మహాభారత కథలు-11: గరుత్మంతుడు-దేవతలు యుద్ధము

0
4

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]మ[/dropcap]నస్సుకంటే మించిన వేగంతో గరుత్మంతుడు అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవ ప్రముఖుల దగ్గరకు వచ్చాడు. విశాలమైన రెక్కలు గలవాడు, పక్షిజాతికి రాజు, గొప్ప బలవంతుడు అయిన గరుత్మంతుణ్ని చూసి అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవతలు భయపడి బాణాలతోను, రకరకాలైన శస్త్రాస్త్రాలతోను యుద్ధం మొదలుపెట్టారు.

గరుడుడు తన రెక్కల్ని విదిలించి వర్షం కురిపించినట్టు దుమ్ము వర్షం కురిపించాడు. స్వర్గలోకం మొత్తం ధూళితో కప్పబడి దేవతలకి ఏదీ కనిపించకుండా చీకటిగా అయిపోయింది. అమృతానికి కావలిగా ఉన్న దేవతలు ఇంద్రుడికి మొర పెట్టుకున్నారు. ధూళి మొత్తం పోయేలా చెయ్యమని ఇంద్రుడు వాయుదేవుణ్ని పంపించాడు. వాయుదేవుడు గాలి గట్టిగా వీచేలా చేసి దుమ్మంతా పోగొట్టాడు.

అక్కడ కావలిగా ఉన్న భౌమనుడు గొడ్డలి, వజ్రం, ఈటె, విల్లు, బాణం, కంపం, చక్రం అనే అయుధాలు ధరించిన తన సైన్యాన్ని తీసుకుని గరుత్మంతుణ్ని ఎదుర్కున్నాడు. కాని, అగ్నిలా మండిపోతున్న గరుత్మంతుడి కోపాగ్నిలో పడి మాడిన మిడతలా కాలి బూడిదయ్యాడు. అతడి సైన్యాన్ని కూడా రెక్కలతోను, ముక్కు కొనతోను, కాళ్ల గోళ్లతోను రక్తం ధారలు కట్టేట్టు చేస్తున్నాడు గరుత్మంతుడు. దేవతలందరూ పరుగులు పెడుతూ ఇంద్రుడి దగ్గరికి వెళ్లారు.

సాధ్యులు అనే దేవతాగణం తూర్పు దిక్కుకి పారిపోయారు. వసువులు, రుద్రులు దక్షిణ దిక్కుని ఆశ్రయించారు. పన్నెండు మంది సూర్యులు దిగులుతో పడమటి దిక్కుకి జారిపోయారు. అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు రాక్షసుడైన నైర్రుతి అనే దిక్పాలకుడు దిక్కు తెలియకుండా పారిపోయారు.

రేణువు, క్రథనుడు, ప్రలిహుడు, ప్రరుజుడు, అశ్వకృంతుడు, పదనఖుడు, అనే కావలివాళ్లని తన వజ్రం వంటి గోళ్లతో గరుత్మంతుడు చీల్చి ముక్కలుగా చేసాడు. చివరికి యుద్ధం ముగిసింది. దేవతా ప్రముఖులందర్నీ ఓడించాడు గరుత్మంతుడు. అమృతం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్లాడు.

ఆకాశాన్నే మింగ కలిగినంత పెద్ద పెద్ద మంటలతో తన నాలుకలు చాపి అగ్ని అమృతాన్ని కాపలా కాస్తున్నాడు. అగ్నిని చూసిన గరుత్మంతుడు వేగంగా వెళ్లి అన్ని నదుల్లో ఉన్న నీటిని తన నోటిలో ఉంచుకుని తీసుకుని వచ్చి అగ్ని మీద పోసి చల్లార్చాడు.

పదునైన అంచులతో వేగంగా తిరుగుతున్న యంత్రానికి అడుగున అమృతం చాలా జాగ్రత్తగా ఉంచబడింది. గరుడుడు తన పెద్ద ఆకారాన్ని తగ్గించుకుని చిన్నగా మారి యంత్రం అంచుల కిందకి దూరి వెళ్లాడు. అతి ఎవరేనా అమృతం దగ్గరికి వస్తే విషాన్ని చిమ్ముతూ అమితమైన కోపంతో నిప్పుకణాల్లా ఎర్రగా ఉన్న కళ్లతో కాపలా కాస్తున్న రెండు భయంకరమైన పాములు కనిపించాయి.

గరుత్మంతుడు తన రెండు రెక్కల్ని వేగంగా విదిలించాడు. వాటి నుంచి వచ్చిన దుమ్ముకి పాములకి కళ్లు కనిపించలేదు. అదే సమయంలో వాటి తలల మీద కొట్టి అతి బలవంతుడైన గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

గరుత్మంతుడు-విష్ణుమూర్తి- ఇంద్రుడు

ఇంతమంది దేవప్రముఖుల్ని, అతి వీరుల్ని ఓడించి అమృతాన్ని తీసుకుని వెడుతున్న గరుత్మంతుడికి దాన్ని తాగాలని కొంచెం కూడా అనిపించలేదు. దాని వైపు కూడా చూడకుండా దాన్ని ఎవరి కోసం సంపాదించాడో వాళ్లకి ఇవ్వడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్లిపోతున్న గరుత్మంతుణ్ని చూశాడు విష్ణుమూర్తి.

అతడి అంకితభావానికి, శౌర్యానికి, వేగానికి, అనాసక్తికి, మంచితనానికి ఆనందించిన విష్ణుమూర్తి గరుత్మంతుణ్ని కావలసిన వరాలు కోరుకోమన్నాడు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి “దేవా! అమృతం తాగకుండానే ముసలితనం, మరణం రాకుండా ఉండేట్లు, అన్ని లోకాల్లోను పూజింపబడే నీయందు భక్తి కలిగి ఉండేటట్టు అనుగ్రహించు!” అని వేడుకున్నాడు.

విష్ణుమూర్తి అతడు అడిగిన వరాలు ఇచ్చి తనకు వాహనంగాను, జండాగాను ఉండేటట్లు కూడా అనుగ్రహించాడు. తరువాత విష్ణుమూర్తికి నమస్కరించి గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

ఇంద్రుడు అతడి మీదకి తన వజ్రాయుధాన్ని విసిరాడు. గరుత్మంతుడి రెక్కలు నరికెయ్యడానికి ఆకాశంలో నిప్పుకణాలు ఎగురుతున్నాయేమో అనిపించేంత వేగంగా వెళ్లింది వజ్రాయుధం. దాన్ని చూసి గరుత్మంతుడు నవ్వి “నువ్వు నన్ను కనీసం తాకలేవు కూడా! గొప్ప తపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముకతో చెయ్యబడిన నీ మీద గౌరవంతో, నీకు అవమానం జరగకూడదని ఒక్క ఈక మాత్రం తీసుకుని వెళ్లిపోడానికి అవకాశమిస్తున్నాను. ఇంతకంటే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు” అన్నాడు.

అతడి రెక్కల బలానికి అబ్బురపడి వజ్రాయుధం అతణ్ని ‘సువర్ణుడు’ అని స్తుతించింది. ఇంద్రుడు పక్షిరాజు గొప్పతనానికి ఆశ్చర్యపడి “సాటిలేని పరాక్రమం కలిగిన గరుత్మంతుడా! ఇంత బలపరాక్రమాలు కలిగిన వాడిని ఇంతవరకు నేను చూడలేదు. నాకు నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నువ్వు ముసలితనం, మరణము లేనివాడివని; ఇంతటివాడివి, అంతటివాడివి అని పొగడడానికి కూడా అందనివాడివి. నీకు అమృతం ఎందుకు?

అమృతాన్ని తీసుకుని వెళ్లి నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్లని దేవతలు కూడా జయించలేరు. నువ్వు ఈ అమృతాన్ని ఇతరులెవ్వరికీ ఇవ్వకూడదు. దాన్ని నాకు ఇచ్చేస్తే నీకు కావలసింది నేనే చేసి పెడతాను” అన్నాడు.

దేవేంద్రుడి మాటలు విని “దేవేంద్రా! అమృతం తీసుకుని వస్తానని కద్రువ పిల్లలు పాములకి మాట ఇచ్చాను. దీన్ని పాములకి ఇస్తే నా తల్లి వినతకి దాస్యం తొలగి పోతుంది. నేను ఈ అమృతం తీసుకుని వెళ్లి నా తల్లిని దాస్యం నుంచి విడిపించాలి. నేను దీన్ని తీసుకుని వెళ్లి పాములకి ఇస్తాను. అవి తాగక ముందే నువ్వు వచ్చి అమృతాన్ని తీసుకుని వెళ్లిపో!” అని ఇంద్రుడికి ఉపాయం చెప్పాడు గరుత్మంతుడు.

అతడు చెప్పిన ఉపాయానికి ఇంద్రుడు మెచ్చుకుని “నీ బలపరాక్రమాలు చెప్తావా? వింటాను” అని అడిగాడు. అది విని గరుడుడు “ఇంద్రా! ఇతరుల్ని నిందించడం, తనను తాను మెచ్చుకోవడం సజ్జనులు చేసే పని కాదు కదా! అయినా నువ్వు అడిగావు కనుక చెప్తాను. అవి విన్నాక నువ్వు ఆశ్చర్యపోతావు. నాకు నిజంగా ఉన్న లక్షణాల్నే నీకు చెప్తాను.

కదలగలిగిన, కదలలేని పదార్థాలతో నిండి ఉన్న ఈ భూమండలాన్ని నాకున్న బలంతో మొయ్యగలను. నా బలమైన రెక్కల నుంచి వచ్చే గాలితో అన్ని సముద్రాల్లో ఉన్న నీళ్లని, అందులో ఉన్న రత్నాలతో సహా బయటికి వెదజల్లగలను. ముల్లోకాల్ని ఒక్క క్షణంలో చుట్టి రాగలను!” అని చెప్పాడు.

ఇంద్రుడు అతడు చెప్పినది విని అతడి వేగానికి, బలానికి, శక్తికి మెచ్చుకుని “నువ్వు నాతో స్నేహంగా ఉంటావా? నువ్వు నాకు ఇష్టమైన పని చేశావు. నేను కూడా నీకు ఇష్టమైన పని చేస్తాను. నీకు ఏం కావాలో అడుగు” అన్నాడు.

ఇంద్రుడి మాటలు విని గరుత్మంతుడు “అమితమైన గర్వంతో నా తల్లికి అపకారం చేసిన కద్రువ కుమారులు పాముల్ని నాకు ఆహారంగా చెయ్యి! నేను తినలేక నిన్ను అడగట్లేదు. నువ్వు రక్షిస్తున్న లోకాల్లోనే పాములు తిరుగుతున్నాయి. నీ ఆజ్ఞ తీసుకోవడం ధర్మం కనుక అడుగుతున్నాను” అని చెప్పాడు. పాములు తనకు ఆహారంగా ఉండేలా ఇంద్రుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఇంద్రుడితో సహా పాముల దగ్గరికి వచ్చాడు. తను తెచ్చిన అమృతాన్ని మరకతమణుల్లా పచ్చగా మెరిసిపోతున్న దర్భల మీద పెట్టాడు.

పాముల్ని పిలిచి “దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి అమృతాన్ని తెచ్చాను. కనుక సూర్యుడు, అగ్ని, గాలి, చంద్రుడు మొదలైన వాళ్లందరి సాక్షిగా నా తల్లి వినత దాసితనం పోయింది. మీరందరు పవిత్రంగా స్నానం చేసి వచ్చి ఈ అమృతాన్ని తాగండి” అని చెప్పాడు. తరువాత పక్షిరాజు గరుత్మంతుడు తల్లి వినతని తన వీపు మీద కూర్చోబెట్టుకుని, ఎవరికీ కనిపించకుండా దాక్కుని ఉన్న దేవేంద్రుడి వైపు చూసి వెళ్లిపోయాడు.

పాములన్నీ అమృతం తాగాలని ఉత్సాహంతో స్నానం చెయ్యడానికి వెళ్లాయి. అవి అటు వెళ్లగానే ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని స్వర్గలోకం వెళ్లిపోయి దాన్ని ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టాడు.

దర్భల మీద ఉన్న అమృతం తాగాలని స్నానం చేసి వచ్చిన పాములు తమ నాలుకలతో దర్భల మీద నాకాయి. అందువల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోయాయి. అమృతాన్ని తమ మీద ఉంచడం వల్ల దర్భలు మాత్రం పవిత్రమయ్యాయి.

పాముల నాలుకలు చీలి ఉండడానికి కారణం, దర్భలు పవిత్రత పొందడానికి కారణం తెలిసిందిగా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here