[మల్లాది వసుంధర గారు వ్రాసిన ‘నరమేధము’ అనే చారిత్రక నవలను పరిచయం చేస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
[dropcap]మ[/dropcap]హారాజులు, చక్రవర్తులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా యజ్ఞపశువుగా ఏదైనా జంతువుని బలి ఇస్తూ ఉంటారు. కానీ ‘నరమేధము’ అనే యజ్ఞంలో యజ్ఞపశువు మానవుడు. చరిత్రలో ఈ యజ్ఞం ఎవరూ చేసిన దాఖలాలు లేవు. హరిశ్చంద్రుడు చేసినట్లు దేవీ భాగవతంలో ఉంది కానీ, యజ్ఞపశువుగా నిర్ణయించిన బాలుడిని బలి ఇవ్వకముందే విశ్వామిత్రుడు అతడిని విడిపించి, తన తపోశక్తి చేత హరిశ్చంద్రుడికి యాగఫలం దక్కేటట్లు చేస్తాడు. అంటే యజ్ఞం అసంపూర్తిగా ముగిసినదని చెప్పవచ్చు. ఈ యజ్ఞాన్ని మొట్టమొదటి సారిగా నిర్వహించినది విష్ణుకుండిన ప్రభువులలో ఒకడైన మాధవవర్మ మహారాజు. ఆ కథే ఈ ‘నరమేధము’.
రచయిత్రి పరిచయం:-
చారిత్రాత్మక నవలలు రాయటం చాలా కష్టం. చరిత్రలో జరిగినది జరిగినట్లు రాస్తే అది వార్త అవుతుంది గానీ నవల కాదు. నవల అంటే కొన్ని సంఘటనలు కల్పన చేయాలి, సభాషణలు కూర్చాలి. వర్ణనలు చేయాలి. పఠితుల మనసుని ఆకట్టుకునే విధంగా కథ చెప్పాలి. అప్పుడే అది పాఠకాదరణ పొందుతుంది. అలాంటి చారిత్రాత్మక నవలలు రాయటంలో నిష్ణాతురాలు మల్లాది వసుంధర. ఆమె జన్మించింది 1934లో. ఆమె రచించిన మొట్టమొదటి నవల ‘తంజావూరు పతనం’ చారిత్రక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. ఈ నవలను ఇంటర్మీడియట్ ఉపవాచకంగా తీసుకున్నారు 1951లో. తర్వాత ఆమె రామప్పగుడి, పాటలి, యుగసంధి, సప్తవర్ణి, దూరపు కొండలు వంటి నవలలు; అచల, అలక తీరిన అపర్ణ వంటి కథలు రచించారు. వీటిలో చాలా వరకు బహుమతులు పొందినవే! ఈ ‘నరమేధము’ నవల కూడా 1979-80 విద్యా సంవత్సరమునకు ఇంటర్‌మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు ఉపవాచకంగా తీసుకున్నారు. చారిత్రక నవలా రచయిత్రిగా పేరుపొందిన మల్లాది వసుంధర 1992లో కన్నుమూశారు.
కథ క్లుప్తంగా :-
ఆరోజు ఉదయం కృష్ణానదీ తీరమంతా వివిధ దేశాలనుంచీ వచ్చిన రాజుల కోసం వేసిన కుటీరాలతోనూ, వంటశాలలు, స్నానాగారాలు, ఆహార వస్తుశాలలతోనూ, యజ్ఞ సంభారాలతోనూ నిండిపోయి కనుచూపు మేర వరకూ ఒక తెల్లని దీవిలా కనిపిస్తూ ఉంది. అందుకు కారణం ఏమిటంటే విష్ణుకుండిన ప్రభువైన మాధవవర్మ నరమేధ యజ్ఞం సంకల్పించాడు. ఆ యజ్ఞ దర్శనార్ధం వచ్చిన వారు వీరందరూ.
ఆంధ్రదేశం లోని విష్ణుకుండిన ప్రభువైన మాధవ వర్మ మహారాజు మహా పరాక్రమవంతుడు. ఆయన పరాక్రమానికి ముగ్ధుడై చందగుప్త చక్రవర్తి తన కుమార్తె చంద్రావతీ దేవిని ఇచ్చి వివాహం చేసి ఆయనతో బాంధవ్యం కలుపుకున్నాడు. మాధవవర్మ పరిపాలనలో దేశం యుద్ధాలు లేకుండా, సుభిక్షంగా, ప్రశాంతంగా సాగిపోతూ ఉంది.
తెల్లవారితే యజ్ఞం ప్రారంభం కావాలి. ఇంకా యజ్ఞపశువు దొరకలేదని అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ యజ్ఞానికి యజ్ఞపశువు కాదగిన వటువు కొన్ని విశిష్ట లక్షణాలు కలిగి ఉండాలి. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు, విద్యావంతుడు అయి ముఖ్యంగా తనకు తానై బలిపశువు కావటానికి సమ్మతించాలి. ఈ లక్షణాలు అన్నీ ఉన్నవారు కనిపించలేదు, కనిపించినా అంగీకరించక పోవటం వంటివి జరిగాయి ఇప్పటివరకూ. విజయవాటికకు కొద్దిదూరంలో గల బ్రాహ్మణ అగ్రహారంలో ఈ లక్షణాలు కల యువకుడు ఉన్నాడనీ, అతడి పేరు యజ్ఞదత్త శర్మ అనీ వేగులు వార్త అందించారు. మహారాజు అతడిని పంపించమని అడగటానికి స్వయంగా తనే అతడి ఇంటికి వెళ్ళాడు.
యజ్ఞదత్తుడు తనకు తానుగా సమ్మతించినప్పుడు అతని తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకు, వాడి మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నామని ఈ ప్రయత్నం విరమించమనీ ఎన్నో విధాల బ్రతిమిలాడుకున్నారు. కానీ కొడుకు అంగీకరించలేదు. “నాన్నా! మరణం ఎప్పటికైనా సంభవించేదే కదా! మీ కుమారుడు యజ్ఞ పరిపూర్తికి దోహదం చేసాడన్న పుణ్యం పొందండి.” అన్నాడు. అతడి తండ్రి కొడుకు మాటలకు సమాధానం ఇవ్వలేక పోయాడు. ఈ వార్త వినగానే యజ్ఞదత్తుడి తల్లి గోలుగోలున ఏడుస్తూ వచ్చి“మహారాజా! లేకలేక కలిగిన నా కన్నకుమారుడిని నాకు దూరం చేస్తారా! మీకు కూడా ఇటువంటిది సంభవించినప్పుడు గానీ నా కడుపుకోత తెలియదు. ఇది నా శాపం” అన్నది. మహారాజు యజ్ఞదత్తుడి తండ్రిని చూసి “అయ్యా! మీరు కూడా నన్ను శపించండి. శాపం నాకొక్కడికే తగులుతుంది. యజ్ఞం దేశప్రజలకి సంబంధించినది” అన్నాడు.
“మహారాజా! నాకు నేనుగా శపించకపోయినా మా శోకానికి కారణమైన మీ కర్మ మిమ్మల్ని క్షమించదు. నేను అనుమతిస్తున్నాను. మా కుమారుడిని తీసుకుని మీరు వెళ్ళవచ్చు” గుండె రాయి చేసుకుంటూ అన్నాడు తండ్రి. మాధవవర్మ యజ్ఞదత్తుడిని తీసుకుని వెళ్ళిపోయాడు.
నరమేధము ముగిసింది. ఆ యజ్ఞానికి దేశదేశాల రాజులతో పాటు పల్లవ రాజైన నాలుగవ కుమార విష్ణువు, అతడి సోదరి త్రిలోచన పల్లవి కూడా వచ్చారు. బాల్యంలోనే తల్లిదండ్రులు కరువైన వీరిద్దరినీ తాతగారైన మూడవ కుమార విష్ణువు పెంచి పెద్దచేశాడు. పల్లవి ఆడపిల్ల అని వివక్ష చూపించకుండా మనవడితో సమానంగా పురుషోచితమైన యుద్ధవిద్యలు అన్నీ నేర్పించాడు. మాధవవర్మ పరాక్రమానికి అసూయాగ్రస్తులైన ఇతర రాజుల లాగానే ఒకసారి మూడవ కుమారవిష్ణువు కూడా అయన పైకి దండెత్తి వెళ్ళాడు. కానీ ఆ యుద్ధంలో పరాజయం పొంది సిగ్గుతో క్రుంగి కృశించి చివరకు మరణశయ్యకు చేరుకున్నాడు.
చివరిక్షణంలో త్రిలోచన పల్లవిని దగ్గర కూర్చోబెట్టుకుని తన పరాభవానికి ప్రతీకారం చేయాలనీ, మాధవవర్మ వంశం నిర్వంశం చేయమనీ వాగ్దానం తీసుకున్నాడు. “అమ్మా! పల్లవీ! ఈ పగ మనవడి ద్వారానే సాధించవచ్చుగా అని నువ్వు అడగవచ్చు. మీ ఇద్దరి స్వభావాలు నాకు తెలుసు. కుమారవిష్ణువు శాంతి ప్రియుడు. ఇలాంటివి ఇష్టపడడు. నువ్వు కారణ జన్మురాలివనీ, దుర్గాదేవి అవతారమనీ నా నమ్మకం. ఈ కార్యం నువ్వే సఫలం చేయాలి తల్లీ!” అన్నాడు. “అలాగే తాతగారూ! మీ ఆఖరి కోరిక తీరుస్తాను.” అని చేతిలో చేయి వేసింది త్రిలోచన.
“అమ్మా! మనం బ్రాహ్మణ ప్రభువులం. విష్ణుకుండినులు క్షత్రియులు. ఎట్టి పరిస్థితులలోనూ పల్లవ రాజరక్తం కలుషితం కాకూడదు” అన్నాడు. త్రిలోచన సరే నన్నది. నిశ్చింతగా కన్నుమూశాడు మూడవ కుమారవిష్ణువు.
“తాతగారు నీ దగ్గర ఇలాంటి వాగ్దానం తీసుకోవటం చాలా అన్యాయం చెల్లీ! మాధవవర్మ తనకు తానుగా మనమీద దండెత్తి రాలేదు కదా! తాతగారే ఆయన మీదకు వెళ్ళారు. దండెత్తి వచ్చిన శత్రువుని నిర్జించటం వీరధర్మం. పాపం! ఇందులో మాధవవర్మ తప్పేమున్నది?”
“తప్పో ఒప్పో నాకు అనవసరం. చిన్నప్పటి నుంచీ మనల్ని పెంచి ఇంతటివారిని చేసిన వాత్సల్యమయులైన తాతగారి అంతిమకోర్కె ఇది. దీనిని చెల్లిస్తానని మాట ఇచ్చాను.” అన్నది. కుమార విష్ణువు మౌనంగా ఉండిపోయాడు.
ఉన్నపాటుగా మాధవవర్మ మహారాజు రాజభావనంలోకి ప్రవేశించటం ఎలా! పల్లవి ఆలోచించింది. మాధవవర్మ చిన్న కుమారుడు సునీతివర్మ అవివాహితుడు అని విన్నది. ఏ విధంగానైనా అతడిని వివాహం చేసుకుని అంతఃపురంలో అడుగుపెడితే చాలు. అక్కడనుంచీ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి రాచబాట పడినట్లే! చెలికత్తెను తోడు తీసుకుని ఇద్దరూ పురుషవేషాలలో బయలుదేరారు. కొంతదూరం తర్వాత అరణ్యంలో ప్రయాణిస్తుండగా, వేట కోసం వస్తున్న సునీతివర్మతో పరిచయం ఏర్పడింది. ఆడబోయిన తీర్థం ఎదురయినట్లుగా అతనితో పరిచయం కలిగినందుకు ఎంతో సంతోషించింది త్రిలోచన. తాము మాధవవర్మ సైన్యంలో సిపాయిలుగా చేరటానికి బయలుదేరినట్లు చెప్పింది. సునీతివర్మ వారిద్దరినీ రాజధానికి తీసుకువచ్చి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు.
సునీతివర్మకు, త్రిలోచనకూ క్రమక్రమంగా సానిహిత్యం పెరిగింది. ఆమె సమక్షంలో గడపటానికి అతడు తహతహలాడిపోతూ ఉన్నాడు. సరైన సమయం చూసి తను సునీతివర్మను నరమేధ యజ్ఞంకి వచ్చినప్పుడు చూసి ప్రేమించిందనీ, తనని వివాహం చేసుకోవటంలో అతని అభిప్రాయం తెలుసుకోవటానికి ఇలా మారువేషంలో బయలుదేరవలసి వచ్చిందనీ చెప్పింది త్రిలోచన. స్త్రీగా బయల్పడిన తర్వాత త్రిలోచన జగన్మోహన సౌందర్యం చూసి సమ్మోహితుడై పోయాడు సునీతివర్మ. ఆమెతో వివాహానికి సంతోషంగా అంగీకరించాడు.
ఈ విషయం రాజమందిరం అంతా వెల్లడి అయింది. విష్ణుకుండిన పల్లవ రాజవంశాలు రెండూ ఇలా ఒకటి అవుతున్నందుకు సంతోషించాడు మాధవవర్మ. సునీతివర్మ, త్రిలోచన పల్లవిల వివాహం ఎంతో వైభవంగా జరిగిపోయింది. త్రిలోచన అనతికాలంలోనే అక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకుంది. మాధవవర్మకు చంద్రావతీ దేవి ద్వారా ఇద్దరు కొడుకులు కలిగారు. వారు గోవిందవర్మ, సునీతివర్మ. చంద్రావతి కాకుండా మరో ఇద్దరు రాణులు ఉన్నారు. వారు మలయవతి, సుభద్ర. మలయవతి కుమారుడు ఇంద్రవర్మ, సుభద్ర కుమారుడు దేవవర్మ. ఇద్దరూ భోగలాలసులు.
గోవిందవర్మకు యుద్దవిద్యల పట్ల ఆసక్తి లేదు. సునీతివర్మను అందరూ పసివాడిగా భావిస్తారు. త్రిలోచన తన చతుర్యంలో రాజబంధువులు అందరినీ ఆకట్టుకుంది. గోవిందవర్మ భార్య సుదర్శన ఆమెని సొంతచెల్లెలి లాగా ఆదరిస్తున్నది. మహారాజు అయితే త్రిలోచన సాక్షాత్తూ ఆ కామాక్షీ దేవే తమ ఇంట అడుగుపెట్టినట్లు భావిస్తున్నాడు. త్రిలోచన తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటానికి పావులు కదుపుతూ ఉంది. మలయవతి కోడలు గర్భవతి అయింది. పుట్టబోయే శిశువే రాజ్యానికి వారసుడు అవుతాడని సుభద్ర అసూయతో రగిలిపోయింది. త్రిలోచన చెలికత్తెను కోయతగా మారువేషంలో పంపి మలయవతి కోడలికి గర్భవిచ్ఛేదనం కావటానికి మూలికలు ఇచ్చింది. అలాగే సుభద్ర కోడలు జన్మలో గర్భం రాకుండా కూడా మూలికలు ఇచ్చింది.
యువరాజు గోవిందవర్మకు రథం వేగంగా తోలటం సరదా. అయన జన్మ దినోత్సవం రోజు రథయాత్ర ఏర్పాటు చేసారు. యువరాజుని కళ్ళారా చూసి సత్కరించాలని ప్రజలందరూ పూలదండలు పట్టుకుని వీధులకు ఇరువైపులా నిలబడి ఎదురుచూస్తున్నారు. యువరాజు రథం అత్యంత వేగంగా దుమ్మురేపుకుంటూ వెళ్ళిపోయింది. సరిగా ఇంద్రకీలాద్రి దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఒక బాలుడు ప్రమాదవశాత్తూ రథం కింద పడి మరణించాడు. నేలంతా నెత్తురు కొల్లయిపోయింది. రాజమందిరంలో గోవిందవర్మ భార్య సుదర్శనకు సీమంతోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్త వినగానే మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది.
బాలుడి తల్లి కొడుకు శవం తీసుకుని గోలుగోలున ఏడుస్తూ న్యాయం చేయమని కోట వాకిట నిలబడి ధర్మగంట మోగిస్తూ ఉంది. ఆ గంట యమధర్మరాజు మహిష ఘంటికా నాదంలా రాజమందిరం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. తెల్లవారిన తర్వాత రాజసభలో న్యాయ విచారణ చేసాడు మాధవవర్మ. గోవిందవర్మ రథం అత్యంత వేగంగా నడుపుతూ ఆ వేగం అరికట్టలేకపోవటం చేతనే బాలుడు మరణించటం జరిగిందనీ, ఈ నేరానికి శిక్షగా యువరాజుకి మరణదండన విధించాడు మహారాజు. ఈ సభకు యజ్ఞదత్తుడి తండ్రి కూడా వచ్చాడు మహారాజు తన వరకూ వచ్చేసరికి ఎలాంటి తీర్పు ఇస్తాడో చూడాలని. తీర్పు విన్న తర్వాత ఆయనకి స్వపర భేదం లేదని అర్థం చేసుకుని సిగ్గుతో తిరిగి వెళ్ళిపోయాడు.
శిక్షాస్మృతి ననుసరించి ఆ రోజు తెల్లవారుజామున గోవిందవర్మ శిరసు ఖండించారు. స్వపరభేదం పాటించని మాధవవర్మ తీర్పుకు, ధర్మనిరతికి సంతోషించి దుర్గాదేవి కనకవర్షం కురిపించింది. ప్రజలందరూ మహారాజుని వేనోళ్ళ పొగుడుతూ ఆ నాణాలు ఏరుకున్నారు. అప్పటినుంచీ ఇంద్రకీలాద్రిపై నున్న దుర్గాదేవికి కనకదుర్గ అనే పేరు వచ్చింది.
గోవిందవర్మ మరణంతో మహారాజు కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రావతీదేవి కొడుకు మీద బెంగతో ఆరోగ్యం కృశించిపోసాగింది. ఆమె శరీరంలో ఏదో రుగ్మత ప్రవేశించింది. ప్రాణసమానమైన భర్త మరణంతో గోవిందవర్మ భార్య సుదర్శనకు మతి చలించింది. ఒంటినిండా నగలు ధరిస్తుంది. క్షణంలో అవన్నీ విసిరేసి పకపకా నవ్వుతుంది. అన్నగారితో సన్నిహితంగా ఉండే సునీతివర్మ ఈ పరిణామాలకు బెంబేలు పడిపోయాడు. ఇంద్రవర్మ, దేవవర్మలకు ఇవేమీ పట్టలేదు. వారి విలాసాల్లో వారు మునిగిపోయారు. మహారాజుకి వార్ధక్యం తరుముకువస్తున్నది. రాజ్యానికి సరైన రక్షకుడు లేదు. మహారాణి శరీరంలో ప్రవేశించిన రుగ్మత ఎక్కువై ఆమె కన్నుమూసింది. మాధవవర్మ భార్యను తలచుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే పులకేశి దండెత్తి వస్తున్నట్లు వార్త అందింది.
కొల్లేటి తీరంలో మాధవవర్మకూ, పులకేశికీ యుద్ధం ప్రారంభమైంది. ఇరు సైన్యంలో ఎందరో వీరులు నిహతులైనారు. కొల్లేరు రక్తపుటేరు అయింది. ఇరవై అయిదు రోజులపాటు పోరు ఘోరంగా సాగింది. మాధవవర్మ శక్తి అంతరించ సాగింది. పులకేశిదే పై చేయి అయింది. ఇంతలో ఒక ఆశ్వికుడు వేగంగా వచ్చి త్రిలోచనాదేవి అందివ్వమన్నదని ఒక లేఖ మహారాజుకు అందించాడు. అందులో ఇలా ఉంది.
“విష్ణుకుండిన మహారాజు శ్రీశ్రీ శ్రీ మాధవవర్మ గారి చరణారవిందములకు నమస్కరించి త్రిలోచన వ్రాయునది. మహారాజా! మా తాతగారైన మూడవ కుమారవిష్ణువు మీతో యుద్ధం చేసి పరాజితులైనారు. ఆ పరాభవంతో క్రుంగి కృశించి మీ వంశం నిర్మూలనం చేసి ప్రతీకారం సాధించమని నా చేత ప్రమాణం చేయించుకుని, కన్నుమూసారు. నేను మొదట మారువేషంలో వచ్చి మీ కుమారుడిని వలపింపజేసుకుని వివాహమాడింది నా పథకం లోని భాగమే! విష్ణుకుండిన పల్లవ రాజవంశాలు ఏకమైనాయని మీరు సంతోషించారే గానీ, ‘రాచకన్య వలచిన వాడి కోసం స్వగృహం వీడి వస్తుందా! అది పరిహాసాస్పదమైన విషయం కాదా!’ అని దూరం ఆలోచించలేదు. నేను మీ రాజ్యంలో అడుగుపెట్టింది మీ వంశవిధ్వంశం కోసమే!
ఆనాడు యువరాజు జన్మదినోత్సవం అని రథయాత్ర కల్పించింది నేను! రథం కిందకు బాలుడిని త్రోయించింది నేను! మహారాణి, యువరాజు మరణాలు మిమ్మల్ని క్రుంగదీయుచుండగా ఇదే సరైన సమయం అని మీమీదకి దండెత్తి రమ్మని పులకేశికి సందేశం పంపించింది నేను! మీ ఇద్దరి భార్యలలో అసూయాద్వేషాలు రగిల్చి వారి కోడళ్ళను వంధ్యులుగా చేయించింది నేను! ఇంద్రవర్మ, దేవవర్మలు అసమర్థులు. సునీతివర్మ అమాయకుడు. వారు సాధించగలిగేది ఏమీలేదు. ఇక్కడికి రాకపూర్వమే నేను గర్భనిరోధక ఔషధం సేవించి వచ్చాను. నా వలన మీకు వారసుడు కలుగడు. పల్లవరాజ రక్తం కలుషితం చేయనని తాతగారికి మాట ఇచ్చాను. భర్తవియోగంతో మతి భ్రమించిన సుదర్శన రాజ ప్రాసాదోపరిభాగం నుంచీ క్రిందపడి మరణించింది. గర్భస్థశిశువు విగతజీవుడైనాడు. విజయవాటిక స్మశానవాటిక అయింది. పులకేశి సైన్యం నగరం ప్రవేశిస్తే ఎదిరించే వారు ఇక్కడ ఎవరూ లేరు.
మహారాజా! మీరూ నరమేధం చేశారు. నేనూ నరమేధం చేశాను. మీరు చేసిన నరమేధం లోకకల్యాణం కోసం, నేను చేసిన నరమేధం ప్రతిజ్ఞా నిర్వహణ కోసం. విష్ణుకుండిన వంశాకురాన్నే యజ్ఞపశువుగా చేశాను. ఇంకా ఏం చెప్పను ప్రభూ! నా బ్రతుకంతా నటనయై పోయింది. ఆనాడు మీ ధర్మనిరతికి సంతసించి దుర్గాదేవి సువర్ణవృష్టి కురిపించింది. అలాంటి ధర్మమూర్తులైన మీ పాదాలు అంటటానికి కూడా నాకు అర్హత లేదు. ఈ లేఖ మీకు అందే సమయానికి నేను ఉండను. అందిన తర్వాత మీరు ఉండరు. పైలోకంలో కలుసుకుని క్షమాభిక్ష వేడుకుంటాను.
సెలవు.
మీ వంశ విధ్వంసిని, కులవధువు
త్రిలోచన పల్లవి.
ఆ లేఖ చదివిన తర్వాత కూడా మహారాజుకి త్రిలోచనపై ఇసుమంత కూడా కోపం రాలేదు. నరమేధయజ్ఞం చేసిన ఫలితం ఇది. యజ్ఞదత్తుడి తల్లి శాపం ఫలించింది. త్రిలోచన నిమిత్తమాత్రురాలు అనుకుంటూ శివనామం జపిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆయన ప్రాణ వాయువులు అనంత వాయువులో లీనమైనాయి.
ఇదీ ‘నరమేధము’ కథ! పుస్తకం మొత్తం చదివిన తర్వాత కుట్రలు, కుతంత్రాలు, ప్రతిహింసతో కూడుకున్న పాత్ర అయినా త్రిలోచన మీద మనకు కోపం కలగదు. పాపం! ఆమె మాత్రం ఏం చేస్తుంది? వాగ్దాన బంధితురాలు! అని సానుభూతి కలుగుతుంది. మాధవవర్మ ధర్మనిరతికి మనసు ఆర్ద్రమౌతుంది. చదవటం పూర్తి అయిన తర్వాత ఆ భావోద్వేగం నుంచీ బయటపడటం కష్టం. ఇది చారిత్రాత్మకమైన నవల కావటం వలన ఇంద్రకీలాద్రి, కనకదుర్గ ఆలయం, విజయవాటిక (విజయవాడ), ఉండవల్లి గుహలు, కృష్ణవేణి నది, విష్ణుకుండిన నగరం (వినుకొండ), కొల్లేరు వంటి చిరపరిచితమైన ప్రదేశాలు కనిపిస్తాయి.
ఈ నవలని మల్లాది వసుంధర గ్రాంథిక భాషలో రచించారు. ఇతర పుస్తకాల లాగా దీనిని వేగంగా చదవలేము. నిదానంగా అర్థం చేసుకుంటూ చదివితే అందులోని సన్నివేశాలు, కథని నడిపించిన తీరు, ప్రకృతి వర్ణనలు, వాక్యనిర్మాణ చాతుర్యం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఈ నవల 1979-80 విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆనాటి విద్యార్ధులు అంతటి భాషా పరిజ్ఞానం కలవారు కనుకనే వారు నేడు కవులుగా, రచయితలుగా రాణిస్తూ ఉన్నారు.
నరమేధము నవల దొరకు చోటు: కిషోర్ పబ్లికేషన్స్, విశాఖపట్నం. మొత్తం పేజీలు: 220. వెల: రు. 4.50. సాధారణంగా పై చిరునామాలో ఈ గ్రంథం దొరకదు. గ్రంథాలయాల్లోనూ, పుస్తక ప్రదర్శనలలోనూ, సాహితీ ప్రియుల సేకరణలోనూ దొరకవచ్చు. మంచి సాహిత్యం దొరకటమూ, అవి చదివే అవకాశం రావటమూ మహదవకాశమే!