[మాయా ఏంజిలో రచించిన ‘Old Folks Laugh’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(ఎంతో జీవితాన్ని చూసి వృద్ధాప్యాన్ని చేరుకున్నాక వారి జీవితానుభవం, మృత్యువును అంగీకరించేలా, గడిచిన జీవితాన్ని క్షమించేలా చేస్తుందని చెబుతున్న కవిత!)
~
[dropcap]అ[/dropcap]టు ఇటు బిగబట్టిన
పెదాలను సాగదీసి
కనుబొమల మధ్య రేఖలను
మెలికలు తిప్పుతూ
తెలివితక్కువగా, కొంటెగా
వాళ్ళకెలా తోస్తే అలా
వాళ్ళు నవ్వుతుంటారు
తేలికైన చేతి చరుపులతో
కంపించి పోయే డప్పుల్లాగా
పొట్టలు ఊగిపోయేలా
కదిలి కదిలి మరీ
ఆ ముసలివాళ్ళు నవ్వుతుంటారు
తాము కోరుకున్నట్టుగా చిందులేస్తూ
అరుస్తూ ఈలలేస్తూ గేలి చేస్తూ
వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు నవ్వుతుంటారు
చంకలోని నిండు నీళ్ళబిందె
తొణికి చిందే నీళ్ళలాగా
భళ్ళున వాళ్ళు నవ్వుతుంటారు
ఏది మంచో ఏది చెడో
అప్పుడే తెలుసుకున్నట్టుగా
విరగబడి నవ్వుతున్నప్పుడు
వాళ్ళీ ప్రపంచాన్నే మరచిపోతారు
పెళుసుగా మారిన మెడలపైన
వాళ్ళ తలలు వణుకుతుంటాయి
నోటి చివర్లలో కారే ఉమ్మి మెరుస్తుంటుంది
అయితేనేం
వాళ్ళ ఒడి నిండా మది నిండా
ఎన్ని జ్ఞాపకాలు..
మరెన్ని అనుభవాలు..
ఎల్లలు లేని వాళ్ళ నవ్వులతో
రానున్న మృత్యువును
నొప్పించకుండా రమ్మని
ఇష్టంగా ఆహ్వానిస్తూ
వాగ్దానం తీసుకున్నారేమో!
జీవితం వాళ్ళకు
ఏమిచ్చినా ఇవ్వకున్నా
మౌనంగా అంగీకరించి
ఉదారంగా క్షమించేస్తున్నారేమో!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
1968లో జూ. మార్టిన్ లూథర్ కింగ్ హత్యకు గురైన తరువాత, రచయిత James Baldwin, కార్టూనిస్ట్ Jules Feiffer లను ఒక సమావేశంలో కలిసిన మాయా వారి వలన స్ఫూర్తి పొంది, 1969లో ‘Why the caged bird sings’ అన్న తన ఆత్మకథ రాసారు. ఒక మిత్రుని మరణం నుంచి తన మనసుని, ధ్యాసని మళ్ళించుకునే దిశగా – తాను బాల్యంలో ఎదుర్కొన్న హింస, పోరాడిన వర్ణవివక్ష గురించి గత జీవిత జ్ఞాపకాలతో కూర్చిన ఈ రచనకు ఆనాటి పాఠకుల నుంచి విపరీతమైన ఆదరణ దొరికింది. National Book Award కొరకు నామినేట్ అయ్యింది కూడా.
1979 లో TV చిత్రంగా కూడా రూపు దిద్దుకుంది.
మాయా ప్రతి రచన ఆమె జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. తన జీవితంలోని ఎలాంటి కోణాన్నైనా నిర్భయంగా బహిరంగపరచిన తెగువ ఆమెది.
మాయా వచనమైనా, కవిత్వమైనా అనేక పోలికలు కలిగి, ప్రత్యక్ష, సంభాషణా సరళిలో ఉంటుంది. పాఠకులతో తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడమే కాకుండా, వాళ్ళను కూడా చర్చలకు ఆహ్వానించేదామె. మాయా శైలి బలమైన పోలికలు, చక్కటి పదబంధాలు కలిగి ఉంటుంది.
A Georgia Song అన్న మాయా కవిత దక్షిణ అమెరికా జనజీవితాన్ని చిత్రిస్తారు. తన అన్ని ఇతర రచనల లాగానే Savannah, అట్లాంటా, కొలంబస్ నగరాల ప్రజల జీవనశైలిని, అక్కడి ప్రజల పౌరహక్కుల గురించి, బానిసత్వం గురించి రాసారు.
2006 లో అట్లాంటాలో జరిగిన ఒక ప్రముఖ కాన్ఫరెన్స్‌కి మాయా హాజరయ్యారు.