[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]
[ప్రశాంతంగా ఉన్న నల్లమల అడవులు సంజయ్ వేటలో పోలీస్, మిలిటరీ అధికారుల పదఘట్టనలతో దద్దరిల్లి పోతాయి. హఠాత్తుగా పైన పడిన పోలీసులను చూసి అటవీప్రాంత గిరిజన ప్రజలు, చెంచులు కకావికలవుతారు. పోలీసులు నిజం రాబట్టడానికి వాడే అన్ని పద్ధతులు అవలంబించారు. మనిషి శరీర ఉష్ణోగ్రతను పసిగట్టే థర్మల్ స్కానర్స్, హైఎండ్ సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ వెతుకుతారు. అయితే నల్లమల్ల విశాలమైన అరణ్యం కావడం వల్ల లోపలికి వెళ్ళి వెతకడం కష్టమవుతుంది. దాంతో కిడ్నాపర్స్ సంజయిని నల్లమల అడవుల నుండి తరలించారనీ; సంజయ్ ఎక్కడ ఉన్నాడో తెలియదని, అయినా తమ ప్రయత్నాలు తాము కొనసాగిస్తామని శుష్క వాగ్దానాలు చేసి చేతులు దులుపుకుంటారు పోలీసులు. సంజయ్ కిడ్నాప్ అయిన వార్తను క్రమంగా ప్రజలు మర్చిపోతారు. ఎంత గొప్ప వార్తైనా ఒక పూట కన్నా ఎక్కువ థ్రిల్ కలిగించటం లేదు. కొత్త అప్‌డేట్స్ లేకపోవడంతో, అప్పుడప్పుడు, అక్కడక్కడ సంజయ్ కిడ్నాప్ విషయాన్ని మెయిన్ టీవీ ఛానెళ్ళు ప్రస్తావిస్తున్నా, పెద్దగా ఫోకస్ చేయడం లేదు. కొన్ని అంతగా పాపులర్ కాని ఛానెళ్ళు, టీఆర్పీ రేటింగ్ కోసం పాకులాడే ఛానెళ్ళు సందీప్ కిడ్నాప్ గురించి చర్చలు పెట్టినా, క్రమంగా టాలీవుడ్, ఇన్ జనరల్, సందీప్ గురించి మరిచిపోతుంది. సందీప్ కిడ్నాప్ వల్ల ‘త్రిబుల్ యస్’ వారి సినిమా, ఉక్రేయిన్ దేశ రాజధాని ‘కీవ్’ పట్టణంలో జరపాల్సిన పాటల చిత్రీకరణ ఆగిపోతుంది. ఆ పాటలు తీయనవసరం లేకుండా, సినిమాను రిలీజ్ చేసే, అవకాశాలను నిర్మాతలు పరిశీలిస్తున్నారని సమీర్‍కి తెలుస్తుంది. సంజయ్‍తో తనకున్న అనుబంధాన్ని తలచుకుని బాధపడతాడు సమీర్. సందీప్ మీద గాసిప్‍లు రాసే వెబ్‍సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ళను ఎలా దారికి తెచ్చింది గుర్తు చేసుకుంటాడు సమీర్. – ఇక చదవండి.]
[dropcap]సం[/dropcap]దీప్ కిడ్నాప్ అయిన వారం రోజులకు, ‘త్రిబుల్ యస్’ బ్యానర్ నిర్మాత నన్ను ఆఫీసుకు రమ్మన్నాడు. నేను వెళ్ళేసరికి నిర్మాత గారి ఆఫీస్ మెయిన్ హాల్లో గోడకు నిలువెత్తుగా వేలాడుతున్న ‘త్రిబుల్ యస్’ పోస్టర్ కనపడింది.
సందీప్ ఉగ్రరూపంతో ఉన్న స్టిల్ అది. కింద ‘సాహసం, సమరం, సంధి’ అని మూడు ‘యస్’లకు సంబంధించిన ట్యాగ్‌లైన్ ఉంది. ఆ పోస్టర్ చూడగానే నా మనసు విచలితమయింది. సందీప్ కళ్ళ ముందున్నట్టుగానే తోచింది.
నిర్మాత గారి గదిలో నిర్మాత సత్యం గారితో పాటు, డైరెక్టర్ శ్రీవిక్రం గారు, సన్నీ అనే ఎడిటర్ కుర్రాడు కూర్చుని ఉన్నారు.
నన్ను చూడగానే రమ్మని ఆహ్వానించారు. కానీ, ట్రీట్‌మెంటులో తేడా కనిపిస్తూనే ఉంది. సందీప్ ఉన్నప్పుడు నాకు ఆత్మీయ ఆహ్వానాలు ఉండేవి. నేను రాగానే లేచి నిలబడి పిలిచేవారు. కాబట్టి, ఈ రంగంలోని – ఎదుటివారితో మనకున్న అవసరాన్ని బట్టే మర్యాదలూ, బంధాలూ, అనుబంధాలూ ఉంటాయన్న – చేదు నిజం మరొకసారి గుర్తొచ్చింది. ఇప్పుడు సందీప్ లేడు కాబట్టి, వారి దృష్టిలో నేనొక కోన్ కిస్కాగాణ్ణి మాత్రమే!
నేను కూర్చోగానే, డైరెక్టర్ శ్రీవిక్రం గారు,
“సమీర్! రెండు పాటలు మినహా, సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆ రెండు పాటలు కూడా లేకుండా సినిమా రిలీజ్ చేయొచ్చు గానీ, సంజయ్ ఫ్యాన్సుతో ప్రాబ్లెం. మన ఎడిటర్ సన్నీ ఆ రెండు పాటలను గ్రీన్ మ్యాట్‌లో, బాడీ డబుల్‌ని పెట్టి పూర్తి చేద్దామని సలహా ఇచ్చాడు. నీకు తెలుసు కదా ఈ మధ్య ‘ఫేస్ స్వాప్’ అనే యాప్ ద్వారా ఎవరి శరీరానికైనా, మన ముఖాన్ని తగిలించి, రీ-మిక్స్ చేస్తున్నారు. అట్లా చేద్దామా అని ఆలోచిస్తున్నాము. నీ సలహా ఏంటి? తర్వాత, భవిష్యత్తులో లీగల్ సమస్యలు రాకూడదని ముందే నీకు చెప్తున్నాము.” అన్నాడు.
నాకా ప్రాసెస్ అంతా తెలుసు. గ్రీన్ మ్యాట్ అంటే ఇక్కడ స్టూడియోలో చుట్టూ దళసరి ఆకుపచ్చని బట్ట తెరలు కట్టి పాట షూట్ చేసిన తర్వాత సీజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్, డీఐ లో, షూటింగులో వాడిన గ్రీన్ మ్యాట్ తీసేసి మనకు కావలిసిన ప్రదేశంలో షూట్ చేసినట్టుగా చూపించవచ్చును. ఉదాహరణకు మన హీరో హీరోయిన్లను లండన్‌లో గానీ, అమెరికా వైట్ హౌజ్‌లో గానీ, అన్నవరం గుడి కింద గానీ డాన్సు చేస్తున్నట్టుగా చూపించ వచ్చును. అట్లాగే డీప్ ఫేక్ ఆల్ {Deep Fake Al} అనే యాప్ ద్వారా బాడీ డబుల్ అంటే డూపులను పెట్టి ఫేస్ రీమ్యాపింగ్ {Face Remapping} టెక్నిక్ ద్వారా అసలు నటుడు డ్యాన్స్ చేస్తున్నట్టుగానే చూపించ వచ్చును.
సినిమా సాంకేతిక రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. హాలీవుడ్‌లో దాదాపు అందరి ప్రముఖ యాక్టర్ల 3 డీ డిజిటల్ స్కానింగ్ చేసి స్టోర్ చేసి పెడుతున్నారు. మన దేశపు నటి ప్రియాంకా చోప్రాది కూడా ఇలా చేసి భద్రపరిచారు.
ఇందువల్ల ఆ నటి గానీ నటుడు గానీ ఏదైనా కారణం వల్ల, ఒప్పందం ప్రకారం సినిమాలో నటించ లేకపోతే, ఆ డిజిటల్ ప్రింటును వాడి సినిమా పూర్తి చేయవచ్చును.
గమ్మత్తైన విషయమేమిటంటే అటువంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన వెటా డిజిటల్ {Weta Digital; WetaFX} నిర్వాహకుడు – ప్రేమ్ అక్కరాజు అని – మన తెలుగు వాడే.
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ {Fast and Furious- 7}లో నటించి, ఆ సినిమా పూర్తి కాక ముందే మరణించిన ‘పాల్ వాకర్’ {Paul Walker} స్థానంలో అతని తమ్ముడిని పెట్టి ఫేస్ మ్యాపింగ్ చేసి ఆ సినిమా పూర్తి చేసారు. ఆ విషయం నిర్మాతలు చెప్పేంత వరకు కూడా ఎవరికీ తెలియదు. అలాగే ‘గ్లాడియేటర్’ {Gladiator} సినిమాలో, అప్పటికే చనిపోయిన ‘అలివర్ రీడ్’ {Oliver Reed} అనే నటుడిని బ్రతికించి, నటించినట్టుగా చూపించారు.
అదంత అవసరం లేకుండా, ఈ మధ్య ‘ఫేస్ స్వాప్’ {Face Swap} అనే యాప్ సహయంతో చిన్న పిల్లలు కూడా ఒక నటుడి ముఖానికి మరో నటుడి లేదా నటుడు ముఖాన్ని అంటించి కేరింతలు కొడుతున్నారు. అలా మహేష్ బాబు ముఖాన్ని తీసేసి, మన ముఖాన్ని పెట్టుకుని, ఏ హీరోయినుతోనైనా గంతులేస్తున్నట్టుగా మార్ఫింగ్ చేయవచ్చును. ఇదెంత వరకు వెళ్ళిందంటే, పోర్న్ వీడియోలలో నటించిన అసలు పోర్న్ నటి ముఖం తీసేసి, ఎవరికి నచ్చిన నటీమణుల ముఖాలు, ఆ పోర్న్ నటి ముఖం స్థానంలో తగిలించి, నానా కంపు లేపే స్థాయికి చేరింది. అలా ప్రఖ్యాత హీరోయిన్లు పోర్న్ సీన్లలో నటించినట్టుగా ఉన్న అనేక వీడియోలు మార్కెటులో చెలామణి అవుతున్నాయి కూడా.
ఈ సాంకేతిక ప్రగతి గురించి నాకు తెలుసు కానీ, శ్రీవిక్రం గారు ఈ విషయాలన్నీ నాకెందుకు చెబుతున్నట్టని నాకు అనుమానమొచ్చింది. అందుకే,
“సార్! ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు?” అని అడిగాను.
దానికి సత్యం గారు కోపంగా,
“మరెవరికి చెప్పాలి? మీ వాడేమో దొ..” అని ఏదో బూతు మాట అనబోయి, డైరెక్టర్ అతని చెయ్యి పట్టుకుని ఆపడంతో, తమాయించుకుని,
“సందీప్ బాబేమో కిడ్నాప్ అయ్యాడని మీరంటున్నారు? ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు వినపడుతున్నాయి. ఇప్పటికి ఇరవై కోట్లు ఆయనకిచ్చాం! నీక్కూడా తెలుసు కదా? అంతా కలిపి యాభై కోట్లై కూర్చుంది. తడిసి మోపెడైంది. ఇప్పటికే ఐదు రూపాయల వడ్డీతో ఫైనాన్స్ తెచ్చాను..” అని అంటుంటే అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను సత్యం గారి భుజం మీద చేయి వేసి,
“నన్నేం చేయమంటారో చెప్పండి! మీరు పెట్టిన యాభై కోట్లకు ఇంకో యాభై కోట్లు లాభం తప్పక వస్తుంది సార్! బాధ పడకండి. సంజయ్ కూడా ఎప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరుకునే వాడే! అతని నుండి లీగలుగా మీకే సమస్య రాకుండా చూసుకునే పూచీ నాది. మీరు ఏ టెక్నిక్ అయినా ఉపయోగించి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయండి.” అన్నాను.
దాంతో నిర్మాత శాంతించి,
“థ్యాంక్యూ సమీర్!” అన్నాడు. అందరి ముఖాల్లో సంతోషం తాండవించింది. అప్పుడు నేను కోపంగా,
“సార్! మీరు వయసులో పెద్దవాళ్ళు. సినిమా రంగంలో ఇంత అనుభవం గడించారు. కానీ మీరు కూడా సందీప్ కిడ్నాప్ గురించి తప్పుడు మాట మాట్లాడబోయారు. అది మాత్రం నేను మరిచిపోను. సందీప్ తిరిగి వచ్చిన తర్వాత కూడా జీవితంలో మీ బ్యానరులో సినిమా చేయనివ్వను. సెలవ్!” అని అన్నాను మనసు కుతకుత ఉడుకుతుంటే. దాంతో నిర్ఘాంతపోయిన నిర్మాత, దర్శకుడు విస్మయంగా చూసారు.
ఇంతలో శ్రీవిక్రం తేరుకుని, పరిస్థితి చేజారి పోబోతుందని గ్రహించి అప్పటికప్పుడే, వ్యూహం మార్చి, నిర్మాత వైపు తిరిగి, కన్ను కొట్టి, నాతో,
“సమీర్! నిన్ను పిలిపించింది ఈ విషయం గురించి కాదు. నీకొక ప్రపోజల్ చెప్తాను ప్రశాంతంగా విను. మన కెమెరామెన్, మన సన్నీ, నేనూ కలిసి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాము. సంజయ్ స్థానంలో నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నీ ఒడ్డూ, పొడుగు, ముఖ కవళికలూ అన్నీ సంజయ్‌వే. ఇన్ని రోజులుగా నువ్వు సంజయ్‌ని చూస్తున్నావు కాబట్టి, సంజయ్‌ని అనుకరించడం నీకు పెద్ద సమస్య కూడా కాదు. పాటలే కాబట్టి క్లోజప్పులు లేకుండా, లిప్ సింక్ లేకుండా మ్యానేజ్ చేద్దాం. ఎక్కడైనా అవసరమైతే సంజయ్ స్టాక్ షాట్స్ వాడదాము.
నీకు తెలుసుగా కన్నడ నటుడు విష్ణువర్థన్ మరణించిన తర్వాత కూడా అతను నటించిన సినిమా ‘నాగరహవు’ను ఇదే CGI {Computer Generated Imagery} టెక్నిక్ ఉపయోగించి విష్ణువర్ధన్ నటించినట్టుగా సినిమా పూర్తి చేసి, 2016లో విడుదల చేస్తే అఖండ విజయం సాధించింది. దీనికి మన తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణనే దర్శకత్వం వహించాడు.
నువ్వు నీ స్నేహితుడి కోసమైనా ఈ పని చేయక తప్పదు.” అని శ్రీ విక్రం గారు అనేసరికి నేను ఆలోచనల్లో పడిపోయాను.
‘ఇదేదో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగులా ఉంది. తెలివిగా వ్యవహరించి బయటపడాలి.’ అని అనుకుని,
“సార్! మీకు తెలియంది కాదు. సంజయ్ కిడ్నాప్ కావడంతో అతని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. మీరు వచ్చి కనీసం పలకరించను కూడా లేదు. అందుకే, మీరు వచ్చి సుధాకర్ నాయుడు గారికి ఒక మాట చెప్పి ఆయన అనుమతి తీసుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేకపోతే, సంజయ్ కిడ్నాపైన సంఘటనను నేను నా స్వలాభం కోసం వాడుకున్నట్టుగా వాళ్ళు అనుమానిస్తే నేను తట్టుకోలేను. కాబట్టి.. సంజయ్ ప్లేస్‌లో నేను నటించగలనని మీరు భావిస్తే.. నా వరకైతే నాకేం అభ్యంతరం లేదు. మీరొప్పుడొస్తారో చెపితే అంకుల్‌కు చెప్పి పెడ్తాను.” అని వినయంగా అన్నాను.
నిజానికి సంజయ్ దగ్గరకు రాక ముందు నాకింత లౌక్యంగా మాట్లాడడం వచ్చేది కాదు. కానీ, సినిమా ఫీల్డు వాళ్ళతో, సంజయ్ కాల్ షీట్లు సర్దుబాట్లు చేసే సమస్యలతో, కొత్తలో సతమతమవుతుంటే సంజయే కొన్ని సలహాలు ఇచ్చేవాడు. తరువాత్తరువాత నేను సంభాషణా చాతుర్యాన్ని ఆకళింపు చేసుకున్నాను. అది ఇప్పుడు ఇక్కడ, ఈ విధంగా, ఉపయోగపడింది.
నా మాటలతో నిర్మాత, దర్శకుడు అయోమయంలో పడిపోయారు. సినిమా రంగం స్వార్థపూరితమయిందే అయినా సినిమా రంగంలోని ఎంతో మంది ప్రముఖులు వచ్చి సుధాకర్ నాయుడి గారికి తమ సానుభూతి తెలియచేసారు. కానీ, ఎందువల్లనో, సంజయ్ కిడ్నాప్ వల్ల తమ సినిమా ఆగిపోయిందన్న కోపం వల్లనో నిర్మాత సత్యం గారు గానీ, దర్శకుడు శ్రీవిక్రం గారు గానీ మా ఇంటికి రాలేదు.
అది నాకు మొన్నటి నుండి కంటగింపుగా ఉంది. ‘షూటింగ్ చివరి రోజున రాత్రి పది వరకు రకరకాల కాస్ట్యూములు ధరించి, ప్యాచ్ వర్క్ ముగించి సహకరించాడన్న కృతజ్ఞత కూడా లేని మనుషులు’ అని మనసులోనే తిట్టుకున్నాను.
అందుకు వాళ్ళను, ఇలా ఇరికించగలిగినందుకు మనసులో నన్ను నేనే అభినందించుకుని, బయటకు నడిచాను.
***
నిర్మాత సత్యం గారి ఆఫీసు నుండి వస్తుంటే మనసంతా సంతోషకరమైన ఊహల్లో తేలిపోయింది. ‘ఫ్రెండ్లీ మూవీ మేకర్స్’ బ్యానరులో, శ్రీవిక్రం గారి డైరెక్షనులో వారి సినిమాలో హీరోగా – డూపుగానైనా సరే – నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. పెద్దపెద్ద స్టార్లే ఆయనతో సినిమా చేయాలని సంవత్సరాల పాటు వేచి చూస్తుంటారు.
ఇప్పుడు టాలీవుడ్‌లో పరిస్థితి మారింది. గత దశాబ్దం క్రిందటి వరకు హీరోల డామినేషన్ నడిచేది. తమ అభిమాన హీరో ఉంటే చాలు బొమ్మ హిట్టయ్యేది. హీరోనే సినిమారంగాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలేవాడు. హీరో తనే నిర్మాతను, హీరోయిన్లను మిగిలిన సాంకేతిక సిబ్బందిని నిర్ణయించేవాడు. డైరెక్టరును కూడా హీరోనే ఫైనల్ చేసేవాడు. అప్పుడున్న సినిమా విడుదల మెకానిజంను బట్టి ఫలానా హీరో ఉంటేనే డిస్ట్రిబ్యూటర్లు, సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స్ పెట్టేవారు. కాబట్టి ‘హీరో’ అనేవాడు సర్వం సహా అయి తెలుగు చిత్ర రంగాన్ని పరిపాలించేవాడు. సినిమా కథలన్నీ ప్రేమ, ప్రతీకారం, డబుల్, త్రిబుల్ యాక్షన్ల చుట్టే తిరిగేవి. అసలు హీరో అన్నవాడు ఈ భూగోళంలో మానవమాత్రుడు చెయ్యలేని ఫీట్లన్నీ చేస్తున్నట్టుగా చూపించడం మొదలుపెట్టారు.
హీరోదే పెత్తనం కాబట్టి తన ఫ్యాన్స్ కోసం పిచ్చి ఫైట్లు, బుర్రలేని యాక్షన్ సీక్వెన్సులు, ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లతో పిచ్చి గంతులు పాటలు, హీరో వేయవలసిన ఐటెం సాంగ్ వంటివి కంపల్సరీగా పెట్టి, కథకు, దర్శకత్వ ప్రతిభకు తగిన ప్రాధాన్యత లేకపోవడంతో, కాలక్రమేణా, పెద్ద హీరోల సినిమాల పెట్టెలన్నీ మొదటి ఆట కాగానే తిరిగి రావడం మొదలయ్యాయి.
ఒకానొక దశలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, అనూరాధ, విజయ లలిత వంటి డ్యాన్సర్లతో హీరో గెంతులు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేసేవారంటే, ప్రేక్షకుల మనస్తత్వాలను ఏ విధంగా మౌల్డ్ {Mould} చేసారో అర్థం చేసుకోవచ్చు.
కానీ, ప్రేక్షకులు, ఫ్యాన్సుతో సహా, క్రమక్రమంగా, ఈ ‘రొడ్డకొట్టుడు’ సినిమాలను తిరస్కరించడం మొదలు పెట్టారు. అలా, హీరోల స్వర్ణయుగం క్షీణదశకు చేరుకుంది.
అప్పుడు దర్శకుల శకం మొదలయింది. సామాజిక ప్రయోజనం కలిగిన మంచి కథ, పటుత్వమైన స్క్రీన్ ప్లే, ఒకే హీరోయిన్ పట్ల ప్రేమ భావనతో మెదిలే హీరో, ఉమ్మడి కుటుంబ విలువలు ఉండి, విదేశాలలో సుందరమైన ఔట్‌డోర్ లొకేషన్లు, అందమైన విలువైన, సహజత్వానికి దగ్గరగా ఉండే కాస్ట్యూమ్స్, మెలోడ్రామా లేని సన్నివేశాలు, పంచ్ డైలాగులంటే అరిచి గోల చేయడం కాకుండా, సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండే మంచి సంభాషణలు, సినిమా మొత్తాన్ని ఒక సుందరదృశ్యంగా, ఆహ్లాదంగా, అందంగా ఉన్న సహ నటీనటులందరు నటించిన, కుటుంబ సభ్యులందరితో కలిసి చూసే విధంగా, ఫ్యాన్సును కూడా శాటిస్‌ఫై చేసే విధంగా దర్శకులు ఒక కంప్లీట్ ప్రాజెక్టును డిజైన్ చేసి సిద్ధంగా ఉంచుకున్నారు. అందువల్ల హీరో కన్నా దర్శకుడికే ప్రాధాన్యత పెరిగింది.
అసలు హీరోనే లేకుండా తీసిన సినిమాలు, అప్పటి వరకు కమేడియన్ పాత్రలను, సైడ్ క్యారెక్టర్లను వేసిన వారిని హీరోలుగా పెట్టి తీసిన సినిమాలు విజయవంతం కావడంతో రొడ్డకొట్టుడు ఫార్ములా సినిమాలు కాకుండా, నిండైన, హుందాగా ఉండే తెలుగు సినిమాలకు ఆదరణ పెరిగింది.
అటువంటి దర్శకుల్లో శ్రీవిక్రం ఒకరు. మంచి డైలాగులు రాసి, హీరోను ఎలివేట్ చేస్తూనే, కుటుంబ విలువలకు ప్రాధాన్యతను ఇస్తూనే, మసాలా అంశాలు చొప్పించే విధంగా స్క్రీన్ ప్లే రాసుకుంటాడని ఆయనకి పేరు.
అటువంటి శ్రీవిక్రం సినిమాలో రెండు పాటల్లోనే అయినా, సంజయికి డూప్ గానే అయినా, హీరోయిన్‌తో ప్రణయ సన్నివేశాల్లో పాల్గొనడం అంటే, నా మది వనంలో సీతాకోకచిలుకలు మురిసిపోతూ ఎగురుతున్నాయి. ‘లడ్డూ కావాలా నాయనా?’ అని ఎవరో అడుగుతున్నట్టుగా అనిపించింది.
(సశేషం)