(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[ఒక్కరోజు కోసం అని ఊరెళ్ళిన మహతి, వారం రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. కుసుమ ఉండమని బ్రతిమాలడం ఒక కారణమైతే, డాక్టరు గారు కూడా కుసుమ పక్కనే ఉంటే, తనకి తొందరగా నయమవుతుందని చెప్పడం మరో కారణం. కుసుమ బామ్మా, తల్లిదండ్రులూ కుసుమని ఓ ఏడాది పాటు మా వూళ్ళోనే, వాళ్ళింట్లోనే వుంచుకోవడానికి అంగీకరిస్తారు. వారం తర్వాత మహిత ఇంటికి చేరుతుంది. కుసుమ విషయం తండ్రికి చెప్తే, మహతి చేసిన పనిని ఆయన మెచ్చుకుంటాడు. కుసుమని ఇక్కడికి తీసుకొచ్చి తమ ఇంట్లో ఉంచుకుందామని తండ్రితో అంటుంది మహిత. కుసుమ పెళ్ళయిన పిల్ల అనీ, తాము నిర్ణయం తీసుకోకూడదని, ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు, భర్తా నిర్ణయం తీసుకోవాలని అంటాడు కుసుమ తండ్రి. కుసుమకి తాను మాట ఇచ్చానని చెప్తుంది మహిత. సాయంత్రం అమ్మతో ఈ విషయం చెబితే, ఆమె మహితని బాగా కోప్పడుతుంది. పెళ్ళయిన ఓ ఆడపిల్ల బాధ్యతను తాము ఎంత వరకూ మోయగలమని అడుగుతుంది. తల్లి మాటలు మహితకి నచ్చవు. తన సమస్యని లెక్చరర్ వరలక్ష్మి గారితో చెప్తే, ఆవిడా కూడా మహి అమ్మ చెప్పిన అభిప్రాయాన్నే సమర్థిస్తారు. పరిష్కారానికి ప్రయత్నిద్దాం అంటారు. ఈలోపు మహి పేర్లు మార్చి కుసుమ కథని తన ఫ్రెండ్ కథగా చెప్పి తన మిత్రులతో చర్చిస్తుంది. వీళ్ళ చర్చల్లో ఏ పరిష్కారం దొరకదు. అమ్మ ఒప్పుకోకపోవడంతో ఇంట్లో మహి మౌనంగా ఉండిపోతుంది. ఇల్లంతా ఓ రకమైన నిశ్శబ్దం పేరుకుపోతుంది. చివరికి ఓ రాత్రి అమ్మ వచ్చి మహి పక్కన కూర్చుని సుదీర్ఘంగా మాట్లాడి సమస్యలోని లోతుపాతులు వివరిస్తుంది. అప్పుడు అమ్మ ఆలోచనని అర్థం చేసుకుంటుంది మహిత. – ఇక చదవండి.]
[dropcap]కా[/dropcap]లేజీ వాతావరణం చాలా ఊపులో వుంది. ఫుల్‌గా విద్యార్థులు, లెక్చరలు కల్చరల్ ప్రోగ్రామ్స్ మీద కాన్‍సన్‍ట్రేట్ చేస్తున్నారు. కారణం ఇంటర్-కాలేజ్ కాంపిటీషన్స్. మా కాలేజీకి స్పోర్ట్స్‌లో పెద్ద పేరు లేదు; అంటే వాలీబాల్, ఫుట్‍బాల్ లాంటి వాటిల్లో.
కేరమ్స్, రింగ్ టెన్నిస్ లకి మంచి బేచ్ వుంది. పరుగు పోటీల సంగతి చూడాల్సిందే మరి. ఎందుకంటే నేనెప్పుడూ ఆటల సంగతి పెద్దగా పట్టించుకోలేదు.
పాటల పోటీలకి మాత్రం హరగోపాల్, నేనూ మరో నలుగురం సెలెక్టయ్యాం (నా మోహం, సెలక్షనేం జరగలేదు. మా ఇద్దరి పేర్లూ మొదట రాసి, ‘ఎనీబడీ ఎల్స్’ అనగానే మరో నలుగురు పేర్లిచ్చారు. అంతే!).
బూరుగు చెట్టు కింద ఆరుగురం సమావేశమయ్యాం. ఏ పాటలు పాడాలి? ఎలాంటివి సెలెక్టు చేసుకోవాలీ అని. గంటన్నర అయినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. కారణం కొత్తగా పేరిచ్చిన నలుగురు కాస్త మొండి ఘటాలవటమే కాగ, మొండితనానికి తోడు మూర్ఖత్వమూ తోడై, వాదాలు సాగించారు. వాళ్ళసలు ఏ పాట పాడదలచుకున్నారో కూడా చెప్పకపోతే మేమిద్దరం ఏం చేయగలం?
వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేసి, నేనూ హగ్గీ చెరో ఎనిమిది పాటలూ సెలెక్ట్ చేసుకున్నాం. రామదాసు గారివీ, అన్నమయ్యవీ చెరో రెండు కీర్తనలూ, రెండు రెండు సెమీ క్లాసిక్ సినిమా పాటలు, రెండు రెండు జానపద గీతాలూ, రెండు రెండు సోలో సినిమా సాంగ్స్.
“ఇవి గాక కొన్ని హిందీ సాంగ్స్ కూడా కలిసి ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే వెరైటీగా వుండటమే గాదు, మాంఛి డెప్త్ వస్తుంది” అన్నాడు హగ్గీ. సరేనన్నాను.
వక్తృత్వపు పోటీల్లో కూడా నేను పాల్గొన్నాను. తిమ్మూ సంగతి సరేసరి. హగ్గీ మాత్రం పేరివ్వలేదు. ‘అల’ పేరిచ్చింది. “బహుశా తిమ్మూతో ఎక్కువ పరిచయం పెంచుకోవడానికేమో” అన్నది రహీమా. “కావొచ్చు” నిర్లిప్తంగా అన్నాను. అల యీ మధ్య డిస్టన్స్ మెయిన్‍టెయిన్ చేస్తోంది. కారణం నాకు తెలీదు. తెలుసుకోవాలన్న కుతూహలమూ లేదు.
ఆ సాయంత్రం హగ్గీ మా ఇంటికి వచ్చాడు. అమ్మానాన్న, అన్నయ్య, చెల్లి, తమ్ముడు అందరం వున్నాం. అతను రావడం అదేమీ ఫస్ట్ టైం కాదు.
“అంకుల్, నేనో పాట సెలెక్ట్ చేసుకున్నాను. విని బాగుందో లేదో చెబుతారా?” అని నాన్నతో అన్నాడు. “ఆంటీ, మీరూ చెప్పాలి” అని అమ్మతోటీ అన్నాడు. “వై నాట్. హేపీగా పాడు” ఉత్సాహంగా అన్నారు మా నాన్న. ‘ఏ దునియా కే రఖ్‍వాలే’ అనే రఫీ పాడిన హిందీ పాట పాడాడు.
పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు మేము ఎక్కడున్నామో కాసేపు మాకే తెలీలేదు. అమ్మనాన్న కళ్ళల్లోంచి ధారగా కన్నీరు కారుతోంది. పాడింది హరగోపాల్ కాదు, సాక్షాత్తూ మహమ్మద్ రఫీనే అన్నట్లుంది పాట.
“హరగోపాల్, నిజంగా నువ్వు చాలా గొప్ప సింగర్‍వి అవుతావు.. ఓహ్.. వెయ్యిమందిలో ఒక్కరికి కూడా మహమ్మద్ రఫీలా ‘అనుభవిస్తూ’ పాట పాడటం తెలియదు. స్వరాల్ని వొప్పజెప్పే ప్రయత్నం చేస్తారే తప్ప, పాటలోని భావాన్ని పూర్తిగా జీర్ణించుకుని, సొంతం చేసుకోరు. పాట సహజంగా వచ్చేది దాన్ని స్వంతం చేసుకున్నప్పుడే” నాన్న చెబుతూనే వున్నాడు. ఆ రాత్రి అతనికి స్పెషల్సు చేసి తినిపించేదాకా అతన్ని మా పేరెంట్స్ వదల్లేదు. అతను వెళ్ళిపోయాకా, మా నాన్న “మహీ.. ఇతని గైడెన్స్ తీసుకో. అబ్బా.. ఎంత అనుభూతితో పాడాడూ!” అని నాతో అన్నాడు.
‘నవరంగ్ టాకీస్’లోకి ‘గైడ్’ సినిమా వచ్చింది. ఆర్.కె. నారాయణ్ నవల ‘The Guide’ ఈ సినిమాకి మూలం. ఎస్.డి. బర్మన్ సంగీతం, విజయ్ ఆనంద్ (గోల్డీ) డైరక్షన్, హీరోహీరోయిన్లు దేవ్ ఆనంద్ – వహీదా రెహమాన్‍లు.
మా నాన్న మా కుటుంబాన్నంతట్నీ సినిమాకి తీసికెళ్తూ, హరగోపాల్‍నీ, తిమ్మూని, రహీమాని కూడా ఆహ్వానించాడు.
సినిమా పూర్తయి బయటకొచ్చాకా ఓ గంట వరకూ ఎవ్వరం నోరు విప్పలేకపోయాం! ఓహ్ అది సినిమానా??
ఆ నవలని తెలుగులో ‘మార్గదర్శి’ పేరున ఆల్‌రెడీ అనువదించారు. కనీసం ఓ అయిదారుసార్లు నేను చదివి వుంటాను. కానీ సినిమా చూశాక మాత్రం పిచ్చెక్కినట్లయింది,
“అంకుల్, గైడ్ లోని ‘పియా తోసే నైనా లాడిరే’ పాట మహీ పాడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది!” అన్నాడు హగ్గీ, హోటల్లో మాతో పాటు భోం చేస్తూ.
“నేనూ అదే అనుకున్నా. ఫెర్‍ఫెక్ట్‌గా ఉంటుంది!” మెరిసే కళ్ళతో అన్నది రహీమా.
తిమ్మూ మాట్లాడలేదు. సాభిప్రాయంగా అతని వంక చూశారు నాన్నగారు.
“అంకుల్.. యీ కథా, యీ సినిమా.. నా గుండెల్లో ఎక్కడో ఏ తలుపునో తెరుస్తున్నాయి. నా ఆలోచనా విధానంలో చాలా మార్పు రావాలనిపిస్తోంది!” అన్నాడు తిమ్మూ. అతని చూపు ఎవరి మీదా లేదు. కళ్ళు ఏదో శూన్యం లోకి చూస్తున్నట్లు వున్నాయి.
***
ఎవరూ ఎవరికీ అర్థం కారు; చేసుకున్నామని అనుకుంటాం అంతే. ఉషారాణి అందరితోనూ క్లోజ్ గానే వుంటుంది. కానీ, తన గురించి మాత్రం ఎవరికీ తెలీనివ్వదు. అది మాకు అర్థం కావడానికే ఏడాది పట్టింది. అయితే, ఎవరికీ అపకారం చేసే మనిషి కాదు. హాయిగా అల్లుకుపోయే స్వభావం.
సడన్‍గా ఓ రోజు అందరికీ చాక్లెట్లు పంచింది. “ఎందుకూ?” అనడిగితే, “పెద్ద విశేషమేమీ కాదులే” అని మాట దాటేసింది.
వారం తరువాత తెలిసింది ఉషా వ్రాసిన కథకి ‘ఆంధ్రపత్రిక’లో మొదటి బహుమతి వచ్చినట్టు. ఆంధ్రపత్రికలో కథ పడటం అంటేనే గ్రేట్. అందులోనూ ఫస్ట్ ప్రయిజ్! అసలు తను కథలు రాస్తుందనేదే మాకు తెలీదు.
కాలేజీ మొత్తం యీ న్యూస్‌తో పొంగిపోయింది. “మన కాలేజీలో చదివే అమ్మాయికి ఫస్టు ప్రైజ్ రావడమంటే మాటలు కాదు” అని రవీంద్రనాథ్ గారూ, ప్రిన్సిపాల్ గారూ, మిగతా లెక్చరర్లూ ప్రశంసించడమే గాదు; ప్రేయర్ టైమ్‍లో ఆమెకి మా అందరి చేతా ‘జేజేలు’ కొట్టించారు.
ఉషారాణీ జూనియర్ కాలేజీలో రచయితగా పేరు కొట్టేస్తే, భారతి కాలేజీ రన్నింగ్ రేస్‍లో ఫస్టొచ్చింది.
“ఎప్పుడు ప్రాక్టీస్ చేశావే?” అనడిగితే, “నా మొహం, యీ మాత్రం పరుగు తియ్యడానికి ప్రాక్టీస్ కూడా కావాలా?” అన్నది. “మరి ఇంటర్-కాలేజీ పరుగుపందాలకి?” అడిగాను. “దాని కోసం ఖచ్చితంగా చెయ్యాలి. అయినా మహీ, ఏ పని చేసినా సందేహంతో చెయ్యకూడదే!” అన్నది. ఎంత చక్కని మాట!
***
ఓ పక్క చదువు – మరో పక్క పాటల పోటీలకి ప్రిపరేషను. కుసుమ విషయం అప్పుడప్పుడూ గుర్తుకొస్తున్నప్పుడు, మా తాతయ్య అమ్మమ్మలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం కుసుమ ఆరోగ్యం నిలకడగానే వుందనీ, బెంగపెట్టుకోవద్దనీ వాళ్ళన్నారు. అందరం ఓ ‘జోష్’లో వున్నాం. అది కాంపిటీషన్ జోష్. దాని ముందు ఏదీ నిలబడలేదు.
***
“మనం వీటిని పోటీలంటున్నాం. కానీ ఇవి పోటీలు కాదు. ప్రదర్శనలు మాత్రమే. ఎందుకంటే, ఎవరి టేలెంట్ వారిది. ఎవరు ఎక్కువో, ఎవరు తక్కువో లెక్కగట్టేది ఎవరూ? మేము న్యాయనిర్ణేతలుగా వచ్చాం. మీ పాటలు విన్న క్షణాన మాకు ఆ క్షణంలో తోచినదాన్ని బట్టి మార్కులేస్తాం. కానీ, అది ఆ క్షణపు రియాక్షనే. అందరూ ఒకేలా పాడరు. ఎవరి స్వరం వారిది. హాయిగా పాడండి. గెలుపు మీదో, మార్కుల మీదో దృష్టి పెట్టకుండా స్వేచ్ఛగా పాడండి” అన్నారు జాలాది గారు. జాలాది గారు గొప్ప సినీ రచయితే కాదు, మానవతావాది. గొప్ప ఉపన్యాసకులు. ఇంటర్-కాలేజీ పోటీలకి వారిని ముఖ్య అతిథిగా పిలిచారు. వారితో పాటు గొప్ప నటుడూ, రచయితా అయిన రంగనాథ్ గారూ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. జి. ఆనంద్ గారు పాటల పోటీలకి మెయిన్ జడ్జి. గత రెండు రోజులుగా పాటల పోటీల్లో పాల్గొనే వారికి చక్కని సూచనలిస్తూ తప్పులు సరిదిద్దుతూ వారు విజయవాడలోనే ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఓపిక ఎక్కువ. చిరునవ్వుతోనే సరిజేసేవారు.
“సంగీతం అనేది నేర్పితే వచ్చేది కాదు. అది భగవంతుడి వరం. సాధన చేసిన కొద్దీ అది మెరుగుపడుతుంది. లోకాన్నే ఆహ్లాదపరుస్తుంది. అందుకే, ఎవరు పాడినా, చక్కగా వారిని ఉత్సాహపరచండి. దయచేసి పిల్లికూతలూ, కేకలతో అల్లరి మాత్రం చెయ్యకండి. సంగీతకారుడ్ని బాధపెడితే, సంగీత సరస్వతిని బాధ పెట్టినట్టే. హాయిగా పాటలు వింటూ సంతోషిద్దాం” అనునయంగా అప్పటికే అల్లరి మొదలుపెట్టిన పిల్లకాయలకి చురక వేశారు రంగనాథ్ గారు.
ఇక ఆనంద్ గారు అయితే, “చక్కగా మీరు ఆనందిస్తూ, మమ్మల్ని ఆనందింపజెయ్యండి” అన్నారు, ఒక్క ముక్కతో ఉపన్యాసం ముగిస్తూ.
పి.డబ్యూ.డి. గ్రౌండ్స్ పోటీలకి వేదిక. ఎగ్జిబిషన్లు జరిగినా, బుక్ ఫెయిర్స్ జరిగినా, గొప్ప గొప్ప నాయకులు ఉపన్యాసాలు ఇచ్చినా వేదిక పి.డబ్యూ.డి. గ్రౌండే. ‘ఇన్‍డోర్’గా గొప్ప కళాక్షేత్రం ఉండాలనే ఆలోచన ప్రజలకీ, నాయకులకీ వున్నది గానీ, ఎందుకో అప్పటికి కార్యరూపం దాల్చలేదు. సినిమా వారంటే జనాల్లో చెప్పలేని క్రేజ్. ఇక ఓ గొప్ప రచయితా, రచయితా కవీ అయిన నటుడూ, గొప్ప గాయకుడూ ముగ్గురూ త్రివేణీ సంగమంలా నగరానికి వస్తే, ఊరు వూరే ఆనందంతో మునిగి తేలదూ?
క్వార్టర్ ఫైనల్స్‌కి వచ్చిన వారు ఎనిమిది మంది. వాళ్ళల్లో నేనూ, హరగోపాల్ మా కాలేజీ తరఫున ఉన్నాం. మిగత ఆరుగురూ ఇతర కాలేజీల వాళ్ళే.
నా అదృష్టం ఏమంటే నన్ను చివర పిలవడం! హగ్గీ నాలుగో వాడిగా పాడాడు. ‘జగదేక వీరుని కథ’ సినిమా లోని ‘శివశంకరీ, శివానందలహరి’ పాట పాడాడు. పాడాడు అనడం కంటే, జనాల్ని పిచ్చెక్కించాడు అనడం రైట్. ఒక తన్మయత్వంతో పాడాడు. తనని తాను మరిచిపోయి పాడాడు. అయిదు నిమిషాల పాటు జడివాన కురిసినట్టు చప్పట్లు మారుమ్రోగిపోయాయి. గ్యారంటీగా సెమీఫైనల్స్‌కి వస్తాడనీ, ఫైనలిస్ట్ అవుతాడనీ కూడా అందరికీ అర్థమయింది.
హగ్గీ తరువాత పాడాల్సిన కేశవ ప్రసాదూ గొప్ప సింగరే. శాస్త్రీయ సంగీతాన్ని తన అయిదో యేట నించీ నేర్చుకున్నవాడు. కానీ హగ్గీ కొచ్చిన రెస్పాన్స్ చూసి కొంచెం తడబడ్డాడు. పోటీల్లో పాల్గొనేవారికి యీ సైకలాజికల్ ‘హెల్’ తప్పదు. అతను పాడిందీ తక్కువ పాట కాదు, ‘సలలిత రాగ సుధా రస సారం’ (నర్తనశాల లోనిది). అయితే ఆ పాటలో వున్న చిక్కు ఏమంటే అది డ్యూయట్. దాన్ని ఒక్కరే పాడాలంటే భయంకరమైన సాధన చెయ్యాలి. పాపం కేశవ్ మనసులో వున్న సంకోచం వల్ల తడబడి కొన్ని చోట్ల ‘దూకు’ వేశాడని నాకు అర్థమైంది.
ఆ తరువాత భావనారాయణ కాలేజ్ నించీ వచ్చిన వత్సల ‘పిలచిన బిగువటరా’ (మల్లీశ్వరి) పాట చాలా గొప్పగా పాడింది. భానుమతి గారి పాట పాడాలంటే ‘ఈజ్’ ఉండాలి. అత్యంత సహజంగా పాడతారు ఆవిడ. అసలు కంఠస్వరంలోనే నవరసాలూ పలికించగలరు. వత్సల కూడా అల్‍మోస్ట్ అంత గొప్పగానూ పాడింది. మళ్ళీ చప్పట్ల జడివాన.
చిన్నప్పుడు మా రామ్ చరణ్ మాస్టారు చెప్పిన మాట గుర్తొచ్చింది, “నీ ఎదురుగా ఎవరున్నారో, ఎందరున్నారో నువ్వు పట్టించుకోకు. పాటల పోటీ కూడా పరుగు పందెం లాంటిదే. పరుగు పోటీల్లో పాల్గొనేవాడు ఎప్పుడూ గమ్యం మీదే ధ్యాస వుంచాలి తప్ప, పక్కవాడు ఎంత దూరంలో వున్నాడూ, ఎంతముందు వున్నాడు అని ఆలోచించకూడదు. ఒక్క క్షణం ఆలోచించినా కాన్‍సన్‌ట్రేషన్ దెబ్బ తింటుంది. వేగం మందగిస్తుంది. అలాగే, నీ ముందు పాడేవాళ్ళ గురించో, తరవాత పాడబోయే వాళ్ళ గురించో, జనాల గురించో, చప్పట్ల గురించో ఆలోచించకు. పోటీ పూర్తయ్యేదాకా నీలోనూ, నీ పాటలోనూ మాత్రమే నువ్వుండు” అని.
నేనూ అదే పని చేశాను. ఒక్కసారి నా పాటలోకి నేను దూరి మనసులోనే మననం చేసుకోవడం మొదలుపెట్టాను. నన్ను స్టేజి మీదకి పిలిచేవరకూ మిగతా ఇద్దరూ ఏం పాడారో కూడా వినిపించుకోనంతగా నా పాటని మననం చేసుకున్నాను. చివరికి నా వంతు వచ్చింది.
“శ్రీరాముని చరితమునూ తెలిపెద మమ్మా – ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా” అంటూ మొదలెట్టాను. ఆ తరువాత నాకు తెలీదు. ‘అయోనిజ పైనే అనుమానమా’ లైను పాడుతూ వుండగానే నా కళ్ళ వెంట నీళ్ళు ధారగా కారడం నాకు తెలుస్తోంది. పాట ఎలా పూర్తి చేశానో కూడా తెలీలేదు.
ఓ జడివాన కాదు, తుఫాను కాదు, ఉప్పెనలా చప్పట్లతో నిలబడ్డారు స్టూడెంట్సూ జడ్జీలూ, వాద్యకారులు.
రంగనాథ్ గారి కళ్ళల్లోంచి కన్నీటి వర్షం కురుస్తోంది.
“తల్లీ.. గుండె నిండిపోయిందమ్మా.. ఓహ్.. సీతమ్మ తల్లిని కళ్ళముందు సాక్షాత్కరింప జేశావు” అన్నారు నా తల నిమురుతూ.
“పోటీ సంగతి పక్కన పెట్టు.. అదిగో, అన్ని వేల మంది మనసుల్ని ఆల్‍రెడీ గెల్చేసుకున్నావు. గ్రేట్ అమ్మాయ్” భుజం తట్టి అన్నారు జాలాది గారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లే వున్నాయి.
“ఎన్నో పోటీలకి జడ్జిగా వెళ్ళాను. నిజమైన ఆనందం ఇవ్వాళ పొందుతున్నాను. గ్రేట్ మహితా.. కీప్ ఇట్ ఉప్” అన్నారు జి. ఆనంద్ గారు.
సైమీఫైనల్సూ, ఫైనల్సూ నల్లేరు మీద బండిలా సాగింది. కారణం మేం గొప్పవాళ్ళమని కాదు. ప్రజల చప్పట్లూ, జడ్జీల కామెంట్లూ మా సెల్ఫ్-కాన్ఫిడెన్స్‌ని పెంచితే, ప్రత్యర్థుల కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీశాయి.
యుద్ధంలో ఓడితే అది ఓటమి కిందకి రాదు. ఓడిపోతామేమో అనే భయంతో యుద్ధంలో పాల్గొనకపోవడమే సిసలైన ఓటమి. జరిగింది అదే.
గాల్స్ తరఫున నేను, బాయిస్ తరఫున హగ్గీ ఇద్దరం ఫస్టు ప్రైజ్‌లు కొట్టేశాం.
“మీరిద్దరూ మీ చదువు పూర్తి చేసుకున్నాక మద్రాసు వస్తే, తప్పకుండా మిమ్మల్ని సంగీత దర్శకులకి పరిచయం చేస్తాం” అని మా జడ్జీలు ముగ్గురూ చెప్పారు. హగ్గీ కళ్ళల్లో మెరుపుని చూశా ఆ క్షణంలో.
వక్తృత్వపు పోటీల్లో నాకు ద్వితీయ స్థానం వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ ఉషారాణిది. అంతే కాదు, పరుగు పోటీల్లో నిర్ద్వందంగా భారతి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. అప్పటికప్పుడే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఆంధ్రా సెలెక్టర్, భారతికి కోచ్‍ని ఏర్పాటు చేస్తాననీ, డైలీ ట్రైనింగ్ తీసుకుంటే ఆంధ్రా నించి అథ్లెట్‍గా పోటీ చెయ్యడానికి మంచి అవకాశం వుంటుందనీ ప్రామిస్ చేశారు ప్రైజ్‍ని బహూకరిస్తూ!
(ఇంకా ఉంది)