ఈనాటి కథే

0
4

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘ఈనాటి కథే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]మోద భర్త సంతోష్ శర్మ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగస్థుడు.

ప్రమోద తండ్రి, దిగువ మధ్యతరగతి బడి మాష్టారు. తన అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ, ఆ అప్పులు తీర్చడం, తల్లి తండ్రుల జబ్బులూ.. వీటన్నిటితో ప్రమోదకి పెద్ద ఉద్యోగస్థుడుని కట్నాలిచ్చీ, చేయలేక, శర్మ సంబంధం కుదిర్చేసేడు.

శర్మ తల్లి చాలా తీయగా మాటాడింది. తనకి కూతుళ్ళు లేరని, కోడళ్ళే కూతుళ్ళు అవుతారని చెప్పింది. తమకి ఉంటున్న ఇల్లు కాక, ఇంకో రెండు ఇళ్ళు ఉన్నాయని, ఇద్దరు కొడుకులకీ, సమానంగా ఇచ్చేస్తానని నమ్మకంగా మాటాడింది.

ప్రమోద ఒక్కరోజు కూడా అత్తింట తనకి ఎంత విలువ ఉందో చెప్పలేదు.

తల్లితండ్రులు వస్తే, అత్తగారు చాలా ఆప్యాయంగా మాటాడి, మర్యాదలు చేస్తుంది. సంతోష్ అత్తవారింటికి వెళితే, ఎంతో వినయవిధేయతలతో మసలుకుంటాడు. తమ ఇల్లు చిన్నది అవటం, కూతురికి, అల్లుడికీ ప్రత్యేకంగా గది ఇవ్వలేరు కనుక, రాత్రుళ్ళు ఉండమని, ప్రమోద తల్లితండ్రులు బలవంతపెట్టరు.

ప్రమోద స్నేహితురాలు ఒకసారి ప్రమోదని, తన‌ పుట్టినరోజని పిలిస్తే, ప్రమోదని సంతోష్ దింపి వెనక్కి వెళిపోయేడు.

స్నేహితురాలు రమ కబుర్ల మధ్య అడిగింది. “ఏవిటే, పెళ్ళయి మూడేళ్ళయినా ఏ గుడ్ న్యూసూ చెప్పవు? అసలు నీ కబుర్లు ఏవీ మాకు తెలీవే?”

ప్రమోద కళ్ళలో నీళ్ళు. రమ కంగారుపడుతూ, “ఏమయిందే.. సంతోష్ సరయినవాడు కాదా?” అంది.

“అదేమీ కాదు, సంతోష్ నన్ను ఒక్కమాట అనడు. కానీ మా అత్తగారికి మొదటినించీ, ఇద్దరు కొడుకులతోనే లోకంలాగ బతికేరు. భర్తకి ఎప్పుడూ అనారోగ్యంట. ఆయన్ని చూసుకోడం, ఆయన వంతు కూడా పిల్లలని తనే చూసుకున్నారట.”

“అయితే?” అనుమానంగా అంది రమ.

“విను. మా అత్తగారు రాత్రి మేం ఇద్దరం గదిలో పడుకుంటే, తప్పనిసరిగా గది తలుపులు తట్టి తీరతారు. మొదట్లో నేను కంగారు పడేదాన్ని. ఏమయిందో అని. తీరా చూస్తే ఏదో చిన్న కారణం, ‘మామగారికి నిద్రపట్టడం లేదనో, వంటింట్లో చప్పుళ్ళు అయేయనో’ ఇలాంటి కారణాలు చెప్పి, ఆవిడ కళ్ళనీళ్ళతో, బాల్కనీలోకి వెళ్ళి కూచుంటారు”

“అదేమిటి?” అంది రమ

“అంతే. సంతోష్‌ని ఒకసారి గట్టిగా అడిగేను. ‘ఈ చిన్న కారణానికి మనలని లేపాలా? మావయ్యగారికి తలనొప్పి అని మనలని లేపి ఆవిడ బాల్కనీలో కూచోడం ఏవిటి?’ అని.”

“మా ఇంట్లో, మాకు మొదట్నించీ మా అమ్మ ఏది చేసినా ఎదురు అడగడం, అలవాటు లేదు. ఇప్పుడూ అడగను” అన్నాడు.

“ఏ‌ నిమిషాన ఆవిడ తలుపులు బాదుతుందో తెలీక, నాకు భర్త దగ్గరకి వస్తేనే దడ వస్తోంది. ఇహ కన్సీవ్ అవడం ఒకటా? మా తోటికోడలు ఒకసారి చెప్పింది. ఈమె ఇలా చేస్తుటేనే, వాళ్ళు నార్త్‌లో ఉద్యోగం చూసుకొని వెళిపోయేరట.”

“ఆమెకి ఒక కొడుకు కదూ” రమ అంది.

“ఇద్దరు కొడుకులు. మా అత్తగారు గొప్ప ప్రేమ చూపించేవారిలా అందరితో ‘పిల్లలు ఉన్నా, లేకపోయినా ఇద్దరూ నా కూతుళ్ళే.. ఇలాటి జోక్యాలు నేను చేసుకోనమ్మా’ అంటారు. నాతో ‘దేవుడు ఇస్తే దెయ్యానికి కానుపు వస్తుందే? కంగారు పడకు’ అంటారు. ‘మీ అమ్మా వాళ్ళూ నీకు సారె చీరె పెట్టకపోయినా, నేను అడగనమ్మోయ్.. ‌పెద్దదానికి, వాళ్ళమ్మ ఎన్ని కొన్నారో? మీ అమ్మని గానీ, నాన్నని గానీ, నేనడిగేనా? నా తీరే వేరు’ అని చాటుకుంటారు” కసిగా అంది ప్రమోద.

రమ మాటాడలేక వింటున్నాది.

“నీ పుట్టినరోజు ఆనందం పోయేట్టు నా మాటలు ఉన్నాయే..” నవ్వు తెచ్చుకుంటూ అంది ప్రమోద.

“అదేం లేదులే కానీ, నిన్ను ఎక్కడకీ పంపరా మీ అత్తగారు?” అడిగింది రమ.

“ఎక్కడకీ వద్దనరు. వెళ్ళబోయే సమయానికి ఏదో వంక పెడతారు. ఇహ కదల్లేకుండా అవుతుంది.” ప్రమోద దిగులుగా నవ్వింది

“ఎవరయినా, ఈ రోజుల్లో ఇలా ఉన్నారంటే నమ్ముతారా? మా బావగారిలాగ మాకు మేముగా బతకగలిచే శక్తి అయినా ఉండాలి. లేదా మా ఆయన గట్టిగా అయినా మాటాడగలగాలి. అంతవరకూ నా బతుకింతే” అంటూనే ప్రమోద మళ్ళా, “ఆవిడ బతికి ఉండగా, నాకు సంతాన భాగ్యం, సంతోష భాగ్యం లేవే..” కఠినంగా అంటూ ఉంటే, రమ బిక్కచచ్చినట్టు చూసింది.

‘ఎంత మెత్తటి మనిషి. దీ‌ని నోటంట ఇంత కఠినమయిన మాటలు వస్తున్నాయంటే? వస్తున్నాయా? ఆ తల్లీ కొడుకూ అనిపిస్తున్నారా?’ అనుకున్నా, ప్రమోద మొహం చూసి అనలేకపోయింది.

ఈరోజుల్లో కూడా అలాంటి వాళ్ళున్నందుకు విస్తుపోయింది రమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here