[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘రేయిని పలుకరించే పని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]క[/dropcap]లలను ఎవరో
అంతెత్తున ఆకాశంలో ఆరవేసారు
అలసిన శరీరం కావాలని అడుగుతుంటే
అందుకునే ప్రయత్నం
ఆపకుండా చేశాను రాత్రంతా
చీకటి నిచ్చెనలెక్కి మరీ ఎక్కడెక్కడో
ఓటమి విసురుగా తోసేసింది
కలల వాకిలి తలుపులు మూసేసింది
వైఫల్యం పిలవగా
వద్దంటే వచ్చిన కలతనిదుర
కొంటెగా చూస్తూ గట్టిగా కౌగిలించుకుంది
కాలం కరిగిపోతూ బాధ్యతగా కేకేస్తే
వచ్చి నిలిచిన వెలుతురు పనివాళ్ళు
చీకటి పరదాలను చిత్రంగా తొలగించేశారు
ఆరిన కలలను అందంగా మడిచి
రేతిరింటి అలమరాలో జాగ్రత్తగా దాచేశారు
ఏం చేస్తాను
రేయిని పలుకరించే పని
ప్రయత్నానికి మళ్ళీ తప్పేట్టు లేదనుకున్నాను
మైమరిచి పడిపోయిన మెలకువను
మెత్తగా తట్టి నిద్రలేపాను..!
మెల్లగా నిద్ర లేచాను..!!