కాజాల్లాంటి బాజాలు-126: వదిన రైటరైపోయిందోచ్..

2
3

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]వ[/dropcap]దిన ఉదయాన్నే ఫోన్ చేసి “స్వర్ణా, నువ్వు అప్పుడప్పుడు ఏదో గిలుకుతుంటావు కదా! అందుకని నీ ఈ మెయిల్‌కి ఒకటి పంపాను.. వెంటనే చదివి, నీ అభిప్రాయం చెప్పు..” అంది..

“కథేమైనా రాసావా వదినా!” కాస్త భయపడుతూ అడిగేను.

“కథ కాదులే..” అంది.

హమ్మయ్య అనుకుంటూ “మరింకేం రాసేవు వదినా.. అన్నయ్యకి లవ్ లెటరా..”

సర్దాగా హాస్యమాడేను.

“అదైతే నీకెందుకు పంపుతానూ.. ముందు చదివి చెప్పమన్నానా! ఆ.. అన్నట్టు ఏదో వదిన్ని రాసేను కదాని బాగులేకపోయినా బాగుందనెయ్యకు..” అంటూ ఫోన్ పెట్టేసింది.

అసలు వదిన ఉదయాన్నే ఫోన్ చేసిందంటేనే నాకు గుండెల్లో ఒకలాంటి దడ వచ్చేస్తుంది. దానికి తోడు పొద్దున్నే పనులన్నీ మానుకుని అదేదో చదవమందంటే ఇంక కాదనగలనా!.. అందుకే మెయిల్ ఓపెన్ చేసి వదిన పంపినది చదవడం మొదలెట్టేను.. అది ఇలా ఉంది..

~

అది ఒక సుందర ఉద్యానవనము. సమయం చల్లని సాయంత్రం. చెట్ల మీది పక్షుల కిలకిలారావాలు వీనులవిందుగా వినిపిస్తుంటాయి. మలయమారుతంలా వీస్తున్న చల్లని గాలికి ఆ ఉద్యానవనంలోని పూలన్నీ ఆనందంగా తలలూపుతుంటాయి.

ఆ ఉద్యానవనంలో ఉన్న ఓ బెంచీ మీద ఒకరి పక్కన ఇంకొకరు అంటుకుపోయినట్లు ఒక ప్రియుడు, ప్రియురాలు కూర్చుని ఉంటారు.

ప్రియుడు చాలా బిగుతుగా ఉన్న తన టీ షర్ట్ పాకెట్ లోంచి కష్టపడుతూ ఒక కవరు తీస్తాడు.

ప్రియురాలి మొహం ఆశ్చర్యంతో తెల్లబోతుంది. ప్రియుడు నెమ్మదిగా ఆ కవరున్న చేతిని ప్రియురాలి వైపు కదిలిస్తుంటాడు. ఈ లోపల ప్రియురాలి మనసులో ఆలోచనల ప్రవాహం మొదలై ఆ అనుభూతులన్నీ ఆమె ముఖం మీద ప్రతిఫలిస్తుంటాయి..

ఏముండొచ్చు ఈ కవరులో..(ఆలోచన)

ఏదైనా బహుమతా.. (మొహంలో ప్రసన్నత)

డబ్బా.. బంగారమా.. వజ్రాలా.. (ఒక్కొక్కటీ అనుకుంటున్నకొద్దీ ఆతృతగా మారిపోతున్న ఆమె ముఖంలో భావాలు)

ఆమె ఆలోచనలని భగ్నం చేస్తూ ఏడుపు గొంతుతో ప్రియురాలి చేతిని అందుకుని ఆ కవరుని ఆమె చేతిలో పెడతాడు ప్రియుడు.. వణుకుతున్న చేతులతో దానిని అందుకుంటుంది ప్రియురాలు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ ఇలా ఉంటుంది.

ప్రియుడు – ప్రియా, ఇదిగో ఇది చదువు..

ప్రియురాలు దానిని తెరవబోతుంటే

ప్రియుడు – ఆహా.. ఇక్కడ కాదు.. ఇంటి కెళ్ళిచదువు..

ప్రియురాలు – ఏముంది ఇందులో

ప్రియుడు – నోటితో చెప్పలేకే కదా.. రాసి ఇచ్చిందీ..

ప్రియురాలు – అంత చెప్పకూడని విషయమైతే రాసి చెప్పడం కూడా ఎందుకూ

ప్రియుడు – చెప్పకూడని విషయం కాదు.. చెప్పలేని విషయం

ప్రియురాలు – అదేదో చెపితే పోయే.. దానికింత రాధ్ధాంతం.. రాతలూ ఎందుకూ..

ప్రియుడు – నా మనసులో విషయాన్ని నీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేను ప్రియా..

ప్రియురాలు – పోనీ కళ్ళు మూసుకుని చెప్పూ

ప్రియుడు – నా నోటితో దానిని చెప్పలేను ప్రియా..

ప్రియురాలు – నోటితో చెప్పలేనివాడివి చేతితో మటుకు ఎలా రాయగలిగావూ..

ప్రియుడు – నా మనసుని చిక్కబట్టుకుని, నా వేదనని అక్షరాల్లో బంధించడానికి నేను పడ్డ క్షోభ నీకేమని చెప్పను ప్రియా!

ప్రియురాలు – ఇది రాస్తూ నీ మనసు పడ్డ క్షోభని తల్చుకుంటుంటే నా మనసు ద్రవించిపోతోంది ప్రియా..

ప్రియుడు – నువ్వు ఇలా బాధ పడతావనే నా ఎదురుగా చదవొద్దంటున్నాను ప్రియా.. ఇంటికెళ్ళి, మీ అమ్మ పెట్టిన అన్నం కడుపునిండా తిని, నీ రూమ్ లోకి వెళ్ళి, ఏసీ వేసుకుని, పక్క సరిచేసుకుని, పక్కన రెండు టిస్యూ పేకెట్స్ పెట్టుకుని ఈ లెటర్ చదువు ప్రియా..

ప్రియురాలు – టిస్యూ పేకెట్స్ ఎందుకూ..

ప్రియుడు – ఆ లెటర్ చదువుతుంటే నువ్వు కార్చే కన్నీళ్ళకి కనీసం రెండు టిస్యూ పేకెట్స్ ఖర్చైపోతాయి.. అందుకూ..

ప్రియురాలు – (గద్గదమైన గొంతుకతో) -ప్రియా..

ప్రియుడు – (మరింత వణికిపోతున్న గొంతుకతో) ప్రియా..

ఒకరి చేతులు మరొకరి చేతుల్లోకి తీసుకుందుకు ముందుకు వస్తుంటారు..

****************************************************

“ఛీ..” విసుగ్గా లాప్‌టాప్ కీబోర్డ్‌ని గట్టిగా కొట్టాను.. వెంటనే తేరుకుని నా లాప్‌టాప్‌ని గభాలున ముందుకి లాగి ఏమైనా విరిగిపోయిందేమోనని పరీక్షించాను. హమ్మయ్యా.. నా అదృష్టం.. దానికేమీ కాలేదు. కానీ వదిన పంపిన తర్వాతి కథ చదివితే నేనేమైపోతానోనని భయమేసింది. కానీ తప్పదుగా..

వదిన చెప్పిందంటే అది సుగ్రీవాజ్ఞే.. అందుకే మనసుని చిక్కబట్టుకుని, మంచినీళ్ల జగ్గు పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఏముందా అని భయపడుతూ అక్షరాలవెంట కళ్లని పరుగులెత్తింఛాను.

ప్రియుడు (దీనంగా) – ప్రియా

నెమ్మదిగా కళ్ళెత్తి చూస్తుంది ప్రియురాలు

ప్రియుడు – చదివాక నువ్వేమనుకుంటున్నావో చెపుతావు కదూ!

ప్రియురాలు – ఇది చూస్తుంటే అసలు చదవగలనా అనిపిస్తోంది ప్రియా

ప్రియుడు (ఆవేశంగా) – నువ్వు చదవాలి ప్రియా.. తప్పదు చదవాలి. చదివితే కదా ఈ దౌర్భాగ్యుడి గురించి నీకు తెలిసేది.

ప్రియురాలు (ప్రియుడి నోటిని చేతితో మూసేస్తూ, ఏడుపు గొంతుతో) – ప్రియా

టక్కున కీబోర్డ్‌ను కొట్టబోయిన నా చేతిని గబుక్కున వెనక్కి తిప్పి నా నెత్తినేసి కొట్టుకున్నాను.

కడుపులో గిరగిరా తిప్పేస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వదినకి ఫోన్ చేసాను. వెంటనే పలికింది వదిన.

“అప్పుడే చదివేసావా.. ఎలా ఉంది.. ఎక్కడైనా మార్పులు చెయ్యాలంటే చెప్పు.. వదిన్ని కదా అని మొహమాటపడి బాగుందనెయ్యకు..” అంది.

నెమ్మదిగా వదినని అడిగాను..

“అసలిదేంటి వదినా! కథా.. స్కెచా.. నాటికా..” అని ఇంకా అడుగుతుండగానే వదిన చెప్పింది.

“అదేంటి స్వర్ణా.. నువ్వు హా హా చానల్‌లో వచ్చిన ప్రకటన చూడలేదా! వాళ్ళకి సీరియల్స్‌కి స్క్రిప్ట్ రాయడానికి రచయితలు కావాలిట.. ఆసక్తి ఉన్నవారిని ఏదైనా ఒక సన్నివేశాన్ని రాసి పంపించమన్నారు. దానికోసమే రాసాను.. ఇవాళే ఆఖరిరోజు. ఇందాకే పంపించాను.. నీ అభిప్రాయం కూడా అడుగుదామని నీకూ పంపాను. ఎలా ఉందీ! బాగుందా.”

వదిన గొంతులో ఆతృత.

హతవిధీ.. ఇప్పుడు వదినకి ఏమని చెప్పడం.. ఎలా చెప్పడం.. అనుకున్నాను.

అవతల్నించి వదిన “హలో హలో స్వర్ణా” అంటోంది..

వదిన మనసు నొప్పించకుండా ఎలా మాట్లాడడం..

“అదీ.. అదీ.. ఇంతకీ ఆ లెటర్‌లో ఏవుంది వదినా..!”

కాస్త కూడదీసుకుంటూ అడిగాను.

“అది ఇప్పుడే చెప్పకూడదు స్వర్ణా.. నెక్స్ట్ ఎపిసోడ్ చివరికి చెప్పాలి. అప్పటిదాకా ఇలాగే సాగదీయాలి.”

“అలాగని ఎవరు చెప్పారు వదినా!”

“ఒకళ్ళు చెప్పాలా.. మనం ఎన్ని సీరియళ్ళు చూడడంలేదూ! రెండు ఎపిసోడ్లదాకా ఇలా ఎంతవరకూ సాగదీయగలిగితే అంతవరకూ సాగదీసి చివర్న ట్విస్ట్ పెట్టాలి.. నీకామాత్రం తెలీదా!”

నా అమాయకత్వానికి జాలిపడింది వదిన. నేనూ ఒప్పేసుకున్నాను.

“నాకు ఈ సీరియళ్ళ గురించి ఏవీ తెలీదు వదినా.. ఇంకెవరినైనా అడుగు..”

అంటూండగానే వదిన గొంతు సంతోషంతో వినిపించింది.

“స్వర్ణా, ఆ చానల్ నుంచి ఇప్పుడే మెసేజ్ వచ్చింది.. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన స్క్రిప్ట్ లలో నాదీ ఉందిట..”

విన్న నేను అవాక్కయ్యాను. హూ.. ప్రోడక్టు పబ్లిక్ లోకి వెళ్ళాక ఎవరు మటుకు ఏం చెయ్యగలరూ!

“కంగ్రాట్యులేషన్స్ వదినా..” అంటూ నీరసంగా ఫోన్ పెట్టేశాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here