తొలిప్రేమ చిగురించిన వేళ

0
3

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘తొలిప్రేమ చిగురించిన వేళ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]నాటి మన తొలి కలయిక
బహు విచిత్రమే కదా!
అటు వైపు ఓసారి
ఇటువైపు మరోసారి
నీ చూపులతో గిలిగింతలు పెడుతూ
నా హృదయాన్ని భలేగా గాయం చేశావు!

నీ చూపుల కోలాటంతో
సహజసిద్ధమైన ప్రేమ
నా అంతరంగంలో వెల్లువెత్తి..
నీ మాటల్లో కోపాన్ని గాక
నీ ఎద లోపలి ప్రేమ భావనను
నాకు ఇట్టే తెలియజేసింది!

నీ పెదాలపై గలాటా రుసరుసలు కనిపించినా
నీ కళ్ళల్లో ప్రేమ మతాబులు విచ్చుకోవడాన్ని
నా హృదయ నేత్రాలు చూశాయి ప్రేయసీ!

నా చూపుల బాణాలు
నీ గుండె లోతులను గాయం చేస్తోంటే
భయం.. కోసంతో కూడిన ప్రేమ
నన్ను నిలువెల్లా ఆక్రమించిన వేళ..
నేనలా నీ కళ్ళల్లో మునిగేపోయాను.

నీ కన్నులు వెదజల్లిన కాంతిరేఖలు
నా చూపులకు ఎరగా మారి
ఒకింత ఆందోళనుకు గురైపోయాను కానీ..
అసలైన ప్రశాంతత అక్కడే లభించింది నాకు!

ఆత్మాభిమానం.. ఆత్మగౌరవం
నీ సహజ అభరణాలుగా
నిరంతరం నీ మనసును అంటిపెట్టుకొనిన వేళ
నా మనసు తెలిసి కూడా
నన్ను దూరంగా పెట్టావు!

అయినా.. చెలీ..!
నా మనసుతో నీ మనసు ఢీకొని
తీయని గాయాలెన్నో చేసింది!
నీ ప్రేమ లభించని నా జీవితం
పరిపూర్ణం కాదు కదా సఖీ!

నీ కోపతాపాలను ఓర్పుతో భరించి
నిలువెత్తు ప్రేమలో మునిగిపోయాను!
నీవు పెట్టిన ప్రేమ పరీక్షలో
విజయతీరాలను చేరి..
గొంతెత్తి ప్రేమ గానం చేస్తూ
వినీలాకాశంలో విహరించాను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here