ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూ

3
3

[ఇటీవల ‘వ్యాసభారతంలో అసలు కర్ణుడు’ అనే పుస్తకం వెలువరించిన సందర్భంగా ప్రముఖ రచయిత, సినీ విశ్లేషకుడు శ్రీ వేదాంతం శ్రీపతిశర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూ.]

* నమస్కారం శ్రీపతిశర్మ గారూ.

** నమస్కారమండీ.

ప్రశ్న1: వ్యాసభారతంలో అసలు కర్ణుడు’ అన్న పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు కర్ణుడు అంటే నకిలీ కర్ణుడున్నట్టా?

జవాబు: నాటకీయత, పాత్ర చిత్రీకరణలో గల రసపట్టు వంటి అంశాలను పురస్కరించుకుని వ్యాసుడు కర్ణుని గురించి ఏమి చెప్పాలని అనుకుని వర్ణనలు చేసి యున్నాడో వాటిని పూర్తిగా ప్రక్కన పెట్టి, జనరంజనం కోసం, తద్వారా కీర్తి కోసం కవులు, పండితులు, వ్యాఖ్యాతలు ఒక భిన్నమైన కర్ణుని ముందరకి తెచ్చారు. కర్ణుని పట్ల అభిమానాన్ని ప్రజలలో సృజింపజేయటం భారత కథలు చెప్పే వారిలో ప్రధానాంశంగా మారింది. పర్యవసానంగా సత్యం, ధర్మం అను జయసంహిత లోని విషయాలు మరుగున పడటం వాస్తవం. అలా కాకుండా వ్యాసుడు అసలు ఏమి చెప్పాడు అన్నది పలువురికీ తెలియాలన్నది ఈ పుస్తకం వెనుక గల ఆలోచన.

ప్రశ్న2: ఈ పుస్తకం రాయటానికి ఎలాంటి తయారీలు చేసుకున్నారు?

జవాబు: మహాభారతం యావత్తూ (మూలం, అనువాదంతో) పదే పదే పలుమార్లు చదివియున్నాను. ఒక రెండున్నర, మూడు గంటలకు సరిపోవు చలన చిత్రం కోసం ఒక స్క్రిప్టు కూడా వ్రాసుకున్నాను. అనేక భాషలలో గల వ్యాఖ్యానాలు (తెలుగుతో సహా) అవగాహనకు అధ్యయనం చేసి మూలంలో లేనివి మార్క్ చేసుకున్నాను.

ప్రశ్న3: వ్యాఖ్యానానికి ఏఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకున్నారు?

జవాబు: వ్యాస భారతం ఒక్కటే.

ప్రశ్న4: పుస్తకం రచించటంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారు?

జవాబు: సంస్కృత మూలం నుండి చేసిన అనువాదం సరైనదా కాదా అన్నది శ్లోకాల అధ్యయనం, ఖండాన్వయం, ఇతర అనువాదాలు పోల్చి చూసి ఖరారు చేసుకుని ముందుకు వెళ్లాను.

ప్రశ్న5: ఇటీవలి కాలంలో అధ్యయనం, పరిశోధన, అవగాహనలతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ అన్నీ తెలిసినట్టు వ్యాఖ్యానించి వాదించేస్తూ, తమ వాదనే కరెక్టన్న మొండి పట్టుదల ప్రదర్శిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో, అందరూ అనుకుంటున్న దానికి భిన్నమయిన అభిప్రాయాలు ప్రకటించటం వల్ల ఇబ్బందులేమయినా ఎదుర్కున్నారా?

జవాబు: ఏమీ లేవు. నేను స్వంత వ్యాఖ్యానాలు ఏమీ చేయలేదు. అందుచేత ప్రశ్నించేందుకు, విమర్శకూ తావు లేదు.

ప్రశ్న6: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ భారతీయ ధర్మ సంబంధిత అంశాల గురించి అన్నీ తెలిసినట్టు వ్యాఖ్యానిస్తున్నారు. వారికి నిజానిజాలు చేప్పేవారు లేరు. ఇలాంటి పరిస్థితి ఎందుకు కలుగుతోంది? దీన్ని ఎలా ఎదుర్కోవాలి?

జవాబు: మన మూల గ్రంథాలు మిర్చీ బజ్జీలు పెట్టుకుని తినే కాగితాలు కావు. ఆ స్వల్పమైన ఆనందాన్ని అందించే మీడియా కోసం చేసే ప్రక్రియలు మంచివి కావు. ఈ కాలపు పిల్లలు అంతర్జాలంలో మూలాలను శోధిస్తున్నారు. టీపాయ్ మీద కాళ్ళు జాపుకుని పనికి మాలిన ప్రవచనాలను టీ.వీ.లో చూసే బదులు గోరఖ్‍పూర్ ప్రెస్ వారి మూల గ్రంథాలు ఎందుకు చదవలేరు? చదివినది పిల్లలు ఎందుకు చెప్పలేరు? సమస్య, సమాధానం – రెండూ ఇక్కడే ఉన్నాయి!

ప్రశ్న7: భారతీయ ధర్మం ప్రమాదంలో పడిందని అందరూ అంటున్నారు. మీకూ అలా అనిపిస్తోందా? అనిపిస్తే ఎందుకు? అనిపించకపోతే ఎందుకు?

జవాబు: ప్రమాదం లోకి జారిపోయి చాలా కాలం అయింది. దాని పర్యవసానాలు బహిరంగంగా మీడియా వలన అందరి ముందుకూ వస్తున్నాయి.

ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం ధార్మిక గ్రంథం, పారాయణ గ్రంథం కావడమే కాకుండా సాహిత్యపరంగా కవిత్వానికి కావ్యానికి ఒక ఆదిగ్రంథం కావడం వలన ధార్మిక గ్రంథం స్థాయి నుండి మామూలు పుస్తకాలు, దిక్కుమాలిన వ్యాఖ్యానాలు, పనికిమాలిన కల్పనల స్థాయికి వెళ్ళిపోవటం మన జాతి చేసుకున్న దౌర్భాగ్యం. ఆ ఖర్మ గురుగ్రంథ్‌కు, ఖురాన్‍కు పట్టలేదు, పట్టనీయలేదు.

మత గురువులు, పెద్దలు, పీఠాధిపతులు సరైన సవరణలు చేస్తూ, ‘తప్పు, ఇలా మాట్లాడకండి’ అని బహిరంగంగా హెచ్చరించగలిగే పరిస్థితులలో ఉన్నారా? అప్పుడప్పుడు కనిపించి పాదపూజలు చేయించుకుని పబ్బాలు గడుపుకుని తిరిగి మఠానికి వెళ్ళి పడుకుంటున్నారు! వాళ్ళు మాట్లాడినా వారినీ నిందించే వారే ఉన్నారు! అది మరో సంచలనంగా మీడియా వాడుకుంటుంది!

ప్రజలకీ, ముఖ్యంగా యువతకి విసుగొచ్చి మూలాన్ని చక్కగా తెలుసుకునే సదవకాశాన్ని విద్యావేత్తలు కల్పించాలి. పాపభీతి లేకుండా మాట్లాడేవారిని ధర్మనిరతి గలవారు ఎక్కువ సంఖ్యలో ఏర్పడినప్పుడే వెలి వేయగలరు. ఆ ఆలోచన పిల్లల తలిదండ్రులకు ఉన్నదా? రాబోయే రోజుల మీద ఏదైనా ఆందోళన  కలుగుతున్నదా? ప్రస్తుతం లేదు. ఇది ఇంకా పెద్ద ప్రమాదం!

ప్రశ్న8: ఈ పుస్తకంలో ఒక చోట కుంతి కన్యగా ఉన్నప్పుడే జన్మించటం వల్ల నీ బుద్ధి ఇలా అయిందని భీష్ముడు కర్ణుడితో అంటాడు. ఆధునిక సమాజంలో వివాహమే అవసరం లేదు అని సహజీవనం చేస్తున్నారు. కావాలని పెళ్ళి కాకుండానే పిల్లలని కంటున్నారు? భీష్ముడి మాటలు ఇప్పటికీ వర్తిస్తాయా?

జవాబు: ఒక విధంగా వర్తిస్తాయి. ఏ కాలానికైనా ధర్మం, అధర్మం రెండూ ఉంటాయి. తప్పు చేయకపోయినా ఒక్కోసారి మరో విధంగా ఒకరి జన్మ ఏర్పడుతుంది. తల్లి దండ్రులెవరో తెలియని వారు, అనివార్య కారణాల వలన అనాథలైన వారు ఉంటారు. వారి లోంచి ఉత్తములు కూడా సమాజానికి దొరికారు!

‘మూగనోము’ తెలుగు చలన చిత్రం (తమిళ మూలం)లో తల్లిదండ్రులు విడిపోగా కుర్రాడు అనాథ శరణాలయంలో చేరి ప్రతిభావంతుడుగా ముందుకు వస్తాడు. తద్వారా తిరిగి తల్లిదండ్రులను కలిపిన వాడవుతాడు. అనాథలు సమాజం మీద కక్ష సాధింపు చర్యలకు దిగాలన్నది సందేశం కాదు కదా? ‘ప్రహార్’ అనే హిందీ చిత్రంలో నానా పాటేకర్‌దీ చిత్రమైన పాత్ర. తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ దేశానికి సేవ చేసిన ఉత్తముడిగా చూపించారు.

కర్ణుడు తాను చేసిన అఘాయిత్యాలకు నొచ్చుకుని రాజ్యం ధర్మరాజే చేపట్టాలని శ్రీకృష్ణుడికి చెప్పాడు – సందేశం తేటతెల్లం!

ప్రశ్న9: పౌరాణిక పాత్రలను మూలంతో సంబంధం లేకుండా వక్రీకరించి వికృతంగా ప్రదర్శించటం ఆనవాయితీ అవుతోంది. ఇది మంచి అంటారా? చెడు అంటారా? మంచి అయితే ఎలా? చెడు అయితే ఎలా? దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి?

జవాబు: వక్రీకరించటం కవులకు, పండితులకు వెన్నతో పెట్టిన విద్య! ఆ కారణంగా నవ్వుల పాలైన, అవుతున్న సంస్కృతి మనది. సినిమా రంగం ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నది. ఒక మంచి పరిణామం ఏంటంటే ఈ సమాచార యుగంలో ఎవరినీ ఎక్కువ కాలం మోసం చేయలేరు. ఆ దిశగా రచనలు సాగాలి – మూలాల సరైన అర్థాలు, పరంపరగా నవతరాలకు చేరాలి. ఒక చెత్త పద్ధతిలో పురాణాల ఆధారంగా తీసిన సినిమా లేదా వ్యాఖ్యానం లేదా ‘ప్రవచనం’ వచ్చినప్పుడు వినేవారు, చూసేవారు ప్రస్తుతం పెద్దగా లేకపోయినా మరో చానెల్‍లో ఇది కాదు ఇది అని చెప్పే ప్రక్రియ సమాంతరంగా ప్రబలమవ్వాలి. నిశ్శబ్దంగా వదిలెయ్యటం మంచిది కాదు.

ప్రశ్న10: పురాణాలిప్పటి సమాజానికి ఉపయోగపడతాయా?

జవాబు: ఉపయోగపడతాయి. ఒక క్లిష్టమైన పరిస్థితిలో, ఒక నూతనమైన సమస్య ఎదురైనప్పుడు పూర్వం ఎటువంటి దారులు, దేనిని ఆధారంగా చేసుకుని వెతికారు అనేది తెలుసుకోవాలంటే పురాణమే కాదు, ఏ పురాతన అంశమైనా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.

ప్రశ్న11: భవిష్యత్తులో, ఇలా మూలాన్ని అనుసరించి ఇతర పురాణ పాత్రల అసలు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఆలోచనలున్నాయా? ఏయే పాత్రలను పరిచయం చేస్తారు?

జవాబు: చాలా ఆలోచనలున్నాయి. వాలి వధ మీద అర్థం లేని ప్రచారాలున్నాయి. ఉపనిషత్తులలో సందర్భాన్ని వదిలేసి అర్థాన్ని ప్రచురణలోకి తెచ్చిన ఉదంతాలు ఎన్నో కలవు. శ్రీకృష్ణుడు కేవలం విలాస పురుషుడా? కాదని ఎలా చెప్పాలి? ఈశ్వరానుగ్రహంతో ఎన్నో చేయాలనున్నది. చేస్తాను కూడా.

ప్రశ్న12: మన పురాణాలంటే మనలోనే ఎందుకంత చులకన? ఇది పోవాలంటే ఏం చేయాలి?

జవాబు: మొదటిది – మజ్జిగ పలుచనైనది.

శాస్త్రబద్ధంగా ఏది పురాణం, ఏది కాదు అని నిర్ణయం లేకపోవడం పెద్ద సమస్య.

ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని పురాణాలు ఎన్ని చెప్పినా సర్వోపరి కేవలం సత్యం, ధర్మం అని సూటిగా నిర్ణయించి చెప్పలేకపోవటం, చెప్పకపోవటం రెండో సమస్య.

మూడవది – ఒక అంశం ఒక రకమైన సామాజిక ఒరవడికి అన్వయం అయిందనుకుంటేనే ఆ గ్రంథంలో ఉత్తరోత్తర అది కాదని తేలుతుంది. ఇప్పుడున్న పాశ్చాత్య విద్యతో కలిపేసి ఏదో గొప్ప మాట చెప్పాననుకుంటూ వాగడం వలన దాని పర్యవసానం చెడుగా మారుతోందన్న అవగాహన పెద్దలలో, ఉపన్యాసకులలో లేకపోవటం!

జోకర్లకూ కీర్తికాంక్ష ఉంటుంది. కీర్తికాంక్ష ఎంత గొప్పవారినైనా జోకర్లగా మారుస్తుంది. ఎంత గొప్పదైనా వీరి చేతిలో చెడిపోయి ఊరుకుంటుంది!

ప్రశ్న13: చివరగా, పుస్తకం ధర ఎక్కువ అనిపిస్తుంది. తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?

జవాబు: పుస్తకం ధర నోషన్ ప్రెస్ వారు వారి వ్యవహారానికి తగ్గట్లు – నెట్‍వర్క్ మార్కెటింగ్, ప్రింట్ పద్ధతి ద్వారా నిర్ణయించినది. ఈ పుస్తకం అంతర్జాతీయ రంగంలో ప్రచురణకు వచ్చినది. ఎక్కువ అనిపించటానికి కారణం అది. ఎవరికైనా తక్కువలో కావాలనుకుంటే రచయితకి ఇచ్చే డిస్కౌంట్‍లో తెప్పించగలను!

ప్రశ్న14: మరో ప్రశ్న.. భారతం గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా వ్యాఖ్యానించాల్సిన అవసరం వుందా? వారు చెప్పని కొత్త విషయాలు మీరేం చెప్తారు?

జవాబు: నేను కొత్తగా వ్యాఖ్యానించ లేదు. వ్యాసుని భారతంలో శ్లోకాలను చెప్పి తాత్పర్యం వ్రాసాను. కొత్తగా ఏమీ చెప్పలేదు. అలా అని అసలు కర్ణుని గురించి పూర్తిగా తెలియని వారు లేరనటం కూడా పొరపాటే. భరత భూమి మీద అందరూ మూలాన్ని చదివి అర్థం చేసుకుంటే శ్రీపతికి పనేమి?

శ్రీపతిశర్మ రచనలు

* మీ విలువైన సమయాన్ని వెచ్చించి, సంచికకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృతజ్ఞలు శ్రీపతిగారూ. అలాగే, తక్కువ ధరకు తెప్పించి ఇస్తానన్న రచయిత ఆఫర్ ను పాఠకులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి. 

** ధన్యవాదాలు.

(‘వ్యాసభారతంలో అసలు కర్ణుడు’ పుస్తకం అమెజాన్‌లో లభ్యం. లింక్

https://www.amazon.in/Vyaasabhaaratamlo-Asalu-Karnudu-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/dp/B0C2DZZMNB/)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here