[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
ప్రకరణం 3 కాకతీయుల కాలంనాటి సమాజము – స్త్రీలు – మొదటి భాగం:
[dropcap]ఏ[/dropcap] కాలంలోనైనా స్త్రీల సామాజిక స్థితిగతులు తెలుసుకోవాలంటే ఏ ఒక్క వర్గానికి చెందిన స్త్రీలలో పరిగణనకు తీసుకుంటే చాలదు. సంఘంలో ఎన్నో వర్గాలుంటాయి. అందరి జీవన విధానం ఒకే విధంగా ఉండదు. రాజకీయ మత ఆర్థిక పరిస్థితుల ప్రభావం వివిధ వర్గాలపై భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఆయావర్గాలకు చెందిన స్త్రీల జీవన విధానంలో కూడా తేడాలుంటాయి. కనుక స్త్రీల సామాజిక స్థితిగతులు తెలుసుకోవాలంటే వారినీ వర్గీకరించి అంచనా వేయవలసి ఉంటుంది.
ప్రాచీన కాలంనుంచి స్త్రీలను కులస్త్రీలు, వేశ్యలు అని రెండు వర్గాలుగా ఎంచేవారు. కులస్త్రీ అంటే మంచి కులము, శీలము కలిగిన ఆడది అని నిఘంటువులో అర్థమున్నది కానీ అన్ని కులాలలోనూ శాస్త్రీయంగా వివాహమాడిన స్త్రీని కులస్త్రీ అనే వ్యవహరిస్తారు. వేశ్యలంటే తమ రూపంతోనూ, కళానైపుణ్యంతోనూ విటుల నాకర్షించి ధనార్జన చేసేవారు. కాకతీయుల కాలంలోని సాహిత్యంలోనూ, శాసనాలలోనూ కులస్త్రీలు, వేశ్యలకంటే భిన్నమైన వారు సానులు, భోగశ్రీలనే వారు కానవస్తారు. సానులు తమ కళలను దైవారాధనకు ఉపయోగించి దేవాలయాలకు అంకితమైన స్త్రీలు, భోగస్త్రీ అంటే కులపత్ని లాగా వివాహిత కాకుండా, వేశ్యలాగా విటులని మార్చక ఒకే పురుషుని నమ్ముకుని జీవించేది. స్త్రీల గురించి తెలుసుకోవాలంటే వీరందరినీ భిన్న వర్గాలుగా పరిగణించ వలసి ఉంటుంది. కనుక ఆనాటి స్త్రీలను ఈ క్రింది వర్గాలుగా విభజించి వారి గురించి తెలుసుకోవాలి.
స్త్రీలలో వర్గాలు:
- కులస్త్రీలు
- సానులు
- భోగస్త్రీలు
- వేశ్యలు
ఒక్కొక్క వర్గానికి చెందిన స్త్రీలకు సాహిత్యంలో, శాసనాలలో వాడిన విశేషణాలను బట్టి వారు ఏవిధంగా ఉండాలని సమాజం ఆశించిందో, వారికుండవలసిన ధర్మాలేమిటో తెలుస్తాయి. ఆయా వర్గాల స్త్రీల జీవన విధానం గురించి కూడా ముందు వివరించ బడుతుంది. జీవన విధానంలో తేడాలున్నా సంఘంలో వారి స్థానాలలో తేడాలున్నాయా లేదా అన్నది కూడా పరిశీలించవలసిన విషయం.
కులస్త్రీలు
వీరు సంఘంలో అధిక సంఖ్యాకులు. తక్కిన వర్గాల వారు అల్ప సంఖ్యాకులు. కులస్త్రీని కులపాలిక, కులసతి అని కూడా వ్యవహరిస్తారు. కులపాలిక అంటే కులమును, శీలమును గల యాడుది అని సూర్య రాయాంధ్ర నిఘంటువులో అర్థమివ్వబడింది. పాతివ్రత్యం, కుటుంబ నిర్వహణ బాధ్యత, అతిథి అభ్యాగతుల నాదరించడం, పిల్లల పెంపకం గృహలంకరణ ఇవి కులస్త్రీల ధర్మాలు. పురుషుడికి ఎంత మంది భార్యలున్నా లేక భోగసతులున్నా కులపత్ని అంటే అతని కులానికి చెందిన భార్యకు తక్కిన వారందరికన్నా గౌరవం ఎక్కువ. ధర్మ కార్యాల నిర్వహణలో ఆమె భర్తతో పాలుపంచుకుంటుంది. భారతీయ సమాజంలో ప్రాచీనకాలం నుంచి నేటి వరకు కులస్త్రీలకు ఆ గౌరవం ఉన్నదే కానీ సమాజంలో ఆమె ఎంత వరకు స్వతంత్రంగా వ్యవహరించ గలుగుతుంది. కుటుంబంలో తల్లిగా, భార్యగా, కుమారైగా ఆమెకున్న స్థానం, మిగిలిన వర్గాల స్త్రీలతో పోలిస్తే ఆమె సుఖప్రదమైన జీవితం గడపగలిగిందా లేదా, కావ్యాలు, పురాణాలు, నీతి, ధర్మశాస్త్రాలు, ఆమెకు నిర్దేశించిన ధర్మాలు, న్యాయ సభలలో కులస్త్రీలకు ఎంతవరకు న్యాయం జరిగేది అన్న విషయాలను బట్టి సమాజంలో ఆమెకున్న స్థానం గురించి నిర్ణయించ వచ్చును.
మొదట కాకతీయులనాటి కావ్యాలలో శాసనాలలో కులస్త్రీలను వర్ణించే సందర్భంలో వారికి ఉపయోగించిన విశేషణాలను బట్టి ఆనాటి వారు స్త్రీలు ఏ విధంగా ఉండాలని ఆశించేవారో తెలుస్తుంది.
కావ్యాలలో కులస్త్రీలకు వాడిన విశేషణాలు:
కావ్యాలలో కులస్త్రీలను అనింద్య చరిత, సకల గుణగణాలంకృత, పుణ్యచరిత్ర మొదలైన విశేషణాలతోను శాసనాలలో సతి, పతివ్రత, ప్రియతమ, ధర్మపత్ని, సుచారిత్ర వంటి విశేషణాలతోను ప్రస్తుతించారు. కులస్త్రీలకు వాడిన విశేషణాలను బట్టి సమాజం కులస్త్రీలకు నిర్దేశించిన లక్షణాలను తెలుసుకోవచ్చును.
దశకుమార చరిత్ర అవతారికలో కేతన కవి తిక్కన తల్లి అన్యమాంబను కులవధూరత్నమని అఖిల ‘గుణగణాలంకృత’, ‘పూర్వారాధిత దేవత’ అని ప్రశంసించి ఆమె పతిభక్తిలో అరుంధతికి, సౌభాగ్యంలో రతీదేవికి, భాగ్యంలో లక్ష్మీకి, ఓర్పులో భూదేవికి సాటియైనదన్నాడు.
అతడు ఖడ్గతిక్కన తల్లిని “కామిత వసు విశ్రాణన భూమిజనిత కల్పవల్లి” అనగా కోరిన వస్తువులనిచ్చే భూమిపై జనించిన కల్పలత అని, ఖడ్గతిక్కన భార్యను “పతిహితారుంధతి, అనింద్య చరిత, సకల గుణగణాలంకృత” అని ప్రశంసించాడు. భూమిదేవి, కొమ్మమాంబ అన్న స్త్రీలను ధీరగుణాన్విత అనీ, బ్రహ్మమాంబను మానిని అని వర్ణించాడు. మారమను పతిదేవత అని స్తుతించాడు.
మారన మార్కండేయ పురాణంలో మల్ల సేనాపతి భార్యను “సౌభాగ్య నీతిభాసుర కాంతి శ్రీమహిత” యని, కాకతి గణపతిదేవుని అనుగు తలవరి మేచయనాయకుని కుమార్తె మల్లమాంబికను “అతుల శుభలక్షణ స్ఫురితామలాంగి” అని ప్రశంసించాడు. మంచన కేయూర బాహుచరిత్రలో గుండదండాధీశుని పుత్రిక భీమనామాత్యుని భార్య అయిన ప్రోలమాంబను ‘వసుమతీదేవి కెనవచ్చు’నని పొగిడాడు.
శాసనాలలో కులస్త్రీలకు వాడిన విశేషణాలు:
గొదిశాల శాసనంలో రాజనాయకుని భార్య రవ్వమాంబను ధర్మపత్ని, సుచారిత్ర అన్నారు.
మల్యాల నాథుడు సబ్బసేనాపతి భార్య, కాటయ తల్లి అయిన ఆచమను పతివ్రత, ప్రియతమ అన్నారు. చౌండసేనాని భార్య మైలమను కొండపర్తి, కాటకూరు శాసనాలలో గుణంలోనూ, రూపంలోనూ దేవతాస్త్రీలను మించినదని, నిర్దోషమైన గుణాలు కలదని, కులభూషణమనీ ప్రశంసించారు. చెఱకు కేతన భార్యను ప్రియభాషిణి, గంభీరురాలు అన్నారు.
పడ్లాభిదానుని భార్య వెన్నాంబికను “అరుంధతీ వాస్య భభూవకాంతా పతివ్రతాచార విచారవీధీ! శిష్టేష్ట విద్వజ్జన కామధేనుర్వెన్నాంబికా” అని పొగిడారు.
తాడికొండలోని ఒక శాసనంలో పోతక్షితీశుని భార్య పోతాంబను “శ్వశుర గృహజనైరీడ్యమానాతి ముగ్ధా” అనీ, సాధుశీల, పతిహితచరిత, అని ప్రశంసించారు. మన్మపోతరాజు భార్య రాణి పండాంబికను లక్ష్మీవలె సంపదలు కలదనీ, పార్వతి వలె సర్వార్థాలు కలదనీ, ప్రియంవద అనీ, వాణివలె వీణాగానం వంటి మధురమైన కంఠం కలదనీ, అరుంధతి వంటిదనీ ప్రస్తుతించారు.
కులస్త్రీలకు ఉండవలసిన లక్షణాలు:
కాకతీయుల కాలంనాటి శాసనాలలో కులస్త్రీలకు వాడిన విశేషణాలను బట్టి ఆనాడు కులస్త్రీలు ఈ విధంగా ఉండాలని సమాజం ఆశించినట్లు ఊహించవచ్చును.
కన్య శుభలక్షణాలు కలిగిన అవయవ సౌందర్యం కలిగి ఉండాలి. ముగ్ధ అయి ఉండాలి. వినయ వివేకాలు కలిగి ఉండాలి. ఆనాడు వంశాభివృద్ధి కొరకు కులశీల రూపగుణాలు కలిగిన కన్యను ధర్మపత్నిగా చేసుకొనేవారు. అరుంధతి వలె పతివ్రత అయివుండాలనీ, సౌందర్య సౌభాగ్య చాతుర్యాలలో రతి, లక్ష్మీ, సరస్వతులకు సాటి అయివుండాలనీ ఆశించేవారు.
పండితులను, ఆశ్రితులనూ ఆదరించేది, పుట్టినింటికీ, మెట్టినింటికీ పేరుతెచ్చేది అయివుండాలి.
కులసతి గంభీరమైన స్వభావం కలిగి నిండుకుండవలె తొణకని స్వభావం, ధీరగుణం కలిగి ఉండాలి. సహనము కలిగి ఉండాలి. వీణాధ్వని వంటి మధుర కంఠస్వరంతో ప్రియభాషిణి అయిఉండాలి.
మంచెన కేయూర బాహుచరిత్రలో పోలమాంబ అన్న స్త్రీ గురించి చెప్పినదాన్ని బట్టి పురాణాలు కులస్త్రీలు ఎలా ఉండాలని ఆశించాయో తెలుస్తుంది.
పుణ్యంబు ముడి మోచు పొలతుల కెల్ల నీ
పువు బోడి యౌ దల భూషణంబు
పతియాజ్ఞ దలనిడి బరి యింత గడవని
లలనల కీయింతి తిలకలక్ష్మి
తొడిపూసి కట్టి బంధువులకు నిడియున్న
పడతుల కీ పుణ్యభామ యొజ్జ
కడుపు చల్లగ మేలికొడుకుల బడసిన
సుదతుల కీచామ మొదలిపేరు
తాల్మిగని యొప్పు కందువ తగవు నెలవు
ధర్మముల యొక్క మొగమాట తావకంబు
సుగుణముల ఠావు వినయంబు చోటనంగ
బోలమాంబిక యెల్లెడ బొగడ నెగడె
పోలమ పుణ్యం మూటకట్టుకున్న స్త్రీలకు శిరోమణి వంటిది, పతి ఆనతి తలదాల్చి, గీచిన గీటుదాటని స్త్రీలకు తిలకం వంటిది అని, తాను అనుభవించి బంధువులకు కూడా ఇచ్చిన పుణ్యవతి అనీ, కడుపుచల్లగా కొడుకులను కన్నతల్లులలో శ్రేష్ఠురాలు, ఓర్పు, ధర్మము, వినయం కలది అని ఆమెను అందరూ పొగిడేవారని చెప్పడం ద్వారా మంచెన కులస్త్రీల గుణాలను వర్ణించాడు.
సిరిపురం శాసనంలో కాట్యపెగ్గడ భార్య అన్నాంబ పాతివ్రత్య గుణాన్విత అనీ, ధైర్యగుణంలోనూ, జనుల పొగడ్తనందుకున్నదని ప్రశంసించారు. బ్రాహ్మణ స్త్రీలకు ఆనాడు సహగమనం తప్పనిసరి కాదు బహుశా ఆమె ధైర్యంగా పరలోకగతుడైన భర్తను అనుగమించి ఉంటుంది. కనుక ధైర్యగుణంలోను, పాతివ్రత్యంలోను ఆమె పొగడ్తలందుకుని ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు ఉన్నదంతా బ్రాహ్మణులకు, బీదసాదలకు దానం చెయ్యడమూ, మామూలు ధర్మకార్యాలకై ధనాన్ని వెచ్చించడం వల్ల శిష్టేష్ట విద్వజ్జన కామధేనువని ప్రశంసలనుందుకుని ఉంటుంది. పతిహితారుంధతీ, అరుంధతీ వాస్య భభూవ కాంతా పతివ్రతా చార విచారవీధి వంటి విశేషణాలను ఆ స్త్రీ అరుంధతి వలె పతివ్రత అన్న అర్థంలో వాడి ఉండరు. సహగమనం చేసిన స్త్రీ అరుంధతితో సమానమైనదని ధర్మశాస్త్రాలలో చెప్పడం వల్ల ఆ విధంగా సహగమనం చేసిన స్త్రీలకే ఆ విశేషణాలు వాడి ఉంటారు.
కావ్యాలలో కవులు శ్రీల ధీరత్వాన్ని, గంభీర గుణాన్ని, పాతివ్రత్యాన్నీ, శుభలక్షణయుతమైన సౌందర్యాన్నీ పొగిడితే శాసనాలలో స్త్రీల దాన తత్పరతను, దేవబ్రాహ్మణ భక్తిని ప్రశంసించడమే కాక వారి శారీరక సౌందర్యాన్ని కూడా అభివర్ణించారు. కాకతి గణపతి దేవుని ముందుకాలంలోని శాసనాలలో కులస్త్రీల సౌందర్యాన్ని రతి, రంభ, తిలోత్తమ, మేనక వంటి అప్సరల సౌందర్యంతో పోల్చారు. మాటల చాతుర్యంలో వాణితో పోల్చేవారు. క్రమక్రమంగా ఈ పద్ధతి వర్ణన మానీ కులస్త్రీలకు, వారి సహనం, వినయ విధేయతలు, దానతత్పరత, దేవ బ్రాహ్మణభక్తి, పాతివ్రత్యం వంటి సుగుణాలను పొగిడే విశేషణాలనే వాడసాగారు.
రెండవ ప్రతాప రుద్రుని కాలంనాటి కావ్యాలలోను, శాసనాలలోను కులస్త్రీలకు, ధర్మపత్నులకు వారి శారీరక సౌందర్య, చాతుర్యాలకు సంబంధించినంత వరకు రతి, రంభ, వాణి వంటివారితో పోల్చడం మాని కేవలం సతి, అరుంధతి, సీత, శచీదేవి వంటి స్త్రీలతో మాత్రమే పోల్చడం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వైదిక పౌరాణిక మతానికి చెందిన మారన, మంచెన, కేతన వంటి కవులు ఈవిధంగా కులస్త్రీలను ప్రస్తుతించడం జరిగింది.
కాకతి రెండవ ప్రోలుని కాలంనాటి నిడిగొండ శాసనంలో నతవాడి దుర్గభూపతి భార్య ముప్పమాంబను గుణాధిక్యానికి సీత, అరుంధతి, పార్వతి, శచీదేవిలతో పోల్చి, అందానికి రతి, రంభ, ఊర్వశి, తిలోత్తమలతో పోల్చారు. చతురోక్తులలో వాణిని మించినదన్నారు. గొడినెల శాసనంలో రేచర్ల రుద్రుని తల్లి బెజ్జమాంబను సౌభాగ్య, సౌందర్య, చాతుర్యాలు కలిగిన పతివ్రత అని ప్రశంసించారు. కానీ నన్నెచోడుడు కుమార సంభవంలో “బహుపద చతురోక్తులలో వరసతి గతి నెఱిగింపవలదె” అని కావ్యం వారశ్రీ వలె బహువిధములైన చతురోక్తులతో ఆనందింప చేయాలన్నాడు. అంటే నన్నెచోడుని కాలానికి కులస్త్రీలకు మాటలలో గాంభీర్యమే గానీ చాతుర్యం ఉండవలసిన గుణంగా కనిపించలేదు.
వరసతి అంటే వారవనిత కాదు అనే అభిప్రాయముంది. కానీ నన్నెచోడుడు వరసతి అన్న పదం వారాంగనకే వాడాడు అని ఈ క్రింది పద్యాన్ని బట్టి చెప్పవచ్చు.
“వరసతి సురత కళాగమ
పరిణత డగు విటుని గూడి పాయదు; మఱి డె
ప్పరమున బాసియు నెన్నడు
నొరు గవయదు జున్ను దిన్న యొట్టియ వోలెన్”
విట విదూషక నాగరిక పీఠమర్థకులు – వారు చేసే సంభాషణలను నన్నె చోడుడు చతురోక్తి, పరిహాసోక్తి, వక్రోక్తి, గ్రామ్యోక్తులన్నాడు.
“అంత నటవిట గోష్ఠియందు విటవిదూషక నాగరిక పీఠ
మర్దకులు చతురోక్తి పరిహాసోక్తి వక్రోక్తి గ్రామ్యోక్తులందగిలి సంభా
షించుచు దమ తమ మనోవ్యాపారంబు లెఱింగించుచు”
వెలయాండ్ర గురించి వారు సంభాషించే సందర్భంలో వరసతి అన్న పదం వాడబడింది.
కాకతి మైలమాంబ త్రిపురాంతకం శాసనాన్ని బట్టి నీతి, మతి, ధృతి కులస్త్రీల గుణాలుగానూ, సర్వకళలు విలాసినుల గుణాలుగాను ఆనాటివారు భావించినట్లు గమనించవచ్చును.
కాకతి మైలమ మామగారైన నతవాడి బుద్ధభూపతిని
“తత్సుతో బుద్ధ భూపాలో యస్య నీతిర్మతిర్ధృతిః
కులస్త్రీయః కళాస్సర్వా విలాసిన్యో విలాసినః” అన్నారు.
కులస్త్రీలు ఎలా ఉండాలో ఆనాటి కవులు కావ్యాలలో పాత్రల ద్వారా చెప్పించారు.
మహాభారతం ఆదిపర్వంలో శ్వేతకేతుడు స్త్రీల విషయంలో ఈ విధంగా కట్టడి చేశాడు.
“ఇదియాదిగా సతులెన్నండు బరపురుషార్థినుల్ గా జనదన్య పురుషు
సంగమంబున జేసి సకల పాతకములు నగు, బరిగ్రహ భూతలయిన సతుల
కిట్టిద మర్యాద..”
కులసతులు పరపురుషులను కోరరాదు. భర్త నియోగించినట్లయితే చేయకపోవడం దోషం. భర్త నియోగించని ఏ పనీ సతి చేయరాదు అని పాండురాజు కుంతికి చెప్పి ఆమెను నియోగ పద్ధతిలో సంతానం పొందమని ఆదేశించాడు.
భర్తచేత నియోగింప బడక సతికి,
నెద్దియును జేయగా దగదెద్దియైన
భర్తచేత నియోగింప బడిన దాని
జేయకునికి దోషంబని చెప్పెమనువు
శైవ మతంలో జంగములను శివునితో సమానంగా సంభావిస్తారు. వారు కోరితే భార్యలను కూడా అప్పగించేవారు. జంగముడు ఒకడు బసవన్న భార్య గంగాంబ కట్టుకున్న కోకను తన వేశ్యకిప్పించమని కోరితే అప్పటికప్పుడే భార్యను పిలిచి అందరి ముందరా ఆమె కోకను విప్పి అతనికిప్పించాడు బసవన్న. అంటే భర్త ఏమి చేసినా కులసతి అడ్డు చెప్పరాదు.
అపుడు ‘దనసతి నాస్థానసదన – మునకు బిల్వ గ బంచి ముద్దియ గదిసి,
పుట్టు సావెఱు గనియట్టి మహాత్ము డట్టలంబుగ నీదు పుట్టమడ్గెడివి.
పుట్టనీవేగమీ పుట్టమిచ్చినను – బుట్టము మన యని యట్టి చందమున
లజ్జయు సిగ్గు దలంపక బసవ డజ్జ లజాక్షి వల్వఱిముఱిబట్టి, యొలవంగ’
భర్త ప్రేమగా ఉన్నా, ఇష్టపడకపోయినా, తనకు ప్రియంగా ఉన్నా లేకపోయినా మగడే ప్రియుడు అని వర్తించే మానవతికి అన్ని లోకసుఖాలు లభిస్తాయి అని పురాణకవులు స్త్రీలకు బోధించారు.
తె. ఒక్క మన్నతోనున్న నొల్లకున్న
గరము నెయ్యుడై యున్నను గాకయున్న
మగడు ప్రియతముండని యుండు మానవతికి
నెల్లలోక సుఖంబులు నెదురువచ్చు.
కం. నడవడి యొప్పక యుండిన
గడునిర్ధను డయిన పతియె గతియును వినుమె
క్కుడు బంధుండును, బ్రియుండుం
బడ తులకుం బరమగురుడు బరదేవతయున్
తె. ఇంతిశీల దోషంబుల నిట్టి పతికి
నతివలెవ్వరు ప్రతికూలలయి చరింతు
రమ్మహా పాపవతులు దుర్యశము నొంది
కూలి, కాంతురధోలోక ఘోరగతుల
అని భాస్కర రామాయణకర్త అనసూయ ద్వారా సీతకు చెప్పినట్లు చెప్పించాడు.
పతివ్రత అయిన స్త్రీ భర్త అంటే యిష్టం లేకపోయినా ఉన్నట్లు ప్రవర్తించాలి అని ఆనాటి పౌరాణిక కవులు కులస్త్రీలను శాసించారు.
కులస్త్రీలు – స్వాతంత్ర్యం:
నన్నెచోడుని కుమారసంభవంలో శివునికై తపస్సు చేయడానికి వెళ్ళే పార్వతిని అంతఃపురంలోని ప్రౌఢాంగనలు నిరోధించారు.
‘ఇడ్డబొట్టువోలె నింటిలో నుండక, యాడుదానవింతయడరి’ అడవిలో తపం చేయటానికి పోతానని అంటున్నావు. అంత జఱభితనం ఎక్కడ నేర్చావు అని వారు కోపగించారు. దాన్నిబట్టి పెద్దకుటుంబంలోని స్త్రీలు, కన్యలు తపస్సు చేసుకొనేందుకైనా బయటికి వెళ్ళరాదు. అట్లా వెళ్ళినవారిని బరితెగించినట్లు భావించేవారు.
స్త్రీలు ఎవరినైనా తమ యిష్టం వచ్చిన వారిని ప్రేమించి పెళ్ళిచేసుకోవడం కూడా సమాజం హర్షించలేదు. స్త్రీకి ప్రేమ తగదు. “ఇంతవలవంతతనమాడు వారికి దగునె?” అని అంతఃపురంలోని వృద్ధ స్త్రీలు పార్వతిని విమర్శించారు. పెద్దవారు వివాహాలు నిశ్చయించాలే గానీ తనకు తానుగా పెద్దయింటి స్త్రీ కులస్త్రీ ప్రేమించి వివాహం చేసుకోరాదు. ఆ కాలంలో రాజకుటుంబాలలో పెళ్ళిళ్ళు ఎక్కువగా రాజకీయ సంబంధాలు గట్టిపడడానికి అయేవిగానీ వధూవరులు ఒకరినొకరు ఇష్టపడటం వల్ల కాదు.
కులస్త్రీల ధర్మాలు – భిన్న దృక్పధాలు:
కులసతికి సపత్నీ మాత్సర్యం ఉండకూడదని, భర్తవైపు బంధువులకు ఆమె సపర్యలు చేయాలనీ, గృహస్థ ధర్మము తప్పకుండా ఆచరించాలనీ పాతివ్రత్యం, ఓర్పు, నేర్పులతో ఆమె సంచరించాలనీ పురాణ కవులు ఆశించారు. దశకుమార చరిత్రలో గోమిని అన్న స్త్రీ సవతికి, భర్తకు సుఖాన్ని కలిగిస్తూ వారి బంధువులకు భక్తిగా సేవచేసి నీచకార్యాలకు దూరంగా ఉండి ఓర్పు, నేర్పు, పాతివ్రత్యాలతో తోటి స్త్రీలలో ప్రసిద్ధిచెందింది. “గృహ ధర్మము తప్పక నీచవృత్తులందవులక” అని కవి చెప్పడంలో గృహసంబంధమైన కార్యాలు తప్ప ధనార్జనకు పనికివచ్చే ఇతర వృత్తులు ఏవీ స్వీకరించరాదు అని ఉద్దేశం అయివుంటుంది. ఆ కాలంలో చాలామంది స్త్రీలు వివాహితలైనప్పటికీ దేవాలయాలలోనూ, రాజుల, ధనవంతుల ఇండ్లలోనూ, ఉత్సవములు, పండుగలు, శుభకార్యాల సందర్భాలలో రకరకములైన పనులు చేసి డబ్బు సంపాదించేవారు. బహుశా గోమిని అందరు స్త్రీలలాగా కాక తన ఇంటికీ, భర్తకు సంబంధించిన కార్యాలకే పూర్తిగా అంకితమై ఉంటుంది. అందుకే ఆమె అందరు స్త్రీలలోనూ ప్రసిద్ధి చెందింది అని కవి ప్రశంసించాడు. దీన్నిబట్టి కులసతి అని ప్రత్యేకంగా కవుల చేత పొగడబడే స్త్రీలు గృహేతరమైన ఏ పనులనూ చెయ్యక పూర్తిగా గృహసంబంధమైన పనులను మాత్రమే చేస్తూ ఉండేవారని, అయితే ఆనాటి సమాజంలో వీరిసంఖ్య అల్పమనీ మనం గ్రహించవచ్చును.
పాతివ్రత్యం:
పురాణాలు రచించిన కవులు కులసతి అయిన స్త్రీకి భర్తే దైవమనీ, పతివ్రత అయిన స్త్రీ సూర్యచంద్రుల గమనాలను కూడా శాసించగల శక్తి కలిగి ఉంటుందనీ పతివ్రతల కథల ద్వారా చెప్పారు.
వైదిక పౌరాణిక కవులు అనసూయ, నాలాయని అనే ఋషి పత్నులను పతివ్రతలుగా సంభావిస్తే, శైవ కవులు అనసూయ, నాలాయని అనే స్త్రీలనే శైవమతావలంబులు కాని భర్తలను వదిలివేసిన వారిగా ఉదహరించారు. భర్త శివభక్తుడు కాకపోతే భార్య అతనికి శివభక్తిని బోధించాలని, అతడు వినకపోతే, అతడిని విడిచి పెట్టాలనీ పండితారాధ్యుడు శివతత్త్వసారంలో తెలిపి, ఆ విధంగా భర్తల ఆజ్ఞను మీరి అనసూయ, నాలాయని శివభక్తులైనారని తెలిపాడు. శివభక్తి లేనివాడైతే ఆ పురుషుని అతిక్రమించడం సతికి మార్గమని, భర్తను వదిలివేయడం వల్ల ఆమెకు దుర్గతి కలుగదు అని తేడర దాసయ్య చెప్పాడు. మారన మార్కండేయ పురాణంలో కౌశికుడనే విప్రుని భార్య పాతివ్రత్య మహత్యం గురించి చెప్పిన సందర్భంలో ఆమె పేరు చెప్పలేదు. కానీ అదే వృత్తాంతం మహాభారతంలో ప్రసక్తమైనపుడు ఆమె పేరు నాలాయని అని చెప్పబడింది. ఆమె భర్త కుష్ఠురోగం వల్ల కాళ్ళూ, చేతుల వేళ్లు కుళ్ళి, చీము నెత్తురు కారుతూ ముఱికితో, దుర్వాసనతో ఉన్న శరీరం పైన ఈగలు ముసురుతూ, హేయరసము మూర్తీభవించినట్లు ఉంటే, ఆమె ఏమీ అసహ్యించుకోక, భర్తను దైవంగా తలచి, నూనెతో తల, కాళ్ళు, చేతులు తోమి, కడిగి, బట్టలు కట్టి, తిండిపెట్టి, కామభోగాలతో తృప్తిపరచేది, అతడు ఒక వేశ్యపై మనసుపడి ఆమె దగ్గరికి తీసికెళ్ళమని కోరితే అతడిని తన మూపుపై మోస్తూ వేశ్య దగ్గరికి బయలుదేరింది. కొఱత వేయబడిన మాండవ్యుడనే ముని వీపుకు కౌశికుని కాలు తగలడం వల్ల అతడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. కౌశికుని భార్య సూర్యుడు ఉదయించకూడదని శాసించింది. పతివ్రత మహత్యం వల్లనే చక్కబడుతుందని దేవతలు అత్రి భార్య పరమ పతివ్రత అయిన అనసూయను ప్రార్థించగా ఆమె కౌశికుని భార్యతో సూర్యోదయం అయ్యేవిధంగా చేయమని అర్థించి భర్త మృతుడైతే అతడిని తాను బ్రతికిస్తాననీ పలికి ఒప్పించింది. నాలాయనీ, అనసూయల పాతివ్రత్యం గురించి ప్రశంసించే ఈ పురాణకథ ఉద్దేశం ఆనాటి స్త్రీలకు భర్త పట్ల భార్య ఆచరించవలసిన ధర్మం గురించి చెప్పడమేనని ఆ కథ సందర్భంగా చెప్పిన బోధలను బట్టి తెలుస్తుంది. పురుషుడు వ్రతాలు, జపాలు, ఉపవాసాలు, తీర్థస్నానాలు, యజ్ఞ దాన తపః కర్మలాచరిస్తూ అతికష్టం మీద సంపాదించే పుణ్యంలో భర్త శుశ్రూష వల్ల సతి సగంపాలు తానే గ్రహిస్తుందని, స్త్రీలకు ఉపవాస, తీర్ధ దాన దేవ పూజా వ్రతాదుల తెరువు అవసరం లేదని, పతి సమారాధన వల్ల వారికి సుగతులు కలుగుతాయనీ కవి ఈ కథ ద్వారా నీతిబోధ చేశాడు.
ఈ విధంగా చెప్పడానికి కారణం కాకతి మైలమ, కుందమాంబ, కాటకూరు మైలమ, మల్యాలగుండ దండనాధుని భార్య కుప్పాంబిక, బేతిరెడ్డి భార్య ఎఱకసానమ్మ మొదలైన స్త్రీలు ఆ కాలంలో ఎన్నో ధర్మకార్యాలు స్వతంత్రించి చేసేవారు. శైవాలయాలు కట్టించి, తమ ధనాన్ని శైవ మతపరమైన ధర్మకార్యాలకు వినియోగించడం, శైవ ధర్మానికి చెందిన నోములు, పూజలు చేయడం శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల స్త్రీలకు ఈ స్వాతంత్ర్యాన్నిచ్చిన వీరశైవ మత ప్రాబల్యాన్ని తగ్గించడానికి పురాణాలలో స్త్రీలకు పాతివ్రత్యం పరమధర్మంగా బోధించి ఉంటారు. వీరశైవ మతం ప్రబలంగా ఉన్న రోజుల్లో ఈ ధర్మాలను స్త్రీలు అంతగా పాటించినట్లు లేదు. సాహిత్య శాసనాధారాలను బట్టి స్త్రీలు చేసిన ధర్మకార్యాలు, ఆచరించిన వ్రతాలు, నోములు, పూజలు మనకు తెలుస్తున్నవి. వీరశైవమత ప్రాబల్యం తగ్గి, వైష్ణవ, వైదిక మతాల ప్రభావం హెచ్చినకాలంలో అంటే కాకతీయుల చివరికాలంలో, ముఖ్యంగా శ్రీనాథుని కాలానికి కులస్త్రీలకు పాతివ్రత్యమే పరమధర్మంగా మారింది. కనుకనే కాకతీయుల కాలం తరువాతి శాసనాలలో దానాలు, ధర్మాలు చేసిన స్త్రీలు, మతం విషయంలో స్వాతంత్ర్యం చూపించిన స్త్రీలు మనకు కనిపించరు. రెండవ ప్రతాపరుద్రుని నాటికే అటువంటి స్త్రీల సంఖ్య బాగా తగ్గినట్టు మనం గమనించవచ్చును. భర్త మరణించినపుడు సహగమనం చేయక అతని శివలోక ప్రాప్తికై శివలింగ ప్రతిష్ఠ ఆలయనిర్మాణం, తటాక నిర్మాణం వంటివి చేసి వీర శైవమతం ధర్మమా అని కాకతీయుల కాలం నాటి స్త్రీలు స్వతంత్రంగా వ్యవహరించారు. కానీ శ్రీనాథుని నాటికి, పురాణ సాహిత్య ప్రభావం వల్ల సహగమనమే సతికి పరమార్థమనీ భర్త ఎంత దుష్టుడైనా, పాపాత్ముడైనా అతడిని నరకబాధ నుండి తప్పించాలన్నా అతడి వంశాన్ని, పితృదేవులను కూడా ఉద్ధరించాలన్నా, భర్తను అనుసరించి భార్య సహగమనం చేయాలని పురాణాలు నొక్కివక్కాణించాయి. స్కాందపురాణాన్ని అనుసరించి వ్రాయబడిన కాశీఖండంలో శ్రీనాథుడు ఈ విషయాన్నే బృహస్పతి ద్వారా లోపాముద్రకు నీతిబోధ చేయించాడు. “పిఱికి కండ యొకింత లేక ఱమి వేడ్క జిచ్చుఱక బోవు వికచ రాజీవనేత్ర కశ్వమేధంబు ఫలము తథ్యంబు గలుగు” అన్న మాటలను బట్టి పతివ్రత అయిన స్త్రీ ధైర్యసాహసాలు కలిగి మరణించిన భర్తతో అనుగమించడానికై నిప్పులోకి దూకాలి అని శ్రీనాథుని కాలంనాటికి శాసించబడింది. శ్రీనాథుడు వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. ఆ యుగంలోనే ప్రసిద్ధి పొందిన సాహిత్య యుగకర్త. కనుక శ్రీనాథుడే ఈవిధంగా చెప్పినపుడు ప్రజలు ముఖ్యంగా అగ్రవర్ణాలవారు, తప్పక ఆచరణలో పెట్టి తరువాతి తరాల స్త్రీలకు కూడా భర్త తరువాత బ్రతుకు లేకుండా చేసి ఉంటారు.
కులస్త్రీలు – పాతివ్రత్యం – ధర్మశాస్త్రాలలో చెప్పినది:
పురాణాలు రచించిన కవులు కులస్త్రీ భర్తను దేవతల కంటె అధికంగా చూడాలని అతనిని చూచి సంతోషంగా ఉండాలని, ఆశించేవారు. పతి శుశ్రూష చేయడమే సతులకు ధర్మమనీ, ఆ పతి శుశ్రూష వల్లనే కోరినవన్నీ తాను పొందినదని కౌశికుని పత్నికి అనసూయ పాత్ర ద్వారా మారన మార్కండేయ పురాణంలో చెప్పించాడు. మార్కండేయ పురాణంలో పతివ్రత తన భర్తను కుష్ఠు రోగి అయినా అసహ్యించుకోక సేవలు చేసిందని చెప్పారు. అయితే సుమతీ శతకకారుడు చెప్పిన మాటలు పై అభిప్రాయాలకు (పురాణలలో చెప్పిన) భిన్నంగా ఉన్నవని పిస్తుంది.
“తలమాసిన వొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునై నన్,
గులకాంత లైన రోతురు తిలకింపగ.
భూమిలోని దిరముగ సుమతీ”.
పతి పేదవాడైనా అతనిని వీడక, అతని ఆజ్ఞ శిరసావహించి వర్తించే పత్నికి ఉభయలోకాలలోను శుభం కలుగుతుంది అని కౌసల్య సీతకు చెప్పింది.
కేతన విజ్ఞానేశ్వరంలో పాతివ్రత్యం గురించి ఆ విధంగా చెప్పాడు.
పతియున్నను బతి చచ్చిన
నితరులదా బొందకున్న యీలువుటాలీ
క్షితి గీర్తియు బిమ్మట బా
ర్వతి తోడ సఖిత్వమును ధ్రువంబుగ బడయున్
కేతన పతివ్రత అన్న పదానికి బదులుగా ‘యీలువుటాలు’ అన్న అచ్చతెనుగు శబ్దం వాడాడు. పై పద్యాన్ని బట్టి పతివ్రత అయిన స్త్రీ భర్త చనిపోయిన తర్వాత సహగమనం చేయనక్కరలేదు. బ్రహ్మచర్యం పాటిస్తే ఆమెకు భూమిమీద కీర్తి, పరలోకంలో పార్వతి సన్నిధి లభిస్తాయి అని కేతన చెప్పినట్లు గ్రహించవచ్చును.
పాతివ్రత్యం పాటించని స్త్రీలను కేతన తీవ్రంగా గర్హించినట్లు కనిపించదు. అంతేకాదు శీలం తప్పిన స్త్రీలకు గాక వారితో వ్యభిచరించిన పురుషులకు పాపం కలుగుతుందని హెచ్చరించాడు. తన భర్తను వదిలి వేఱక మగనితో చరించే స్త్రీని స్వైరిణి అంటారని కేతన చెప్పాడు. ఆ విధంగా తిరిగిన స్త్రీని బయటికి వెళ్ళగొట్టకుండ ఒక మూల ఉండనిచ్చి, అవమానిస్తూ, మాసిన బొంతలు కట్టడానికి ఇచ్చి (జడకలు కట్టనిచ్చి) సంపదపైన అధికారం లేకుండా చేసి, కేవలం ఒక ముద్ద మాత్రమే తినడానికి పెట్టి నేలపై శయనించేలా చెయ్యాలి. అదే కులటలైన స్త్రీలకు కేతన చెప్పిన శిక్ష. శూద్రునితో వ్యభిచరించిన స్త్రీ ప్రాయశ్చిత్తంతో శుద్ధి పొందుతుందని ఆనాటి ధర్మశాస్త్రకారులు చెప్పారంటే, శీలం తప్పిన స్త్రీని ఈనాటివారికన్న మానవత్వంతో చూశారని అనవచ్చును. స్వైరిణి అయిన స్త్రీతో గానీ, పునర్భువు అంటే భర్త చనిపోతే తిరిగి పెండ్లి చేసుకున్న స్త్రీతో గానీ చరించిన పురుషుడికి పాపం కలుగుతుందని చెప్పిన కేతన స్త్రీకి ప్రాయశ్చిత్తమే చెప్పాడు కానీ పాపం కలుగుతుందని చెప్పలేదు. బహుశా ఆనాటి రాజకీయ పరిస్థితులవల్ల తరచు యుద్ధాలు జరగడంతో చిన్నప్పుడే వైధవ్యం పొందిన స్త్రీలపైన, భర్తలకు దూరమైన స్త్రీలపైన విజ్ఞానేశ్వరుని వంటి ధర్మశాస్త్రకారులకు కరుణ కలిగి ఉంటుంది. కానీ కుటుంబం, సంఘం పతనం కాకుండా ఉండాలంటే స్త్రీ శీలవతి అయి ఉండాలన్న అభిప్రాయంతో కొంత శిక్షను విధించారు. అయితే ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆమెను తిరిగి భర్త వెనుకటివిధంగానే చూసుకోవాలి. ఇల్లాలిగా ఆమెకు అధికారాలన్నీ ఉంటాయి.
భర్త కనుక పతితుడైతే భార్య అతన్ని విడిచిపెట్టి (దూరంగా ఉండి) అతడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే తిరిగి అతనితో కాపురం చెయ్యవచ్చునని కేతన విజ్ఞానేశ్వరంలో చెప్పాడు. దీన్నిబట్టి కాకతీయుల కాలంలో స్త్రీ పురుషులలో ఎవరు తప్పు చేసినా శిక్ష, ప్రాయశ్చిత్తం వారికి సమానంగానే విధించారని చెప్పవచ్చును.
కులస్త్రీకి పాతివ్రత్యం పరమధర్మంగా హైందవ ధర్మశాస్త్రాలు చెప్పినా కాకతీయల కాలంలో పాతివ్రత్యం అన్నది బలవంతంగా స్త్రీలపైన విధించినది కాదు. అంటే స్త్రీని నాలుగు గోడల మధ్య బంధించి అనుక్షణం కాపలాకాచి శీలాన్ని కాపాడే విధంగా ఉండేదికాదు. ఒకవేళ ఎవరైనా అలాచేస్తే ఆనాటివారు దాన్ని విమర్శించకపోలేదు.
మంచన తనకేయూరబాహు చరిత్రలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు చిన్న బాలికను వివాహం చేసుకుని నేలమాళిగలో ఉంచి పరులెవ్వరినీ ఆమె చూడకుండా ఉంచిన వృత్తాంతము, ఆమె అంతకంటె మోసకారియై భర్త చాటున ఎటువంటి నీచపు పని చేసిందో చెప్పి ఆమె వింత పాతివ్రత్యాన్ని విమర్శించి, చివరకు అతి నిష్ఠ, అనాచారము, అతినిర్భంధము వంటివి మేలుకంటే కీడునే చేస్తాయని హెచ్చరించాడు.
ఆనాటి స్త్రీలు కూడా అంత నిర్బంధంలో ఉండేవారు కాదు. వనవిహారాలు, ఉత్సవాలు, పండుగలు, తీర్థయాత్రలు మొదలయినవాటిలో పాల్గొనే స్వాతంత్ర్యం వారికి ఉండేది. అసూర్యంపశ్య అంటే సూర్యుని వెలుగు కూడా సోకని విధంగా ఆనాటి స్త్రీ ఉండలేదు. పరవనితపైన, పరుల ధనం పైన చూపు పెట్టిన వాడికి నరకబాధ తప్పదని మార్కండేయ పురాణకర్త శాసించాడు. పరవనిత అంటే వివాహిత అయిన కులస్త్రీ అని భావించాలి. చూపుపెట్టటం అంటే చెడుతలంపుతో చూడడమనే అర్థమే కాని అసలు చూడడం తప్పు అనే ఉద్దేశం ఉండి ఉండదు. ఉత్సవాలు, తీర్థయాత్రలు, తిరునాళ్ళు, సంతలు, జాతరలు వీటన్నిటిలో స్త్రీలు పురుషులు ఒకరికొకరు కనిపించకుండా దూరంగా ఉండడం సాధ్యంకాదు. కాకతీయులనాటి కావ్యాల్లో వసంతోత్సవాలు, పెండ్లివేడుకలు, వెన్నెల రాత్రుల వర్ణనల సందర్భంలో చేసిన శృంగార వర్ణనలను బట్టి కొన్ని వర్గాల కులస్త్రీలు తప్ప తక్కిన వర్గాల స్త్రీలు స్వేచ్ఛగా పురుషులతో కలిసిమెలసి తిరిగేవారని గ్రహించవచ్చును. పరదామాటున ఉండడం పాతివ్రత్యానికి నిదర్శనంగా ఆ కాలంలోని వారు భావించలేదు. రంగనాథ రామాయణంలో రావణవధ అయిన తరవాత విభీషణుడు సీతను తీసుకువచ్చిన సందర్భంలో అంతమంది ముందూ, ఆమెను తీసుకురావడానికి వెరచిన విభీషణుడు రాక్షస కపుల మూకలను అక్కడి నుండి తరిమివేయడానికి ప్రయత్నిస్తుండగా రాముడు పాతివ్రత్యమే మరుగు అంతేకాని కోటలు, తెరలు, స్త్రీలకు ఆవరణలు కావు అనీ, వ్యసనాలలో, వివాహాలలో, యుద్ధాలలో, నిష్టలలో, ఉత్సవాలలో స్త్రీలకు మరుగు పనికిరాదు అని చెప్పాడు.
కాలదేశాంతర క్రమమున జెడని, యీలునొక్కడ మఱు వింతియకాక
యెనసినకోటలు నిండ్లును దెరలు, వనితల కెందునావరణ ముల్గావు
వ్యసనంబులందు వివాహంబులందు, నెసగు కయ్యములందు నిష్ఠలయందు
తలకొని చెల్లు నుత్సవములయందు, వలవదా వరణముల్వారిజాక్షులకు
నేనిందునున్నాడ నిది రణభూమి, గాన నెగ్గేమియు గాదు రానిమ్ము
దీన్నిబట్టి కాకతీయులనాడు స్త్రీలు పాతివ్రత్యం ధర్మంగా భావించినా తెరచాటున ఉండడం తప్పనిసరి అని భావించలేదు.
రంగనాథ రామాయణ కాలంనాటికి తెరలు స్త్రీలకు మరుగుకాదని పాతివ్రత్యమే మరుగని కవి చెప్పినా రెండవ ప్రతాపరుద్రుని కాలంలో అంతఃపుర స్త్రీలు మరుగు పాటించారని తెలుస్తున్నది. ప్రతాపరుద్ర చరిత్రలో ప్రతాపరుద్రుని పట్టపురాణి విశాలాక్షీదేవి ప్రతాపరుద్రుడు తన గురువు శివదేవయ్యతో కలిసి అంతఃపుర ప్రవేశం చేస్తే ఆయన పరపురుషుడని మరుగునకు అంటే తెరచాటుకు పోయింది. ప్రతాపరుద్రుడు శివదేవయ్య ఈశ్వరుడే కాని మనుష్యమాత్రుడు కాడని ఆయనను పూజించి సద్గతి పొందమని చెప్పినప్పటికీ, విశాలాక్షీదేవి శివదేవయ్య యెదుట తాను నిలువలేక శివదేవయ్యగారి రూపంలో సువర్ణ ప్రతిమ చేయించి సువర్ణ వేదికపైనుంచి పూజలను చేసింది.
“రాజు పట్టపుదేవియగు విశాలాక్షి శివదేవయ్యగారింజూచి పరపురుషుండు గదాయని మరుగునకు బోయెను.
……………………………..
ఆ వాక్యంబు విని విశాలాక్షిదేవి తన చిత్తంబున బాదు కొల్పి శివదేవయ్యగారి యెదుట దానిల్వ నోడియు బతివాక్యంబులు మనంబున నిల్పి శివదేవయ్యగారి రూపంబుగా నొక్క సువర్ణ ప్రతిమను జేయించి, యొక్క సువర్ణ వేదిక పైనునిచి షోడశోపచారంబులం బూజింపుచుండె”
పై ఉదంతాన్ని బట్టి ప్రతాపరుద్రుని రాజ్యకాలంలో అంటే కాకతీయుల చివరికాలంలో పై వర్గాల స్త్రీలు తమ గురుజనులను కూడా పరపురుషులుగానే ఎంచి మరుగు పాటించేవారని గ్రహించవచ్చును.
పాతివ్రత్య నిరూపణము:
కాకతీయుల కాలంలో వెలువడిన సాహిత్యంలో స్త్రీలు తమ పాతివ్రత్యం నిరూపించుకొనేందుకు పరీక్షలకు గురి అయినట్లు కనిపించదు. ఆ కాలంలో వెలువడ్డ రంగనాథ, భాస్కర రామాయణాలు వాల్మీకి రామాయణాన్ని అనుసరించి సీతాదేవి అగ్నిపరీక్ష గురించి వ్రాశారే కానీ, దాన్ని తప్పించి మరి యే విధంగానూ స్త్రీలను పాతివ్రత్య నిరూపణకై పరీక్షలకు గురిచేసినట్లు సాహిత్యంలో ఆధారాలు కానరావు. కేతన కూడా స్త్రీలకు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేందుకు ఏ విధమైన పరీక్ష నిర్దేశించినట్లు కనబడదు. కానీ కాకతీయుల తరువాతి కాలాల్లో స్త్రీ తన శీలాన్ని నిరూపించుకొనడానికి మడ్డు పట్టడం వంటి పరీక్షలకు గురి అయ్యేది. ఈ విషయం కొరవి గోపరాజు తన సింహాసన ద్వాత్రింశికలో సూర్యోదయ వర్ణన సందర్భంగా సూచించాడు.
తన యుదయమే మది గోరెడు
నను విడిచెనినుండు కల్ల నాయెడలేకుం
టనెఱు గ డని పూర్వదిశాం
గన జగమున మడ్డు పట్టు గతి శశి మెఱసె
(సింహాసన ద్వాత్రింశిక॥ 4.106)
పింగళి సూరన తన ప్రభావతీ ప్రద్యుమ్నంలో (5వ ఆశ్వాసం) లో పై అభిప్రాయాన్నే ఈ విధంగా వెలిబుచ్చాడు.
ఏ గలలోన నొండెఱుగ నీవె విభుండవు సందియంబునా
పై గలదేని చూడుమని ప్రాగ్దిశ గౌతమదార జారుని
దా గడు నమ్మ జేయుటకు దక్కక యెత్తెడునట్టి యెఱ్ఱగా
గా గిన మడ్డుచందమెస గం గనుపట్టె నినుండు నుష్టత
15వ శతాబ్దమువాడైన కొఱవి గోపరాజు 16వ శతాబ్దము వాడైన పింగళిసూరన నాటికి స్త్రీలు తమ పాతివ్రత్యం నిరూపించుకొనేందుకు, తమ నిర్దోషిత్వాన్ని రుజువుచేసుకోవడానికి ఎర్రగా కాల్చిన ఇనుపగుండు (తప్తాయఃపిండమ్) ను పట్టుకునేవారు. దీన్నే మడ్డు పట్టటం అంటారు. ఈ మడ్డు పట్టటం అన్నది కాకతీయుల కాలంలో క్షత్రియులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేందుకు చేసేవారు. కేతన విజ్ఞానేశ్వరంలో ఈ మడ్డు పట్టటం అన్న దాన్ని సాక్షి, పత్రం లేనిచోట సత్యనిరూపణకు సాధనాలలో ఒకటిగా ఆ సందర్భంలో చెప్పి క్షత్రియులకు మడ్డు పట్టటం నిర్దేశించాడు. కాలక్రమేణా స్త్రీల పాతివ్రత్య నిరూపణకు మడ్డు పట్టటం జరిగి ఉంటుంది.
(సశేషం)