గాడ్ది మీది గరీబు

0
3

[శ్రీ నల్ల భూమయ్య రచించిన ‘గాడ్ది మీది గరీబు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘సాం[/dropcap]బయ్య’ ఒక కంపిన్ల జీతగాడు. ‘ఒక కంపిని’ అనంగనే గదేదో శెతకోటి లింగాల్ల గదో బోడిలింగం గావచ్చు అనుకునేలు గిన! కాదు. గా కంపిని మా లింగాలల్ల ఒక మాలింగం అసుంటిది. గంతగంత పెద్ద కంపిన్లు వున్నందున గాపూట – సుట్టువున్న కాలేర్లల్ల యింకగూడ పంచాయితులే వుండంగ గా వూర్లె సిటి మున్సిపాలిటి, ఏనాటి సందో! గా కంపిన్లల్ల జీతగాండ్లు దేశదేశాల నుంచి అచ్చినోళ్ళున్నరు. అన్ని తీర్ల మంది. దొరలు, కూలోళ్ళు, బగ్గ సదివినోళ్ళు, సదువురానోళ్ళు, గక్కడి మొగోళ్ళు – పైంట్లు తొడిగెటోళ్ళున్నరు, పంచెలు గట్టెటోళ్ళున్నరు. గక్కడి ఆడోళ్ళు గోల్సాడీలు జుట్టెటోళ్ళున్నరు, గోసిసీరెలు గట్టెటోళ్ళున్నరు. మిషిని కుట్టు జాకిట్లు తొడిగెటోళ్ళున్నరు, సేలికుట్టు రైకలు తొడిగెటోళ్ళున్నరు. అన్ని బాసలోళ్ళు, అన్ని మతాలోళ్ళు, అన్ని కులాలోళ్ళు, అన్ని కులపు పనులోళ్ళు. గక్కడిమందిల అందరి బతుకుల కన్నగూడ కంపిని జీతగాండ్ల బతుకులే నయం. ఎవుసం దార్ల బతుకులు బొందలల్ల వుంటే, కంపిని జీతగాండ్ల బతుకులు భూమి మట్రంల, కంపిని దొరల బతుకులు గాలిమోటర్ల మీద.

సాంబయ్య బతుకు బట్టకు, పొట్టకు మా బాగనే నడుస్తుంది, కడుపుల సల్ల కదులకుంట.. సాంబయ్య ఏం సదువుకున్నోడు గాదు. వర్కుషాపుల పని – పెద్ద పనోని సేతికింద వుంటడు. మిషిని పనిని గూడ సెయ్యజాల్తడు సాంబయ్య. మిషిని మీది మేస్త్రి ‘ఆరాం’ జేస్తంటే, సాంబయ్య మిషినిని నడుపుతాంటడు.

‘మల్లయ్య’ గుట్టల్లల్ల వున్న వూర్లకెల్లి గీ కాలేరు కచ్చిండు. మల్లయ్య గా వూర్లల్ల గొర్లని పెంచుడు, గొంగళ్ళు నేసుడు. గింతంత ఎవుసం గిట్ట మా వున్న గూడ గని వానమీది బతుకులే పెద్దపెద్ద వాగులు పక్క పొంటే పోరుతన్నైగని, నీళ్ళేమో ఒడ్ల కింద, వూర్లేమో ఒడ్ల మీదనాయె. అనువుగాని నీర మదివెమి జేయను అన్నట్టుగనే.. ఎవుసం మీద బతికేటోళ్ళళ్ళ గోంతమంది బతుకులు – పీనుగు మీద ముగ్గేసుటానికి కుండల పిండి లేకుంట వున్న యిండ్లు గూడ వున్నయి. మల్లయ్యకు గొర్రెలమీది బతుకు గొర్రెతోక అన్పిచ్చింది. గందుకని మల్లయ్య వూరిడ్సిపెట్టి, గీ కాలేరు కచ్చిండు. పెద్ద కాలేరు, ఏమన్న జేసుక గింతంత  మంచిగనే బతుకక పోతనా అని.

కాలేర్ల, మల్లయ్య పని – నెత్తిమీద ఒక గంప, గా గంపల పుట్నాల, బెల్లం.. రోజంత కాళ్ళ మీదనే తిరుక్కుంట గా పుట్నాలు, బెల్లం అమ్మాలె. గా అమ్ముడు, మరి, పైసలకు గాదు! పనికిరాని పాత రాగి, యిత్తడి వస్తువులకు.. మంది, రాగి, యిత్తడి వస్తువులిస్తె, మల్లయ్య గిన్నన్ని పుట్నాలు, గింతంత బెల్లం పెడుతడు. మల్లయ్యకు ఏమంత పెద్ద వజను వస్తువులు అచ్చేటయిగాదు. గని, రాగి తీగెలు మట్టుకు అచ్చేటాయి. పిల్లగండ్లు దడులకు కట్టిన రాగి తీగెల్ని పెద్దోళ్ళకు తెలువకుంట, దొంగతనంగ యిడ్సుకచ్చి మల్లయ్య దగ్గెర పుట్నాలు, బెల్లం తినెటోళ్ళు. పిల్లగండ్లు యిండ్లల్ల వున్న పనికచ్చే రాగి, యిత్తడి చెంబులు, గిలోసలు, తలెలు, తాంబోలాలు, బిందెలు ఎత్తుకపొయ్యి మల్లయ్య దగ్గెర పుట్నాలు, బెల్లం తినెటోళ్ళుగాదా అని ఎవరన్న అడుగవచ్చు! ఎందుకు తినరు! మాతింటరు తియ్యగ! గని, గా తరువాత యింట్ల అవ్వ, అయ్యలు పెట్టే ‘కారం’ రుసి గూడ సూడవల్సి వుంటది మరి! గందుకని పిల్లగండ్లు గంత వజను పనులేం జేసెటోళ్ళుగాదు.

మల్లయ్య బతుకుల ఎదుగాలె అనుకోడా? గువ్వకు ఎగురాలని వుంటే రెక్కలు వస్తాయి.. వూర్లె సముద్రాలసుంటి కంపిన్లు, వర్కుషాపులు. దాంట్ల రాగి, యిత్తడి కడ్డీలు.. కంబాలు గూడ! గవీటి మీద పనులు జేస్తున్న కంపిని జీతగాండ్లు మల్లయ్య కంట్లె పడ్డరు. మల్లయ్య కంట్లె పడ్డోళ్ళండ్ల సాంబయ్య ఒగడు

సాంబయ్య గంతకుముందు దళ్ళెకు గట్టుకునుటానికి కంపిని సాకిదార్లకు తెలువకుంట దొంగతనంగ రాగితీగెల సుట్టలు సుట్టలు దెచ్చెటోడు. గని, గిప్పుడు మల్లయ్య మూలంగ, తీగెలనుంచి పబ్బులకు ఎదిగిండు. మెరుపుతీగెల చూపుల మెల్లగాను, మేడలోపలి భాగంబు సూడుమన్న!.. మల్లయ్య, సాంబయ్య యింటిపక్క పొంటే మకాం పెట్టిండు. పనులన్నియు సమకురువారి చేతనే అని.. మల్లయ్య బతుక్కు సాంబయ్య ఆధారం.. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా, గారవించి దప్పిక తీర్చు కాలమేఘమా, సెడనీక బ్రతికించు సిద్ధమంత్రమా అన్నట్టుగ… ‘గుప్త’ విద్య యొకటెకుల కాంత వంటిది అనుకున్నడు.. గుంట పట్టు చెలమ కులముద్దరించురా అనుకున్నడు.

గిప్పుడు సాంబయ్య రోజుగూడ కంపిని నుంచి దొంగతనంగ సద్ది డబ్బల్లల్ల నింపుకోని రాగి, యిత్తడి తేవట్టిండు – ఆశారాగం సాగెసుమా – కాలు మృదువుగా కదిలెసుమా!..

మల్లయ్య రోజుగూడ సాంబయ్యకు తాగిపిచ్చుడు, పైసలిచ్చుడు.. అంచుకు తినిపిచ్చుడు, కోడిని గోసుడు, మేకకూర, గారెలు, అప్పాలు.

మల్లయ్యకు ఆముదాని పది రూపాలైతే, సాంబయ్యకు దక్కేటిది ఒక రూపాయి మందం కావచ్చు. అయినాగూడ సాంబయ్య బతుకు కడుమ కంపిని జీతగాళ్ళ మీద మా మంచిగనే వున్నది. గీ మీది ఆముదానితోటి, తాగంగ, తినంగ గూడ.. గదీంతోటి సాంబయ్య యింట్ల ఎక్కో కార్యాలు జేసెటోడు – పిల్లగండ్ల పురుళ్ళు, పుట్టెంటికలు దీసుడు, గిసుంటప్పుడు దండిగ జేసేటోడు – తన నావోళ్ళకు పెట్టుపోతలు గిట్ట – కర్సువెట్టుట్ల పెండ్లాం మొగడు యిద్దరికిద్దరే బొక్కలేని సెయ్యి.

కడుమ కంపిని జీతగాళ్ళ యిండ్లు గుడ్డి గుడిసెలైతే, పొరుక మట్టి మెత్తిన గోడల యిండ్లైతే, సాంబయ్య మట్టుకు యిటిక, సున్నం గోడలు, బెంగుళూరు గూన కప్పుతోటి యిల్లు గట్టిండు. గా యిల్లును గూడ ‘చారాన’ సేతులుంటే ‘బారాన’ బాకి జేసి కట్టిండు. యిల్లు కట్టుడు మీద కర్సువెట్టిందానికన్న గూడ ఉప్పరోళ్ళకు, మందికి, తాగిపిచ్చుడు, తినిపిచ్చుడు మీదనే కర్సువెట్టింది ఎక్కో.

గిప్పుడు సాంబయ్య యిల్లు, కౌరవుల మండల కర్ణుని వారం అలగున కన్పిస్తుంది మెరుసుకుంట – గా వాడల – సూసెటోళ్ళకు గని, బాకీల పునాదులు కన్పిస్తయా?

గిప్పుడు మల్లయ్యకు, సాంబయ్యకు అసుంటియి ఎన్నో పాయలు. అన్ని పాయల్ని కల్పుకుంట పెద్ద వాగై పారుతాండు మల్లయ్య. సేర్లనుంచి కింటాళ్ళకు, కింటాళ్ళ నుంచి లారీలకు గీ లారీల మోతల్ని పట్నం తీసుకపొయ్యి సంగళ్ళమీద, గిర్నీల మీద రాగి, యిత్తడి చెంబులు, గిలాసలు, తలెలు, తాంబోలాలు, బిందెలు, సర్వలు.. జేపిచ్చి – అమ్ముడు.. అంగట్ల, వూర్లె పోలీసోళ్ళను గట్టుకున్నడు – కంపిన్లల్ల దొరలని, చౌకిదార్లను కట్టుకున్నడు.. కరిగి రాగిపైని క్రమముగా నుంచరా అన్నట్టుగ.. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత? మల్లయ్య గిప్పుడు వూడలు దిగిన మర్రి. గణికి లొప్పియున్న గవ్వలు జెల్లవా?

ఇగ సాంబయ్య యిల్లు, సంసారం, పెండ్లాం, పిల్లగండ్ల ముచ్చెటకు అస్తె.. సాంబయ్య అందరిమీద ఎక్కో నసీబుమంతుడే అనుడేనేమో.. పెండ్లాం – ఆడిది – వెలది చక్కదనము వెరపైన ఈడును అన్నట్టుగ వుంటది.. సాటిలేని పొలతి చక్కదనము. హిమగిరి సొగసులు.. మనసుపడే మనోజ్ఞసీమ అడుగడుగున ఆడే లేనడుము సొంపులు, సడిసేయక వూరించే వయ్యారపు వంపులు.. ఘుమఘుమ పూవులు సిగలోన, సొగసుల మోమును ముడుసుకుని.. పడుచుదనం అందానికి తాంబూలమొత్తింది. కరకంకణ నిక్వణాలు, పదనోకుర నిస్వణాలు గిప్పుడు సుట్టూత వున్న ఆడోండ్లళ్ళ బతుకుల గూడ ఎక్కోనే నాయె. గందుకని గామెకు, నిత్తె బాలింత వారం మర్యాదలు పొందు సుఖము చేత పుత్రుల గాంచిరి అన్నడు తత్త్వం పాడినోడు  – గని, గీ ఆలుమొగలకు మట్టుకు ‘పుత్రులు’ పుట్టలేదు. కడుమ మందికందరికి ఐదారు గురికన్న తక్కో పిల్లగండ్లు పుట్టని కాలంల గీళ్ళకు మట్టుకు యిద్దరంటె యిద్దరే పుట్టిండ్రు – గా యిద్దరు కూడ ఆడిపిల్ల గండ్లే, అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేది తెలియదు.

అందరి కంపిని పనోళ్ళకు గుద్దిడబ్బ సింగిలు డబ్బ అయితే, సాంబయ్య సద్ది డబ్బకు ఎన్నో గిన్నెలు, పెద్దపెద్ద గిన్నెల డబ్బ.. మొనగాడి పిట్టనని మోరెత్తి కూస్తావా?.. గోతదింపుసుమ్ము కొండెకాడు.. కరువనున్న పాము నెరిగాసి కొనినట్లు.. పిట్టకు సల్లిన గింజలే తెలుస్తై గని, పన్నిన వల తెలుస్తదా?.. మాటేసి పొంచి నిన్ను వేటేసి వదులుతాము.. కాలం మాటేసింది.. ఒకనాడు సద్దిడబ్బల మీద రాగి, యిత్తడి తోటి సాంబయ్య పట్టువడ్డడు కంపిని గేటు దగ్గెర చౌకిదార్లకు..

కంపిని సాంబయ్యను పోలీసు ఠాణాకు అప్పజెప్పింది. కంపిని, నౌకరి నుంచి తీసేసింది.. సాంబయ్య లీడర్లను పట్టుకోని, పైసలు పెట్టి పోలీసు ఠాణాలకెళ్ళి బైట వడ జాలిండుగని, పొయ్యిన కంపిని నౌకరైతే మళ్ళ రాలేదు.. వున్న బతుకుదెరువు పాయె. దేవరంటబోతె దిగబట్టుకొనెనయా..

సాంబయ్య యిల్లు బాకీలకు సాలలేదు.. యిల్లు పొయ్యింది, బాకీలు మిగిలినై.. సాంబయ్య గిప్పుడు, ఏ పని దొరికితె గాపని, దొరికిన కూలిపని జేసుకుంట.. గుడ్డిదీప మారిపాయె, గుడిసంతా సీకటాయె.. కంపను ఏరి, తప్పను జీరి… పొద్దుంటే మాపుండది, మాపుంటే రేపుండది.. గది గూడ బాకీల మీదనే.. కదళి మ్రింగిన వాడు గరళంబు మింగవల్సిన కాలం..

సిన్నపోరి నవ్వ బట్టె, సిల్లిగవ్వ లేకపాయె.. బాకీలు, ఆడిపిల్ల గండ్ల పెండ్లిండ్లు.. ఋణము జేయువాడు ఎక్కువ కెక్కునా?.. మనుగడ చీకటి మయమైపోయె…

గిప్పుడు – సాంబయ్య పెండ్లాం గూడ తట్ట మొయ్యక తప్పని కాలం.. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలము నందు సుఖముజెందు అనుటానికి సుతులు గూడ లేకపాయె. విరబూసిన చెట్టులాగ మురిసిపోవు నీ బ్రతుకు, వాడి, మాడి, మోడువారి.. గ్రహణం పాలయ్యేనా.. చీకటిమూగిన ఏకాంతములో.. గామెది గప్పుడేమో నిమ్మపండువారం నిగనిగలపెయ్యి, గిప్పుడేమో తెంపి ఎండల పారేసిన పువ్వు.. గప్పుడూ గదే సూర్యుడు – గిప్పుడూ గదే సూర్యుడు.. నీటబాసిన కమలం.. నిగనిగల శరీరం మాంసం సెముటలై, పెయ్యిమీది తోలు బొక్కలకంటుక పోతంది.. వైసంత ముసలితనం దిక్కుపోతూన్న కాలంల, బతుకు మిడుసుంపులమీద మొయ్యజాలని తట్ట బరువు, ఈడ్వలేని కాళ్ళు.. వ్యాధులు, బాధలు మసిలేవేళ.. తెలియక వచ్చింది, తెగిపోని బంధం.. కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ.. సుడిలో దూకి ఎదురీదక, మునకే సుఖమనుకోవోయ్..

గిప్పుడు, గంతపెద్ద కాలేర్ల, నట్టనడిమి బజాట్లె నిలవడి సూస్తన్న మల్లయ్య రంగురంగుల, తీరుతీర్ల ఏడంతస్తుల మేడ.. గప్పుడేమో మల్లయ్య మిడుసుంపులు పుట్నాలు, బెల్లం గంపను మోస్తే, గిప్పుడేమో గంతవజను మల్లయ్య మేడల్ని భూదేవి మొదలు మొయ్యవట్టె.. ఆ నింగికి నీలం నేనై అన్నట్టుగ మల్లయ్య మేడ.. మల్లయ్యేమో, బస్సు రూట్లు, కంట్రాక్టులు, బస్తీలో జల్సాలు.. వూరునంత మింగినోడు వుయ్యాలల వూగుతాండు.. వేళ్ళ తాళ్ళు బట్టుకోని ఆకులదాన్క ఎగబాకె..

సాంబయ్య, మల్లయ్య యిద్దరు గూడ జేసిన పని గదే… గదే తాళకం, గదే తగురం.. ఇద్దరు గూడ గదే తిన్నరు.. గదే బువ్వ, గదే తీపి ఒగనికేమో యిసమాయె, ఒగనికేమో అముర్తమాయె. గదే తీపి – సెక్కర బీమారోన్ని పాడె మీదికెక్కిచ్చె, మంచి పాణమోని పెయ్యిని యింకింత వూరవెట్టె.. గదే గాలిదేవుడు – దీపాన్నేమో మలిపె. యిండ్లకు మంటవెడ్తున్న అగ్గిదేవున్నేమో యింకింత ఎగదోసె గదే సముద్రమదనం.. దేవుండ్లకేమో సావు రాకుంట జేసె, రాక్షసులకేమో బతుకులు లేకుండ జేసె.. తలుకాయలు తెగిన మొండాలాయె.. గదే సీకటిరాత్రి.. గుడ్లగూనకేమో తిన తిండి జూపె, కాకులకేమో ఉసుర్లు బాపె.. గదే రాత్తిరి… బతుకునిండవున్న ఎలుకను పాణం దీసె,  సావబోతున్న పాముకు పాణం పోసె.. మల్లయ్య ఎండిపోతున్న బతుకుల ‘మిరుగు’ పూనె,   సాంబయ్య బతుకులనేమో ఉప్పెనచ్చె..

మల్లయ్య అల్లిన కల్లలకు సాంబయ్య పందిరాయె.. ఒగంది గింజ, ఒగంది గంజి, ఒగంది వుడుకు, ఒగంది వణుకు.. గుర్రం మీది నవాబు మల్లయ్య – గాడిది మీది గరీబు సాంబయ్య. ఒగంది కులుకు, ఒగంది కుములు..

గయ్యే తెగిన తలుకాయలు – కిరాయిగూండల సేతులల్ల. లీడర్లకేమో మంత్రి పద్దవతులాయె, కన్నోళ్ళ ఒడిలనేమో కడుపుకోతలాయె..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here