‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -12

1
4

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

భయపడవద్దు

[dropcap]సీ[/dropcap]నియర్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సుమారు 20 రోజుల ముందు ఒక సెక్షన్ విద్యార్థులకు నేను ఒక రోజు మధ్యాహ్నం మూడుగంటలకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాను. పరీక్ష కాలం యుద్ధ సమయం. చాలామంది విద్యార్థులు పరీక్షలు సమీపించగానే చదువు మొదలు పెడతారు. యుద్ధకాలే శస్త్రాభ్యాసః. పరీక్షలు సమీపిస్తున్నప్పుడు జరిగే క్లాసులు మునుపటికన్నా ఎక్కువ సీరియస్‌గా నడుస్తాయి. పాఠం ముగించాను. దానితోపాటు పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలనే విధానాన్ని మళ్ళీ ఒత్తి చెప్పడమయింది.

క్లాసు ముగిసిన తరువాత ఒక విద్యార్థి “నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్” అన్నాడు. నేను పరీక్షలకు చదువుకునే విధానం గురించి చెప్పినందుకు అతడికి సంతోషం కలిగి ఉండవచ్చని ఊహించి “నేను మొదటి నుండీ చెబుతూనే ఉన్నాను కదప్పా బాగా చదువుకోవాలని. కాలేజీ మొదలైనప్పటి నుండే మీరు చదవడం మొదలు పెట్టాలి. ఫరవాలేదు. ఇప్పుడైనా నీకు ధైర్యం వచ్చింది కదా” అన్నాను. “అది సరే సార్. మొదటి నుండీ మీరు చెబుతూనే ఉన్నారు. ఐనా నేను అంత బాగా చదవలేదు. పరీక్షాసమయం వస్తూ వుంది. నా గుండె డబడబా కొట్టుకుంటూ ఉంది. క్లాసులో మీ పాఠం అవుతున్నపుడు సమీపంలోని ఒక బిల్డింగు నుండి మైకు ద్వారా ఈ పాటను విన్నాను.

తల్లణిసదిరు కండ్య తాళు మనవె

ఎల్లరను సలహువను ఇదకె సంశయవిల్ల

బెట్టదా తుదియల్లి హుట్టిరువ వృక్షక్కె

కట్టెయను కట్టి నీరెరిదవరు యారు

హుట్టిసిద స్వామి తా హోణెగారనాద మేలె

గట్టియాగి సలహువను ఇదకె సంశయబేడ

(తల్లడిల్లక యుండు తాల్మితో మనసా

ఎల్లరను కాచేను సంశయమదేల?

గుట్టపైన తుదిని పుట్టిన చెట్టునకు

గట్టు కట్టి నీరు పెట్టు వాడెవరో?

పుట్టించి నతగాడె నిను గాచువాడౌచు

గట్టిగా కాపాడు సంశయంబేలా?)

(ఇది కనకదాసు గారి కీర్తన. నాకు మొదటి రెండు పాదాలు మాత్రం జ్ఞాపకం ఉంది. మిగిలిన భాగాన్ని వెదికి దాని పూర్తి పాఠాన్ని ఇచ్చాను)

“ఈ పాట నాకు ఎక్కువ ధైర్యమిచ్చింది. నా ఆందోళన తగ్గిపోయింది” అన్నాడు.

నేనైతే నిరాశతో కృంగిపోయాను. నేను చెప్పినదంతా గాలిలో కొట్టుకొని పోయింది. “సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ. నీవు మొదటి నుండి చదువకుండా దేవునిపై భారం వేయడం తప్పు” అన్నాను. “పుట్టించినవాడు గడ్డి తినిపిస్తాడేమి సార్” అన్నాడు. “లేదప్పా. మట్టి కరిపిస్తాడు” అన్నాను కోపంగా.

ధాత

నాకు ఒక పాఠశాల వార్షికోత్సవపు ఆహ్వాన పత్రికను ఆ పాఠశాల అధ్యాపకులు తెచ్చియిచ్చారు. నేనూ ఒక అతిథి. ఆహ్వాన పత్రికలో “ధాతలకు సన్మానం” అని ఒక కార్యక్రమం ఉంది. “ధాత కాదప్పా. దాత అనాలి. మహాప్రాణం ఉండరాదు” అన్నాను. “కాదు సార్. వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు సార్” అన్నారు. “కాదప్పా. అల్పప్రాణం, మహాప్రాణం అనేవి దానమిచ్చే పరిమాణాన్ని బట్టి నిర్ధారించరాదు. ఎంత ఇచ్చినా అల్పప్రాణమే. దాతయే” అన్నాను.

ఈ సందర్భంగా వెనుక మా కాలేజీ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన ఒక ఘటన జ్ఞాపకం వచ్చింది. రాయి సాంద్రత (Density) కనిపెట్టడం ఆ రోజు ప్రయోగం ఉద్దేశం. ఒక విద్యార్థి ప్రయోగాన్ని ముగించి దాని ఫలితాన్ని నాకు చూపించాడు. అది 1.5 లేదా 1.6. కానీ అది 2.5 లేదా 2.6 కావాలి. అతనికి వచ్చిన ఫలితం చాలా తక్కువగా ఉంది. “నీకు వచ్చిన ఫలితం నిజమైన దానికన్నా చాలా తక్కువప్పా” అన్నాను. దానికి అతడు “మీరు ఇచ్చిందే చిన్న రాయి సార్. ఇంకెంత వస్తుంది” అన్నాడు. నాకు నవ్వూ కోపమూ రెండూ వచ్చాయి. “సాంద్రత వస్తువు సైజును బట్టి ఉంటుందని నీకు ఏ మేష్టారు చెప్పారు? నీ లెక్కప్రకారం పెద్ద రాయి ఇస్తే దాని సాంద్రత గుండ్రాయిలా పెద్దగా ఉంటుందా? సాంద్రత వస్తువు పైన మాత్రమే ఆధారపడుతుంది. సాంద్రతకూ, పరిమాణానికీ సంబంధం లేదు. నీకు ఇచ్చిన దానికన్నా ఇంకా చిన్న రాయి ఐనా సాంద్రతలో మార్పేమీ ఉండదు. ఇంకోసారి చెయ్యి.” అన్నాను. రెండవ సారి చేసినప్పుడు అతని సమాధానం సరిపోయింది.

ఉండాన్ సామి

మా కాలేజీ కాలిబాట పక్కనే ఒకదానిపై ఒకటి రెండు లెక్చర్ హాల్స్ ఉన్నాయి. క్రింద గదిని రసాయనశాస్త్రానికి, పై గదిని భౌతికశాస్త్రానికి ఉపయోగించుకునేవాళ్ళం. ఆ కాలిబాటలో మునిసిపాలిటీకి చెందిన ఒక మంటపం, ఒక గది ఉన్నాయి. ఆ మంటపాన్ని జట్కా స్టాండుగా వాడేవారు. ఆ రెండు రూములలో పాఠం చెబుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు. “చింతపండమ్మో చింతపండు”, “పాత సామాన్లు కొంటాం” అనే శబ్దాల వల్లో, కొన్నిసార్లు గుర్రానికి క్షవరం చేస్తున్న యంత్రం నుండి ‘జుయ్’ అనే శబ్దం వల్లో విద్యార్థుల మనసు వేరే వైపుకు మళ్ళేది. అంతే కాకుండా అక్కడ జట్కా స్టాండులో ఒక రాయి వుంది. అది విక్రమార్కుని సింహాసనం లాంటిది. అక్కడ ఒక ఏరియాలో చీపురుతో రోడ్లు ఊడ్చే వారి (ప్రస్తుతం వారు మునిసిపాలిటీలో క్లాస్ 4 ఉద్యోగులు) సభ నడిచేది. ఒక మేస్త్రీ ఆ సింహాసనం మీద కూర్చునేవాడు. అతనికి ఇరువైపుల బుట్ట, చీపురులు పట్టుకుని వరుసగా చెత్త ఊడ్చేవారు నిలబడేవారు. అతడు ఆ సింహాసనం మీద కూర్చొనడమే ఆలస్యం అతని నోటి నుండి ‘దేవ భాష’ నిరర్గళంగా వెలువడేది. అతడు హాజరు తీసుకునే విధానం ఇలా సాగేది.

‘ఎంకటి’

‘ఉండాన్ సామి’ (ఉన్నాను స్వామీ)

‘అమాస్‌గా’

‘ఉండాన్ బుద్ధి’

‘లచ్మి’

‘ఉండాన్ దేవరా’

‘తిమ్మ’

‘_ _ _ _ ఓ’

‘ఎక్కడరా చూస్తా ఉండావు దొంగనా కొడకా..’ ఇలాంటి తిట్లను ఆ కాలంలో తట్టుకునేవారు. ఈ కాలంలో ఇలాంటి తిట్లు, బూతులు అపురూపం. ఒకరోజు నేను నా క్లాసులో హాజరు తీసుకుంటూ ఉన్నాను. ఒక విద్యార్థి పేరును పిలిచాను. అతడు ‘ఉండాన్ సామి’ అన్నాడు. క్లాసు మొత్తం ఘొల్లుమంది. నాకు కూడా నవ్వు వచ్చింది. ఆ నవ్వులు నిలిచిన తరువాత అతని వైపు చూసి “చూడప్పా నీవేమో ఉండాన్ సామి అని అన్నావు. దాని పూర్తి అర్థం నీవు తెలుసుకున్నట్లు లేదు. ఈ సమాధానం నుండి నన్ను ‘మేస్త్రీ’ని చేశావు. నేనేమో కొంచెం ఎక్కువతక్కువగా ‘మేస్త్రీ’ పని చేస్తున్నాను. అయితే నీవు చెత్త ఊడ్చేవాడివి అయ్యావు” అని వ్యాఖ్యానించాను. మళ్ళీ క్లాసంతా నవ్వులతో నిండిపోయింది.

కర్ణాటక రాష్ట్రోదయం

ముక్కలైన కన్నడ ప్రదేశాలు 1956 నవంబరు 1వ తేదీన ఒకటయ్యాయి. ముఖ్యంగా మైసూరు రాజ్యం, ఉత్తర కర్ణాటక, ఉత్తర దక్షిణ కన్నడ ప్రదేశాలు, కొడగు అన్నీ ఒకటై కర్ణాటక అయ్యింది.

కర్ణాటక రాష్ట్ర అవతరణను మేము ఆచరించినట్లు, నాకు తెలిసినంత వరకూ, ఇంకెవరూ అంత బాగా ఆచరించినట్లు కనబడలేదు. రెండు దివ్యాలంకృతాలైన ఎద్దుల బండ్లు; ఒకదానిపై పుష్పాలతో అలంకరించిన కర్ణాటక భూమి పటం, ఇంకొక దానిపై దేశనాయకుల చిత్రపటాలు. సరిగ్గా ఉదయం ఎనిమిదిన్నరకు ఊరేగింపు మా కాలేజీ నుండి కదిలింది. ఊరేగింపు ముందు భాగంలో క్రమశిక్షణతో కూడిన ఇద్దరు మోటర్ సైకిల్ విద్యార్థులు, వారి వెనుక ఇద్దరు అశ్వారోహకులు, తరువాత మా కాలేజీ బ్యానర్ పట్టుకున్న ఇద్దరు విద్యార్థులు, వారి వెనుక బ్యాండ్ సెట్, దాని వెనుక ఆ రెండు అలంకరించిన ఎద్దుల బళ్ళు. తరువాత యూనిఫాం ధరించి క్రమశిక్షణతో గంభీరంగా బ్యాండ్ ధ్వనికి అడుగులేస్తున్న మా విద్యార్థుల ఊరేగింపు కనుల పండువగా ఉంది. ఊరేగింపు నగర ముఖ్య వీధులలో వెళ్ళి సిటీ మార్కెట్, బళేపేటె మీదుగా గాంధీనగర్‌లో ఉన్న ఆర్యా విద్యాశాలను చేరినప్పుడు సుమారు పదిన్నర గంటలు అయ్యింది. దూరం సుమారుగా ఆరు కిలోమీటర్లు. అలసిపోయిన విద్యార్థులకు అక్కడ లఘు ఉపహారం (ఉప్మా, అరటి పళ్ళు) అయిన తరువాత అక్కడి నుండి ఊరేగింపు వెనుదిరిగింది. బెంగళూరులోని వేలాదిమంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఊరేగింపు చూసి సంతోషించారు. విద్యార్థులు కాలేజీకి చేరుకున్న తరువాత మిఠాయిలను పంచారు.

క్రమశిక్షణతో కూడిన ఇలాంటి ఊరేగింపులు సందర్భోచితంగా చాలా నడిచాయి.

పి.ఇ.ఎ.సమితి (P.E.A. Committee)

మా కాలేజీలో పబ్లిక్ పరీక్షకు ముందు ఒక సన్నాహక పరీక్ష (Preparatory Examination) పెట్టడం ఆనవాయితీ. పరీక్షకు వెళ్ళకుండా ఇద్దరు విద్యార్థులు బయట తిరుగుతున్నారు. “ఎందుకప్పా. పరీక్షకు పోలేదు” అన్నాను. దానికి వారు “Preparatory Examinations Absentees Committee – సన్నాహక పరీక్షలకు హాజరుకాని సభ్యులం” అన్నారు. “అయ్యో పాపులారా. ఇలాంటి కమిటీని ఎవరు చేశారు. మీ కమిటీలో ఎంతమంది సభ్యులున్నారు” అడిగాను. “ఆఫీసుకు రండి సార్. చెబుతాము” అన్నారు. ఆఫీసుకు వెళ్ళాను. “సార్. మీరు పొద్దున లేస్తూనే టెస్టులు పెట్టడంతో కొందరికి బేజారయ్యి వ్యవస్థాగతంగా ఈ పరీక్షలకు హాజరు కారాదని ఈ సమితిని స్థాపించాము” అన్నారు. “మీ సమితిలో ఎంతమంది ఉన్నారు” అడిగాను. “చెప్పుకోవడానికి సిగ్గు అవుతోంది సార్. మొత్తం ఐదు మందిమి ఉన్నాము. ఒకరు అధ్యక్షులు. ఒకరు కార్యదర్శి. మిగిలిన ముగ్గురూ సభ్యులు” అన్నారు. “పరీక్షలు నిజంగానే విద్యార్థులకు విసుగును పుట్టిస్తే మీ సమితిలో ఎక్కువమంది ఎందుకు సభ్యులు కాలేదు” అన్నాను. “ప్రయత్నించాము సార్. కుదరలేదు” అన్నారు. అయితే వారిలో ఒక విద్యార్థి కవి, వేదాంతి. అతనికి శంకరాచార్యుల ప్రసిద్ధమైన ‘భజగోవిందం’ కొన్ని భాగాలు తెలుసు. పెక్కు శ్లోకాలున్న ఈ భజగోవిందంలో ఒక శ్లోకం ఈ విధంగా ఉంది.

కా తే కాంతా కస్తే పుత్రః

సంసారో యమతీవ విచిత్రః

భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృణ్ కరణే

(నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. ఓ బుద్ధిహీనుడా భజించు గోవిందుడిని. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు)

ఆ భజగోవింద శ్లోకాన్ని జాణతనంతో ఆ విద్యార్థి ఈ విధంగా మార్చినాడు.

కా తే టెస్టూ కస్తే మార్క్సూ

కాలేజో యమతీవ విచిత్రః

భజమంకండం భజరాజకుమారం

లాల్‌బాగం భజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి న్యూటన్స్ లాసూ

ఈ విచిత్రమైన కాలేజీలో నీకు పరీక్ష ఏమిటి? మార్కులు ఏమిటి? (ప్రసిద్ధ క్రికెటర్ అయిన) మంకడ్‌ను భజించు. (ప్రసిద్ధ నటుడైన) రాజ్‌కుమార్‌ను భజించు. లాల్‌బాగ్‌ను భజించు. ఓ బుద్ధిహీనుడా! నీకు అవసానకాలం వచ్చినప్పుడు నిన్ను ఏ న్యూటన్ నియమాలు కాపాడవు.

పిల్లల తెలివి ఎలావుంటుందో చూడండి!

హాలీవుడ్ ఐయ్యంగార్

1954వ సంవత్సరంలో 68 మంది విద్యార్థులు, అధ్యాపకులు హొస్పేట, తుంగభద్ర, బొంబాయి, అజంతా, ఎల్లోరా, హైదరాబాదులకు విహారయాత్రకు వెళ్ళాము. చాలామందికి ఈ ప్రదేశాలు కొత్త. బొంబాయి పట్టణంలో ఎలెక్ట్రిక్ రైలు ఆ పట్టణము వివిధ స్టేషన్లలో కేవలం కొన్ని సెకెన్లు మాత్రమే నిలుస్తుంది. ఆ వ్యవధిలో మేమందరం రైలు నుండి దిగాలి. దిగిన వెంటనే నా పని ప్లాట్‌ఫామ్ మీదనే విద్యార్థుల హాజరు తీసుకోవడం. ఎవరైనా తప్పించుకుంటే మళ్ళీ వారు మా గుంపును కలుసుకోవడం కష్టమౌతుంది. అంతేకాకుండా మా యాత్రకూ అడ్డంకి ఏర్పడుతుంది.

ప్లాట్‌ఫామ్ పైన ఉన్న వారంతా నేను హాజరు తీసుకోవడాన్ని కుతూహలంతో చూసేవారు. నేను చాలా యాత్రలలో విద్యార్థులతో పాటు వెళ్ళాను. ఈ యాత్రలలో నాకు మాత్రం పూర్తిగా ఆనందించడం కుదిరేది కాదు. అక్కడంతా నాది గొర్రెల కాపలాయే. ఏ గొర్రె ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ తప్పించుకుని పోయింది? ఇదే పని. యాత్ర పొడుగున్నా ఇంకా ఇలాంటి తలనొప్పి పనులు. ఒకసారి మద్రాస్ యాత్రలో ఒక పిల్లవాడు ఎస్.జి.శేషాద్రివాస్ అనుకుంటాను (పాపం అతడు కొన్ని సంవత్సరాల క్రితమే మరణించాడు.) సముద్ర తీరానికి పోయినప్పుడు ఎంత చెప్పినా వినకుండా పదే పదే సముద్రంలోనికి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు కోపం వచ్చింది. అతడిని ఇవతలకు లాగి, అతడి తలపై ఉన్న టోపీని సముద్రంలో విసిరివేశాను. “అయ్యో నా హ్యాట్ పోయింది సార్” అంటూ గొణిగాడు. “హ్యాట్ పోతే పోయింది, నీవు సముద్రంలో పడవద్దు” అన్నాను. అంతలోనే సముద్రపు అల ఆ హ్యాట్‌ను ఇవతలకు విసిరివేసింది.

అజంతా, ఎల్లోరా చూసుకుని హైదరాబాద్‌కు వచ్చాము. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వసతి. అక్కడి హాస్టల్‌లోనే భోజనం. భోజనమైతే శాకాహారమే కానీ ఎక్కువ మసాలా వేసినందు వల్ల నాకు, కొందరు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అ భోజనం నచ్చలేదు. నేను విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఇదే విషయాన్ని వారితో ముచ్చటిస్తూ ఉన్నాను. అప్పుడు నాకు రంగరాజన్ అనే సాంప్రదాయ బద్ధుడైన విద్యార్థి జ్ఞాపకం వచ్చాడు. అతనికి తలపై జుట్టు. నుదుటిపై మూడు నామాలు. అయ్యో పాపం రంగరాజన్ ఈ భోజనం తిన్నాడో లేదో అనుకుంటూ భోజనం ముగించి బయటకు వచ్చాము. ఇంకొక చోట భోజనం చేస్తున్న రంగరాజన్ భోజనం చేసి లక్షణంగా ఆకు వక్కా నములుతూ మాకు కనిపించాడు. “ఏమప్పా భోంచేశావా? ఎలా వుంది?” అని అడిగాను. “ఫస్ట్‌క్లాస్‌గా ఉంది సార్. కడుపు నిండా తిన్నాను” అన్నాడు.

నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే అక్కడున్న ఇంకొక విద్యార్థి “వీడు హాలీవుడ్ ఐయ్యంగార్ సార్” అన్నాడు. అందరూ నవ్వారు. “అలా అంటే ఏమప్పా?” అని అడిగాను. “చెబుతాను. వినండి సార్. ఈ ఐయ్యంగార్ల కథ. మీరు ఫిజిక్స్ మేష్టారు కాబట్టి మీ భాషలోనే చెబుతాను. మన దేశంలో ఉన్న ఐయ్యంగార్లను స్పెక్ట్రం (Spectrum) మాదిరి విభజించాలి. (సూర్య కాంతిని స్పెక్ట్రమ్‌లో విభజించినపుడు ఏడు వర్ణాలు ఒకదాని ప్రక్క ఒకటి వస్తుంది). ఈ ఐయ్యంగార్ స్పెక్ట్రమ్‌లో ఒక తుది మేల్కోటేలో ఉంటుంది. ఇంకొక తుది హాలీవుడ్‌లో ఉంటుంది. మేల్కోటే ఐయ్యంగార్ ఎక్కువ సంప్రదాయస్తుడు, మడి ఆచారాలను పాటించేవాడు. నల్లా నీటిని బావిలోకి వదిలి చేది త్రాగేంత సంప్రదాయస్తుడు. హాలీవుడ్ ఐయంగార్ అంటే పూర్తిగా మాడ్రన్. (హాలీవుడ్ అమెరికా లాస్ ఏంజెల్స్ నగరపు ప్రఖ్యాత సినిమా కళాకారులున్న ప్రాంతం.) ఈ రంగరాజన్ పూర్తిగా మాడ్రన్. ఈ స్పెక్ట్రం రెండు కొసల మధ్య మిగిలిన ఐయ్యంగార్లు స్థానం పొంది ఉంటారు” అన్నాడు. “నల్లా నీళ్ళను బావిలోకి వదిలి మళ్ళీ చేదుకుని ఎందుకు త్రాగుతారు?” అని అడిగాను. “సార్ ఐయ్యంగార్లకు బావి నీళ్ళే శ్రేష్ఠం. నల్లా నీళ్ళు మైల, అపవిత్రం. అందువల్ల మైలపడిన నల్లా నీళ్ళు బావిలో పడిన తక్షణం అది పవిత్రమౌతుంది” అన్నాడు. రంగరాజన్‌తో సహా అందరూ పడీ పడీ నవ్వాము. అప్పటి నుండి అతడిని అందరూ హాలీవుడ్ ఐయ్యంగార్ అని పిలవసాగారు. “చూడండి సార్. ఈ రంగరాజన్‌కు ఉడిపి హోటల్ ఎంత ఇష్టమో ఉస్మానియా హోటలూ అంతే ఇష్టం సార్” అన్నారు అక్కడున్న విద్యార్థులు. హాలీవుడ్ చాలా దూరం ఉండడంవల్ల, ఉస్మానియా హోటల్‌ను వదిలి ఉడిపి హోటల్‌కు ఆ రాత్రి భోజనానికి వెళ్ళాము.

బెంగళూరుకు వచ్చిన తరువాత రంగరాజన్ ఖ్యాతి కాలేజీ అంతా ప్రాకి అందరూ అతడిని హాలీవుడ్ ఐయ్యంగార్ అనే పిలిచేవారు. రంగరాజన్ నిజంగానే మంచి విద్యార్థి. సభ్యత కలిగినవాడు. సాత్వికుడు. అతని తండ్రి తిరువేంకటాచార్యులు మా హైస్కూలులో సంస్కృత ఉపాధ్యాయులు. అతడిని హాలీవుడ్ ఐయ్యంగార్ అని పిలిచిందీ, ఇంకా ఐయ్యంగార్ల వర్గీకరణ అంతా కేవలం హాస్యం కోసమే. దీనిని ఎవరూ తప్పుగా భావించకండి.

గోమాత

నేను హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు మా వూరిలో ఒక చిన్న సంఘటన జరిగింది. వేసవి సెలవులు. తీవ్రమైన ఎండలు. ఒక రోజు కోలారు జిల్లా తపాలాశాఖ అధికారి మా ఊరి పోస్టు ఆఫీసుకు అధికారికంగా తనిఖీ చేయడానికి వచ్చారు. వారు ఇంగ్లీషు వారు. పోస్టాఫీసు వరండాలో వారికోసం వేసిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం మండుతున్న ఎండలలో పోస్టాఫీసు ముందు ఒక పశువును కట్టినారు. ఎండలకు తట్టుకోలేక అది బుస కొడుతూ ఉంది. గోమాత పవిత్రమైనది అని సదా ఘోషిస్తున్న అక్కడ చుట్టు పక్కల ఉన్న ఏ హిందువూ దానిమీద కనికరం చూపడంలేదు. అయితే బాధపడుతున్న ఆ పశువును నీడలో కట్టివేయమని ఆ అధికారి అక్కడున్న వారికి సూచన చేశాడు. గోమాంసం తినే ఇంగ్లీషు అధికారికి ఆ పశువును చూసి మనసు కరిగింది. అయితే పశువును పూజించే హిందువులకు ఆ వైపు గమనం పోలేదు. సామాన్యంగా పాలిచ్చే పశువులను బాగా చూసుకుంటాము. అది పాలు ఇవ్వడం నిలిపివేశాక ఆ పశువు కటికవాడి పాలు అవుతుంది. జీవితాంతం పాలు ఇచ్చి జనులను సాకిన పశువుకు వృద్ధాప్యంలో ఇదే గతి. పశువులు పూజనీయమని ప్రచారం చేసే ఎంతమంది స్వామీజీలు లేదా అలాంటి భావాలున్న మిగిలిన వారు గోశాలలను కట్టి ముసలి పశువులు ప్రశాంతంగా జీవించడానికి, సహజంగా చివరి శ్వాస తీసుకోవడానికి సహాయం చేస్తున్నారు?

ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. ఒక రోజు నేనున్న నేషనల్ కాలేజీ హాస్టల్‌కు ఒక స్వామీజీ, ఇంకా ఐదారుగురు శిష్యులు వచ్చారు. వారు వచ్చిన ఉద్దేశాన్ని వివరించారు. గోవులను పరిరక్షంచాలని, గోవధను వ్యతిరేకించాలని ప్రచారం చేయడం వారి పని. దానికి సంబంధించిన కరపత్రం నాకు ఇచ్చి “మీరు గాంధేయవాది, శాకాహారులు అని విన్నాను. అహింస పట్ల మీకు నమ్మకం వుంది. అందువల్ల గోవధను నిలిపివేయాలని మేము చేస్తున్న ఉద్యమానికి మీ సహకారం కావాలి” అని స్వామీజీ చెప్పారు. ఆ కరపత్రాన్ని చదివాను. “స్వామీజీ ఈ కరపత్రంలో గోమాతకు జై అని వ్రాశారు. ఎనుము మాతకు జై అని ఎందుకు వ్రాయలేదు? ఆవుకన్నా ఎనుము ఎక్కువ పాలు ఇస్తుంది. ఆవు పూజనీయమైతే ఎనుమూ అంతే పూజనీయమైనది కావాలి” అని అడిగాను. స్వామీజీ గారు తడబడ్డారు. ఏమో చెప్పడానికి ప్రయత్నించారు. అయితే దానికి సమంజసంగా చెప్పడానికి వారి వద్ద పదాలు లేవు. మారు మాట్లాడకుండా వారి శిష్యులతో వెళ్ళిపోయారు.

అస్పష్టమైన వ్రాత

మా పాఠశాలలో సమాధాన పత్రాల మౌల్యాంకనం గానీ, కన్నడ ఇంగ్లీషు కాంపోజిషన్ (Composition)లను కానీ అధ్యాపకులు జాగ్రత్తగా చూసేవారు. కాంపోజిషన్‌లను ఎక్కువ ధ్యాస పెట్టి దిద్దేవారు. శ్రీ కె.సంపద్‌గిరి రావుగారు ఇలానే తమ పనిని నిర్వహించేవారు. ఒక రోజు వారు ఒక తరగతి సమాధాన పత్రాలను దిద్ది వాపసు ఇచ్చారు. సామాన్యంగా ప్రతి సమాధాన పత్రంపై దానికి సంబంధించిన విధంగా ‘Very poor’, ‘Confused Answers’, ‘Good’, ‘Very Good’ వంటి రిమార్కులను వ్రాయడం స్వాభావికం. ఒక విద్యార్థి ఆన్సర్‌షీటు మీద సంపద్‌గిరిరావు గారు వ్రాసిన రిమార్కు ఆ విద్యార్థికి అర్థం కాలేదు. ఆ సమాధాన పత్రాన్ని సంపద్‌గిరిరావు గారికి చూపి “మీరేమి వ్రాశారో నాకు అర్థం కాలేదు సార్” అన్నాడు. సంపద్‌గిరిరావుగారు కొన్ని సెకెండ్లు గమనించి చూసి తరువాత “ఇది Write legibly – స్పష్టంగా వ్రాయి అని అర్థం” అని నవ్వుతూ చెప్పారు.

కొన్ని సార్లు మన అక్షరాలు మనకే చదవడం కష్టం అవుతుంది. నాకు ఇంగ్లీషు లేదా కన్నడ స్పష్టంగా వ్రాయడానికి శక్తి ఉన్నా తొందరతొందరగా వ్రాసిన వాక్యాలను నేనే సరిగ్గా చదవడానికి అయ్యేది కాదు.

నమ్మిచెడిన వారు లేరు

నేను పాఠం చెప్పినప్పుడు సందర్భోచితంగా మిగిలిన విషయాలను చెప్పడం సర్వసాధారణం. ఇదే చెప్పాలని ముందే నిర్ణయించుకుని వెళ్ళేవాడిని కాదు. ఇలాంటి విషయాలు పరీక్షల దృష్టితో ఉపయోగం లేకపోయినా విద్యార్థుల జీవితంలో అవసరం అని నా భావన.

సీనియర్ ఇంటర్మీడియట్‌కు ఎప్పటిలాగానే పాఠం చెప్పేవాడిని. అయితే ఆ రోజు పాఠ్యేతర అంశాలపై నా ప్రసంగం కొంచెం ఎక్కువే అయ్యింది. సీనియర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష. విద్యార్థుల జీవితంలో ముఖ్యమైనది. ఆ పరీక్షలు సమీపంలోనే అంటే మూడు నాలుగు నెలలలోనే ఉన్నాయి. నేను చెబుతున్న విషయాలు జీవితానికి అవసరమైనదైనా సహజంగా ఆ సందర్భంలో విద్యార్థుల దృష్టి అంతా పరీక్షల వైపే. ఐనా ఏ విద్యార్థికీ నా ప్రసంగాన్ని ఆపే ధైర్యం లేకపోయింది. చివరకు ఒక విద్యార్థి లేచి నిలబడి “సార్. మరో సెక్షన్ వాళ్ళు మనకన్నా పాఠంలో ముందున్నారు” అని చూచాయగా చెప్పాడు. అంటే నా ‘హరికథ’ను నిలిపి పాఠం చెప్పండి అని అర్థం. వెంటనే నేను “నీకు పురందరదాసు కీర్తనలు తెలుసేమప్పా?” అని అడిగాను. అతడు గందరగోళంలో పడిపోయాడు. క్లాసులోని విద్యార్థులకూ అర్థం కాలేదు. ఆ విద్యార్థి అడిగినదానికీ, పురందరదాసు కీర్తనలకు ఏమి సంబంధం? పురందర దాసు ఎన్నో కీర్తనలు చెప్పారు. అప్పుడు మళ్ళీ నేను “నంబి కెట్టవరిల్లవో రంగయ్యన – కీర్తన తెలుసేమప్పా?” అని అడిగాను. “తెలుసు సార్” అన్నాడు. “ఆ కీర్తనలో రంగయ్య బదులు నరసింహయ్య వేసుకో అంతా సరిపోతుంది” అన్నాను. క్లాసు మొత్తం ఘొల్లున నవ్వింది. “మీరెవరూ ఆలోచించాల్సిన పనిలేదు. మీకు నేను అన్యాయం చేయను. నన్ను నమ్మండి. పరీక్షల దృష్టిలో మీకు ఎంత కావాలో దానికన్నా ఎక్కువ చెబుతాను. చెబుతూ ఉన్నాను.” అని వారికి భరోసా ఇచ్చాను.

కోలాటం

నేను మైసూరు జైలులో ఉన్నప్పుడు పవమాన అనే విద్యార్థి నాతోపాటు ఉన్నారు. మా విడుదల అయ్యాక వారు చదువును ముగించారు. మా నేషనల్ హైస్కూలు ఉపాధ్యాయులుగా వచ్చారు. వారు జైలులో ఉన్నప్పుడు మంచి కోలాటపు గుంపు నాయకుడిగా ఉన్నారు. హైస్కూలుకు వారు ఉపాధ్యాయులుగా వచ్చాక మాలో ఒకటి రెండు గుంపులకు కోలాటం నేర్పించమని అడిగాను. అంతే. వారు హైస్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు సాయంత్రం కోలాటం నేర్పించారు. నేను ఇంకా ఒకరిద్దరు కాలేజీ అధ్యాపకులు ఆ బ్యాచులలో ఉన్నాము. కాలేజీ అధ్యాపకులు కోలాటం ఆడటం కొంచెం అపురూపమే. ముఖ్యమైన కార్యక్రమాలలో మా కోలాటం గుంపు ప్రదర్శన ఇచ్చి విద్యార్థుల, జనుల మెప్పును పొందాము. పవమాన ఒక సంవత్సరమే మా హైస్కూలులో ఉన్నారు. తరువాత వారు స్కూలు వదిలి వేరే పనిలో చేరారు. వారి స్థానాన్ని వారి సహోద్యోగి అయిన ఎస్.ఎన్.మూర్తి తీసుకుని కోలాటం నేర్పించారు. పాటలను ఉత్సాహంగా నేర్పించడమే కాక కోలాటాన్ని సజీవంగా నిలిపారు. వారు మా కాలేజీలో చదివినవారు. చాలా సార్లు మా కోలాటం టీము గణేశ నిమజ్జనం రోజు ఊరేగింపులో పాల్గొనేది. వీధుల వెంబడి కాలేజీ ఉపాధ్యాయులు చెడ్డి వేసుకుని కోలాటం ఆడుతూ పోవడం అనేకులకు వినోదంగా ఉండేది.

అమెరికాలో విద్యాభ్యాసం

ఉన్నత విద్య గురించిన ఆలోచన

1946వ సంవత్సరంలో నాకు ఎం.ఎస్.సి.డిగ్రీ వచ్చిన తరువాత స్వామీ త్యాగీశానంద గారు, ఇంకా కొందరు స్నేహితులు. శ్రేయోభిలాషులు ఉన్నత విద్యకోసం అమెరికా లేదా ఇంగ్లాండుకు వెళ్ళాలని నన్ను ప్రేరేపించారు. స్వామీజీ గారైతే పదే పదే ఒత్తిడి తెచ్చేవారు. అయితే నా జాతీయదృక్పథం స్వదేశానికి మాత్రమే ప్రోత్సహించేది. పరదేశానికి విద్యాభ్యాసానికై వెళ్ళాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. అయితే నేను విదేశానికి వెళ్ళాలని ఎక్కువ వత్తిడి రావడంతో గాంధీజీ గారికి ఒక ఉత్తరం వ్రాసి ఈ విషయంలో వారి అభిప్రాయం తెలుపవలసిందిగా ప్రార్థించాను. నేను స్వాంతంత్ర్యోద్యమంలో పాల్గొన్న విషయము తదితర వివరాలు ఆ ఉత్తరంలో ప్రస్తావించాను. “మన దేశపు యువకులు పరదేశంలో విద్యాభ్యాసానికి వెళ్ళవలసిన అవసరం లేదు” అని వారు ఖచ్చితంగా వ్రాశారు. నాకేమో సంతోషమయ్యింది. ఆ ఉత్తరాన్ని స్వామీజీగారికి చూపించాను. వారు నవ్వి ఊరుకుండిపోయారు. ఆ ఉత్తరం చూసిన తరువాత మిగిలిన స్నేహితులు ఆ విషయాన్ని పొడిగించే ధైర్యం చేయలేదు.

స్వామీ త్యాగీశానంద

ఏడెనిమిది సంవత్సరాలు గడిచాయి. నేనెందుకు ఉన్నత విద్యాభ్యాసానికై అమెరికాకో, ఇంగ్లాండుకో వెళ్ళకూడదు అనే ఆలోచన రావడం మొదలయ్యింది. కొన్ని కారణాలు ఈ ఆలోచనకు మూలం. కొంతమంది నా సహాధ్యాయులు కొంతమంది ఎం.ఎస్.సి. రెండవ క్లాసులో పాసయ్యారు. వారిలో ఇద్దరు ముగ్గురు వేరే కాలేజీలలో అధ్యాపకులైనారు. వారు ఇంగ్లాండుకు డాక్టరేట్ విద్యాభ్యాసానికి వెళ్ళడం నాకు తెలిసింది. డాక్టరేట్ వచ్చిన తరువాత వారు ఎం.ఎస్.సి.ని ఏ తరగతిలో పాసయ్యారనేది గణనలోనికి రాదు. నేను మొదటి నుండీ అన్ని డిగ్రీలను ఉత్తమశ్రేణిలో పాసయ్యాను. డాక్టరేట్ ముందు ఇవి యేవీ అంతగా లెక్కలోనికి రావు. సమాజంలో విదేశీ డాక్టరేట్‌కు ఎక్కువ విలువ ఉంది. ఇదొక కారణమైతే దానికన్నా ఎక్కువగా మరొక కారణముంది. నేను ఏ కారణంతోగానీ నేషనల్ కాలేజీని విడిచి వేరే ఉద్యోగానికి వెళ్ళే ప్రసక్తి లేదు. పైగా ఏనాటికైనా నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నేను కేవలం ఎం.ఎస్.సి. అర్హతను మాత్రం కలిగివుంటే నాతో పాటు కాలేజీకి ప్రజల దృష్టిలో విలువ తగ్గవచ్చని ఆలోచించాను. అప్పుడు కాలేజీలో ప్రిన్సిపాల్ కావడానికి డాక్టరేట్ ఉండాలని నియమేమీ లేదు. ఇప్పుడూ లేదు. అందువల్ల నేను పి.హెచ్.డి.తో ప్రిన్సిపాల్ కానవసరం లేదు. నా విద్యార్హతను పెంచుకునే దృష్టితో, ఇంకా కాలేజీకి దీనివల్ల ప్రజల దృష్టిలో ఎక్కువ గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో ఒకటి రెండు సంవత్సరాలు దీర్ఘంగా ఆలోచించిన తరువాత 1957వ సంవత్సరంలో అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యకోసం దరఖాస్తు చేయాలని నిశ్చయించాను. పి.హెచ్.డి. తీసుకున్న తరువాత నేను నా పరిశోధనను కొనసాగించడం కానీ, ఇంకే ఉద్యోగానికి వెళ్ళాలనే ఆలోచన కానీ నా కలలోకూడా రాలేదు.

అమెరికా విశ్వవిద్యాలయం

1957 ఆగస్టు, సెప్టెంబరు నెలలలో అమెరికాలోని 8-10 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నాను. నాకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం ఒకటి లభిస్తే సరిపోదు. దానితో పాటు ఆర్థిక సహకారమూ తప్పనిసరిగా కావాలి. అప్పుడు నా జీతం నెలకు సుమారు 150 రూపాయలు. దీనితో నా భోజనము, వసతి, మా తల్లికి పంపే ధనం, ఇంకా పేద విద్యార్థులకు సహాయం; ఇదంతా పోను మిగిలేది అత్యల్పం. అందువల్ల నేను స్కాలర్‌షిప్‌ను ఆశించాను.

నేను దరఖాస్తు చేసిన విశ్వవిద్యాలయాలపైకి ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయం(Ohio State University), ఫోర్ట్ కాలిన్స్ (Fort Collins) విశ్వవిద్యాలయం (ఇంకొక విశ్వవిద్యాలయం పేరు మరచిపోయాను) నుండి నాకు ప్రవేశమూ, ఆర్థిక సహకారము లభించింది. కార్నెల్, పిట్స్‌బర్గ్ ఇంకా ఒకటి రెండు విశ్వవిద్యాలయాలలో కేవలం ప్రవేశం మాత్రం లభించింది. స్కాలర్‌షిప్ లభించిన విశ్వవిద్యాలయాల్లో ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయం ఉత్తమమైనదని తెలిసినవారి అభిప్రాయం తీసుకున్న తరువాత అక్కడే చేరాలని నిశ్చయించుకున్నాను. నా ఈ నిర్ణయాన్ని 1957 జూన్- జూలై నెలలో మా పాలక మండలికి తెలియజేశాను. నేను చదువుకోవడానికి అమెరికాకు వెళ్ళే ప్రయత్నాలు నా సహోద్యోగుల ద్వారా పాలక మండలికి ముందే తెలుసు.

అమెరికాకు వెళ్ళిరావడానికి ప్రయాణ ఖర్చులకు నా వద్ద డబ్బులు లేవు. దానికోసం వేలాది రూపాయలు అప్పు చేయడానికి మనసొప్పలేదు. ఏ విధమైన ఆస్తి లేని కారణంగా ఋణం లభించడానికి ఏ ఆధారమూ లేదు. కేవలం నా మీది నమ్మకంతో ఎవరైనా అప్పు ఇచ్చినా దానిని తీర్చే శక్తి కూడా నాకు లేదు. ఈ విషయమై ఆలోచిస్తూ ఉన్నపుడు అమెరికాకు ఉన్నత విద్యాభ్యాసానికై వెళ్ళే విద్యార్థులకు ఫుల్‌బ్రైట్ ట్రావెల్ గ్రాంట్ నుండి సహాయం పొందే అవకాశం ఉందని తెలిసింది. సహాయానికి దరఖాస్తు పెట్టుకున్నాను. దాని ఆఫీసు మద్రాసులో ఉంది. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ బోర్డులో ఐదుమంది సభ్యులున్నారు. ఇద్దరు అమెరికన్లు. నానుండి తగిన వివరాలు తెలుసుకున్నారు. కొన్ని ప్రశ్నలు అడిగి తీర్మానాన్ని తెలియజేస్తామని చెప్పి పంపించారు. ఇది జరిగిన ఐదు రోజులకు ప్రయాణపు ఖర్చులకు పూర్తి సహాయం ఇస్తున్నామని ఉత్తరం వచ్చింది. నాకు చింతలేక పోయింది.

ఈ అంశాన్నే కాదు, నా ఈ ‘కథ’ను చాలావరకు జ్ఞాపకాల ఆధారంగానే వ్రాస్తున్నాను. వివరంగా డైరీ వ్రాసుకునే అలవాటు లేదు. కొన్ని ముఖ్యమైన అంశాలను అప్పుడప్పుడూ ఒక చిన్నపుస్తకంలో గుర్తుగా వ్రాసుకునే వాడిని. అది ఇంతవరకూ నా వద్ద ఉండడమే పరమాశ్చర్యం. కొన్ని వివరాలను దానినుండి గ్రహించాను.

హైస్కూలు, కాలేజీ ఆవరణలోనే ఉన్న నేషనల్ కాలేజీ హాస్టల్‌లో నేను నివసిస్తున్నందు వల్ల నా సమయంతా కాలేజీకి, విద్యార్థులకూ అంకితమైపోయింది. విద్యార్థులతో సాయంత్రం పూట బాస్కెట్‌బాల్, హాకీ, బ్యాడ్‌మింటన్ ఆడేవాడిని. అన్ని విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడిని. అధ్యాపకులకూ, విద్యార్థులకూ మధ్య ఉన్న అంతరం వీలైనంత తక్కువగా ఉండాలని నా ఖచ్చితమైన అభిప్రాయం. అందువల్ల క్లాసు బయట విద్యార్థులతో కలిసిపోయి వారితో చనువుగా ఉండేవాణ్ణి.

ఈ అన్ని కారణాలతో నేను అమెరికా పోవడానికి బెంగళూరు వదిలేముందు చాలా మంది విద్యార్థుల ఇళ్ళల్లో విందులు, కాలేజీ, హాస్టలు, పాలక వర్గం, ఇంకా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి వీడ్కోలు సభలు జరిగాయి. దీనితోపాటు నేను పుట్టిన ఊరైన గౌరీబిదనూరు తాలూకా హోసూరులో కూడా ఇలాంటి సభలు జరిగాయి. ఆ వూరి నుండి ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్ళినవారిలో బహుశా నేనే మొదటివాడిని. సహజంగానే గ్రామస్థులంతా గర్వించే విషయం. మధుగిరి తాలూకాలో ఒక పల్లెలో ఉన్న నా చెల్లెలిని చూసి వచ్చాను. నా తల్లితండ్రులు ముందే స్వర్గస్థులయ్యారు.

డాక్టరేట్‌కు కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుంది అని తెలుసుకున్నాను. అయినా నేను మొదటి విడతగా పాలక వర్గం నుండి రెండు సంవత్సరాల సెలవు తీసుకున్నాను. తరువాత సెలవును అవసరమైనంత పొడిగించుకుందాము అని అనుకున్నాను. చదువు కోసం లాంగ్ లీవ్ తీసుకోవాలంటే అధ్యాపకుడు చదువు ముగిసిన వెంటనే తిరిగి వచ్చి కొంత కాలం కాలేజీలోనే పని చేయాలని బాండ్ రాసి ఇవ్వాలి. ఆ విషయం నాకు తెలుసు. నేను మా పాలకవర్గపు కార్యదర్శి గారైన వి.గోపాలస్వామి ఐయ్యంగార్ గారిని బాండ్ వ్రాసి ఇవ్వడం గురించి అడిగినప్పుడు వారు చెప్పిన మాటలు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. “నీవేమీ బాండ్ వ్రాసి ఇవ్వాల్సిన అగత్యం లేదు. ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి పోతావు? నీమీద మాకు పూర్తి నమ్మకముంది” అన్నారు. పాలక వర్గం నాపై చూపిన ఔదార్యం చాలా అమూల్యమైనది.

అమెరికా ప్రయాణం

అమెరికాకు వెళ్ళడానికి ముందు సన్నాహాలు చేసుకునే పనిలో మునిగిపోయాను. ఉన్నత విద్యకోసం అమెరికాకు పోయే మరియు ప్రయాణానికై ఫుల్‌బ్రైట్ (Fulbright) సంస్థ సహాయం పొందిన విద్యార్థులు బొంబాయిలో నడిచే ఐదు రోజుల శిబిరంలో భాగం వహించాలి. నిపుణులైన అధికారుల నుండి అమెరికాలో విద్యావిధానం, జీవన విధానం, సంస్కృతి మొదలైన విషయాలపై ఉపన్యాసాలు ఉంటాయి. బెంగళూరు నుండి బొంబాయికి రైలులో పోవాలని నిశ్చయించుకున్నాను. ఉద్యోగం చేస్తున్న నా పూర్వపు విద్యార్థులు, స్నేహితులు నేను ఆదివారం బెంగళూరునుండి బయలుదేరితే నన్ను వీడ్కోలు చెప్పడానికి తమకు అనుకూలంగా ఉంటుందని, తాము సెలవు పెట్టుకోవాల్సిన పని ఉండదని చెప్పారు. అలాగే కానీ అని సుమారు 1 నెల ముందు 1957 ఆగష్టు 25వ తారీఖు ఆదివారం బెంగళూరు నుండి వెళ్ళే రైలులో అడ్వాన్స్ బుకింగ్ చేయించుకున్నాను. నేను శ్రీ రామకృష్ణా విద్యార్థి మందిరంలో ఉన్నప్పుడు నిలయ పాలకులూ, నా శ్రేయోభిలాషీ అయిన స్వామీ ఋతాత్మానంద గారిని, కొంత మంది స్నేహితులను కలిసి వెళ్ళివస్తానని చెప్పి వారి నుండి వీడ్కోలు పుచ్చుకున్నాను.

స్వామీ ఋతాత్మానంద

అప్పటికి స్వామీ త్యాగీశానందగారు లేరు. వారు మరణించి కొన్ని సంవత్సరాలైంది. నా ఉన్నతవిద్య విషయంలో ఎక్కువ ఆసక్తిని కనబరచిన వారు ఉండివుంటే ఎక్కువ సంతోష పడేవారు. ముందు రోజు అంటే శనివారం మా పాలకమండలి కార్యదర్శిగారు, నా పట్ల ఎక్కువ మక్కువకలిగిన శ్రీ వి.గోపాలస్వామి ఐయ్యంగార్ గారి నుండి వీడ్కోలు తీసుకోవడానికి వారి ఇంటికి వెళ్ళాను. వారు వయోవృద్ధులు. నా తండ్రి వయసు. నన్ను చూసి కూర్చోమన్నారు. “రేపు బొంబాయికి వెళుతున్నాను. మీకు చెప్పి వెళదామని వచ్చాను” అన్నాను. “నీవెందుకు వచ్చావు. నేనే రేపు స్టేషన్‌కు వచ్చేవాణ్ణి” అన్నారు. “అది నాకు తెలియదు. మీరు రేపు స్టేషన్‌కు వచ్చినా నేను మీ ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవడం నా కర్తవ్యం” అన్నాను. “సరే” అన్నారు. తరువాత అలాగే కొంచెం సేపు ఆలోచించి ఉన్నట్టుండి “నీకు ఇదంతా నమ్మకం లేదు” అన్నారు. వారు చెప్పింది నాకు అర్థం కాలేదు. “అలా అంటే ఏమిటి? నాకు దేనిమీద నమ్మకం లేదు సార్?” అన్నాను. “పోనీ వదిలేయ్” అన్నారు. “సార్ ఇదేదో ఒక పజిల్ లాగా ఉంది. ఏమి అని తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి చెప్పండి” అన్నాను. “ఏమీ లేదు. రేపు అమావాస్య. ఆ రోజే నీవు వెళుతున్నావు” అన్నారు. నేను వెంటనే నవ్వేశాను. అప్పుడు వారు “నాకు తెలుసు. దీనిపైన నీకు నమ్మకం లేదు” అన్నారు. “నిజమే సార్, నాకు ఇలాంటి వాటిపై అసలు నమ్మకం లేదు. నా విద్యాభ్యాసానికి అమావాస్య అడ్డు రావడం అసాధ్యం” అన్నారు. వారూ చిరునవ్వు నవ్వారు. ఆ తరువాత వారు నాకు ఫలతాంబూలం ఇచ్చి ఒక పుస్తకాన్ని కూడ ఇచ్చి ఇంటి నుండి వీడుకోలు చెప్పారు.

ఆదివారం ఉదయం సుమారు 8 గంటలకు హాస్టలు వదిలి విద్యార్థుల మరియు శ్రేయోభిలాషుల ఒత్తిడికి లొంగి కోట ఆంజనేయస్వామి దేవస్థానంలో వారు ఏర్పాటు చేసిన పూజలో పాల్గొనడానికి ఒప్పుకున్నాను. అక్కడి నుండి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాను. మా ప్రిన్సిపాల్ గారైన ప్రొ.కె.సంపద్‌గిరిరావుగారూ, పాలక మండలి కార్యదర్శిగారైన శ్రీ వి.గోపాలస్వామి ఐయ్యంగార్, పాలక మండలి పలువురు సభ్యులు, నా సహోద్యోగులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అతిహెచ్చు సంఖ్యలో గుమిగూడారు. ప్లాట్‌ఫామ్ నిండా వారే. మిగిలిన ప్రయాణీకులకు ఎవరు ఈ రైలులో ప్రయాణం చేస్తున్నారని కుతూహలం కలిగివుంటుంది. ఒక అధ్యాపకుడు అని తెలుసుకున్నప్పుడు వారికి తప్పకుండా ఆశ్చర్యం కలిగివుంటుంది! అందరినీ వదిలి, కాలేజీని వదిలి కనిపించని దూరంలో ఉన్న దేశానికి వెళ్ళాలికదా, అక్కడ మూడు సంవత్సరాలు ఉండాలి కదా అనే బాధ కలిగి నా జీవితంలోనే మొట్టమొదటిసారి బహిరంగంగా ఏడ్చేశాను. స్నేహితులు ఎంత సమాధానపెట్టినా నా దుఃఖం ఆగలేదు. నా జీవితంలో సర్వస్వం నేషనల్ కాలేజీయే. కాలేజీతో పాటు పదకొండు సంవత్సరాలు పెరిగిన నేను మూడు సంవత్సరాల పాటు కాలేజీకి దూరంగా ఉండాలనే బాధ పదేపదే పునరావృత్తమవుతోంది. కంపార్ట్‌మెంట్ ఎక్కి అందరికీ చేతులు జోడించి వెళ్ళివస్తానంటూ చెప్పాను. రైలు నిదానంగా కదిలింది. కంపార్ట్‌మెంట్ అంచులలోనే నిలుచుని వారంతా కనబడేవరకూ వారు చేతులు ఊపడం ద్వారా వ్యక్తం చేసిన శూభాకాంక్షలకు నేనూ చేతుల ద్వారా ప్రతిక్రియను వ్యక్తం చేశాను. కొన్ని సెకెన్లలో వారంతా కనబడకుండా పోయారు. ఆయాసంలో లోపలికి వచ్చిన నేను అలసిపోయి కూర్చున్నాను. హాస్టల్‌లోని కొందరు విద్యార్థులు, కొందరు మిత్రులు రైలులో నా జతలో యశ్వంతపురం వరకూ వచ్చారు. అక్కడ నాకు శుభాభినందనలు తెలిపి వెనుదిరిగారు. ఆ క్షణం నుండి నా ఒంటరితనం ప్రారంభమయ్యింది. నాకు అంతా శూన్యంగా అనిపించింది. 26వ తేదీ తెల్లవారుజాము 3.30 గంటలకు నా పూర్వ విద్యార్థులైన శ్రీ వామనరావు, శ్రీ విజయంద్రరావు, శ్రీ వెంకటేశరరావు గారలు బెలగాం రైల్వే స్టేషన్‌లో నన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు బొంబాయి చేరి అక్కడ నేరుగా శ్రీరామకృష్ణాశ్రమానికి వెళ్ళాను. బొంబాయిలో అమెరికా వారి ఫుల్‌బ్రైట్ సంస్థ నడిపిన ఐదురోజుల శిబిరం ముగిసే వరకూ నా భోజన వసతులు ఆశ్రమంలోనే ఏర్పాటయింది. శిబిరం నుండి ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. అది ఉపయోగకరంగా ఉంది.

బొంబాయి పట్టణంలో కొందరు మిత్రులూ, నా పూర్వ విద్యార్థులు ఉన్నారు. సెప్టెంబరు రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు విమానంలో ప్రయాణం చేయాలి. విమానాశ్రయానికి ఆశ్రమపు స్వామీజీ, పూర్వ విద్యార్థులైన సర్వశ్రీ ఎన్.ఎస్.సత్యమూర్తి, హెచ్.గుండూరావు, జి.రామన్, కె.చంద్రశేఖర్, కుమారస్వామి మరియు స్నేహితులైన సర్వశ్రీ ఎ.ఎల్.సత్యనారాయణ, ఎ.కె.రామచంద్ర ప్రభు, జి.ఎ.శర్మ మొదలైనవార్ వచ్చి వీడ్కోలు చెప్పారు. ఆ కాలంలో విమానంలో ప్రయాణం చేసేవారు ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంది. కాలేజే నా సర్వస్వం అయినందువల్ల నేను దాని పేరుమీద ఒక లక్ష రూపాయలు ఇన్‌న్సూర్ చేయాలని నిశ్చయించాను. అయితే కాలేజ్ పేరుతో ఇన్‌న్సూర్ చేయడానికి వీలుకాదని అధికారులు మొదట అభ్యంతరం చెప్పారు. వారి మనస్సు గెలిచి కాలేజీ పేరుమీదే ఇన్‌న్సూర్ చేశాను. అదైన తరువాత కాలేజీ ప్రిన్సిపాల్‌గారైన ప్రొ.కె.సంపద్‌గిరిరావు గారికి “దీనితో పాటు కాలేజీ పేరుమీద చేసిన ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ పత్రాలను పంపుతున్నాను. రేపు లేదా ఎల్లుండి వార్తా పత్రికలలో మా విమానం ప్రమాదం వార్త లేక పోతే దీని వెంట పంపుతున్న ఇన్సూరెన్స్ పత్రాలను చించివేయండి” అని ఉత్తరం వ్రాశాను. చివరకు ఆ పత్రాలకు అదే గతి పట్టింది.

లండన్ చేరాను

ఒకటిరెండు చోట్ల ఆగి విమానం లండన్‌కు సాయంత్రం 4.15కు చేరింది. లండన్లోని రస్సెల్ స్క్వేర్‌లో ఉన్న న్యూలాండ్స్ హోటల్లో మేము ఉండటానికి ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటలకు శ్రీ కె. సంపద్‌గిరిరావు గారికి నేను క్షేమంగా చేరానని కేబుల్ పంపాను. బ్రెడ్డు, పళ్ళు తిని పాలు త్రాగి పడుకున్నాను. అలసట వల్ల పడుకున్న మరుక్షణమే గాఢనిద్ర పట్టింది. మరుసటిరోజు ఉదయం 6.30గంటలకు మెలకువ వచ్చింది.

ఆ రోజు ఉదయం, మధ్యాహ్నం మాకంతా లండన్‌లోని దర్శనీయ ప్రదేశాలను చూపించడానికి ఏర్పాట్లు చేశారు. వాటితో పాటు సైన్స్ మ్యూజియాలను చూశాము. చూసిన ప్రదేశాల జాబితా ఇక్కడ ఇవ్వను కానీ ఒకటి మాత్రం ప్రస్తావించడం సబబు. లండన్‌లో ఒక హైడ్ పార్క్ (Hyde Park) ఉంది. దానికీ లాల్‌బాగ్‌కూ ఎటువంటి పోలికలు లేవు. లాల్‌బాగ్‌ అతి సుందరమైన ఉద్యానవనం. అయితే హైడ్ పార్క్ అటువంటి ఉద్యానవనం కాదు. అది విశాలమైన మైదానం. అక్కడక్కడా కొన్ని చెట్లు ఉన్నాయి. మధ్యలో ఒక పెద్ద చెరువు. బోటింగుకు అనుకూలంగా ఉంది. ఆ హైడ్ పార్క్ విశేషమేమిటంటే దాని మధ్యలో ఉన్న వేదికపై ఏ విషయం పైన అయినా జంకూ గొంకూ లేకుండా మాట్లాడవచ్చు. అక్కడి ఉపన్యాసాలు ఎంత అభ్యంతరకరమైనవి అయినా ప్రభుత్వం లేదా సంస్థలు, వ్యక్తులు వాటిపై చర్యలు తీసుకోవడానికి లేదు. హైడ్ పార్క్ ప్రసంగాలకు అన్ని నిబంధనల నుండి, చట్టాల నుండి విముక్తి లభిస్తుంది. నోటి దురద తీర్చుకోవడానికి అక్కడకు వచ్చి మాట్లాడతారు. దానిని వినడానికి సాధారణంగా ప్రజలు ఉండరు. నేను వెళ్ళినప్పుడు ఒకడు ఏమో మొత్తుకుంటూ ఉన్నాడు. దానిని ఒకరిద్దరు కొంచెంసేపు విని వెళ్ళిపోయారు. అతడు తగ్గలేదు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి ‘నిష్కామకర్మ’ చేసేవారు అపురూపం. ఎవరు తమ మాటలను విననీ వినకపోనీ తాను చెప్పదలచుకున్నది బహిరంగంగా చెప్పి తృప్తిపొందుతారు. దీనినే అరణ్య రోదన అంటారు. ఇలాంటి వైఖరిని ప్రదర్శించే అధ్యాపకులూ అపురూపమేమీ కాదు.

న్యూయార్క్ పట్టణం

లండన్‌లో మూడురోజులు ఉండి సెప్టెంబర్ 7వ తేదీ రైలులో లండన్ నుండి లివర్‌పూల్‌కు పోయి అక్కడి నుండి క్యూనార్డ్ లైన్‌కు చెందిన ‘సిథియా’ అనే ఒక స్టీమర్లో న్యూయార్క్‌కు బయలుదేరాము. ‘సిథియా’ సుమారు 700 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉన్న ఒక సాధారణమైన ఓడ. ప్రయాణీకులు, ఓడ సిబ్బంది చేరి మొత్తం 1200 మంది ఉన్నారు. ప్రయాణీకులలో రెండు తరగతులు. ఫస్ట్ క్లాస్, టూరిస్ట్ క్లాస్. మాది టూరిస్ట్ క్లాస్. సహజంగానే ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు ఎక్కువ, మేలైన సౌకర్యాలు ఉంటాయి. ఫస్ట్ క్లాసు ప్రయాణికులు, టూరిస్ట్ క్లాసు ప్రయాణికులతో కలయిక తక్కువ. ఫస్ట్ క్లాస్ వారిదే ఒక లోకం.

క్యూనార్డ్ లైన్‌కు చెందిన ‘సిథియా’ ఓడ.

ఓడ ప్రయాణం వల్ల ఎక్కువ అలసట అయ్యింది. కొందరు ప్రయాణీకులకు నౌకాప్రయాణం సరిపడదు. దీనిని Sea Sickness అంటే సముద్ర ప్రయాణం వల్ల సంభవించే ఖాయిలా అని అంటారు. మొత్తం 9 రోజుల నౌకాప్రయాణంలో ఎక్కువ రోజులు తల తిరగడం, వాంతి, నిస్సత్తువ వంటి వాటి నుండి నీరసించి పోయాను. వారు ఇస్తున్న ఆహారం నాకు పడలేదు. శాకాహారులకు కొంచెం కష్టంగానే ఉంది. బ్రెడ్డు, పాలు, పళ్ళు, కూరగాయలతో తొమ్మిది రోజులు గడిపాను. కొందరు భారతీయ విద్యార్థుల నడవడిక చాలా నీచంగా ఉంది. త్రాగుడు మొదలైనవి వ్యాపకాలయి పోయాయి. మన దేశంలో త్రాగని వారూ ఇక్కడ త్రాగడం మొదలు పెట్టారు. కొలరాడో స్టేట్ యూనివర్శిటీ, పోర్ట్ కాలిన్స్‌కు చెందిన భౌతిక శాస్త్ర ప్రొఫెసర్లూ అదే ఓడలో ప్రయాణం చేస్తున్నారు. వారి నుండి అమెరికా విశ్వవిద్యాలయాల విద్యాభ్యాసం గురించి, వారి జీవన విధానం గురించి అనేక ఉపయోగకరమైన సమాచారాన్ని పొందాను. మొత్తానికి ఆ ప్రయాణం సెప్టెంబరు 16వ తేదీన ముగిసింది. నౌక న్యూయార్క్‌కు రాత్రి 11.30కి చేరింది. ఎదురుగా విశ్వ విఖ్యాత స్వాతంత్ర్య జ్యోతిని పట్టుకున్న పెద్ద ప్రతిమ Statue of Liberty మమ్మల్ని స్వాగతించింది. వర్ణరంజితమైన, ప్రకాశవంతమైన రంగురంగుల నియాన్ లైట్లు, అడ్వర్టైజింగ్ బోర్డులు, పట్టపగలా అనే విధంగా వెలుగునిస్తున్న వేలాది దీపాలు, వివిధ రంగుల దీపాల విన్యాసాలు ఎంతవారినైనా ఆకర్షిస్తాయి. ప్రపంచంలో అతి ఎత్తైన (అప్పటికి) సుప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ భవనం అక్కడి నుండే కనిపిస్తూ ఉంది. అమెరికన్ అధికారులు మధ్యరాత్రిలోనే నౌకలోనికి ప్రవేశించి మా అందరికీ తప్పనిసరిగా కావలసిన ఆరోగ్య పత్రాలు (Health Certificates), మా విశ్వవిద్యాలయాలున్న ప్రదేశాలను రైలు టికెట్లు, ఇంకా కొన్ని విధిగా కావలసిన పత్రాలను అందజేశారు. వారు పాస్‌పోర్ట్‌కు సంబంధించిన కొంత సమాచారాన్ని తనిఖీ చేశారు. ఇదంతా ముగిసేటప్పటికి తెల్లవారు జాము రెండు గంటలయ్యింది. అప్పుడు పడుకుని ఉదయం ఏడు గంటలకు లేచి ఫలహారం ముగించి నా రెండు సూట్ కేసులు తీసుకుని నౌక దిగాను. సూట్‌కేసులు మొదలైన సామాన్లు మోయడానికి కూలీలు దొరకరు. అంతే కాదు అమెరికన్ల నిత్యజీవితంలో ఇంటిలో పనిచేసేవారిని పెట్టుకునే అభ్యాసం లేదు. కావాలన్నా పనిమనుషులు దొరకరు. పొరపాటున దొరికినా వారికి నెలకు ఇవ్వాల్సిన జీతాన్ని ఎంతటి శ్రీమంతుడికైనా భరించడం కష్టం.

న్యూయార్క్ నగరపు భవంతులు ఆకాశాన్ని అంటుకున్నట్లు కనిపిస్తాయి. అవన్నీ అంత ఎత్తు. ఒక్కొక్క భవంతీ 40-50 అంతస్తులు. వీధిలో నడుచుకుంటూ వెళుతుంటే ఒక లోయలో నడిచినట్లుంటుంది. ఏ భవనం చివరను సులభంగా చూడడం కుదరదు. అతి ఎత్తైన ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ భవంతి మొదలైన ముఖ్య ప్రదేశాలను చూశాము. ఆపైన యునైటెడ్ నేషన్స్ భవనాన్ని చూడటానికి వెళ్ళాము. అది ఒక 18 ఎకరాల స్థలంలో ఉన్న 40 అంతస్తుల సుందరమైన కట్టడం. అప్పుడు 81 దేశాలు ఆ అంతర్జాతీయ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు జనరల్ అసెంబ్లీ నడుస్తూ ఉంది. అప్పుడే 82వ సభ్యదేశంగా మలయా దేశాన్ని చేర్చుకునే విషయాన్ని చర్చించి ఆ దేశాన్నీ చేర్చుకున్నారు. మేము వెళ్ళినప్పుడు సభ్యులైన 81 దేశాల జాతీయధ్వజాలు ఆ ఆవరణలో స్వతంత్ర్యంగా రెపరెపలాడుతూ ఉన్నాయి.

అదే రోజు రాత్రి 8 గంటలకు పెన్సిల్వేనియా రైల్వేస్టేషన్ నుండి కొలంబస్ నగరానికి రైలులో బయలుదేరాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here