వైవిధ్యభరితమైన కవితా సుమమాల ‘పండుగలు ముత్యాలహారాలు’

1
3

[dropcap]భా[/dropcap]రతీయుల పండుగల గురించి, జాతీయ పర్వదినాల గురించి ఒక నూతన ప్రక్రియలో వెలువరించిన కవితల సంపుటి ‘పండుగలు ముత్యాలహారాలు’. ఉట్నూర్ సాహితీ వేదిక ద్వారా వెలువడిన 31వ పుస్తకం ఇది.

వృత్తి రీత్యా హిందీ అధ్యాపకులైన శ్రీ రాథోడ్ శ్రావణ్ తెలుగు సాహిత్యాభిమాని. స్వయంగా కవి, వ్యాసకర్త కూడా. కవిత్వం మీది అభిమానంతో స్వయంగా ‘ముత్యాలహారం’ అనే ఒక కొత్త కవితా ప్రక్రియని రూపొందించారు.

‘ముత్యాలహారం’ కవితా ప్రక్రియ నియమాలు:

  • ఇందులో నాలుగు పాదాలు ఉండాలి.
  • 1, 2, 3, 4 పాదాలకు అంత్యానుప్రాస ఉండాలి.
  • మొత్తం నాలుగు పాదాలకు కూడా మాత్రలు 10 నుండి 12 వరకు ఉండాలి.
  • నాలుగు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి.

ఈ ప్రక్రియని కవుల్లో ప్రచారం చేయడమే కాకుండా ఈ ప్రక్రియలో కవితలు రాసి, సంపుటి వెలువరించడం ముదావహం.

***

ఈ పుస్తకంలో మన దేశంలో వివిధ మతస్తులు జరుపుకునే పండుగలు, జాతీయ పర్వదినాలు, మహనీయుల జయంతులపైన లఘుకవితలు ఉన్నాయి. తెలుగువారి పండుగ ‘ఉగాది’తో ప్రారంభించి ‘ఉపాధ్యాయ దినోత్సవం’తో ముగించారు.

ఈ పుస్తకంలోని 29 ముత్యాలహారాలలో, దేనికదే ప్రత్యేకమైనది. పండుగలు, పర్వదినాల నేపథ్యంలో సరళమైన పదాలతో, భారతీయ సంస్కృతిని సంప్రదాయాలను వివరించారు కవి. అలాగే ముఖ్యమైన దినోత్సావల నేపథ్యంగా  కొందరు మహనీయులు జాతికి చేసిన సేవలను స్మరించారు.

‘ఉగాది’లో “కోకిలమ్మ పాటలు/పరిమళిస్తూ పువ్వులు/వసంత కాల ఋతువులు/మదిన ఆనందక్షణాలు” అంటూ పండుగ ప్రాశస్త్యం వివరించడంతో పాటు అందమైన ప్రకృతిని దర్శింపజేస్తారు.

‘శ్రీరామనవమి’లో “శ్రీరాముని గుణగణాలు/అధర మధుర తలపులు/నిత్య సత్య వచనాలు/సకల ప్రాణుల రక్షకులు” అంటూ శ్రీరామచంద్రుని స్తుతించారు.

‘గురు పూర్ణిమ’లో “రవి చంద్రుల వెలుగులు/చుక్కల్లోని చంద్రులు/సత్య హరిశ్చంద్రులు/మన గురువులు” అంటూ గురువుల ఔన్నత్యాన్ని చాటుతారు.

‘నాగుల పంచమి’లో “ఉయ్యాల కట్టాలి/అక్క చెల్లిని పిలవాలి/ఖుషి ఖుషిగా ఉండాలి/ఉయ్యాల పాట పాడాలి” అంటూ పండుగ వేడుకలోని ఆచారాలను తెలుపుతారు.

‘రాఖీ’లో “రక్షాబంధన వేడుకలు/సంతోష పలకరింపులు/రంగురంగుల రాఖీలు/కట్టేను అక్కాచెల్లెళ్ళు” అంటూ సోదరీమణుల అప్యాయతలను ప్రదర్శిస్తారు.

“అల్లిన బుట్టలను పట్టి/చేతులు చేతులు కట్టి/తెచ్చేను చీమల మట్టి/ఉపవాస దీక్షలు పట్టి” అంటూ ‘తీజ్’ పండుగ సందర్భంగా గిరిజన మహిళల భక్తశ్రద్ధలను తెలియజేస్తారు.

“మా కోసం బతుకుతావు/సిరులు పండిస్తున్నావు/పండుగ రోజున నీవు/పూజలు అందుకుంటావు” అంటూ ‘పోలాల అమావాస్య’ సందర్భంగా పశువులను పూజించే ఆచారం గురించి తెలిపారు.

“సంతోషంగా ఆటలు/మధురమైన పాటలు/వరి పొలాలు అందాలు/వాకిలికి కొత్త శోభలు” అంటూ బతుకమ్మ పండుగలోని శోభని కళ్ళకు కడతారు.

“తలకు నెమలి కిరీటాలు/కాళ్ళకు కట్టేను గజ్జెలు/చేతికి రాజదండాలు/రేల, థింసా నృత్యాలు” అంటూ ఆదివాసి పండుగ ‘దండారి’ని జరుపుకునే పద్ధతిని పరిచయం చేస్తారు.

“పవిత్రమైన పండుగ/నిష్ఠ నియమాలు ఉండగ/ఉపవాసం కఠినంగా/సహర్ ఇఫ్తిర్ విందుగా” అంటూ రంజాన్ పండుగ విశిష్టతని వెల్లడిస్తారు.

‘క్రిస్మస్’లో “మీ మహిమలు అనంతం/మీ దీవెనలు అమృతం/మీ బోధనలు అద్భుతం/ప్రభు త్రిగుణాలు స్వంతం” అంటూ యేసు ప్రభువును కొనియాడుతారు.

“రంగురంగుల ముగ్గులు/అలంకరించు గడపలు/మామిడాకు తోరణాలు/ఇంటింటికి వెలుగులు” అంటూ సంక్రాంతి సంబరాలను వర్ణిస్తారు.

“పూసిన పువ్వు నీవు/మెరిసిన మెరుపు నీవు/దీపానికి కాంతి నీవు/పారే సెలయేరువి నీవు” అంటూ ‘అంబేద్కర్ జయంతి’లో ఆ మహనీయునికి వందనాలు అర్పిస్తారు.

ఇవే కాక జెండా పండుగ, గాంధీ జయంతి, నెహ్రూ జయంతి, సంత్ సేవాలాల్ జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి, సీత్ళ పండుగ, పీర్ల పండుగ గురించి మనోజ్ఞమైన భావాలతో చక్కని కవితలు వెలువరించారు.

ఈ కవితలన్నింటిలో దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల, దేశానికి సేవలందించిన మహనీయుల పట్ల కవికి ఉన్న గౌరవ భావం స్పష్టంగా గోచరిస్తుంది. ఆయా శీర్షికలకి తగ్గ బొమ్మలతో, చక్కని ఛాయాచిత్రాలలో పుస్తకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

***

పండుగలు ముత్యాలహారాలు (కవితా సంపుటి)
రచన: రాథోడ్ శ్రావణ్
ప్రచురణ: ఉట్నూర్ సాహితీ వేదిక
పేజీలు: 84
వెల: ₹ 75/-
ప్రతులకు:
రాథోడ్ శ్రావణ్,
ఐబి సుభాష్ నగర్
ఉట్నూర్, ఆదిలాబాద్. 504311
సెల్. 9491467715.
ఆన్‍లైన్‌లో తెప్పించుకునేందుకు:
https://www.amazon.in/PANDUGALU-MUTHYALA-HARALU-Poems-Telugu/dp/B0BVBL3B5Y/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here