కలవల కబుర్లు-25

0
14

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]పో[/dropcap]నీ కదా అని ఉపకారానికి పోతే అపకారం ఎదురవుతుందట. అదే పుణ్యానికి పోతే పాపం ఎదురవడం కూడానూ..

ఇది చాలా మందికి చాలా చోట్లే అనుభవం అవుతుంది.

మొన్నామధ్య ఒకరు కలిసారు. పిచ్చాపాటీ ముచ్చట్ల మధ్య ఆవిడ చెప్పిన సంగతులేంటంటే.. ఎవరింట్లో అయినా పెళ్ళీడుకి వచ్చిన అమ్మాయో, అబ్బాయో వుంటే ఈవిడగారికి ఉత్సుకత పెరిగిపోతూందట. ఎలాగైనా ఆ పిల్లకో, పిల్లాడికో తనకి ఎరుకలో వున్న పెళ్ళి సంబంధాలన్నీ చేరవేస్తూంటుంది. అదో హాబీ ఆవిడకు. సింపుల్‌గా చెప్పాలంటే, పెళ్ళిళ్ళ పేరయ్య లాగా పెళ్ళిళ్ళ పేరమ్మ అనుకోండి. పాపం.. ఆవిడ సదుద్దేశంతోనే వివరాలు సేకరించడం, అవసరమైనవారికి అడిగినా, అడక్కపోయినా చేరవేస్తూ వుంటుంది. ఫ్రీ సర్వీసే చేస్తుంది. తన మూలంగా కనుక తాను చెప్పిన పెళ్ళి కుదిరితే బహు సంతోషపడుతుంది. వీళ్ళ వివరాలు వాళ్ళకి, వాళ్ళ వివరాలు వీళ్ళకి చేర్చి, జాతకాలు చూపించడంలోనూ, పెళ్ళి చూపులు ఏర్పాటు చేయడం లోనూ, కుదిరితే కట్నకానుకలు మాట్లాడడంలో మధ్యవర్తిత్వం నడపడం లోనూ ప్రధాన పాత్రే వహిస్తుంది. నిస్వార్థంగా చేసే మేరేజ్ బ్యూరో అనుకోవాలి. ఒకవేళ ఆ సంబంధం కుదరకపోతే, పట్టు వదలని విక్రమార్కురాలిలాగా మరో మేచ్ వివరాలు చేరవేస్తూంటుంది

ఈవిడ చెప్పిన సమాచారం మేరకు వాళ్ళు ఎంక్వయిరీలు చేసుకుని, కుదిరిన పెళ్ళి సంబంధాలు లేకపోలేదు. ఆ కాపురాలు సజావుగా సాగుతూంటే, అంతా ఈవిడ చలవే అని పొగిడేస్తారు. ఒకవేళ ఖర్మ కాలి ఆ పెళ్లి కాస్తా పెటాకులైతే.. ఇక ఈవిడని పట్టుకుని నానా మాటలు అంటారు. అంతా ఈవిడే చేసిందంటూ.. ‘దరిద్రపుగొట్టు సంబంధం చెప్పిందని’ తిట్టి పోస్తారు.

పాపం, మధ్యలో ఈవిడేం చేసింది? అదే ఏ మాట్రిమోనియల్ ద్వారా కుదిరి, ఆ తర్వాత చెడితే.. వాళ్ళని అనగలరా? ఎక్కడో తెలిసిన వివరాలు, ఏదో పెళ్ళి సంబంధం, వాళ్ళ ఆస్తిపాస్తులు, చదువు ఉద్యోగాలు తనకి తెలిసినవి చెప్పగలదు కానీ.. వాళ్ళ మనస్తత్వాల గురించి ఈవిడకి ఏం తెలుసని చెప్పగలదు? అయినా మధ్యవర్తిత్వం నడపడం బహు అసాధ్యం. అయినా వెయ్యి అబద్ధాలు చెప్పైనా పెళ్ళి సంబంధాలు కుదర్చాలని సామెతని కొందరు నిజం చేస్తూంటారు కానీ.. ఇవి తర్వాత ఖచ్చితంగా బెడిసికొడతాయి.

ఇలా పెళ్ళిళ్ళే కాదు.. ఏ విషయమైనా, ఇలాగే వుంటుంది. ఫలానా వారు, ఫలానా చోట ఏ స్ధలమో, ఇల్లో కొనుక్కున్నారని తెలిసి వాళ్ళ బంధువులో, స్నేహితులో, వీళ్ళు కొనమని చెప్పినా, చెప్పకపోయినా.. తాము కూడా అక్కడే కొనుక్కుని.. ఆ తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గిపోతే.. ఇహ ఆ ముందు కొన్న వారిని ఎన్నైనా అంటారు. ‘మీరు ఇక్కడ కొన్నారని మేమూ కొన్నాము. ఇదే పెట్టుబడి మరోచోట పెడితే ఇంతకింతా లాభం వచ్చేది. మిమ్మల్ని చూసి మేము మునిగిపోయాము’ ఇలా అంటూంటే.. ముందు అక్కడ కొన్నవారికి ఒళ్లు మండుతుంది. అదే లాభం వచ్చిందనుకోండి.. ఆకాశానికి ఎత్తేస్తారు. మీ మూలంగానే మేము కోటీశ్వరులమయామంటూ వేయినోళ్ళ పొగుడుతారు.

మనుషులు రీతులు ఇలా రకరకాలుగా వుంటుంది. మంచి జరిగితే, దానికి మూలమైన వారిని పొగిడినా, పొగడకపోయినా.. ఒకవేళ ఇబ్బంది ఎదురయితే మాత్రం తిట్టడానికి, నిందించడానికి, మాటలు అనడానికి ముందుంటారు. నరుని నాలుక ఎటైనా తిరుగుతుందట.

పెద్ద పెద్ద విషయాలే కాదు.. ఇంట్లో కొనుక్కునే ఫ్రిజ్‌లు, ఏసీలు వగైరాలు కూడా ‘మీరు చెప్పారని ఫలానా బ్రాండ్ కొన్నాము.. మీరెలా వాడుతున్నారో కానీ.. పరమ దరిద్రంగా వుంది. కొన్న మూడో రోజునే రిపేర్ వచ్చింది.’ అంటూ ముఖాన అంటే, మనం మళ్ళీ వాళ్ళకి సలహా ఇవ్వగలమా? మరి మనింట్లో సేమ్ అదే వస్తువు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాళ్ళకి తేడా వచ్చిందంటే అది వాళ్ళ ఖర్మ. అటువంటప్పుడు ఎవరినీ సలహాలు అడక్కూడదు. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని ఏడవాలి.

ఇక ఆరోగ్య సమస్యల్ని ఇలా సలహాలు అడిగితే వచ్చే సమాధానాలు కోకొల్లలు. తమకి తెలిసిన డాక్టర్ల పేర్లు, చేరవలసిన హాస్పటళ్ళు, కొండొకచో వైద్యాలు కూడా వరస పెట్టి చెరుతారు. ‘మా మాట విని ఫలానా డాక్టర్ దగ్గరకే వెళ్ళండి. మీ బాధని చేత్తో తీసి పారేస్తాడు’ అనేసరికి.. ఎదుటివారు నమ్మకుండా వుండరు కదా! అది నిజమే..వారి విషయంలో బాగానే జరిగి వుండవచ్చు. కానీ అన్ని వేళలలా ఒకేలా వుండదు కదా? అయినా చెప్పేవాడికి అడిగేవాడు లోకువ అని వూరికే అనలేదు. అందుకే సలహా ఇచ్చాక.. తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చే పొగడ్తలతో పాటు తెగడ్తలుని కూడా స్వీకరించడానికి సిద్ధంగా వుంటేనే సలహా చెప్పాలి.

అవండీ ఈ వారం కబుర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here