[శ్రీ కుంతి రచించిన ‘వాగ్భూషణం భూషణం!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]త[/dropcap]నను తాను పెద్ద సాహితీవేత్తగా, మహాకవిగా భావించుకుని, తనకు తగినంతగా గుర్తింపు రాలేదని నిత్యం బాధపడే పట్టాభిరామారావు అనే వ్యక్తికి, అతని మిత్రుడైన శ్రీనివాసరావు దారిలో ఎదురుపడ్డాడు.
“పట్టయ్య బావా! చూడకుండా పోతున్నావు” పలకరించాడు శ్రీనివాసరావు.
“అబ్బే ఏదో ఆలోచిస్తున్నాను. నిన్ను చూస్తే పలకరించకుండా ఉంటానా?”
“ఏదో దిగులుగా, పోగొట్టుకున్న వాడిలా కనబడుతున్నావు. ఇలారా. ఆ మయూరి కేఫ్‌లో సరదాగా కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం”. ఇద్దరూ హోటల్‌కి దారితీసారు. కాఫీలు త్రాగి, సిగరెట్లు పీల్చారు.
“చెప్పు పట్టయ్య బావా! యేదో మథనపడుతున్నావు?”
“ఏమీ లేదురా శీనయ్యా! నాకు సరస్వతీ కటాక్షం ఉంది. కవిత్వం రాస్తాను. పద్యాలు అల్లుతాను. ప్రతిదినం అటు సాహిత్య సభకు గానీ, ఇటు కవి సమ్మేళనానికి గానీ వెళతాను. నా పద్యాలు, కవితలు, వ్యాసాలు వినిపిస్తాను. ఒక్కరూ మెచ్చుకోరే?”
శీనయ్య పట్టయ్య వైపు చూసాడు. అతడికి పట్టయ్య డిగ్రీ చదువుతున్నప్పటి నుండి తెలుసు. క్లాస్‌మేట్సే కాదు. కొంతకాలము రూం మేట్స్, ఆ పై గ్లాస్ మేట్స్ కూడా.
అతడిలో పద్యాలు రాసేంతటి పాండిత్యం, ప్రతిభావ్యుత్పత్తులు కానీ, కవిత్వం చెప్పేంత సరస హృదయం, కాల్పనిక శక్తి, సామాజిక స్పహ కానీ లేవు. ఆ విషయం అతడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలాసార్లు చెప్పాడు. కానీ పట్టయ్య వినిపించుకోలేదు. పైగా తన కవిత్వాన్ని, తన పాండిత్యాన్ని గుర్తించే సంస్కారం, భావుకత, సరస హృదయం లోకానికి లేదని అంటుండేవాడు. దానితో ఆ విషయాలు చెప్పడం మానేసాడు.
“ఏరా అలా చూస్తున్నావు?”
“నీ కవితాశక్తిలో, నీ భావనా పటిమలో, భాషాపాండిత్యాలలో లోపాలున్నాయి” అని ఎప్పటి విషయాలు చెప్పి బాధ పెట్టడమెందుకని, అతని వైపే చూస్తూ, అప్పుడే యేదో ఆలోచన స్ఫురణకు రావడంతో,
“చూడు పట్టయ్య బావా! నిన్ను నీవు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేగిన జుట్టు, మాసిన గడ్డం, ఎప్పటివో కనిష్కుల నాటి దుస్తులు.. ఇలా ఉంటే నీ కవిత్వానికి గుర్తింపు వస్తుందా? అసలు భావ కవి అంటే ఎలా ఉండాలి? నీవు ఎన్ని సార్లు టీవీలలో, సభలలో, ఉత్సవాలలో లబ్ధప్రతిష్ఠులైన కవులను చూసి ఉంటావు. వారి వస్త్రధారణ, వేషధారణ ఎంత హుందాగా ఉంటుంది. మంత్రాల బలం లేకున్న తుంపర్ల బలం అయినా ఉండాలి. డాబూ దర్జా ఉండాలి ఏమంటావు?”
“ఇంతకీ నీవు అనేది ఏమిటిరా”
“యేముంది! ఈ లోకం నేవళానికి, డాంబికానికి పై పై ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తుంది. నీలో లక్ష్మీకళ కనబడితే నీలో సరస్వతిని కూడా చూస్తారు”
“అయితే నేను ఇప్పుడేమి చేయాలి”
“నెల మొదటి వారం కదా. జీతాలు వచ్చి ఉంటాయి. పద షాపింగ్‌కు వెళదాం”
“అది నిజమే కానీ ఇంట్లోకి నెల తాలూకు ఉప్పులూ, పప్పులూ కొనాలి. ఇన్సురెన్సులు చెల్లించాలి. చేసిన అప్పులు తీర్చాలి. పిల్లలకు స్కూలు ఫీజులు కట్టాలి. మీ చెల్లెలు పిల్లలని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. తాను ఇంటికి వచ్చేలోగా ఈ యేర్పాట్లు చేయాలి.”
“సంసారం సాగరం. గోల ఎప్పటికీ ఉండేదే. నిన్ను నీవు సుందర పురుషునిగా మార్చుకో. నీలోని కవిత్వానికి సౌందర్యం అదే వస్తుంది”
పట్టయ్యకు అతని మాటలు బాగా అనిపించాయి. ఇద్దరూ దగ్గరలో ఉన్న మాల్‌కి వెళ్ళారు. శీనయ్య దగ్గరుండి పట్టయ్య చేత ఖరీదైన పట్టు ధోవతులు, పట్టు లాల్చీలు, పట్టు ఉత్తరీయాలు కొనిపించాడు. పట్టయ్యకు క్యాష్ కౌంటర్‌లో డబ్బులు చెల్లిస్తుంటే ఇంటికి కొనాల్సిన నెల సరుకులు గుర్తుకు వచ్చాయి.
గుండెలో గుబులు పుట్టింది.
అది గమనించిన శీనయ్య, “ఈ పట్టు వస్త్రములు ధరించి రేపు సభకు వెళ్ళు. జయం నీదే” అన్నాడు. దానితో పట్టయ్య ముఖంలో ఆనందం తాండవమాడింది. అది గమనించిన శీనయ్య “బావా! ఈ ఆనంద సమయంలో అలా బారుకి వెళ్ళి మధుసేవన చేద్దాం” అన్నాడు.
పట్టయ్య కూడా మూడ్ లోకి రావడంతో ఇద్దరూ బార్‌కు వెళ్ళారు. పీకల దాకా మందు పట్టించారు. పట్టయ్య క్యాష్ కౌంటర్‌లో డబ్బులు చెల్లిస్తుంటే పిల్లకు కట్టాల్సిన స్కూల్ ఫీజులు గుర్తుకు వచ్చాయి.
గుండెల్లో గుబులు పుట్టింది.
***
మరునాడు నీట్‌గా షేవ్ చేసుకున్నాడు. తలకు రకరకాల ఆయిల్స్ రాసుకున్నాడు. పట్టు బట్టలు కట్టుకున్నాడు. స్ప్రే చేసుకున్నాడు. అద్దంలో చూసుకున్నాడు. ఈ బట్టలు తన కోసమే నేయబడినట్లుగా అనిపించాయి.
తన వల్లనే బట్టలకు కూడా అందం వచ్చింది అని అనుకున్నాడు.
నగరంలో ఒక పెద్ద ఆడిటోరియంలో నడుస్తున్న కవిగర్జన సభకు వెళ్ళాడు. అతి కష్టం మీద తన పేరు అక్కడ నమోదు చేయించుకొని, తన వంతు రాగానే ఒక కవిత చెప్పాడు. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. అందరు ముఖాలు ఉదాసీనంగా పెట్టారు.
వేదిక దిగి వచ్చాడు. సభ అయిపోగానే కవి మిత్రులు పోగయ్యారు.
అందులో ఒక కవి శార్ధూలం మరొక కవి సింహంతో “ఈ రోజు సభలో అందమంతా పట్టయ్య గారిదే. యేమి వైభవం అతడిది. ఆ పట్టు బట్టలలో మెరిసి పోతున్నాడు” అన్నాడు. మరొక కవి దిగ్గజం, “పట్టయ్య గారు ఈ రోజు పార్టీ ఇవ్వవలసినదే” అన్నాడు. మరొక కవితా నారి “పట్టయ్యగారు ట్రీట్ చేయాల్సిందే” అంటూ వాగ్బాణం సంధించింది.
పట్టయ్యకి వారిని ఆడిటోరియం పక్క నున్న పెద్ద హోటల్‌కు తీసుకు వెళ్ళక తప్పలేదు. హోటల్లో తింటున్నంత సేపు ఎవరైనా తన కవిత్వాన్ని మెచ్చుకుంటారేమోనని ఎదురు చూసాడు. అందరూ తన పట్టు వస్త్రాలు ఎక్కడ కొన్నదీ, ఎంతకి కొన్నది అన్న విషయాలు ఆరా తీస్తున్నారు తప్ప కవిత్వం తాలూకు ఊసు లేదు. భోజనాలు అయ్యాయి. క్యాష్ కౌంటర్‌లో బిల్లు చెల్లించాడు. కట్టవలసిన ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు గుర్తుకు వచ్చాయి.
గుండెల్లో గుబులు పుట్టింది.
అందరూ హోటల్ బయటికి వచ్చారు. బిచ్చగాళ్ళు వెంటపడ్డారు. అందరూ తలా ఒక రూపాయి వేసారు. పట్టయ్య రూపాయి బిళ్ళ వేయబోతుండగా “దొర లాగా ఉన్నవు. నువ్వు కూడ బిళ్ళ యేస్తే ఎట్ల. పది రూపాలన్న ఇయ్యి సామీ. నీ పేరు చెప్పుకుంటాం” అన్నారు. వాళ్ళకు బాగానే భిక్ష వేసి, ‘ఈ రోజు నా వస్త్రధారణ తప్ప, కవన శక్తి గుర్తింపబడలేదు’ అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు.
***
“పట్టయ్య బావా! రెండు రోజులుగా మాటా మాంతీ లేదు. ఫోన్, మెస్సేజ్ లేదు” మరొక సాహిత్య సభకు వెళుతున్న పట్టయ్యకు ఎదురుపడ్డ శీనయ్య ప్రశ్నించాడు. “ఏమీ లేదు లే” అంటూ నిరుత్సాహంగా ముఖం పెట్టాడు.
“ఏమీ లేకపోవడం యేమిటి, పట్టు వస్త్రాలు ధరించి మరీ సాహిత్య సభకు వెళుతున్నట్టున్నావు”
“యేమి పట్టు వస్త్రాలోరా బావా! బట్టలైతే వేసుకొని వెళుతున్నాను కానీ నా కవిత్వానికి మాత్రం గుర్తింపు రావడం లేదు. ఒక్కరు కూడా నా కవిత్వాన్ని పొగడడం లేదు”
శీనయ్య పట్టయ్యను ఎగాదిగా చూసాడు.
“ఆ అర్థమైంది. నీవు ఎప్పుడైనా సాహిత్య సభలో కవులను పండితులను చూసావా? వాళ్ళు ఎలా ఉంటారో నీవు అలా లేవు”
“నీవు చెప్పినట్లు పట్టు పంచ, లాల్చీ, ఉత్తరీయం ధరించాను కదా”
“ఇక్కడే మనమొక పొరపాటు చేసాం. ఆ వస్త్రాలకు తగినట్లుగా ఒక ఓవర్ కోట్ మరిచిపోయాం. అలాగే నీ కాళ్ళ వైపు చూడు, ఆ చెప్పులు యే తాతల కాలం నాటివో. ఎంత అసహ్యంగా ఉన్నాయి”
తనను తాను చూసుకున్నాడు. శీనయ్య మాటలు నిజమే అనిపించాయి. మళ్ళీ పక్కనే ఉన్న పెద్ద సాపింగ్ మాల్‌కి వెళ్ళారు.
శీనయ్య ఖరీదైన పట్టు చారికలు గల ఓవర్ కోటును పట్టయ్య చేత కొనిపించాడు.
పట్టయ్య అది వేసుకొని అద్దంలో చూసుకున్నాడు. తనకు తాను జ్ఞానపీఠ అవార్డు గ్రహీత లాగా, సాహిత్య అకాడమీ మెంబర్ లాగా, అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వెళ్ళే విశిష్ట అతిథి లాగా ఉన్నట్లుగా భావించాడు.
అదే మాల్‌లో మరొక చోట మంచి చెప్పులు, ఖరీదైన గడియారం కొన్నాడు. క్యాష్ కౌంటర్‌లో డబ్బులు చెల్లించాడు. వేలల్లో కట్టవలసిన చిల్లర బాకీలు గుర్తుకు వచ్చాయి.
గుండెల్లో గుబులు పుట్టింది.
కానీ వేషధారణ చూసుకోని మురిసిపోయాడు. అదే అదనుగా భావించిన శీనయ్య కాస్తా దిగులుగా ముఖం పెడుతూ,
“పట్టయ్య బావా! ఒక చిన్న కష్టం వచ్చి పడింది. ఇంటికి చుట్టాలు వచ్చారు. ఒక రెండు వేలు సర్దు” అన్నాడు. ఇవ్వక తప్పలేదు. మరొక రోజు ఎప్పటి లాగే పట్టు వస్త్రాలు, కోటు ధరించి, కాళ్ళకు ఖరీదైన జోళ్లు, చేతికి ఖరీదైన వాచ్‌తో ‘కవి వెడలె రవి తేజములలరగ’ అన్నట్లుగా మరొక పద్య కవితా సమ్మేళనానికి వెళ్ళాడు. అతి కష్టం మీద పట్టయ్యకు ఆ సభలో నాలుగు పద్యాలు చదివే అవకాశం వచ్చింది. తన వస్త్రధారణ వైభవంతో వేదిక పైకి వెళ్ళి, నాలుగు పద్యాలు చదివాడు.
సభాధ్యక్షుడు సమయం లేదని వారిస్తున్నా వినకుండా, కవిత్వం గురించి, భావుకత గురించి, సాహిత్యంలో ధోరణులు వంటి అంశాల గురించి తనకు తోచిన మాటలు మాట్లాడాడు. ఎవరూ స్పందించలేదు. నిరుత్సాహంగా వేదిక దిగి వచ్చి, కూర్చున్నాడు.
సభ అయిపోయింది. ఇంతలో ప్రముఖ నవలా రచయిత్రి మద్దెల చెరువు మహారాణి, చిన్న కధల చెంచమ్మ, విప్లవ రచయిత్రి రంగక్కలు అటుకేసి వచ్చారు.
“పట్టయ్య గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు నడుస్తున్నాయి. మేము వచ్చే ఉగాది నాడు వేయి మంది కవులు, రచయితలతో మహా సాహిత్యోత్సవం నిర్వహించబోతున్నాం” అన్నారు. ఆ మాటలు వినగానే వారు తనను కవిగా ఆ సభకు ఆహ్వానిస్తున్నారేమోననుకొని ఆనందపడిపోయే లోగా, “మీరు కనీసం పదివేల రూపాయలైనా మీ వంతుగా విరాళం యివ్వాలి” అన్నారు అతని పట్టు బట్టలకేసి చూస్తూ.
పట్టయ్యకు పచ్చి వెలగకాయ గొంతులో పడినట్లుగా, చేదు నమిలినట్లుగా అనిపించింది. ఎన్నోసార్లు, ఎన్నో సభలలో తాను మాట్లాడబోయినా తనను పలకరించని వారు ఈ రోజు తన దగ్గరికి వచ్చి మాట్లాడడం, విరాళమడగడం వింతగా, రోతగా అనిపించింది. తన వస్త్రధారణ వైపు చూసుకున్నాడు. తప్పించుకోవడం కుదరదు అనిపించింది. “అలాగే ఇస్తాను” అని చెప్పి ఆడిటోరియం ప్రక్కనే ఉన్న ఏటీఏం సెంటర్‌కు వెళ్ళి పదివేలు డ్రా చేసాడు. బ్యాలెన్స్ చూసాడు. మినిమం మాత్రమే ఉంది.
నిట్టూరుస్తూ, మౌనంగా అక్కడి నుండి వచ్చి ఎదురుచూస్తున్న నారీమణులకు డబ్బులు ఇచ్చాడు.
డబ్బులిస్తున్నపుడు కట్టాల్సిన ఇంటి లోన్ గుర్తుకు వచ్చింది. గుండెల్లో గుబులు పుట్టింది.
అప్పుడే అక్కడికి తన తరువాత పద్య కవిత వినిపించిన సుందరయ్యగారు వచ్చారు. మాసిన గడ్డంతో, రేగిన జుట్టుతో, సాదాసీదా వస్త్రధారణతో సాధారణంగా ఉన్నారు. ఆయన ఆ సభలో కనబడకుండా మరొక చోట కనబడితే అనామకుడిలా ఉంటారు. అంతకు ముందు ఆయన పద్యాలు చదువుతుంటే అందరూ మంత్రముగ్ధులై వినడమే కాక, అతడు మాట్లాడిన తరువాత చాలా సేపు చప్పట్లతో అభినందించారు. ఆయన వీరున్న చోటికి రాగానే చాలా మంది ఆయన చుట్టూ చేరి పాదాభివందనం చేసారు.
పట్టయ్యకు భర్తృహరి సుభాషితం లోని ‘వాగ్భూషణం భూషణం’ వాక్యం గుర్తుకు వచ్చింది.
***
శ్రీమతి పిల్లలతో సహా ఇంటికి వచ్చింది. కుశల ప్రశ్నలు, మంచీ చెడులు అయ్యాయి.
“అడగడం మరిచాను, నెల సరుకులు తెచ్చారా? పిల్లల స్కూల్ ఫీజులు కట్టారా? ఇన్సురెన్సులు, బాకీలు, ఇంటి లోన్ కట్టారా?” ప్రశ్నల వర్షం కురిపిస్తున్న భార్య మాటలకు యేమి సమాధానం చెప్పాలో తెలీయక పక్క నున్న గదిలోకి వెళ్ళాడు.
స్టాండ్‌కు వెళ్ళాడుతున్న పట్టు వస్త్రాలు, ఓవర్ కోట్ కనిపించాయి.
ఒక్క సారిగా అతను ‘నేను ఎంతటి భ్రమలకు లోనయ్యను కదా’ అని ఫీల్ అయ్యాడు.
గుండెల్లో గుబులు మాత్రం పుట్టలేదు. తత్వం బోధ పడినట్లుగా అనిపించింది.
అద్దాల బీరువాలో తాను అపురూపంగా దాచుకున్న వందల గ్రంథాలు కనిపించాయి. తాను కవిగా ఎదగడానికి అవి సోపానాలుగా అనిపించాయి. టేబుల్ మీద ఆ రోజు వెళ్ళాల్సిన కవి సమ్మేళనం తాలూకు పత్రిక కనిపించింది. దానిని చించి పారవేసి, భార్యతో మాట్లాడటానికి గదిలో నుండి బయటికి వచ్చాడు.