[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హిందీ సినిమా తొలి జట్కా క్వీన్ రెహానా:
1940 దశకం చివర్లోనూ, 1950 దశకం తొలినాళ్ళలోనూ హిందీ సినీరంగాన్ని ఓ ఊపు ఊపిన నటి రెహానా. ఆమె నృత్యాలు నేలటికెట్టు ప్రేక్షకులను (ఛవానీ క్లాస్) ఆకట్టుకోగా, విద్యావంతులైన ప్రేక్షకులు మాత్రం అసభ్యంగా భావించేవారు. ఆ నృత్యాలని ఇప్పుడు చూస్తే, అందులో అసభ్యత ఏమీ లేదనీ అర్థమవతుంది, అప్పట్లో గొడవెందుకు చేసారో మరి! అయితే తనకున్న శృంగార తార ఇమేజ్‌ని రెహానా ఇష్టపడేవారు.
రెహానా 1931లో జన్మించారు. ఆమె జన్మనామం పట్ల కొంచెం గందరగోళం ఉంది. కొందరేమో ఆమె పేరు ముస్తార్ జహాన్ అనీ, మరి కొందరు రెహానా అంజుమ్ చౌదరి అనీ అంటారు. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టం! ఆమె తండ్రికి లక్నోలో – ఒక సిల్వర్‌వేర్ ఫ్యాక్టరీ ఉండేది. రెహనా స్టేజ్ మీద డాన్సర్‌గా బాల్యం నుంచే కెరీర్ ప్రారంభించారు. ఐదేళ్ళ లేత వయసులో – కథక్ దిగ్గజం – శంభు మహారాజ్ గారి నుంచి కథక్ నేర్చుకున్నారు. మహారాజ్‌కీ, కిజ్జన్‍బాయ్ కంపెనీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. కిజ్జన్ భాయ్ కంపెనీ వాళ్ళు లక్నోలో పర్యటిస్తున్నప్పుడు – స్థానిక శిష్యులతో మహారాజ్ ప్రదర్శనలిప్పించేవారు. అలా ఒకసారి కిజ్జన్ భాయ్ గృహంలో రెహానా నాట్యం చేయగా, వారికి నచ్చి తమ బృందంలో చేర్చుకున్నారు. ఈ ట్రూప్ సభ్యురాలిగా రెహానా దేశమంతా పర్యటించారు, విదేశాలలోనూ ప్రదర్శనలిచ్చారు. ఇండియాకి తిరిగి వచ్చకా రెహానా ఇ.ఎన్.ఎస్.ఎ. (Entertainments National Service Association)లో చేరారు. ఈ సంస్థని రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్న బ్రిటీష్ సైనికులకు ఉల్లాసం కలిగేంచేందుకు బాసిల్ డీన్, లెస్లీ హెన్సన్ స్థాపించారు. అనేకమంది సినీతారలు హాజరైన ఓ పార్టీలో రెహానా డాన్స్ చూసి, ఆమెకి సినిమాల్లో నాట్యం చేసే పాత్రలు, చిన్న చిన్న సహాయక పాత్రలు లభించాయి. కె.ఎల్. సైగల్, సురయ్య నటించిన ‘తడ్‍బీర్’ (1945) అందులో ఒకటి. ఆ తరువాత ఆమెకి ప్రభాత్ వారి ‘హమ్ ఏక్ హైఁ’ (1946)లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం దక్కింది. దేవ్ ఆనంద్, కమలా కోట్నిస్, రెహామాన్ ఇతర ముఖ్య నటులు. ఆ తరువాత దర్శకుడు పి.ఎల్. సంతోషి గారి దర్శకత్వంలో – షెహనాయి (1947), కిడ్కీ (1948), సర్గమ్ (1950), ఛమ్ చమా ఛమ్ (1952) షిన్ షినా కీ బుబ్లా బూ (1952) సినిమాల్లో నటించారు రెహానా.
ఫిల్మిస్థాన్ నిర్మించిన షెహనాయి (1947), సాజన్ (1947) సినిమాలు రెండూ రెహానాకీ మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమెను ఓ స్టార్‌ని చేశాయి. పి.ఎల్. సంతోషి గారి దర్శకత్వంలో ‘షెహనాయి’ లో ఆమె నసీర్ ఖాన్ సరసన నటించారు. ఈ సినిమాకి సంగీతం అందించిన సి. రామచంద్రకి కూడా గొప్ప పేరు వచ్చింది. ఈ సినిమాలోని ‘ఆనా మేరీ జాన్ మేరీ జాన్ సండే కే సండే’ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాజన్ (1947) సినిమాలో ఆమె అశోక్ కుమార్‍తో జత కట్టారు. ఆమెకి పేరు తెచ్చిన సినిమాలలో అది ఒకటి. 1948-1951 మధ్య రెహానా కెరీర్ ఉచ్చస్థాయిలో ఉందని చెప్పాలి. ఆనాటి టాప్ హీరోలందరి సరసనా ఆమె నటించారు. ప్రేమ్ ఆదిబ్ (యాక్ట్రెస్, 1948), రాజ్ కపూర్ (సునహరే దిన్, 1949, సర్గమ్ 1950), దేవ్ ఆనంద్ (దిల్‍రూబా, 1950), శ్యామ్ (నిర్దోష్, 1950, సురాజ్‌ముఖి, 1950), శేఖర్ (అదా, 1951), ప్రేమ్ నాథ్ (సగాయి, 1951). సర్గమ్ (1950), సగాయి (1951) – ఈ కాలంలో ఆమెకి లభించిన అతి పెద్ద హిట్ సినిమాలు. అయితే చాలా సినిమాలలో ఆమెను శృంగార నాట్యతారగానే ఉపయోగించుకున్నారు, అందువల్ల నటనని కనబరిచే అవకాశాలు ఆమెకు తక్కువగా లభించాయి. ముఖ్యంగా సి. రామచంద్ర బాణీలు ఆమె నాట్య భంగిమలకు అనువుగా ఉండి, ప్రేక్షకులను అలరించేవి.
అయితే, ‘సగాయి’ అనంతరం రెహానా ప్రభ మసకబారసాగింది. ‘రంగీలీ’ (1952), ‘ఛమ్ చమా ఛమ్, హజార్ రాతేఁ’ (1953), ‘సమ్రాట్’ (1954) సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. పైగా అప్పటి విమర్శకులు ఆమె నటించిన సినిమాలను తీవ్రంగా విమర్శించారు. ‘రంగీలీ’ సినిమాని సమీక్షిస్తూ, ఓ విమర్శకుడు దర్శకులకు తెలివితేటలు తక్కువై, రెహానాతో సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించాడు.
కొన్ని రోజుల తరువాత రెహానా ‘ధోలా మారు’ (1956), ‘ఢిల్లీ దర్బార్’ (1956) వంటి సినిమాల్లో ద్వితీయ కథానాయిక పాత్రలకి మళ్ళారు. రెహానా, సాధనా బోస్, రంజన్ నటించిన ‘షిన్ షినా కీ బుబ్లా బూ’ సినిమాకిచ్చిన యూనివర్సల్ సర్టిఫికెట్‌ని అప్పటి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రద్దు చేయడమే కాకుండా, సినిమాని నిషేధించిది కూడా. కొద్ది కాలం తర్వాత నిషేధాన్ని తొలగించినా, అప్పటికి ఈ సినిమా మీద ప్రేక్షకులకి ఆసక్తి పోయి, సినిమా పరాజయం పాలయింది. భారతదేశంలో అవకాశాలు క్షీణిస్తుండడంతో, తన కెరీర్‍ని నిలబెట్టుకునేందుకు రెహానా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. భారతదేశంలో నటించిన చివరి సినిమా ‘మెహ్‌ఫిల్’ (1957), ఆమె పాకిస్తాన్‍కి వెళ్ళిపోయాకా విడుదలయింది.
దురదృష్టవశాత్తు, పాకిస్తాన్‍లో ఈమె నటించిన ‘షాలిమార్’ (1956), ‘వెహ్‌సీ’ (1956), ‘అప్నా పరాయా’ (1959) పరాజయం పాలయ్యాయి. కథానాయికగా ఆమె నటించిన ‘రాత్ కే రాహీ’ (1960) సినిమా మాత్రమే పాకిస్తాన్‌లో హిట్ అయింది. 1962లో వచ్చిన ‘ఔలాద్’ హిట్ అయినప్పటికీ అందులో రెహానా ప్రధాన హీరోయిన్ కాదు. హీరోయిన్ పాత్రని నయ్యర్ సుల్తానా పోషించారు. ఇదే కాలంలో రెహానా సయ్యద్ కమాల్ సరసన ‘ఆంఖ్ ఔర్ ఖూన్’ చిత్రంలో నటించారు, కానీ దురదృష్టవశాత్తు, ఆ సినిమా విడుదల కాలేదు. రెహానా – ‘రాత్ కే రాహీ’ నిర్మాత ఇక్బాల్ షెహ్‍జాద్‍ని వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆయన్నుంచి విడిపోయాకా, వ్యాపారవేత్త సబీర్ అహ్మద్‍ను పెళ్ళి చేసుకున్నారు రెహానా. జెబా, సయ్యద్ కమాల్, మొహమ్మద్ ఆలీ నటించిన ‘దిల్ నే తుజే మాన్ లియా’ (1963) సినిమాలో నాట్యతారగా తళుక్కుమన్నారు రెహానా. ఆ తరువాత ఆమె క్రమంగా సినిమాలకి దూరమయ్యారు.
1995లో పాకిస్తాన్ లోని నిగార్ అవార్డ్స్ (మనదేశంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సమానం) న్యాయనిర్ణేతలలో ఒకరిగా వ్యవహరించారు రెహానా. భర్త చనిపోయాకా, రెహానా ఎక్కువగా ఒంటరి జీవితం గడిపారు. తదుపరి కాలంలో ఆమె చిన్నపిల్లలు పవిత్ర ఖురాన్ బోధించారని అంటారు.
రెహానా 23 ఏప్రిల్ 2023న పాకిస్తాన్‍లో మరణించారు.
విస్మృతికి గురైన హాలీవుడ్ స్టార్ – నార్మా షేరర్:
పొట్టిగా ఉన్నారని, కాళ్ళు మరీ లావుగా ఉన్నాయనీ, వంకరపళ్ళని, మెల్లకన్ను అనీ – నార్మాకి ‘Follies’ లో అవకాశం తిరస్కరించారట ఫ్లోరెంజ్ జీగ్‍ఫీల్డ్. సినిమాల్లో కెరీర్ నిర్మించుకునేంత రూపసి కాదని, అంత ప్రతిభ ఆమెలో లేదని భావించారు. అయినా పట్టుదలతోనూ, దృఢనిశ్చయంతోనూ (ఓ వైద్యుడు ఆమె మెల్లకన్నును సరిచేశారు) నార్మా హాలీవుడ్‍లో రాణించి ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ది స్క్రీన్’ అని అనిపించుకున్నారు. ఓ స్టూడియో యజమానిని వివాహం చేసుకున్నారు. 1920 దశకం చివరి నుంచి 1930 దశకంలో హాలీవుడ్‍లో అతి పెద్ద స్టార్‍లలో ఒకరిగా పేరుపొందారు. అకాడమీ అవార్డుకు ఆరు సార్లు నామినేట్ అయి, 1930లో అవార్డు సాధించారు.
1902లో మాంట్రియాల్‍లో ధనవంతులైన తల్లిదండ్రులకి జన్మించారు నార్మా. అయితే ఈ కుటుంబం మొదటి ప్రపంచ యుద్ధం వల్ల తమ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కుంది. నార్మా తల్లి, కుమార్తెలను తీసుకుని న్యూయార్క్ వచ్చేసి సినీ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.
తొలి రోజుల్లో పాత్రలు పొందడానికి నార్మా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. డి. డబ్ల్యూ. గ్రిఫిత్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేశారు. ఆ సమయంలో ఆయన చెప్పారట – ఆమె మెల్లకన్నే ఆమె అవకాశాలని దెబ్బతీస్తుందని. తరువాత మోడలింగ్ రంగంలోకి వచ్చి, కార్లు టైర్ల ప్రకటనలో కనబడి ‘మిస్ లొట్టా మైల్స్’ అని ప్రసిద్ధి చెందారు. ‘ది స్టీలర్స్’లో ఆమె ప్రదర్శన చూశాకా, ఎట్టకేలకు ఆమెకు 1923లో లూయిస్ బి. మేయర్ గారి ఆరు నెలల కాంట్రాక్టు లభించింది.
నార్మా లాస్ ఏంజెలిస్‍కి మారారు. వారానికి 250 డాలర్ల పారితోషికంతో ఎన్నో చిన్నా చితకా పాత్రలలో నటించారు. కొందరు దర్శకులు ఆమెది ‘ఫొటోజెనిక్ ఫేస్’ కాదనీ, అమెలో ప్రతిభ లేదని భావించారు. ఫలితంగా ప్రధాన పాత్రలు కొన్ని దూరమయ్యాయి. ఆలాంటి వాటిల్లో ‘The Wanters’ ఒకటి. అయితే ఆమె పరిస్థితులను తన చేతిలోకి తీసుకోవడం ప్రారంభించారు. అవకాశాలను అన్వేషిస్తూ – ప్రొడక్షన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఇర్వింగ్ థాల్‍బెర్గ్‌ని కలిసారు. అప్పట్లో ఆయనకి పరిశ్రమలో ‘Boy Wonder’ అని పేరు ఉండేది. 24 ఏళ్ళ వయసులో అతిపిన్న వయస్కుడైన స్టూడియో ఎగ్జిక్యూటివ్‌గా ఉండేవారు. ఆయన, నార్మాకి ఓ పెద్ద సినిమాలో అవకాశం ఇచ్చారు. అదే The Student Prince in Old Heidelberg (1927). అదే ఏడాది, ఆమె జుడాయిజం లోకి మారాకా, వాళ్లిద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
తన భార్యని పెద్ద స్టార్‍ని చేయాలనుకున్నారు థాల్‍బెర్గ్. తన పలుకుబడిని ఉపయోగించి, తన సంస్థ నిర్మించే చిత్రాలలో ఆమెకి అవకాశాలు కల్పించారు. ఆమె దర్శకులతోనూ, సహనటులతోనూ సౌకర్యవంతంగా ఉండేట్టు చూశారు. ఆమె సినిమాలకు బాగా ప్రచారం కల్పించి, మార్కెటింగ్ గొప్పగా చేశారు.
అయినా ఆమెను దెబ్బతీయాలనుకునే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. నాటకకర్త లిలియన్ హెల్‍మాన్ ఆమెది ‘ఆలోచనలు వ్యక్తం కాని వదనం’ అని వ్యాఖ్యానించగా, నార్మా ఓ స్టార్ అయ్యారంటే అదంతా ఇర్వింగ్ థాల్‌బెర్గ్ ఘనత అనీ, నాణ్యమైన కెమెరా యాంగిల్స్ ద్వారా, నార్మాని అందంగా చూపించి, స్టార్‍ని చేశారనీ నటి, రచయిత్రి Anita Loos అన్నారు.
ఇటువంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా శ్రమించారు నార్మా. జాన్ గిల్బర్ట్‌తో ‘The Wolf Man’, లోన్ చేనీ తో ‘He Who Gets Slapper’ అనే సినిమాల్లో నటించారు. 1924లో విడుదలైన ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. ఆమె పారితోషికం కూడా వారానికి వెయ్యి డాలర్లకి పెరిగింది. కొద్ది కాలానికి వారానికి ఐదువేల డాలర్లు అయింది. ఎంజిఎం సంస్థలో అతి పెద్ద స్టార్‍లలో ఒకరయ్యారు నార్మా. ఈ సంస్థ కోసం 13 సైలెంట్ ఫిల్మ్స్‌లో నటించారామె.
మూకీ సినిమాల నుంచి టాకీ సినిమాలకి విజయవంతంగా మళ్ళిన కొద్ది నటీనటుల్లో నార్మా ఒకరు. ఎంజిఎం లో సౌండ్ ఇంజనీరుగా పనిచేస్తున్న సోదరుడు డగ్లస్ సాయంతో ఆమె వాయిస్ లెసన్స్‌లో శిక్షణ పొందారు. ఆమె మొదటి టాకీ ‘The Trial of Mary Dugan’ 1929లో విడుదలై హిట్ అయింది. ప్రేమికుడిని హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కునే బ్రాడ్‍వే షో గర్ల్‌గా నార్మా నటించారు. Let Us Be Gay (1930), Strangers May Kiss (1930) సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.
అదే ఏడాది ‘The Divorcee’ చిత్రంలో ఆమె నటనకి ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాత్రలో నటించేందుకు ఆమె తన భర్తని కష్టపడి ఒప్పించారని అంటారు. తరువాత ఆమె నటించిన A Free Soul (1931), Private Lives (1931), Strange Interlude (1932) సినిమాలు కూడా హిట్ అయ్యాయి.
1934లో విడుదలైన Riptide చిత్రం వివాదాస్పదమైంది. భర్తకి, ప్రేమికుడికి మధ్య ఒకరిని ఎంచుకోవాల్సిన ఓ మహిళ కథ ఇది. నార్మాని నైతికత లేని స్త్రీగా విమర్శించారు. ఆ తరువాతి నుంచి స్త్రీలు, నేరాలకి సంబంధించి సెన్సార్ నిబంధనలు కఠినంగా అమలయ్యాయి.
తన ఇమేజ్‍ని మార్చుకునేందుకు నార్మా – The Barretts of Wimpole Street (1934), Romeo and Juliet (1936) (రోమియో అండ్ జూలియల్ లో నటించే సమయానికి ఆమె వయసు 30లలో ఉంది, ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా), Marie Antoinette (1938) వంటి చిత్రాలలో నటించారు. ఈ వరుసలోని చివరి రెండు చిత్రాలు పరాజయం పాలయినా, ఓ స్టార్‌గా నార్మా ఖ్యాతికి భంగం కలగలేదు.
1936లో ఇర్వింగ్ థాల్‍బెర్గ్ న్యుమోనియాతో మరణించారు. ఆయనకి గుండెకి సంబంధించిన సమస్యలు కూడా ఉండేవి. భర్త పోయిన దుఃఖం నుండి బయటపడి దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత, ఎం.జి.ఎం సంస్థతో కొత్త కాంట్రాక్టు కుదుర్చుకుని ఆరు సినిమాల్లో నటించారు. భర్తకి రావల్సిన బకాయిల గురించి స్టూడియోతో న్యాయపోరాటం చేశారు. ఆ సమయంలోనే గాసిప్ కాలమిస్ట్ Louella Parsons తో వివాదాన్ని ఎదుర్కున్నారు.
న్యాయపోరాటంలో ఎంజిఎంపై విజయం సాధించగా, మిలియన్ డాలర్లకి పైగా పరిహారం పొందారు. నార్మా ‘Sunset Boulevard’, ‘Now, Voyager’ ‘Mrs. Miniver’ వంటి సినిమాల్లో కథానాయిక పాత్రలను తిరస్కరించారు. అలాగే, Gone with the Wind సినిమాలోని ‘స్కార్లెట్ ఓ హారా’ పాత్రని కూడా తిరస్కరించారు. ఆ పాత్ర కఠినమైనదనీ, రెట్ బట్లర్ పాత్ర అయితే తనకి బాగుండేదని అన్నారు. 1939లో ఆమె నటించిన ‘ది ఉమన్’ విడుదలయింది. ఇందులో ఆమె అత్యుత్తమ నటన కనబరిచారు. ఈ సినిమాలో Joan Crawford , Rosalind Russell, Paulette Goddard లతో సహా అంతా మహిళలే నటించారు.
ఇర్వింగ్ థాల్‌బెర్గ్ మరణం తరువాత నార్మా James Stewart, Mickey Rooney, George Raft వంటి వారితో ఎఫయిర్స్ నడిపారని పత్రికలు రాశాయి. అయితే ఆమె George Raft ని పెళ్ళి చేసుకోవాలనుకున్నారనీ, కానీ ఆయన భార్య విడాకులకి అంగీకరించలేదని రాశాయి.
నార్మా 1942లో సినిమాల నుంచి విరమించుకున్నారు. తన కన్నా 11 ఏళ్ళు చిన్నవాడైన Martin Arrougé ని వివాహం చేసుకున్నారు. 1983లో 80 ఏళ్ళ వయసులో నార్మా మరణించేదాక ఈ దంపతులు కలిసి ఉన్నారు. ఆమె కాలిఫోర్నియా లోని ఉడ్‍లాండ్ హిల్స్ లోని మోషన్ పిక్చర్స్ కంట్రీ హోమ్‍లో మృతి చెందారు. గ్లెండేల్ లోని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్ లో ఆమెను సమాధి చేశారు. ఆమె సమాధిపై Norma Arrougé అని రాశారు.