింది.
బ్రిటీష్ వారి నుండి వారసత్వంగా పొందిన సామాజిక క్రమాన్ని కాపాడుకోవడం, నిర్వహించడం మన ప్రస్తుత పాలక వర్గాలకు అవసరం. వారికి ఇందులో విశేషమైన శ్రద్ధ ఉంది. కానీ వారు దానిని బహిరంగంగా ఒప్పుకోరు. అందుకే హిందీని రాష్ట్రభాషగా చేయాలని ఎంతో మాట్లాడతారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పదాలన్నింటినీ కోల్పోయిన భాష, ఇంగ్లీషు ఆధిపత్యాన్ని సవాలు చేయలేనంత బలహీనమైనదని, తెలివితక్కువదని వారికి బాగా తెలుసు. అందువలన ఈ రాష్ట్ర భాష హిందీ నినాదం ఒక ప్రదర్శనగా మాత్రమే మిగిలిపోతుంది. ఇంకా చెప్పాలంటే, జనాలను తమలో తాము పోట్లాడుకునేలా చేయడానికి అనుకూలమైన సాధనంగా ఉండిపోతుంది.
మా సినిమా వ్యక్తులకు పాఠశాలల, కళాశాలల్లో చదువుతున్న యువకుల నుండి ఫ్యాన్ మెయిల్ క్రమం తప్పకుండా వస్తుంది. నాకు చేరే ఆ ఉత్తరాల ద్వారా భారతీయ విద్యార్థులు ఆంగ్ల భాషతో ఎంత హింసకు గురవుతున్నారో స్పష్టంగా అర్థం అవుతుంది. బోధన మరియు అభ్యాస స్థాయిలు మన దేశంలో అధ్వాన్నంగా ఉన్నాయి. ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యం పెరిగిపోతూ సగటు విద్యార్ధిని భయపెడుతుంది.
ఇంగ్లీషు పరాయి భాష అని, అందువల్ల సగటు భారతీయుడికి అది నేర్చుకోవడం చాలా కష్టమని అందరూ అంగీకరిస్తారు. ఇది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అఖిల భారత స్థాయిలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సహాయపడుతుందని అర్థం చేసుకోండి. పాలకుల ప్రయోజనాలకు ఏది ఉపయోగపడుతుందో అది జాతీయ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడే విధంగా నిర్ణయిచబడుతుంది. అందుకే ఇంగ్లీషుకు ప్రాధాన్యత భవిష్యత్తులో పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఒక రోజు నేను కార్మిక నాయకుడైన నా స్నేహితుడికి ఇదే విషయం చెప్పాను. పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి పలికి సోషలిజాన్ని తీసుకురావాలని మనం తీవ్రంగా ఆలోచిస్తే, పెట్టుబడిదారీ వర్గం చూపే శక్తితోనే శ్రామికవర్గం అఖిల భారత స్థాయిలో సంఘటితం కావడానికి మనం సహాయం చేయాలని నేను చెప్పాను. శ్రామికవర్గం సమాజంలో ప్రముఖ పాత్రను సాధించడంలో మనం సహాయం చేయాలి అంటే ఆంగ్ల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి, దానిని ప్రజల భాషతో భర్తీ చేయడం ద్వారా మాత్రమే సాధించగలం. నా స్నేహితుడు నా మాట జాగ్రత్తగా విని నాతో చాలా వరకు ఏకీభవించాడు. “మీరు పరిస్థితిని చాలా బాగా విశ్లేషించారు, అయితే నివారణ ఏమిటి?” “ఇంగ్లీషు లిపిని అలాగే ఉంచుకోవడం మరియు ఆంగ్ల భాషను తరిమికొట్టడమే దీనికి పరిష్కారం” అని నేను బదులిచ్చాను. “కానీ ఎలా?” “ఒక పద్ధతిలో హిందుస్తానీ భాషని భారతదేశం అంతటా శ్రామిక ప్రజానీకం ఉపయోగిస్తున్నారు. విద్యాసంబంధమైన, వ్యాకరణ సంబంధమైన నియమాలను విస్మరించడం ద్వారా దానిని ఆచరణాత్మకంగా వారు ఉపయోగించుకోగలరు. ఈ రకమైన హిందుస్థానీలో, “లడ్కా భీ జాతా హై” మరియు “లడ్కీ భీ జాతా హై” అని మాట్లాడుకోవచ్చు. ఇందులో గొప్ప స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉంది. మేధావులు కూడా దీనికి సులువుగా అలవాటు పడిపోతారు. నిజానికి, ఇది హిందుస్థానీ యొక్క ఉత్తమ సంప్రదాయం.
పాత రోజుల్లో, బజార్ల భాష అని దీన్ని ధిక్కరించారు. ఈ రోజు ఈ బజారీ హిందూస్తానీలో యూనివర్సిటీ అనే పదం ‘యూనివ్రస్తి’ అవుతుంది – విశ్వవిద్యాలయం కంటే చాలా మంచి పదం అది. లాంతరు ‘లాల్టైన్’ అవుతుంది, స్పానర్ ‘పనా’ అవుతుంది. సైనికుడు తన రైఫిల్‌ను శుభ్రపరిచే తీగను ఆంగ్లంలో “పుల్-త్రూ” అంటారు. రోమన్ హిందుస్తానీలో, ఇది “ఫుల్ట్రూ” అవుతుంది – ఇది ఓ అందమైన పదం. “బార్న్-డోర్” అనేది హాలీవుడ్ లైట్ మ్యాన్ బ్లేడ్ కవర్ కోసం ఉపయోగించే పదం. బాంబే ఫిల్మ్ వర్కర్ దానిని “బందర్”గా మార్చాడు, ఇది అద్భుతమైన పరివర్తన.
ఇలాంటి ప్రయోగాలతో హిందుస్తానీ భాషకు ప్రజలలోకి చొచ్చుకుపోయే అపరిమితమైన అవకాశాలున్నాయి. దానితో అంతర్జాతీయ, శాస్త్రీయ, సాంకేతిక పదజాలాన్ని పూర్తిగా హిందుస్తానీలో వాడవచ్చు. ఆ భాషను సుసంపన్నం చేసుకోవచ్చు. ప్రతి దానికి సంస్కృత నిఘంటువు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. రోమన్ లిపిని అలానే ఉంచుకోవచ్చు. ఇప్పటికే అల్-ఇండియా కరెన్సీ పొందిన ఏకైక స్క్రిప్ట్ ఇది. కొన్ని సంవత్సరాలుగా దాన్ని మనం ఉపయోగిస్తున్నాము. అప్పుడు నా మిత్రుడు “కామ్రెడ్ యూరప్ కూడా ఎస్పెరాంటోతో ఇలాంటి ప్రయోగాలు చేసింది. బెర్నార్డ్ షా వంటి గొప్ప మేధావి బేసిక్ ఇంగ్లీషును ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఎంతో ప్రయత్నీంచాడు. కాని భాషలను యాంత్రికంగా పరిణామం చేయడం సాధ్యం కాదనే సాధారణ కారణంతో ఈ పథకాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి.” అన్నాడు “కాని నేను మాట్లాడుతున్నది ప్రజలు వాడుకలో మార్చుకుంటున్న భాషా పరిణామాల గురించి, వాటిని ఆమోదించవలసిన అవసరం గురించి” అన్నాను. కానీ నా మిత్రుడిని నా వాదానికి ఒప్పించలేకపోయాను.
నేతాజీ సుభాష్ బోస్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ ఇద్దరూ రోమన్ హిందుస్తానీకి బలమైన న్యాయవాదులు అని చెప్పి చూసినా అతను నా ఆలోచనను ఆమోదించలేదు. నేను తప్పే కావచ్చు. కాని భాషా పరమైన సనాతన ఆలోచనల నుండి ఏదో విధంగా బయట పడవలసిన అవసరం ఉంది అన్నది నా అభిప్రాయం. అప్పుడే ఇంగ్లీషు భాష దాస్యం నుండి మనలను మనం విముక్తులను చేసుకోగలం.”
బల్‍రాజ్ సహ్ని చర్చించ జూసిన విషయాలలోని లోతు గమనిస్తే భాషా పరిణామల పట్ల, భాషా రాజకీయాల పట్ల, దేశ ఐక్యతకు భాష అవసరం పట్ల వారి లోతైన ఆలోచన అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా భారతీయం ఆంగ్లమయం అయిపోయింది. దీనిని ఆయన ఆ రోజుల్లోనే ఊహించారు. అందుకోసం ప్రత్యాయమానాలను సూచించారు. ఇవే ప్రత్యాయమానాల్ని ఎంచుకున్న స్పానిష్ భాష ఇప్పటికీ ఆంగ్లానికి ఎలా గట్టి పోటీగా నిలిచి ఉందో చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఆయన చేసిన దూరాలోచన అబ్బుర పరుస్తుంది. భారతీయతను అంతగా ప్రేమించారు కాబట్టే, విదేశాలలో పని చేసినా, యూరోప్ జీవితాన్ని అనుభవించినా ఆయన పూర్తి భారతీయత నిండిన కళాకారుడిగానే, నిలబడి, భారతదేశపు సగటు మానవుని ప్రతినిధిగా కనిపించే పాత్రలనే ధరించి తన నిబద్ధతను చాటుకున్నారు.
ఆ క్రమంలో వచ్చిన మరో సినిమా 1958లో వచ్చిన ‘ఘర్ సంసార్’. వీ.యం. వ్యాస్ దర్శకత్వంలో నర్గిస్, బల్‍రాజ్ సహ్ని జంటగా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర కుమార్, కుంకుం కూడా ప్రధాన పాత్రలు పోషించారు. మజ్రూహ్ సుల్తాన్‌పురి, ఎస్. హెచ్. బిహారి రాసిన పాటలకు రవి సంగీతం సమకూర్చారు. కైలాష్, ఉమ భార్యా భర్తలు. వీరికి ఓ పాప. కైలాష్ తమ్ముడు దీపక్ ‘లా’ చదువుతూ ఉంటాడు. అతని చదువు కోసం అన్నా వదినలు ఎంతో కష్టపడతారు. తన మంగళసూత్రం కూడా కుదువ పెట్టి ఉమ మరిదిని హాస్టల్‌లో ఉంచి చదివిస్తూ ఉంటుంది. దీపక్ జ్యోతి అనే ధనవంతురాలిని ప్రేమిస్తాడు. అయితే జ్యోతి తండ్రి కారణంగానే కైలాష్ దీపక్‌ల తండ్రి చిన్నతనంలో మరణిస్తాడు. జ్యోతి దీపక్ పేదరికం తెలిసే అతన్ని ప్రేమిస్తుంది. తన వల్ల మరణించిన మిత్రుడు కొడుకుగా దీపక్‌ని గుర్తించి ఆమె తండ్రి కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. కాని కైలాష్ దీన్ని వ్యతిరేకిస్తాడు. అయినా ఉమ మరిది మనసు తెలుసుకుని కైలాష్‌ని పెళ్ళికి ఒప్పిస్తుంది. కాని కోడలిగా వచ్చిన జ్యోతి చెప్పుడు మాటలు విని ఆ ఇంట ప్రశాంతత లేకుండా చేస్తుంది. దీపక్ వదినపై చేయి చేసుకునే స్థితి కల్పిస్తుంది. దీనికి దీపక్ ఎంతో పశ్చాత్తాపపడతాడు. కాని కైలాష్ ఇలాంటి పరిస్థితులలో ఇంట ఉండలేమని వెళ్ళిపోతాడు. చివరకు బాంకే అనే ఓ మిత్రుడి సహాయంతో అసలు విషయాలన్నీ బయటకు వచ్చి అందరూ కలసిపోవడం సినిమా కథ.
సినిమాలో సంగీతం చాలా బావుంటుంది. ‘యే హవా యే నదీ కా కినారా’ అనే సూపర్ హిట్ పాట ఈ సినిమాలోనిదే. ‘చేడో ధున్ మత్వాలో కీ’ అనే మరో చలాకీ పాట కూడా చాలా బావుంటుంది. నర్గిస్ బల్‍రాజ్ సహ్నిలు పోటీ పడి నటించారు. సినిమాలో మెలోడ్రామా పాలు ఎక్కువ ఉన్నా ఆ పాత్రలలోని భావావేశాలు సహజంగా ఉండడానికి ఇద్దరూ కలిసి కష్టపడడం కనిపిస్తుంది. ఇద్దరివీ సాత్వికమైన ప్రవృత్తి కల పాత్రలు. కాని వారిలో అంతర్లీనంగా ఉండే బలహీనమైన మనస్తత్వం సహజంగా బైటకు కనిపిస్తూ ఉంటుంది. తప్పు చేసిన వారిని క్షమించడానికి ఇద్దరూ ఇబ్బంది పడతారు. బల్‍రాజ్ సహ్ని ఎంట్రీ సీన్ బావుంటుంది. ఇంటికి అఫీసు నుండి వచ్చిన కైలాష్ వదినా మరుదులు, తన కూతురు సరదాగా ఇంట్లో నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ఇంత కన్నా ప్రశాంతత ఇంటి యజమానికి ఏం కావాలి? ఇంటికి రాగానే ఇంట్లోని వారి నవ్వులను చూడడం కన్నా అదృష్టం ఏం ఉంటుంది అని అనే చోట చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుక్కునే సగటు మానవుడి ఫిలాసఫి కనిపిస్తుంది. బల్‍రాజ్ ఇలాంటి సన్నివేశాలను చాలా సహజంగా పండిస్తారు. అలాగే తన దగ్గర ఉత్తరం రాయించుకోవడానికి వచ్చిన వ్యక్తి అతని తమ్ముడి చదువు మానిపిస్తున్నాడని తెలిసి అతన్ని మందలించేటప్పుడు కూడా ఆయనలోని ఆ సహజమైన సింప్లిసిటీ ముచ్చట గొలుపుతుంది. వీధి పిల్లల గొడవలతో చదువుకోలేక పోతున్న మరిది దీపక్‌ను ఉమ బలవంతంగా హాస్టల్‌కు పంపుతుంది. దాని కోసం అప్పు చేస్తుంది. హాస్టల్ రూమ్‌లో దీపక్‌ని చూడడానికి వచ్చిన జ్యోతికి టీ ఇచ్చి, మరో కప్పు చేసుకోలేక నీళ్లను టీగా తాగుతూ నటించే దీపక్ పేదరికాన్ని అర్థం చేసుకోలేని జ్యోతి పరిస్థితులు ఆలోచింప జేస్తాయి.
అలాగే ఆమె మొండి వైఖరి కారణంగా ఆమె హాస్పిటల్ పాలయినప్పుడు ఆ వేదనతో నలిగిపోయి పరీక్ష రాయలేక చావుకు సిద్ధపడతాడు దీపక్. చివరకు మరో చోట పరీక్ష రాయవచ్చంటే దానికి కూడా డబ్బు అప్పుగా తీసుకువచ్చి కడుతుంది ఉమ. ఇలాంటి అన్ని సందర్భాలలోనూ భర్త కన్నా ఇంటి నిర్ణయాలలో ఆమెదే పైచేయిగా కనిపిస్తుంది. బల్‍రాజ్ సహ్నికి అసలు పాత్రలేదు అనిపిస్తుంది. కాని నిరాడంబరుడుగా, అతి సాధారణ వ్యక్తిగా తాను కనిపించే సీన్లలో తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఆ అర్ధ మౌనంలోనే ఓ డిగ్నిటీని మోసుకొస్తారు బల్‍రాజ్. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే కప్పులోని టీని పంచుకోవడం ఓ సీన్‌లో కనిపిస్తుంది. సాసర్‌లో టీ వంచుకుని కప్పుని భార్యకిస్తూ బల్‍రాజ్ భార్యకు తానిచ్చే విలువను ప్రదర్శిస్తాడు. ఏ సీన్‌లో కూడా పురుషాధిక్యత చూపకూండా ఆయన చూపించే ఆ మంచితనం ఎంత గొప్పగా ఉంటుందంటే అసలు చాలా సీన్లలో నర్గిస్ తప్ప ఆయన కనిపించరు. చాటున ఉండిపోతారు. అది ఆ పాత్ర నైజం. దాన్ని అంతే మామూలుగా నటిస్తారు బల్‍రాజ్. నటుడికి ఎక్కడ మౌనాన్ని ఆశ్రయించాలో, ఎక్కడ తన ఉనికిని చాటుకోవాలో తెలియాలి. ఈ కంట్రోల్ ఎప్పుడు ఏ సందర్భంలోనూ తప్పని ఏకైక నటుడు బల్‍రాజ్ సహ్ని. మరో సీన్‌లో ఊరు నుండి వచ్చిన దీపక్ ఇంటికి వస్తాడు. అతని చేతిలో ఓ బాగ్ ఉంటుంది. అలాగే మరొకటి కైలాష్ చేతిలో ఉంటుంది. ఇంటికి వచ్చిన చిన్నానను చూసి అతని పైకి దూకుతుంది ఉమ కూతురు. ఆమెను ఎత్తుకోవడానికి సంచి పక్కన పెడతాడు దీపక్. ఇద్దర్ని చూసి నవ్వుతూ తమ్ముడు పక్కన పెట్టిన సంచిని మరో చేతితో తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు కైలాష్. ఈ సీన్‌తో కైలాష్ పాత్ర స్వభావాన్ని మాటలు లేకుండా చెప్పగలిగారు. ఈ సినిమా మొత్తంలో బల్‍రాజ్‌కి చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. కాని ఇలాంటి చిన్న చిన్న చర్యల ద్వారా ఆ పాత్ర నైజాన్ని బల్‍రాజ్ సహ్ని పలికించిన తీరు నిశితంగా గమనిస్తే ఆయన నటనా శైలికి అచ్చెరువు చెందుతాం.
భార్య గౌరవం ఇంట తగ్గుతుందని తెలిసినప్పుడు కోపంతో రగిలిపోతాడు కైలాష్. ఇంటి గౌరవం పాడవుతున్నదని తెలిసినప్పుడు అతనిలోని ఆ ఇంటి పెద్ద నైజం బైటపడుతుంది. భార్య అసహాయిరాలయినప్పుడు అతను నిర్ణయాధికారం తన చేతిలోకి తీసుకుంటాడు. యజమాని భాద్యతను నిర్వహిస్తాడు. భార్య పై చేయి చేసుకున్న మరిదిని పెంచిన మమకారంతో ప్రేమిస్తూ కూడా ఆ ఇంట ఉండలేని వెళ్లిపోతాడు. అనవసరమైన అధికారాన్ని ప్రకటించని ఔదార్యం ఉన్న సామాన్యమైన గృహస్థుడిగా ఆ పాత్రను బల్‍రాజ్ స్కీన్ పై నడిపించిన తీరు గమనిస్తే సామాన్య గృహస్థులలోని కుటుంబ పరమైన విలువలను, ఉమ్మడి కుటుంబాల యజమానుల ఔదర్యాన్ని అతను ఎంత స్టడీ చేసారో అర్థం చేసుకోవచ్చు. కూతురుని రక్షించుకునే క్రమంలో అసహాయిడైన ఓ పేద తండ్రిగా మళ్ళీ కనిపిస్తారు ఆయన. ఇంట్లో యజమాని, భార్యకు భర్త, సమాజంలో ఓ పేద గుమస్తాగా సీన్ సీన్‌కు ఆయన శరీర భాష మారిపోతూ ఉంటుంది. కుటుంబం తిరిగి కలిసే సీన్‌లో అప్పటి దాకా మిగతా పాత్రల వెనుక నిలిచి ఉండడంలోని తన పెద్ద మనసును పరిచయం చేస్తూ విడిచిన ఇంట్లోకి ముందుగా తిరిగి తానే ప్రవేశిస్తూ “వెనుక వచ్చే కుటుంబానికి అండగా నేను” అన్న సందేశాన్నిస్తారు.
నటుడు సంభాషణలతోనే కాదు, ఓ సీన్‌లో ఎక్కడ నుంచోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువైపు చూడాలి అన్న విషయాలతో కూడా తన పాత్రతో కథ చెప్పించగలగాలి. బల్‍రాజ్ సహ్ని చేసిన సాత్వికమైన పాత్రలలో ఇది గమనించవచ్చు. తాను ప్రేమించే వ్యక్తులతో సంభాషిస్తున్నప్పుడు ముందుకు వంగిన శరీరంతో ఆయన కనిపిస్తారు. పని చేసే చోట ఆయన కూర్చున్న తీరులో ఓ బాధ్యత కనిపిస్తుంది. అక్కడకు వచ్చే వ్యక్తులతో మాట్లాడే తీరులో ఆయన శరీరం స్నేహాన్ని కురిపిస్తుంది. కాని ఇక్కడ పూర్తిగా వంగి ఆయన మాట్లాడుతూ కనిపించరు. కూతురుతో సంభాషించేటప్పుడు వారి శరీర భాష మరోలా ఉంటుంది. అందుకే ఆయన ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా సినిమాను నడిపించగలరు. భారతదేశంలో ఇంతటి సహజ నటనను ప్రదర్శించే నటులు బహు కొద్దిమంది. అనవసరమైన ఒక్క కదలిక, ఒక్క మాట కూడా బల్‍రాజ్ సహ్ని గారి పాత్రలలో కనిపించవు. ఇది అర్థం చేసుకోవడానికి ‘ఘర్ సంసార్’ సినిమా ఒక్కటి చాలు.